అ దృశ్యం

“చలిగా ఉంది బేని.”

“టీ తాగుతావా యోగీ?”

“టీ నీళ్ళతో వళ్ళు వెచ్చబడదు. ఇంకేదో కావాలి బేని. అన్ని వదిలేసి వచ్చావా? అయినా అట్లెట్లా వెళ్ళనిచ్చారు నిన్ను?”

“రమ్ము కావాలని అడుగుతున్నావా? యోగులు తాగుతారా?”

“వాళ్ళు మునిగుండేది ఇలాంటి మత్తులోనే కదా పిచ్చితల్లీ. ఈ చలికి ఎముకల్లో తీపులు. కొంచం దగ్గరగా కూర్చో, ఎట్లా బయటపడ్డావో చెప్పు అక్కడినుంచి.”

“అదేమీ పెద్ద కష్టం కాలేదులే యోగీ. నిజానికి ఆ తతంగం నాకు అంత ఇష్టం లేకుండా కూడా లేదు, అంత అందంగా తయారవ్వడం అదే మొదటిసారి జీవితంలో. నా అలంకరణ నాకు నచ్చింది. పెళ్ళి ఒక తంతుగానే ఉంది. అదంతా చూస్తా వుంటే, ఇద్దరు మనుషులు శారీరకంగా కలవడానికి మానసికంగా సిద్ధంచేసే పన్నాగంలా అనిపించింది. అదోరకమైన వ్యూహాత్మక దుర్మార్గం.”

“అందుకే పెళ్ళి ఇష్టం లేదా బేని?”

“పెళ్ళిపై ఏ అభిప్రాయం లేదు. దానికి నేను సరిపోయే వ్యక్తిని కాదనిపించింది.”

“మరి అలాంటప్పుడు పెళ్ళిదాకా ఎందుకు ఆగావు?”

“ఆ అలంకరణ, అందరూ సంతోషంగా పండగలా ఉండటం నచ్చింది. అతన్ని అలా చూడటం కూడా.”

“అతన్ని ఇష్టపడ్డావా?”

“అది సరే కానీ, నీ నేపథ్యం ఏంటి?”

“ఎందుకు బేని?”

“నిన్ను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను.”

“నా నేపథ్యం తెలిస్తే నన్ను అర్థం చేసుకోగలవా? మనిషి లోపలి పొరల్లో ఏమి జరుగుతుందో నీకెలా తెలుస్తుంది?”


ఏమో వేక్ ఫీల్డ్ కౌంటీలో డ్రైవింగ్ నేర్పిన జాస్పర్ ఇలాంటి ప్రశ్న వేశాడు.

“నా బ్యాక్‍గ్రౌండ్ కనుక్కోకముందే నన్నో నల్లవాడిగా చూశావు కదా!” అన్నాడు నిండుగా నవ్వుతూ.

“లేదు జాస్పర్, నేర్పుగా స్టీరింగ్ తిప్పుతున్న నీ చేతుల్ని, ట్రిప్‌కి పది డాలర్లు మాత్రమే తీసుకొనే నీ ఉదారతను చూశాను. ట్రస్ట్ మి.”

“యా. అయ్ ట్రస్ట్ యూ.”

నన్ను ఎందుకు నమ్ముతావు అని జాస్పర్‌ని అడగలేదు. ఎందుకు అడగలేదు? బహుశా నేను నమ్మదగిన మనిషిని అని జాస్పర్‌తో పాటు నేనూ బలంగా నమ్ముతున్నానేమో! నిజంగా నేను అంత నమ్మదగిన మనిషినేనా? నన్ను నమ్మదగని వ్యక్తిగా ఎదుటివారు చూస్తే ఫర్వాలేదా? అందుకే నన్ను నమ్మడంతో పనిలేకుండా నన్ను నమ్మే మనుషులతో ఉండటానికి ఇష్టపడతానేమో!

అలా జాస్పర్ అడగగలడా? ఎలా అడుగుతాడు? నేను అతని కంటే ఒక స్థాయిలో…

ఈ యోగిని నమ్మొచ్చా? ఇప్పుడు ఎదురుగా ఉన్న యోగిని కాదు. ఇతని పేరు రాజు కదా! రాజు యోగి అయ్యాడనే ఆలోచనకు భలేగా నవ్వొచ్చింది. నేను నేపథ్యం అడిగింది అర్థం చేసుకోవడానికి కాదేమో! ఇతన్ని నమ్మడానికి కావొచ్చు.


“నువ్వు హిమాలయాల్లోకి వెళ్ళావా యోగి?”

“వెళ్ళాను, కానీ ఏమీ చేయలేదు, అక్కడ ఉండలేక వెనక్కి వచ్చాను.”

“మరి అక్కడ యోగులు ఉంటారట కదా! నిజమేనా?”

“ఉంటారట బేని.”

“నీకెవరైనా తారసపడ్డారా?”

“యోగో కాదా చెప్పలేను కానీ ఒక మనిషి మాత్రం తారసపడ్డాడు.”

నాలో ఉత్సాహం వచ్చింది. “అతని గురించి చెప్పు వినాలని ఉంది” అన్నాను.

“నేను దారి తప్పి అలసిపోయి ఉన్నా. ఆ చలికి నేను వేసుకున్న బట్టలు సరిపోవట్లేదు. అతని దుస్తులు పల్చగానే అనిపించాయి. నా దగ్గరకు వచ్చాడు. అతనొక పిచ్చివాడిలా అనిపించాడు. ఏమీ మాట్లాడలేదు. నన్ను పట్టించుకోలేదు. ముందుకు వెళ్ళిపోయాడు. అతని పాదాలు కొద్దిగా పెద్దగా ఉన్నాయి, అంత దృఢమైన మనిషిలా అనిపించలేదు. చాలా వేగంగా నడుస్తున్నాడు. అతని కళ్ళలో పచ్చిక్రూరత్వం. అది నన్ను అతన్ని వెంటాడేలా చేసింది. అతనివెంట రావద్దనేమో నా పైన రాళ్ళు విసిరాడు. అయినా కొంచం దూరం అనుసరించా, నేను మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు మీదకి వచ్చాడు. గట్టిగా అరిచాడు. ఆ అరుపు చాలా విచిత్రంగా ఉంది. అది మనిషి అరిచే అరుపులా అనిపించలేదు. అతనికి నా మాటలు, నా ఉనికి భరించలేనివిగా ఉన్నట్లనిపించింది. నాపైన దాడి చేస్తాడేమోనని ఇక అతన్ని అనుసరించలేదు.”

“ఇక్కడ ఈ ఇంట్లో మంట ముందు కూర్చొని కూడా చలి అంటున్నావ్, ఆ మంచులో ఎలా ఉండగలిగావ్?”

“అప్పుడు అలా ఏమి అనిపించలేదు బేని.”

“అతను యోగై ఉంటాడేమో.”

“యోగులు ఎలా ఉంటారో నీకు తెలుసా?”

“తెలీదు.”

“పెళ్ళికొడుకుని ఇష్టపడ్డావా?”

“లేదు, ఇష్టం లేదు. పరిచయం లేదు. కానీ అతనితో పెళ్ళయితే అతను నన్ను హత్తుకుంటాడు, ముట్టుకుంటాడు అని ఆలోచించా. నాకది అభ్యంతరంగా అనిపించలేదు. అది ఇష్టం కాకపోవచ్చు ఏదో ఆసక్తి అంతే. అతను బాగాలేడని చెప్పలేను.”

“మరి అభ్యంతరం దేనిపైన బేని?”

“నాకు దేనిపైన అభ్యంతరం లేదు, అలాంటి చిన్న ఉత్సాహాల కోసం అతనితో జీవితాంతం ఉండడం కష్టం.”

“మరి ఒక్కదానివే చెప్పకుండా వచ్చావా?”

“ముందు ఇది చెప్పు. నువ్వు యోగివి అయినట్లేనా?”

“నాకు తెలీదు బేని. ప్రయాణంలో ఉన్నా. కాని సర్వసంగపరిత్యాగిని కాదు.”

“నీ చలి తగ్గిందా?”

“కొంచం తగ్గింది. ఈ ఇంటివాళ్ళు నీకు ఇక్కడ షెల్టర్ ఎలా ఇచ్చారు?”

“అడిగాను. ఇచ్చారు. పెద్దగా ప్రశ్నలు ఏమీ అడగలేదు. నువ్వు యోగివి, నీ శిష్యురాలిని అనుకున్నారేమో! నాకు హిమాలయాలకు వెళ్ళి ఆ మనిషిని చూడాలని ఉంది.”

“ఎందుకు బేని?”

“ఆ కళ్ళలోని క్రూరత్వపు స్వచ్ఛత చూడాలి.”

“అన్నీ వదిలేయాలని అనుకుంటున్నావా బేని?”

“లేదు. ఏదీ వదిలేయాలని వదిలేయాలనుకోవట్లేదు. అన్నిటిని హత్తుకొని ఉంటాను. కానీ ఏదీ అంటుకోకుండా సమయానికి సాధారణంగా రాలిపోవడం ఎట్లా ఉంటుందో అది నా అనుభవంలోకి రావాలని ఉంది యోగీ.”

“అందుకేనా బేని ఈ ప్రయాణం?”

“కాదు. ఒక మాట అడుగుతాను చెప్పు యోగీ. నువ్వెందుకు ఇలా వచ్చేశావు. మీ తల్లిదండ్రుల మాటేమిటి?”

“వారి గురించి చెప్పేందుకు ఏమీలేదు. నేను వారినుంచి ఆశించిందేమీలేదు. వారు నానుంచి ఆశించినా ఇవ్వగలిగింది లేదు. నా వల్ల వాళ్ళకి బాధ మిగిలింది. అదీ వారి అంచనాల వల్లనే. వాళ్ళకి నేను బ్రతికుంటే చాలు అనే అంచనా మాత్రం ఉంటే బావుండేది. వాళ్ళకి అంత బాధ ఉండేది కాదు.”

“అప్పట్లో ఏ పని చేసేవాడివి యోగీ?”

“మనుషుల్ని ప్రేమించేవాడిని, కోరుకునేవాడిని. అంతకు మించి ఏమీ చేయలేదు.”

“మనుషుల్ని అంటే ఆడవాళ్ళనా?”

“బేని! ప్రేమించడంలో ఎవరనేది ఉండదు, ఏమి కోరుకుంటున్నాం అన్నదానిలో తేడా ఉంటుందేమో!”

“మరి ఆ ప్రేమలు ఏమి చేశాయి?”

“కొద్దికొద్దిగా ఖాళీ చేశాయి, ఏమీ మిగలకుండా చేశాయి.”

“అవి ప్రేమలా, వాంఛలా? అసలు ప్రేమనేది ఉందా? ఇప్పుడు వాటి గురించి బాధపడుతున్నావా?”

“బేని! ప్రేమలో కోరిక ఉండదా? కోరికతో ప్రేమ కలుగదా? ప్రేమకి ఉనికి ఏంటనేది నాకు తెలీదు. ఆ సమయంలో ఉన్న భావన ఇప్పుడు లేదు. బాధ లేదు. శూన్యం మాత్రం ఉంది. లోపల చాలా లోతైన చీకటి ఏంటో చూడాలనుకున్నా. చాలాసార్లు నిశ్శబ్దం, దేనికి సమాధానమో అర్థం కాదనిపించింది.”

“నా స్నేహితుడు జాస్పర్ ఒకమాట అనేవాడు. ప్రపంచాన్ని ప్రేమించడం తెలిస్తే, దాని సంతోషంలో దుఃఖంలో పాలు పంచుకుంటే, దాని బాధని అనుభవిస్తే నీ బాధని, చీకటిని, దుఃఖాన్ని అది తీసుకుంటుందని. నిజమేనా అంటే, ట్రస్ట్ మీ అన్నాడు.”

“నీ స్నేహితుడ్ని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నావ్?”

“అతనికి అతను యోగిగా ప్రకటించుకున్నాడు.”

“బేని నీ కాళ్ళు చల్లగా ఉన్నాయి. నీ దేహం పిల్లిచర్మంలా మెత్తగా మృదువుగా ఉంది.”

“ఒకసారి నాదగ్గరకొక పిల్లి వచ్చింది నన్ను పెంచుకోమని. అది స్వచ్ఛమైన స్వార్థంతో నిస్వార్థంగా ఉండేది. దాన్నుంచి వచ్చే వింత వాసన అర్థమయ్యేది కాదు. నా స్పర్శ కావాలని ప్రేమగా నా చుట్టూ తిరిగేది. నా వడిలో వెచ్చదనం అనుభవించడానికి దీనంగా అరిచేది. కొన్నిసార్లు జాలితో, ఒక్కోసారి దయతో దగ్గరికు తీసుకొనేదాన్ని. జాగ్రత్తగా ముడుచుకు పడుకునేది. మధ్యమధ్యలో ఒంటి కన్నుతో చూస్తూండేది. నాకు ప్రేమగా అనిపించినపుడు కష్టమైనా కదలకుండా అలానే ఉండేదాన్ని. ఎప్పుడైనా పక్కకి తీసి పెట్టేదాన్ని. అప్పుడు కోపంతో దాని కాలిగోళ్ళతో గీరేది. అరుస్తూ ఇల్లంతా తిరిగేది, ఇక్కడంతా తనకు అధికారం ఉందన్నట్లు.”

“తరువాతేమైంది బేని?”

“రానురాను ప్రేమగా ముడుచుకొని పడుకోవడంకన్నా కోపం, గీరడం ఎక్కువైంది. తన అధికార ప్రాంతంలో నేను అనవసరంగా తిరుగుతున్నట్లు పెద్దగా అరిచేది. తన అడుగులంత మెత్తగా నేను నడవట్లేదని హేళన చేసేది.”

“పిల్లిది నిస్వార్థ ప్రేమన్నావ్!”

“నిస్వార్దమే, దానిలో నన్నుకూడా చూడలేనంత. నాకో విషయం చెప్పు, నీ ప్రయాణంలో లోపల చీకటి అన్నావ్ దానిగురించి ఏమైనా తెలిసిందా?”

“బేని! అదే అర్థంకాదు. ప్రయాణిస్తున్నంతసేపు కోరిక ఉండదు. ఆ చీకటి కనపడదు.”

“అది పోయిందా?”

“పోలేదు, ఎప్పుడో అకస్మాత్తుగా లేచి కమ్మేస్తుంది. ఆ ఎదురైన మనిషి చీకటి విషయం తేలుస్తాడనిపించింది కానీ అతను నన్ను తరిమికొట్టాడు.”

“బయట చాలా మంచు కురుస్తుంది. పొద్దున వైష్ణోదేవి గుడికి బయలుదేరడం సాధ్యపడుతుందా?”

“రాత్రి ఎంత మంచుకురిసినా, పొద్దునకి తెరిపిన పడుతుంది. వెళ్ళడానికి అడ్డంరాదు. చాలా రాత్రయింది. నీ కాలివేళ్ళు వెచ్చబడ్డాయి.”

“నన్ను బేని అని ఎందుకు పిలుస్తున్నావ్?”

“బేని అంటే డోంగ్రి భాషలో సోదరి అని అర్థం.”

“అలా పిలవడంలోనే నీలో యోగిత్వం లేదని అర్థమవుతుంది. ఎక్కడినుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావో తెలుసా నీకు?

“నీ పేరేంటీ?”

“సత్య.”

“పిల్లి ఏమైంది సత్యా?”

“ఏమీ కాలేదు, అక్కడే ఉంది. ఆ ఇంటిని తనకప్పగించి బయటికి వచ్చేశాను.”

“అది నీ ఇల్లు కదా?”

“ఏదీ నాది కాదు. నావే అనుకున్న ఆ క్షణాలలో మాత్రమే అవి నావై ఉన్నాయి. అప్పుడు ఇల్లు, పెళ్ళికొడుకు, పిల్లి, ఇప్పుడు నువ్వు. నాకు నిద్రొస్తుంది పడుకుంటా యోగీ.”


మాటలు, మనుషులు, మంచులాంటి కాలం. కాలంలో కొట్టుకుపోయిన మనుషులు, అనుభవాలు, అనుభూతులు, ముడతలు పడుతున్న దేహాలు. వడలిపోయిన వాంఛలు, రోగాలు, జీవితాలు, బ్రతుకులు, మరణాలు.

ప్రేమెక్కడ? వీటి మధ్యలో అది విశ్వమంతా నిండి ఉన్న ఉనికి.

అదే, అదే కల, మెలుకువ. మనుషులు, వెలుగు కల్సిన సన్నటి చీకటి. హిమాలయాల్లోని మనిషి పెద్ద అంగలతో లోపల నుంచి నడిచి వెళుతున్నాడు. అతని కళ్ళలో అంతులేని దయ. ‘యోగీ! నువ్వు చూసింది నీ కళ్ళని, నేను చూస్తుంది నా కళ్ళని.’ అతను రాళ్ళు విసిరింది ఎందుకో తెలుస్తుంది.

తలుపు తీసిన చప్పుడు.

చల్లటిగాలి తగిలి చుట్టుకుంటుంది.

అడుగుల శబ్దం దూరమవుతుంది.

శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...