నచ్చినట్లు బతకడం లేక ఎలా బ్రతుకుతున్నాడో కూడా తెలీకుండా బ్రతకడం ఈ రెండింటికి మధ్య తేడా ఏంటో అతనికి తెలీదు.
ఆ వాక్యం రాశాక నవ్వొచ్చింది. ఇలా మొదలైన కథ ఎలా మారుతుందో!
రూప మెసేజ్: ఈ రెండు గంటల్లో ఒక వాక్యమైనా రాశావా?
రూప వచ్చే టైమ్ అయ్యింది. లేచి టీ పెట్టి వెనుక వరండాలోకి వచ్చి కూర్చున్నా. రెండో కప్ సిద్ధంగా ఉంచా. రూప వచ్చి ఎదురుగా కూర్చొని మౌనంగా టీ కప్ తీసుకొంది.
“కథ ఏమన్నా సాగిందా రాజా?”
టీ తాగుతూ తన పాదాలు చూడటం ఇష్టం. రోజులో ఆ కొద్దిసేపు కోసం ఎదురు చూస్తా. అవి రూప మూడ్‌ని పట్టిస్తాయనో, లేక తనలోని ఓ స్వేచ్ఛని ప్రకటిస్తాయనో కాదు కాని, ఊరికే అలా తన పాదాల వైపు చూస్తూ టీ తాగడంలో ఏదో ఆనందం ఉంది.
“రాస్తాలే, ఇప్పుడే కదా మొదలైంది.”
“ఒక్క వాక్యం రాశావంటే నీకు కథ అందినట్లే. ఎత్తుగడ బాగా తీసుకో” అంది ఉషారుగా.
కథలు చదవడం, రాసేటప్పుడు వాటి గురించి డిస్కస్ చేయడం రూపకు ఇష్టమైన పనుల్లో కొన్ని. తన ఉత్సాహం చూస్తే ముచ్చటేస్తుంది. అదే సమయంలో భయం కూడా.
“నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ నీకు. ఇక్కడ అంత సీన్ లేదోయ్” నవ్వుతూ అంటూ సిగరెట్ చేతుల్లోకి తీసుకున్నా.
“హేయ్, నా ముందు సిగరెట్ కాల్చకని ఎన్నిసార్లు చెప్పాలి. కావాలంటే మందు తాగు. ఈ పొగ మంచిది కాదు” అంటూ పాదాలు వెనక్కి తీసుకుంది అటెన్షన్‌గా.
“ఈ రాత్రికి వర్షం పడుతుందేమో!”
“సరే మరి, బయలుదేరతా.”
“అప్పుడేనా…”
“వెళ్ళాలి కదా. ఈ రాత్రికి కథని పట్టుకోవాల్సిందే నువ్వు.”
రాసిన వాక్యం కొట్టేసి మళ్ళీ రాయడం మొదలుపెట్టా.
‘బ్రతకడం అంటే మనకి నచ్చినట్లు బ్రతకడం మాత్రమే, లేకుంటే నా దృష్టిలో అది బ్రతుకే కాదు’ షన్నూకి ఫోన్ చేస్తూ అనుకున్నా.
“షన్నూ, రేపొద్దున్నే యాదగిరిగుట్టకి వాళ్ళూ వస్తున్నారు కదా!”
“…”
“నేనా… స్నేహితులతో గుడికనే చెప్పా ఇంట్లో. ఎవరికైనా అనుమానం వస్తుందని కాదు కానీ కనీసం అక్కడవరకైనా నిజం చెపితే మరీ అబద్ధం చెప్పట్లేదు అని నాకు నేను నచ్చచెప్పుకోవడానికి.”
షన్నూ మాటలు రాయాలా వద్దా. కాసేపు ఆలోచించా. షన్నూ వైపు నుండి కథ నడపట్లేదు కాబట్టి అది అనవసరం. కథ ఎటు వైపు నుండి నడిపినా అన్ని వైపుల నుండి పాత్రలను సరిగా చూపించడం రచయితగా నా బాధ్యతనా!? కాకపోవొచ్చు.
రాసేటప్పుడు ఇలాంటి ఆలోచనలు చిరాకు తెప్పిస్తుంటయ్. కొన్నిసార్లు నాలో ఒక పిచ్చివాడు ఉన్నాడేమో అనిపించేది. అప్పుడప్పుడు రూప కూడా అనేది ‘నీ పిచ్చితనమే నాకు నచ్చుతుంది రాజా. దానిలో ఒక నియంత ఉంటాడు. వాడు ఎవడు చెప్పినా వినడు. మహా బలవంతుడు. వాడిని లొంగదీసుకోవడం నీవల్ల కాదు. బహుశా వాడి వల్లేనేమో నీ కథల్లో పాఠకుడి కోసం చేసే మానిప్యులేషన్, మెలోడ్రామా రాయడానికి కష్టపడతావు’ అని. నన్ను సపోర్ట్ చేయడానికి చెప్పే మాటలలాగా అనిపిస్తాయి.
ఎప్పుడూ లేంది, గుడికి వెళ్తున్నానని ఇంట్లో అందరికీ పేరు పేరునా చెప్పి బయలుదేరా.
వెళుతుంటే అమ్మమ్మ వెనక్కి పిలిచింది. ఇష్టం లేకపోయినా వెళ్ళి అమ్మమ్మ పక్కన కూర్చోక తప్పలేదు.
“ఏంటి అమ్మడూ గుడికా, నీకు గుడి అంటేనే విసుగు కదే!” (అమ్మమ్మ ముఖంలో ఆశ్చర్యం.) ముందుకు వంగి మెడలో రాముడి లాకెట్ ఉండే గొలుసుని దగ్గరగా చూసింది. “ఈ గొలుసు వేసుకున్నావా!? అది పోతుందేమో అని భయంతో ఎప్పుడూ బయటికేసుకెళ్ళవు కదే! ఈ రోజు, విశేషమే మరి.” (గొంతులో హాస్యంతో కలిసిన అనుమానం కనిపిస్తుంది.)
ఆమెకి ఏదో తెలిసిపోయింది అనే తొట్రుపాటు నాలో.
“ఏంటి ఇప్పడు నీ ఎంక్వయిరీ నా మీద. తలంటు పోసుకోవడం, గొలుసు వేసుకొని గుడికి వెళ్ళడం నీకు తప్పులాగా అనిపిస్తుందా?” ఊరకే గొంతు పెంచి రచ్చచేయడం ఇష్టం లేదు కానీ నా అసహనాన్ని కప్పిపుచ్చుకొనే అసంబద్ధమైన చిరాకుతో కస్సుమని లేచా.
నా చిరాకుని పట్టించుకోకుండా గుండెలపైన లాకెట్‌ని సరిచేస్తూ మురిపంగా చెప్పింది అమ్మమ్మ “మహీ, నువ్వు మొదటి అడుగు వేసినపుడు మీ తాతతో కొట్లాడి నా చెవిదిద్దులకి ఆరువేలేసి ఈ గొలుసు చేయించా. దోగాడకుండా తొమ్మిదో నెల్లోనే లేచి నేరుగా నడిచేశావు. అందరం ఆశ్చర్యపోయాం తెలుసా అప్పుడు!”
“ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు అమ్మమ్మా. నాకు లేట్ అవుతుంది. నేను వెళ్తా” అంటూ లేచా. తొందరగా వెళ్ళాలనే ఆత్రుత నాలో.
“బయటికెళ్తున్నావు కదా అమ్మడూ, జాగ్రత్తగా ఉండాలి. రోజులు అసలే బాలేవు. ప్రతిదీ ఆలోచించి అడుగెయ్యాలి. నీకు నా తెలివితేటలు వచ్చాయని మురిసిపోతుంది మీ అమ్మ. కానీ నీకు బతకనేర్చే తెలివితేటలు లేవే” అంది బుగ్గలు నిమురుతూ.
అమ్మమ్మ నన్నేదో చదువుతున్నట్లనిపించింది.
ఇంట్లో జరిగే ప్రతి విషయం ఆమె గ్రహిస్తుందని. తొందరగా బయటపడి ఎవరినీ ఒక్క మాట అనదని. ఆమె అత్తగారు, మామగారు పెద్ద నోరు మనుషులని. ఎవ్వరైనా వాళ్ళిద్దరిముందు కుక్కిన పేనుల్లా పడుండాల్సిందేనని. అలాంటి వారిని కూడా అమ్మమ్మ ఎలాంటి పేచీలు పడకుండా తన దారికి తెచ్చుకుందని. అలా అమ్మమ్మ తెలివి, పరిశీలనా శక్తి, లౌక్యం గురించి అమ్మ ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉండేది.
“సరేలే అమ్మమ్మా” అని అక్కడ నుంచి బయలుదేరాను.
“బతకనేర్చడం, కుక్కిన పేనుల్లా… లాంటి ముక్కిపోయిన మాటలు పట్టుకొని ఇంకా వేలాడతావేంటయ్యా రాజా! యాదగిరి గుట్ట, దొంగ పెళ్ళి లాంటి అవుట్‌డేటెడ్ కథలు. వాటిని వదిలేయరాదూ!” ఎడిటర్ సుందరం చేసే వెటకారాలు గుర్తొచ్చాయి.
రూప సుందరంతో అంత క్లోజ్‌గా మూవ్ అవుతుందేంటో. రూపకి చెప్పినా అర్థంకాదు సుందరం తెలివిగా ముగ్గులోకి లాగుతున్నాడని. పోయినవారం రూప సుందరం రూమ్ దాకా వెళ్ళానని చెప్పడంలో నాకేదైనా ఇండికేషన్ ఇస్తుందా. అదే విషయంలో గొడవ పడితే నీపనవ్వడం కోసమే కదా వాడితో అలా మాట్లాడేది అని దబాయించేస్తుంది. నా పనవ్వడం ఏంటి? దానికీ ఇది వాడి రూమ్ దాకా వెళ్ళడానికీ ఏమైనా సంబంధం ఉందా? కొన్ని విషయాల్లో రూప చేసే ఎదురుదాడి తట్టుకోవడం కష్టం. దానికంటే ఆ ఫీలింగ్‌ని నోరుమూసుకొని భరించడమే మంచిది. అయినా రూప అట్లా కనిపిస్తుంది కానీ అట్లాంటిది కాదులే.
మామూలుగా రూప ఈ టైమ్‌కి మెసేజ్ చేయాలి. ఇంకా చేయలేదంటే వాడితో మాట్లాడుతూ ఉంటుందేమో ఫోన్లో.
“ఆడాళ్ళని ప్రేమించు కానీ నమ్మకు” అన్నాడు మొన్న సిటింగ్‌లో డైరెక్టర్ కృష్ణ. ఎందుకన్నాడో, ఎవరిని ఉద్దేశించి అన్నాడో లేదా మామూలుగా అన్నాడో అని ఎంత ఆలోచించినా ఆలోచనలు తెగలా. “ఈ రోజుల్లో పెళ్ళి, పవిత్రత అని మడి కట్టుకొని కూర్చోకు. అవకాశాలు వాడుకో. యూజ్ అండ్ త్రో అంతే. కొంచెం ఈ జనరేషన్‌లా ఆలోచించు.” నలభై ఐదేళ్ళ ఏకాంబరం ముప్ఫైలలో ఉన్న నాకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.
విసుగ్గా అనిపించింది. రాసిందంతా చుట్టి పక్కన పడేశా.
ఈ కాగితాల మీద రాసే అలవాటు మానుకోవాలి. అందరూ లాప్‌టాప్‌లు, సెల్స్‌లో వర్క్ పూర్తి చేసేస్తుంటే నేనేమో ఇంకా పెన్ను పేపర్ ఉంటే తప్ప రాయలేకపోతున్నా.
బయటకు వచ్చా. రాత్రి పదకొండు కావొస్తుంది. బండి తీసి కాసేపు రోడ్‌పై తిరిగి ఓ చిన్న కాఫీ షాప్ ముందు చెక్కబల్లపై ప్రశాంతంగా కాఫీ తాగుతూ సిగరెట్ తాగా.
గదికివచ్చి కథని మార్చి రాయడం మొదలుపెట్టా.
అయినా వీడు ఒక సైకో లాగో, అబ్యూసర్గానో ఉంటే నా పని సులభం అయిపోయేది. నీ మీద నాకు ఇష్టం పోయిందిరా నీతో కలిసుండటం కష్టం, అని ఓ మాట చెప్పి బ్రేకప్ చేసుకుంటే సరిపోయేది. తలంతా దిమ్ముగా ఉంది. ఓ కాఫీ కలుపుకొని, అమ్మమ్మకి కాల్ చేశా. అమ్మమ్మ తెలివితేటలపైన నాకు గట్టి నమ్మకం.
తన సమస్య చెప్పకపోయినా, అది తెలిసినట్లు అమ్మమ్మ ఏదో ఒక సలహా ఇచ్చేస్తుంది.
కాసేపు అవీ ఇవీ మాట్లాడాక, “వచ్చేవారం యాదాద్రికి వెళ్తున్నాం. నీ పేరు మీద మొక్కు ఉంది తీర్చుకోవాలి. నువ్వు వచ్చేయవే. ఎందుకొచ్చిన పాట్లే అక్కడ, ఇక్కడికి మారిపోవచ్చు కదా, అందరికి బావుంటుంది” అంది.
“సరే, చూస్తాలే అమ్మమ్మా” అని ఫోన్ పెట్టేశా.
అదే మంచిదేమో, ప్లేస్ మారితే షన్నూ నుంచి కూడా తప్పించుకోవచ్చు.
“ఇలాంటి స్క్రిప్ట్‌లు జనాలకి నచ్చవయ్యా, నువ్వు కారణం చెప్పకుండా ఇట్లాంటి మాటలు రాస్తే ఎట్లా డ్రమటైజ్ చేస్తారు స్క్రీన్ మీద” అంటాడేమో సుందరం.
ఈసారికి ఇలానే ఇవ్వాలి. ఎలా వస్తే అలా రాయాలి.
కుర్చీని బాల్కనీ లోకి వేసుకొని కూర్చున్నా.
దూరంగా స్ట్రీట్‌లైట్ వెలుతురులో వాచ్‌మన్ వెంకటేశ్ ఉండే రూమ్ కనిపిస్తుంది. ఇక్కడ కూర్చున్నప్పుడల్లా మూడేళ్ళ అతని కొడుకును చూస్తూ ఉండటం ఒక కాలక్షేపం. వాడి జుట్టు ముఖాన్ని కనబడనివ్వదు. అక్కడే పిల్లలందరూ వచ్చి ఆడుకుంటున్నా వాళ్ళతో ఆడినట్లు ఎప్పుడూ కనిపించడు. రెండు వేళ్ళు నోట్లో వేసుకొని గడపమీద కూర్చొని అందరినీ చూస్తూ ఉంటాడు. ఎప్పుడన్నా పక్కనున్న మట్టితో బొమ్మలు చేసి వాటితో ఆడుకొంటాడు. వాటితో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు వాటిని మళ్ళీ మట్టిలో కలిపేస్తాడు. బుడ్డోడు చాలా చిత్రంగా కనిపిస్తాడు.
రూపైనా అంతేనా!
రెండు రోజులైంది కథ జోలికి వెళ్ళి. బలవంతంగా కథ ముందు కూలబడ్డా.
రేపు షన్ను వస్తానన్నాడు.
Before I reveal shall I make love to you? అని అడగాలనుకున్నా. ఆ ప్రశ్న తెలుగులో చెబితే ఎలా ఉంటుందో! ఈ మధ్య అతని టచ్‌ని భరించడం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. అతడు ఈ మార్పుని గ్రహించే ఉంటాడా!? ఇక తనతో అలా ఉండటం నా వల్ల కాకపోవడం నాకే తెలుస్తుంది. ఈ మార్పు అతన్ని మరింతగా ఇరిటేట్ చేస్తున్నట్లుంది. విసిగించడం మరీ ఎక్కువైపోయింది. ప్రేమ పోయాక మనుషుల్ని భరించడం ఎంత కష్టమో!
ఇద్దరు ముగ్గురు ముఖ్యమైన స్నేహితులకి ఫోన్ చేసి ఏదైనా సలహా అడగాలనుకున్నా కాని, ఎవరికి ఎలా చెప్పాలో తెలీలేదు. అందరూ ఏదో రకంగా జడ్జి చేసేవాళ్ళే. అతని పైన ఇష్టం పోవడానికి కారణం తనా లేక నేనా అని ఆలోచించా. కాలం గడుస్తున్న కొద్దీ నా అభిరుచి మారిపోయింది. ఒకప్పుడు నచ్చినవి ఇప్పుడు నచ్చట్లేదు. అంటే ముందు ముందు కూడా ఎవరు నచ్చినా ఇంతేనా!
ఏమో, మార్పు అనేది సహజం. దాన్ని స్వీకరించడం మంచిదనిపించింది.
నాలాంటి స్థిరత్వంలేని మనిషితో జీవించడం ఎవరికైనా కష్టమే! ప్రేమ అనేది నచ్చడానికి బియాండ్ ఉండాలి అంటారు. అసలు ప్రేమ అనేది ఉందా!? ఒక వేళ ఉంటే అది ఒకే మనిషితో శాశ్వతంగా బంధించబడి ఉండాలని శాసించడం ఎలా సరైనదో అర్థంకాలేదు. మన అనిశ్చిత ఉద్వేగాలతో, మన చుట్టూ ఉండే పరిస్థితుల మార్పులతో ప్రేమకేం సంబంధం లేదా!?
హ్మ్, ఇక ఎంత ఆలోచించినా అతనితో కలిసి ఉండటం నా వల్ల కాని పని అని నిశ్చయించుకున్నా.
కథ రాయడం బోరింగ్‌గా అనిపించింది. పాడ్, పెన్ను పక్కన పెట్టా. బుడ్డోడు ఒక్కడే ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని చూస్తున్నాడు. కొంచెం చీకటి పడుతోంది. ఆడుకుంటున్న పిల్లలందరూ వెళ్ళిపోయినట్లున్నారు. వాడి నోట్లో వేళ్ళు లేవు ఇప్పుడు.
బయట బండ్ల హారన్లు వినిపిస్తున్నాయ్. మనుషులు రకరకాలుగా అరుచుకుంటున్నట్లు. ఒరేయ్ నన్ను వెళ్ళనివ్వు. నన్ను తోసుకుంటా ముందుకు వచ్చావు, నీ అంతు చూస్తా. పక్కకి జరగరా, నేను వెళ్తా అన్నట్లు వినిపిస్తున్నాయి. అందులో ఇక్కడ నన్ను గుర్తించండి అనే అందమైన స్కూటీ హారన్ కూడా.
రూప మెసేజ్: నేను ఈ రోజు కలవలేను కొద్దిగా పని ఉంది బయటికి వెళ్తున్నా.
ఎవరి దగ్గరికో వెళ్ళి ఉంటుందా. రెండు రోజుల నుంచి ఇలానే మెసేజ్ చేస్తోంది. దానికి అందగత్తెనని పొగరు.
రూప పరిచయం గుర్తొచ్చింది. ఏడేళ్ళ క్రితం ఏదో సినిమా షూటింగ్లో సిగరెట్ తాగడానికి డబ్బులు లేని రోజుల్లో పరిచయమైంది. సిగరెట్ పెట్టెతో పాటు భోజనం పెట్టించింది. ఈ అమ్మాయికి అందమైన రూపమే కాదు, అందమైన మనసు ఉందని అనిపించింది. అలా మొదలైంది స్నేహం. తనకి రచయితలంటే చాలా గౌరవం అని చెప్పేది. నా మాటలు వింటూ నీకు చాలా భవిష్యత్తు ఉందని చెపుతుండేది. నేను ఈ రంగంలో స్థిరపడటంలో రూప ప్రోత్సాహం చాలానే ఉంది. నేను రచయితగా సెటిల్ అయినా తను మాత్రం ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్‌గానే కొనసాగుతోంది. ఏ రోజుకైనా మంచి డైరెక్టర్ అవుతానోయ్ అంటుంది కాని తన ప్లాన్స్ ఎప్పుడూ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
ఇప్పుడు రూప మీదే కొద్దిగా డౌట్ వస్తుంది. బండచాకిరీ చేస్తుంది కానీ రూపలో రూపం తప్ప తెలివి లేదేమో అని. లేకపోతే ఏడేళ్ళల్లో ఎప్పుడో ఒక సినిమా అయినా డైరెక్ట్ చేసి ఉండాలి. కానీ రూపని కలిస్తే ఈ విషయాలు గుర్తుకు రావు. ఆమె అందం అట్లాంటిది, మాట్లాడనివ్వదు. నేను జూనియర్ని అనే ఫీలింగ్ ఇంకా ఆమెకి ఉండటం వల్లనేమో ఆమె కూడా నా నుంచి ఎలాంటి రికమెండేషన్ ఆశించలేదు. ఇలా కప్పిపుచ్చుకుంటా కాని ఆమె డైరెక్టర్ అయి నన్ను దాటిపోవడాన్ని నేను సహించలేనేమో!?
ఈ రోజన్నా కథ ఓ కొలిక్కి వస్తుందా…
షన్ను మెసేజ్: ఏదో కొత్త రెస్టారెంట్ వచ్చింది. డిన్నర్‌కి అక్కడ కలుద్దాం.
డిన్నర్ అనగానే ఉత్సాహం వచ్చింది. షన్ను ఫుడ్ విషయంలో చాలా ఆలోచిస్తాడు. మంచి ఫుడ్, డిఫరెంట్ టేస్ట్ దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళ్తాడు. తిండి విషయంలో వాడి టేస్ట్ బావుంటుంది. అవన్నీ నాకు తినిపించాలనుకుంటాడు. ఈ విషయంలో మాత్రం భలే ముచ్చటేస్తుంది. కాకపోతే ఇలాంటి డిన్నర్ తరువాత అది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసు. ఈ సారి అక్కడిదాకా పోకుండా జాగ్రత్తపడాలి.
ఇష్టాలు, బ్రేకప్‌లు అన్నీ పక్కన పెట్టి, హుషారుగా లేచా. అనవసరమైన ఈ ఉత్సాహం ఏదో అర్థం కాలేదు. వాడిపైన ఇంకా ప్రేముందా!? కొద్దిగా పల్చగా ఉన్న మైల్డ్ పింక్ కలర్, గ్రే కలర్ కాంబినేషన్ డ్రస్ వేసుకొని రెడీ అయ్యి బయలుదేరా.
వెళ్ళి షన్ను ఎదురుగా కూర్చున్నా.
“ఏంటీరోజు కొత్తగా కనిపిస్తున్నావు” షన్నులో ఉత్సాహం. బహుశా నా విషయంలో అతను ఏదో నిర్ణయించుకున్నట్లున్నాడు.
“నాలో కాదు నీలో ఉంది కొత్తదనం” అంటూ మెనూ చేతిలోకి తీసుకున్నా.
“ఏం తింటావ్?”
“ఈ రోజు గురువారం. నేను నాన్-వెజ్ తినను.”
“మరి సిగరెట్ తాగుతావా?” షన్ను ముఖంలో ఆ పిచ్చి జోక్ తాలుకు దాచుకున్న నవ్వు కనిపిస్తుంది.
“ఎక్కడ కనుక్కున్నావ్ ఈ రెస్టారెంట్?”
వెయిటర్ వచ్చి నిలుచున్నాడు.
టైమ్ తొమ్మిది దాటింది. కథ పక్కన పెట్టి బండి వేసుకొని బయలుదేరా. ఆ వేళప్పుడు నా బండి ఎటువైపు తిరుగుతుందో తెలుసు.
వెంకటేశ్వర బార్. మందు షాపులకి బార్లకి దేవుళ్ళ పేర్లెందుకో, ఇలాంటి పేర్లే కలిసొస్తాయనో లేదా సురాపానం దేవతలకు ఇష్టమనో! వెళ్ళి మూలగా ఉన్న టేబుల్ చూసుకున్నా. బాలు వచ్చాడు. వాడికి తెలుసు నేనేమి తాగుతానో.
“అన్నా, రెగ్యులరా?”
తలూపానో, తలూపా అనుకున్నాడో వెళ్ళి తీసుకొచ్చి టేబుల్ పైన పెడుతూ అన్నాడు “మీరు 90కి మించి వెళ్ళరెప్పుడు, భలే కంట్రోలన్నా మీకు.”
బాలు ముఖంలోకి చూశా, ఇంకా చిన్నపిల్లాడి నీడ కనిపిస్తుంది వాడిలో. నీడేంది, చిన్నపిల్లోడే వీడు. వీడి కళ్ళెప్పుడూ నవ్వుతూ ఉంటాయి. వీడికి తాగుబోతోళ్ళంటే ఎంత ప్రేమ. ‘బాలూ, చదువుకోవాల్సిన టైములో ఇక్కడ ఏంటిరా’ అని కొంచం జ్ఞానం చెప్పాలనుకుంటా ఎప్పుడైనా. ఇప్పటికే ఎంతోమంది చెప్పి ఉంటారు వాడికి ఇట్లాంటివి. ఇక్కడికి వచ్చేదే లోకం నీతులు మర్యాదలు జ్ఞానాలను కాసేపు మర్చిపోదామని. ఇట్లాంటివి ఎందుకనిపించింది.
“నా డ్రైవింగ్‌కి ఇంతకంటే పడకూడదులే బాలూ” అన్నా.
మంచింగ్ తెచ్చిపెట్టి వెళ్ళాడు. రూప గుర్తొచ్చింది. మంచింగ్ చూస్తే రూప గుర్తుకు రావడం కాకతాళీయం. దాని ఫిగర్ గురించి చెప్పే పనిలేదు. ఒక్కసారైనా దారిలో పెట్టాలి.
కృష్ణ మెసేజ్: రాజా, రేపు డిస్కషన్స్ ఒబెరాయ్‌లో వచ్చెయ్. పక్కన కన్ను కొట్టిన ఎమోజి. వీడు ఈ ఎమోజి పెట్టాడంటే లేడీస్ ఉన్నారన్నమాట. చీప్ ఫెలో.
లేచి బండి స్టార్ట్ చేసి రోడ్ పైకి వచ్చా. సన్నటి జల్లుతో వర్షం మొదలైంది. కొద్దిగా వర్షం పడితే చాలు రోడ్లు కనపడి చావవు. స్పీడ్‌గా ఉన్నానేమో మలుపులో సెకనులో పదోవంతులో బండి స్కిడ్ అయ్యింది. తేరుకునేలోపు డివైడర్ని కొట్టుకొని కింద పడింది. రోడ్ పక్కన విసిరేసినట్టు పడిపోయా. డొక్కల్లో రాయి గుచ్చుకున్నట్లు నొప్పి. చేయి గీసుకుపోయి మంటగా ఉంది. నిదానంగా లేచి రోడ్ పక్కన కూర్చున్నా.
ఎక్కడినుంచి వచ్చిందో ఊరకుక్క, అరుస్తుంది కొద్ది దూరంలో నిలబడి. అది ఎందుకు అరుస్తుందో! అది నన్ను ఓదారుస్తోందా లేక భలే పడ్డావురా అని గేలి చేస్తోందా!? చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా కనిపించలేదు. లేచి బండి లేపి, కిక్కు కొట్టా. స్టార్ట్ అయ్యింది. అట్లానే ఇంటికి వచ్చా.
ఫస్ట్ ఎయిడ్ చేసుకొని వేడిగా కాఫీ పెట్టుకొని తాగా. కొంచెం రిలీఫ్‌గా ఏదైనా రాయాలనిపించింది.
వెయిటర్ గమ్మత్తుగా ఉన్నాడు. వాడు మాలాంటి జంటలను వందలమందిని చూసిన అనుభవంతో ‘మీకు టైమ్ కావాలా మేడమ్?’ అని అతి వినయంగా అడుగుతున్నాడు. రెగ్యులర్ కాక్టెయిల్ ఆర్డర్ ఇచ్చా షన్నుని అడగకుండానే. అతనికి తిండి మీదున్న ధ్యాస డ్రింక్స్ మీద ఉండదు. షన్ను చబ్బీగా ఉంటాడు. గడ్డంపైన చిన్న డింపుల్. కళ్ళు కనపడనీయకుండా గ్లాసెస్ పెట్టుకుంటాడు. ఇన్ఫీరియారిటి కాంప్లెక్స్‌ని డబ్బుతో కప్పిపుచ్చుకోవాలనుకుంటాడు.
“ఇల్లు తీసుకుందామనుకుంటున్నా” అన్నాడు హఠాత్తుగా.
“ఓ… అవునా!?”
“మరి మనం ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి కదా!” అసలు విషయంలోకి నేరుగా వచ్చాడు, గ్లాసెస్ తీసి పక్కన పెడుతూ.
సరిగా తిండి కూడా తిననిచ్చేటట్లు లేడు వీడు. ఏంటి వీడితో నా ఫ్యూచర్. వీడి తిండి పిచ్చి, ఇన్ఫీరియారిటీతో చంపేస్తాడు.
“ఏంటి ఏం మాట్లాడవు?” రెట్టించాడు.
వాడు ఇంత నేరుగా ఈ టాపిక్ తెస్తాడనుకోలేదు. అంతకుముందు ఉండే బెరుకు లేదు వాడి కళ్ళలో. ఇది వెళ్ళిపోతుందేమో అనే ఇన్సెక్యూరిటీ కూడా. నా మీద ఆధారపడింది. ఇక ఎక్కడికి పోతుందిలే అనుకుంటున్నాడా? నా గురించి తెలిసే మాట్లాడుతున్నాడా? బ్రేక్-అప్ చెప్పాల్సిన టైమ్‌లో సెటిల్ అవ్వాలంటున్నాడు.
ఆర్డర్ ఇచ్చిన చిల్లీ పన్నీర్, చిల్లీ చికెన్ వచ్చాయి టేబుల్ పైకి. ఈసారి వెయిటర్ ముఖం చూడాలనిపించలేదు. ఈ విషయాన్ని నాన్చడం కంటే సున్నితంగా తేల్చుకోవడమే మంచిది.
“షన్నూ, నాకు బెంగళూర్‌లో సెటిల్ అయ్యే ఆలోచనలు లేవు, అమ్మమ్మ కూడా హైదరాబాద్ వచ్చేయమంటోంది. కాంపస్ చేంజ్ చేయమని రిక్వెస్ట్ చేశా. ఇన్ని రోజులు ఇక్కడ ఉండటానికి ఉన్న ఒకే ఒక కారణం నువ్వు మాత్రమే” అంటూ షన్ను ముఖంలోకి చూశా. తెంపుకొని వెళ్ళేటప్పుడైనా అతడిని బాధపెట్టకూడదనిపించింది.
తింటున్నవాడు దిగ్గున లేచి టేబుల్ పైన రెండు చేతులు ఆనించి నా మీదకు వంగి అన్నాడు. “మరి డిన్నర్‌కి పిలిస్తే సింగారించుకుని వచ్చావ్. రాత్రి కూడా అయ్యాక తెల్లారి చెప్దామనుకున్నావా? తీసుకున్న వాటికి రిగ్రెట్స్ లేకుండా.”
వాడి విసురుకు, డబ్బా నిండా బురద తెచ్చి నాపైన కుమ్మరించినట్లు ఉక్కిరిబిక్కిరయ్యా. మామూలుగా ఇలాంటి పరిస్థితుల్లో కసిగా జవాబిచ్చే నేను ఏం మాట్లాడలేకపోయా. ఎవడైనా నిజాయితీగా బట్టలూడదీసి మాట్లాడితే ఇట్లానే ఉంటుందేమో. డొక్కలో ఎవరో గుచ్చుతున్నట్లు నొప్పి.
“గుడ్ బై షన్నూ, ఇంతకు మించి నీతో మాట్లాడే అవసరం లేకుండా సులభం చేశావ్ నా పని” అంటూ లేచి వచ్చా.
రూప మెసేజ్: ఎక్కడ ఉన్నావ్, అరగంటలో ఉంటా ఇంట్లో.
టైమ్ పదకొండు దాటింది. ఈ టైమ్‌లో రూప… తగిలిన దెబ్బలు చూసుకున్నా. సింపతీ కూడా కలిసి వస్తుందేమో ఈ రోజు. ఉషారుగా అనిపించి లేచి అద్దంలో చూసుకున్నా. బెడ్ పైన తడి టవల్ తీసి ఆరేశాను. దుప్పటి సర్ది పెట్టా.
రూప వచ్చింది. వర్షంలో తడిసినట్లు షర్ట్ అక్కడక్కడ ఒంటికి అంటుకొని ఉంది.
“నా షర్ట్ ఇవ్వనా?” అన్నా చొరవగా. నా వైపు చూసింది. నా కళ్ళలో కనపడ్డ తెగింపుకేమో “వద్దులే ఒక విషయం చెప్పాలని వచ్చాను. ఒక ప్రాజెక్ట్ తగిలింది. బెంగళూరులో. రేపు ఉదయం బయలుదేరాలి. బహుశా ఓ సంవత్సరం ఉండాల్సి ఉంటుందేమో అక్కడ” అంది. “ఓహ్…” నా నోట్లోంచి ఆ శబ్దం మాత్రమే వచ్చింది.
రూప కనీసం నాకు తగిలిన దెబ్బలను చూడలేదు. ఏమైంది అని దగ్గరికి తీసుకోలేదు. వెళ్తున్నందుకు ముఖంలో కనీసం బాధ కూడా లేదు. తను చాలాసార్లు నెమరువేసుకున్నది చెపుతున్నట్లుగా ఉంది. చేప అందినట్లే అంది వెక్కిరించి వెళ్ళిపోతున్నట్లనిపించింది.
“రాజా! ఏంటి మాట్లాడవు” అంది.
“ఏముంది మాట్లాడటానికి నువ్వు ముందే నిర్ణయించుకొని వచ్చావుగా. మంచి బహుమతి ఇచ్చావు నీకు చేసినదానికి.”
రూప లేచింది “నా పని సులభం చేశావ్ రాజా. నీకెన్ని దెబ్బలు తగిలినా బుద్ధి రాదు” ఎగాదిగా సర్కాస్టిక్‌గా చూసి వెళ్ళిపోయింది.
అవి నేను ప్రేమించిన పాదాలేనా!?
ఇంతకీ ఎవరి కథను ఎవరు ముగిస్తారు? ఈ కథకి ఎండింగ్ ఇలా ఉండచ్చంటావా?