“పదమూడో ముక్క చాల్రాజా, అది దొరక్కపోతే నీ ఆట పూర్తవ్వదు. ఏమైందిరా రూప సంగతి?”
“అయినా టైం బొక్క తప్పితే ఎందుకురా వెళ్ళిపోయిందాని గురించి.”
“వెళ్ళిపోయిందని వదిలేస్తామా మావా?”
“ఓ మంచి ముక్కెయ్యరాదూ, లైఫ్ లేదు. విస్సుగాడు ఆట చూయించాడంటే ఫుల్కౌంట్.”
“ఒరే బావా, ఉన్న ముక్క నీకేస్తే, నేనేమి ఆడాల్రా. లైఫున్నా జోకర్ లేక సచ్చిపోతున్నా.”
“ఉప్పులేకుండా వేయించాడురా వీడు. జీడిపప్పైనా రుచీపచీ లేదు.”
“ఎందుకురా అది అలా వెళ్ళిపోయింది. పెద్ద పోరంబోకు లంజ లాగుందే.”
వాళ్ళ మాటలు వినలేనట్టు గట్టిగా దగ్గా. మాటలు ఆగి గుసగుసగా నవ్వులు వినపడ్డాయి.
అన్నిటికీ ఆడదే కావాలి వీళ్ళకు, ఆఖరికి తిట్లకు కూడా. అస్తిత్వంలేని స్వేచ్ఛా అస్వతంత్రులు. రూపా! వీడ్ని వదిలేసి మంచి పని చేశావ్. లేకుంటే జీవితంలో జోకరయ్యుండేదానివి.
“ఒరేయ్ చిన్నోడా! ఎంత కాదనుకున్నా వాడు నీకు అన్న కాకుండా పోతాడా? ఒక తల్లిబిడ్డలు. ఇన్ని పట్టింపులుంటెట్టారా?”
“మామా! నీ మాట మీద గౌరవంతో ఇంతకాలం ఏమనకుండా ఉన్నా. ఇంత జరిగాక ఇప్పుడైనా మాట్లాడకపోతే ఇంట్లో ఆడోల్లు ఊస్తరు. ఈసారి ఏదో ఒకటి తేలిపోవాలి.” పట్టుదలగా అంటున్నాడు సన్నగా బక్కపల్చగా ఉన్న వ్యక్తి.
“చిన్నోడా! ఇది ఇట్టా తేలే వ్యవహారం కాదురా. ఇలా కానీ ఈసారికి.” ఆయనకున్న కొంచం జుట్టు నెరిసుంది. అన్యాయం జరిగిందంటూ కూడా సర్దుకోమని చెప్తున్నాడు.
అవును, ఎవడికి అన్యాయం జరుగుతుందో, వాడే సర్దుకుపోవాలి. జరగాల్సిన న్యాయంకంటే ఎక్కువ న్యాయం జరిగినప్పుడు ఏమనాలి దాన్ని? కలిసిరావడమా? దాని వెనక కనబడని అన్యాయాలెన్నో! ప్రపంచంలో ఎవరైనా కలవగలరు కాని గొడవ పడ్డాక అన్నదమ్ములు కలవలేరు. వాళ్ళకి విడిపోలేనంతగా కొట్టుకోవడం అలవాటవుతుందో లేక చిన్నప్పటినుండి అన్నిటిని పంచుకోవడంలో విసిగిపోయి ఉంటారో! నాగరిక ప్రపంచాలు రాకముందు అన్నదమ్ములకు ఆడవాళ్ళు కూడా పంచుకునే వస్తువులే.
ఎదురుగా కూర్చున్న సుందరి బాబుకి అరటిపండు తినిపిస్తుంది. వాడు తినను అని అడ్డంగా తలూపుతున్నా వాడేదో ధ్యాసలో ఉన్నప్పుడు ఒడుపుగా నోట్లో కుక్కుతుంది. వాడికి నచ్చకపోయినా ఉరిమిచూసే వాళ్ళమ్మ కళ్ళు చూసి పెట్టింది మింగి మళ్ళీ ఏమి గమనించనట్లు ఆడుకుంటున్నాడు. ఈ తల్లుల్లో ఇంత క్రూరత్వం ఎలా వస్తుంది. వాళ్ళకెవరైనా ఇలా కుక్కితే ఒప్పుకుంటారా?
సుందరి మధ్యమధ్యలో ఇటు చూస్తూ ‘అస్సలు తినడండి బాబు’ అంటుంది ముద్దుగా. ఆమె పక్కన కూర్చొని, కదులుతూ తగులుతూ ఇంకొంచెం దగ్గరగా జరుగుతూ సొంగ కారుస్తున్న గళ్ళచొక్కాగాడు. ఏదో చీప్‌నెస్ వాడి ముఖంలో. పురుగును చూసినట్లు చూశా. అయినా నాకేమధికారముంది వాడ్నలా చూడటానికి. వాడి కామం వాడిష్టం. కామం లేనిదెవరికి? నిర్మలమైన చూపులు ఉన్నదెవరికి?
నువ్వు నా ఫ్రెండ్‌విరా అని కౌగిలించుకొనే సతీశ్‌గాడు, ఎప్పుడైనా ఎద తగలగానే ఏమీ తెలీనట్లుంటున్నా ఆ క్షణంలో వాడి చూపుల్లో తేడా తెలియలేదా తనకు. వాడి కోసమే కదా ఇప్పుడు ఊరెళ్తుంది. ఎప్పుడో ఒకసారి కోరికని వేళ్ళలోనో, కళ్ళల్లోనో చూపిస్తే స్నేహితుడు కాకుండా పోతాడా? అదే సతితో అంటే ‘అంత కోరిక ఉంటే నీకు చెప్పకుండా నటించడం నాకు చాతనవుతదా? అయినా నీ పేరు జీవని అని ఎట్లా పెట్టారు?’ అంటూ నవ్వుతాడు.
బుడ్డోడు మొండికేశాడు. ఇక తిననని తిరుగుబాటు ప్రకటించాడు. బుజ్జగించి ముద్దలు పెట్టే తల్లి మాట విననని. అది వాడి పొట్ట, వాడి ఆకలి. సంవత్సరం కూడా నిండని బుడ్డోడు వాడికి నచ్చకపోతే, సహించకపోతే గట్టిగా ఎదురు తిరుగుతున్నాడు. వాడి విప్లవం స్వేచ్ఛగా ఉంది. దానికి హద్దులు లేవు. నువ్వూ నేను అనే భేదం లేదు. అమ్మైతే ఏంటి? ఇంకెవరైతే ఏంటి? ఇష్టం లేని పని చేయలేను అని వాడి మొండితనం. మూతి బిగించి అసహనంతో తల అడ్డంగా తిప్పుతున్నాడు. ఇంకా బలవంతం చేస్తే అమ్మ ఒడిలోంచి కిందకి దూకాలని చూస్తున్నాడు. గట్టిగా ఏడ్చయినా ప్రతిఘటిస్తున్నాడు. ఎలారా ఇంతటి విప్లవం నీలో. మళ్ళీ ఆకలైతే ఆమె పెట్టదనో, ఈ విప్లవంతో రేపు ఏమో అవుతుందనో చింతలు లేవు. వాడు విజయం సాధించాడు. విజయగర్వంతో నా వైపు చూసి నవ్వాడు. వాడి నవ్వులో ప్రశ్నలు. నువ్వెప్పుడైనా నీకు వద్దన్నది స్వేచ్ఛగా చెప్పగలిగావా? ఎప్పుడైనా ఇష్టంలేదని నోరు తెరిచి అరవగలిగావా? కనీసం నీ స్వేచ్ఛని నీకు నువ్వయినా చెప్పుకోగలిగావా? కొద్దిగా మిగిలిన అరటిపండుని పారేయలేక తెగ బాధపడుతుంది సుందరి. కనీసం గంట నుంచి బొద్దుగున్న ఆ బుడ్డోడు వద్దన్నా వినకుండా పట్టుబట్టి పెడుతూ, తినడు అసలు అని బలవంతగా వాడి నోట్లో తోస్తున్న సుందరి ఇప్పుడు అంతే ముద్దుగా మురిసిపోతుంది, ‘వీడు అంతేనండీ, నచ్చకపోతే ఖరాకండిగా చెప్పేస్తాడు’ అని. చాలా సాధారణంగా మిగిలిన అరటిపండుని కిటికీలోంచి బయటికి విసిరింది. ఆమెకి ప్రపంచం ఒక చెత్త బుట్ట. అందులో ఆమె కూడా ఉందన్నది ఆమెకెప్పుడైనా తెలిస్తే బావుండు.
అటుపక్కన తెల్లజుట్టు ముసలోడు మళ్ళీ అందుకున్నాడు. “ఒరేయ్ చిన్నోడా! ఆడోళ్ళ మాటలు ఇనబాకురా. అన్నదమ్ముల మధ్యకి ఈ ఆడోళ్ళని తీసుకొచ్చినవంటే నాశనమే ఇంక. దాని మాటలిని మీరు కొట్టుకోబాకండిరా నాయనా! తింటే తినేది మీ అన్నే కదరా.”
అంటే అన్న తింటే అది ఉదాత్తం. పెళ్ళాం నేను తినాలి, నా పిల్లలకి పెట్టుకోవాలి అంటే అది స్వార్థం. ఏది స్వార్థం? నీ వల్ల ఇంట్లో మగ్గుతున్న నీ పెళ్ళాం, నీ వల్ల పుట్టిన పిల్లల కోసం ఆమె కొట్లాడితే అది స్వార్థం. ఉదాత్తతంటే ఇది అని ఎంతటి పిచ్చి నమ్మకాలని, కండిషన్ చేసిన ఆలోచనలను రుద్దుతారు వీళ్ళు. ఉదాత్తత తృప్తినిస్తుందని, ఇది మంచితనం అని చెప్పి చూపించి బలహీనమైన మనసు ఉన్నవాళ్ళని లోబరుచుకుంటారు. మంచితనం ఎప్పుడూ అన్యాయమే కదా! చిన్నప్పటినుండి తనతోపాటు పెరిగిన తమ్ముడిని సమానంగా పరిధిలోకి తీసుకోవాలనే న్యాయాన్యాయాలు చూడని అన్నని సహించి తమ్ముడు మంచితనం పేరుతో సర్దుకుపోవాలి. తప్పకుండా ఈ ముసలాడికి స్వార్థం ఉండే ఉంటుంది. వాడికి లాభం కలిగేదేదో వాడికి తెలిసినప్పుడు అది మనకి తెలీకుండా మనతో వాడికి లాభం కలిగేలా చేసుకోవడంలో ఈ నీతిసూత్రాలు, మంచితనాలు బాగా పని చేస్తాయి. ఈ ముసలోడికి ఆడవాళ్ళంటే అసలు పడేట్లు లేదు. వీడి స్వార్థం కోసం పెళ్ళానికి ఎన్ని నీతి, జాతి సూత్రాలు నూరిపోస్తున్నాడో. ఎట్లా విసిగిస్తున్నాడో రోజూ.
సతి అంటాడు ‘నువ్వు తిరుగుబాటు చేయలేని, సర్దుకుపోలేని ఒక ప్రశ్నలా ఉంటావేంటి జీవా?’ అని. ‘సర్దుకుపోవడమనే విషయం వందల సంవత్సరాలుగా బానిసైన ఆలోచనలకు ప్రతినిధి కదా! అక్కడ మొదట ‘ప్రశ్న’నే కదా విప్లవం. తిరుగుబాటు లేవాలంటే సరైన ప్రశ్నలు లోపల రావాలి. ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరకాలి. సమాధానాలు ఇంకా నన్ను చేరట్లేదు. అందుకే ఇంకా ప్రశ్నల్లోనే ఉన్నానేమో!’ అంటాను.
ఎందుకు రమ్మన్నాడో ఇంత అకస్మాత్తుగా. ‘నాకు నీ హెల్ప్ కావాలి జీవా, స్టార్ట్ ఇమ్మీడియట్లీ’ అన్నాడు. ఫోన్లో కూడా ఎక్కువ మాట్లాడలేదు. వాడి గొంతులో ఏదో బరువు ఉంది. ‘అంతా ఒకేనా?’ అన్నా. ‘అమ్మ కొంచం బాలేదు. నువ్వుంటే ధైర్యంగా ఉంటుంది. వచ్చాక అన్ని విషయాలు చెప్తా’ అన్నాడు.
ఘాటువాసన పక్కనుంచి. ఎవడో సిగరెట్ తాగుతున్నట్లున్నాడు. కిటికీలోంచి పొగ ఇటువైపు వస్తుంది. ఒకడు చేసే పనుల వల్ల తెలీకుండా ఇంకొకరిపై ప్రభావం పడుతూనే ఉంటుందేమో! ప్రభావం పడుతుంది అని తెలిసి కూడా అలా ఎందుకు చేస్తారు? తప్పని సరై చేస్తారా? లేక పడితే ఏంటనే విసురా?
బండగాడు ఇదేగా మొన్న నన్ను మొహం మీద అడిగింది. అప్పుడు నేను సమాధానం ఇలానే ఇచ్చా కదా! ‘అక్కడ ఉండమని నేను చెప్పానా ఆ పరిస్థితుల్లో. నువ్వున్నావ్ నేనేమి చెయ్యాలి’ అని. బండగా నవ్వాడు, ‘పోనీ తెలిసే చేశావన్నమాట’ అని.
‘అన్నీ తెలిసే చేస్తారు మనుషులు, తెలీనట్లు నటిస్తారు. తెలిసి చేశామనే విషయాన్ని కన్వీనియంట్‌గా గుర్తించకుండా ఖాళీతనంలోకి మునిగిపోతారు. వారి బాదరబందీలని, బాధలని అడ్డు పెట్టుకొని దాక్కుంటారు. అంతే జరిగేది.’
అయినా నేను చేసిందేముంది. ‘వాడు నాతోపాటు పనిచేశాడు’ అని ఒక్కమాట చెప్పడం స్కిప్ చేశాను. అది వాడికి ప్రాజెక్ట్ రాకుండా చేస్తుందని, ఉద్యోగమే పోతుందని ఎవడనుకున్నాడు? అనుకున్నానేమో! అంతగా ఆలోచించలేదు. బండ నన్ను ఏమీ అనకుండా వెళ్ళాడు. నిజంగా వాడు ఇచ్చిన టైమ్, ఐడియానే కదా నేను వాడుకుంది. వాడు తెలివికల్లోడు. ఏదో పెద్దకంపెనీలోనే జాబ్ కొడతాడు. వాడ్ని గురించి పెద్దగా ఆలోచించనవసరం లేదు. వాడి పేరు చెప్పుంటే ఇన్నాళ్ళు నేను చేసిన కష్టానికి కూడా విలువ ఉండేది కాదుగా! సిగరెట్ వాసన ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
వాళ్ళు పేకాట ఆపినట్టున్నారు. ఆ రూప ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎవడితో అయినా వెళ్ళిపోయింటుందా వీడిని భరించలేక. అయినా వీడి దోస్తు అన్నాడు కదా ఒక బూతు మాట. ఇంత చీప్‌గా తీసేస్తున్నాడు. నిజంగా ఇష్టపడితే దాన్ని సహించగలడా? సతి అంటాడు ‘నిజం అబద్దం అంటూ ఏమీ ఉండదు. ఇష్టంలో తక్కువ ఎక్కువలే వదిలివెళ్ళడానికి కారణమవుతాయ్. కారణాలు ఇష్టాల పర్సెంటేజ్‌లను మారుస్తా ఉంటయి’ అని.
గళ్ళచొక్కావాడు ఇటు పైకెక్కి పడుకున్నాడు. సుందరిని కళ్ళతో తాకడానికా? అప్పుడు వచ్చాడు టీ అమ్ముతూ పెద్దకళ్ళ పిల్లవాడు. బహుశా వాడికోసమే ఎదురు చూస్తున్నానేమో. ఎక్కడా ఆగకుండా తిరుగుతూ, టీ టీ అని కేకేస్తూ, ఎక్కేదిగే మనుషుల్ని చూస్తూ వాడిలా రైల్లో టీ అమ్ముకోవాలని అనుకునేదాన్ని. ఎక్కిన వాళ్ళందరూ ఆ రైలు వాళ్ళదే అనుకుంటారు. వాళ్ళకే కాదు వాళ్ళ సామాన్లు పెట్టుకోడానికి స్థలం కోసం కొట్లాడతారు. కొంచెం స్థిరపడ్డాక కొత్తవాళ్ళు ఎక్కితే, మేము ముందే ఎక్కాం, రైలు మాది అని ఏదో అధికారం చూపే చూపులతో కాల్చేస్తారు. దిగేటప్పుడు ఒక్క నిమిషంలో అప్పటిదాకా వాళ్ళతో ప్రయాణించిన వాళ్ళందరిని ఒక్క క్షణంలో వదిలేసి గమ్యం వచ్చిందని ఆనందంగా వెళ్ళిపోతారు. ఇదంతా చూస్తూ ఆ రైల్లో తిరుగుతూ టీ అమ్ముతూ, వాళ్ళు సులభంగా వదిలేసే మాటలని చూస్తూ ఉండటం ఒక అద్భుతం. ఆ పిల్లోడి కష్టాలు ఏంటో కానీ వాడి జీవితం ఈ రైల్లో అందంగా ఉంటుంది.
‘ఒక టీ’ అని వాడికి చెప్తూ అప్పటిదాకా చీదరించుకున్న సుందరిని ఆప్యాయంగా చూస్తూ “మీరు టీ తాగుతారా?” అన్నా. ఆ బుడ్డోడు విప్లవం ప్రకటించాక ఆనందంగా నిద్రపోయాడు. ఆమె టీ పిల్లోడి వంక, నావంక ఒక రకంగా చూస్తూ “వద్దండి. మేము బయట ఏమీ తినం, తాగం” అంది. ఆమె ఏంటో అర్థమయ్యాక నవ్వుతూ బాగ్‌లోంచి ఒక ఇరవై రూపాయలు ఇచ్చి “ఉంచుకోరా” అన్నా. వాడు “థాంక్స్ అక్కా” అంటూ వెళ్ళాడు. వాడి కళ్ళల్లోకి చూడటానికి ఆ ఇరవై రూపాయలు ఎంత విలువైనవి. నేను ఇరవై రూపాయలు ఇవ్వగానే సుందరిలో ఏదో మార్పు. ఏంటో అది, నాలో ఒక నచ్చని చూపు తనపైన. ఒకే ఒక్క క్షణంలో మారిపోతుంది నీ చూపు అప్రమేయంగా.
చేతులు కడుక్కోవడానికి లేచి వెళ్ళాను అక్కడ బోగి డోర్ దగ్గర ట్రైన్ చప్పుళ్ళ మధ్య సన్నజీరలాంటి అరుపుతో అర్ధింపు వినపడుతుంది. “బంగారం నాదేరా తప్పు, నిన్ను ఒదులుకోలేను, ఇంకెప్పుడు అలా మాట్లాడను వచ్చెయ్ రా. నువ్వు లేకుండా ఉండలేను బంగారం…” నన్ను చూసి ఒక్క క్షణం ఆపాడు. వీడేనా రూపని లంజ అంటే నిశ్శబ్దంగా విన్నోడు. ఫోర్త్ కార్డు వచ్చి షో చూపించాడా? ఏమో ఎవడు ఆట కొడతాడో చెప్పడం కష్టం, కొందరు ఎదురు చూస్తూనే ఉంటారు. సడన్‌గా కౌంట్ పడుద్ది అని ఏడ్చేవాడే షో చూపిస్తాడు.
అర్ధరాత్రి మెలుకువ వచ్చింది. ఎదురుగా సుందరి బుడ్డోడికి పాలిస్తుంది. పైట పక్కకు తొలిగుంది. ఆమె కళ్ళు దించుకొని ఉంది. ఇలాంటివి కూడా ఆత్రంగా చూసేవారుంటారు. హఠాత్తుగా గళ్ళచొక్కా గుర్తొచ్చాడు. ఇక ఆగలేక లేచి చూశా. పైన వాడు లేడు. మనసంతా ఖాళీగా అపరాధ భావమేదో కమ్ముకున్నట్లు. ‘ఓహ్, యు ఆర్ సో సినికల్’ అని ఎవరో అరుస్తున్నట్లు, అరుపులు రైలు పట్టాలకింద నలిగినట్లు ఇబ్బంది ఏదో మనసులో. లేచి డోర్ దగ్గరికెళ్ళా.
అన్నని సమర్ధించిన ముసలాయన డోర్ దగ్గర కూర్చొని చుట్ట కాలుస్తున్నాడు. అంతకు ముందులా కనిపించలేదు. ఇప్పుడంతా మారినట్లు అనిపించింది. అతడు మనుషులందరూ బాగుండాలనే సూత్రాన్నేదో పట్టుకు నడుస్తున్న పెద్దమనిషిలా కనిపిస్తున్నాడు.
మొబైల్ సిగ్నల్ అందినట్లుంది. ‘ఎక్కడదాకా వచ్చావ్, సీట్ దొరికిందా?’ అని సతి దగ్గరినుంచి మెసేజ్.
“హాఁ ఓకే, సగంలో ఉన్నా, ఏమైంది?”
“ఏం లేదు పేరెంట్స్ ఇష్యూ.”
“పేరెంట్స్ ఇష్యూనా, ప్రపంచంలో చావు కాకుండా ఎక్కువ బాధ పెట్టేది ఎంతోకాలంగా కలిసున్నట్లు కనపడేవాళ్ళు విడిపోవడం.”
“డోన్ట్ బి ఓవర్ డ్రమటిక్. అమ్మ ఆశ్రమానికి వెళ్ళాలంటుంది. అలివేలుని ఇంట్లో ఉండమని. వెయిటింగ్ ఫర్ యు.”
అలివేలంటే సతిని పెంచినామె. వాళ్ళ అమ్మ వయసే ఉంటుంది దాదాపు. సతి నాన్న, అలివేలు ఏమో. వెనక్కి వచ్చి కూర్చున్నా.
బండగాడికి మెసేజ్ చేశా. ‘ఐ యామ్ సారీ. ఐ డిడ్ ఎ మిస్టేక్.’ బండ నుంచి ఆ టైమ్‌లో కూడా వెంటనే మెసేజ్. ‘డోన్ట్ బి. ఐ డోన్ట్ వాంట్ యువర్ గిల్ట్. లెట్ ఇట్ గో. స్వార్థంతో నిస్వార్థంగా ఉండటం నీకొచ్చేమో. నిస్వార్థంతో స్వార్థంగా ఉండటం నాకు వచ్చు.’
కళ్ళు మూతలు పడుతున్నాయా? పడాలని కోరుకుంటున్నానా?
సతి వాళ్ళ అమ్మ, రూప గాల్లోకి ఎగురుతున్నారు. నా వైపు వేళ్ళు చూపించి నవ్వుతున్నారు. ముసలాయన చుట్టపొగతో బోగి అంతా నిండిపోతుంది. వాడి అల్లుడు ఊపిరాడక దగ్గుతున్నాడు. బుడ్డోడు సుందరి జాకెట్ పట్టుకొని హుక్సులు తెంపుతున్నాడు. అది వాడి హక్కని లాగుతున్నాడు. బండ తల దగ్గర కూర్చొని ఏదో చెప్తున్నాడు. పెద్దకళ్ళ పిల్లోడు టీ విసిరి కొట్టి రైలు దూకి పారిపోతున్నాడు. నేను జోకర్‌ని. లైఫ్‌ని. ఫోర్త్ కార్డ్‌ని. వాడు షో చూపిస్తున్నాడు. వాడు ఎవడు? గళ్ళచొక్కావాడు నాకాళ్ళ దగ్గర. వాడి చేయి నా కాలి మడిమలని తడుముతుంది. వాడూ సుందరి మరి?
ఎవరిది న్యాయం? ఎవరిది స్వేచ్ఛ? ఎవరిది కోరిక?
ఏది కల? ఏది నిజం?