మెడిటేషన్‌

అయితే మీరనేది, ఈ ప్రపంచంతో పనిలేకుండా బతకమనా?

ఒక్కసారి ఐదు నిమిషాలసేపు కళ్ళు మూసుకుని చూడు; నీకు అక్కర్లేని ప్రపంచం నిన్ను ఎంతగా కమ్మేసిందో తెలుస్తుంది.

చూపు మనదిక్కే ఉన్నట్టుగా కనబడి, పలకరింపుగా నవ్వడానికి తీరా కండరాలను సిద్ధం చేస్తున్నప్పుడు అతడు పక్కనెవరికో కరచాలనం చేసి. ఎక్కువకాలం సంసారం చేసినవాళ్ళ ముఖాలు ఒకేలా అన్నాచెల్లెళ్ళుగా కనబడి. చక్కగా పరవని దుప్పటి ముడతలు కూడా మూడ్‌ చెదరగొట్టి. తీరా కుర్చీలో కూర్చునేమోపుకు పక్కగదిలో ఫ్యాను ఆపలేదని లేవకతప్పని స్థితి.

‘గట్టిగా సంకల్పించుకోండి, ఈ భవంతి పైకప్పు కూలినా మీరు కాళ్ళూ చేతులూ కదిలించకూడదు, కళ్ళు తెరవకూడదు.’

ఒక్కసారి గుండ్రటి పైకప్పు వైపు చూడాలనిపించి, మరింత గట్టిగా కళ్ళు మూసుకుంటే లోపల కనుగుడ్డు ఊపిరాడనట్టుగా అదిరి, మళ్ళీ రెప్పల్ని వదులుచేసుకుని, రెప్పల కింద మారుతున్న రంగుల్ని చెంపలకు అద్దుకుంటూ, తెలియకుండానే కిందకు జారిన నడుమును నిలబెట్టి-

రాగి జావ త్రేన్పు.

అప్లికేషన్‌ చూస్తూ గురూజీ సహాయకుడు: అయితే మీరు ఈ స్మోకింగ్, డ్రింకింగ్‌ మానేయాలనేనా ఇది అటెండ్‌ అవుతున్నారు?

అయ్యో, నా లక్ష్యం ఇంకా చాలా ఉన్నతమైంది, మొత్తంగా మనిషి అస్తిత్వాన్నే తరచి చూద్దామని–

ఒకసారి కళ్ళెత్తి చూసి, మళ్ళీ అప్లికేషన్ను స్కాన్‌ చేయడంలో మునిగి-

‘మీ ధ్యాస అంతా మీ శ్వాస మీదే ఉండాలి. సహజమైన శ్వాస. మీకు ఎలా వచ్చి పోతున్నదో ఆ శ్వాస. ఎడమ ముక్కులోంచి వస్తోందా, కుడి ముక్కులోంచి వస్తోందా, రెంటిలోంచీ వస్తోందా?’

ముక్కు ముందే సింహప్పిల్ల కాపలాగా కూచునుంది, గాలి లోపలికి వస్తుంటే పట్టేయాలి, పంజాకు దొరకదే. గాలి దొంగలాగా జొరబడుతుంది. ఏయ్‌ సింహం, నిద్రపోవద్దు. సింహం తోక ఊపుతుంది కానీ పట్టుకోదు. వచ్చేది తెలిస్తే పోయేది తెలీదు, పోయేది తెలిస్తే వచ్చేది తెలీదు, రెండూ ఒకేసారి తెలవ్వా?

ఎన్నారై సాఫ్టూవేరూ, నువ్వు చెప్పు నాకు, గాలి ముక్కు ఏ గోడకు తగులుతున్నదో చెప్పు.

వజ్రాసనంలోంచి పద్మాసనంలోంచి అర్ధ పద్మాసనంలోంచి సుఖాసనంలోంచి బార్లా చాపుకోవడంలోకి మారి. (‘బాబూ, అది గురుపీఠం. కాళ్ళు అటు పెట్టకూడదు.’)

ఈ రింగుల జుట్టు బక్కపిల్ల యోగినిలా వుందే! ఆడవాళ్ళు పుట్టు యోగినులు. వీళ్ళకేం ఉండవా డిస్ట్రాక్షన్స్‌?

‘ఈ భూమ్మీద సమస్తం నశించిపోయేదే. ప్రతీ క్షణం పుట్టి ప్రతీ క్షణం చచ్చే ప్రపంచం ఇది.’

అంటే, ఇప్పుడు అంత పెద్ద కారులో వచ్చి ఆ రెండో వరుసలో నాలుగో మెత్త మీద కూర్చున్న ఆ కండపట్టిన నల్లకళ్ళద్దాల లిప్‌స్టిక్‌ ఆవిడ కూడా రేపు మనం చచ్చిపోతామని తెలుసుకోవడానికే ఇంత దూరం వచ్చిందంటావా? ‘పది రోజులు ఫోన్‌ చేతిలో లేదే బాబూ, ఎంత ఫ్రీ అయ్యాననుకున్నావ్’ అనేపాటి అతిశయానికి పోవడానికి కాకపోతే.

ఒకవేళ ఇప్పుడు నేనా కొండను తొలిచి కడుతున్న కింగ్స్‌ ప్యాలెస్‌ ముందుగానీ నిలబడి ఇదంతా పోయేదే, అనిత్య అనిత్య అని అరిస్తే నన్నో పిచ్చివాడిగా జమకట్టరా?

దేవుడి కోసం తపస్సు చేస్తే దయ్యం వచ్చినట్టు, ఈ ప్రపంచమూ పోతుంది, వీళ్ళంతా కూడా పోతారనేది ఒక క్రూరత్వపు తృప్తినిచ్చి.

ఎంత అనుభవించినా మిగిలిపోయే శరీరం గల ఆడదొకతి మొన్న రోడ్డు మీద నడుస్తూ చూసిన చూపు. గుండెకు పట్టిన చెమట. స్పష్టంగా కారణం చూపించలేని విసుగు. టాయ్‌లెట్‌లో పక్కన బాస్‌ ఉన్నారన్న స్పృహలో వదులుకాని నరాలు. బస్సులో పక్కసీటువాడు ఏదో తింటున్నప్పుడు మనం పడే ఇబ్బంది; బస్సులో మనం తినాల్సి వచ్చినప్పుడు కూడా మళ్ళీ పడే ఇబ్బంది. ఒకటి కాని కొత్త నోటు, పాత నోటు. చూడబుద్ధికాని విరిగిన చేయి. చెమ్మగా ఉన్న టేబుల్‌ మీద తినాల్సిన ఖర్మ. అయితే, భార్యకు మీసం మొలవడం మొదలైంది. పిల్లల్ని కొట్టడానికి చేయెత్తవలసిన కష్టం. ‘మీ అబ్బాయి స్కూలుకు ఆబ్సెంట్‌’ అనగానే చెడూహతో వణికే మోకాళ్ళు.

వేప వాసన, మామిడి వాసన, గంధపు వాసన. పిల్లి కోడి కూతల్ని కలుపుకున్న నెమలి అరుపు. ఎలుకలు ఎగురుతున్నట్టు, పిట్టలు బట్టలు కొరుకుతున్నట్టు, ముక్కు చుట్టూ చీమలబారేదో పాకినట్టు, గండుచీమలున్న చెట్టును కౌగిలించుకున్నట్టు. పెడల్స్‌ తొక్కినట్టూ గాలి, పంపుకొట్టినట్టూ గాలి. ముక్కు పుటాలు ఉబ్బిపోతున్నట్టు, ఉన్నట్టుండి రెండు ముక్కులు మొలిచినట్టు, దేహమంతా ముక్కే అయినట్టు. చిన్న గుటకకే తెగిపోయే ఊపిరి గొలుసు, అల్లుకునే ఆలోచనల వరుస.

ప్రతి నమస్కారం చేయడమే ఆయన వృద్ధాప్యానికి సార్థకత. ఎంతకాదన్నా ఒక మనిషికీ ఇంకో మనిషికీ ఎప్పటికీ ఉండగలిగే మధ్యదూరం. నచ్చని చొక్కాను నచ్చని హేంగర్‌కు తగిలించడంలో చూపే వివక్ష. చెవులు తాగబోయే అమృతం కోసం కళ్ళను సిద్ధం చేసి. శృంగారానంతరం వినగలిగే మెడనరపు సాన్నిహిత్యం. తమకంలో భాగస్వామి చేష్టలు గుర్తొచ్చి వచ్చే నవ్వు. చెత్త తిన్న పాపానికి తెల్లారి బాత్రూములో అనుభవించే శిక్ష. గోధుమకిలోపిండి. అవసరమైతే భగవంతుడి ముందు మోకరిల్లడానికి సిద్ధపడి. మనం ఏది నమ్మమో దాని దగ్గరికే తెచ్చి పడేయడంలోని జీవితపు కుట్ర. చనిపోవాలంటేనే భయపడేట్టుగా చేసే నివాళి వ్యాసం. ఇంతాచేస్తే మనం సాధించవలసింది ఇన్ఫార్మల్‌గా ఉండగలిగే శక్తి.

వెన్ను నొప్పి, మోకాలి నొప్పి, కుడి షోల్డర్‌ బ్లేడ్‌ నొప్పి. ఇంకా లంచ్‌ గంట కొట్టరా? పొద్దున జారుడు చట్నీ బాగుండింది.

నాగేశ్‌ గాడు ఒకటే నీళ్ళు తాగుతుంటాడు. నరేందర్‌ గాడు వాడిలో వాడు మాట్లాడుకుంటాడు. శరత్‌ సక్సేనా తమ్ముడి పేరు నాగేశ్వర్రావు కావడం వింత కాదా? గుండుగా గుండ్రంగా ఉండే ఆ నీలోత్పల్‌ గాడు అంత తక్కువ తింటాడా? పది రోజుల మౌనవ్రతంలో పరిచయాలు లేని మనుషులకు పరిచయమున్న పేర్లను తగిలించి. ఉన్నట్టుండి చిన్నప్పుడెప్పుడో అమ్మ చేసిన గంటె పిట్టు వాసన గుర్తొచ్చి-

‘ఆ పేలాలు అంత జెప్ప జెప్పన ఎందుకు బుక్కుతావు?’ నా ప్లేట్లో ఉన్నవే నా నోటిదాకా వస్తాయన్న నమ్మకం ఎందుకో నాకుండదు.

అంగుళం తెల్ల పురుగును ఎర్ర చీమలు భోంచేస్తున్నప్పుడు చూడాల్సివచ్చే సాధకుడి కర్తవ్యం ఏమిటి? ఊడిపోయిన అంగీ గుండీకి ధ్యానంలో ఏమిటి పరిష్కారం?

మీరు బయటికి వెళ్ళినప్పుడు గమనించండి: ఒక్కో చేయి తర్వాత ఇంకో చేయిలోకి మారుతూ, ఈ ధమ్మహాల్‌ తలుపు తెరిచివుండటం బయటి నిజం, మారిన మనుషులు మాత్రం కనబడరు. కణాలు కూడా అలానే పుడుతూ గిడుతూ శరీరం స్థిరంగా ఉందన్న భ్రమను కలిగిస్తాయి.

కేవలం అన్నింటా ఉన్నది ఒకే పదార్థం అయితే, ఈ చెట్టు చూడు, దీని ఆకులు వేరు, దీని కాయల రంగులు వేరు, దీని వాసస వేరు, దీని గుణం వేరు, మళ్ళీ ఒక్కో ఆకూ కాయా దానిదైన ప్రత్యేకత కలిగి-

మొత్తం సృష్టి విన్యాసాన్ని వ్యాఖ్యానించడానికి నువ్విక్కడ లేవు, సరిపోవు.

ఇదంతా తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? బుద్ధునంత పాతది సమాధానం, మనిషి స్వభావమంత సంక్లిష్టమైనది వాస్తవం.

‘ఇదివరకూ ఈ కోర్సు అటెండ్‌ అయ్యానండీ, మైండ్‌ ఎంత ప్రశాంతం అయిందనుకున్నారు!’

ఎవరమ్మా నువ్వు? నిన్న మధ్యాహ్నం పళ్ళెం కడుగుతున్నప్పుడు ఊరికూరికే జారిపోతుంటే, దీనికగ్గిదలుగ అనుకోకుండా ఉండలేపోతి.

అమ్మో దీన్ని రహస్యంగా ఉంచాలి, మనల్ని ఇక్కడ ఎవరో మెషీన్‌లో పెట్టి తీశారనుకుని, ఇక మన యాక్షన్స్‌ అన్నింటినీ జడ్జ్‌ చేయడం మొదలెడతారు.

అవునూ, అటు కిటికీ పక్కన బిల్డింగ్‌ పనాయనకు ఇవేమీ వద్దా?

ఏ హక్కూ లేని కొత్త దేహాలు. దేహానికి మాత్రమే అర్థమయ్యే లౌల్యం. ప్రపంచంతో ఉన్నది ఓ దారప్పోగు సంబంధం. తలలో ఇమడని భాగంలా చెవి పీకే కొడుకు. ఎక్కడివక్కడ విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళమే అయినప్పుడు ఎంతగనమనీ సర్దుడు. నామవాచకం లేని నమస్తే. గోక్కుంటే కూడా ముద్దొచ్చే చిన్నోడు. వెనక రాసిన చిల్లర అడిగితే, టికెట్‌ మీద కొట్టేసి తీరా ఇవ్వకపోతే కండక్టర్‌?

కొద్ది భూమిలో నీ కాళ్ళు నిలదొక్కుకోవడం తేలిక. పన్నెండుకు బదులు పదిహేను సమోసాలు ఇంటికి తీసుకెళ్ళలేకపోయిన గిల్ట్‌. కొడితే మోలార్‌ పన్ను విరిగిపోవాలి. మనం బాధపడగలిగినంత సమస్య ఏదీ లేదు భూమ్మీద.

మేకను ఇట్లా ముట్టుకుంటెనే బతుకబుద్ధయితుంది కద నానా.

మట్టిపాములా కనబడిన బుక్‌షెల్ఫు చెదలు. క్రిస్‌మస్‌ ట్రీని గుర్తు తెచ్చే సీతాఫలం లోపలి తొడిమ. పెద్ద పళ్ళ దువ్వెన. గడ్డపెరుగు. కందిపప్పు చారు. పొడిచద్దరు స్పర్శ. బుడమకాయ వడియాలు. అవిపత్తికర చూర్ణం. లేవగానే గోరువెచ్చటి నీరు. భయపడేట్టుగా గట్టిగా నిద్రలో తండ్రి కౌగిలించుకున్న గుర్తు. బట్టతల, ముసలితనానికి నేను అతీతుడినన్న నమ్మకం పోయి. మనకు నష్టం కలిగించని విషయం గురించి ఎంతసేపైనా చేయగలిగే వేదాంత చర్చ. మన సహకారం లేకుండానే అవతలివాడు ఎదిగిపోవడంలోని నొప్పి. హైదరాబాద్‌ నుంచి కాకినాడ కంటే, ఒక్కోసారి ఇద్దరి కళ్ళ మధ్య దూరం ఎక్కువ అనిపించి. పుట్టిన చోటే మెరుగ్గా చనిపోయే అవకాశం ఉండింటే ఎంతో ఘర్షణ తొలగి. ఎన్ని లెక్కలేసినా మన చేతుల్లో ఉన్నది సున్నా ప్లస్‌ శాతమే అనిపించి. జీవితం పలు పర్యవసానాల పర్యవసానం.

ఆ కండపట్టిన నల్లకళ్ళద్దాల లిప్‌స్టిక్‌ ఆవిడ ఇంతకూడా సిగ్గు లేకుండా పూర్తిగా నా ఎదురుగా కూర్చుని, ముందు నల్లకళ్ళద్దాలు తీసేసి. ఈ భౌతిక ప్రపంచంతో తేల్చుకోవలసిందీ, లెక్క సరిచేసుకోవలసిందీ ఇంకా ఏదో ఉంది.

‘మెత్తటి పరుపులూ, సెంట్లూ, మత్తుపదార్థాలూ, కాళ్ళు కింద పెట్టనీయని వాహనాలూ మన శరీరానికి మనల్ని దూరం చేస్తాయి.’

పొడగాటి వానపాము నా పాదం మీద మెడ ఆన్చి పడుకుని. ఒడిలో కూర్చున్న చిన్నిపిల్లిని అయ్యో బలవంతంగా తరమాల్సి వచ్చి. ముఖం మీద చూపు పడటానికి అడ్డుపడనంతటి వక్షం. ఆలోచన గొంతుకు అడ్డంపడితే పడిన సరం. అది అందరమూ నమ్మడానికి ఇష్టపడుతున్న అబద్ధం. లోకంతోపాటు నడిచి ఫెయిలైనా ఫర్లేదుగానీ లోకవిరుద్ధంగా పోయినప్పుడు విధిగా సక్సెస్‌ కావాల్సిన బరువు మన మీద పడి.

ఒక దగ్గర కలిసి పనిచేస్తున్నప్పుడు వంద గొంతులతో మాట్లాడుకుని; సంబంధంలో కొద్దిగా తేడా రాగానే ఒక పొరలో ఒక గొంతుతో మాట్లాడినదాన్ని ఇంకో పొరలోకి తెచ్చి కలిపి దాన్ని ఇంకా ఎందుకు చెడగొట్టి. సంబంధాలను స్కేళ్ళు పెట్టి కొలుచుకుంటే ఎవరికి ఎవరం మిగులుతామని. ఆరున్నరకు పార్కుకు వచ్చిన మనిషి, కాసేపు నడిచాక కూర్చున్న బెంచీని తనదే అనుకుని; ఏడున్నరకు వచ్చిన ఇంకో మనిషి కాసేపు నడిచాక కూర్చున్న అదే బెంచీని కూడా తనదే అనుకుని. స్థూల ప్రపంచంలో దొరకనిదేదో ఈ సూక్ష్మ ప్రపంచంలో దొరుకుతుందేమో, లేదా స్థూల ప్రపంచంలో దొరకనిదాన్ని జయించగలిగే శక్తి ఈ సూక్ష్మ ప్రపంచం ఇస్తుందేమో. ఒక ప్రశ్నకు నాలుగు రకాలుగా జవాబు ఇవ్వగలిగే అవకాశం ఉండి, తీరా ఆ ఎంపిక చేసుకున్న సమాధానం మన బుర్రలేనితనాన్నే బయటపెట్టి. తీరా అవతలివైపుకు చేరుకున్నాక ఇటువైపుకు మనసు లాగి.

ముక్కు నాకు అందకుండా దూరం జరిగి, ముక్కు దానికదే మనిషిలా మారి, ముక్కే సింహపు నాలుకలా మారి గాలిని అందుకుని, ముక్కే తల్లిలా గాలి పిల్లాడిని ముద్దాడి-

సటిలిటీ ఈజ్ బ్యూటీ. ఎండలో నీడ, ఉక్కలో గాలి, చన్నీళ్ళలో వేడి, ఆకలిలో మెతుకు.

నాలుక ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అవస్థపడుతూ. నిశ్చల స్థితికి గుండె చప్పుడే అడ్డుపడుతూ-

కళ్ళను దగ్గరగా కుట్టిన దారం విప్పినట్లు, గాలిని కొక్కేలు వేసి లాగినట్లు, సన్నటి వెండితీగలాంటి గాలి.

ఏది శరీరం, ఏది నేను? శరీరాన్ని నేను సమీపిస్తున్నానా, నన్ను శరీరం చేరుకుంటోందా? మనసును శరీరం నియంత్రిస్తోందా, శరీరాన్ని మనసా? పదార్థమా, చైతన్యమా, ద్వంద్వమా, ఏకమా?

ముక్కు మీద కంచె ఏదో అల్లుకుపోవడం మొదలై, పత్తికాయ పురుగేదో మెడ పక్కనుంచీ తొలుచుకుంటూ వచ్చినట్టు భయమై, రెండు చేతులూ మంటలో పెట్టినట్టయి, సూదులేవో వీపులో గుచ్చినట్టయి, చెవి తమ్మె మీద సోమరి పురుగేదో కదలకుండా నిలుచున్నట్టయి, అద్దంలో ముఖం చూసుకుందామన్న భయ కుతూహలమై.

ఊడిపోయిన గుండీ నువ్వే కుట్టుకోవాలి; కానీ నీ అస్తిత్వానికి ఏ అదనపు ప్రాధాన్యతా లేదు. నువ్వూ ఈ ప్రకృతిలో భాగమే అని కణకణంలోనూ ఇంకించుకుంటే గనక సాటిజీవిని అపార కరుణతో చూస్తావు. నేను ప్రత్యేకమనే అతిశయమేదో డ్రైవ్‌ చేయకుండా మనిషనేవాడు ఎట్లా బతకాలి? అందరూ అదే అతిశయంలోకి వచ్చాక అది అతిశయం కాకుండా పోతుంది. అప్పుడు ముందువరసలోని వాళ్ళు ఇంకో అతిశయాన్ని మోస్తూవుంటారు కదా? దాన్ని బ్రేక్‌ చేయనంతకాలం నువ్వు వాళ్ళ వెంబడి పరుగెడుతూనే ఉంటావు. పదేళ్ళ తరువాత అడుగుపెట్టిన కిరాయి ఇల్లు కూడా ఎందుకు దుఃఖపు తెరనిచ్చి. రెండడుగుల దూరంలో ఉన్న మనిషి అంతరంగమే మనకు తెలియనప్పుడు, ఏ రెండు వందల ఏళ్ళ కిందటిదాన్నో ఎలా నిజం అని నమ్మి.

గిన్నె లేనిదే పాల ప్యాకెట్‌ కట్‌ చేయని నాకూ, ప్యాకెట్‌ కట్‌ చేశాకే గిన్నె కోసం వెతికే తనకూ మధ్య మళ్ళీ కొట్లాటొచ్చి. భౌతిక ప్రమాణాలు మాత్రమే చెల్లుబాటయ్యే ఈ ప్రపంచంలో నువ్వు చేసేదంతా అర్థరహితంగా కనబడి. ఎంత పెద్ద ఇష్యూ అయినా నీ మనశ్శాంతి పోగొట్టేంతటిది కాదని విస్మరించి. శూన్యపు గుహలోకి పోతున్నట్టు రాత్రికారురోడ్డు ప్రయాణం తలపించి. షెల్ఫు సైజుకు అనుగుణంగా ప్యాంటును ఒక్క మడతేయాలా, రెండు మడతలేయాలా అని నీకు ఎప్పటికి తెలిసి. అన్నీ ఒకటేసారి వచ్చి మీదపడి. ఇంపెర్ఫెక్షనే సాధారణం అని చాలా కాలానికి అర్థమై. సృష్టి విలాసంలో ఈ భౌతిక విలాసాలకు ఏ ప్రాధాన్యతా ఉండబోదని ఎప్పటికి తెలిసొచ్చి. ముక్కు మీది, నెత్తి కింది ప్రపంచమని నమ్మడానికి ఇంకేమిటి అడ్డుపడి. ముందు నీకూ శరీరానికీ అభేదం; తర్వాత సృష్టికీ నీకూ అభేదం. బి నథింగ్, డూ నథింగ్‌. శిశిర గాలి చివరి తోపుకు ఎదురుచూస్తున్న ఆకుల్లా ఆలోచనలు రాలిపడి.

సుఖమో దుఃఖమో స్థూలమో సూక్ష్మమో నీ సంవేదనలకు జాగరూకంగా ఉండాలి, వాటిని తటస్థంగా గమనించాలి, తీక్షణంగా చూస్తే తప్ప కనబడని ఎత్తైన రబ్బరుచెట్టుకు పెట్టుకున్న తేనెపట్టులోని కదలికల్లా. అప్రయత్నంగా దేహం మొత్తం రేగినట్టయి, ఒక్కసారి తలుపు తెరిచి ఆహ్వానిస్తూ, ఇంకోసారి తాళం బద్దలుకొట్టినా తెరుచుకోనట్టు. చల్లటి నీళ్ళగడ్డలా మోకాలు నొప్పి భళ్ళున కరిగిపోయి.

దేహం మొత్తం పెద్ద కొండలా అంతూదరీ దొరక్కుండా, మళ్ళీ అదే దేహం బుజ్జి కుందేలుపిల్లలా మారి.

ఇక్కడి గుండె ఊపిరి అక్కడి ఎడమ అరికాలిలో తెలుస్తూ. ఆపాదమస్తకం విద్యుత్ప్రవాహ సర్క్యూట్‌ పూర్తి చేస్తూ. రాలిన ఆకులా, కదిలే మబ్బులా తేలికై. దేహం మొత్తం మిణుగురుల్లా ఉల్లాసపు రొద చేస్తూ- హహ్హ, ఓఓఓ- హహ్హహ్హ. ఆనందం. పరమానందం. రియల్‌ బ్లిస్‌. ఇది సాధ్యమే. ఇది నాక్కూడా సాధ్యమే. మీదేదో కాంతివలయం తిరిగినట్టు. గంజాయి, సెక్సు ఎందుకూ కొరగావు. ఒక మనిషి శరీరంలో ఇంత ఆనందం నిక్షిప్తమై ఉంటుందా? ఈ రహస్యం తెలియడం వల్లే యోగులు బ్రహ్మచారులుగా ఉండగలుగుతున్నారా? ఏదో చూద్దామని వచ్చినవాడికే ఇది ఇంత ఇవ్వగలిగితే నిజంగా మునిగినవాడికి ఎంత ఇవ్వగలుగుతుంది? ఓఓఓ, నిజం, ఇదంతా నిజం నిజం. తల నుంచీ కాళ్ళ దాకా శక్తి పరుగులెత్తుతూ, ఆనందం గంతులెత్తుతూ.

సాధకా, నీ సంవేదనలకు తటస్థంగా ఉండు, సుఖానికి వశం కావొద్దు–నా వల్ల కావట్లేదు, నేను లోబడిపోతున్నాను. ఈ మాయలోకి మళ్ళీ జారకు, సుఖం వెంటే నీడలా దుఃఖం కూడా ఉంటుంది–నేను కష్టాన్ని తట్టుకోగలిగాను గానీ సుఖాన్ని ఓపలేకపోతున్నాను. కేవలం పరిశీలకుడిగా ఉండు, నీ రాగవికారాలన్నీ కరిగిపోనీ, నీ కోరికలన్నీ కాలిపోనీ, లేకపోతే దీని మొత్తం ప్రయోజనమే దెబ్బతింటుంది. సంవేదనలు నీకు ఆట కాదు, మనసుతో దేహాన్నీ దేహంతో మనసునూ నియంత్రించుకో. నీకు గతం లేదు, భవిష్యత్‌ లేదు, ఉన్నది వర్తమానం ఒక్కటే. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించు. ఈ క్షణమొకటే నీకు సత్యం, దానికి మెలకువగా ఉండు, తటస్థంగా ఉండు. సహజాతంతో కాదు చైతన్యంతో స్పందించు.

గాలి తేటగా తేలిగ్గా ఉంది. చిన్న పిట్టొకటి ఎగురుతూ వాలుతూ చిన్న కాయలు పొడుచుకుంటోంది. కానుగ ఆకులను దగ్గరగా మలుచుకొని కొరిచీమలు గూడు చేసుకున్నాయి. రాత్రి గాలికి ఆకుపచ్చ బాదాంకాయలు రాలిపడ్డాయి. ఇదివరకే రాలిపడిన మామిడిపిందెలు చెదలెక్కుతున్నాయి. ఆకాశంలోని నిండు చంద్రుడు తెలియని బెంగ పుట్టిస్తున్నాడు. దూరంగా మనిషెవరో తత్వం పాడుతున్నాడు.