రచయిత వివరాలు

శ్రీసుధ మోదుగు

పూర్తిపేరు: శ్రీసుధ మోదుగు
ఇతరపేర్లు:
సొంత ఊరు: రెంటచింతల, గుంటూరు జిల్లా.
ప్రస్తుత నివాసం: కింగ్ స్టన్, జమైకా.
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://amohamkavitvam.blogspot.com/
రచయిత గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి.

 

కథ ఎటు వైపు నుండి నడిపినా అన్ని వైపుల నుండి పాత్రలను సరిగా చూపించడం రచయితగా నా బాధ్యతనా!? కాకపోవొచ్చు. రాసేటప్పుడు ఇలాంటి ఆలోచనలు చిరాకు తెప్పిస్తుంటయ్. కొన్నిసార్లు నాలో ఒక పిచ్చివాడు ఉన్నాడేమో అనిపించేది. అప్పుడప్పుడు రూప కూడా అనేది ‘నీ పిచ్చితనమే నాకు నచ్చుతుంది రాజా. వాడి వల్లేనేమో నీ కథల్లో పాఠకుడి కోసం చేసే మానిప్యులేషన్, మెలోడ్రామా రాయడానికి కష్టపడతావు’ అని.

ఒక్కసారిగా ఊళల శబ్దం, ఉలిక్కిపడి నిద్రలేచా. ఎక్కడనుంచి వచ్చాయో తోడేళ్ళు అమీ చుట్టూ. అక్కడ అమ్మ, గొర్రెలు ఏమీ లేవు. అమీ వాటి వైపు చిత్రంగా చూస్తోంది. అమీ తల ఇంకా పెద్దదైంది. కళ్ళు నీలి రంగుతో వెలుగుతున్నాయి. అమీ ముఖంలో సన్నటి జలదరించే నవ్వు. క్రమంగా అది పెరిగిపోతోంది. నవ్వులా లేదు అది, తోడేలు ఊళలా ఉంది. చుట్టూ తోడేళ్ళు అమీతో పాటే ఊళలు పెడుతున్నాయి. వెక్కిళ్ళు మళ్ళీ మొదలయ్యాయి. తోడేళ్ళు నా వైపు తిరిగాయి.

ఏం ఆశలని అడుగుతాడేమో అనుకున్నా. కానీ అడగలేదు. అతను మౌనంగా ఉండిపోవడం వెనుక నిరసన అర్థమవుతూనే ఉంది నాకు. వెళ్ళేదారిలో రోడ్ పక్కన కారు ఆపి మూర్తి టీ తెచ్చాడు. ఇద్దరం తాగాం. మూర్తి నా ఇష్టాయిష్టాలు ఒక్కటీ మర్చిపోకపోవడం ఎక్కడో కించిత్తు గర్వంగా అనిపించింది. కొద్దిగా మామూలు అయ్యాడు మూర్తి. నాలుగు గంటల ప్రయాణం. ఎర్రగొండపాలెం దగ్గరికి వచ్చాం.

ఆమె ఇంటికి తరచు వెళ్ళడం అలవాటైంది. ఉండేకొద్దీ ఆమెతో కాసేపు గడిపిరావడం బాగా అనిపించేది. అప్పుడప్పుడు తెలీసీ తెలీనట్లు ఆమె చేతివేళ్ళను తాకడం, భుజాన్ని తడుతూ మాట్లాడటం జరుగుతుండేది. అదేదో కావాలని చేసినట్లు కాదు కానీ అలా అవుతుండేది. ఆ మొక్కల మధ్య ఇల్లు అరణ్యంలో ఇల్లులా ఉండేది. అక్కడికి వచ్చినప్పుడు నా ఉనికి ఆ మొక్కలకి నచ్చనట్లు అనిపించేది. అప్పుడప్పుడు ఊపిరాడనట్లు అనిపించేది.

ఫ్రాంక్‌కి బహుశా అరవై ఏళ్ళు ఉంటాయేమో. ‘దేని సౌందర్యమైనా దాని ఆత్మలో ఉంటుంది ఫ్రాంక్’ అంటే గట్టిగా నవ్వేవాడు. ‘ఆత్మలో సౌందర్యం, హృదయంలో సౌందర్యం, శరీరంలో సౌందర్యం ఇవన్నీ ఒట్టి మాటలు శ్యామా. సౌందర్యమంటే ఒకటే, అది నీకు సౌందర్యంగా కనపడటం మాత్రమే’ అంటాడు. ‘బ్యూటీ ఈజ్ ఇన్ ది బిహోల్డర్స్ ఐస్ అన్న మాట’ అంటే, ‘కాదు. ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ది బిహోల్డర్స్ లైఫ్, మూడ్, అండ్ ఛాయిస్’ అంటాడు.

మంచం అంచుకు జరిగి ఇంకోవైపు తిరిగి పడుకున్నా. నా గుండె చప్పుడు నాకే పెద్దగా వినిపిస్తుంది. అలా ఎంత సమయం గడిచిందో తెలియదు. తన చేతులు నెమ్మదిగా వెనుక నుంచి నా చుట్టూ చుట్టుకున్నాయి. బలంగా తనలోకి అదుముకుంది. మెడపైన తను పెడుతున్న ఒక్కొక్క ముద్దులో కొద్దిగా కొద్దిగా నా విచక్షణ కరిగిపోయింది. గుండె ఇంకా పెద్దగా కొట్టుకుంది. చిన్నపాటి పెనుగులాట లోపల వీగిపోయింది. ఒక్కసారిగా తనవైపు తిరిగి ముద్దు పెట్టుకున్నా.

మా తాతవాళ్ళు పసిఫిక్ సముద్రంలో ఉన్న ఛానల్ ఐలాండ్స్‌లో ఉండేవాళ్ళట. అక్కడకి సీ లయన్స్ వచ్చేవట, అవి మేటింగ్ సీజన్లో సముద్రపు ఇసుకలోకి చేరేవి. ఒకసారి ఒక సీ లయన్ పుట్టాక దాని తల్లి చనిపోయిందట, తండ్రి సముద్రంలోకి వెళ్ళి తిరిగి రాలేదట. ఆ సీ లయన్‌కి రాస్ అని పేరుపెట్టి మా తాత పెంచుకున్నాడు. మా అమ్మ, రాస్‌తో దగ్గరగా పెరిగిందట. రాస్‌కి మా అమ్మ అంటే అలవికాని ప్రేమ.

ముజు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు తొమ్మిదేళ్ళు ఉంటాయేమో! ఆమె రాగానే మూడేళ్ళ నా చెల్లెలు సేనిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. ఇక అప్పటి నుంచి సేని ముజుని వదిలి క్షణం ఉండేది కాదు. ఆమె వెంటే తిరుగుతూ ఉండేది. ముజుని పెళ్ళి చేసుకున్న కొన్ని రోజులకే పచ్చి తాగుబోతైన మా నాన్న చిన్న మురికికాలవలో పడి ఆపైన మంచానికి అతుక్కుపోయాడు. తాగుడుకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేక ఆయన తన కోపమంతా ముజుపైన చూపించేవాడు.

రెండు గదుల పెంకుటిల్లు. బయట వరండాలో రెండు అరుగులు. నవారు కుర్చీ. ఓ నులక మంచం. వంటింటి సామాన్లు, ఆమె చీరలు కాకుండా, అన్నిటికంటే ఆకర్షించింది అక్కడ ఉన్న చిన్న చిన్న వెదురు బుట్టలు. రకరకాల రంగుల్లో ఉన్నాయి. వాటిలో చిన్న చిన్న రంగుల గవ్వలు. గవ్వలతో చేసిన బొమ్మలు. పక్కన ఓ ట్రంక్ పెట్టె. దానిని తెరవాలనిపించలేదు. వాటినన్నిటిని చూస్తుంటే ఆమె ఆ ఇంటిని ఎంత ఇష్టంగా చూసుకుందో కనిపిస్తుంది.

ఏరా దామూ బడికి రాలేదూ అనడిగితే ఈ రోజు లచ్చిమి ఈనింది అని, ఇంకో రోజు రాజుకి దెబ్బ తగిలింది అని ఏదో ఒక కారణం చెప్పేవాడు. మేకలన్నిటికీ పేర్లు పెట్టాడు. ఎందుకురా మేకలకు పేర్లు పెట్టావ్ అంటే, ‘మేకల భాష తెలీదు కదా టీచరమ్మా వాటికి అవి ఏమి పేర్లు పెట్టుకున్నాయో! ప్రతి మేకకి ఏదో ఒక పేరు ఉంటది కదా, మరి మేక అని ఎట్లా అంటా, అందుకే నేను ఒక పేరు పెట్టుకున్నా’ అని అన్నాడు. వాడి దగ్గర అదో రకమైన మేకల వాసన.

ఆవరణలో పెద్ద మామిడిచెట్టు, దానిపక్కనే మొదలుకంటూ అడ్డంగా కొట్టేసి, ప్రస్తుతం మొద్దులా మిగిలిన మరో చెట్టు ఆనవాలు. ముందుకు నడిచాను. రెండు పిల్లులు గబాల్న నా ముందునుండి పరిగెత్తాయి. హాల్ మధ్యలో నాలుగు కేన్ చైర్స్, ఒక చిన్న కాఫీ టేబుల్. పక్కగా కొద్దిపాటి ఎత్తులో పియానో. దానికి కొంచెం దూరంలో కిటికీ. దానికి అటు ఇటు పుస్తకాల షెల్ఫులు.

ఏమో తెలియదు కాని, దాని శబ్దాలు వినే కొద్ది కొన్ని రోజులకు అర్థమైంది, అది చేస్తున్నవి శబ్దాలు కావు, అది పాడుతుందని. ఆ పాట ఎంత తీవ్రతతో ఉంటుందంటే దాన్ని వింటున్నప్పుడు ఒక్కోసారి దుఃఖం వచ్చి ఏడ్చేవాడిని. ఇంకొన్నిసార్లు ఆనందం లోపలనుంచి పొంగుకొచ్చేది. అప్పుడప్పుడు అది ఏదో శాంతి మాత్రం జపిస్తున్నట్లు అనిపించేది. దాని పాట వింటూ ప్రపంచాన్ని మనుషుల్ని మరిచిపోయేవాడిని.

నా దాహం తీరడం లేదు. లోలోపల దహించి వేస్తున్న దాహం. అంచెలంచెలుగా పెరిగిపోతున్న దాహం. చివరకు నిద్ర కూడా కరువైంది. ఏమీ చేయాలో తోచలేదు. మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళాను. అతడు నాకు పాలీడిప్సియా ఉందని, నాలో ఒక రకమైన స్క్రిజోఫినిక్ లక్షణాలు కనిపిస్తున్నాయని నిర్ధారించాడు. నాకు భయం వేసింది. నాకు దాహం తప్ప ఏమీ లేదని చెప్పేందుకు ప్రయత్నించా. కానీ అతడు వినలేదు. మెదడు మగతలో జారుకోవటానికి అంటూ కొన్ని మందులు ఇచ్చాడు.

నా సమస్య కొంతమందికి నవ్వులాట. కొంతమంది శ్రేయోభిలాషుల్లా సలహాలు కూడా ఇచ్చారు. ఇంకొంతమంది వెటకారాలు చేస్తారు ‘ఏంటి, ఈ సారి ఏమైంది’ అని. శరవణన్ మాత్రం ఎప్పుడూ సలహాలు ఇవ్వడం, పెద్దగా తీర్పులు చెప్పడం చేసేవాడు కాదు. అది ఒక్క నా విషయంలోనే కాదు. ఎవరి గురించైనా ఆరా తీసినట్లు కాని, ఎవరికైనా సహాయమో, హానో చేసినట్లు కానీ నేను చూడలేదు. అతను తన కోసం తప్ప ఎవరికీ ఏ పని చేయడు.

ఆ నవ్వు నాకు చిత్రంగా మా ఊర్లో చాకలి రాజయ్య గాడిద నవ్వులా అనిపించింది. ఆ గాడిద నవ్వడం నేను ఒకే ఒక్కసారి చూశా. నా చిన్నప్పుడు దొంగలు ఒకసారి చాకలి రాజయ్య గాడిదను ఎత్తుకెళ్ళారు. కానీ దాన్ని తోలుకు వెళ్ళలేక దాన్ని, దానితో పాటు దానిపైన దొంగతనం చేసి వేసిన బరువైన వస్తువుల్ని కూడా ఊరి చివరి వదిలేసి వెళ్ళారు. ఉదయాన్నే దాన్ని వెతుకుతూ వెళ్ళిన రాజయ్యకి తన గాడిద ఊరి చివర బీడు పొలాల్లో గడ్డి తింటూ కనిపించింది.

ఇక్కడికి ఇలా రావడానికి ఏదైనా కారణం ఉందా? లోపలెక్కడో తెలీని ఆలోచనల నుంచి ఇక్కడికి రావాలని, ఇలా ఈ క్షణాన్ని గడపాలని, ఈ పరిసరాలను చూడాలని, ఇలా ఒక మనిషిని కలవాలని అనిపించి ఉంటుందా? లోలోపలే ఏదైనా జరిగి ఉంటుందా? ఇదేదీ కాకపోవచ్చు! మనుషుల జీవితాలు చాలా చిన్నవి. దేనికీ ఎవరికీ అక్కర ఉండదు. బతికుండే క్షణాలను కల్పించుకోడం కోసం మనస్సు పడే వెంపర్లాటేమో ఇదంతా!

జీవితం మామూలుగానే గడిచినా, ఆనందం లేకపోయినా, విషాదంగా ఉన్నా బానే ఉంటుంది. కానీ తప్పు చేసినట్లు దాన్ని మోస్తూ తిరగడమే కష్టం. తప్పు ఒప్పు అంటూ ఏమీ ఉండవని, తప్పు జరగడం వెనుక తెలియని, అర్థం కాని అన్యాయాలు ఉంటాయని అర్థం కావడానికి చాలా రోజులు పట్టింది. ఏదో చెప్పడానికో ఏదైనా అడగడానికో కాదు, ఉత్తగా కారణాలు ఏమీ లేకుండా ఒక్కసారి నిన్ను చూసి దగ్గరగా హత్తుకొని గుండెని తేలిక చేసుకొని వెళ్ళాలనుకుంటున్నా.

ఇంటికి ఎవరెవరో వచ్చారు. అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నారు. బయటికేగాని లోపల ఎవరికీ డాలీని పట్టించుకోవాలని ఉన్నట్లు లేదు. నాకు సంతోషమేసింది, డాలీని నిజంగా ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ డాలీ కూడా ఎవరినీ పట్టించుకోవట్లేదు. ఆడుకొంటున్న పిల్లల దగ్గర ఉంది. ఎవరితో కలవకుండా అందరినీ పరిశీలనగా చూస్తున్నట్లు అనిపించింది. నిజంగానే డాలీ ప్రత్యేకమా?

“చూసినావురా శేషు, కప్ప దొరకాలని పాములు కోరుకుంటాయి. తప్పించుకోవాలని కప్పలు కోరుకుంటాయి. తప్పించుకోవడం, దొరికించుకోవడం అనేది వాటికున్న ఒడుపు వల్ల వస్తది. పాము ఒడుపుతో ఇంకో కప్పని దొరికించుకోవచ్చు. కప్ప చురుగ్గా లేనిరోజు ఇంకో పాము నోట్లో పడొచ్చు. సంతోషించు, నీ చిత్తం ఏంటో తెల్సి చేసిందో తెలీక చేసిందో కరుణమ్మ, తెలిసుంటే ఈ డబ్బులు కూడా దక్కేవి కావు.”

మరియమ్మ ఒడిలో వాడు ఆడుకుంటున్న క్షణాలు అస్సలు నచ్చనివి. మరియమ్మ వాడినే కలవరిస్తా పోయింది. నన్ను కదా ఆమె మొదట పెంచింది. ఏదడిగినా ఇచ్చాను ఆయమ్మైనా కూడా. అయినా వాడినే ఇష్టపడింది, వాడు అమ్మా అనేవాడనా? చివరికి లక్ష్మి కూడా వాడిని నవ్వుతున్న కళ్ళతో చూసేది. ఆ చూపుల్లో ఇష్టం. అది నా జీవితంలోకి కదా వచ్చింది? నావైపు భయంతోనో భక్తితోనో చూసేదే తప్ప ఏవి ఆ ఇష్టపడే కళ్ళు?

ఈ కవర్ నా ముందు లేకపోతే అతను నా జీవితంలో ఉన్నాడని గుర్తులేనట్లు గడిపేదాన్ని. అది బావుండేది. ఆ కవర్ గుడారంలోకి తలదూర్చిన ఒంటెలా టేబుల్ మీద వెక్కిరిస్తుంది. వచ్చి వారమైంది. చిరాగ్గా ఉంది. ఏడేళ్ళ తరువాత రామలక్ష్మి రాసిన ఉత్తరం. ‘మధూ, నా పరిస్థితేమి బాగాలేదు. నీతో మాట్లాడాలి. ఇప్పుడు స్థిరంగా నమ్మగలిగే వ్యక్తులు ఎవరూ లేరిక్కడ. ఒక్కసారి రా.’

మనుషులు మాటలకి, చిన్నపాటి ఈగో తృప్తికే వారిని వారు గొప్పవాళ్ళుగా బలవంతులుగా ఎలా అనుకుంటారో, వీళ్ళింత బలహీనులేంటి అనిపిస్తది నాకు. ఇవన్నీ అనుకొని చేసిందా లేకా అనుకోకుండా చేసిందా అన్నదాన్లో నాకెలాంటి అనుమానం లేదు. ఇన్నీ జరిగాకా సంతోష్ నస్రీన్ కోసం పనిచేయడానికి రత్నాన్ని పక్కన పెట్టడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టలేదు.

ఎక్కిన వాళ్ళందరూ ఆ రైలు వాళ్ళదే అనుకుంటారు. వాళ్ళకే కాదు వాళ్ళ సామాన్లు పెట్టుకోడానికి స్థలం కోసం కొట్లాడతారు. కొంచెం స్థిరపడ్డాక కొత్తవాళ్ళు ఎక్కితే, మేము ముందే ఎక్కాం, రైలు మాది అని ఏదో అధికారం చూపే చూపులతో కాల్చేస్తారు. దిగేటప్పుడు ఒక్క నిమిషంలో అప్పటిదాకా వాళ్ళతో ప్రయాణించిన వాళ్ళందరిని ఒక్క క్షణంలో వదిలేసి గమ్యం వచ్చిందని ఆనందంగా వెళ్ళిపోతారు.

“అమ్మమ్మా! నీకు తాతయ్య అంటే కోపమా?”

“అదేం లేదురా. మీ తాతయ్యకి నా స్వభావాన్ని అర్థం చేసుకొనే అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు. ఆయన స్వభావంలో ఇమిడిపోతూ వచ్చా అనేక భయాల కారణంగా.”

“అంత భయం ఉన్నదానివి రేపు అంత పెద్ద అబద్ధం ఆడటం ఏంటి అమ్మమ్మా! అదీ నువ్వు పూజించే దేవుడి ఎదురుగా. దేవుణ్ణి మోసం చేయడం కదా అది!”

నేను దారి తప్పి అలసిపోయి ఉన్నా. ఆ చలికి నేను వేసుకున్న బట్టలు సరిపోవట్లేదు. అతని దుస్తులు పల్చగానే అనిపించాయి. నా దగ్గరకు వచ్చాడు. అతనొక పిచ్చివాడిలా అనిపించాడు. ఏమీ మాట్లాడలేదు. నన్ను పట్టించుకోలేదు. ముందుకు వెళ్ళిపోయాడు. అతని పాదాలు కొద్దిగా పెద్దగా ఉన్నాయి, అంత దృఢమైన మనిషిలా అనిపించలేదు. చాలా వేగంగా నడుస్తున్నాడు. అతని కళ్ళలో పచ్చిక్రూరత్వం.

పెళ్ళానికైనా ఇవన్నీ చేశానా? ఆమెకైనా ఎందుకు చేయాలి? ఎప్పుడైనా పెళ్ళాంగా ఉందా? పూర్తి స్వాతంత్య్రం ఇచ్చా కదా! దేనిలో ఇచ్చా? అంతకంటే చేసేదేంటి, ఏం కావాలో అవి చేశా. ఆమెనేమన్నా అబ్యూజ్ చేశానా? ‘తిట్టడం కొట్టడం ఒక్కటే అబ్యూజా, ఇంట్లో ఇంకో మనిషి ఉందన్న ధ్యాస లేకుండా, తనతో బతికే మనిషిని పట్టించుకోని నిర్లక్ష్యం కంటే పెద్ద అబ్యూజ్ ఏముంటుంది?’ అనేది ఆమె.

హాల్లోకి వచ్చా. కొందరు నిద్రపోతున్నారు. కొందరు నిద్ర నటిస్తూ మెలుకువ దాచుకుంటున్నారు. వాళ్ళకి నా ఉనికి చిరాగ్గా ఉన్నట్లుంది. జత బట్టలు, టవల్ తీసుకున్నా. బ్రష్, పేస్ట్, దువ్వెన గుర్తొచ్చాయి. అవీ తీసుకున్నా. ఇంకా ఏవో గుర్తొచ్చాయి. అన్నీ వదిలేసి పోవడానికి అన్నీ తీసుకెళ్ళాలనుకోవడం, ఏది లేకపోయినా ఇబ్బందనో, చిన్న వస్తువే కదా అనో ప్రతిదీ సంచిలో పెట్టుకోవడం. చివరికి ఏది అవసరమో ఆలోచించి కొన్ని తీసుకొని బయటపడ్డా.

ఏమవుతుంది నాకు? గిల్టీగా ఎందుకుంది, నా లోపల భయమెందుకు? మణి ఇదివరకటిలా లేదు. ప్రశ్నలు వేసినా నన్నేమి అనలేదు, నా వైపు చూసే అభావపు చూపు తట్టుకోలేకుండా ఉన్నా. ఉక్రోషంగా చెప్పాలనిపించింది భరణి నన్ను వెతుక్కుంటా వచ్చాడు నిన్ను చూసుకోమని అని. కాని చెప్పలేకపోయా. మనుషులు మన అవసరాలను చూసి, వాళ్ళ పనులు చేయించుకుంటారు. ప్రేమ స్నేహం ముసుగులో భరణి చేసిందేంటి?

యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి? అనుకొని ఏదీ జరగదు. ఊహించనివి ఊహించకుండా జరుగుతాయి. అయినా ఇది అనుకోకుండా జరిగిందా? అనుకొనే జరిగింది కదా! కావాలని చేసిన యాక్సిడెంట్‌కి ఎంత మూల్యం చెల్లించాలి? మూల్యం చెల్లించడం కోసమే యాక్సిడెంట్ చేస్తారా! విరిగిన చేయి, వెన్ను పక్కగా దిగబడిన రాయి, నీ ప్రమేయం లేకుండా నిన్ను తడిమే చేతుల స్పర్శ కూడా.