ఫ్రాంక్, ది పెయింటర్

నా ఇంటి తలుపు కొడుతున్నారు ఎవరో పొద్దున్నే. కొట్టే పద్దతిలో నాకేదో చెప్పే విషయం ఉన్నట్లు వినపడుతుంది. చిన్నపాటి ఆత్రుతతో తలుపు తీశా.

నాన్సీ.


మొదటిసారి నాన్సీని పార్క్‌లో చూశా.

“ఈ దగ్గరలో పనిచేస్తున్న వెట్ డాక్టర్, పేరు శ్యామ” అంటూ ఫ్రాంక్ నన్ను పరిచయం చేశాడు. చిన్నగా నవ్వాను ఆమె వైపు చూస్తూ. కొద్దిగా ముడుచుకొని ముభావంగా ఉంది ఆ రోజు. తక్కువ మాట్లాడుతుంది. ఎక్కువ గమనిస్తుంది అనిపించింది.

చాలా మాములుగా ఉన్న ఆమె ఫ్రాంక్ లాంటి డైనమిక్ పర్సన్‌కి భార్య అంటే నమ్మడం కొద్దిగా కష్టమే. అదే మాట ఎప్పుడైనా అంటే, ఆమె వల్లే నాకాళ్ళు భూమి మీద అని ఉన్నాయి అని నవ్వుతూ అనేవాడు ఫ్రాంక్.

టర్టిల్ పార్క్ – ఫ్రాంక్, నేనూ రెగ్యులర్‌గా నడిచే ప్లేస్. దాని వల్లే మా స్నేహం బలపడింది.

మొదట్లో అతడి భార్య అతను వేసే బొమ్మలని ఎంత ప్రేమిస్తుందో, ఎలా విమర్శిస్తుందో అనేది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన పిల్లి జె తనచుట్టూ ఎలా తిరుగుతుందో కూడా చెప్పేవాడు. ఆ మాటల వల్ల అతడు బొమ్మలు గీస్తాడని, అతడికో భార్య ఉందని, ఒక పిల్లిని పెంచుకుంటున్నాడని అర్థమైంది. తరువాత తన భార్య, బొమ్మల కంటే పిల్లుల ప్రవర్తన గురించి, వాటి ఇష్టాయిష్టాల గురించే ఎక్కువగా మాట్లాడేవాడు. నేనొక వెట్‌ని అని తెలీడంతో అతడు నాతో స్నేహం చేశాడేమో అనిపించేది కొన్నిసార్లు.

అతడొక పెద్ద సెలబ్రిటీ అని మొదటిసారి అతని ఆర్ట్ ఎక్జిబిషన్ చూశాకనే తెలిసింది. అంతేకాదు, అతని పెయింటింగ్స్ అన్నీ న్యూడ్‌గా ఉన్న ఆడవారివే. దాదాపుగా అవన్నీ వెనక నుంచి గీసినవే. అవి చూశాక, ఎందుకో ఫ్రాంక్‌తో మాట్లాడటం తగ్గిద్దామా అనిపించింది. ఫ్రాంక్ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. మామూలుగా మాట్లాడుతూనే ఉండేవాడు. నేను కూడా నా వాకింగ్ అలవాటును వదలుకోలేదు.

ఫ్రాంక్‌కి బహుశా అరవై ఏళ్ళు ఉంటాయేమో. అతడు ఇటాలియన్, అమెరికన్ తల్లితండ్రులకి పుట్టాడు. అతడనేవాడు ‘నాలో ఇటాలియన్ నన్ను డామినేట్ చేస్తాడు. నేను సౌందర్యాన్ని ఆరాధించినంతగా ఇక దేన్నీ ఆరాధించలేను’ అని.

‘దేని సౌందర్యమైనా దాని ఆత్మలో ఉంటుంది ఫ్రాంక్’ అంటే గట్టిగా నవ్వుతాడు. ‘ఆత్మలో సౌందర్యం, హృదయంలో సౌందర్యం, శరీరంలో సౌందర్యం ఇవన్నీ ఒట్టి మాటలు శ్యామా. సౌందర్యమంటే ఒకటే, అది నీకు సౌందర్యంగా కనపడటం మాత్రమే’ అంటాడు. ‘బ్యూటీ ఈజ్ ఇన్ ది బిహోల్డర్స్ ఐస్ అన్న మాట’ అంటే, ‘కాదు. ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ది బిహోల్డర్స్ లైఫ్, మూడ్, అండ్ ఛాయిస్’ అంటాడు.

అతని పెయింటింగ్స్‌ని వేల డాలర్లు ఇచ్చి కొనుక్కునేవాళ్ళను చూశా. అతడి పెయింటింగ్స్‌లో ఎక్కువ ఆకర్షించే విషయం ఆ నగ్న శరీరాల వెన్ను లోపల నుండి వెలువడుతున్నట్లుగా ఉండే రంగురంగుల గీతలు. అవి బయటికి వస్తున్నాయా లోపలికి పోతున్నాయా అనేది అర్థం కాదు. ఆ గీతల వెనుక పరుచుకుంటున్న సన్నని నల్లని వెలుగు. అదెలా గీస్తాడో! అతని కుంచెకి ప్రాణం ఉందేమో అనిపిస్తుంది. అతడి పెయింటింగ్స్ చూడాలనిపించడంకంటే అంతకు మించినదేదో చెప్తున్నట్లుగా ఉంటాయి. వాటిని చూస్తూ అతనిలో చాలామంది ప్రేమలో పడి ఉంటారేమో అనిపించింది. అదే మాట ఓ సారి అతనితో అన్నా.

“పెయింటర్, పెయింటింగ్ రెండు వేరు వేరు అంశాలు శ్యామా” అన్నాడు.

“అంటే పెయింటింగ్‌లో పెయింటర్ ఉండడా?”

“పెయింటింగ్‌లో ఉండాలనుకుంటే ఏ ఆర్టిస్ట్ కూడా ఆ పెయింటింగ్‌ని పూర్తి చేయలేడు. అలా చేస్తే అతడిక ఆర్టిస్ట్‌గా మిగలలేడు.”

“నువ్వు మోడల్‌లో ఏం చూస్తావు?”

అతడు దానికేం సమాధానం చెప్పలేదు. కాసేపటి తరువాత నిదానంగా అన్నాడు, “ఆర్టిస్ట్‌కి కొన్ని రహస్యాలు ఉంటాయి. అవి చెప్పటానికి రావు. తెలుస్తూ ఉంటాయి లోపల అంతే” అని.

అతనితో జరిగిన ఈ సంభాషణ నన్ను మరింతగా అతని వైపుకి ఆకర్షించింది. చాలాసార్లు అతనితో మాట్లాడటం కోసమే పనికట్టుకొని పార్క్‌కి వెళ్ళేదాన్ని. అతను కూడా నా కంపెనీని ఎంజాయ్ చేస్తున్నాడనిపించేది.

అతనితో పరిచయమైన చాలాకాలం తరువాత అతని ఇంటికి మొదటిసారి వెళ్ళాను. ఒక పురాతనమైన బంగళా. వెలిసిన గోడలు. పాతకాలం నాటి కుర్చీలు, సోఫా. కిటికీలకు వేసిన కర్టన్స్, పైన వేలాడుతున్న షాండ్లియర్ అన్నీ పాతగానే ఉన్నాయి. లోపల అక్కడక్కడ ఫ్రాంక్ వేసిన పెయింటింగ్స్. అతడు డబ్బులకి పెద్దగా విలువనిచ్చే మనిషి కాదని అనిపించింది. అప్పణ్ణుంచి తరచూ వాళ్ళింటికి వెళ్ళడం అలవాటైంది. ఆ ఇంటి పాత వాసన ఏదో నచ్చేదనుకుంటా. నాన్సీ కూడా నన్ను చూసి సంతోషపడినట్లుంది. ఆ ఇంటికి పెద్దగా ఎవరూ రారేమో. ఫ్రాంకే ఎవరినీ రానివ్వడేమో.

అలా క్రమంగా నాన్సీతో కూడా నా స్నేహం కొనసాగింది. అతడు చెప్పే పిల్లి జె నాకు ఎప్పుడూ కనిపించలేదు.

అదే విషయం నాన్సీని అడిగితే ఆమె వాళ్ళ బెడ్‌రూమ్‌లో ఉన్న కిటికీ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ కిటికీగుండా చూస్తే దూరంగా కొండలు, పెద్ద పెద్ద చెట్లతో అడివి ఉన్నట్లు ఉంది. ఇలాంటి ప్రదేశంలో కిటికీ నుండి అడవి కనిపించడం చాలా సాధారణం. కానీ అక్కడకి ఏదో తెలీని బాట వెళ్తున్నట్లు అనిపించింది. ఆ పిల్లి ఎప్పుడైనా రాత్రుళ్ళు ఈ కిటికీ గుండా వస్తుందని, ఫ్రాంక్ చుట్టూ తిరిగి వెళుతుందని చెప్పింది. నాన్సీ అతని విషయాల్లో అంతగా తలదూర్చకపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించలేదు. ఫ్రాంక్ పెయింటింగ్ స్టూడియో బేస్‌మెంట్‌లో ఉంటుందని, అక్కడికి ఎవరికీ అనుమతి ఉండదని, ఆ పిల్లికి మాత్రం ఉంటుందని హాస్యంగా చెప్పింది. ఎంత హాస్యంగా చెప్పినా ఆమె ఫ్రాంక్‌కి చాలా దూరంలో ఉన్నట్లు అనిపించింది నాకు.

రానురానూ ఫ్రాంక్ కంటే ఆ ఇంట్లో ఎక్కువగా నాన్సీనే నేను కలిసింది.


నాలుగు నెలల క్రితం ఒకసారి ఫ్రాంక్ చెప్పాపెట్టకుండా మొదటిసారి మా ఇంటికి వచ్చాడు. చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఏదైనా మాట్లాడాలని వచ్చాడేమో అనిపించి, “ఫ్రాంక్, నువ్వేదైనా నాతో మాట్లాడొచ్చు. నీ రహస్యం నా లాకర్‌లో భద్రంగా ఉంటుంది” అన్నా నవ్వుతూ. నిజానికి, నేనేమి పెద్దగా రహస్యాలు దాచే మనిషిని కాదు. కాకపోతే అతనితో మాట్లాడించాలనే ఉత్సాహం, అతనేదో పంచుకోకూడని విషయం పంచుకోబోతున్నాడు అన్న ఆత్రుత నాలోపల ఉన్నాయి.

“నాకీమధ్య చూపు, వినికిడి శక్తి బాగా పెరిగిందనిపిస్తుంది. చిన్న చిన్న శబ్దాలు కూడా స్పష్టంగా వింటున్నా, చిన్న చిన్న అక్షరాలు కూడా కనిపిస్తున్నాయి. కళ్ళజోడు అవసరం కూడా లేకుండాపోయింది…”

“మంచిదే కదా. అందరికీ వయసు పెరిగేకొద్ది తగ్గుతాయి. నీకు పెరుగుతున్నాయి” అన్నా.

అతడి కళ్ళు చిత్రంగా అనిపించాయి. ఏదో వెతుకుతున్నట్లు కొద్దిగా కంగారు కళ్ళలో. “మంచిదో కాదో తెలీదు. కానీ ఇది సాధారణమని అనిపించడం లేదు.”

కాసేపు మౌనంగా కూర్చొని, ఉన్నట్లుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత క్రమంగా పార్క్‌కి రావడం తగ్గించాడు. వారంలో మహా అయితే ఒకటి రెండు రోజులు కనిపిస్తున్నాడు. అప్పుడు కూడా కొద్దిగా అలసటగా అస్థిమితంగా అనిపించాడు. ఫ్రాంక్‌లో ఏదో మార్పు కనిపించింది. అతడి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కున్నాను. అన్నీ టెస్టులు చేయించుకోమని తోచిన కొన్ని సలహాలు చెప్పా. ఫ్రాంక్ విన్నట్లుగానే ఉన్నాడు.

ఒక రోజు మా ఇంటి గేటుముందు అటూయిటూ తిరుగుతూ కనిపించాడు. ఫ్రాంక్‌ని ఇంటిలోకి పిలిచి నిలదీశా ఏం జరుగుతోందని. ఎంత తిన్నా ఆకలిగా ఉంటుందని, మనుషులెవరిని నమ్మాలనిపించడంలేదని, నిద్రమాత్రలు వేసుకున్నా నిద్ర పట్టట్లేదని చెప్పాడు. అతడి చర్మం ఎండిపోయినట్లుగా ఉంది. ఎర్రటి వెంట్రుకలు కనిపించాయి. గమనించనట్లు ఉన్నా. అతడి పెయింటింగ్ గురించి అడిగా. అది కూడా సమస్యగా మారిందిప్పుడు. మోడల్స్ ఎవరూ నాదగ్గరికి రావట్లేదు అన్నాడు. ఎందుకని అడిగితే సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు.

ఆ తరువాత ఒకరోజు నాన్సీ వచ్చింది. ఫ్రాంక్‌ని చూస్తే భయంగా ఉందని, రాత్రుళ్ళు నిద్రపోవట్లేదని, అప్పుడప్పుడు రాత్రుళ్ళు బయటికి వెళ్ళి ఊళలు పెడుతున్నాడని, ఈ మధ్య జె కూడా కనపడట్లేదని చెప్పింది.

మోడల్స్ ఎందుకు రావట్లేదని అడిగా. ‘అతడంటే ఎంతో ఇష్టంగా ఉండే మోడల్స్ కూడా అతడు వింతగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. కొంతమంది అతడు కూడా నగ్నంగా మారి వారి పెయింట్ వేస్తున్నాడని, ఇంకొందరు అతడి స్పర్శ భరించలేకుండా ఉందని రావడం మానేశా’రని చెప్పింది.

కాసేపు నిశ్శబ్దం తరువాత, అతడు ఏదో జంతువుగా మారుతున్నట్లు అనుమానంగా ఉందని అంది.


ఒక సాయంత్రం వాళ్ళింటికి వెళ్ళా. తలుపు తడితే తెరుచుకుంది. లోపలికి వెళ్ళా. అక్కడ ఎవరు లేరు. నాన్సీ కాని, ఫ్రాంక్ కానీ ఎక్కడా కనిపించలేదు. ఎప్పటినుండో అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు నెమ్మదిగా బేస్‌మెంట్‌కి వెళ్ళా. ఎప్పటినుంచో ఫ్రాంక్ స్టూడియో చూడాలనే కోరిక. రంగుల వాసన వస్తుంది. నెమ్మదిగా లోపలికి తొంగి చూశా.

అక్కడ ఫ్రాంక్ నగ్నంగా కూర్చోని బొమ్మ గీస్తున్నాడు. అతని వెనుకంతా ఎర్రని పొడవైన దట్టమైన వెంట్రుకలు. లేత నారింజ రంగులో పెయింటింగ్ కొంచెం కొంచెం కనిపిస్తుంది. ఏదో జంతువు తల సగం పూర్తయింది. దాని కళ్ళు అచ్చు ఫ్రాంక్ కళ్ళలా. ఉలిక్కిపడ్డా. నాకు వెక్కిళ్ళు మొదలయ్యాయి. గట్టిగా ఊపిరి బిగబట్టి వెనుకకు వచ్చా.

ఆ రోజు రాత్రి నా తలుపు మీద ఎవరో తడుతున్నట్లు, గీరుతున్నట్లు శబ్దాలు. ఏదో ఊళ. నా కిటికీ నుండి చూశా. సగం మనిషి. సగం జంతువు. ఎవరో తెలుస్తోంది. భయంతో బిగుసుకుపోయా. ఇది నిద్రలో కాదు, నిజమే. ఆ భయాల మధ్య ఎప్పుడు నిద్రపోయానో తెలీదు.

ఇక ఫ్రాంక్ ఇంటికి వెళ్ళడం మానేశా.


ఇప్పుడు నాన్సీ పొద్దున్నే నా కళ్ళ ముందు. అతడు పారిపోయాడు. ఆమె మాటలు తడబడుతున్నాయి. అడివిలోకి పారిపోయాడు అంది. ఆమెని హత్తుకున్నా.

ఫ్రాంక్ అతని పెయింటింగ్ పూర్తి చేశాడా?!

శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...