అట్రిబ్యూట్

ఇలా ఏదో జరుగుతుందని చాలా రోజుల ముందే అర్థమైంది. మోసమని ఒకరు ఆరోపిస్తే, ఇంకొకరు వాడుకోబడ్డాను మోసం న్యాయమే అన్నారు. మోసం చేయడం న్యాయం ఎలా అయిందని ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజాయితీ, వినయవిధేయతలు పెట్టుబడి పెట్టాక దానికి తగ్గ సరైన రాబడిలేనప్పుడు వెళ్ళిపోవడం మోసం కాదంటుంది నస్రీన్.

ఇప్పుడు నా భవిష్యత్తు రత్నం చేతుల్లో ఉంది. నా భవిష్యత్తు మాత్రమేనా?


తెలివి, మాటకారితనం, కొంచెం స్వార్థం ఉన్న మనిషి రత్నమని అందరికీ సులభంగానే తెలిసిపోయేది. ఎప్పుడూ అతి మేకప్. ఎర్రటి లిప్‌స్టిక్ పెదాల కంటే కొంచం మందంగా దట్టంగా పెట్టేది. కళ్ళకి కాటుకతో పాటు కళ్ళపై అనేక రంగులు వేసేది. తన చామనచాయ రంగు కనిపించకుండా తెల్లగా కనబడాలనే తాపత్రయంతో రకరకాల క్రీములతో ముఖంపై కోటింగ్ వేసుకొనేది. చామనచాయ అందమైన రంగని చెప్పాలనిపించేది. ఎత్తయిన ఎద ఇంకా ఎత్తుగా కనిపించడానికి ఏవో ప్రయత్నాలు చేసేది. నిజానికి రత్నం మేకప్ లేకుండా బావుంటుంది. కానీ ఆ విషయం తనకి తెలియదు, ఎవరూ చెప్పినట్లు లేదు.

రత్నం తన బ్యూటీపార్లర్‌కు, నెలకు ఆరువేల జీతం ఇచ్చేట్లు వాళ్ళ ఇంట్లో ఒప్పందం కుదుర్చుకొని తీసుకొనివచ్చింది పదహారేళ్ళ నస్రీన్‌ను. అందంగా కనిపిస్తుంది. ఎక్కువగా మాట్లాడదు. తక్కువ మాట్లాడటంలో నస్రీన్ వినయవిధేయతలు కనిపించాయి రత్నానికి. మాట్లాడకుండా ఉండటంలో చాలా పనులు జరుగుతాయని తెలిసినా మాట్లాడకుండా ఉండలేని బలహీనులు మనుషులు అనుకుంటా. ఇక్కడికి రకరకాల ఆడవాళ్ళు కస్టమర్లుగా వచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్పే కథల్ని ఒక్క మాట కూడా మాట్లాడకుండా నవ్వుతూ వినేది నస్రీన్. మనుషుల ప్రవర్తన తన చుట్టూ ఉన్న మనుషులను బట్టి మారిపోతా ఉంటదని అనిపించేది తనను చూస్తుంటే. ఒక్కతే ఉన్నప్పుడు చెవులు కనపడకుండా కట్టుకున్న గుడ్డ తీసి పక్కన పడేసేది. పార్లర్‌లో ఉన్న రకరకాల క్రీమ్‌లు, లిప్‌స్టిక్‌లు రాసుకొనేది. పెద్దగా నవ్వుతూ పాటలు పాడేది. మనుషులు ఉన్నప్పుడు ఎప్పుడూ అలా ఉండటం నేను చూడలేదు. ఒక్కసారి కూడా రత్నానికి ఎదురుచెప్పేది కాదు. మనిషి ఎదురు మాట్లాడకుండా ఉండటంలోనే నమ్మకాన్ని కలిగిస్తాడు. అది నస్రీన్ మొదటి పెట్టుబడి అనుకుంటా. తనలాంటి అమ్మాయిని చూడటం మాత్రం నాకిదే మొదటిసారి. మనుషుల్లో ఉన్నప్పుడు ఒకలా, రత్నం ముందు ఒకలా, ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకోలా ఉండేది తన చూపు. నాకు ఒంటరి నస్రీన్ చూపులో ఏదో క్రూరమైన స్వేచ్ఛ కనిపించేది. అప్పటిదాకా మనుషుల తమాషాలు, నటన సరదాగా చూసిన నాకు నస్రీన్ నిశ్శబ్దాన్ని, తన కళ్ళని చూస్తే భయం వేసేది. కాని నా పట్ల తనకెందుకో ఆసక్తి, అది ఎలాంటిదో నాకర్థమయ్యేది కాదు.

తనకు సహాయంగా ఎంతో నమ్మకమైన, సమర్థవంతమైన వ్యక్తి దొరికిన సంబరంతో రత్నానికి రోజులన్నీ ఎంతో బాగున్నట్టు అనిపిస్తున్నాయి. రత్నం ఇప్పుడు చేస్తున్న తప్పు నస్రీన్‌ని ఇంతగా నమ్మడం. వచ్చిన కస్టమర్స్ అందరికీ నస్రీన్ ఎంత నమ్మకమైన మనిషో చెప్పేది కాని తన సామర్థ్యం గురించి చెప్పేది కాదు. అలా ఉండటమే చాతుర్యం అనుకునేది. సామర్థ్యం చెప్పనప్పుడే ఎక్కువ తెలుస్తుందని రత్నానికి తెలీదు.

వీళ్ళద్దరి మధ్య ఇంకొక వ్యక్తి సంతోష్. వాడికి పాతిక సంవత్సరాలుంటాయా? రత్నానికి ఏ రకంగా నమ్మినబంటయ్యాడో తెలీదు కాని రత్నంపై వింతైన అభిమానం చూపించేవాడు. వాడు ఏ పనిచేస్తాడో తెలీదు. రత్నానికి అతనెంత ఎక్కువంటే తన బ్యూటీ పార్లరంతా వాడి సొంత ఆస్తిలా ప్రవర్తించే అధికారం తనకు తెలియకుండానే ఇచ్చేసింది. సంతోష్ అమాయకుడని ఎవరూ అనుకోరు. అతను వేరే ఆడవాళ్ళని పట్టించుకోనట్లు, రత్నానికి అతిప్రాధాన్యత ఇచ్చినట్లు నటిస్తుంటాడు. చూసేవాళ్ళకి అతడితో పరిచయం పెంచుకోవాలనిపించేలా ఉండేవాడు. వాడిలో నాకు నచ్చని విషయం వాడు నాపైన చూపించే చులకన భావం. ఒక్క నాపైనే కాదు, రత్నంతో సహా చాలా వాటిపైన వాడికి చులకన. అప్పుడప్పుడు బయటపడి కనిపిస్తుంటుంది ఆ విషయం. వాడి లోపల సంగతి నస్రీన్ సులభంగానే కనిపెట్టింది. అది నాకు సంతోషంగా అనిపించింది.


రత్నం గమనించేలోపే చాలా విషయాలు జరిగిపోయాయి. అందంగా కనపడటం, ఉండటం, మాట్లాడటం ఇదంతా మనుషులని మచ్చిక చేసుకోవాలంటే అవసరమని నస్రీన్‌కు తెలుసు. ఎవరికి ఏమి కావాలో అది ఇవ్వగలననే నమ్మకాన్ని ఇవ్వడంలో విజయం సాధించింది.

రత్నం కొందరిని చూపించి, వీళ్ళు మనకి చాలా విలువైన కస్టమర్లు, వీళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలని చెప్పేది. రత్నం చాలామంది ముందు ప్రత్యేకంగా ఇలా చెప్పడం నాకు కనిపించేది. రత్నం అలా చెప్పినప్పుడు వాళ్ళముందు నస్రీన్ ‘నాకు అందరు కస్టమర్స్ సమానమే’ అనేది నిజాయితీతో కూడిన అమాయకమైన మొఖం పెట్టి. కానీ ప్రత్యేక వ్యక్తులు అనుకున్నవాళ్ళకు సర్వీస్ చేసేప్పుడు మాత్రం కొంచం ఎక్కువ శ్రద్ధగా చేసేది. మాటల్లో పెట్టి మధ్యలో–‘మీరు అందరిలో ఒకరెలా అవుతారు మేమ్. అయినా అందరినీ సమానంగా చూడాలి, కానీ అరుదుగా కొంతమంది గొప్పగా ప్రత్యేకంగా ఉంటారు. వారిపై తెలీకుండానే ఆ శ్రద్ధ వచ్చేస్తుంది,’ అనేది. కస్టమర్లకు నిజంగానే వాళ్ళు విలువైనవాళ్ళు అనుకునేలా చేసేది. దీని వెనుక ఆ విలువకు తను ఏమి లెక్కకడుతుందో అంచనాకి రావడం మాత్రం కష్టమే అనిపించేది.

కొంతమందితో ‘మీది సహజమైన అందం. ఇలాంటివి చేసుకొనే అవసరమే లేదు’ అని చెప్పేది. విచిత్రంగా వాళ్ళు మాములుగా కంటే ఇంకా ఎక్కువ సర్వీస్‌లు తీసుకొనేవాళ్ళు. వారి అంచనాలకి భిన్నంగా ఉంటూ తెలీకుండా వాళ్ళపైన ఒక ముద్ర వేసేది. నాకు అప్పుడు నస్రీన్ కళ్ళ వెనుక ఉన్న వ్యూహాత్మకమైన నవ్వును చూడాలనిపించేది.

నస్రీన్ డబ్బు దగ్గర అతి నిజాయితీ ప్రదర్శించేది. ‘టిప్స్ వద్దు మామ్ మీ మాట చాలు’ అనేది. ఆ మాటని దేనికి ఉపయోగిస్తుందా అనిపించేది. డబ్బుల విషయంలో కూడా క్రమంగా రత్నం నస్రీన్‌ను నమ్మడం, బ్యాంకు పనులు ఎలా చెయ్యాలో నేర్పి తనకే డబ్బుల పని అప్పగించడం చేసింది. ఇవన్నీ నా కళ్ళ ముందే జరిగేవి. బ్యాంకు నుంచి కొత్తగా కస్టమర్స్ రావడం చూశా. వాళ్ళకి ప్రత్యేకమైన సర్వీసులు ఇచ్చేది నస్రీన్.

కొంతమంది విలువైన కస్టమర్స్ అనుకున్నవాళ్ళ ముందు ఎప్పుడైనా నెమ్మదిగా ఒక మాట అనేది, మేడమ్‌కి మీరు ఎంత ప్రత్యేకమైన వారో అర్థం కాదనో, మేడమ్‌కి ఇలా అందమైన కోటేరుముక్కు ఉన్నవాళ్ళంటే ఇష్టం ఉండదనో, నవ్వుతూ మా మేడమ్ మంచివారే కానీ మీ అంత గొప్ప టేస్ట్ లేదనో… అలా అనేదో లేదో తెలియనట్లు అనేది. అవి ఎవరి ఆలోచనల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో నస్రీన్‌కి ఎలా తెలుస్తుందో ఆలోచిస్తే ఒక రకమైన గగుర్పాటు.

ఇలాంటి నస్రీన్‌కి సంతోష్‌ని డీల్ చేయడం పెద్ద కష్టం కాలేదు. రత్నం లేనప్పుడు చూసి సంతోష్‌ని గొప్పగా చూస్తున్నట్లు ఆరాధిస్తున్నట్లుగా మాట్లాడేది. మీలాంటివారు పక్కనుంటే ఏదైనా సాధించవచ్చు అనేది. అయినా అందరికి మేడమ్ అంత అదృష్టం ఉండొద్దు అనేది నిట్టూరుస్తూ. సంతోష్‌ని ఎక్కడలేని ప్రాధాన్యాన్నీ గౌరవాన్నీ ఇచ్చేది. వాడివల్లే రత్నం పనులు జరుగుతున్నట్లు వాడిపైన వాడికి లేని నమ్మకాన్ని, ఇగోని కల్పించి దానిని సంతృప్తి పర్చడంలో నస్రీన్ సఫలమైంది.

మనుషులు మాటలకి, చిన్నపాటి ఈగో తృప్తికే వారిని వారు గొప్పవాళ్ళుగా బలవంతులుగా ఎలా అనుకుంటారో, వీళ్ళింత బలహీనులేంటి అనిపిస్తది నాకు. ఇవన్నీ అనుకొని చేసిందా లేకా అనుకోకుండా చేసిందా అన్నదాన్లో నాకెలాంటి అనుమానం లేదు. ఇన్నీ జరిగాకా సంతోష్ నస్రీన్ కోసం పనిచేయడానికి రత్నాన్ని పక్కన పెట్టడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టలేదు.

వెళ్ళే ముందు రాత్రి నా ముందే తన ఇంటికి కాల్ చేసింది నస్రీన్. అవతలవాళ్ళు ఏమంటున్నారో నాకు వినపడలేదు. “నా పని చూసి వాళ్ళే సొంత పార్లర్ పెట్టమన్నారు. లోన్ ఇస్తామన్నారు. నా పార్లర్ నేను పెట్టుకోవడం మోసం అవుతుందా? అయినా నేను నా కోసం చేస్తున్నానా? మీ అందరికోసం కదా! ఇప్పుడు నెలకి మీకు ఆరువేలు కాదు రెట్టింపు పంపిస్తాను” అంది. ఇక ఆ వాక్యం వాళ్ళని ఏమీ మాట్లాడనివ్వలేదేమో తాపీగా ఫోన్ పెట్టేసింది నస్రీన్, తనలో తాను నవ్వుకుంటూ. మనుషుల బలహీనతల్ని పట్టేసి ఆట చూస్తున్న నవ్వు అది.

రెండేళ్ళ పెట్టుబడి, యూ గ్లో నస్రీన్ బ్యూటీ పార్లర్. ఒక్కొక్కరుగా కస్టమర్లు నస్రీన్ పార్లర్ వైపు మరలించబడ్డారు. ఎవరికీ ఏమి కావాలో తెలుసు పద్దెనిమిదేళ్ళ నస్రీన్‌కు. రత్నం పార్లర్ కిటికీ నుంచి నస్రీన్ పార్లర్ సందడిగా కనిపిస్తుంది.


సంతోష్ రావడం మానేశాడు. ఫోన్ ఎత్తడంలేదు. రత్నానికి నెమ్మదిగా అర్థమవుతుంది. ఇది మరింత నిరాశలోకి నెట్టినట్లుంది. ముఖంలో ఏదో బాధ. అప్పుడప్పుడు రత్నం నాతో ఒంటరిగా మాట్లాడుతుంది. అప్పుడు మేకప్ వేసుకోదు. అందంగా ఉంటుంది.

ఆ రోజు రాత్రి రత్నం ఇక్కడే ఉంది. అసహనంతో నన్ను బలంగా నెట్టేసింది మొదట. నాకు నస్రీన్‌ని ఇక్కడికి తెచ్చేరోజు, రత్నం ఎవరితోనో మాట్లాడటం గుర్తొచ్చింది. ‘ఊర్లో ఒక మాదిరి పేదరికం ఉన్న కుటుంబంనుంచి అంతగా చదువుకోని కొంచెం హిందీ తెలిసిన అమ్మాయిని పనికి తీసుకొచ్చా. ఆ కుటుంబానికి డబ్బు ఆశ చూపించా. సిటీలో ఉద్యోగంతో పాటు భద్రత కూడా ఇస్తున్నాన్న కృతజ్ఞతతో ఆ అమ్మాయ్ ఇక్కడే పడి ఉంటది’ అని పడిపడి నవ్వుతున్న రత్నం గుర్తొచ్చింది. ఒక మాదిరి పేదరికమా, అదేంటో నాకు సరిగా అర్థంకాలేదు.

కాసేపయ్యాక ఆప్యాయంగా నన్ను పట్టుకొని తడిమింది. “చూశావా! నమ్మిన వాళ్ళు ఎలా మోసం చేస్తారో! మన కస్టమర్స్‌ని లాగేసింది. నా వయసులో సగం లేదు అంత ధైర్యం ఎలా వచ్చింది దానికి!” అంది. కొంచెం సేపు అటు ఇటూ తిరిగి ఏదో ఆలోచించి ఎవరికో ఫోన్లు చేసింది. “దాని పార్లర్ ఎట్లా నడుస్తుందో చూస్తా, వాడి సంగతి కూడా తేలుస్తా” అని అంది. ఆ తరువాత రత్నం ఏం చేసేదో తెలీదు కానీ ఆ రాత్రే నస్రీన్ వంటరిగా వచ్చి రత్నం ముందు చేతులు కట్టుకొని నిలబడింది. అదే మౌనం, అదే వినయం విధేయత. నస్రీన్ అన్ని రోజులు దేనితో విజయం సాధించిందో మళ్ళీ అదే స్ట్రాటజీ. నాకు తెలిసిపోతుంది. రత్నానికి ఇప్పటికైనా ఆ విషయం తెలిసిందో లేదో! కాసేపు అరుపులు కేకలు. తరువాత రత్నం నిశ్శబ్దమైపోయింది. హఠాత్తుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెప్పింది: “నస్రీన్ నీ బ్రతుకు నువ్వు బతుకు. నీ జోలికి రాకుండా ఉండాలంటే నువ్వు నాకు ఒక మాటివ్వాలి. సంతోష్‌ని మాత్రం నీ దగ్గరికి రానివ్వకూడదు, వాడితో నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు.” నస్రీన్ చిన్నగా నవ్వింది. “మేమ్, మీరెంత మంచివారు!” అంటూ రత్నం చేతులు పట్టుకొంది. రత్నం జంకుగా బింకంగా చేతులు విడిపించుకొంది. ఆ జంకు చూస్తుంటే నస్రీన్‌ను అర్థంచేసుకోవడానికి రత్నం భయపడుతోందా? అని ఏ మూలో నాకు అనిపించింది.

మొదటిసారి నస్రీన్ కళ్ళు నిర్మలంగా కనిపించాయి. నాకు తెలుసు రత్నం అడిగినా అడగకపోయినా నస్రీన్ వాడ్ని దగ్గరికి రానివ్వదని. నస్రీన్ వాడ్ని తనవైపు తిప్పుకోవడం తనని తాను సంసిద్దం చేసుకొని రత్నంపై మానసికంగా పైచేయిని సాధించే ప్రయత్నమొక్కటే కాదు. అలా, రత్నానికి ఛాయిస్‌లు ఇవ్వాలి. దానిలో రత్నం సంతోష్‌నే ఎంచుకోవాలి, అనే చివరి వ్యూహం పూర్తి చేసింది నస్రీన్.

రత్నానికి నస్రీన్ పూర్తిగా అర్థమయ్యే తెలివితేటలు లేవేమో కానీ సంతోష్ లాంటివాళ్ళు అర్థం కానంత తెలివితక్కువది కాదు. రత్నం వాడ్ని ఏమి చేస్తుందోనని కుతూహలంగా అనిపించింది. ఒక రకంగా రత్నానికి నస్రీన్ పూర్తిగా అర్థంకాకపోవడమే మంచిదేమో అనిపించింది. నస్రీన్ వెళ్తూ వెళ్తూ వెనక్కి వచ్చి నా మీద చేయి వేసి, “మీ దగ్గర పనిచేసిన గుర్తుగా దీన్ని ఇస్తారా మేమ్?” అని అడిగింది వినయంగా. ఇంత జరిగినా అలా అడిగే ధైర్యానికి ఆశ్చర్యమేసింది. రత్నం ఏదో ఆలోచిస్తూ కిటికీనుంచి బయటకు చూస్తుంది.

నెమ్మదిగా వచ్చి నా పైన కూర్చొని “దీన్ని ఇవ్వలేను నస్రీన్. పార్లర్ కోసం ఎంతో ఇష్టంగా కొన్న మొదటి రివాల్వింగ్ చైర్ ఇది” అంది రత్నం నాతో పాటు తన భవిష్యత్తును కూడా తేల్చుతూ.

రత్నానికి ఒడుపు లేదేమో కానీ బతకడం తెలుసు.


శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...