ఆమె – దాసు

ఈ భయం ఎప్పుడు మొదలైంది అసలు? శాంత అడుగుతోంది. శాంత మా చిన్నమ్మ కూతురు. సైకాలజీలో పీహెచ్‌డీ చేసింది. కొన్ని అనుభవాలు జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. అవి భయాలై వెంటాడతాయేమో. నాకు నాగలక్ష్మి మేడమ్ ఇంట్లో జరిగింది, అదంతా ఒక ఊహేనేమో అని కొన్ని వందలసార్లు కొట్టిపారేసినా అది నేను మర్చిపోలేని రాత్రి.


నాగలక్ష్మి మేడమ్ ఇంటికి తరుచుగా వెళుతుండేవాణ్ణి. ఆమె అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆమె చిన్నమ్మ స్నేహితురాలు. ముఖ్యంగా చిన్నమ్మ ఆస్ట్రేలియా వెళ్ళిన దగ్గర నుంచి నేను మేడమ్ దగ్గరికి వెళ్ళడం ఎక్కువైంది. చిన్న సలహా దగ్గరినుంచి ఐడియాలజీ వరకు అన్నీ మాట్లాడుతుండేవాణ్ణి. ఆమె పెద్దగా మాట్లాడేది కాదు. వింటూ ఉండేది, మధ్యలో ప్రశ్నలు వేసేది. వాటికి నేను సమాధానాలు ఇచ్చానా లేదా అవి సరైనవా కావా అనే చర్చ ఉండదు. వెళ్ళినప్పుడల్లా అల్లం నూరివేసి బాగా మరిగించి ఆమె చేసి ఇచ్చే టీ నాకు చాలా ఇష్టం. అది మరుగుతుంటే వచ్చే సువాసనలో ఆమె మాయేదో కలిపింది అనిపించేది. ఇల్లంతా ఆమె చేసిన మట్టిబొమ్మలతో, ఆమెకిష్టమైన రకరకాల రంగుల దిండ్లు, లేత నీలంరంగు కర్టెన్స్‌తో తీర్చిదిద్దినట్లు ఉండేది.

ఆమె మొక్కల గురించి చాలానే చెప్పాలి. ఇంటి చుట్టూ ఒక అడవినే పెంచుకుందా అన్నట్లు ఉండేది ఇల్లు. ఇంటి చుట్టూ పెద్ద స్థలం కాకపోయినా ఉన్నదాంట్లోనే ఎన్నో పండ్ల చెట్లు, పూల మొక్కలు. ఆమె మొక్కల మధ్య తిరుగుతుంటే వనదేవతలా అనిపించేది. ఆమె మొక్కల్లో ఉన్నప్పుడు ఉషారుగా ఉండేది. మొక్కలు మాట్లాడతాయని, వాటికి హృదయం ఉందని, వాటికి నీళ్ళతో పాటు ప్రేమనూ ఇవ్వాలని, అవి గ్రహిస్తాయని, వాటికి మించిన తోడు ప్రపంచంలో ఏదీ ఉండదని… ఇలా చెపుతూనే ఉండేది. ఆ చెట్ల దగ్గరికి వచ్చేసరికి ఆమె ఎన్ని మాటలు చెప్పేదో. అప్పుడు ఆమె సంభాషణ కన్నా ఆమె వాటి మధ్యలో మైమరిచి ఉండటం చూస్తే సంతోషంగా ఉండేది. ఆమెకు పెద్దగా వంట రాదు కానీ ఆమె దగ్గరుండి వడ్డించి శ్రద్ధగా పెట్టడం నాకు బాగా నచ్చేది.

ఆమెతో చాలా చర్చలు నడిచేవి. చాలా చర్చల్లో ఆమె ఎలాంటి స్టాండ్ తీసుకోదని అర్థమయ్యేది. కొన్నిసార్లు ఆమె తీర్మానాలు చేసినట్లు, కొన్ని స్టే‌ట్‌మెంట్స్ ఇచ్చేది. చర్చల వల్ల ఏమి ఉపయోగం ఉండదని, మాటలతో వేటికీ పరిష్కారం ఉండదని చెప్పేది. ఆమెది నిరాశావాదం అని అనేవాడిని. మాటలకంటే లోపల జరిగేవి చాలా ఉంటాయని చెపుతుండేది. ఒక్కోసారి ఆమె లోతైన మనిషిలా కనిపించేది.

ఆమె నన్ను దాసూ అని పిలిచేది. నిజానికి అది నాపేరు కాదు, ఆమె ఉద్యోగరీత్యా జర్మనీలో కొన్ని రోజులు ఉన్నప్పుడు ఒక ఆప్తుడైన మిత్రుడిని అనుకోని పరిస్థితుల్లో కోల్పోవాల్సి వచ్చిందని, నాతో ఉన్నప్పుడు ఆ మిత్రుడితో ఉన్నట్లే ఉంటుందని చెప్పేది. అతని వివరాలు మాత్రం అడిగినా చెప్పేది కాదు. ఎలాంటి మిత్రుడు అతడు, ఈమెకి ఎంత దగ్గరివాడు అని ఆలోచించేవాడిని. ఎప్పుడూ ఆమె వ్యక్తిగతమైన విషయాలు చెప్పడం చర్చించడం చూడలేదు.

ఆమెను సలహా అడిగినప్పుడల్లా ‘దాసూ, నీకు ఏది సరైనదో అదే చేయి’ అనేది. ఆమె స్నేహితులు అందరూ ఆమెకి కొంత దూరం వచ్చి ఆగినట్లు అనిపించేది. అందరితో స్నేహంగా ఉండే ఆమెకి, మిగతావారికీ మధ్య అలా ఎందుకు గీతలు ఉన్నాయో అర్థమయ్యేది కాదు.

ఆమె ఇంటికి తరచూ వెళ్ళడం అలవాటైంది. ఉండేకొద్దీ ఆమెతో అలా కాసేపు గడిపిరావడం బాగా అనిపించేది. అప్పుడప్పుడు తెలీసీ తెలీనట్లు ఆమె చేతివేళ్ళను తాకడం, భుజాన్ని తడుతూ మాట్లాడటం జరుగుతుండేది. అదేదో కావాలని చేసినట్లు కాదు కానీ అలా అవుతుండేది. ఆ మొక్కల మధ్య ఇల్లు అరణ్యంలో ఇల్లులా ఉండేది. అక్కడికి వచ్చినప్పుడు నా ఉనికి ఆ మొక్కలకి నచ్చనట్లు అనిపించేది. అప్పుడప్పుడు ఊపిరాడనట్లు అనిపించేది. అదేమాట ఆమెతో అంటే ‘నువ్వు మొక్కలని ప్రేమించడం మొదలుపెట్టాలి. వాటికి తెలుస్తుంది వాటికి ఎవరు స్నేహితులో, ఎవరు కారో’ అనేది. నాకు మొక్కల మీద స్నేహమూ లేదు శత్రుత్వమూ లేదు. ‘నేను మొక్కల మనిషిని కాదు’ అనేవాడిని. ‘మొక్కల మనిషి కానివాడంటూ ఎవరూ ఉండరు దాసూ. మొక్కకి దగ్గరగా జరిగి చూడు. అది నీకు ఏదో ఒకటి చెపుతూనే ఉంటుంది’ అనేది. ‘మనుషుల మాటలే వినడం కష్టమైతుందంటే కొత్తగా మొక్కల భాష నాకెందుకు మేడమ్, నన్ను వదిలేయండి’ అనేవాడిని.

ఆమెను వ్యక్తిగతమైన ప్రశ్నలు వేసే ధైర్యం కానీ చనువు కానీ నేను ఎప్పుడూ తీసుకోలేదు. ఆమె గట్టిగా తెరలు తెరలుగా నవ్వడం ఒకే ఒక్కసారి చూశా. ఆరోజు అర్థం కాని సంభాషణ ఆమెతో. ఆ ఇంట్లో ఎవరి ఫోటోలు ఏవీ కనిపించవు గోడలకి. అదే విషయం అడిగితే, గోడలకి ఫోటోలు పెడితే లోపలనుంచి వాళ్ళని విసిరి పడేయటమే కదా అంది. ఆమె చెప్పింది నాకు అర్థంకాలేదు. ‘కనీసం మీ ఫోటో అయినా పెట్టొచ్చు కదా’ అన్నా. ఆమె గట్టిగా తెరలు తెరలుగా నవ్వింది ‘నన్ను నేనే విసిరేసుకోమంటావ్, పర్లేదా’ అని. అంటే మనుషులను చూసుకోవడం గుర్తు తెచ్చుకోవడంలో ఇబ్బంది ఏంటి. ‘గుర్తు పెట్టుకోవడం అంటే ఏంటి దాసూ, వాళ్ళ రూపురేఖలనా గుర్తు పెట్టుకొనేది? అయినా మనుషులను అంత గుర్తు పెట్టుకొని ఏం చేయాలి?’ నా సమాధానం ఆశించలేదు అనుకుంటా ఆమె. ఆమె ఇలా రెట్టించినప్పుడు ఎక్కడలేని నిస్సహాయతలో పడిపోయేవాణ్ణి.

మా చిన్నమ్మ అనేది ఆమొక విచిత్రమైన మనిషి కానీ మంచి మనిషి అని. ఆమె ఎప్పుడూ సహాయం అడిగేది కాదు. సహాయం చేయడానికి సమయం ఉందిలే అని చెప్పేది. అలాంటిది ఒకసారి ఆమె నా సహాయం అడిగింది.

ఆమె స్నేహితులతో కలిసి కేరళ వెళుతుంది వారం రోజులు. మొక్కలకి నీళ్ళు పోయడానికి, ఆ ఇల్లు చూసుకోవడానికి ఆ ఇంట్లో నన్ను ఉండమని అడిగింది. రాత్రుళ్ళు ఉండాల్సిన అవసరం లేదని రోజులో ఏదో ఒక సమయంలో వచ్చి చూసిపోయినా చాలని చెప్పింది. సహాయం చేయడానికి వచ్చిన అవకాశం, ఇంకా ఆ ఇంటి మీదున్న ఇష్టంతో వెంటనే ఒప్పుకున్నా. వచ్చేదాకా అక్కడే ఉంటానని ఉత్సాహంగా చెప్పా. సరే నీ ఇష్టం అని గెస్ట్ బెడ్‌రూమ్‌లో ఉండమని చెప్పి, ఆమె బెడ్‌రూమ్ వరకు తాళం వేసుకొని, ఇంటి తాళాలు నా చేతిలో పెట్టింది. మొక్కలు జాగ్రత్త, మొక్కలతో స్నేహం చేయి, జాగ్రత్త దాసూ! అని మరీ మరీ చెప్పి వెళ్ళింది.

వారానికి కావాల్సిన బట్టలు తెచ్చుకున్నా. మా ఇంట్లోవాళ్ళు ఇచ్చిన ఉచితసలహాలు పట్టించుకోలేదు. రాత్రుళ్ళు అక్కడ ఉండాల్సిన పనిలేదు, సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేయి అన్నా వినలేదు.

మొదటి రోజు ఉషారుగా ఉంది. పెద్దగా చేయడానికి ఏమీ లేదు. ఆమె ఫ్రిడ్జ్‌లో వండి పెట్టిన చేపల పులుసు, గులాబ్‌జామ్‌తో ఎంజాయ్ చేశా. కావాల్సినంతసేపు టీవీ చూసి అలాగే నిద్రపోయా. నిద్రలో పిల్లులు అరుచుకుంటున్నట్లు ఏవో అరుపులు వినపడ్డాయి. కొద్దిగా తెల్లవారుతుండగానే మెలుకువ వచ్చింది. అంత పొద్దునే లేచే అలవాటు లేదు నాకు. వెనుక తలుపు తెరవగానే చల్లటి గాలి, పొద్దున పూట ఇంత అందంగా ఉంటదని ఊహించలేదు. చల్లగా ప్రశాంతంగా ఉంది ఆ ప్రదేశం. ఆకులపై చిరుచెమటలు పోసి అలసి కారుతున్నట్లు సన్నటి చెమ్మ, మునగతీసుకొని నిద్రపోతున్నాయి చెట్లు, రాత్రంతా గాలి వీచినట్లు చెట్ల ఆకులు రాలి ఉన్నాయి. చెట్లకి నీళ్ళు అవసరం లేదనిపించింది.

రెండవ రోజు బెడ్‌రూము కిటికీ తలుపు తెరవగానే జామచెట్టు గాలి చల్లగా తాకింది. ఒక్కసారి గదంతా చల్లగా మారిపోయింది. పొద్దునంతా బయటికెళ్ళి స్నేహితులతో ఊరంతా తిరిగి వచ్చా. అలసిపోయి అలాగే నిద్రపోయా. మధ్యరాత్రి మెలుకువ వచ్చింది. చల్లగా ఉన్న గది వెచ్చగా మారిపోయింది. ఎవరో గుసగుసగా మాట్లాడుతున్నట్టు వినపడుతున్న శబ్దాలు. కళ్ళు తెరవకుండా అలానే ఉండిపోయా. ఆ గుసగుసలు ఏమిటో అర్థం అవ్వట్లేదు, వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకున్నట్లు. ఎవరై ఉంటారు? అక్కడ నేను, చెట్లు తప్ప ఏమీ లేవు. చెట్లు మాట్లాడుతున్నాయా, నా గురించి ఏదైనా చెప్పుకుంటున్నాయా. అసలు చెట్లు మాట్లాడితే అదేం భాష అయి ఉంటది? అసలివి చెట్లేనా? కళ్ళు తెరవాలంటే భయం వేసింది. అవేమి మాట్లాడుతున్నాయీ అర్థం కావట్లేదు. ఆమె చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వాటితో స్నేహం చేయాలంటే ప్రతి చెట్టునీ తాకి చూడాలని చెప్పేది. రానురానూ ఆ గుసగుసలు ఎంత పెద్దవయ్యాయంటే ఒకరు నా చెవిలో అరుస్తున్నంతగా. మధ్యలో నా పేరు ఒక్కసారిగా వినపడింది. ఉలిక్కిపడ్డా. గాలికి కిటికీ తలుపు ముందుకీ వెనక్కీ కొట్టుకున్న చప్పుడు. నేను కల కనడం లేదు కదా అనిపించించి. కొద్దిగా తెరిచీ తెరవకుండా చూశా. నా పైన నీలపు కాంతి. అలాంటి కాంతి ఎప్పుడూ చూడలేదు. అక్కడంతా గమ్మత్తైన పరిమళం, వింత కాంతి. గుసగుసల శబ్దాలు. ఒక్కసారి కళ్ళు తెరిచా. అంతే, శబ్దాలు ఆగిపోయినయి, నీలపుకాంతి చటుక్కున మాయమైపోయింది. లేచి కిటికీ తలుపులు వేసి హాల్‌ లోకొచ్చి టీవీ పెట్టుకొని పడుకున్నా.

మొక్కలు మంచివి అనుకుంటాం, అన్నీ మంచివేనా వాటిల్లో చెడ్డవి కూడా ఉంటాయా. మంచి మొక్కలంటే ఏంటి? మనుషులకి ఉపయోగపడే మొక్కలా లేక మొక్కల్లో మొక్కలకి సహాయపడేవా? వాటిని అవి మంచి చెడు అని వేరు చేసుకుంటాయా? ఇదంతా గందరగోళంగా అనిపించింది. మరీ ఎక్కువ ఆలోచిస్తున్నట్లున్నా. అంత అవసరం లేదు.

మరుసటి రోజు పొద్దునే ఆమె ఫోన్ వచ్చింది. అంతా బాగానే ఉందని చెప్పా. ఆమె ఎక్కువ ప్రశ్నలు వేయలేదు. జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆమె ఇప్పుడు ఎవరికి జాగ్రత్త చెప్పింది, నాకు కాదు కదా అనిపించింది.

ఆరోజు శ్రద్ధగా మొక్కలకి నీళ్ళు పెట్టా. అన్నిటినీ జాగ్రత్తగా చూశా. మామూలు చెట్లు మొక్కలలానే ఉన్నాయి. అన్నిటిని తాకి చూశాను. బలహీనంగా కిందకి వాలిపోయిన జాజిమల్లి తీగను శ్రద్ధగా పైకి తీసి కట్టా. వాటితో నేను సంధి కుదుర్చుకొనే ప్రయత్నమేదో చేసినట్లనిపించింది. ప్రతి చెట్టుని మొక్కల్ని జాగ్రత్తగా చూశా, అవెంతో ప్రశాంతంగా గాలికి సన్నగా చిరునవ్వుతో ఊగుతున్నట్లు అనిపిస్తున్నాయి. దారంతా ఆకులు పడివున్నాయి అన్నిటినీ ఊడ్చి ఎత్తి వేశా. చాలా రోజుల తరువాత ఒళ్ళు వంచి కష్టపడి పనిచేసినట్లనిపించింది. ఇక ఆరోజు ఎక్కడికీ వెళ్ళకుండా కూర్చొని శ్రద్ధగా పుస్తకాలు చదువుకున్నా.

పడుకోబోయే ముందు భయపడకుండా కిటికీ తలుపు తీసి పడుకున్నా. అమావాస్య దాటి సగం రోజులు అయినట్లుంది, సగం చంద్రుడి వెలుతురు పడుతుంది గది లోపలకి. వెన్నెలంతా లోపల పరుచుకున్నట్లుంది. ఏదో జరగబోయేముందు ప్రశాంతతలా ఉంది. ఫోన్‌లో సన్నగా పాటలు పెట్టుకొని అవి వింటూ నిద్రలోకి జారిపోయా.

ఎప్పుడు మెలుకువ వచ్చిందో తెలీదు, చెమటలు పడుతున్నాయి ఉక్కగా ఉంది. అకస్మాత్తుగా గాలి ఆగిపోయింది. గదంతా చిక్కటి నీలపు కాంతి పరుచుకొని ఉంది. కొద్దిగా కళ్ళు తెరిచి చూశా. కిటికీ లోపలకి వచ్చిన కొమ్మలు, ఆకుల నీడలు. నీడలను చూసి భయపడటం తెలుస్తుంది. కరుకుగా శబ్దాలు. ఏదో అర్థమవుతుంది. వెళ్ళిపొమ్మని, కరుకు శబ్దాలు. గుసగుసగా మాటలు. వెళ్ళిపొమ్మని చెపుతున్నాయి. పొద్దున శ్రద్ధగా నిలబెట్టిన జాజి తీగ కొస ఏమో చెవులకి తాకుతుంది. లోపల సన్నని జలదరింపు.

వాటి శబ్దాలకు నాకు అర్థమయ్యే శక్తేదో వచ్చిందనుకుంటా. నువ్వు దాసువి కాదు. నీకు ఆమె పైన కోరిక. నువ్వెదురు చూసేది జరగదు. ఆమె ప్రేమ కొండచిలువ ప్రేమ. ఆకలి వేస్తే మింగేస్తుంది. భయంవేసి కళ్ళు తెరిచి చూశా. అది కల కాదు నిజమే. చుట్టూ దట్టమైన నీలపుకాంతి.

వీటికి మాటలు వచ్చా లేక ఇవి చేస్తున్న శబ్దాలు నాకు అలా అర్థమవుతున్నాయా. నాకు ఆమె పైన ఉంది కాంక్షా? వాటికి తెలిసిపోయిందా? అయినా ఆమె స్నేహితుడి గతి ఏమైంది, అన్నీ వదులుకొని వెళ్ళిపోయాడా లేదా ఆమెనుంచి పారిపోయాడా?

నాకో కథ తెలుసు, ఎవరినైనా నమ్మవచ్చుగాని కొండచిలువని నమ్మకూడదని. ఎంత ప్రేమగా ఉంటుందో ఆకలికి సరిపడా భోజనం తయారైనప్పుడు అది మింగేస్తది. దానికి ప్రేమంటే లోపలకి మింగి ఆకలి తీర్చుకోవడమే.

ఎంతో అందంగా కనిపించిన ఇల్లు బందీఖానాలా అనిపించింది. తాళం వేసి ఉన్న ఆమె బెడ్‌రూమ్‌లోకి కీహోల్ గుండా చూశా. ఆ బెడ్‌రూమ్‌లో ఏమీ కనిపించలేదు, ఒకదగ్గర చిన్న ఫోటో కనపడింది. ఆమె అతడి భుజాల చుట్టూ చేతులు వేసి నవ్వుతున్న పిక్చర్. అతడు దాసా? అతడు నాలా ఉన్నాడా లేక నేను అతడిలా ఉన్నానా? అతడి మొఖంలో నవ్వు లేదు. ఆ ఫోటో పైన కొండచిలువేదో పాకుతున్నట్లు అనిపించింది. ఉలిక్కిపడ్డా. ఒక్కో అడుగు నెమ్మదిగా కూడదీసుకొని ఇంటి బయటికి వచ్చా. తాళాలు వేశానో లేదో గుర్తు లేదు. ముందుకు నడిచా, ఆ చెట్లన్నీ నా వెనుక గేలిచేస్తూ నన్ను తరుముతున్నట్లు గట్టిగా గాలి వీస్తోంది.


శాంత నావైపు లోతుగా చూస్తోంది!


శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...