బోఁజూర్

ఆ పిల్లవాడికి పదేళ్ళు ఉంటాయేమో సొట్టబుగ్గలతో నవ్వుతూ ఎదురు వస్తున్నాడు. వెనక్కి తిరిగి చూశా, నాతో వచ్చిన వాళ్ళు జంటలు జంటలుగా అటూ ఇటూ వెళ్ళిపోయారు. ఆల్ప్స్ పర్వతాల పైన ఉన్న ఆ చిన్న గ్రామంలో అంతా తెలిసినట్టు వస్తున్నాడు. రావడంతోటే నా ఎదురుగా నిలుచొని ‘కమ్‌ దిస్ వే’ అంటున్నాడు.

టైమ్ చూసుకున్నా, ఒక గంట ఉంది. పర్వాలేదు టైమ్ ఉంది అని వాడి వెనుక అడుగులేశా. టూరిస్టులతో ఏముంటది ఇలాంటి పిల్లల్ని పెట్టి కస్టమర్స్‌ని ఆకర్షిస్తా ఉంటారనుకుంటా. ఏ దేశంలో అయినా ఇంతేనేమో. అక్కడ రాతి యుగంలోకి వచ్చినట్లనిపించింది. అంత పెద్ద పెద్ద బండలతో వీధులు కొద్దిగా ఇరుకుగా ఉన్నాయి. పెద్దగా మనుషులు లేరు. పొద్దున గైడ్ రీకో జోక్ చేశాడు – ఈ చలికాలం కళాకారులు, అందమైనవాళ్ళు తప్ప ఈ ప్రదేశాలకి ఎవరూ రారని. అతని ఫ్రెంచ్ యాసలో ఇంగ్లీష్ ముద్దుగా ఉంది. అతడు బోఁజూర్ అనే పద్ధతి కూడా. ఏదో నాకే ప్రత్యేకంగా చెపుతున్నట్లు కళ్ళలో కళ్ళు పెట్టి మరీ చెప్తాడు రీకో. ఈ ఫ్రెంచ్ వాళ్ళకి ఆడవాళ్ళపై ఉన్న ఇష్టాన్ని స్వచ్ఛందంగా చెప్తుంటారేమో.

సొట్టబుగ్గల పిల్లవాడు ఉషారుగా అడుగులేస్తున్నాడు, వాడు వేసుకున్న మాసిన లెదర్ జాకెట్, పెట్టుకున్న ఊలు టోపీ చూస్తుంటే, మా ఊరిలో మేకలు కాచే దాము గుర్తొచ్చాడు. దాము ఎప్పుడూ వాళ్ళ నాన్న పాతకోటు, గుడ్డతో చేసిన టోపీతో కనపడేవాడు. ఏరా దామూ బడికి రాలేదూ అనడిగితే ఈ రోజు లచ్చిమి ఈనింది అని, ఇంకో రోజు రాజుకి దెబ్బ తగిలింది అని ఏదో ఒక కారణం చెప్పేవాడు. మేకలన్నిటికీ పేర్లు పెట్టాడు. ఎందుకురా మేకలకు పేర్లు పెట్టావ్ అంటే, ‘మేకల భాష తెలీదు కదా టీచరమ్మా వాటికి అవి ఏమి పేర్లు పెట్టుకున్నాయో! ప్రతి మేకకి ఏదో ఒక పేరు ఉంటది కదా, మరి మేక అని ఎట్లా అంటా, అందుకే నేను ఒక పేరు పెట్టుకున్నా’ అని అన్నాడు. వాడి దగ్గర అదో రకమైన మేకల వాసన.

ఏదో షాప్‌లా ఉన్న ఇంటిముందుకి తీసుకెళ్ళి ఆగాడు. ఆ షాప్ ముందు వేలాడుతున్న విండ్ ఛైమ్స్ వెదురు బొంగుల మధ్య చిన్న చెక్కతో చేసిన ఇల్లు గాలికి ఊగుతోంది చిన్నగా. వెదురు లోపలికి వెళ్ళిన గాలి సన్నటి ఈల లాంటి శబ్దంలా వినిపిస్తుంది. ఆ శబ్దం అడవిలో పుట్టిన పాటలా ఉంది. కళ్ళతో నవ్వుతూ చూస్తున్నాడు, లోపలకి వెళ్ళమని చెప్తున్నాడు. లావెండర్ వాసన. అది నెమ్మదిగా నన్ను చుట్టుకున్నట్లు ఉంది. అక్కడ ఒక పక్కన లావెండర్ ఎండిన పూల కట్టలు, చిన్న చిన్న పెర్‌ఫ్యూమ్ బాటిల్స్. ఒక పక్కన సిల్క్, ఊలు స్కార్ఫ్‌లు ఉన్నాయి. కౌంటర్ పక్కగా కూర్చీలో చూశాను ఆమెని. ఆమెకి ఎంత వయసుంటుందో అంచనా వేశాను. పెద్ద వయసే ఉండొచ్చు. ఆమె స్కార్ఫ్ అల్లుతోంది. చిరునవ్వుతో నావైపు తలెత్తి చూసింది. ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు తళుక్కున మెరిసినట్లుంది. ఈ పర్వతాల మీద మామూలు మనుషులు కూడా కళాకారులవుతారేమో అనుకున్నా.

ఆమె స్పష్టమైన ఇంగ్లీష్‌లో “నా పేరు ఎలేరా! ఇక్కడికి వచ్చినందుకు సంతోషం” అంది. నేను నవ్వుతూ చూశాను. ఆమె కన్నార్పకుండా నన్నే చూసింది. నాలో ఏదో వెతుకుతూ కుతూహలంగా చూస్తున్నట్లు అనిపించింది.

“నువ్వేమైనా కొనాలనుకుంటున్నావా ఇక్కడ. ఏదైనా నచ్చిందా?” అని అడిగింది.

నేను లావెండర్ డ్రై ఫ్లవర్స్ వైపు చూశా. లోపల నుంచి నీలపు రంగు కవర్‌లో ఉన్న లావెండర్స్ తీసి ఇచ్చింది. “ఇవి ట్రూ ఫ్రెంచ్ లావెండర్ డ్రై ఫ్లవర్స్ ఇవి తీసుకో” అంది.

“ఎంత?” అడిగాను.

“పర్వాలేదు. నీ దగ్గర డబ్బులు తీసుకోవాలనుకోవట్లేదు” అంది.

అదేంటి ఎందుకలా అని అడగలనుకున్నా. చిత్రంగా నేను రెట్టించకుండా చిన్నగా తల ఆడించా.

“అమ్మాయీ, నువ్వు ఇండియా నుంచి వచ్చావు కదా. నీ స్ట్రాంగ్ ఇండియన్ యాస పట్టి ఇస్తోంది. నాకు ఇండియన్స్‌లో ఈ చామనచాయ రంగులో ఉన్న వాళ్ళను చూస్తే నా స్నేహితురాలు శ్యామ గుర్తుకు వస్తుంది. నేను ఇండియాలో కొంతకాలం చదువుకున్నాను” అంది ఉత్సాహంగా.

ఇండియా ప్రస్తావన రాగానే ఇంటరెస్ట్ వచ్చింది. ఆమెకి కనీసం డెబ్బై పైన వయసు ఉంటుంది.

కొద్దిగా క్యూరియాసిటీతో “ఎక్కడ చదువుకున్నారు?” అన్నా.

“శాంతినికేతన్‌లో.”

కళ్ళెత్తి పరిశీలనగా చూశా ఆమె వైపు ఇంకోసారి. ఆమె నీలి కళ్ళు, తెల్లటి ముడుతలు పడ్డ చర్మం, రాగి రంగు జుట్టు. ఆమె నుండి ఏదో వెలుగు వస్తున్నట్లు అనిపించింది. నా భ్రాంతికి నాకు నవ్వు వచ్చింది.

“అయితే మీకు ఠాగూర్ గీతాంజలి తెలుసు కదా?”

ఆమె మొఖం ఒక్కసారి విరబూసిన మందారపు పువ్వులా మారిందనిపించింది నా ప్రశ్నకు. ఆమె డెస్క్ వెనక్కి వెళ్ళి నలిగిన పుస్తకం తీసింది, అది గీతాంజలి.

“ఈ పుస్తకమే నన్నింకా ప్రపంచాన్ని ప్రేమించేలా చేస్తోంది” అంది.

నాకు తెలుసు ఫ్రెంచ్ నేల కళాకారుల నిలయమని. వారు కళకి ఇచ్చే ప్రాధాన్యం ఎంతో ఉంటుంది.

“నువ్వు చదివావా?” అంది.

“చదివాను. ఇక్కడ ఇంకా ఏవి బావుంటాయి?” అన్నా.

“ఇక్కడ దొరికేవి కావు, నీ దగ్గర సమయం ఉందా, నేను చూపిస్తాను” అంది. వాచ్ చూసుకున్నా, లేదు నేను వెళ్తాను అని అనాలనుకున్నా, అనలేకపోయాను.

“జూన్ ఫ్లవర్‌లా ఉన్నావ్, నిన్ను జూన్ అని పిలుస్తా అమ్మాయీ” అంది నా పేరుతో పని లేకుండా. ఉలిక్కిపడ్డా ఒక రోజు దాము మేక పిల్లను తీసుకు వచ్చి ‘పేరు పెట్టు టీచర్’ అని అడిగాడు. జూన్ అని పెట్టా. వాడి నవ్వు మొఖం వెలిగిపోయింది.

“నువ్వు నాతో వస్తావా జూన్! ఈ పూట నీతో గడపాలని ఉంది” అంది.

ఎలేరాతో నాకూ కొంచెం సమయం గడపాలనిపించింది. లోపల కొద్దిగా సంకోచంగా ఉన్నా ఎందుకో ఆమె మాట కాదనలేకపోయా. నేను వెళ్ళాలి అని గుర్తుకు వచ్చి వాచ్ చూసుకున్నా.

“ఎందుకు టైమ్ చూసుకుంటున్నావ్, మరేమీ పర్వాలేదు. సమయం కదలమనే దాకా అదెక్కడికీ పోదు” అంది నవ్వుతూ ఎలేరా. “ఎప్పటినుండో ఒక మిత్రురాలు వస్తుందని ఎదురుచూస్తున్నాను, వచ్చావు.” ఆమె కళ్ళు నవ్వుతున్నాయి.

నన్ను తీసుకు వచ్చిన సొట్టబుగ్గల పిల్లవాడు నాకు ఎక్కడా కనిపించలేదు. “ఇక్కడికి తీసుకు వచ్చిన పిల్లవాడు ఎవరు?” అన్నా.

“చిరుబ్! అతడికి ఎవరిని ఇక్కడికి తీసుకు రావాలో తెలుసు… వెళ్ళేముందు నీకో షరతు జూన్” అంది.

“ఏంటి?” అన్నా అనుమానంగా.

“నువ్వు నాతో ఉన్నంతసేపు నిన్నని రేపటికి మరిచిపోవాలి. ఇంకా ప్రశ్నని వదిలేయాలి.”

ఇది సాధ్యమేనా? అన్నిటిని మించి ప్రశ్నని ఆపడం. ఆమె చిన్న పికప్ ట్రక్‌లో బయలుదేరాం. ఆ బండి లోయ లోకి వెళ్తుందని అర్థమైంది. ఏటవాలుగా ఉంది బాట. చాలా నెమ్మదిగా వెళుతోంది ఎలేరా. చుట్టూ కొండల మధ్య సురక్షితంగా అనిపించింది. కొద్దిసేపటికే ఎలేరా ఇంటి ముందు ఆగాము. కొద్దిగా ఎత్తులో కొండ మధ్యలో ఉందా ప్రదేశం. ముందు చదునుగా ఉన్న ప్రదేశం, చిన్న ఇల్లు. మనుషులను ఆహ్వానిస్తున్నట్లు ఒకరకమైన ఆహ్లాదం ఉంది. మనుషుల అవసరం లేదేమో ఆహ్లాదంగా ఉండటానికి. మొదట ఆ ఇంటి లోపలకి వెళ్ళలేదు నేను, ఆ రాతి అరుగులపైన కూర్చుండిపోయా. సన్నటి లావెండర్ వాసన. ఎలేరా చిన్న కప్పుల్లో టీ పోసుకొని ఇచ్చింది. ఆ టీ తాగుతుంటే, లావెండర్ తోటల్లో తిరుగుతున్న అనుభూతి. సూర్యాస్తమయం అవుతోంది. తన చేతిలో గీతాంజలి పుస్తకం. పక్కన కూర్చొని చదవడం మొదలుపెట్టింది.

The time that my journey takes is long and the way of it long.

I came out on the chariot of the first gleam of light, and pursued my voyage through the wildernesses of worlds leaving my track on many a star and planet.

It is the most distant course that comes nearest to thyself, and that training is the most intricate which leads to the utter simplicity of a tune.

The traveler has to knock at every alien door to come to his own, and one has to wander through all the outer worlds to reach the innermost shrine at the end.

My eyes strayed far and wide before I shut them and said “Here art thou!”

The question and the cry “Oh, where?” melt into tears of a thousand streams and deluge the world with the flood of the assurance “I am!”

కళ్ళు చెమ్మగిల్లాయి. కొండమీద గీతాంజలి పరిమళం వ్యాపిస్తుంది. లోపల ఉన్న ఉద్వేగం, ఉవ్వెత్తున లేస్తున్న భయాలన్నీ చల్లారిపోయాయి. లోపల నది శాంతించింది, ప్రవాహం నెమ్మదించింది. పరిగెత్తే కాలం నెమ్మదిగా ఆగిపోయింది. సన్నటి జల్లు మొదలైంది, చినుకులు నన్ను ఆర్తిగా చుట్టుకుంటున్నాయి.

“వర్షం పడుతుంది, లోపలికి వెళదామా? చలి కూడా మొదలైంది.”

ఆ ఇంటి లోపలకి వెళ్ళాను, అదెప్పుడో నేను ఉన్న స్థలం లాగా, నాకు తెలిసిన ప్రదేశం లాగా అన్పించింది. తను సన్నగా పాడుతూ పనిచేస్తోంది. లోపల వెచ్చగా ఉంది. ఫైర్‌ప్లేస్ వెలుగుతోంది… కట్టెల మీద సన్నటి వెలుగు. ఆ వెలుతురులో ఎలేరా చుట్టూ వెలుతురూ కనిపిస్తోంది. ఓవెన్‌లో పెట్టిన బ్రెడ్ తియ్యటి వాసన, ఆలివ్ ఆయిల్ నింపిన చిన్న గిన్నె. చిన్న చిన్న చేపలతో సూప్ చేస్తోంది. “వీటిని ఆంచోవీస్ అంటారు, చేపలు తింటావు కదా” అంది. నేను అలానే చూస్తున్నాను. చిన్న ఆయిల్ పెయింటింగ్స్ గోడల మీద. చిన్న చీకటి ఎంత బావుంది ఈ నిశ్శబ్దం.

మరి నాకెందుకు నిశ్శబ్దం భయంకరంగా ఉంటుంది అతడితో! అతడు మాట్లాడకుండా తన పని తాను చేసుకున్నప్పుడు. ఏ మాత్రం విసుగులేకుండా నిర్వికారంగా చూసే చూపులు. అంత ప్రేమ, ఇష్టంతో తాకిన స్పర్శని భరించలేక పారిపోయిన నేను. నీకెప్పుడూ మనుషులు కావాలి, నువ్వంతా ఖాళీ. నీలో శూన్యం తప్ప ఏమీ లేదు! అని పెదవి విరిచి విసిగిపోయి వెళ్ళిపోయిన అతడు. నాలో ప్రేమే లేదని తేల్చిన అతడు ఈ నిశ్శబ్దాన్ని అనుభవించగలడా!

ఎలేరా పిలుస్తోంది. “జూన్, ఈ సమయం మనకి తక్కువ ఉంది, రా ఇటు.” ఎలేరా షరతు గుర్తుకు వచ్చింది.

అంత రుచికరమైన వంట నేనింత వరకూ తినలేదు. ఎలాంటి ఆలోచనలు రాలేదు.

ఆమె నాతో గీతాంజలి చదవడం, ఒకటి రెండు మాటలు తప్పించి ఇంక ఏమీ జరగలేదు.

వర్షం ఎక్కువైంది, మంచు కూడా కురుస్తున్నట్లుంది బయట. ఫైర్‌ప్లేస్‌లో మంట, చలి తెలీడం లేదు. చిన్న మంచం పైన వెచ్చగా పడుకున్నాను. ఎలేరా వచ్చి నా పక్కన కూర్చుంది. తను అల్లిన స్కార్ఫ్ నా మెడలో వేసింది. అది లేత నీలంరంగులో రోజాపూల డిజైన్‌లో అల్లింది, అది ఎప్పుడు పూర్తి చేసిందో తెలీదు. నా మెడలో వేసి “గుడ్‌నైట్ మై చైల్డ్!” అంది. నుదిటి పైన చిన్న ముద్దు పెట్టింది. నిద్ర ముంచుకువచ్చింది. దాము దొంగతనంగా మేక పాలు తెచ్చిచ్చినప్పుడు వాడి కళ్ళలో ప్రేమ గుర్తొచ్చింది. మొఖమంతా నవ్వుతూ అమ్మ నన్ను కౌగిలించుకుంటుంది. ఎలేరా షరతు.

ఈ చలికాలం కళాకారులు, అందమైనవాళ్ళూ తప్ప ఈ ప్రదేశాలకి ఎవరూ రారని అతని ఫ్రెంచ్ యాసలో ఇంగ్లీష్‌లో నా ముందు కూర్చున్న కొత్తగా పెళ్ళైన జంటతో అంటున్నాడు రీకో. ఎక్కడ ఉంది తను, ఏంటి ఇదంతా, ఎలేరా లేదా, నిజంగానే లేదా! నా మెడ చుట్టూ చుట్టిన స్కార్ఫ్, ఆమె లావెండర్ పరిమళం నాకు ఇంకా తెలుస్తుంది. ఏంటిదంతా జరగలేదా!

అందరూ చిన్న ఫ్రెంచ్ పదాలతో ఉత్సాహంగా జంటలు జంటలుగా బోఁజూర్ లక్ష్మీ! అంటున్నారు. నేనింకా అయోమయంలోనే ఉన్నట్లనిపించింది. నిన్న రాత్రి ఎప్పుడూ లేనిది బాగా మంచు కురిసింది. అక్కడ ఎలా ఉంటుందో అంటున్నాడు రికో. కొందరు వెళదామని, కొందరు వద్దని వాదించారు. నేను వెళ్ళాలని పట్టుపట్టేసరికి, సరే వెళ్ళిచూసొద్దాం అని బయలుదేరాం. నాకా ప్రయాణం కొత్తగా అనిపించలేదు, అవన్నీ అంతకుముందే చూసినట్లు అర్థమవుతోంది. అక్కడికి వెళ్ళేసరికి మంచువల్ల అన్నీ మూసివేశారని చెప్పేసరికి, వెనక్కి తిరగక తప్పలేదు. అంత చలిలోనూ ఒక్కసారి ఎలేరా షాప్ ఉందేమో చూడాలనిపించింది.

లోపలకి వెళ్ళడానికి ఉన్న పెద్ద గేట్ మూసి ఉందని తెలిసింది. ఒకసారి వాన్ దిగి కొంచం ముందుకు నడిచా. అప్పుడు చూశా సొట్టబుగ్గల పిల్లవాడు చిరుబ్ నవ్వుతూ వస్తున్నాడు. వాడి చేతుల్లో స్కార్ఫ్‌లు ఉన్నాయి, లేత నీలం రంగుపైన గులాబీల ఊలు స్కార్ఫ్ తీసి అడుగుతున్నాడు కొనమని, తియ్యగా బోఁజూర్ అంటూ. దూరంగా వెదురు లోపలికి వెళ్ళిన గాలి వేసే సన్నటి ఈల.


శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...