పరి అలియాస్ పార్వతి

“సత్యం రావడానికి ఇంకా టైమ్ ఉంది.”

“పర్వాలేదు. నిజం ఏంటో తెలుసుకోవాలి” అన్నా మూర్తితో.

“ఎన్ని రోజులు చేస్తావ్ ఈ ఇన్వెస్టిగేషన్, ఎందుకు? వాడేదో చేశాడు. పోనీలే అని వదిలేయొచ్చు కదా పరీ…” మూర్తి గొంతులో తేడా నాకు అర్థమైంది.

“మూర్తీ! ఒక్క మాట చెప్తా విను. ఎప్పుడూ న్యాయంగా ప్రవర్తించనివాళ్ళు, కేవలం తమ స్వార్థం కోసమే బతికేవాళ్ళు ఎవరైనా ఒకళ్ళకి పెద్ద ఎత్తులో సహాయం చేస్తున్నారంటే… అది ఎప్పుడో అంతే పెద్ద ఎత్తున మనల్ని ముంచేస్తది” అన్నా నిశ్చయంగా.

“వాడంటే నీకెందుకు అంత అపనమ్మకం? మొదటినుంచీ అంతే నువ్వు!” మూర్తి తేల్చేశాడు.

ఎందుకో ఆ మాటలకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

“నిజానికి నువ్వూ-వాడూ వేరు వేరుగా ఉండరు. మీ ఇద్దరి పనుల్లో మోటివ్స్‌లో తేడాలు ఉంటాయి. మీ ఇద్దరిలో ఒకే మొండి పట్టుదల. వాడిది స్వార్థం అంటావ్ నువ్వు, నిస్వార్థం అనే స్వార్థంలో నువ్వుంటూ” అన్నాడు మూర్తి.

మూర్తితో వాదించలేనని తెలుసు నాకు. సత్యానికి ఉన్న ఒకే ఒక ప్రాణస్నేహితుడు మూర్తి. అయినా మూర్తికి నాకు మధ్య అదోరకమైన దగ్గరితనం ఉంది. నేను బలవంతం చేస్తే మూర్తి సహాయం చేయకుండా ఉండలేడు. ఆ అదోరకమైన దగ్గరితనం ప్రాణస్నేహాన్ని కూడా లెక్క చేయదేమో. మూర్తి పేరున్న పత్రికలో ఒక పొలిటికల్ రిపోర్టర్. ఎవరు ఎట్లాంటి పనులు ఏ మోటివ్‌తో చేస్తున్నారో, ఆ పనులను ఏ కోణంలో చూడాలో బాగా తెలిసినవాడు. నా దవడ కొద్దిగా బిగుసుకోవడం చూసినట్లున్నాడు.

“వెళ్దామంటావా అయితే?” అన్నాడు మూర్తి ఇక తప్పదన్నట్టుగా.


పొద్దున్నే ఐదింటికల్లా బయలుదేరాం. మూర్తి ముభావంగా ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళడం మూర్తికి ఇష్టం లేదా? లేక ఇంకేదైనా కారణమా? అర్థం కాలేదు. చాలాసేపటికి ఏదో ఆలోచిస్తున్నట్లు అన్నాడు.

“అక్కడికి వెళ్ళి ఏదైనా తెలుసుకొని మాత్రం ఏం చేస్తావ్?” నా సమాధానం కంటే నాపైన చిరాకుతో అడిగినట్లున్నది ఆ ప్రశ్న.

“తెలీదు.”

“ఏదేమైనా నువ్వనుకున్నంత అయితే కాదు వాడు.”

“నేను ఎంత అనుకున్నానో తెలుసా నీకు?” సూటిగా అడిగా.

“…”

“కానీ ఒకటి మూర్తీ… ఊహించనిచోట మంచితనం కనిపిస్తున్నప్పుడు చాలా అనుమానాలు వస్తాయి. సత్యం స్వార్థంగా ఉన్నా ఫర్వాలేదు. కానీ, వాడు మనసులో ఇంకేదో ఉంచుకొని మంచి చేస్తుంటే మాత్రం అది స్వార్థాన్ని కూడా దాటి మరో మెట్టు ఎక్కినట్టే. నేను ఇక వాడి మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే.”

ఏం ఆశలని అడుగుతాడేమో అనుకున్నా. కానీ అడగలేదు. అతను మౌనంగా ఉండిపోవడం వెనుక నిరసన అర్థమవుతూనే ఉంది నాకు. వెళ్ళేదారిలో రోడ్ పక్కన కారు ఆపి మూర్తి టీ తెచ్చాడు. ఇద్దరం తాగాం. మూర్తి నా ఇష్టాయిష్టాలు ఒక్కటీ మర్చిపోకపోవడం ఎక్కడో కొంచెం గర్వంగా అనిపించింది. కొద్దిగా మామూలు అయ్యాడు మూర్తి. నాలుగు గంటల ప్రయాణం. ఎర్రగొండపాలెం దగ్గరికి వచ్చాం. ఇక్కడి నుంచి గతుకుల రోడ్డు. ఎగిరిపడుతోంది కారు.

“ఈ ప్రయాణం పూర్తయ్యేవరకు నీ కారు ఎలా ఉంటుందో. అయినా నువ్వు ఈ కారు మార్చాల్సిన టైమ్‌ వచ్చింది” అన్నా. “మూర్తీ! నేనడిగే పిచ్చి కోరికలకు నువ్వు ఏమనుకుంటావూ?”

అతని కళ్ళు కొద్దిగా చిన్నగా అయి మెరిశాయి.

కారు వెనక దారంతా దుమ్ము లేస్తోంది. పెద్దగా చెట్లు కూడా లేవు. అక్కడక్కడ పెద్ద పెద్ద బండలు. ఏదైనా ఎడారిలో అడుగుపెట్టామా అనిపించింది. ఎండ తీవ్రమైంది. ఒక పది పన్నెండు కిలోమీటర్లు వెళ్ళినట్లున్నాం అలా. ఇళ్ళు కనిపించాయి. చెట్లు కూడా. ఆ ఊరు కొద్దిగా దాటగానే కారు పక్కకి తిప్పాడు మూర్తి. దారి పక్కనే ఒక మట్టి ఇల్లు. ఆ ఇంటి ముందున్న చిన్న గేటు తీసుకొని లోపలికి వెళ్ళాం. లోపల ఇంటి తలుపు వేసి ఉంది. అక్కడ ఎవరూ లేరు. మూర్తి బయటికి వెళ్ళి, పార్వతమ్మ ఎక్కడుందని చుట్టుపక్కల వాళ్ళని అడుగుతున్నాడు. పార్వతమ్మ పొలానికి వెళ్ళిందని వాళ్ళు చెప్తున్నారు.

ఇది పార్వతమ్మ ఇల్లా? సత్యం అంత సాయం చేస్తే ఈ ఇల్లు ఇలా ఉందేంటి?

“పొలందాకా వెళ్దామా” అడిగాడు మూర్తి.

మట్టిదారి ఉన్నవరకు కారులో వెళ్ళి, అక్కడి నుంచి కాలిబాట పట్టుకొని లోపలికి నడిచాం. మూర్తి మాటలు వింటూ అతనితోపాటు నడుస్తున్నా. కొన్ని చేలు ఎండిపోయి ఉన్నాయి. మరికొన్ని పచ్చగా ఉన్నాయి. అక్కడంతా మెట్ట వేసి ఉంది. పచ్చగా ఉన్న చేనులో జొన్న వేసినట్లుంది. పచ్చని జొన్నకంకుల మధ్యలో మనిషి కదులుతున్నట్లు కనిపించింది. “సాంబయ్యా!” అని పెద్దగా పిలిచాడు మూర్తి. అతను నెమ్మదిగా నడుచుకుంటా చేనులోనుంచి బయటికి వచ్చాడు. మనిషి చిన్నగా ఉన్నాడు. తలకి గుడ్డ చుట్టి ఉంది. పంచ ఎగదోసుకుంటా మావైపు చూసి “ఏం బాబూ, శానా రోజులకి ఊరి మీద మనసు మల్లిందే” అన్నాడు. పార్వతమ్మ గురించి అడిగాడు మూర్తి. “బాయి దగ్గరుళ్ళా?” చేయెత్తి ఆమె ఉన్న వైపు చూపించాడు సాంబయ్య. ఆ వైపు చూశా. కొంచెం దూరంగా బావి కనిపిస్తుంది. గట్టు మీద నడుస్తుంటే ఒడుపుగా చిన్న పాముపిల్ల పక్కనుండి వెళ్ళింది. పక్కకు దూకాను. మూర్తి అదేమీ పట్టించుకోకుండా ముందుకు నడిచాడు. నాకు మాత్రం కంగారుగా అనిపించింది.

పార్వతమ్మ సన్నగా చిన్నగా ఉంది. చూడగానే మొదట ఆమె కాళ్ళకి ఉన్న వెండి కడియాలు కనిపించాయి. నా చిన్నప్పుడు ఆ వెండి కడియాల పాదాలు చూసినట్లు లీలగా గుర్తు. ఆ తర్వాత మధ్యలో ఒకసారి ఆమెని చూశా, నాన్న పోయినపుడు వచ్చింది ఆమె. అమ్మ ఆమెని మాతోనే ఉండమంటే ఒద్దమ్మా, నేను ఉండలేను అని చెప్పి వెళ్ళిపోవడం గుర్తుంది.

పెద్దావిడై పోయింది, చీర కొద్దిగ ఎగదోసి కట్టింది. అక్కడ విశాలమైన బండ. దానిపక్కనే కొడవలి ఉన్నాయి. మూర్తిని చూసి ” యేంది మూర్తయ్యా, శానా రోజులకి కనిపిస్తూండావే” అని పలకరించింది. ఆమె గొంతు ప్రత్యేకంగా ఉంది.

“ఏందీ పాంపిల్లకి భయపడ్డా?” అంది నవ్వు మొఖంతో నన్ను చూస్తూ. “సత్తెం పోలికలు బాగుండాయి నీకు.”

మూర్తివైపు నావైపు చూసి “సత్తెం ఎట్టున్నాడూ? బానే ఉండాడా?” అని ఆరా తీసింది. మేమిద్దరం ఏమీ అనలేదు.

“ఒరే సాంబా! పజ్జొన్న కంకులు పట్రా. అటుకొసకుళ్ళే కందికాయలు కాసినయి కూడా” అంటూ కేకేసింది. “కూసోండి, కూసోండి” అంది. నేల మీదే కూర్చోవాలని అర్థమైంది. కొద్దిగా ఇబ్బంది అనిపించింది. సన్నటి నిప్పు మీద జొన్నకంకులు కాల్చి ఇచ్చింది. పొలంలో బావి పక్కన మర్రిచెట్టు ఉంది. దానినిండా ఊడలు వేలాడుతున్నాయి. చల్లటి నీడ. కాల్చిన జొన్నకంకులు, కందికాయలు అంత రుచిగా ఉంటాయని అనుకోలేదు. పార్వతమ్మ పెద్దగా మాట్లాడలేదు.

జొన్నచేను మీదగా కిందికి దిగాడు సూర్యుడు. పరిసరాలు కొద్దిగా చల్లబడ్డాయి. ఆకాశంలో కొంగల బారు ముత్యాలహారంలా తేలుతూ వెళుతున్నాయి. “లచ్చువమ్మ గుంపు ఇంటికి బయలెల్లింది. ఏందమ్మాయీ, నువ్వొచ్చి టయానికి పొద్దుగుంకించా! ఇంక పోదాం” అంది పార్వతమ్మ ఆకాశంలోకి చూస్తూ.

అక్కడికి వచ్చాక నేను అడగాలనుకున్న మాటలు గుర్తుకు రాలేదు. ఇంటికి వచ్చాక పార్వతమ్మ మమ్మల్ని స్నానం చేసి రమ్మని పురమాయించింది. బయట మంచాలు వేసి దుప్పటి పరిచింది. ఆ మట్టి ఇంటి వెనుక బాత్రూములు కొత్తగా కట్టించినట్లు ఉంది. మేం ఫ్రెషప్ అయి వచ్చేలోపు పార్వతమ్మ జొన్నరొట్టెలు, కూర వండి పెట్టింది. మూర్తి కనపడటంలేదు. ఎక్కడికి వెళ్ళాడని అడిగింది. ఎవరినో టౌనులో దింపడానికి వెళ్ళాడు, కాసేపట్లో వస్తాడని చెప్పా.

“సత్యం ఇక్కడికి తరుచుగా వస్తుంటాడా?” అడిగా. ఆమె సమాధానం చెప్పలేదు.

చిన్నప్పుడు మా ఇంట్లో పనిచేసేప్పటి పార్వతమ్మ కొద్దిగా గుర్తువచ్చింది. వెండి కడియాలతో ఆమె మా ఇంట్లో తిరగడం లీలగా గుర్తుంది. నాకు అప్పుడు ఆరేళ్ళు ఉంటాయేమో. ఓసారి వేసవి సెలవులకు ఊరెళ్ళి వచ్చేప్పటికి ఆమె ఇంట్లో లేదు. నాయనమ్మ గుర్తొచ్చింది. నాయనమ్మ పెద్దగా గదిలో నుంచి బయటికి వచ్చేది కాదు. ఎప్పుడూ కొద్దిగా విచారంగానో, భగవంతుణ్ణి తలచుకుంటూనో ఉండేది. నాయనమ్మ నన్ను ఎప్పుడూ దగ్గరికి తీసింది లేదు. ఎప్పుడూ పేరు పెట్టి పిలిచేది కూడా కాదు. ఆమెకి సంబంధించిన ప్రతి పనీ మా నాన్నే చేసేవారు. నాన్నతో కూడా ఆమె పెద్దగా మాటాడినట్లు అనిపించేది కాదు. కానీ సత్యం అంటే విపరీతమైన ప్రేమ చూపించేది. ఎవరినీ ముద్దు చేయని ఆమె సత్యాన్ని మాత్రం తెగ గారాబం చేసేది. ఆమె గారాబం వల్లే సత్యం మరీ స్వార్థంగా తయారయ్యాడని అమ్మ అనేది. ఆ తరువాత నాయనమ్మ ఎక్కువరోజులు లేదనే చెప్పాలి. ఆమె పొయ్యేప్పటికి నాకు పదేళ్ళు ఉంటాయేమో.

“నీకు ఎవరూ లేరా?”

“ఒక అన్న ఉండేటోడు. వూరినిండా అప్పులు చేసి పొలం తాకట్టు పెట్టి యెటో దారులు పట్టిపొయాడు. నాకు కాల్చేతులాడలా. యిక మీ అమ్మకి కబురు పంపితే, సత్తెం వచ్చి అప్పులన్నీ కట్టి పొలం ఇడిపించాడు” అంది పార్వతమ్మ. ఆమె గొంతు నిర్వికారంగా ఉంది.

“సత్యం వస్తూ ఉంటాడా?” మళ్ళీ అడిగా. ఆమె ఈసారికూడా సమాధానం చెప్పలేదు.

“నువ్వు మా ఇంట్లో పని చేసేదానివి కదా, ఎందుకు వెళ్ళిపోయావ్?”

“నేను సత్తేన్ని మాలిమి జేసుకుంటున్న అని ఎల్లిపొమ్మన్నది మీ నాయనమ్మ.”

“నువ్వెప్పుడు వచ్చావు మా ఇంటికి?”

“మీ తాత మీ నాయనమ్మని జేసుకొని మీ యింటికి తెచ్చినప్పుడు నేనుగూడ మీ నాయనమ్మతో వచ్చా. మా అయ్య బాకీ తీర్సుకోలేక నన్ను ఒదిలేశాడు మీ తాతకి.”

“నువ్వెప్పుడూ వెనక్కి వెళ్ళలేదా?” నా గొంతు నాకే బలహీనంగా వినిపించింది.

“మీ నాయనమ్మకు పిల్లలు పుట్టలే. ఇంగ నేను గూడా అక్కడే వుండాల్సొచ్చింది.”

అంటే మా నాన్న… మూర్తి ఇంకా రాలేదు. ఆరుబయట మంచాలపై నేను, పార్వతమ్మ పక్కపక్కన పడుకున్నాము. ఆకాశంలో నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ మెరుస్తున్నాయి. చంద్రుడు కనపడట్లేదు. ఆమె సన్నగా భజగోవిందం పాడుతోంది. అది ఎన్నోసార్లు నాన్న గొంతులో విన్న గుర్తు. మమ్మల్ని నిద్ర పుచ్చడానికి నాన్న అదే పాడేవారు. ఏనాడూ గుడికి వెళ్ళడం, దేవుడికి దణ్ణం పెట్టడం చేయని నాన్న ఆ పాట పాడటం నాకు చిత్రంగా అనిపించేది.

“నువ్వొక్కదానివే ఉంటావా ఇక్కడ?”

“నేనొక్కదాన్నే ఏముంది, కూసంత దూరంలో పెద్దవాగుంది. సుట్టంతా చేనుంది. మనుసులున్నారు. ఒక్కదాన్నే యాడున్నానమ్మాయ్!” అంది. ఆమె కళ్ళు ఆకాశం వైపు నిర్మలంగా చూస్తున్నాయి.

మాతో వచ్చెయ్యి అని అడగాలనిపించింది. మళ్ళీ ఆమెని తీసుకెళ్ళడమా… ఆ ఊహే బరువుగా అనిపించింది.

పార్వతమ్మ లేచి కుండలోంచి నీళ్ళు ఒంపుకొని తాగింది. ఆమెవైపు కన్నార్పకుండా చూశా. అకస్మాత్తుగా ఆమెలో మా నాన్న కనిపించాడు. ముఖ్యంగా ఆమె నీళ్ళు తాగే పద్ధతి. ఆమె చేతివేళ్ళు, కళ్ళు, పల్చని పెదాలు. ఆమె నడక. చేతులు తిప్పుతూ మాట్లాడే పద్ధతి. ప్రతిదానిలోనూ నాన్న కనిపించాడు. లోపలేదో ఉలికిపాటు. ఇంకా ముందుకువెళ్ళి ఆలోచించడం ఇష్టంలేక కళ్ళు మూసుకున్నా. ఆమె భజగోవిందం పాట నన్ను ఎప్పుడు నిద్ర పుచ్చిందో తెలీదు.


“పార్వతమ్మ లాంటి మనుషుల్ని అరుదుగా చూస్తాం. ఆమె మట్టి మనిషి. ఇంతటి సహజమైన మనిషి కాబట్టే ఆమెను చూసేందుకు సత్యంతో కలిసి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాను…” అన్నాడు మూర్తి కారులో తిరిగి వెళ్తున్నపుడు.

“…ఆమెను చూస్తే మీకు బాగా కావాల్సిన వ్యక్తనిపిస్తుంది.” అతని మొహంపై నవ్వు.

“సరే, ఇంతకీ నీకేం అర్థమైంది? ఏం తెలుసుకున్నావ్? ఒక్కమాట కూడా మాట్లాడకుండా పార్వతమ్మను గట్టిగా వాటేసుకొని, ముద్దుపెట్టుకొని నీ చేతిలోని డబ్బులన్నీ బలవంతంగా ఆమెకి ఇచ్చి మరీ వెనక్కి వచ్చేశావు. మీ అన్నాచెల్లెళ్ళు నాకు అర్థం కారు!”

“మూర్తీ, కొన్ని విషయాలను ఎక్కువ అర్థం చేసుకోవాలని, లోతుగా తెలుసుకోవాలని అనుకోకూడదేమో. జరిగేవాటిని జరగనివ్వాలి అనుకుంటా.”

చిన్నప్పుడు వర్షం వెలిశాక చెట్టును ఊపుతూ నాపైన చటుక్కున వర్షం కురిపించి అల్లరిగా నవ్వుతూ పారిపోయే సత్యం గుర్తొచ్చాడు.


శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...