ఎన్నో వానాకాలాల తర్వాత
అరవైనాలుగో అంతస్తు
అపార్ట్‌మెంటు బాల్కనీలో
చీకటిపడ్డ సాయంత్రం వేళ
మెరుపుల మధ్య చినుకులు
కాగితం పడవలు
పంచుకున్న చిల్లుల గొడుగులు
మండువా ఇంట్లో
కుంపటి మీద కాల్చిన అప్పడాలు
ఉడుకుతున్న ఆలుగడ్డ
ఆవిరిలొలుకుతోన్న అన్నం
కరెంట్ పోయిన సాయంత్రం
హరికేన్ లాంతరు వెలుగులో
ఒక్క కంచం ఆరుగురు పిల్లలు
వరసగా తెరుచుకునే నోళ్ళు
భూకంపం ముగిసేక
కురిసిన జపాన్ వాన
చిల్లులు పడే ధార
కాళ్ళకడ్డం పడుతూ
వరదలా నీరు
హోటల్ గది కిటికీలో
ముడుచుకున్న ముంగిస
ఎప్పటికీ ఆరని లోదుస్తులు
తడి తగలని చోట చెమ్మ
ఏళ్ళకేళ్ళు అరణ్యవాసం
కొన్నాళ్ళైనా తప్పని రహస్య జీవితం
ఖనిజంలో లవణం
గుర్తు తెలీని మరణం
ఎగరేసుకు పోయిన కాలం
ఎవరిదో తెలీని గాలిపటం
తెల్లటి పక్కమీద
బురదకాళ్ళు
వచ్చి వెళ్ళిపోయిన
ఆనవాళ్ళు
అది సరే,
యుగాంతమెప్పుడు?