ఆమె నవ్వు

అయినా నిర్ణయాలు ఎక్కడ జరుగుతాయి? ఎవరు నిర్ణయిస్తారు, ఎలా నిర్ణయించబడతాయి? ఆ రోజు నువ్వలా నిర్ణయించుకొని రాకపోతే ఇలా జరిగేది కాదు కదా! ఎలాంటి సందిగ్ధంలోకి నెట్టావు పూర్ణా నన్ను?

హాస్పిటల్ కారిడార్లో దూరంగా విసిరేసినట్లున్న చెక్కబల్లవైపు నడిచాను.


జీవితంలో ఉత్తమోత్తమమైన సందర్భం ఏమిటో తెలుసా! నీ వాళ్ళనుకున్నవాళ్ళు నిన్ను విడిచి వెళ్ళాక హాయిగా ఊపిరి పీల్చుకోవటం. అలా ఉండటంలోని స్వేచ్ఛను అనుభవించడం బావుంటుంది. ఇంకెవరైనా వస్తారనే ఆశ దాగుంటుందా దానిలో? అంత దూరదృష్టి అవసరమా? ఇక నాకు మాత్రం మిగిలిన సమయమెంత?

వంటింట్లోంచి టీ వాసన తేలుతూ వచ్చింది. అంతకు ముందు టీతో కలిసి పూర్ణ వాసన కూడా వచ్చేది. వట్టి టీ వాసనే బావుంది.

పూర్ణ వెళ్ళి అప్పటికి పది రోజులు. మనుషులు పోవడంతోటే లోపల ఏదైనా ఖాళీ అవుతుందా? వచ్చేప్పుడు లోపల కొంచంకొంచం జాగా చేసుకొని మెల్లగా వస్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు మిగిల్చిన ఖాళీ అంతా వాళ్ళ బోలుతనం. నిజమే, వాళ్ళు నింపినదేమైనా ఉంటే, లోపలింత శూన్యతెందుకు! పూర్ణ రాకముందు బానే ఉన్నాగా. ఆధారపడటంతోటే అన్ని మొదలవుతాయనుకుంటా. సుఖమెంత దుఃఖమో!

రామం అరుస్తున్నాడు. వాడు ఏదో చెప్తాడు ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు. కొన్నిసార్లు ఊరటగా ఉంటుంది. ఒక్కోసారి వాడి అరుపు ఎంత వికృతంగా ఉంటదంటే వాడ్ని ఎక్కడైనా వదిలేసివద్దామనిపిస్తుంది.

ఓవారం కొత్తగా ఏదో స్వాతంత్య్రం వచ్చినట్లున్నా రోజులు గడిచేకొద్ది కుడిచెయ్యి పోయినట్లనిపించసాగింది.

ఏమి తక్కువ చేశా? ఏమి తక్కువ చేశా?

అసలు ఏమన్నా చేశానా పూర్ణకి?

ఎలా చూశా? ఒక వంటమనిషిగానే కదా! రుచిగా వండిపెట్టడమే కాదు, మన అవసరం ఎప్పుడు ఏముందో చూసి అన్నీ అమర్చే మనిషి కేవలం వంటమనిషే అవుతుందా? గౌరవంగానే చూశా కదా. ఎప్పుడు డబ్బులు అడిగినా ఎక్కువే ఇచ్చా, ఒక్కోసారి అడక్కుండా కూడా. అది సరిపోతుందా? సరిపోక! పెళ్ళానికి కొనిచ్చినట్లు కొనివ్వాలా, సినిమాలకి షికార్లకి తిప్పాలా?

పెళ్ళానికైనా ఇవన్నీ చేశానా? ఆమెకైనా ఎందుకు చేయాలి? ఎప్పుడైనా పెళ్ళాంగా ఉందా? పూర్తి స్వాతంత్య్రం ఇచ్చా కదా! దేనిలో ఇచ్చా? అంతకంటే చేసేదేంటి, ఏం కావాలో అవి చేశా. ఆమెనేమన్నా అబ్యూజ్ చేశానా? ‘తిట్టడం కొట్టడం ఒక్కటే అబ్యూజా, ఇంట్లో ఇంకో మనిషి ఉందన్న ధ్యాస లేకుండా, తనతో బతికే మనిషిని పట్టించుకోని నిర్లక్ష్యం కంటే పెద్ద అబ్యూజ్ ఏముంటుంది?’ అనేది ఆమె. అదేంటి, అది నాకు నేను చేసుకునే సెల్ఫ్ అబ్యూజ్ కదా. అసలు అదంతా ఆమె చేసినదానివల్లే. ‘అయినా అంతకుముందు మాత్రం నువ్వు మనిషిలా ఎప్పుడు చూశావ్?’ అని ప్రశ్నిస్తున్నట్టుగా ఆమె చూసే సూటిచూపు భయపెట్టేది.

ఆమంటే సరే, మరి పూర్ణ ఎందుకెళ్ళింది?

ఆమె పోయినప్పుడు కూడా ఇంత బాధలేదు. పూర్ణ వెళ్ళడమే…

వెళుతున్నా అని ఎంత సింపుల్‌గా చెప్పింది! అలా ఎలా వెళ్ళనిచ్చా? అయినా నాకేమి అధికారముంది తనను ఆపడానికి.


‘ఈరోజు నుంచి పూర్ణ ఇక్కడే ఉంటుంది,’ అంది ఆమె వెళ్ళడానికి కొన్నినెలల ముందు. ఆమె మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పింది లేదు, అలా అని వత్తాసు పలికిందీ లేదు. మాములుగా బజారులో ఎదురయ్యే పదిమంది మనుషుల్లో ఒకళ్ళలా అనిపించింది పూర్ణ. మళ్ళీ చూడాలనిపించే ప్రత్యేకతేమీ కనిపించలేదు.

ఒకప్పుడు ఆమె నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అనారోగ్యంతో వెనక్కి వచ్చింది. ఎటూ పోలేకనా లేక ఎప్పటికైనా తనని చూసుకొనేది నేనే అనుకొనో తెలీదు. ఆమెకి ఏ మూలో నామీద ప్రేమ ఉండే ఉండాలి.

ఎందుకు ఉండాలి? నేనెప్పుడూ ఆమెని కాదనలేదు, అలా అని దగ్గరకావడానికి ప్రయత్నించిందీ లేదు. తాను వెళ్ళినందుకు ఎప్పుడైనా బాధపడి, పశ్చాత్తాపం ప్రకటిస్తుందేమోనని ఆశపడ్డా. విచిత్రంగా కొన్నిసార్లు తిరిగి నీ దగ్గరికి రావడం నీ అదృష్టం అన్నట్లుండేది ఆమె ప్రవర్తన. ఏమి చేసినా మన్నించేంత ప్రేమ, ఇంత విశాల హృదయపు గొప్పతనాన్ని చూసి కూడా ఏమీ పట్టనట్టు తను రావడమే నా అదృష్టంలా ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కాదు. ఆమెని తక్కువగా చేసే ప్రతి ప్రయత్నంలో నాకు నేను పాతాళంలో ఉన్నట్లు ఎందుకు కనిపిస్తానో తెలిసేది కాదు. నువ్వే నాకు ఆధారం అని తనెప్పుడూ నా భుజం పట్టుకొని ఏడవదేంటి, కన్నీళ్ళతో నా కాళ్ళు కడగదేంటి?

ఎప్పుడో ఓ సారి లాలనగా ‘అనిల్, నువ్వెందుకు నన్ను భరించాలనుకుంటావ్?’ అన్నప్పుడు ఆమె కళ్ళలో అంతులేని దయ. ఆమె గుండెలపై తలపెట్టుకొని శాంతిగా నిద్రించాలనిపించేది. కానీ, నేనెందుకు అలా వాలిపోవాలి!? ఒక్కొక్కసారి తను నవ్వుతూ అనేది, ‘నువ్విలా ఉండకు, నువ్వు ఏది నిజమో అలానే ఉండు’ అని. కోపం తన్నుకొచ్చేది. నాలో అంత హిపాక్రసీ లేదు అని విసురుగా అనాలనిపించేది.

నేనేమి తక్కువచేశా నీకు అని అడగాలనుకునేలోపే, నేను ఏం ఇవ్వలేక పోతున్నానో అర్థమయ్యేది. నా గది లోపలికి ఎవ్వరినీ రానీయకుండా బయట బయటే ఉంచుతాను కదా, మరి వాళ్ళుమాత్రం ఎన్ని రోజులుంటారు? ఆమెని రానిచ్చా, ఊపిరాడట్లేదని వెళ్ళిపోయింది. అది నా తప్పా? ఒక మనిషిని ప్రేమించడం ఆదరించడం తోడుగా ఉండటం, ఇదంతా నేను ఎలా చేయగలనో అలానే చేస్తా. ఆమె ఆశించినట్లు ఎలా ఉండగలను? వెళ్ళిపోవడం ఆమె స్వార్థం అంతే. ద్వేషం, ప్రేమ, బాధ, భక్తి ఏదో ఒకటి ఆమెని చుట్టుకొని ఉంటాయెందుకో.

పూర్ణ వచ్చాక నేను తక్కువ అన్న భావనని నాలోంచి తీసేసింది. నేనూ మనిషినే అనిపించింది. ఏమో! మనుషులు దయామయులు, అట్లానే మోసపూరితులు కూడా. తాగి లేట్‌గా వచ్చినా టేబుల్ పైన తినడానికి ఏదో ఒకటి సిద్ధంగా ఉండేది. మనుషులే ఉండరు మాట్లాడటానికి.

రెండో మూడో డ్రెస్‌లు ఉండేవి పూర్ణకి. ఎక్కువ కనిపించేది ఎరుపు రంగు డ్రెస్. ఆమెప్పుడూ పూర్ణను పెద్దగా కసిరినట్లు అనిపించేది కాదు. ఎప్పుడైనా ‘ఓ రాజకుమారీ ఎక్కడికి పోయావు?’ అనేది.

ఆమె వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగిరాలేనంత దూరం. నేను బాధపడ్డానా! మళ్ళీ రాలేనంత దూరం వెళ్ళినందుకు బాధపడ్డాను. కొన్ని రోజులముందు అంది ఆమె, ‘నేను వెళ్ళాక పూర్ణ ఇక్కడే ఉంటుంది. కనీసం పూర్ణనైనా వెళ్ళకుండా చూసుకో’ అని. ‘వంట మనిషి, దాన్ని కూడా వెళ్ళకుండా చూసుకోవాలా!’ అన్నా కోపంగా. నిరసనగా నావైపు చూసింది, ‘నిన్ను కనిపెట్టుకొని తోడుగా ఉండే మనిషికన్నా ఇప్పడు నీకేమి కావాలి? పూర్ణను పోగొట్టుకోకు అనిల్’ అంది.

ఇంత ప్రేమించినా నువ్వే వెళ్ళిపోయావ్, ఇక పూర్ణ ఎందుకు అనుకున్నా. అలా అనుకున్న నేను ఇంత శూన్యమైపోవడమేమిటి!

అప్పుడు వచ్చాడు రామం. అదేంటో వాడు కూడా ఆమె ముందు ఏమీ అరవడు. ఆమె కోసం భక్తిగా పడిగాపులుకాసేవాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నేను ఒకటే అన్నట్లు ఉండేవి వాడి చూపులు. పూర్ణతోటి ఇలాంటి ఇబ్బంది ఉండేదికాదు. వీడికంటే పూర్ణే నయం.

రాను రాను పూర్ణపై ఆధారపడడం ఎక్కువైంది. ఆమె పోయాక పూర్ణ వెళ్ళి పోతుందనుకున్నా. వెళ్ళలేదు, ఉంది. నాకోసం ఉందనే ఆనందంలో కూడా, నాకోసం కాదు దిక్కుమొక్కులేక ఇక్కడుందని అనిపించేది.

బహుశా ఎలా మొదలైందో అధికారం, ఇష్టంతో అని నేను అనుకుంటా. నాలాంటివాడు కనికరించడం మామూలు విషయమా! పూర్ణకి మాత్రం కోరికలుండవా, అవి తీరక చంపుకొని ఉంటుంది. ఒకే ఇంట్లో ఉంటున్నాము. అనుకొనేవాళ్ళు ఎలాగూ అనుకుంటూనే ఉంటారు. తనో అనామకురాలు. నేను దయ చూపించా. తన చేయిపట్టుకొని నిజాయితీగా నా కోరిక చెప్పా. నా వైపు అదోలా చూసి నవ్వింది. ఒళ్ళు గగుర్పొడిచేలా, లోపల భయం కలిగించేలా. ఆ నవ్వులో నిర్లక్ష్యం, నిరసన, నిశ్శబ్దం. ఎందుకలా నవ్వావు అని అడిగే ధైర్యం, తనని ముట్టుకొనే కోరిక ఆగిపోయాయి.

పూర్ణ వెళ్ళిపోయింది. రామం నా చుట్టూ తిరుగుతున్నాడు. వాడికి ఇప్పుడు తిండిపెట్టేవాళ్ళు లేరు. నేను పెట్టినా తినడంలేదు. వాడూ నాలానే, కాకపోతే బయటికి అరుస్తూ కాలుకాలిన పిల్లిలా తిరుగుతుంటాడు. వాడు పిల్లేగా. పిల్లికి విశ్వాసం ఉండదంటారు. వీడేంటి తిండి కూడా తినకుండా విశ్వాసం ప్రకటిస్తున్నాడు! బహుశా వాడిలో ఓ నిజమైన మనిషి ఉండి ఉంటాడు. నాలో పిల్లి అరుపు. నేను విశ్వాసహీనుడినా?

పూర్ణ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎవరున్నారు తనకి?


పది రోజులు కాస్తా తొమ్మిది నెలలైనాయి. రామం కూడా మధ్యలో ఆమెలాగే వెళ్ళి వచ్చాడు. వాడితో పాటు ఒక చిన్న పిల్లిపిల్ల. వాడి పిల్లేనేమో మరి, ముద్దుగా ఉంది. అసలు మగపిల్లులు వాటి పిల్లలను గుర్తుపడతాయా అన్న డౌట్ వచ్చింది. వాటికి పాలుపోస్తున్నా. ఖర్చు పెడుతున్నా. రామం ఎటుతిరిగొచ్చినా వదిలిపోకుండా ఉంటాడు. పిల్లిపిల్ల నా చుట్టూ తిరుగుతుంది. కొంచెం గర్వంగా అనిపించింది. నేను వాటిని పోషిస్తున్నా అని.

ఓ రోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు తలుపు కొట్టిన చప్పుడు. ఎదురుగా పూర్ణ, పెద్ద పొట్టతో. చూడగానే ఆవేశం వచ్చింది. ‘ఇక్కడికెందుకు వచ్చావ్?’ వెక్కిళ్ళు వినపడుతున్నాయి. ఇంత రాత్రప్పుడు వచ్చింది. పిల్లిపిల్ల నా కాళ్ళ చుట్టూ తిరుగుతుంది. పక్కకి తప్పుకున్నా.

కోపంగా ఉంది. రేపొద్దున్నే వెళ్ళిపో అని చెప్పాలనుకున్నా. ఎందుకు కోపం. ఎవరితోనో వెళ్ళింది. ఒంటరిగా కడుపుతో వచ్చింది. ఛీ! సిగ్గులేని జన్మ. అలా అనుకోవడంలో ఏదో తృప్తి ఉన్నా, ఎందుకో చాలా అసంతృప్తి.

పొద్దున నిద్ర లేచేసరికి అదే టీ వాసన. ఎన్నోరోజులుగా మర్చిపోయిన టీ వాసన. రామం అరుపులు వినపడుతున్నాయి సందడిగా. ఇలాంటిదాన్ని ఇంట్లో పెట్టుకుంటే లోకం ఏమనుకుంటుందో ఏమో… లోకం చూడకుండా చేయి పట్టుకోవడం ఫరవాలేదా మరి!

ఈ కడుపెక్కడినుంచి వచ్చింది అని అడుగుదామనుకున్నా. పూర్ణ ముఖంలో వెలుగు వెనుక కనపడే సన్నటి చీకటి ఎలానో అనిపించేది. చూస్తున్నకొద్దీ ఈ అమ్మాయినా నేను పట్టుకుంది అనిపించేది. ఎక్కడెక్కడో తిరిగి దిక్కులేక మళ్ళీ ఇక్కడికి వచ్చింది. దీన్ని నేను ఎందుకు చూడాలి? ప్రశ్నలు ప్రశ్నల దగ్గరే ఆగిపోయాయి. పూర్ణ ఎక్కడికీ పోలేదు. నేను ఊహించనట్టు నాకు ఎదురుపడటం ఎక్కువైంది.

రామం పిల్లిపిల్లని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. రెండు రోజులు వెతికాను. ఎదురుచూశాను. ‘పిల్లులు చచ్చిపోతే తప్ప యజమాని దగ్గరికి రాకుండా ఉండవు’ అంది పూర్ణ. అవును అవి పిల్లులు. అదే మనుషులైతే అవసరం అయితేతప్ప రారు. మాట గొంతులోనే ఆగిపోయింది. అయినా నేను ఎవరికి యజమానిని? ఒకరికి నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చేస్తే వాళ్ళకి యజమాని అవుతానా? ఆమె ఇవ్వలేనిది, పూడ్చలేనిది పూర్ణ, రామం చేసినా వాళ్ళని నావాళ్ళనుకొనేదానికి మనసు ఒప్పుకోదు. వాళ్ళకి దిక్కులేక వచ్చారనే అహం నన్ను తొలుస్తుంటుంది. అవును, ఆ అహమే అన్నిటికి యజమాని.

పూర్ణ అడుగులతో ఇల్లు ఇల్లులా ఉంది. ఖాళీతనమంతా దేనితోనో నిండుతుంది. ఆ గాలిలో ఏదో జీవం. రామం లేని లోటు పెద్దగా తెలియడంలేదు.


“ఈ ఫారం మీద సంతకం చేయండి”

“ఎందుకు?”

“ఆపరేషన్‌కి ఎలాంటి అభ్యంతరం లేదని.”

నేనెందుకు చేయాలి? నేనెవరిని పూర్ణకు? ఈ ప్రశ్నలు ఎవరిని అడగాలి? ఆమె పూర్ణని తెచ్చి నా మీద వదిలివెళ్ళింది. సంతకం చేశా.

“బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్‌కి కబురుచేశాం. అమ్మాయి చాలా బలహీనంగా ఉంది, చిన్నవయసు అనుకుంటా” అంటూ వెళ్ళింది తెల్లటి బట్టల్లో మెరుస్తున్న నర్స్.

అంత చిన్నదా పూర్ణ! నలభై ఏళ్ళ వాడి వైపు చూడలేనంత చిన్నదా? అంత చిన్నది అయితే కడుపు తెచ్చుకొని ఎట్లా వస్తుంది! ఇప్పుడైనా అడగాలి ఈ బిడ్డ ఎవరిదని.

ఏడుపు వినపడింది. కొత్త ఏడుపు, ప్రపంచాన్ని పరిచయం చేసుకొనే ఏడుపు. తెల్లటి బట్టలు వేసుకున్న నర్స్ తెల్లటి బట్టల్లో చుట్టిన బిడ్డను తీసుకొచ్చి నవ్వుతూ చేతుల్లో పెట్టి అంది, “పాప పుట్టింది సర్! అభినందనలు మీకు.” పాప గుప్పిళ్ళు బిగించి ఉంది.

దూరంగా ఎక్కడో రామం పిల్లిపిల్లని తెచ్చి నావైపు చూసి అరిచిన అరుపు వినపడుతుంది. పిల్లిపిల్ల అరిచే సన్నటి అరుపు. పాప ఏడుపు ఆపింది. గుప్పిళ్ళు చిన్నగా విచ్చుకున్నాయి. కళ్ళు చికిలించి వెలుగుని చూస్తుంది. లేత పెదాలపై ఉదయిస్తున్న రహస్య భాషను సంభ్రమంగా చూస్తున్నా. లీలగా ఆమె నవ్వు. ఆమె నవ్వే అది. అవును ఆమె నవ్వే.

“సర్, ఈ ఫామ్‌లో తల్లిదండ్రుల వివరాలు పూర్తిచేయండి” అంది నర్స్ వచ్చి.

జేబులోంచి పెన్ను తీశా.

నిర్ణయాలను కేవలం సమయం మాత్రమే నిర్ణయిస్తుంది.

శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...