ఇద్దరు చిన్న పిల్లల్ని సంబాళించుకోవడానికి ఇంట్లో పెద్దవాళ్ళెవరూ లేని తల్లులు చేసే చిన్న చిన్న ఉపాయాలేవో ఉంటాయి. తింటూవుంటే చిన్నోడు ఊరికే అడ్డం వస్తున్నాడట. వాడి ఆటేదో వాడు ఆడుకుంటాడని చిన్న ప్లేట్లో కొన్ని పల్లిత్తులు పోసిచ్చింది. ఆడుకునేంతసేపు ఆడుకున్నాడు. నోట్లో వేసుకునేవి వేసుకున్నాడు. తను చూస్తుండగానే ఒక ఇత్తు తీసి ముక్కులో పెట్టుకున్నాడు. దానికదే జారి పడుతుందేమో అని చూసింది. జారలేదు. ఏమైనా పెట్టి తియ్యడమా, మానడమా? పెడితే దాన్ని ఇంకా లోపలికి నూకినట్టు అవుతుందా?
విషయం చెప్పడానికి ఫోన్ చేసినప్పుడు నేను నవ్వులాటగానే తీసుకున్నా. ఆఫీసులో పనెక్కువుండి, ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యమైంది. ఇద్దరు పిల్లలు పడుకున్నారు. చిన్నోడు చూడటానికి మామూలుగానే ఉన్నాడు. శ్వాస కూడా సాఫీగానే వస్తోంది. ఏం కాదులే అని ఒక ధైర్యం. రాలిపోయివుండదా? వాడు ఎగజల్లిన ఇత్తుల్ని ప్లేట్లో వేసి పక్కన పెట్టి వుంచింది. వీటిల్లో అదేమైనా ఉండివుంటుందా? స్నానం. భోజనం. తర్వాత నిద్ర? ఇట్లా వదిలేయాల్సిందేనా? లోపల ధైర్యంగానూ ఉంది, తెలియని భయం కూడా వేస్తోంది. ఎందుకైనా మంచిదని పాత పరిచయం ఉన్న హోమియో డాక్టర్ సురేంద్రగారికి ఫోన్ చేశాను. చాలా సందర్భాల్లో దానికదే పడిపోతుందట. అలా కానప్పుడు? ఊపిరితిత్తుల్లోకి జారిందంటే మాత్రం ప్రాణానికి ప్రమాదం. మన కేసు ఎందులో ఉంటుంది? ధైర్యం వచ్చినట్టే వచ్చి జారిపోయింది. హాస్పిటల్‌కు వెళ్ళాలా ఇప్పుడు? డాక్టర్లు, పోలీసులు, సాధ్యమైనంతవరకు గవర్నమెంటు ఆఫీసులు–-తగలకుండా బతకాలని నా ఆశ. ఏయ్, ఏం కాదులే? ముందు డోర్ పెట్టేయ్. లైటు ఆర్పేయ్.
పాలు ఇంకా మరవలేదు కాబట్టి చిన్నోడు తన పక్కలో ఉన్నాడు. నాక్కూడా వాడు దగ్గర్లో ఉండేట్టుగా మధ్యలో ఉన్న పెద్దోడిని గోడవైపు జరిపి నేను మధ్యలోకి వెళ్ళాను. రాత్రి నిశ్శబ్దంలోకి జారిపోతోంది నెమ్మదిగా. చిన్నోడి శ్వాసనే వింటూ పడుకున్నాను. సరిగ్గా పదిన్నర ప్రాంతంలో శ్వాసలోని లయ ఏదో దెబ్బతినడం తెలుస్తోంది. ప్రాణవాయువుకు ఏదో అడ్డుపడుతోంది. ఒకసారి గరగర. మళ్ళీ సాఫీదనం. నాకింక వెన్ను వంగిపోవడం మొదలైంది. తప్పదు హాస్పిటల్‌కు వెళ్ళాల్సిందే. ఇటు పోవద్దు, ఇది తగలొద్దు, ఈ పిచ్చి సిద్ధాంతాలు జీవితానికి పనికిరావు. అయ్యో, ఆఫీసు నుంచి రాగానే సుదురాయించుకోవాల్సింది. తప్పు జరిగిపోయింది. రోడ్డు దగ్గర్లో ఒక హాస్పిటల్ ఉంది. అక్కడో పిల్లల డాక్టర్ అయితే ఉండాలి. ఇంత రాత్రిపూట ఉంటాడా? ముందైతే నేను పోతా. నువ్విక్కడే ఉండు. ఏదైనా ఉంటే నేను ఫోన్ చేస్తా.
అట్లాగే ఎత్తుకుని పోతే, హాస్పిటల్ మూసేసివుంది. గేటు చప్పుడు చేస్తే ఇద్దరు నర్సులు బయటికొచ్చారు. డాక్టర్ లేడు. ఈఎన్టీ హాస్పిటల్‌కు తీసుకెళ్తే మంచిదన్నారు. లక్డీకాపూల్‌లో ఎక్కడ వుందో అడ్రస్ చెప్పారు. నా ఫోన్ కోసం తను కాచుకునేవుంది. నిద్రలో ఉన్న పెద్దోడిని ఏం చేయాలి? లోపలే ఉంచి తాళం వేసి వెళ్తే? లేచి భయపడితే? లేస్తాడా? ఇక్కడ ఎవరి కష్టం వాళ్ళే పడాలి. అసలు ఇలాంటి స్థితిలో ఉన్నామని పక్కవాళ్ళకు కూడా తెలీకుండానే బతుకుతుంటాం. వాడిని కూడా ఎత్తుకపోదాం. రోడ్డు మీద ఆటో ఒకటి కనబడింది. ఇంటికి వెళ్ళిపోతున్నానన్నాడు. కానీ హాస్పిటల్ అనేసరికి వస్తానన్నాడు.
హాస్పిటల్ నిద్రపోతోంది. పెద్దగా మనుషులెవరూ కనబడలేదు. రిసెప్షన్లో పేరు, వయసు రాసుకొని. ఐదు వందలు కట్టించుకొని.
మమ్మల్ని ఒక గదిలోకి తీసుకెళ్ళారు. టార్చ్ లాంటిదేదో వేసి ముక్కులోకి లోతుగా చూశాడు డాక్టర్. ముఖంలో ఏ మార్పూ లేకుండా, ‘ఆ ఉంది’ అన్నాడు. ‘ఆపరేషన్ చేయిస్తారా?’ నాకు ఏం చెప్పాలో తెలియలేదు. తుది పరిణామం అదే అనే ఐడియా ఉంది. మీరు ఓకే అంటే ఎస్టిమేషన్ చెప్తానని అనస్తీషియా ఇంత, ఆపరేషన్ ఇంత, కాగితం మీద రాశాడు. మేము బయటికి వచ్చేముందు చివరి మాటగా–-ఒకవేళ వస్తే మాత్రం పొద్దున నాలిగింటికల్లా తీసుకురండి, రెండు గంటల ముందునుంచీ పిల్లాడికి పాలు తాగించొద్దు. తలూపుతూ బయటికి వచ్చేశాం. పాలు ఇవ్వొద్దంటే ఎట్లా? ఆకలికి ఏడిస్తే? ఇవ్వొద్దంటే ఇవ్వొద్దు, ఓర్చుకోవాలి.
ఉంది అన్నాడంతే. నిజంగా ఉందా? ఉందీ అనేంతగా ముఖంలో మార్పు కనబడలేదు. జస్ట్ ఉంది అన్నాడంతే. ఇట్లాంటివెన్నో చూడబట్టి ఆయనకు ఇది మామూలేనేమో. ఏమో ఎవడికి తెలుసు, డబ్బుల కోసం ఆపరేషన్ నాటకం ఆడితే? డాక్టర్ ముఖం అంత అన్యాయం చేసేవాడిలా ఉందా? మరి చిన్నోడు మళ్ళీ మామూలుగానే ఉన్నాడే. ఉందంటావా? ముక్కులోకి దూరింది రాలిపోగానైతే మనం చూడలేదు. ఉండక ఎటుపోతుంది?
మేము రిసెప్షన్‌ను దాటుతున్నప్పుడు రిసెప్షన్లో ఇందాక కూర్చున్న అబ్బాయి మా వెనకే వచ్చాడు. ‘సర్, మీరు రేపు మానింగ్ కచ్చితంగా వస్తారా?’ మరీ నిలదీసినట్టు అడిగితే ఏం చెప్పాలి? బహుశా నా ముఖంలో డాక్టర్‌కు పూర్తి ఆమోదముద్ర కనబడలేదేమో. అందుకే స్పష్టత కోసం పంపివుంటాడు. నూరు శాతం వస్తామని చెప్పడానికి నోరు రావడం లేదు, అట్లా అని రాము అని చెప్పలేకున్నాను. మళ్ళీ ఓ వైపు భయంగానే ఉంది. ‘ఆ లేదు, మీరు రానట్టయితే మీ 500 మీకిచ్చెయ్యమన్నాడు సార్.’ అట్లా ఎందుకు చెప్పినట్టు? ఈ క్షణంలో రేపు ఉదయాన్ని నేను నిర్ణయించేసెయ్యాలన్నమాట. పుట్టువెంట్రుకలు కూడా తీయని ఆ చిన్నోడిని రేపు ఆపరేషన్ బల్ల మీద ఎక్కించి, ఆ మత్తుమందు ఏదో ఇచ్చి, నాకెందుకో నచ్చడం లేదు. కానీ నాకు శక్తి లేనిదే నిర్ణయాలు తీసుకోవడంలో. ఇప్పుడు ఈ ఐదొందలు పట్టుకెళ్ళిపోతే ఇంక ఆపరేషన్ క్యాన్సిల్ అయినట్టే. అంటే, ఒక తలుపును నేను మూసేసినట్టే. ‘లేదు, వస్తాం’ అని చెప్పి బయటికి వచ్చేశాం. ఇట్లాంటి గాభరా ఏమాత్రం అక్కర్లేనిది. ఏదో జరగడం వల్ల పడితే అది వేరే. ఇది ఉత్తి పుణ్యానికి.
అప్పటికి పన్నెండున్నర అవుతోంది. హైదరాబాద్‌లో ఏ అర్ధరాత్రి అయినా ఎవరో ఒకరు మేలుకుని పని చేస్తూనేవుంటారు. ఆటో సులభంగానే దొరికింది. వీడు కాసేపు నా దగ్గర, వాడు కాసేపు నీ దగ్గర అన్నట్టుగా పిల్లల్ని ఇద్దరం భుజాలు మార్చుకుంటూ తిరిగి ఇంటికైతే వచ్చేశాం. చిన్నోడు మధ్యమధ్యలో అటు కదిలి ఇటు కదిలి లేస్తూ వున్నాడు గానీ పెద్దోడైతే అట్లే పడుకుని వున్నాడు. బహుశా వాడు కంటున్న ఏ కలలకో ఇదంతా నేపథ్య సంగీతం అవుతున్నదేమో. నిన్న ఇదంతా జరిగిందని రేపు చెబితే వాడు నమ్ముతాడా?
పిల్లల్ని మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టి. చిన్నోడు శ్వాస బాగా తీసుకుంటున్నాడు. ‘పొద్దున కచ్చితంగా పోదామంటావా?’ ‘ఏమోనే.’ ‘మరి ఆ ఐదు వందలు తెచ్చుకుంటే ఐపోవుగదా.’ ‘ఇప్పుడా ఐదు వందలేనా మన సమస్య?’ ఫలితం ఎటూ తేలకపోవచ్చుగాక. కానీ ఒక ప్రయత్నం అయితే చేశాం. పూర్తి బాధ్యత లేనట్టుగా వ్యవహరించలేదు. పడాల్సినంత ఆందోళన కూడా పడ్డాం. కాబట్టి చూస్తూ ఏమీ చేయలేదే అనే గిల్ట్ అయితే కరిగిపోయింది.
తెల్లారి లేచేసరికి ఆరయింది. ఏదో తెలియకుండానే నిద్రలోనే గండం దాటేసినట్టు అనిపించింది. చిన్నోడు బానే ఉన్నాడు. మళ్ళీ హాస్పిటల్‌కు వెళ్ళాలన్న ఆలోచనే చేయలేదు. ఎప్పుడో రాలిపోయి వుంటుంది. నేను నా రోజువారీ పద్ధతిలోనే ఆఫీసుకు వెళ్ళిపోయాను.
మధ్యాహ్నం నా భార్య ఫోన్ చేసింది. అట్లా మంచంలో పడుకుని ఉందట. పిల్లలు దగ్గరే నిలబడి ఆడుతూ వున్నారు. చిన్నోడి ముక్కు దూలం దగ్గర ఏదో వచ్చి ఆగినట్టు కనబడిందట. లటుక్కున అందుకుందట. నేను చేస్తున్న పనిని ఆపేసి కాసేపు ఊరికే కూర్చుండిపోయాను. నేను ఏ మొండితనంతో దాన్ని ప్రకృతికి వదిలేశానో తెలియదు.
తిరిగి ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు వాళ్ళవైన ఆటలేవో ఆడుతున్నారు. ‘చూస్తావా?’ నాకు వెంటనే అర్థమైంది. ‘ఏదీ?’ చిన్న పల్లిత్తు తెచ్చి చేతిలో పెట్టింది. 22గంటలు లోపల ఉండటం వల్ల ఉబ్బిపోయింది. దీన్ని ఏం చేయాలి? వాడికొక జ్ఞాపకం లాగా దాచిపెట్టాలా? ఎంతకాలమని ఉంటుంది? చూస్తూ చూస్తూ పారేయలేం. ఏ ఎలకో తినేసేవరకూ అది చాలారోజులు మా కిటికీ గోడ మీద ఉంటుండేది.