శరవణన్‌తో ఈ సంభాషణ జరిగి ఉండకపోతే బహుశా పెరియార్ గురించి గాని చేవా గురించి కానీ తెలిసి ఉండేది కాదు. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి ఉండేవాడిని కాదు. అయినా ఎవరి దగ్గరికైనా వెళ్ళాల్సి ఉంటే ఏదో విధంగా వాళ్ళని చేరతాం అనేది సరసు అత్త.
“బహుశా నిన్నెవ్వరూ అడిగి వుండరు, నీకేం కావాలో.”
“వాళ్ళదేమి తప్పులేదు శరవణన్, నాకేం కావాలో నాకే తెలియదు. ఈ రోజు ఎవరి దగ్గరో ఉండాలనిపిస్తుంది. వాళ్ళు చాలా నచ్చుతారు. ఆ సమయంలో వాళ్ళని చాలా ఇష్టపడతాను. వాళ్ళు లేకుండా నేను ఉండలేననిపిస్తుంది. రెండు రోజుల తరువాత ఇక ఆ మనుషుల పొడే గిట్టదు. ఇదొక్క మనుషుల గురించే కాదు, నా ఇష్టాలు, నేనుండే ప్రాంతాలు, ఇంకా అనేక విషయాల్లో. ప్రతి క్షణం నాకేమి కావాలో అది మారిపోతూ ఉంటుంది. క్రమంగా ఇదెంతగా పెరిగిపోతుందంటే రోజు రోజుకి నాలో విపరీతమైన అశాంతి. నామీద నాకు నమ్మకం సడలిపోతుంది. నేనెక్కడా స్థిరంగా లేకపోవడమే కాదు, నాలో స్థిరత్వం అనేదే లేకుండా పోవడం ఏంటో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడంలేదు.”
“బహుశా నువ్వొక ప్రయాణికుడివేమో!”
“లేదు, నాకు ప్రయాణం చేయాలనో, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాలనో ఉండదు. కొత్త మనుషులను కలవాలనో, కొత్త రుచులు చూడాలనో లాంటి ఆలోచనలు ఏమీ ఉండవు. నిజానికి నాకు ప్రయాణాలంటే చిరాకు. కానీ అదేంటో నేను కదలకుండా ఉండాలనుకున్నా కూడా నన్ను స్థిరంగా ఉండనివ్వకుండా ఏదో జరుగుతుంది నా లోపల.”
సిగరెట్ చివరిదాకా వచ్చింది.
ఆఖరి దమ్ము లాగి అన్నా “ఇదంతా ఎందుకు జరుగుతుందో, నా మనుసును ఇలా ఎవరు మారుస్తున్నారో, ఎందుకు మారుతుందో తెలుసుకోవాలని ఉంది.”
శరవణన్ నవ్వాడు. “ప్రతి మనిషికి ఇలాంటి అశాంతి ఎంతో కొంత ఉండటం సహజమే. మరీ ఇంత ఎక్కువ ఉంది అంటే ఆలోచించాల్సిందే. నువ్వొకసారి పెరియార్‌ను, చేవాను కలవాలి. వాళ్ళు నీ సమస్యకి పరిష్కారం చూపగలరనిపిస్తుంది.”
నా సమస్య కొంతమందికి నవ్వులాట. కొంతమంది శ్రేయోభిలాషుల్లా సలహాలు కూడా ఇచ్చారు. ఇంకొంతమంది వెటకారాలు చేస్తారు ‘ఏంటి, ఈ సారి ఏమైంది’ అని. శరవణన్ మాత్రం ఎప్పుడూ సలహాలు ఇవ్వడం, పెద్దగా తీర్పులు చెప్పడం చేసేవాడు కాదు. అది ఒక్క నా విషయంలోనే కాదు. ఎవరి గురించైనా ఆరా తీసినట్లు కాని, ఎవరికైనా సహాయమో, హానో చేసినట్లు కానీ నేను చూడలేదు. అతను తన కోసం తప్ప ఎవరికీ ఏ పని చేయడు. చాలా స్వార్థపరుడేమోనిపిస్తాడు. మేమిద్దరం పాపులేషన్ బోర్డు స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్లో కొలీగ్స్‌గా పక్కపక్క సీట్లలో ఉండటం వల్ల పరిచయం అయ్యిందే తప్ప పరిచయం పెంచుకోవాల్సినంత గొప్ప మనిషిగా కానీ మంచి స్నేహితుడుగా గానీ ఎప్పుడూ కనిపించలేదు. నా స్వభావానికి మనుషులు విసిగిపోయి దూరంగా ఉండేవాళ్ళు లేదా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ శరవణన్ మాత్రం గుండ్రాయిలా నా పక్కనే ఉన్నాడు తొణక్కుండా బెణక్కుండా. అసలు వేరే వాళ్ళ జీవితం గురించి ఒక్క నిమిషం మాట్లాడకుండా వినకుండా మనుషులు ఎట్లా బతుకుతారో అనిపిస్తుంది శరవణన్‌ని చూస్తే. నా కాబోయే భార్య అనుకున్న నీలిమ కూడా నాతో ఉండలేక అందరి ముందు నన్ను ఛీ కొట్టి పోయేదాకా అతనెప్పుడూ నాతో మాట్లాడలేదు.
ఆ రకంగా శరవణన్ సలహాతో పెరియార్‌ను వెతుక్కుంటా వచ్చా అక్కడికి.
ఎలా వచ్చావు అని అడిగితే నేను ఎంత కష్టపడి వచ్చానో చెప్పాలనుకున్న ఉత్సాహం అంతా నీరుకార్చాడు ముసలాయన. నన్ను అలాంటి ప్రశ్నలేవి అడగలేదు.
“పర్వాలేదు, నువ్వు నన్ను ముసలివాడు అనుకోవచ్చు, నాకు తొంభై ఏళ్ళు” అన్నాడు పెరియార్ ప్రశాంతంగా నా వైపు చూస్తూ.
అదిరిపడ్డా. నేను మనసులో అనుకుంది అతనికి తెలియడమే కాదు, అతనికి తొంభై ఏళ్ళు అనే విషయం కూడా నన్ను ఆశ్చర్యపరిచింది. మహా అయితే డెబ్బై కంటే ఎక్కువ ఉంటాయనిపించలేదు. కాలికి వెండి కడియం ఉంది. మాసిన చొక్కా, క్రింద పంచలాంటిదేదో అడ్డంగా చుట్టాడు. నేల పైన మోకాళ్ళు దగ్గరికి చేసుకొని కూర్చున్నాడు. క్రింద కూర్చోక తప్పలేదు నాకు. అతని ఎదురుగా కూర్చున్నా.
“పైన కూర్చో, పాములు తిరుగుతుంటాయి ఇక్కడ” అన్నాడు.
మాట్లాడకుండా పక్కనే ఉన్న నారతో చేసిన మంచంపై కూర్చున్నా.
“కొంతకాలం క్రితం దాకా ఇక్కడ మనుషుల తాకిడి ఎక్కువగా ఉండేది. ఇప్పుడిక్కడికి ఎవరినీ రానివ్వట్లేదు. ఈ కొండదేవుడు మనుషులను తీసుకురావడానికి అనుమతించడంలేదు. శరవణన్ పంపాడు కాబట్టే నువ్వు ఇక్కడి దాకా రాగలిగావు.”
“శరవణన్ ఎలా తెలుసు?”
“శరవణన్ ఈ కొండజాతి మనిషే. ఇక్కడే పెరిగాడు.”
అతడిక శరవణన్ గురించి ఏమీ మాట్లాడలేదు. లోపలికి వెళ్ళి వేడిగా జావ తీసుకొని వచ్చాడు. “ఇది తాగు. రాత్రికి మనం చాలా దూరం నడవాలి. సత్తువ కావాలి నీకు” అన్నాడు.
జావ కొద్దిగా వగరుగా ఉంది. తాగుతూ ఉంటే దాని రుచి అద్భుతంగా అనిపించింది. ఇంకా తాగాలనిపించింది.
“కడుపు నిండుగా తాగకూడదు. కాసేపు పడుకో” అన్నాడు పెరియార్.
అక్కడ వాతావరణం కొత్తగా ఉంది. అంత ఎండా లేదు చలీ లేదు. అప్పుడప్పుడు చల్లటి గాలి తాకుతోంది. చిన్న శబ్దాలు. గాలితో చెట్లు మాట్లాడుతున్నట్లు. అలాంటివి నేను ఎప్పుడూ వినలేదు. ఎలా నిద్రపోయానో తెలీదు. ఒళ్ళు మరిచి నిద్రపోయా. పెరియార్ లేపుతున్నాడు, అతడి మోటైన భాష వినపడుతుంది.
‘వెలుతురు ఉండగానే వెళ్ళాలి. లేకపోతే చేరుకోలేం’ అని లేపుతున్నాడు. “ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో లోయ వుంది. ఆ లోయలో ఉన్న వాగు దగ్గరకు చేవా వస్తుంది.”
చేవా గురించి అడగాలనిపించింది. అడిగే అవసరం లేకుండా చెపుతూ నడుస్తున్నాడు.
చేవా రెండు నెలల పిల్లగా పెరియార్ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చింది. దాని ఒక దంతం పల్చటి బంగారు రంగులో మెరుస్తూ ఉండింది. అది ఈ కొండదేవుడు ఇచ్చిన బిడ్డ అనుకుని పెంచినట్లు చెప్పుకొచ్చాడు.
“ఆ తెగలో ఎవరైనా చనిపోబోయే ముందు రెండు రోజులు చేవా ఏమీ తినేది కాదు. దాని కళ్ళలోంచి అదేపనిగా నీరు వచ్చేది. వారు చనిపోగానే అది అడవికి వెళ్ళిపోయి మూడు రోజుల తరువాత వచ్చేది. దానిని ఎవరైనా ప్రశ్నలు అడిగితే దాని తొండంతో తలపైన తట్టేది. ఆ ప్రశ్నకి సమాధానం దొరికేదని చెప్పుకునేవారు. కొన్ని రోజులకి దానికి ఏదో శక్తి ఉందని, అది భవిష్యత్తుని చెప్పగలదని నమ్మడం మొదలుపెట్టారు. కొందరు డబ్బులకోసం బయట మనుషులకి చెప్పడం మొదలుపెట్టారు. ఆ రకంగా కొత్త మనుషులు రావడం మొదలైంది. మనుషులు ఎక్కువగా రావడం చేవాకి నచ్చలేదు. అడవిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా కనిపిస్తుంది. దానిని కలవాలంటే నేనే లోయలో ఉన్న వాగు దగ్గరికి వెళ్ళి ఎదురుచూస్తాను. అది అందరినీ కలవదు. కొంతమంది వచ్చి రోజుల తరబడి ఉండేవారు. కనపడక నిరాశగా వెళ్ళిపోయేవారు. కొంతమందికి కనిపించేది కానీ ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయేది. చాలా కొద్దిమందిని మాత్రం అది పలకరిస్తుంది కానీ…” అని ఆగాడు కొంచం సంకోచంగా.
“అదేంటో వింత, అది పలకరించాక వాళ్ళు అడగవలసిన విషయాన్ని వదిలేసుకుంటారు. వాళ్ళు సంతోషంగా తిరిగి వెళ్ళినట్లు కూడా అనిపించేది కాదు. దుఃఖాన్ని మోస్తున్నట్లు జీవిత రహస్యమేదో తెలుసుకున్నట్లు భారంగా వెళ్ళిపోయేవారు. అన్నిటికి సిద్ధమయ్యే వచ్చావు కదా! నీ పేరేంటి” అన్నాడు మధ్యలో.
“శేషు” అన్నా. పేరు విన్నాక పెరియార్ సన్నగా కంపించినట్లు అనిపించింది. “పర్వాలేదులే, నువ్వు శేషువైతే మాత్రం ఏమైంది” అన్నాడు నవ్వుతూ.
నేను అతనికి రెండు అడుగులు వెనుకగా నడుస్తున్నా. సన్నటి సాయంత్రం వెలుతురులో నడుస్తున్నాము. పెరియార్ కాళ్ళకి చెప్పులు లేవు. కానీ వేగంగా నడుస్తున్నాడు. హైకింగ్ షూస్ వేసుకొని అతనితో పోటీపడి నడవడానికి ప్రయత్నిస్తున్నా. చాలా దూరం నడిచినట్లనిపించింది. నెమ్మదిగా లోయలోకి దిగడం మొదలుపెట్టాం. వెలుతురు మసక చీకటికి మారింది. చల్లగా గాలి చుట్టుకుంటోంది. సన్నటి బాట. ఒక్క మనిషి అడుగులు మాత్రమే పట్టేంత బాట. చీకటి మెల్లగా లోయను ఆక్రమించుకుంటోంది. మెల్లగా దిగు అంటున్నాడు పెరియార్. ఎంతో అలవాటైన బాటలో సులభంగా అడుగులు వేస్తున్నాడు. నాకోసం మధ్య మధ్యలో ఆగి వెనక్కి చూస్తున్నాడు. నాకు కాళ్ళ నొప్పులు మొదలయ్యాయి.
“ఇంకా ఎంత దూరం?” అన్నా.
“వచ్చేశాం దగ్గరికి. అలసిపోతే ఆకాశం వైపు చూడు. నక్షత్రాలు నీకు శక్తినిస్తాయి” అన్నాడు.
నవ్వొచ్చింది, నక్షత్రాలు శక్తినివ్వడమేంటి అని. శరవణన్ మాట విని అనవసరంగా ఇక్కడికి వచ్చానా అనిపించింది.
“అనుమానాలు దేనినీ నమ్మనీయవు” అన్నాడు. పెరియార్ నా మైండ్ చదువుతున్నాడు. చేవా కాదు పెరియార్ చెప్తాడేమో నా సంగతి అనుకున్నా.
ఈ ఆలోచనల మధ్య ఎప్పుడు వచ్చామో ఏమో, ఎదురుగా పెద్ద వాగు. సన్నటి నీటి చప్పుడు తప్ప ఏమీ వినపడట్లేదు. పక్కనే ఒక విశాలమైన బండ మీద పెద్ద పెద్ద బండలు ఎవరో పెట్టినట్లు ఏటవాలుగా కలిపి ఉన్నాయి. పెరియార్ దానిపైకి ఎక్కి చేయి ఇచ్చాడు. కష్టపడి ఎక్కాను. అందమైన అద్భుతమైన ప్రదేశాలు తెలుసు కానీ ఇంత ప్రశాంతమైన ప్రదేశం నేనెప్పుడూ చూడలేదు. అక్కడికి మనుషులెవరూ రారేమో. ఎవరూ రాని, చూడని ప్రదేశం.
అంతలో ఎక్కడెక్కడో ఉన్న పక్షులు వచ్చి పెరియార్ చుట్టూ తిరిగి, అతనిపై అలవాటుగా వాలుతున్నాయి. వెళ్ళి వాగులో స్నానం చేసి ఎగిరిపోతున్నాయి. అవి సంగీతం ఏదో పాడుతున్నట్లు సన్నటి సవ్వడి చేస్తున్నాయి. అదంతా చిత్రంగా అనిపించింది.
“ఇది వరకు ఎవరినైనా ఇక్కడికి తీసుకు వచ్చావా?” అన్నా.
“లేదు. ఇక్కడికి ఎవరినీ తీసుకురాలేదు. వాళ్ళు వచ్చిన పనులు, వాళ్ళ కోరికలు వేరు. నీలా వచ్చిన వాళ్ళెవరూ లేరు.”
“చేవా అని పేరెందుకు పెట్టావు?”
“అది నా చిన్ననాటి స్నేహితురాలి పేరు. తను అడవిలో తప్పిపోయింది. మళ్ళీ కనబడలేదు. ఆమే ఇలా ఏనుగులా వచ్చిందనిపించింది. అందుకే ఆ పేరు పెట్టాను.”
లేళ్ళ గుంపొకటి వచ్చి నీళ్ళు తాగి వెళ్ళిపోయింది. కాసేపటికి ఏనుగుల గుంపు వచ్చింది. ‘వాటిలో చేవా లేదు’ అన్నాడు. అవి స్నానం చేసి నీళ్ళలో ఈదులాడి వెళ్ళిపోయాయి. ఆ దృశ్యాలన్నీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి.
“ఇక చేవా రాదేమో!”
పెరియార్ ఏమీ మాట్లాడలేదు. ఆకాశం వైపు చూసి కళ్ళు మూసుకున్నాడు.
ఆకాశం నిండా నక్షత్రాలు. అవి నా వైపే చూస్తున్నట్లనిపించాయి. వాటి నీలపు వెలుగు ఏదో చెప్తుంది. ఒక్కసారిగా నా జీవితం అంతా ఆకాశంలో పరుచుకున్నట్లు కనిపిస్తుంది.
తేనె తుట్టె పైకి రాయి విసిరి, తుమ్మెదలని లేపి అందకుండా పరిగెత్తిన ఎనిమిదేళ్ళ నేను. పారిపోతున్న కుక్కని వెంటబడి కొడుతున్న నేను. నవ్వుతున్న అమ్మమ్మ ముఖం. అన్నింటి చుట్టూ పరిగెత్తకు అని వారిస్తున్న ఆమె కళ్ళు. నా దుఃఖాన్ని తుడిచేందుకు దొరకని ఆమె చీరకొంగు. భుజాలపై ఎత్తుకు తిరిగిన రాములు. అతను పాడిన పాట. పూడుకు పోయిన అతని గొంతు. అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిన తండ్రి. అతను లేని జీవితపు ఆనందంలో తేలియాడిన తల్లి. దుఃఖాన్ని వదిలించుకొని పారిపోతున్న నేను. పరిగెడుతూనే ఉన్నా. నాకు దుఃఖం వద్దు. దుఃఖం లేని శాంతి కావాలి. మరిప్పుడు పెల్లుబుకుతున్న ప్రశాంతతలో పొర్లి వస్తున్న దుఃఖం. శరవణన్ నవ్వట్లేదు. నా వైపు దయగా చూస్తూ ఆకాశంలోకి నడుస్తున్నాడు. అతని ముందు పెరియార్, చేవా.
నాకెప్పుడు నిద్రపట్టిందో తెలియలేదు.
నీళ్ళు చిలకరిస్తున్న శబ్దం. వాగులో పల్చటి బంగారు వర్ణపు దంతం ఉన్న చిన్న ఏనుగు చేవా. దానితో ఎవరో పదేళ్ళ పిల్లవాడు, పెరియార్‌లా ఉన్నాడు. ఇద్దరు నీళ్ళలో మునిగి తేలాడుతున్నారు, ఆడుతున్నారు. వారి ముఖాల్లో వెలుగు ఏ చిత్రకారుడూ బంధించలేని అందమైన దృశ్యంలా ఉంది. చెట్లకు ఆకులు ఉన్నంత సహజంగా ఉన్నారు. తొంభై ఏళ్ళ ముసలివాడు పదేళ్ళ పిల్లవాడయ్యాడు. మరి బంగారు దంతపు చేవా ఎవరు? ఏనుగేనా? దేవుడా!? నిజంగా దానికి శక్తులు ఉన్నాయా!? అయినా ఈ శక్తుల అవసరం ఎందుకు వారికి? సంతోషం, సుఖం, దుఃఖం, చీకటి, కాంతి వంటివేవి పట్టనివాళ్ళు, ఆశించనివాళ్ళు. వాళ్ళకి ఇవేమి అవసరం లేదు. వాళ్ళు ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు. వాళ్ళకి వాళ్ళను మిగుల్చుకున్నారు.
ఆసరా కోసం ఆకాశం వైపు చూశా. ఎప్పుడు చూడనన్ని నక్షత్రాలు నాతో పాటు అవి వాళ్ళను చూస్తున్నట్లున్నాయి.
కళ్ళు మూసుకున్నా. ఎవరినీ కదిలించాలనిపించలేదు. చేవాని పిలవాలనిపించలేదు. దేన్నీ వినాలనిపించలేదు. ఎటూ వెళ్ళాలనిపించలేదు. అస్థిమితానికి స్థిమితానికి కారణాలు వెతకాలనిపించలేదు. మరణం, జీవితం రహస్యాలవ్వనీ కాకపోనీ.
ఎవరో నన్ను హత్తుకున్న స్పర్శ.
నిజమో! కలో! భ్రాంతో! తెలీదు.