ఇమేజెస్ ఆఫ్ సబూ

కలలో నుంచి మెలుకువలోకి రాగానే ముందుగా హ్యారీ గుర్తొచ్చాడు. ఈ కల గురించి హ్యారీకి చెప్తే… అతడు ఏదైనా విశ్లేషించి నాకు చెప్తాడనుకున్నాను. కానీ అతడేమో అర్థంకాని పజిల్ చెప్పినట్లు, అతని గురించి ఏదో చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తరువాత అతను కనిపించాలని నేను ఎంత కోరుకున్నా అతను నాకు ఎదురుపడలేదు. ఇంకెప్పుడూ కనిపించనే లేదు.


ఎప్పుడైనా నేనీ పార్కులో నడవడానికి వచ్చినప్పుడు హ్యారీ కలుస్తుంటాడు.

అతనితో పరిచయమే చిత్రంగా జరిగింది.

అతను నడుస్తున్నప్పుడు అతని పాకెట్ నుంచి డబ్బులు జారిపోతున్నట్లు గమనించాను. అతని వెనుకే పడుతూ వస్తున్న డబ్బులన్నీ ఏరి చివరికి అతని చేతిలో పెట్టాను.

అతను నా వైపు విషాదంగా చూసి “ఎందుకు పారేసుకున్నవాటిని తిరిగి ఇస్తున్నావు, అవి నా నుంచి పోవాలనుకుంటున్నాయి” అన్నాడు.

“అవి పోవాలనుకోవట్లేదు, నువ్వు పోగొట్టుకోవాలనుకుంటున్నావు. పోగొట్టుకోవాలనుకున్నంత మాత్రాన ఏవీ పోవు కదా! అవి పోవాలనుకున్నప్పుడే పోతాయి. ముఖ్యంగా డబ్బు” అంటూ నవ్వుతూ వాటిని అతని చేతిలో పెట్టాను.

ఆ రకంగా హ్యారీ పరిచయమయ్యాడు.

నడుస్తున్నప్పుడు, ‘ఈ హ్యారీ ఎక్కడ’ అని తలుచుకోగానే వెంటనే హఠాత్తుగా ఎదురుపడేవాడు. ఆశ్చర్యంగా అనిపించేది. “నేను కోరుకున్నప్పుడు అలా ఎలా వస్తావు. నాకు భలే అనిపిస్తుంది నువ్వు అలా కనిపించినప్పుడు” అంటే “నేను ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టే నేనొస్తున్నాను” అని చెప్పేవాడు. అది జోక్‌లా కాకుండా సీరియస్‌గా చెపుతున్నట్టే అనిపించేది. “నేను రావొద్దంటే నువ్వు రావా?” అంటూ వెటకారంగా అడిగేవాడిని. హ్యారీ నవ్వి ఊరుకొనేవాడు. ఎన్నెన్నో మాట్లాడి వెళుతుండేవాడు. అతని మాటలు మనుషులకి సంబంధం లేనివేవో చెపుతున్నట్లు ఉండేవి.


ఒక రోజు హ్యారితో మాట్లాడుతూ నాకొచ్చిన కల గురించి ప్రస్తావించాను.

“నువ్వెప్పుడూ కలల గురించి చెప్పలేదే, నువ్వు కలల్ని నమ్ముతావా!?” అని అడిగాడు.

“నమ్మను, కలలు మోసం చేస్తాయి. కొన్ని నమ్మించి గొంతు కోస్తాయి. మరికొన్ని మనుషులందరూ మంచివాళ్ళని ఏవేవో అబద్ధాలు చెప్తూ ఉంటాయి. ఒక్కోసారి కలలో నేనెవరితోనో కలిసి తిరుగుతున్నట్లు, వాళ్ళు నన్ను వశపరుచుకున్నట్లు అనిపించి భయంవేస్తుంది. చాలాసార్లు కలలు నాకు గుర్తుండవు. ఏదో మాయ చేసినట్టు వచ్చిపోతుంటాయి. అందుకే నేను కలల్ని నమ్మను. నిజానికి పట్టించుకోననుకో. కానీ ఈ కల అలా లేదు. చాలా చిత్రంగా ఉంది.”

సాధారణంగా హ్యారీ నేను చెప్పే మాటలన్నీ శ్రద్ధగా వింటాడు. విన్న తరువాత కొద్దిగా మాట్లాడతాడు. ఎప్పుడో ఓసారి నేను వింటున్నానో లేదో సంబంధం లేకుండా ఓ గంటపాటు అలా మాట్లాడుతూనే ఉంటాడు. కానీ, ఈసారెందుకో అంత చెప్పినా హ్యారీ ఏమి మాట్లాడలేదు. ఏదో ఆలోచనలో పడినట్లున్నాడు.

కాసేపాగి కల గురించి చెప్పడం మొదలుపెట్టా.

“నేనొక పసిరిక పాములా చెట్లపైన తిరుగుతున్నాను. ఒక చెట్టుపైనుండి ఇంకో చెట్టుపైకి ఎగురుతున్నాను. నా ఒళ్ళు ఆకుపచ్చగా మెత్తగా ఉంది. శరీరం వెన్నెముక లేకుండా తేలికగా ఉంది. వెన్నెముక లేకపోతే ఎంత హాయి, దేన్నైనా చుట్టుకోవచ్చు. సన్నటి చెట్లకొమ్మలకి ఒళ్ళంతా చుట్టుకొని, శరీరం మెలికలు తిప్పుతూ, అపుడప్పుడు ఆ చెట్ల పైనుంచి ఎగురుతూ ఉన్నా. ఆ చెట్లల్లో కలిసిపోయి ఎవరికీ కనపడకుండా ఉండటం ఆనందంగా అనిపించింది. నేను మనిషిని కానని, ఇక భయం లేదని తోచింది. ఎలా చూసిందో ఓ గద్ద, నన్ను పట్టుకోవాలని రివ్వున కిందకి దూసుకొచ్చింది. అది వస్తున్నది పసిగట్టి భయంతో జారి భూమిపై పడ్డాను. వెంటనే మనిషినైపోయి పరిగెత్తాను. నన్ను తరుముకొస్తున్న గద్ద పారిపోయింది. నేను మళ్ళీ మనిషిలా మారిపోడం దుఃఖంగా అనిపించింది. కలలోనే ఏడ్వడం మొదలుపెట్టా. అప్పుడు మెలుకువ వచ్చేసింది.”

హ్యారీ ముఖంలో ఏదో ఆందోళనతో కూడిన నవ్వు. “ఏమయ్యింది?” అన్నా.

కొంచెం తటపటాయింపు తరువాత నెమ్మదిగా, “నేనొక విషయం చెప్పాలి” అని కొద్దిగా ఆగాడు.

నేనంత ఇదిగా చెప్పిన నా కల గురించి ఏమీ మాట్లాడకుండా అతనేదో చెప్పబోతున్నాడని అర్థమయ్యింది. హ్యారీ, తన గురించి ఏదైనా చెప్పుకోవడం నేను ఎప్పుడూ వినలేదు. నాలోపలి ఉత్సాహం బయటికి తెలీకుండా ముఖం పెట్టాను.

అతడు నావైపొకసారి చూశాడు. అతడి కళ్ళు వర్షం ముందు వచ్చే మబ్బుల్లా ఉన్నాయి. అతడేదో సంఘర్షణలో ఉన్నట్లు అనిపించింది.

“కొన్ని రోజులుగా చాలా దాహంగా ఉంటోంది. ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరట్లేదు. నా దగ్గర ఉన్నవి సరిపోక కొందరి ఇళ్ళల్లో నీళ్ళు అడిగి మరీ తాగాను. ఆ రకంగా అయినా నా దాహం తీరుతుందేమోనని.”

“డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసింది కదా!” నా బలహీనమైన సలహా నాకే అసంబద్ధంగా అనిపించింది.

అతడు చెపుతున్నది నేను వింటున్నది రెండు ఒక దగ్గర లేకపోవడమేమో! అతడు ఆ మాటలు విననట్లే చెప్పుకుపోతున్నాడు.

“నా దాహం తీరడం లేదు. లోలోపల దహించి వేస్తున్న దాహం. అంచెలంచెలుగా పెరిగిపోతున్న దాహం. చివరకు నిద్ర కూడా కరువైంది. ఏమి చేయాలో తోచలేదు. మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళాను. అతడు నాకు పాలీడిప్సియా ఉందని, నాలో ఒక రకమైన స్క్రిజోఫినిక్ లక్షణాలు కనిపిస్తున్నాయని నిర్ధారించాడు. నాకు భయం వేసింది. నాకు దాహం తప్ప ఏమీ లేదని చెప్పేందుకు ప్రయత్నించా. కానీ అతడు వినలేదు. మెదడు మగతలో జారుకోవటానికి అంటూ కొన్ని మందులు ఇచ్చాడు. అవి నేను తీసుకోలేదు. మళ్ళీ వైద్యుడి దగ్గరికీ వెళ్ళలేదు. నా దాహం మాత్రం పెరుగుతూపోయింది. ఓ రోజు ఆ దాహాన్ని తట్టుకోలేక రాత్రిపూట పిచ్చివాడిలా బయట తిరిగాను. అలా తిరిగి తిరిగి అలసిపోయి ఓ చెట్టుకింద కూర్చున్నాను. ఆ చెట్టు ఆకులపై నుంచి జారి కొన్ని చుక్కల నీళ్ళు నా పెదవులపై పడ్డాయి. ఆ చుక్కల వల్ల లోపల మండుతున్నదేదో చల్లారుతున్నట్లు అనిపించింది. ఒక్కో చుక్క, ఒక్కో చుక్క… ఆబగా ఆ నీటి చుక్కల్ని అలానే తాగుతూపోయాను. ఆ రోజుకి నా దాహం తీరిపోయింది. ఎన్నో రోజులుగా వెంటాడి వేధించిన దాహం తీరిపోవడం వల్లనేమో అక్కడే అలసిసొలసి‌ అలానే పడి నిద్రపోయాను.”

నేను విభ్రమంగా వింటున్నాను. అతడి మాటలు కొంచెం భయాన్ని కూడా కలిగించాయి.

“ఇప్పుడు కూడా అలానే చేస్తున్నావా!?” ఆత్రుతగా సందిగ్ధంగా అడిగాను.

“అవును, మొదట్లో రెండు చుక్కల నీళ్ళు సరిపోయేవి. కానీ ఇప్పుడు ఒక్కో రోజుకు ఒక చుక్క ఎక్కువ తాగితేనే దాహం తీరుతోంది. రోజు రోజుకి నేను తాగే నీటిబొట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇంకా విచిత్రమేమిటంటే నేను ఒకసారి నీరు తాగాక ఆ చెట్లు క్రమంగా ఎండిపోతున్నాయి.” అలా చెప్తున్నప్పుడు అతని గొంతు కొద్దిగా వణికింది.

“ఇదేమి కల కాదుగా!” అనుమానంగా అడిగా.

“సబూ… ఏది కల? ఏది వాస్తవం? ఎలా చెప్పగలం. ఇప్పుడు నువ్వు కలలో ఉన్నావో వాస్తవంలో ఉన్నావో చెప్పు” అంటూ ఎదురు ప్రశ్న వేశాడు హ్యారీ.

కొద్దిగా అయోమయంగా అనిపించింది. “అంటే నువ్విప్పుడు వాస్తవం కాదా?” అని అడిగా.

హ్యారీ చిన్నగా నిగూఢంగా నవ్వాడు.

అతడు చెప్పిన విషయం నాకు చిత్రంగా తోచింది. నేనే ఓ కల గురించి చెప్తుంటే అతడు ఇలా చెప్తున్నాడేంటి అనిపించింది. నా కలే నిజమై, ఎప్పుడూ వాస్తవంగా తోచే ఇతడే కలనా అన్న సందేహమూ కలిగింది.

కొంచెం సర్దుకొని అడిగా “ఇప్పుడు నీకెన్ని చుక్కలు కావాలి?”

“మా తోటలోని సగం చెట్లు కావాల్సి వస్తోంది. నేను రాత్రులు తోటవైపు వెళ్తుంటే, ఆ చెట్లన్నీ గుసగుసలాడుకుంటున్నాయి. నన్నేదో మాంత్రికుడిని చూసినట్లు చూసి భయపడుతున్నాయనిపించింది. నాకీ దాహం ఎలా తీర్చుకోవాలో తెలీట్లేదు, సబూ” అన్నాడు దిగాలుగా.

అతని చర్మం కొద్దిగా పసుపుపచ్చని కాంతితో సన్నటి ముడతలతో కనిపించింది. హ్యారీ ఎప్పుడూ అబద్ధాలు చెప్పడు. అతని బాధ అతని కళ్ళలో కనిపిస్తోంది.

అతని ఆలోచనలను మళ్ళిద్దామని నా కలను గుర్తు చేస్తూ, “ఆకుపచ్చని పాముల్లో విషముండదు తెలుసా!” అన్నా.

హ్యారీ సాలోచనగా చూస్తూ, “అవి మనుషుల కళ్ళల్లో కాటేస్తాయని మా తాత చెప్పేవాడు” అన్నాడు.

అతడి మాటలు ఎదురు తగిలినట్టు అనిపించాయి. ఉక్రోషంగా అడిగా “చెట్లు ఎండిపోయాక నువ్వు ఎలా బతుకుతావు?”

అతను నా మాటను పట్టించుకోకుండా, “అయినా పాములు చెడ్డవని నేను అనుకోవట్లేదు” అని వెళ్ళిపోయాడు.

మా సంభాషణ ఇంత అసంబద్ధంగా ముగుస్తుందని నేను అనుకోలేదు.


కొన్ని రోజులుగా ఆ పార్కులో చెట్లు ఎండిపోయి పెచ్చులు ఊడిపోతున్నట్లు అనిపించింది. అతను చెప్పింది నిజమని అర్థమైంది. హ్యారీ దాహం తగ్గడానికి ఏమి చేస్తే బావుంటుందని అనుకున్నా. నాకేమీ సమాధానం తట్టలేదు. ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నట్లు తోచింది. ఇదంతా హ్యారీ మూలంగానే అన్నట్లుగా ఉంది. ప్రపంచం అంతా ఎడారిగా మారిపోతుందేమోనని భయం వేసింది. గాలిలో ఒక్క చుక్క నీరులేకుండా హ్యారీ తాగేస్తున్నాడు అనిపించింది.

అనవసరంగా అతనితో స్నేహం చేశానని నన్ను నేను తిట్టుకున్నా. అతను చచ్చిపోవాలని పదేపదే కోరుకున్నా. ఆ రాత్రి ఒక్క క్షణం నా మనసెందుకో విషాదంగా మారిపోయింది. అంతలోనే ఏదో వెర్రి ఆనందం కూడా కలిగింది.

మరుసటి రోజు భయంకరమైన తుఫాను వచ్చింది. మూడురోజులు ఆగకుండా వర్షం. సూర్యుడి జాడే లేదు. చాలా చెట్లు మొదలు నరికినట్లు పడిపోయాయి. నెల రోజులకు పరిస్థితి కొంచెం సర్దుకుంది. చెట్లు తాజాగా పచ్చగా మెరుస్తూ కొత్త చిగుర్లు తొడుగుతున్నాయి.

హ్యారీ భూమీద నుంచి మాయమైపోయాడని అనిపించి ఆనందం వేసింది. అతను నేను కోరుకున్నందుకు మాయం అవ్వలేదని, భూమిపై ఉండటం ఇష్టం లేక అతడు వెళ్ళిపోయాడని, ఈ భూమిని రక్షించుకున్నందుకే నా ఆనందం తప్ప హ్యారీ లేనందుకు కాదని మనసుకు సర్దిచెప్పుకున్నా.


ఆ తరువాత కొన్ని రోజులకు నా చిటికెన వేలు గోరు ఆకుపచ్చగా మారడం గమనించా!

శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...