మూడు పిల్లులు

రాత్రంతా పెద్దవాన. బలమైన ఈదురు గాలులు.

ఉదయాన్నే వెనుక తలుపు తీసి చూశా. ఎవరో విరిచేసినట్లు పేర్ చెట్టు కొమ్మలన్నీ విరిగిపడి ఉన్నాయి. పెరడంతా కాయలు.

ఇప్పుడు వెనుక ఉన్న శాండ్రా ఇల్లు స్పష్టంగా కనిపిస్తుంది.


మొదటిసారి శాండ్రాను చూసింది పేర్ పండ్లు కావాలని అడగటానికి వచ్చినప్పుడు. కొందరిని చూడగానే వారెన్నో అనుభవాలతో నిండిన ముఖంతో కనిపిస్తారు. అది వయసు వల్ల అనే దానికంటే ఎన్నో జీవితాలను దగ్గరగా చూసినందుకేమో అనిపిస్తుంది నాకు.

“నా పేరు లీలావతి” అని చెప్పగానే, “ఈ పేర్లు నాకు నోరు తిరగవమ్మాయ్. నిన్ను మిస్ లీ అని పిలుస్తాను. రెండు పేర్స్ తీసుకోవచ్చా?” అంది నవ్వుతూ చొరవగా లోపలికి వస్తూ.

“రెండేంటి ఎక్కువే తీసుకువెళ్ళండి” అన్నా నేనూ సరదాగానే.

ఆ పేర్ చెట్టు చుట్టూ అరుగు ఉంటుంది. చాలా పరిచయమైన చోటులా ఆమె వచ్చి దానిపై కూర్చుంది. అక్కడ కూర్చున్నాక ఆమె ముఖంలో చిన్నపాటి ఆనందం కనిపించింది. నేనూ వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నా.

“నేను వెనుక ఇంట్లో ఉంటాను. ఈ ఇంటి యజమాని జాన్సన్ నా స్నేహితుడు. నలభై ఏడేళ్ళ క్రితం జాన్సన్, నేను కలిసి నాటాము దీన్ని. ఇక్కడ కూర్చొని దూరంగా కనిపించే సముద్రాన్ని చూస్తూ తియ్యటి పేర్ తినడం మాకు చాలా ఇష్టం” ఆమె ఉత్సాహంగా చిన్న పిల్లలా చెప్పింది.

“టీ తాగుతారా?” అని అడిగా.

ఆమె లేచి పక్కన ఉన్న లెమన్ గ్రాస్ కోసుకొచ్చి దీనితో పెట్టు అని పురమాయించింది. వాటి తియ్యటి నారింజ వాసన చుట్టూ పరుచుకుంది.

అలా మొదలైంది శాండ్రాతో పరిచయం.

అప్పుడప్పుడు వచ్చి ఆ గట్టు మీద కూర్చొని టీ తాగుతూ కబుర్లు చెప్పేది. ఆమె జాన్సన్‌తో కలిసి చేసిన పనులు, వాళ్ళు పడిన గొడవలు. వాళ్ళ స్నేహం. ఆ ఇల్లు. ఆ పేర్ చెట్టు. ఆమె ఇంట్లో ఉన్న పియానో. వాటి పైన వాళ్ళిద్దరూ పాడిన పాటలు. వాళ్ళు కలిసి పెంచిన పక్షులు, వాటిని ఆకాశంలో వదిలేసినా అవి తిరిగి వెనక్కి రావడం. ఇలా సాగేవి ఆమె మాటలు. వాటిలో జాన్సన్ ప్రస్తావన లేని సందర్భాలు దాదాపు ఉండేవి కావు.


ఓ రోజు అడిగింది. “లీ, నీకు సంగీతం తెలుసా?”

“తెలీదు” అని చెప్పా.

“నేను నేర్పుతాను నేర్చుకుంటావా?”

వద్దనడానికి పెద్దగా కారణాలు కనిపించలేదు. అలా మొదటిసారి ఆమె ఇంటిలోకి వెళ్ళడానికి సంగీతం అవకాశాన్ని ఇచ్చింది.

ఆవరణలో పెద్ద మామిడిచెట్టు, దానిపక్కనే మొదలకంటూ అడ్డంగా కొట్టేసి, ప్రస్తుతం మొద్దులా మిగిలిన మరో చెట్టు ఆనవాలు. ముందుకు నడిచాను. రెండు పిల్లులు గభాల్న నా ముందునుండి పరిగెత్తాయి. హాల్ మధ్యలో నాలుగు కేన్ చైర్స్, ఒక చిన్న కాఫీ టేబుల్. పక్కగా కొద్దిపాటి ఎత్తులో పియానో. దానికి కొంచెం దూరంలో కిటికీ. దానికి అటు ఇటు పుస్తకాల షెల్ఫులు. ఆ కిటికీ కింద కూర్చోడానికి వీలుగా అర్ధచంద్రాకారంలో పొడవాటి సోఫా. అక్కడున్న ఆ వస్తువులన్నీ ఎప్పటినుండో ఆమెతో కలిసి పెరిగినట్లు, ఆమె అనుభవాలని మోస్తున్నట్లుగా ఉన్నాయి.

వాటితోటి జీవించే మనుషులను బట్టి వస్తువులు కూడా కళాత్మకంగా మారతాయేమో!

ఆమె నన్ను కూర్చోపెట్టి లోపలి వెళ్ళి ఒక ట్రేలో చిన్న టీపాట్, రెండు కప్‌లు, కొన్ని కుకీస్‌తో వచ్చింది. వాటిని చూస్తుంటే చిన్నప్పుడు నేను ఆడుకునే ఇంగ్లిష్ టీపార్టీ ఆట గుర్తొచ్చింది. నిజంగా ఆ ఆట నిజమై వచ్చినట్లుగా అనిపించింది. ఉత్సాహంగా టీ తీసుకున్నా. కుకీస్ ఊహించినంత రుచిగా లేవు కానీ టీ వాసన వల్ల బానే అనిపించాయి.

“ఇక్కడ కొన్ని రోజులు ఉంటావుగా!”

“నా ప్రాజెక్టు ఇంకా, రెండు సంవత్సరాల పైనే ఉంటుంది, ఇప్పుడప్పుడే ఎక్కడికీ వెళ్ళను” అన్నా నవ్వుతూ.

అందరూ అడిగినట్లు నీకు పెళ్ళయిందా, ఒక్కదానివే ఉంటున్నావా లాంటి ప్రశ్నలు శాండ్రా నుంచి ఎదురుకాలేదు.

కొన్ని మాటల తరువాత పియానో నేర్పడం మొదలుపెట్టింది. కీబోర్డు మీద వేళ్ళు ఎలా కదలాలో చెబుతూ, తను చేసి చూపించింది. ప్రతి వేలూ ఉపయోగించాలని, పదివేళ్ళతో అనుకూలంగా ఎలా వాయించాలో కాసేపు ప్రాక్టీస్ చేయించింది. ఆమె నేర్పే పద్దతిలో ఏదో కొత్తదనం ఉందనిపించింది. క్రమంగా మా ఇద్దరి మధ్య సంగీతం ఒక భాగమైంది. ఆ రెండు పిల్లులు కూడా నాకు దగ్గరగా ఉండటం మొదలుపెట్టాయి.

ఒకటి నల్లపిల్లి, మరొకటి మచ్చల పిల్లి.

వాటిని చూస్తుంటే శాండ్రాతో పాటు అవి కూడా నన్ను ప్రేమిస్తున్నాయేమోననిపించేది.

నల్లపిల్లి ఎప్పుడూ శాండ్రా కాళ్ళ చుట్టూ తిరుగుతుండేది. మచ్చల పిల్లి హాల్ దాటి లోపలికి వచ్చేది కాదు. దూరం నుండే చూస్తూండేది. వాటి ప్రవర్తన విచిత్రంగా అనిపించేది. ఈ నల్లపిల్లి నేను లేకపోతే ఇంకెవరి కాళ్ళో వెతుక్కుని బతికేస్తుంది. ఆ మచ్చల పిల్లి నేను లేకపోతే బతకలేదు అనేది. అలా ఎందుకు అనేదో అర్థమయ్యేది కాదు కాని, ఆమె మాటల్లో మచ్చల పిల్లి మీద ఉండే ప్రత్యేకమైన అభిమానం కనిపించేది.

ఆ ఇంటి చుట్టుపక్కలవాళ్ళు ఆమెతో ఎవరూ మాట్లాడినట్లు కనిపించరు. శాండ్రా కూడా అవన్నీ పెద్దగా పట్టించుకున్నట్లు కనబడేదికాదు. ఆమె ఇంట్లో ఏ ఫోటోలు ఉండేవికావు. పిల్లల గురించి ఏ రోజు ఏమీ మాట్లాడేదికాదు. ఎప్పుడన్నా మిల్లర్ అనే ఓ మనవడు ఉన్నాడని, అతనొక తాగుబోతని, జీవితం విలువ తెలీదని, మనుషులని పట్టించుకోడని, దేశదిమ్మరిలా తిరుగుతూ ఉంటాడని చూచాయగా అనేది. ఆమెకి సంబంధించి మిల్లర్ తప్ప ఎవరూ లేరని అర్థమైంది.


ఆదివారాన్ని మాత్రం పూర్తిగా చర్చికి కేటాయించేది. చర్చికి వెళ్ళడానికి తయారు అవ్వడంలో హడావిడిగా కనిపించేది. అందమైన హ్యాట్, దానికి మ్యాచ్ అయ్యే కోట్, షూస్. చిన్న చిన్న రంగుల పూసలు అంటించిన బ్యాగ్‌లో బైబిల్. ఆ రంగుల విభిన్నత్వంలో ఏదో అందం ఉండేది.

కొన్నిసార్లు నన్ను కూడా చర్చికి రమ్మని పిలిచేది. చర్చిలో కోరస్ గ్రూప్‌ని ఆమె నడిపేది. చాలామంది శాండ్రాను పియానో నేర్పమని అడిగేవారు. చిన్నగా నవ్వుతూ మౌనంగా ఉండేది తప్పించి ఏమీ మాట్లాడేదికాదు. ఆమె ఎవరికీ పియానో నేర్పదని అనుకోవడం విన్నా. అలా విన్నప్పుడు ఆమెకి నాతో ఉన్న స్నేహం ప్రత్యేకమైనది అనిపించేది. అప్పుడప్పుడు తను వండినవి తీసుకొచ్చి ఇచ్చేది, ముఖ్యంగా స్వీట్ పొటాటో పై. చాలా రుచిగా ఉండేది.

నెమ్మదిగా ఇంటి వెనుకగా ఉన్న కాలిబాట బాగు చేశా, శాండ్రా ఇంటికి వెళ్ళడానికి. అది చూసి చిన్నపిల్లలా సంతోషపడింది.

ఎప్పుడన్నా రాత్రుళ్ళు వైన్ తాగడానికి ఆహ్వానించేది. అప్పుడు సంగీతమే ఎక్కువ మాట్లాడేది. ఆ సమయంలో ఆమె సంగీతం ప్రత్యేకంగా ఉండేది. కొద్దిగా విషాదం, కొద్దిగా ఏకాంతం కలిసి ప్రయాణం చేసినట్లుగా ఉండేది. కొన్ని గంటలపాటు కలిసి ఉండే ఆ సమయంలో ఆమె నుంచి ఓ మూడు వాక్యాలు మాత్రం తరచుగా వినేదాన్ని.

“లీ, నాకొక కోరిక ఉంది. ఎప్పుడో ఒకసారి అడుగుతాను తీరుస్తావా? కష్టమైనా నువ్వది తీర్చాలి.”

ఆమె ఏమి కోరుతుందో అని ఆలోచించేదాన్ని. దాన్ని తీర్చకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతానేమో అనిపించేది. నేను చేయగలిగితే తప్పకుండా తీరుస్తాను అని చెప్పేదాన్ని.

ఆ కోరిక ఏమిటి అనేది మాత్రం ఆమె నాకెప్పుడూ చెప్పలేదు.


ఒకసారి బాత్రూమ్‌లో జారిపడి శాండ్రా తుంటి ఎముక విరిగింది. హాస్పిటల్లో చేర్పించాను. రోజూ వెళ్ళి వచ్చేదాన్ని. వెళ్ళినప్పుడల్లా చిన్నపిల్లలా సంతోషపడేది. సంగీతం గురించి, పిల్లుల గురించి మాట్లాడేది. ఆమె పరిస్థితికి ఆమెలో భయం కాని, బాధ కాని నేను చూడలేదు. ఆమెలో నాకు ఎప్పుడూ ఓ చిన్నపిల్ల కనిపించడం ఆశ్చర్యంగా అనిపించేది.

నేనెప్పుడూ ఆమె గురించి కాని, ఆమె ఇంటి విషయాలు కాని అడిగిందిలేదు. బహుశా అదే ఆమెకు నన్ను దగ్గర చేసిందేమో అనిపించేది.

ఆ రోజు ఎందుకో ఆమె నవ్వు చాలా బలహీనంగా కనిపించింది.

“లీ, సముద్రం దగ్గరికి వెళ్ళాలని ఉంది తీసుకెళ్తావా?” అని అడిగింది.

ఆరోజు శాండ్రాని తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్ళాను. చాలాసేపు నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. పెదాలపై చిన్న నవ్వు. సముద్రం పరిగెత్తుకు వచ్చి ఆమె పాదాలను తాకుతున్నట్లు ఉంది. ఆ గాలి నాకేదో చెపుతున్నట్లు దుఃఖంగా అనిపించింది. శాండ్రాని పలకరించే ధైర్యం చేయలేదు. అలా ఎంతసేపు కూర్చున్నామో తెలీదు.

ఆ మరుసటి రోజు శాండ్రా చనిపోయింది.


ఆమె ఫ్యునరల్‌‌కి మనవడు మిల్లర్ వచ్చాడు. ఎలా తెలిసిందో, ఎవరో చెప్పారో అర్థంకాలేదు. రెండు నెలలు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఎందుకు రాలేదో అనిపించింది.

రెండు రోజుల తరువాత లాయర్ వచ్చి కలిశాడు. ఆమె విల్లు తెచ్చి ఇచ్చాడు. ఆమె మనవడు మిల్లర్ ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఉండొచ్చని, ఉండకుండా వెళ్ళిపోతే ఆ ఇల్లు నాకు చెందుతుందని రాసింది. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వీటి విషయం ఆమె ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. దీని వల్ల మిల్లర్ నుంచి ఏమన్నా సమస్య ఎదురవుతుందేమో అనుకున్నా. కానీ అతడు నన్ను హత్తుకొని, తన గ్రాండ్‌మాతో ఇంతకాలం కలిసి ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పాడు. ఆమె చివరిరోజుల్లో ఎంతో ప్రశాంతమైన జీవితం సంతోషంగా గడిపిందని దానికి కారణం నేనేనని, నేను ఆనందంగా ఉండాలని కోరుకున్నాడు. తను అక్కడ ఉండనని, ఆ రోజే ఆ ఇంటికి సంబంధించిన అన్ని పేపర్స్‌లో సంతకాలు పెట్టి వెళ్ళాడు. ఆ ఇంటి నుంచి కనీసం చిన్న వస్తువుని కూడా అతను తీసుకెళ్ళినట్లు నాకనిపించలేదు. ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు.

అతని ప్రవర్తన వింతగా అనిపించింది. శాండ్రా చెప్పిన దానికి భిన్నంగా కనిపించాడు.

నల్ల పిల్లి నా కాళ్ళ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. మచ్చల పిల్లి ఎక్కడా కనిపించలేదు


అప్పటివరకు ఎంతో మాములుగా శాండ్రా, నేనూ మాత్రమే ఉన్న జీవితం కొత్తమలుపు తిరిగింది.

నెమ్మదిగా చుట్టుపక్కలవాళ్ళు ఒక్కొక్కరే వచ్చి పలకరించడం మొదలుపెట్టారు. శాండ్రా ఉన్నన్ని రోజులు దగ్గరికి కూడా రానివాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి బేక్ చేసి ఇచ్చేవాళ్ళు. ఓదార్పుగా మాట్లాడేవాళ్ళు. ఏమి కావాలన్నా అడగొచ్చని శాండ్రా వల్ల నాకు దూరంగా ఉండిపోయామని చెప్పేవాళ్ళు.

శాండ్రా గురించి కొత్త కొత్త విషయాలు వినిపిస్తూ ఉండేవి. శాండ్రాకి పెళ్ళికాలేదని, జాన్సన్‌ని ప్రేమించిందని చెప్పేవారు. జాన్సన్ మిలిటరీలోకి వెళ్ళి ఎవరినో పెళ్ళి చేసుకొని రావడంతో శాండ్రా ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోయిందని, అతని భార్య చనిపోయిందని తెలిసి అక్కడికి తిరిగి వచ్చిందని, శాండ్రా బతకడం చేతకాని తెలివితక్కువ మనిషని చెప్పేవారు. ఎంత ఆస్తి ఉన్నా అవే పాత సామాన్లు పెట్టుకొని వేలాడేదనేవారు. శాండ్రా లాంటి పొగరు మనిషిని ఎక్కడా చూడలేదని అనేవాళ్ళు.

అప్పుడప్పుడు ఎంతైనా నువ్వు ఈ కాలపు అమ్మాయివని, తెలివికలదానివని ప్రేమగా పొగిడేవాళ్ళు. వాళ్ళతో సరదాగా లేక్‌లో బోటింగ్‌కి వెళ్ళడం షాపింగ్‌కి వెళ్ళడం చేసేదాన్ని. ఈ ప్రాంతంలో ఎవరు ధనవంతులో, ఎవరికి ఎంత డబ్బులు ఉన్నాయో మాటల్లో చెపుతుండేవాళ్ళు. వాళ్ళు వేసుకొనే ఖరీదైన ఫ్రాక్‌లు, బ్రాండెడ్ దుస్తులు ఇవన్నీ వారికీ సాధారణం అన్నట్లుగా ఉండేవాళ్ళు. పొద్దున్నే జాగింగ్ పేరుతో వచ్చి పిలిచేవారు. అక్కడ ఇళ్ళ ఖరీదు ఎంతో, ఇప్పుడు నేను ఎంత ధనవంతురాలినో చెప్పేవాళ్ళు మాటల మధ్యలో. ఆ రెండు మూడు నెలల్లోనే అకస్మాత్తుగా నా ప్రాధాన్యం పెరిగినట్లుగా, అందరిలోకి అందమైదానిలా, తెలివైనదానిలా అనిపించేది. కాలం తొందరగా పరిగెడుతున్నట్లు అనిపించింది. అప్పుడప్పుడు సముద్రం ముందు నేను శాండ్రా కూర్చున్న ఆఖరి రోజు గుర్తొచ్చేది. శాండ్రా ఇంటికి కావాల్సిన కోర్టు కాగితాల పని అంతా జరిగి శాండ్రా ఇల్లు పూర్తిగా నా అధీనంలోకి వచ్చిందాకా నేను జాన్సన్ ఇంట్లోనే ఉండేదాన్ని. ఒకరోజు శాండ్రా ఇంటికి వెళ్ళాను. ఇల్లంతా దుమ్ము పట్టి ఉంది. పియానో పైన సన్నటి దుమ్ము. ఇల్లంతా పాతవాసన. లోపల చిన్న ఆలోచన మొదలైంది. ఫ్లోరిడాలో వెస్ట్ పామ్ బీచ్‌లో సముద్రపు వైపు ఇల్లు. దాదాపు అర ఎకరం పైన ఉంటుంది. ఎక్కడో చిన్న ఆశగా మొదలైన కోరిక నిలువనివ్వడంలేదు. కోరిక పెద్దదై కలలు రావడం మొదలయ్యింది.

సర్వేయర్‌ని పిలిపించా. ఆ ఇంటికి ఎంత ఖరీదు కట్టవచ్చో, ఎన్ని డబ్బులు వస్తాయో లెక్కలు వేశా. రియల్టర్‌కి కబురు చేశా. ఆ ఇంటిని చూసి రియల్టర్ సంతోషించాడు. ఆ పాత పియానో అతన్ని ఎంతో ఆకట్టుకుంది. పియానో కూడా అమ్ముతారా అన్నాడు. నేను కొంచం ఆలోచించా. ఈ లోపే రియల్టర్ పియానోతో అక్కడ ఉన్న పాతకాలం నాటి చెక్క సామానుతో ఇంటి విలువ ఇంకా పెరుగుతుందని మొత్తం ఎంత వస్తుందో చెప్పేసరికి పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదనిపించింది. మనుషులే లేనప్పుడు వస్తువులతో ఏముంటుంది అన్నా రియల్టర్‌తో. మంచి పని చేస్తున్నారు అన్నాడు మెచ్చుకున్నట్లు చూస్తూ. ఇంటిని అమ్మకానికి పెట్టా.

అది జరిగిన వారంలోగానే వచ్చాడు మిల్లర్. ఆ రోజు అతడు కోపంగా గ్రాండ్‌మా నమ్మకానికి ద్రోహం చేశానని నిందించాడు. నేనిక్కడికి వచ్చి ఉండబోతున్నానని చెప్పి వెళ్ళాడు.

ఆ రాత్రి ఈదురుగాలులతో ఉరుములు మెరుపులతో జాన్సన్ ఇల్లు ఊగిపోయింది. ఏ అర్ధరాత్రికో శాంతించింది తుఫాను. కాసేపు కలతనిద్ర. ఏవేవో కలలు.

శాండ్రా నా ముందు కూర్చొని నవ్వుతోంది. నేను శాండ్రా పియానో సముద్రం ముందు. శాండ్రా చేతికఱ్ఱతో పియానోను పగలకొడుతోంది. ఒక్కొక్క ముక్కను సముద్రంలోకి విసిరేస్తోంది. అలల తాకిడికి ఆ ముక్కలు ఎగిరి వచ్చి నా ముఖాన్ని కొడుతున్నాయి. ముఖం నిండా గీతలు. క్రమంగా ముఖం పగిలిపోతోంది. మచ్చల పిల్లి ఎగురుతూ వచ్చి నవ్వుతూ నా తలను తన్నుకుంటూ ఎగిరెళ్ళిపోయింది.


ప్రాజెక్టు పూర్తయ్యింది, రేపు బయలుదేరాలి. వెనక తలుపు తెరిచి చూశాను. కూలిపోయిన పేర్ చెట్టు చిగురులేస్తుంది. శాండ్రా ఇంటి ముందు మిల్లర్ కనిపిస్తున్నాడు, అతని పక్కనే ఆ రెండు పిల్లులు. మచ్చలపిల్లి తిరిగి వచ్చినట్లుంది.

ఇక శాండ్రా కోరిక ఇంకా చేతిలో ఉన్న ఇంటి పేపర్లు.


శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...