అస్తిత్వన్యాయం

బాల్కనీలోనుంచి కిందకి చూశా. దూకాలన్న కోరిక లేదు. కానీ అదాటున నాకు తెలీకుండా పడిపోతే బావుండు. నేను ఉన్నాననే ఉనికి నాకు తెలీకుండా చెదిరిపోవాలనిపిస్తుంది. ఎందుకీ కాంక్ష? ఎవరిని ఏం చేశా? ఎలాంటిదాన్ని నేను?


బాధని అణుచుకున్నట్లు, భారాన్ని మోస్తున్నట్లు, ఎన్నో యుగాలుగా ఎదురుచూపులతో ఆర్ద్రంగా పలవరిస్తున్నట్లు కనపడాలి. హాఁ! అలా నటించాలి. కొంత డ్రామా క్రియేట్ చేయాలి. ఇవన్నీ లేకుండా వుంటే నువ్వొక సాధారణ వ్యక్తివని తీసిపారేస్తారు. ఇంత స్పష్టంగా చెప్పకపోయినా అతను చేసిందంతా ఇదే కదా! చివరకి, నీ అంత ఉన్నతంగా ఉండటం నా వల్లకాదని నిజాయితీగా తేల్చేసి వెళ్ళిపోయాడు.


ఈ కవర్ నా ముందు లేకపోతే అతను నా జీవితంలో ఉన్నాడని గుర్తులేనట్లు గడిపేదాన్ని. అది బావుండేది. ఆ కవర్ గుడారంలోకి తలదూర్చిన ఒంటెలా టేబుల్ మీద వెక్కిరిస్తుంది. వచ్చి వారమైంది. చిరాగ్గా ఉంది. ఏడేళ్ళ తరువాత రామలక్ష్మి రాసిన ఉత్తరం. ‘మధూ, నా పరిస్థితేమి బాగాలేదు. నీతో మాట్లాడాలి. ఇప్పుడు స్థిరంగా నమ్మగలిగే వ్యక్తులు ఎవరూ లేరిక్కడ. ఒక్కసారి రా.’

ఎంత దూరంలో ఉన్నా అవసరాలలో మనుషులు ఎప్పుడూ లేనంత దగ్గరగా కనిపిస్తారు.


నాకన్నా సాధారణంగా ఉండే మూర్తి నుంచి మెసేజ్.

వెళ్ళాలనుకుంటున్నావా రేపు?

వెళ్ళాలా? వద్దా? వెళ్ళాలని లేకపోయినా వెళ్ళాలా? వెళ్ళాలని ఉన్నా మానుకోవాలా? ఏమీ తేలక, ‘ఏమో’ అని రిప్లయ్ ఇచ్చా.

వెళ్ళు మధూ, నీకు కంపెనీ కావాలంటే నేనూ వస్తాను.

ఆ ఉత్సాహం చూసి మూర్తి కంటే చిట్టిని తీసికెళ్ళడం బెటరనిపించింది. అంటే నేను వెళ్ళాలని ఫిక్స్ అయ్యానా? అనుకోవడంలో ఆలోచించడంతో పనేంటి? దానితో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోబడతాయి.

సరే. పొద్దున్న షార్ప్ ఆరుకల్లా బయలుదేరదాం.

ఓకే, నేను ఐదున్నరకల్లా కారుతో అక్కడ ఉంటాను.

కార్ ఎందుకు, బస్సుకి వెళ్దాం.

కార్ నీ కోసం కాదులే, నాకోసం.

మూర్తిని రమ్మనడం అతను ఇచ్చే కంఫర్ట్ కోసమా? అందరిలా ఆలోచిస్తున్నానా? అందరిలా కాదు అంతకంటే సాధారణంగా.

కార్ తీసుకు రావడం గురించి ఎక్కువగా ఆలోచించకు. కార్ బెటరనిపించింది, అంతే.

మూర్తి ఇలా బయట పడేస్తుంటాడు ఆలోచనలనుంచి.

ఏ ఊరు?

మూర్తి ప్రశ్న ఒక్క ఊరి పేరు కోసం మాత్రమే కాదు. ఊరికే అడిగిన ప్రశ్న వెనుక ఎన్నో ప్రశ్నలు. ఎన్నో జవాబుల కోసం ఎదురుచూపు. ప్రతి జవాబు వెనుక ఇంకొన్ని ప్రశ్నలు.

నెల్లికల్. రామలక్ష్మి రమ్మని అడిగింది.

అక్కడ ఈశ్వర్ కూడా ఉంటాడుగా?

అంటే నేను రామలక్ష్మి పేరుతో ఈశ్వర్ కోసం వెళ్తున్నానా? ఏంటి నీ ఉద్దేశ్యం?

నీకు ఈశ్వర్‌ని చూడాలనిపించడం సహజం కదా! ఎందుకు అలా ఫీల్ అవుతావ్?

మూర్తిని ఏదైనా అని బాధపెట్టాలని బలంగా అనిపించింది.

నీ అంత స్ట్రాటజీస్ నాకు ఉండవు మూర్తీ!

మూర్తి సైలెంటైపోయాడు.

నిన్ను తట్టి నువ్వు ఇది అని చెప్పేవాళ్ళంటే ఎందుకో కోపం వస్తుంది. ఎవరైనా నీలోపల కోరిక ఇది అని చెప్పాల్సిన అవసరం ఏంటి? అది బయటకులాగి నువ్వు ఇది అని చూపించేదాన్ని ఏమంటారు? ఎంత అవసరమో అంతవరకే మాట్లాడొచ్చుకదా! మనుషులు అనవసరంగా పరిధిదాటి వస్తారెందుకు?

మనుషుల మధ్య పరిధులు దేశాల మధ్య సరిహద్దులాంటివి. అవి చెరిగిపోతే కాని ఆక్రమణ పూర్తికాదు. అప్పటిదాకా దాడులు జరుగుతూనే ఉంటాయ్.


రోజారంగులో ఉన్న రామలక్ష్మి పాదాలవంక సంభ్రమంగా చూశా.

“మనం రూమ్‌లో కలిసి ఉండాలంటే ఒకరికొకరం మన బలహీనతల్ని నిజాయితీగా చెప్పుకోవాలి.” అన్నా.

“హాఁ సరే. నాకు దొంగతనం చేసే అలవాటుంది. ఎవరి దగ్గరైనా నాకు ఇష్టమైన వస్తువు కన్పించినా, నా దగ్గర లేనివి చూసినా అబద్దాలు చెప్పయినా వాటిని లాక్కోవాలనిపిస్తుంది. అబద్దమాడటం అవసరమైపోయింది. అలవాటు కాదులే. నీ బలహీనతలు ఏంటి?” అంది.

నాకు ఏమి మాట్లాడాలో తోచలేదు, రామలక్ష్మికి ఉన్నంత ధైర్యం నాకు లేదు. తనకున్న తెల్లటి మెరిసే చర్మం, రోజారంగు పాదాలు నాకు కావాలనిపిస్తాయని చెప్పలేకపోయా.

“నేను నా బలహీనతలను చెప్పుకునేంత ధైర్యంలేని పిరికిదాన్ని.” అన్నా.

రామలక్ష్మి నావైపు గొప్పగా చూసి, “నువ్వు నాకు నచ్చావు.” అంది.

“పరిచయమై కనీసం పది నిమిషాలు కాలేదు. నేనేమి తెలుసు నీకు!”

“కొందరు ఏమీ తెలియనక్కర్లేదు, నచ్చేస్తారు అంతే.”

రామలక్ష్మికి నచ్చితే ఎలా ఉంటుందో అర్థమైంది. తను అడగకుండానే నాకు ఎన్నో పనులు చేసిపెట్టేది, చివరికి నా నోట్స్ కూడా రాసిపెట్టేది. మనుషులపై నమ్మకం అలానే కలుగుతుందేమో! మనకి కావాల్సినవి అడక్కుండానే చూసుకునేంత ప్రేమ, స్నేహం, అందులోంచి నమ్మకం. నమ్మకం చాలా పనులను చేయిస్తుంది. నమ్మకం ఉంది కాబట్టి ఎదుటివారిని బలహీన క్షణాలకి గురిచేసి నమ్మకాన్ని పరీక్షించడం. ఈశ్వర్ అంటాడు ‘నువ్వు కావాలని పరీక్షించడం తప్పు. నువ్వేమి చేస్తున్నావో నీకు తెలుసు అని తెలిశాక నేను ఆ పరీక్ష తప్పడానికే నిర్ణయించుకున్నా’ అని.

నమ్మకంతో అలాంటి స్థితిలోకి నెట్టింది రామలక్ష్మిని, అతన్ని కాదు. కాని ఈ విషయం ఈశ్వర్‌కి ఎప్పుడూ చెప్పలేదు. మరి ఈశ్వర్ పైన నాకుంది ఏంటి? నమ్మకమా? కాదు ధీమా. నన్ను అతను ఒదులుకోలేడనే పెద్ద భ్రమ. ఎందుకంత నమ్మకం నాపైన. నేను ప్రేమించడమే ఒక అపురూపం అనుకున్నాడు కదా ఈశ్వర్. నవ్వుతూ ఇష్టంగా పరిచయం చేశా రామలక్ష్మిని. అవసరమైనప్పుడల్లా తనకు కావల్సిన సాయం చేయమని చెప్పా. నేను చేసిందల్లా ఒక చిన్న ఏర్పాటు. బంధాలకి ప్రేమలకి కావాల్సిందల్లా కలిసి ఉండే సమయమేనా? ఏ మనిషితోనైనా అవసరాలకి కలిసి ఉంటే ప్రేమ పుడుతుందా?

కొన్ని రోజులకే రామలక్ష్మి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడటం మానేసింది. ఏదో జరుగుతుందని అర్థమైంది. అనుకున్నట్లే అంతా అయిపోయింది. నా కంటే రామలక్ష్మి అతనికి అసాధారణంగా కనిపించింది. అతని నిజాయితీతో కూడిన ఉన్నతమైన అవకాశవాదం నేను ఏమీ ప్రశ్నించకుండానే అనేక జవాబులను మిగిల్చింది.

వెళ్ళిపోయారు. న్యాయంగా ద్వేషించడానికి, నావైపు నిజాయితీ ఉందని చెప్పుకోడానికి నాకో అవకాశం మిగిల్చి వెళ్ళారు

నమ్మకం దాని సాధారణ స్వభావం ప్రకారం నమ్మించినవాడికంటే నమ్మినవాడికే వేదన మిగిల్చింది.


కారు మెయిన్ రోడ్ దిగి పక్కన మట్టిదారిలోకి తిరిగింది. దుమ్ము రేగుతోంది. ఎత్తుగా తాటిచెట్లు కనిపిస్తున్నాయి. చుట్టూ కొండలు. కాసేపు చిన్న నిశ్శబ్దం గాలిలో. నేను కిటికీ దింపా. ఒక్కసారిగా గాలి వేడిగా చెంపని తాకింది గట్టిగా. ఏదో చిన్నవూరు దాటాం. దారెంట బత్తాయితోటలు. ఊరు దగ్గరవుతున్న కొద్దీ ఏదో భయం. ఏమి వినాల్సి వస్తుందక్కడ? ఈశ్వర్ ఎలా ఉన్నాడో? ఇంతకాలం అతన్ని తలుచుకోకుండా బావుంది కదా నా జీవితం. ఎందుకీ ప్రశ్నలిప్పుడు నాకు?

షేక్ వలీ ఎవరో? అతని ఇంటి అడ్రెస్ ఇచ్చింది రామలక్ష్మి. దర్గా దగ్గరికి వెళ్ళాలి. మూర్తి అడుగుతూ ముందుకు వెళ్ళాడు. దర్గా కనిపించింది. పక్కన కొంచం ఇరుకుగా ఉన్న సందులోకి వెళ్ళాం. మట్టి మిద్దెలా ఉంది ఆ ఇల్లు. దిగి లోపలికి నడిచాం. మధ్యవయసులో ఉన్న ఒకతను ‘నేనేనండీ షేక్ వలీ. రండి లోపలికి’ అన్నాడు మా కోసమే ఎదురు చూస్తున్నట్లు. లోపల నుండి రెండు కుర్చీలు తెచ్చి వేశాడు ‘కూర్చోండి’ అని. ఇబ్బందిగా కూర్చున్నా. ‘మంచినీళ్ళు తాగుతారా?’ అంటూ స్టీలుగ్లాసుతో నీళ్ళు తెచ్చాడు.

“రామలక్ష్మి ఎక్కడ?”

“తోటలో ఉంది, వెళ్దామా?”

ఒకామె లోపల నుంచి బయటికి వచ్చి చూసింది. చేతిలో చెంబుని దూరం నుంచి బకెట్లోకి విసిరేసింది. ‘అందర్ జావ్!’ అన్నాడు. అరుపులా లేదు. ఆర్డర్‌లా ఉంది గొంతు. తలుపు చప్పుడు అశాంతిగా.

అతని బైక్‌ని ఫాలో అయ్యాం. ‘ఎవరితను?’ అన్నాడు మూర్తి. నేనేమి మాట్లాడలేదు.


తోటలో చిన్నగది. ముందు రేకుల షెడ్ వేసుంది. ఎండ తీవ్రంగా ఉన్నట్లు అనిపించింది. కొండగాలి గట్టిగా తాకుతూ వెళ్తుంది. చుట్టూతా తోటలు పచ్చగానే అనిపించాయి. కానీ ఈ తోట నీరులేక ఎండిపోతున్నట్లుగా ఉంది. ఆకులు పండుబారిన రంగు. నీళ్ళు తెస్తున్న రామలక్ష్మి, చూడగానే గబగబా వచ్చి గట్టిగా పట్టుకుంది. “మధూ, నువ్వొస్తావని తెలుసు.” అంది నవ్వుతూ. ఆ నవ్వులో సంతోషం. కళ్ళల్లో ఆశ. మనిషి బాగా నలిగిపోయింది. రోజాపాదాలు మట్టిగొట్టుకు పోయున్నాయి. రా! అంటూ గదిలోకి తీసుకెళ్ళింది. మంచం పైన దుప్పటి పరిచి కూర్చోమంది. మూర్తిని వలీ తోట చూపించడానికి తీసుకెళ్ళాడు. ఇంక ఆగలేకపోయా.

“ఈశ్వర్ ఏడి?”

“వెళ్ళిపోయాడు.” అంది ఎటో చూస్తూ.

“అదేంటి! అసలేమైంది?” అన్నా ఆశ్చర్యంగా.

“ఈశ్వర్ కొన్ని రోజులకే నాతో ఉండలేనని వెళ్ళిపోయాడు.”

రామలక్ష్మినే చూస్తున్నా. ఈశ్వర్ వెళ్ళాడంటే బాధగా లేదు. అలా అని కోపంగా కూడా లేదు. సంతోషంగా ఉందా? ఏమో తెలీదు.

“ఎక్కడికి వెళ్ళాడు?”

“తెలీదు. ఈ గిల్ట్ భరించలేను. ఈ ఖాళీని నేను తీసుకోలేను. ఇక్కడ ఉండాలనిపించట్లేదు అని వెళ్ళిపోయాడు. నేను వలీతో వచ్చా. ఇక్కడే ఉంటున్నా.”

నేనేదో అడగాలనుకునే లోపే “నేనేమి చేయనే? నాకు నచ్చిన దగ్గరికి నేను వచ్చేశాను.” అంది నెమ్మదిగా.

“మరి ఇప్పుడేంటి నీ సమస్య?”

“ఏమీ లేదే. అప్పులు పెరిగిపోయాయి. వలీతో కువైట్ వెళ్ళే అవకాశం వచ్చింది. వలీ పాపని ఇక్కడే వదిలేయమంటున్నాడు.”

“ఈశ్వర్ పాపనా?”

ఏడవడం మొదలుపెట్టింది. “మధూ, ఈ ఒక్క సాయం చేయి. పాపని నువ్వు తీసుకెళ్ళు.”

“అదేంటి, పాపని తీసుకెళ్ళలేకపోతే వెళ్ళడం మానుకో. అతడే వెళ్తాడు కువైట్.”

“నాకు ఛాయిస్ లేదు మధూ.”

“ఛాయిస్ లేకపోవడం ఏంటి? ఏదైనా నువ్వు కోరుకున్నట్లే చేస్తావు కదా! అంటే పాపని వదిలేయాలనుకోవడం కూడా…” నా గొంతులో నాకే తెలీని కర్కశత్వం.

“ఈశ్వర్‌ ఎక్కడున్నాడో కూడా తెలీదు. నువ్వు తప్ప ఇప్పుడు నాకు మరో దారి లేదు మధూ. ఈ ఒక్క సాయం చెయ్యవే.”

నేనేమీ మాట్లాడలేదు.

“ఏ మార్గం లేకపోతే నీకు కబురు చేయమనేవాడు ఈశ్వర్…” అంది మెల్లగా రామలక్ష్మి. అలవాటైన అసాధారణత్వం!

“నేనెందుకు తీసుకెళ్ళాలి? ఏమనుకుంటున్నారు మీరిద్దరూ నన్ను. నాకేమి సంబంధం! అసలు నువ్వేమి అడుగుతున్నావో తెలుసా?” అప్పటివరకు ఎక్కడో అణుచుకున్న కోపం ఒక్కసారి మీదకి వచ్చింది.

“తెలుసు, నా చేతులు కట్టేసి ఉన్నాయి. ఏమవుతుందో తెలీదు. పాపని తీసుకెళ్ళు మధూ. అది క్షేమంగా ఉండాలి. నేను నిన్ను మోసం చేయలేదే. ఈశ్వర్ ఏమీ చెప్పొద్దన్నాడు. భయపడ్డాడు.”

రామలక్ష్మి కళ్ళలో ఏదో చీకటి. అర్థం కాని చీకటి.

“నీకిష్టమయ్యే వెళ్తున్నావా?”

రామలక్ష్మి కళ్ళల్లో భయం కప్పిన చిన్న బిగింపు.

స్వార్థంగా ఉండే తల్లులు ఉండొచ్చు కానీ పిల్లని వదిలించుకోవాలనుకొనే తల్లులు ఉంటారా? పిల్లల్ని వదిలివేయగలదా తల్లి, అంత సులభంగా? తన స్వార్థం తాను చూసుకుంటుందా? లేక ఎటూ పోలేక, తప్పించుకోలేక తప్పనిసరి నిర్ణయమా? ఏదైతేనేమి, లేచి బయటకు వస్తూ “లక్ష్మీ, నేను ఎవరినీ తీసుకెళ్ళలేను, నీకెలాంటి సాయం చేయలేను. నన్ను బలవంతం చేయకు, వదిలేయ్. నేను బయలుదేరతా.’ అన్నా కార్ వైపు నడుస్తూ.

కుక్కొకటి పరిగెత్తుతూ అరుస్తూ వచ్చింది. విచిత్రంగా అది నన్ను చూసి దగ్గరకు వచ్చి తోక ఊపుతూ నిలబడింది.

“ఏంటి, దీనికి నేను తెలుసా?”

“తెలుసు” అంది రామలక్ష్మి.

చెట్టుక్రింద నిలబడ్డ వలి నా వైపు అదోలా చూస్తున్నాడు. పాప కోసం చుట్టూ చూశా. కనపడలేదు. ‘పద మూర్తీ, వెళ్దాం.’ అన్నా.

కార్ స్టార్ట్ చేశాడు మూర్తి. కోపం, కసి అన్నీ తీసేసినట్లు పోయాయి. ఏడుపు తన్నుకొస్తుంది. సీటు వెనక్కివాల్చి విండోవైపు తలతిప్పి కళ్ళు మూసుకున్నా. నాకు నేనంటే అయిష్టమా? ఎన్నిసార్లు ఇలా ప్రశ్నించుకుంటా? ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నా నాకు నాపైన స్వార్ధంతో కూడిన అసహ్యమే సమాధానమవుతుంది. అసలు అసహ్యమంటే ఏంటి? అది ఇష్టం లేకపోవడం కాదు. అంతకు మించింది. నన్ను నేను భరించలేకపోవడానికి కారణం నేనా, తనా లేక అతనా? ఏ మార్గం లేకపోతే నాదగ్గరికి వెళ్ళమన్నాడట. మనుషులు ఈ ఎమోషనల్ డ్రామాలు ఎందుకు ఆడతారు! అవసరం కోసం వీళ్ళు ఏమైనా మాట్లాడతారు. ఇప్పుడు నేను గొప్పదాన్నని ఎవరికి నిరూపించుకోవాలి? ఎవరి జీవితాల్లో కష్టాల్లేవు, ఎవరి కష్టాలకు ఎవరు బాధ్యులు? ఎవరు బతకాలంటే వాళ్ళే పోరాడాలి. ఇప్పుడు సాయం చేయకపోతే నేను స్వార్ధపరురాలుగా మిగిలిపోతానా! అలా అనిపించుకోవడం ఇష్టంలేక ఇష్టం లేని పని కూడా చేయాలా! ఎవడికి కావాలి ఈ మంచితనం? ఇప్పుడు నేనెవరికేమి నిరూపించుకోవాలి? ప్రేమని అతను, స్నేహమని ఆమె నన్ను మోసం చేయలేదా! వీళ్ళకి నేను చేసేదేంటి? మరెందుకు ఇంత బాధ, దుఃఖం?

“ఇప్పటికిప్పుడు నేను గొప్పదాన్నని చెప్పుకోడానికి ఏమీ చేయాలనుకోవట్లేదు. నా జీవితం నేను గడపాలనుకుంటున్నా మూర్తీ.” అన్నా అతని వైపు తిరుగుతూ.

“నువ్వేమి చేయనక్కర్లేదు, ఇందులో నీకెలాంటి ఆబ్లిగేషన్ లేదు, కనీసం మోరల్‌గా కూడా. ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? నీకేమనిపిస్తే అది చేయమ్మా.” మూర్తి గొంతులో ప్రేమ. వలీ అన్ని విషయాలు చెప్పినట్లున్నాడు. ఎప్పుడైనా అంటాడు మూర్తి అలా ‘అమ్మా’ అని. అలా అన్నప్పుడు కోపంగా చూస్తానా, ‘నువ్వు చిట్టీలానే’ అంటాడు ముద్దుగా.


మొన్న చిట్టి ఒకమాట అడిగింది. “టీచర్! నేను డ్రామా అంతా అయిపొయ్యేదాకా స్టేజి మీదే ఉండాలనుకుంటున్నా. నాకు స్టేజి దిగడం ఇష్టం లేదు.”

“అలా అయితే నువ్వు చెట్టులా నటించు.”

“కొమ్మలు, ఆకులు పెట్టుకుని ఉండచ్చు కదా!”

“ఒకటి గుర్తుపెట్టుకో. స్టేజి మీద నువ్వు ఎటూ కదలకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. నవ్వకూడదు. ఏడవకూడదు.”

“అదేమీ ఫన్ కాదు కదా!”

“ఫన్ కాదు కానీ ఎప్పుడూ స్టేజ్ మీదే ఉండొచ్చు, అదేకదా నువ్వడిగింది?”

ఆలోచిస్తూ వెళ్ళిపోయింది. చెట్టులా ఉండటం ఎంత కష్టమో చిట్టి బుర్రకి అర్థమైందో లేదో!


ఈ రంగస్థలం పైన చెట్లలా, పిల్లల్లా, కుక్కల్లా, పిల్లుల్లా ఉండే మనుషులు.

ఎవరికోసం ఏమీ చేయల్సిన అవసరం లేని స్థితిలో ఇప్పుడు ఏమనిపిస్తుంది నాకు? నిజంగా ఏమనిపిస్తుంది? ఏదైనా చేయడం, చేయకపోవడం ఎవరిచేతుల్లో ఉంది? నాచేతుల్లో ఉందా? నిస్సహాయంగా అడుగుతున్న కళ్ళను, అర్థిస్తున్న చేతుల్ని విసిరికొడితే అది మనుషులు వాళ్ళకి వాళ్ళు విధించుకొనే శిక్ష కదా! అదే క్షమించి శిక్షించటానికి మించిన శిక్ష ఉంటుందా ఎదుటివాళ్ళకు?

మెయిన్ రోడ్డు కనిపిస్తుంది.

“మూర్తీ, వెనక్కి తిప్పు.” అన్నా హఠాత్తుగా.

“పోనీలే! మరీ ఎక్కువదూరం పోకుండానే చెప్పావ్!” అన్నాడు నా చేయి పైన చేయి వేసి నవ్వుతూ.

“ఒకవేళ ఇద్దరిని తేవాల్సి వస్తే ఓనర్‌కి చెప్పాలా?”

“ఇద్దరా? ఆలోచించే అంటున్నావా? వదిలించుకోవాలనుకొనే మనుషులు వస్తారా?”

“ఏమో మూర్తీ. వదిలించుకోవడం, వదలబడటం, వెళ్ళిపోవాలనుకోవడం మధ్య సన్నటి గీతలు ఉంటాయనిపిస్తుంది. ఇదీ అని ఎవరినీ నిర్వచించలేము. ఇది కాదని ఎలాను చెప్పలేము. ఎటువైపో తేల్చుకోలేని స్థితిలో తేల్చబడని వైపు ఉండాలేమో!”

“నువ్వేమి మాట్లాడతావో నాకు అర్ధంకాదు కానీ అవసరమైతే ఇల్లు మారుదువులే, అందులో ఏముంది.”

గ్లాస్ కిందకి దింపా. చల్లటి గాలి కళ్ళని తాకింది. బత్తాయి తోటల తీయని వాసన. పడమటకేసి వాలుతున్న సూర్యుడు మబ్బుచాటు చేసుకొని నెమ్మదించినట్లున్నాడు.

కథలనుంచి కథలు ఎప్పటికప్పుడు మొదలవుతుంటాయి.

శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...