అజెండా

“వాడు నా పరువు కాపాడాడే అన్నా ససేమిరా అందిరా! నేనంటే లెక్కలేద్దానికి. అదేమనుకుంటే అదే చేస్తది.” మూడో పెగ్గులో ఉన్న శ్రీధర్‌బాబు అసహనంగా అంటున్నాడు.

“కరుణ అంత గట్టిగా చెప్పిందంటే ఏదో బలమైన కారణం ఉందేమో బావా.”

“వాడితో దానికి ముందే పరిచయముందంటావా?”

“అట్లా ఆలోచించకు బావా, కరుణ గురించి…”

“ఏమోరా! ఈ రోజుల్లో ఆడోళ్ళు ఎనకేమి చేస్తున్నారో తెలీట్లేదు. అయినా నేను చెప్పింది చేయకుండా వాడికి ఇంకో పాతిక వేలు ఇచ్చి పంపించేసింది ఇంకెప్పుడు రాకని. ఎందుకంటావ్?”

“వాడిది వాళ్ళూరే కదా! వాడి సంగతి తెలిసుంటుందిలే బావా.”

“వాడి సంగతో తెలుసో, దీని సంగతి తెలుస్తదని చేసిందో!” తూలుతూ అంటున్నాడు శ్రీధర్.

“ఏంటి బావా ఈ మాటలు?”

“మరేందిరా నమ్మాల్సినోడిని నమ్మకుండా…”


“నీలాంటోళ్ళ వల్లే మనుషులకి నమ్మకంపైన నమ్మకం పోవట్లేదు. నీ మంచితనమే నీకు సాయపడుతుందిరా శేషూ.” ఆ సంభాషణలో నాలుగోసారంటున్నాడు రంగ.

శేషుకి చిరాగ్గా ఉంది వాడి మాటలు వింటుంటే. ‘మంచితనమా మట్టిగడ్డా! మంచి అవకాశం జారిపోయిందని నేనేడుస్తుంటే’ అనుకున్నాడు లోపల్లోపల.

“అది సరేకాని మళ్ళీ సిటీకి ఎప్పుడెళ్తున్నావ్?”

“రెండురోజులాగి పోతారా,” అంటూ లేచాడు శేషు.

వెళ్తూ వెళ్తూ ఎదురుగా కనిపించిన చిన్న రాయిని కసిగా తన్నాడు. దుమ్ము లేచింది. దానితో పాటు వేలిమీద గోరు కూడా. ఊహించినట్టు అది తేలిగ్గా లేదు. నేలలో బలంగా ఇరుక్కొనుంది.

ఇంటికి పోవాలనిపించక గుడివైపు నడిచాడు. గుడి ముందు అరుగుమీద శేషు నాయన కూర్చొని ఉన్నాడు. వీడ్ని చూడగానే “శేషా! అమ్మ నీకోసమే చూస్తుందిరా” అన్నాడు లేచి కండువా దులుపుకొని భుజం మీద వేసుకుంటూ. ఎప్పుడూ లేంది వాడి భుజం మీద చేయేసి ముందుకు నడుస్తున్నాడు.

“ఆ డబ్బుతో పెద్ద ఆసామి అప్పు తీరిందిరా శేషా. నువ్వు చేసిన పనికి రెండురూపాయలకి బదులు రూపాయి వడ్డీ తీసుకున్నాడు.” ఆయన ముఖం వెలిగిపోతోంది. శేషు ఏమీ మాట్లాడకపోయేసరికి వాడి వైపు చూశాడు.

“ఏందిరా కోపమొస్తుందా?” అన్నాడు వాడి చెవులు చూసి.

విసుగో చిరాకో కోపమో ఉంటే శేషు చెవులు ఎర్రగా మారతాయి.

“నువ్వు రామచంద్రయ్యగారి అల్లుడిని కాపాడినట్లు కరుణమ్మ చెప్పిందంట. అందుకే వడ్డీ తగ్గించాడు.”

శేషు చెవులు ఇంకొంచం ఎర్రగా మారాయి.

వచ్చి ఇంటి ముందు నులకమంచం పైన కూర్చున్నాడు.

జొన్నరొట్టెల్లోకి వాడికిష్టమైన ఉల్లిగడ్డ కూరేసి తీసుకొచ్చి చేతిలో పెడుతూ అంది వాళ్ళమ్మ, “ఏదో ఒక పని చేసుకు బతుకుతాం, లేకపోతే అడుక్కుతింటాం. ఎవడైనా అట్లా తప్పు మీదేసుకుంటారంట్రా. ఎట్నో వాళ్ళు కాస్తా పట్టించుకోబట్టి బయటపడ్డావ్. ఉన్నోళ్ళు డబ్బులెంతైనా పెట్టి బయటకొస్తరు. నువ్వు ఇట్టా తెచ్చి మాకు డబ్బులియ్యక్కర్లేదు గాని నీ ఉజ్జోగమేదో నువ్వు చేసుకో చాలు.”

ఇన్ని చెప్తున్నా డబ్బుతో వచ్చిన వెసులుబాటు ఇద్దరి ముఖాల్లో కనిపిస్తుంది. వాళ్ళు వాడిపైన చూపిస్తున్న శ్రద్ధా పెరిగింది.

“అమ్మా! ఎంకయ్య మావని కలిసొస్తా” అంటూ బయటికొచ్చాడు.

‘ఈడికి ఆ ఎంకయ్య పిచ్చేందో, ప్రతిదానికి ఆడికాడికి పోతనంటడు. ఆడేమో ఊర్నెలేసి ఎవరినీ దగ్గరికి రానీకుండా బతుకుతడు’ అనుకుందామె వెళుతున్న వాడ్ని చూస్తా.

ఎంకయ్య ఇంటికి గొళ్ళెం పెట్టుంది. ఎక్కడుంటాడో తెలుసు శేషుకి. నేరుగా చెరువు గట్టు దగ్గరకెళ్ళాడు. ఎంకయ్య గట్టున కూర్చొని చుట్ట కాలుస్తున్నాడు. వెళ్ళి పక్కన కూర్చున్నాడు. శేషు వైపు నిశ్శబ్దంగా చూసి మల్లా చెరువు వైపు తలతిప్పాడు. ఎంకయ్య ఏమీ అడగడు కానీ శేషు ప్రతి విషయాన్నీ ఎంకయ్యతో పంచుకుంటాడు. వాడికి ఎంకయ్య మీద ఉన్న గురి ఇంకెవరిమీదా ఉండదు. అందరికంటే తేడాగా ఆలోచిస్తాడు అని గట్టినమ్మకం. ఎంకయ్యకి పెద్ద మంచి పేరేంలేదూర్లో. పెళ్ళాం బిడ్డలెవరూ లేరు. ఎవడికీ ఏ సాయం చేయడు. ఏదీ పట్టించుకోడు. వదినతో ఏదో ఉందని అనుమానించి పొలం కూడా పంచకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు అన్న. చచ్చేముందు తల్లి రాసిన ఇల్లే ఎంకయ్య ఆస్తి. ఏదైనా దొరికిన పని చేస్తుంటాడు. అప్పుడప్పుడు సిటీకి పోయి సినిమాలు చూసొస్తుంటాడు. ఎంకయ్యకి మనుషులంటే పడదని అనుకొనే వాళ్ళందరు.

శేషు వచ్చి ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి “ఏమైంది, ఏదో పోగొట్టుకున్నోడి మాదిరి కూర్చున్నావ్?” అన్నాడు ఎంకయ్య వాడివైపు తలతిప్పి.

“వాళ్ళింట్లొ డ్రైవర్ ఉద్యోగం ఇవ్వకుండా అడ్డంపడింది మాఁవా, రామచంద్రం కూతురు.”

“ఎవర్రా, మన కరుణనా?”

“కరుణనే. నేను పనిచేసే బార్‌కి దాని మొగుడు రోజొచ్చేవాడు. బారు మూసేదాకా తాగుతానే ఉంటాడు. మన ఊరి అల్లుడని ఆయన టేబుల్ని నేనే తీసుకునేటోడ్ని. టిప్పులు బాగిచ్చేవాడు. అప్పుడప్పుడు నేనే ఇంట్లో వదిలొచ్చేవాడ్ని. మొన్న తాగి నడుపుతా పోయి ఎవరినో గుద్దాడు. కేసయ్యింది. నేనే నడిపానని చెప్పి నామీద వేసుకొన్నా దాన్ని.”

ఎంకయ్య అర్థంకానట్టు చూస్తా “ఆళ్ళు అడిగారంట్రా?” అన్నాడు.

“లేదు మాఁవా, నేనే వెళ్ళా. గుద్దినోడు బతికాడులే, కేసు ఏమీ లేకుండా చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నన్ను ఇడిపించారు. ఆళ్ళ పరువు కాపాడానని యాభై వేలు ఇచ్చారు. డబ్బులు వద్దని చెప్పి, వాళ్ళ కార్‌కి డ్రైవర్‌గా పెట్టుకోమన్నా.”

ఎంకయ్య అభావంగా చెరువులోకి చూస్తూ వింటున్నాడు.

“శ్రీధర్ బాబు ఒప్పుకున్నాడు కానీ చివరి నిముషంలో అది ఒప్పుకోలా. ఇంకో పాతిక వేలు కలిపి చేతిలో పెట్టి వెళ్ళమంది.”

శేషు ముఖంలో దాచినా దాగని అశాంతి కనిపిస్తుంది. ఎప్పటినుంచి గమనిస్తుందో నీళ్ళ పాము సర్రున చెరువులోంచి వచ్చి వీళ్ళ ఎదురుగా ఉన్న కప్పని పట్టుకోబోయింది. చివరినిమిషంలో పక్కకి దూకి కప్ప తప్పించుకుంది.

“చూసినావురా శేషు, కప్ప దొరకాలని పాములు కోరుకుంటాయి. తప్పించుకోవాలని కప్పలు కోరుకుంటాయి. తప్పించుకోవడం, దొరికించుకోవడం అనేది వాటికున్న ఒడుపు వల్ల వస్తది. పాము ఒడుపుతో ఇంకో కప్పని దొరికించుకోవచ్చు. కప్ప చురుగ్గా లేనిరోజు ఇంకో పాము నోట్లో పడొచ్చు. సంతోషించు, నీ చిత్తం ఏంటో తెల్సి చేసిందో తెలీక చేసిందో కరుణమ్మ, తెలిసుంటే ఈ డబ్బులు కూడా దక్కేవి కావు.”

“అదేంది మాఁవా?!”

“ఒరే శేషూ, నీటిపాము కప్పని పట్టుకోవచ్చు. కాని ఎండ్రకాయని పట్టుకోవాలనుకుంటే దాని చావు అది తెచ్చుకున్నట్లే!” అన్నాడు పైకి లేస్తూ.

శేషు చెవులు రక్తం లేనట్లు పాలిపోయాయి.


“అయినా కరుణా, ఎందుకు పంపేశావ్ వాడ్ని? మీ ఊరోడే కదా! అడక్కుండానే తప్పు మీదేసుకొని నా పరువు కాపాడాడు. అడిగింది డ్రైవర్‌గా ఉంటానని. ఎలాగూ మనం డ్రైవర్‌ని పెట్టుకుందాం అనుకుంటున్నాం. అంత నమ్మకస్తుడు మనకి దొరుకుతాడంటావా?”

“చూడండీ, అతడు మీ స్నేహితుడో సన్నిహితుడో కాదు. కనీసం మీ దగ్గర జీతగాడు కూడా కాడు. ఇవేవి కాకపోగా మీ బలహీనతల్ని దగ్గరుండి చూసిన మనిషి. మనం అడక్కుండానే అంత పెద్ద సాయం చేశాడంటే అతను సులువుగా నమ్మకాన్ని సంపాదించుకునే మార్గాన్ని ఎంచుకున్నాడు. బలహీనులుగా కనపడుతూ మన బలహీనతలని ఆసరా చేసుకొని అతినమ్మకంగా మనదగ్గర అడుగుపెట్టాలనుకొనే వాళ్ళ వెనుక బలమైన ఆలోచనుంటుంది. ఎందుకో అది మనకి మంచిది కాదనిపించింది.”

“వచ్చి సాయం చేసినోడి గురించి చులకనగా ఆలోచిస్తున్నావేమో నువ్వు.”

“ఆశలు, అవసరాలు పెరిగేకొద్ది అవకాశం దొరికితే మనమైనా మన పరిధులు దాటి వెళ్తాం. అది తప్పుగా కూడా అనిపించదు. అంత అవకాశం అతనికివ్వడం అనవసరమనిపించింది. అందుకే డబ్బులిచ్చి పంపా. అది అతన్ని తక్కువ చేయడం కాదు. మనల్ని మనం సేఫ్ జోన్‌లో ఉంచుకోవడం,” అంది కరుణ ప్రిజ్ లోంచి ఐస్ క్యూబ్స్ తెచ్చి అతని ముందు పెడుతూ.


శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...