ఒక మధ్యాహ్నం పూట ఊళ్ళో

మొదట మేల్కొనేది ఇంటి ప్రక్క పసుప్పూల చెట్టే. నావైపు అలా చూసి తలను ఎటో తిప్పేసుకుంటుంది. మా ఇద్దరి మధ్య దాటలేని నిశ్శబ్దపులోయ. ఊళ్ళో నుంచి వెళ్ళిపోయానని కోపం. ఆకాశంలేని పక్షి ఒకటి ఆ చెట్టునీడను చిరునామాగా చేసుకుంది. కనబడగానే లోపలెక్కడో మిగుల్చుకున్న చిన్న దీపపు కాంతిలాంటి నవ్వుని పెదవులపైకి లాక్కుంటుంది. ముఖం మీదకు పోటెత్తే అలల నురుగుతో ఆదాటున చూస్తే సముద్రమనుకుంటాం.


ఆకుల మధ్య ఖాళీల్లో ఇరుక్కుపోయిన సూర్యుడు పెరోల్ మీద పలకరింపుకొస్తాడు. అక్కడక్కడా కొన్ని గడపలకు చేతులు మొలిచి గాల్లో ఊగుతాయి. సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకునే తలుపు పాడే నిరసన పాటకు గోడలు దాచుకున్న నిశ్శబ్దం మట్టిబొమ్మ పగులుతుంది. చెమ్మదేరిన గోడల్ని ఓదార్చడం ఒక పట్టాన కుదరదు.


పడకగది నిండా నిద్రాభంగమైన జ్ఞాపకాలు. వంటింటి చీకట్లో కలలు చెదిరిన పూలతోట మీద ఎగురుతూ భయపెట్టే ఎడారి నీడ. శూన్యాన్ని శ్రుతి చేస్తూ నీళ్లింకిన కొళాయిలు. గదుల మధ్య పేరుకున్న ధూళిలో అడుగుముగ్గు లేసుకుంటూ తిరిగొచ్చి మనీప్లాంట్ శుష్క ఛాయలో కూలబడతాను. నా చుట్టూ పొరలు పొరలుగా అరువు ఖాతాలో కొనుక్కున్న దుఃఖం.


సాంబమూర్తి లండ

రచయిత సాంబమూర్తి లండ గురించి:

ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2020లో గాజురెక్కల తూనీగ అనే కవితాసంపుటిని ప్రచురించారు.

 ...