ఊఁ, మొత్తం ఈ గదిలోని విద్యార్థులు… ఆరు వరుసల్లో ఐదుగురేసి… ముప్పై మంది. అందులో ఒకటి, రెండు, మూడు… తొమ్మిది మంది రాలేదు. ఈ ఇరవై ఒక్కరిలో ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురూ పంజాబీలే వేసుకున్నారు. ఒకామెది మాత్రం పంజాబీలోనే పాదాల దగ్గర గంటలాగా ఉబ్బే డ్రెస్సు. వీళ్ళను వదిలేస్తే–
పద్దెనిమిది మంది అబ్బాయిల్లో ఒకటి, రెండు, మూడు… పది మంది జీన్సు వేసుకున్నారు. నలుగురు ఫుల్ టీషర్టులు, ఒకతను హాఫ్ టీషర్టు తొడుక్కున్నారు. మిగిలినవాళ్ళలో ఒకతనిది తప్ప అందరివీ నిండు చేతుల అంగీలే. ఈ నిండు చేతుల్ని ఒకతనే మొత్తం కిందికి దించి బటన్లు పెట్టుకున్నాడు. అందరూ సగం పైకి మడుచుకున్నారు. ఈ చొక్కాల్లో రెండు మాత్రమే ప్లెయిన్ కలర్. ఒకటి నీలం, ఒకటి క్రీమ్. మిగిలినవన్నీ చెక్సే. అందులో సన్న చెక్స్ ఇద్దరివి, మిగిలినవన్నీ బ్రాడ్ చెక్స్. క్రీమ్ కలర్ ఆ పొట్టి చేతుల చొక్కా అతనిది. ఇందరిలో ఇద్దరు చొక్కా పైగుండీలు పెట్టుకోలేదు.
జర్నలిజం ఎంట్రన్స్‌కు ఇన్విజిలేటర్‌గా వెళ్ళడం ముందు కాసేపు బానే ఉండింది. వాళ్ళ హాల్‌టికెట్లు చెక్ చేయడమూ, మనం చెప్పే సూచనలకు వాళ్ళు దేహమొగ్గి వినడమూ, బెల్లు మోగగానే ఒక్క సెకను కూడా వృథా చేయొద్దన్నట్టుగా పరుగెత్తి పేపర్లు పంచడమూ, వాళ్ళతో సంతకాలేవో పెట్టించుకోవడమూ, వెనక చేతులు పెట్టుకుని వాళ్ళేం రాస్తున్నారో పరిశీలిస్తున్నట్టుగా గది అంతా వరుసలుగా కలయతిరగడమూ, ఆ కొద్దిసేపు మనమేదో అత్యంత ప్రాధాన్యం గల మనిషిమి అనుకునేపాటిదేదో లోలోపల సంతృప్తి కూడా చెందేసినాక… తర్వాతేమిటి?
ఇద్దరు కళ్ళద్దాలు పెట్టుకున్నారు. ముగ్గురు మెడల్లో గొలుసులు వేసుకున్నారు. నలుగురు చేతులకు ఏవో పవిత్ర దారాల్లాంటివి చుట్టుకున్నారు. ఒకతనికి బ్రేస్‌లెట్ చైన్ ఉంది. బహుశా వెండిది. నలుగురు ఉంగరాలు పెట్టుకున్నారు. అందులో ఒకతని రెండు చేతులకూ ఉన్నాయి. మెడలో గొలుసు, చేతికి దారం, ఉంగరం మూడూ ఉన్న అబ్బాయి ఒకే ఒక్కడు. ఇద్దరు షూలు వేసుకున్నారు. ఏడుగురు శాండల్స్. మిగిలినవాళ్ళంతా బాటాలాంటి చెప్పులు. ఇద్దరికి మాత్రమే గడియారాలున్నాయి.
కాగితాల మీద కదులుతున్న వాళ్ళ చేతుల వైపు కాసేపు. ఏటవాలుగా ఒకరు. నిటారుగా ఒకరు. దిక్కులు చూస్తూ ఒకరు. జుట్టు పీక్కుంటున్నట్టుగా ఒకరు. పోనీ ఎవరైనా కాపీ కొడితే ఏదైనా ఉత్సాహం. బుద్ధిగా రాసుకుంటూ వుంటే చేయగలిగింది ఏమిటి?
ఎన్నిసార్లని కిటికీలోంచి బయట కొండను లోతుగా తవ్విపోయడంతో ఏర్పడిన బావిని చూస్తాం? ఎన్నిసార్లని చూరుముందు పాకుతున్న తిప్పతీగ ఆకుల్ని చూస్తాం? ఎన్నిసార్లని బయట గదిల్లో ఇంకెవరు ఇన్విజిలేటర్లు ఆవులిస్తున్నారో చూస్తాం? కుర్చీలోంచి లేచి, నాలుగు అడుగులు వేసి మళ్ళీ కూర్చుని, మళ్ళీ ఒకట్రెండు సార్లు నీళ్ళు తాగడం కోసం అన్నట్టుగా బాటిల్ మూత తెరిచి, ఈలోపు ఒక చాయ్ వస్తుంది. గుక్కాగుక్కా చప్పరిస్తూ తాగేసినా గడిచేది ఎంతసేపు?
ఈ పద్దెనిమిదిమందిలోనూ కుడిపాపట తీసుకున్నది ఇద్దరే. ఒకతనేమో పైకి దువ్వుకున్నాడు. ఒకతనిది గుండు చేయించుకున్న తర్వాత పెరిగిన జుట్టు కాబట్టి, పాపట కనబడలేదు. ఇంకొకతనికి జుట్టు రాలుతోంది కాబట్టి పాపట లేదు. ఏడుగురు నీటుగా షేవ్ చేసుకున్నారు. పదిమందికీ ఎంతోకొంత పెరిగేవుంది. ఒకతనిది ఇంకా షేవ్ చేయడం మొదలు పెట్టనంత లేతగడ్డం కాబట్టి నీటుగా లేదన్న ఖాతాలో కలపలేము. ఇంతమందిలో ఒక్కతనికే మీసం లేదు. ఇద్దరు పలుచగా ఉండీవుండనట్టు ఉంచుకున్నారు. ఎడమవైపు పాపట, మీసాలు సాధారణ ఆహార్యం.
ముగ్గురిది నలుపు రంగు అనుకోవచ్చు. ఏడుగురు చామనఛాయ. ఆరుగురిని ఎరుపులో వేయొచ్చు. ఇద్దరు తెలుపు. ఈ తెలుపులోనూ కొట్టొచ్చే తెలుపు ఒక్కరిదే.
నా దగ్గరున్న అటెండెన్స్ కాగితంలో వాళ్ళ సీటింగ్ ఎరేంజ్‌మెంట్‌ను బట్టి పేర్లున్నాయి. ఈ మూడో వరుసలో నాలుగోవాడు లక్ష్మీనారాయణ. మొదటి వరుసలో ఐదోవాడు పవన్. ఆరో వరుసలో నాలుగోవాడు మహేశ్. ఈ రెండో వరుసలో ముందమ్మాయి కరుణ. ఇతని పేరేమిటబ్బా… ఆ, రామకృష్ణ. అతనేమో ప్రభాకర్.
వారి వారి ముక్కుల తీరు, గదువల కుదురు, చెవులు, చెంపలు, సృష్టి, మనిషి, విన్యాసం, విలాసం.
నిబంధనల ప్రకారం అర్ధగంట ముందు మాత్రమే వదిలెయ్యడానికి వీలుంది. దానికోసం తొమ్మిది మంది కాచుకుని ఉన్నారు. నాకైనా కనీసం అటూయిటూ నడవడానికి వీలుంది! ఒక ఐదు నిమిషాల్లో ఇంకో అమ్మాయి వెళ్ళిపోయింది. చివరి పది నిమిషాల వరకూ ఆరుగురు మిగిలారు. గంట మోగిన తర్వాత కూడా రాస్తూ ఉండిపోయినవాళ్ళు ఇద్దరు. అన్నీ తీసేసుకుని, హాల్‌టికెట్ల ప్రకారం ఆర్డరులో సర్దుకుని, కవర్లో పెట్టేసుకుని, వాళ్ళ ఉద్యోగ భవిష్యత్తును జాగ్రత్తగా చేతుల్లో మోస్తున్నంత బరువుగా గదిలోంచి బయటకు.