అ సత్యం

మెట్టుమెట్టుకి దీపం పెట్టి దండం పెడుతుంది సత్యవతి. ప్రతి దీపం కొండెక్కుతుంది. వాటితో పాటే సత్యవతి. దాని వెనుక నేనుండాలి. కానీ నాకంటే ముందు అమృత వెళ్ళిపోయింది. నిస్సహాయంగా చూస్తున్నా. మబ్బుల చాటుకి వెళ్ళిపోయారు వాళ్ళు. సూర్యుడు బయటికి వచ్చాడు. నా పాదాలు నేలను తాకాయి. ఇప్పుడు మేల్కోవాలి కలలోకి. కలలాంటి వాస్తవంలోకి. వాస్తవంలాంటి నిద్రలోకి.


కళ్ళు తెరిచా. కిటికీ నుంచి వెలుగు పల్చగా పరుచుకుంటుంది. ఆరైనట్లుంది. ఎదురింటి కిటికీ ఎనిమిదిన్నర తరువాత కానీ తెరుచుకోదు. అతను వెళ్ళాకే ఆమె కిటికీ తెరుస్తుంది. కొంతగాలి పీల్చుకోవడానికేమో. కిటికీలు తెరవకపోతే ఊపిరాడదు కొన్నిసార్లు.

డోర్ బెల్ మూడుసార్లు మోగింది. పాలవాడు వచ్చినట్లున్నాడు. వెధవ అందరి ఇళ్ళదగ్గర ఒక్కసారే కొడతాడంట. ఇక్కడ మాత్రం మూడుసార్లు. నాకు వినపడదనుకుంటాడేమో! లేచాను. కాళ్ళు విరిగిన చప్పుడు. రాత్రి మునగాకు వేయించి పెట్టుకున్నా. నొప్పులు తీసినట్లున్నాయ్.

అరగ్లాసు పాలలో అరగ్లాసు నీళ్ళు కలిపి హార్లిక్స్ తెచ్చుకొని కూర్చున్నా. ఇదో సమన్యాయం. కిటికీ వెనుక ఆమె ఏడుపు, మధ్యలో పిల్లవాడి ఏడుపు. అతని అరుపులు. కొన్ని భరించలేని శబ్దాలు. ఏమంటున్నాడో అర్థంకావడం లేదు కాని అరుపులో చిరాకు, కోపం వినపడుతుంది. చేసేవాళ్ళు, అనుభవించేవాళ్ళు, చూసేవాళ్ళు, వినేవాళ్ళు. ఇదొక హింసాత్మక తాత్వికం.

వెంకూ ఇచ్చిన సత్యశోధన పుస్తకం తీశా. గొప్పగా ఉంటుంది, చదవమని ఇచ్చాడు. నాకెందుకో చప్పగా ఉంది. గాంధీజీ చేస్తున్నది సగం సత్యశోధనే అనిపిస్తుంది. వాళ్ళ అమ్మ ఎదుట చేసిన ప్రతిజ్ఞ మళ్ళీ కనిపించింది: వాగ్దానం నిలబెట్టుకోకపోవడం వల్లనే ప్రపంచంలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఆత్మవంచన చేసుకొని దైవాన్ని, లోకాన్ని మోసం చేస్తూనే ఉంటారు. మనసు కోసినట్లు కలుక్కుమంది. శనివారం సరిగ్గా ఇదే చేయాలి. చేయగలనా? నాలుగు రోజులు ఉంది. ఇంకోసారి నాలోనేను గొణుక్కున్నా.

కిటికీ తెరుచుకుంది. అద్దం కనిపిస్తుంది. దాని ముందు పిల్లల్ని పడుకోబెట్టే తొట్టి. ఉయ్యాలకంటే పెద్దగా ఉంటుంది. అందులో పిల్లాడిని వదిలి రెండు బొమ్మలు వేసి వెళ్ళింది ఆమె. కాసేపు ఆ బొమ్మలు పట్టుకొని ఆడాడు. తరువాత వాటిని వదిలేసి అద్దం వైపు చూస్తూ చేతులు ఆడిస్తున్నాడు. వాడిని చూడగానే ఆనందం వేసింది. కాసేపు అటూయిటూ చూసి తొట్టి అంచును పట్టుకొని నిలబడి, కిటికి వైపు చూశాడు. నేను కనపడతానా? తెలీదు. కళ్ళజోడు సరిచేసుకొని చేయి ఎత్తా.

తలుపు కొట్టిన శబ్దం. అలా ఆగి ఆగి కొట్టేది ఒక్క వెంకూనే. ఏంటి ఇంత పొద్దుటే వచ్చాడు! వెళ్ళి తలుపు తీశా. వాడి ముఖం ముడుచుకుపోయింది.

“ఏంటిరా అలా ఉన్నావ్” అన్నా.

“అమ్మమ్మా… శనివారం వెళ్ళాల్సిందేనా?”

అక్కడేదో జరిగిందని అర్థమైంది. చిన్నగా నవ్వా.

“మామయ్య అంటున్నాడూ, అమ్మకి ఏనాడు డబ్బుల పైన ఆపేక్ష లేదు, ఇప్పుడిలా ఎందుకు చేస్తుందో అని. అయినా నీకు డబ్బులెందుకు అమ్మమ్మా? ఈ ఇల్లు ఉంది. తాత పెన్షన్ కూడా వస్తుంది కదా!”

“డబ్బులకోసం అనుకుంటున్నాడా మీ మామయ్య. సరేలే, టీ తాగుతావా? తాగాలనిపిస్తే లోపల టీ ఉన్నాయి వేడి చేసుకొని తెచ్చుకో.”

ఏమీ మాట్లాడకుండా లోపలికెళ్ళి టీ తెచ్చుకొని కూర్చున్నాడు. అన్నీ అమృత పోలికలు. దానిలాగే పట్టుదల లోపల దాచిపెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. ఒక్క ముక్కు మాత్రం వాళ్ళ నాన్నది. కోసుగా ఉంటుంది.

“బసవయ్యమామకు అప్పు ఇచ్చినట్లు నాన్న కూడా ఎప్పుడూ అనలేదు మాతో అన్నాడు మామయ్య, మరి ఇదంతా ఎందుకు అమ్మమ్మా ఇప్పుడు?”

“నా అరవై ఏళ్ళ జీవితంలో మొదటిసారి నేను అనుకున్నట్లు చేస్తున్నా వెంకూ. తాతయ్య ఉన్నంత కాలం ఒక భయంతోనే బతికాను. అది మనుషుల జీవితాలను మింగేస్తుంది. ఏ పనీ చేయనివ్వదు. అకారణంగా ఎందుకు భయం ఉంటుందో తెలీదు. ఇంత జీవితంలో నేను దాటలేని గీతలన్నీ భయంతో ఆగిపోయినవే. చేయలేక కాదు. ఇది జరగాల్సి ఉంది కాబట్టే చేస్తున్నాను.”

“అమ్మమ్మా! నీకు తాతయ్య అంటే కోపమా?”

“అదేం లేదురా. మీ తాతయ్యకి నా స్వభావాన్ని అర్థం చేసుకొనే అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు. ఆయన స్వభావంలో ఇమిడిపోతూ వచ్చా అనేక భయాల కారణంగా.”

“అంత భయం ఉన్నదానివి రేపు అంత పెద్ద అబద్ధం ఆడటం ఏంటి అమ్మమ్మా! అదీ నువ్వు పూజించే దేవుడి ఎదురుగా. దేవుణ్ణి మోసంచేయడం కదా అది!”

“మీ తాతయ్యతో పాటే భయం కూడా పోయిందిరా. ఏది మోసమో, ఏది న్యాయమో అర్థంకావాలంటే అనేక జీవితాల్ని, కాలాల్ని ఏకకాలంలో చూడగలగాలి. ఏది అబద్ధం, ఏది నిజం, ఎవరు దేవుడు. అయినా నిజాలు, అబద్ధాలు, డబ్బులు, మనుషుల ప్రాణాలు ఇవన్నీ దేవుడికి పడతాయా?”

“నువ్వీ పని చేస్తే మామయ్య నీ గడప తొక్కడంట. మామయ్య చాలా ఆనెస్ట్ అమ్మమ్మా. ఇంకొక్కసారి ఆలోచించు…” అని కాసేపాగి “ఇదంతా డబ్బు కోసమా? నిజంగా?” అని మళ్ళీ అడిగాడు.

“నీకేమనిపిస్తుంది? డబ్బుకోసం మనుషులు ఏమైనా చేస్తారు వెంకూ. దానికి నీతి, న్యాయం లేవు. డబ్బుల ముందు మనుషుల ప్రాణాలకు ఎలాంటి విలువా లేదు.” నా కళ్ళ ముందు సత్యవతితో పాటు కాలిపోయిన సత్యాలు కనిపిస్తున్నాయి. వాడికేమి అర్థమైందో.

“ఇది తప్పు అమ్మమ్మా” అన్నాడు. వాడికళ్ళలో అభ్యర్థన. ఇంత చిన్న వయసులో ఎంత పెద్దమనసు!

“వస్తావుగా శనివారం నాతో.”

“వస్తాను, అయినా నీకెందుకు అమ్మమ్మ అంత డబ్బు, తీసుకొని ఏం చేస్తావ్?”

మళ్ళీ డబ్బు గురించే. నవ్వొస్తుంది. డబ్బు మనుషుల ఆలోచనల్ని అక్కడే ఆపేస్తుంది. అది చేసే మాయ వాళ్ళని దాన్ని దాటి చూడనివ్వదు. దాన్ని దాటలేనప్పుడు నేనేం దాటుతున్నానో వారికెలా తెలుస్తుంది?

బసవయ్యకు పిల్లలుంటే ఇలా చేసేదాన్నా?

వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ కిటికీ ఎదురుగా కూర్చున్నా. పిల్లవాడు నిద్రపోతునట్లున్నాడు. నిశ్శబ్దంగా ఉంది. ఎండ కొంచంకొంచం దిగుతున్నట్లుంది. చేతులపైన సన్నటి ముడతలు. ఒక్కొక్క ముడతలో కొంత జీవితం కప్పబడిపోయింది. వయసు పెరిగేకొద్ది ఇంకా కప్పబడి పోతుంది. లోపల ఉన్న కొవ్వు కరుగుతుంది. చలికి తట్టుకోవడం కష్టమవుతుంది. శనివారానికి మనసు సిద్ధం చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ అదే గుర్తొస్తుంది. రెండో అంతస్తు నుంచి నెమ్మదిగా క్రిందికి వచ్చా. పిల్లలు పరిగెడుతూ ఆడుకుంటున్నారు. క్రిందింటి చిన్నపాప అప్పుడప్పుడే తప్పటడుగులతో నడక నేర్చుకుంటుంది. తనను చూస్తే నా అడుగులు గుర్తొచ్చాయి. అడుగులు నేర్పుగా వేయాలి. సరిగా వేయడం నేర్చుకుంటున్నా ఇప్పుడే. అబద్దాన్ని నిజమని చెప్పాలి అంతే. పెద్ద కష్టం కాదు అది.

ఆమె పిల్లవాడిని తీసుకొని నా వైపే వస్తుంది. ఆమె ముఖం చూస్తే నాకు అమృతే కనిపిస్తుంది. కనిపించేదేంటి, అమృతనే. అది ఇలానే ఉండేది అచ్చం. కానీ ఈ అమ్మాయిలో నిస్సహాయత. సాయం కోసం అరుస్తూ కూరుకుపోతున్న గొంతుతో పాలిపోయిన కళ్ళతో వెలుగులేని ముఖం. అమృత ఎప్పుడూ ఇలా నిస్సహాయంగా కనిపించలేదు. లేదా నేను చూడలేదా! తనకుతానే లోకాన్ని వెలేసి వెళ్ళిపోయిందా? లేక తనకి కూడా సత్యవతికి అయినట్లేమన్నా అయ్యిందా? పిల్లవాడి బండి నా పక్కకు వచ్చింది. ధీమాగా ఉన్నాడు వాడు. పక్కన ఉన్న తల్లిని చూసుకొనేమో! నన్ను గుర్తుపట్టినట్లు నవ్వుతున్నాడు. వాడి కళ్ళు నా గోడమీది పిల్లబుద్ధుడిలా వెలుగుతున్నాయి.


వెంకూ వస్తాడని ఎదురుచూశా. రాలేదు. ఫోన్ చేశా.

“అమ్మమ్మా! మావయ్య నన్ను వెళ్ళొద్దన్నాడు. ఏం చేయను?”

“రావద్దులేరా” అన్నా.

వాడు మాట్లాడిన కార్ మాత్రం టైమ్‌కి వచ్చింది. సంచి తీసుకుని ఒక్కదాన్నే బయలుదేరా. బండి సూర్యాపేట వైపు పరుగుతీసింది. “అమ్మా, ఇక్కడినుంచి అనంతారం దారి చెప్పండి” అన్నాడు డ్రైవర్. చెప్పాను. ఊర్లో నుంచి ఒక్కో ఇల్లు దాటుకుంటూ రాములవారి గుడిదగ్గరికి వచ్చాం. ఎన్నోసార్లు ఈ గుడి మెట్లని కడిగింది సత్యవతి. ఒక్కోమెట్టు ఒక్కొక్క కష్టంలా అనిపించింది. వెళ్ళేసరికి ధర్మకర్త, ప్రెసిడెంట్, పూజారి కనిపించారు. బసవయ్య తమ్మళ్ళు రఘుపతి, ప్రసాదరావు ఇంకో పక్కన ఉన్నారు.

“పార్వతమ్మగారూ, ఏమిటండి ఇదంతా. బసవయ్య ఉన్నప్పుడు ఏ రోజూ మాట్లాడలేదు. ఏమీ చెప్పలేదు దీని గురించి. ఇప్పుడు మీరు ఇలా అనడం బావుందా?” అన్నాడు ధర్మకర్త.

“అదేంటండీ? మావారు చెప్పిన మాటే నేను చెప్పాను. వాళ్ళు దేవుడి ముందు దీపం ఆర్పి చెప్పమంటున్నారనే కదా ఇక్కడిదాకా వచ్చాను.”

“అమ్మా! ఆలోచించు. ఇది నిజం కాకపోతే మీ ఇంటికే అరిష్టం” అన్నాడు పూజారి భయంగా. నేను గర్భగుడిలోకి తొంగి చూశా. పూజారి వెళ్ళి హారతి వెలిగించి తీసుకొచ్చాడు. అందరి ముఖాల్లో భక్తో, భయమో లేక అపరాధభావనో. నేను హారతి వైపు చూశా.

“ఇలా చేసేముందు దేవుడి దగ్గరకెళ్ళి దణ్ణం పెట్టుకొని నిజమే చెపుతా అనుకొని రండమ్మా” అన్నాడు పూజారి. వాళ్ళని చూస్తుంటే నవ్వొచ్చింది. వాళ్ళ చూపుల్లో నేను ఏమి చేస్తానా అన్న దానిపై సందిగ్ధం స్పష్టంగానే కనిపిస్తుంది. దేవుడి వైపు నడిచా.

ఈ గుడిలో చాలాసార్లు అర్చన చేయించా. సత్యవతి కూడా చేయించేది. బసవయ్య గోత్రనామాలతో తన పేరు కూడా చెప్పి కుటుంబాన్ని ఆయురారోగ్యాలతో చల్లగా ఉండేలా చూడమని వేడుకునేది. ఇప్పుడు ఏమని దణ్ణం పెట్టుకోవాలి? అబద్ధం చెపుతున్నందుకు నన్ను రక్షించమని పెట్టుకోవాలా? అయినా ఇప్పటిదాకా ఈ దేవుడు ఎవరిని రక్షించాడు? ఇంకెవరిని శిక్షించాడు? బసవయ్య తండ్రి అగ్గిపుల్ల వెలిగించినప్పుడే దాన్ని ఆర్పి, సత్యవతిని కాపాడాలి కదా దేవుడు. ఇప్పుడు దేవుడి గుడిలో హారతి ఆర్పితే అరిష్టమా? కానివ్వు. హారతి దగ్గరికి వచ్చా. చిన్నగా వెలుగుతుంది.

అరచేత్తో హారతిని ఆర్పాను. “నేను నిజమే చెప్తున్నా. బసవయ్య ఆస్తిని తనఖా పెట్టి, మా దగ్గర పాతిక లక్షలు తీసుకున్నాడు.”

రెండు నిమిషాలు నిశ్శబ్దం. బసవయ్య తమ్ముళ్ళు కోపంతో ఊగిపోయారు. ‘మాస్టారుని నమ్మి మా అన్న ఆస్తి కాగితాలు వీళ్ళ దగ్గర పెడితే ఇంత పనిచేసిందిది. ఇట్లాంటి ముండమోపిదాని మాటకు విలువనిచ్చా’మని ఉద్రేకపడ్డారు.

“చూడండి ఆమె ఇలా చేశారంటే మీ అన్న అప్పు తీసుకొనే ఉంటాడు. డబ్బులు ఇచ్చేసి మీరు మీ దస్తావేజులు తీసుకొండి. అనవసరంగా ఇక్కడ గొడవచేయకండి. మాస్టారితో బసవయ్య స్నేహం మనకు తెలిసిందే కదా!” అన్నాడు ప్రెసిడెంట్ నా పక్క వకాల్తా తీసుకొంటూ.

కొద్దిపాటి ఘర్షణ తరువాత 20 లక్షల దగ్గర బేరం కుదిరింది. డబ్బులు నా అకౌంట్లో వేశాక, ఆస్తి పేపర్లు వాళ్ళకి అప్పగించేట్లు ఒప్పందమైంది. ప్రెసిడెంట్ నారాయణస్వామి నా తరుపున గట్టిగా మాట్లాడి అందరిని ఒప్పించడం నవ్వు తెప్పించింది. అతని కళ్ళల్లో ఏదో పాతకాంక్ష. అది ఇదని చెప్పేలా లేదు. నువ్వు నిస్సహాయురాలివి నేను నీకు సహాయం చేస్తున్నాను అనే ఒక భావనలో చిన్నపాటి ఆహ్వానం.

“పార్వతమ్మగారూ! ఈ పూట మా ఇంటికి భోజనానికి రండి” అన్నాడు. నేను నిన్ను ఎంతో గౌరవంగా చూస్తున్నా అని చెప్పే సూచన. ఎంత గౌరవం ఉంటే ఆహ్వానం అంత రహస్యంగా ఉంటుందేమో! అరవై ఏళ్ళ వయసులో కూడా రహస్య సందేశాలు అర్థమవుతున్నాయి.

“లేదండీ, పనులున్నాయి.వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి.”

ఊరి పక్కన కాలువ దగ్గర కార్ ఆపమన్నా. అక్కడే సత్యవతి, నేను కార్తీకస్నానం చేసేవాళ్ళం. దీపాలు వదిలేది సత్యవతి. కాలువలోకి దిగి దీపాన్ని వెలిగించి వదిలాను. ఈ దీపాన్ని ఎందుకు వెలిగించానో, ఆ దీపాన్ని ఎందుకు ఆర్పానో, ఆర్పిన ఆ దీపం ఏమనుకుందో తెలీదు. ఇప్పుడిక నిజం ఎవరి కోసం? ఏ నిజాలు మనుషులకి కావాలి? బసవయ్య, వాళ్ళనాన్న, సత్యవతి, మాస్టారు, అమృత వీళ్ళంతా ఉండి ఉంటే ఏది నిజమని చెప్తారు? వాళ్ళకే తెలిసిన నిజాలు, ప్రపంచం చూసిన నిజాలు. కాలం కప్పేస్తున్న నిజాలు.

అబద్ధం అయిపోయింది. ప్రయాణం ముగిసిపోయింది.


సత్యశోధనో, ఆత్మకథనో నాకు నచ్చలేదు. ఏది సత్యమో, అది శోధన చేసింది ఎవరో అర్థంకాలేదు. సత్యంతో మాత్రమే సత్యాన్ని శోధించాలా? అసత్యంతో సత్యాన్ని శోధించలేమా? ఆత్మకప్పబడ్డ ఆత్మకథలో సత్యం దొరికే దారేది? వెలుగులో ఉన్న చీకటి తెలియదు, చీకటి వెనుక ఉన్న వెలుగు కానరాదు. అసత్యంలో సత్యం, సత్యంలో అసత్యం. దీపం ఆర్పిన అరచేయి కాలి బొబ్బెక్కింది. చితికిపోతుంది రెండు రోజుల్లో. మరి సత్యాసత్యాలకు సమన్యాయంతో కాలంచేసిన గాయాలో?

పిల్ల బుద్ధుడు నవ్వే వేళయింది. కిటికీని తెరిచిపెట్టా.


శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...