సంగ్రహము

ఇంట్లో ఎవరూ అమీలాంటి పాప పుడుతుందని ఊహించలేదట. అమ్మమ్మ దృష్టిలో మాత్రం అదో దైవనిర్ణయం. కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా బైబిల్‌ని పట్టుకొని గంటలు గంటలు కూర్చునేది, కానీ అమ్మమ్మ ఆ పుస్తకాన్ని తెరిచి చదవడం నేనెప్పుడూ చూడలేదు. అమీ అమ్మ పొట్టలో ఉన్నప్పుడే నాన్న ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడు. అమీ పుట్టాక అమ్మ బాగా బలహీనపడిపోయింది. అమీకి పాలు ఇవ్వలేని తన ఎండిపోయిన రొమ్ములను బాదుకుని ఏడుస్తూ ఉండేది. ఆ తరువాత కొద్దిరోజులకే అమ్మ కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. అప్పటినుండి అమీ దయ్యంలా మా గుండెలపైన పెద్ద బరువైంది.

అమీలియాని అమీ అని పిలవడం పుట్టడంతోటే మొదలైందనుకుంటా. అప్పుడు నాకు పదిహేనేళ్ళు ఉంటాయేమో! పెద్దతల, చిన్నగా ఉండే కాళ్ళు చేతులు. విచిత్రమైన గోళాల్లా తీక్షణంగా చూస్తున్నట్లు ఉండే కళ్ళు. వాటిలో సృష్టి రహస్యమేదో దాగుందేమో అనిపించేది. అమీ నిద్రపోవడం కాదు కదా, కనీసం కళ్ళు ఆర్పడం అనేది కూడా ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు. ఇక, ఎప్పుడూ ఆకలితో ఉన్నట్లు ఏడ్చే ఏడుపు గురించి చెప్పుకోవాలి. ఆ ఏడుపుతో అమ్మమ్మకి, నాకే కాదు, మా చుట్టుపక్కల ఇళ్ళల్లోవాళ్ళకు కూడా నిద్ర ఉండేది కాదు. క్రమంగా అమీ ఏడుపు ఊరు మొత్తానికి సమస్యగా మారింది. అమీకి మత్తుమందు ఇవ్వమని ఉచిత సలహా పడేసేవాళ్ళు కొంతమంది. ఆ ఏడుపుకి కారణం పుట్టిన దగ్గరనుండి నిద్రపోకపోవడమేనని భూతవైద్యుడు దంతుని పిలుచుకు వచ్చారు ఇంకొందరు. దంతు పామో, తేలో కుడితే మంత్రాలు వేసేవాడు. దయ్యాలు పట్టినా వదిలిస్తాడని, అతడి దగ్గర లేని వైద్యం లేదని ఊరంతా నమ్మేవారు.

అమీ పుట్టడమే శాపంతో పుట్టిందని ఆమెకి దగ్గరగా ఉన్నవారికి కష్టాలు తప్పవని చెప్పుకొచ్చాడు దంతు. అమీ కళ్ళ వెనుక గడ్డకట్టిన కన్నీళ్ళు ఉన్నాయని అవి ఆ పిల్లని నిద్రపోనివ్వట్లేదని తేల్చాడు. అవి కరగాలంటే సొరచేప రక్తపు చుక్కలు కళ్ళలో వేయడమే పరిష్కారమని చెప్పాడు. ఊరిలో వాళ్ళు దంతు చెప్పిన వైద్యం చేయించాలని పట్టుపట్టారు.

అమ్మమ్మకి దంతు ఎప్పుడూ నచ్చడు. అతడు దయలేని వాడని, అతడి మనసు నల్లటిదని అతనికి వైద్యం రాదని తిడుతూ ఉండేది. దంతుతో వైద్యం చేయించే బదులు ఊరికి దూరంగా ఉండటం నయమని ఆలోచించింది. అమ్మమ్మ స్నేహితుడు ఊరవతల ఉన్న చిన్న ఇంటిని ఇవ్వడంతో తాత్కాలికంగా మా సమస్యకి పరిష్కారం దొరికింది. అమ్మమ్మ ఒక్కోసారి రాత్రుళ్ళు అమీ దగ్గర కూర్చొని బైబిల్ ముందు పెట్టుకొని కళ్ళు తుడుచుకుంటూ ఉండేది. విచారంగా ఉన్నప్పుడు ఈ బిడ్డను దేవుడు మరిచిపోయాడని వాపోయేది. సంతోషంగా ఉన్నప్పుడు అమీకంటే దేవుడికి సన్నిహితమైన పిల్లలు ఎవరూ వుండరు అనేది.

నెమ్మదిగా ఒక విషయం అర్థమైంది. అమీకి మనుషులు ఎవరైనా దగ్గరగా వచ్చినప్పుడు నచ్చదని, అదే తన ఏడుపుకి అసలైన కారణమని అనిపించింది. ఎవరూ లేనపుడు అమీ గొంతు వినపడేది కాదు. మొదట్లో అమీని పొద్దుటిపూట చూసుకోవడం అమ్మమ్మ బాధ్యత, రాత్రుళ్ళు చూసుకోవడం నా వంతుగా ఉండేది. అమీని నేను దూరంగా ఉండి గమనించడం నేర్చుకున్నా. ఎంతో అవసరం అయితే తప్ప దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే నేను దగ్గరికి వెళ్ళినా, ఎత్తుకున్నా మరుక్షణమే గుక్కపట్టి ఏడుస్తుందని నాకు తెలుసు.

ఊరికే కూర్చుంటే బతకడం ఎట్లా అని పక్క ఊరి పాస్టర్‌గారింట్లో పనికి కుదిరింది అమ్మమ్మ. ఆయన చాలా మంచివాడని చెప్పేది. అప్పుడప్పుడు వచ్చి అమీ కోసం ప్రార్థన చేసి వెళ్ళేవాడు ఆయన. ఇప్పుడు పగలు కూడా అమీ బాధ్యత నాదే అయ్యింది. క్రమంగా పని ఎక్కువ అయిందని చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయని రెండు మూడు రోజులకి ఒకసారి రావడం మొదలుపెట్టింది అమ్మమ్మ.

అమీ నుంచి తప్పించుకోవడం ఆమెకి బానే ఉందేమో.


ఇంటికి దగ్గర్లో ఒక పెద్ద లోయ ఉండేది. ఆ లోయలో గోపన్న అనే అతడు తన గొర్రెల దాహం తీర్చడానికి కొన్ని సంవత్సరాల తరబడి తవ్వుతూ ఓ వాగునే సృష్టించాడని చెప్పేవారు. ఆ లోయలో గొర్రెలు సురక్షితంగా ఉంటాయని గొర్రెలు కాచేవాళ్ళ నమ్మకం. వేసవి వస్తుందంటే గొర్రెల్ని మందలు మందలుగా లోయలోకి తోలుకెళ్ళేవాళ్ళు. వాళ్ళు రాత్రుళ్ళు పాడే పాటలు సన్నగా లోయ నుండి వినపడేవి. ఆ పాటలు వింటుంటే ఎవరో దేవతలు ఆ లోయనుండి పాడుతున్నారా అనిపించేది. ఆ పాటలు వినపడుతున్నంతసేపు అమీ నిశ్శబ్దంగా ఉండేది. చీకట్లో అమీ కళ్ళనుంచి నీలం కాంతి బయటకు వస్తున్నట్లు మెరుస్తుండేవి.

నిదానంగా అమీని ఎత్తుకొని లోయకి తీసుకెళ్ళేవాడ్ని. ఆ లోయకి వెళ్ళడం ఆ గొర్రెల కాపర్ల దగ్గర కూర్చొని రావడం అలవాటైంది. కానీ అమీ ఏడ్చినప్పుడల్లా గొర్రెలు భయంతో పరుగులుపెట్టేవి. ఆ ఏడుపు ప్రతిధ్వని పెద్ద పులి అరుపులా ఉందని, అమీని తీసుకురావద్దని చెప్పేవాళ్ళు.

వేసవి కూడా వెళ్ళిపోయింది.

అమీ భారం రోజు రోజుకి పెరిగిపోతున్నట్లనిపించేది. మోయలేనితనం వల్లనేమో కోపం కూడా ఎక్కువైపోయింది. దంతు చెప్పిన మాట నిజమే. అమీతోనే కష్టాలు మొదలయ్యాయి. నాన్న, అమ్మ దూరమయ్యారు. స్నేహితులెవ్వరూ లేకుండాపోయారు. ఇంటికి మనుషులు రావడమే మానేశారు. అమ్మమ్మ కూడా ఎప్పుడో ఓ సారి వచ్చి వెళ్ళిపోతుంది. అమీలియా లేకపోతే నా జీవితం బావుంటుందనిపించింది. ఎలా వదిలేయాలి అని ఆలోచించాను.


అమీలియాని తీసుకొని లోయలోకి వెళ్ళాను. గోపన్న వాగు దగ్గరికి చేరుకున్నా. అప్పటివరకు ఆ వాగును అంత దగ్గరగా చూడలేదు. అది మొన్న కురిసిన వర్షాలకేమో నిండుగా ప్రవహిస్తున్నది. చుట్టుపక్కల పచ్చని చెట్లు, రకరకాల పువ్వులు. చిన్న చిన్న పిట్టలు ఎగురుతున్నాయి. ప్రశాంతంగా ఉంది. నేను అక్కడికి చేరుకున్నానో లేదో అమీ ఏడవడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా కలకలం. పక్షులు దిగ్గున లేచి ఎగిరిపోయాయి. లోయలో ఏడుపు ప్రతిధ్వనిస్తుంది. వాగు పక్కన చదునుగా ఉన్న పెద్ద బండరాయి పైన అమీని పడుకోపెట్టా. కొద్దిగా దూరం జరిగి నిలబడ్డా. కాసేపటికి అమీ ఏడుపు ఆపి చూడటం మొదలుపెట్టింది. ఆగకుండా వెనక్కి తిరిగి నడుస్తూనే ఉన్నా. ఇంటికి చేరేటప్పటికి పొద్దుపోయింది. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. చాలా రోజుల తరువాత హాయిగా పడుకున్నా. అర్ధరాత్రి మెలుకువ వచ్చింది. అమీ ఏడుపు వినపడట్లేదు. గాఢమైన నిశ్శబ్దం.

ఉన్నట్లుండి వెక్కిళ్ళు మొదలయ్యాయి. నీళ్ళు తాగినా, ఏమీ చేసినా ఆగటం లేదు. ఆ నిశ్శబ్దంలో వెక్కిళ్ళ శబ్దం వికృతంగా వినిపిస్తుంది. లోపల ఎక్కడో డొక్కలో మొదలై కడుపులోకి, అక్కడి నుంచి గొంతులోకి. ఆ శబ్దాలను వినలేక చెవులు మూసుకున్నా. అది నా లోపలి మూలుగులాగా వినిపిస్తుంది. నా శరీరమంతా వెక్కిళ్ళతో కదిలిపోతోంది. చెమటలు కారిపోతున్నాయి. గుండె భారంగా అనిపించింది. నా లోపల నుంచి ఎవరో అరుస్తూ, ఏడుస్తూ నన్ను కొడుతున్నట్లుగా ఉన్నాయి ఆ వెక్కిళ్ళు. భయం మొదలైంది. భయంతో పాటే అలజడి.

అమీ ఏమై ఉంటుంది? విపరీతమైన దుఃఖం కమ్మేసింది. లేచి పిచ్చి పట్టినట్లుగా లోయ వైపు నడవడం మొదలుపెట్టా. వెళుతున్నకొద్దీ అమీకి ఏమైందోన్నన్న ఆత్రుత. నా వెక్కిళ్ళ శబ్దం తప్ప ఏమీ వినపడట్లేదు. ‘అమీ, అమీ’ పెద్దగా అరుస్తూ పిచ్చి పట్టినట్లు రాత్రంతా లోయలో తిరుగుతూనే ఉన్నా. కనీసం ఆ వాగు ఎక్కడ వుందో కూడా తెలియట్లేదు. అలసిపోయా, ఏడుపు తన్నుకొస్తోంది. గట్టిగా ఏడుస్తూ అక్కడే కూలబడిపోయా. ఎప్పుడు వెక్కిళ్ళు ఆగిపోయాయో, ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలియదు.


గాలిలో తేలుతూ నడుస్తున్నా. వెన్నెల్లో దూరంగా గోపన్నవాగు కనిపిస్తుంది. దగ్గరికి పరిగెత్తా. నిశ్శబ్దంగా వుంది అక్కడంతా. ఆ చదునైన పెద్ద బండమీద అమ్మ కూర్చొని ఉంది. బండ చుట్టూ గొర్రెలు నిలబడి నా వైపే చూస్తున్నట్లనిపించింది. అమ్మ ఒళ్ళో అమీ. అమ్మ అమీ ముఖం వైపే చూస్తూ పాట పాడుతుంది.

ఓ నీలి పాపా
ఆకాశం నుంచి మా కోసం వచ్చావా
చంద్రుడిని అడిగి వెన్నెలతో వచ్చావా
చుక్కలకి చెప్పి చల్లదనం తెచ్చావా
ఎలా ఎగిరి వచ్చావు ఈ అమ్మ ఒడిలోకి
ఎవరి కోసం వచ్చావు ఈ మాయాలోకంకి

గడుసుగా వచ్చే ఓ గండుపిల్లి
గోల చేస్తూ రాకు ఇటు వైపుకి
పాలబుగ్గల అమీ పాప
వెలుగు కళ్ళతో
రంగు రంగుల కలలు కంటూ…”

అమీ నిద్రపోతుంది. నిద్రలో నవ్వుతుంది. అద్భుతమైన నవ్వు. ఎప్పుడూ చూడని నవ్వు. అమీ ముఖం చంద్రుడిని మింగేసినట్లు ప్రకాశవంతంగా ఉంది.

ఒక్కసారిగా ఊళల శబ్దం, ఉలిక్కిపడి నిద్రలేచా. ఎక్కడనుంచి వచ్చాయో తోడేళ్ళు అమీ చుట్టూ. అక్కడ అమ్మ, గొర్రెలు ఏమీ లేవు. అమీ వాటి వైపు చిత్రంగా చూస్తుంది. అమీ తల ఇంకా పెద్దదైంది. కళ్ళు నీలి రంగుతో వెలుగుతున్నాయి. అమీ ముఖంలో సన్నటి జలదరించే నవ్వు. క్రమంగా అది పెరిగిపోతోంది. నవ్వులా లేదు అది, తోడేలు ఊళలా ఉంది. చుట్టూ తోడేళ్ళు అమీతో పాటే ఊళలు పెడుతున్నాయి. వెక్కిళ్ళు మళ్ళీ మొదలయ్యాయి. తోడేళ్ళు నా వైపు తిరిగాయి. వెన్నులోనుంచి సన్నటి చలి పాకి వణికిస్తోంది. వెనక్కి తిరిగి పరిగెత్తాను. ఎలా పరిగెత్తుతున్నానో తెలీదు. వెక్కిళ్ళతో నా డొక్కలు ఎగిరెగిరిపడుతున్నాయి. దారీ తెన్నూ లేదు. లోయ భయకరంగా కనిపిస్తోంది. లోయ లోపలికి పరిగెడుతున్నా. ఏదో రాయి కాలికి బలంగా తగిలింది. బోర్లా పడిపోయా. నిదానంగా పైకి లేచి నిలబడ్డా. ఆ చీకట్లో ఎవరో నా వైపే వస్తున్నారు. ఆ మనిషి శరీరం వంగిపోయి చీకటిని మోస్తున్నట్లు నడుస్తూ దగ్గరగా వచ్చింది. ఆమెని ఎక్కడో చూసినట్లుంది. ఒళ్ళంతా మట్టి కొట్టుకొని ఉన్నది. ఆమె నుంచి ఏదో వాసన. వంటి మీద బట్టలు కనపడటంలేదు. జుట్టు జడలుకట్టి ఉంది. చేతులు ముందుకు చాచింది. ఆమె పొడవాటి గోళ్ళు వంకరలు తిరిగి ఉన్నాయి. వాటితో నా ఛాతీని గట్టిగా పట్టుకుంది. ఒళ్ళు జలదరించింది. అవి గుండెలోకి గుచ్చుకుపోతున్నాయేమో అనిపించింది. గట్టిగా కళ్ళు మూసుకున్నానో లేక ఆ క్షణం నాకేమి అర్థం కావట్లేదో అస్తవ్యస్తంగా అయిపోతున్న స్థితి.

నాకు తెలియకుండానే నేను ఆమెకు సంజాయిషీ చెప్తున్నట్లు, అమీ కనపడటం లేదు అని చెప్తున్నా. నా మాట బయటికి రాలేనంతగా గొంతు పూడుకుపోవడం తెలుస్తోంది.

ఆమె నోరు తెరిచింది. గరగరలాడుతూ ఏదో శబ్దం. “ఎక్కడ, ఎక్కడ వెతుకున్నావు అమీలియాని. నీ లోపలనా బయటనా. నువ్వు తొక్కిపట్టేసిన అమీ నిన్ను విడిచి వెళుతుందా? తొక్కిపట్టేస్తే నీ వెక్కిళ్ళు ఆగుతాయా?” అని కరుకైన కంఠంతో అంటూ నన్ను దూరంగా నెట్టేసి చీకట్లో కలిసిపోయింది. నా శరీరం చల్లగా మంచుముద్దలా మారిపోతోంది. నన్ను నేను కోల్పోతున్నట్లుగా అంతా శూన్యం.


ఎండ చురుక్కుమని చేతికి గుచ్చుకుంది. కళ్ళు తెరిచా. ఇంటి పైకప్పు కనపడుతుంది. అమీ ఏడుపు పక్కన వినపడుతోంది. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నా. రాత్రంతా డొక్కలు ఎగిరిపడ్డట్లు నొప్పిగా ఉంది. నా గుండెల పైన ఎవరో ఒత్తిపట్టిన గుర్తులు.

శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...