ఆట

‘ఎంత పని చేశాడు గిరిగాడు! అన్న అని కూడా చూడకుండా పొడిచేశాడు. రౌడీముండాకొడుకు ఒక్కరోజు సరిగ్గుంది లేదు. ఏదైనా మంచి చెప్పబోతే అమ్మనాబూతులు తిడతాడు. వాడు ఎన్ని గొడవలు పడ్డా నారాయణ నవ్వుతూనే ఇంతకాలం భరిస్తుండు. ఎంత మంచోడు, నెమ్మదస్తుడు.’

అందరూ వాడిని తిడుతున్నారు. నామీద సానుభూతి జల్లు కురుస్తుంది. నన్నెత్తి అంబులెన్సులో పెడుతున్నారు. లక్ష్మి ఏడుపు గట్టిగా వినపడుతోంది. అంబులెన్సు సౌండ్ చేస్తూ బయలుదేరింది.

ఇదంతా ఎప్పుడో మొదలైంది.

వాడు పుట్టకముందే నాలో స్వార్థం పుట్టింది. అన్నిట్లో అంతటా నాది అని వచ్చిచేరాక చెప్పాపెట్టకుండా పుట్టాడు వీడు, అదీ అందంగా. నన్ను మెరుస్తున్న కళ్ళతో నవ్వుతూ చూశాడు. ఆ నవ్వే వాడ్ని నాకు నచ్చకుండా చేసిన మొదటిక్షణం. మరియమ్మ ఒడిలో వాడు ఆడుకుంటున్న క్షణాలు అస్సలు నచ్చనివి. అదే ద్వేషమేమో! అలా అని ఏమైనా చూపించానా బయటికి? వాడిపై నా అయిష్టత ఎవరూ కనిపెట్టలేకపోయారు. అది వాడితోపాటే పెరిగి పెద్దదైంది. నాలోని అయిష్టత వాడికి తెలుస్తుందని అనుకోలేదు. కాని వాడికి తెలిసిపోయింది.

మరియమ్మ వాడినే కలవరిస్తా పోయింది. నన్ను కదా ఆమె మొదట పెంచింది. ఏదడిగినా ఇచ్చాను ఆయమ్మైనా కూడా. అయినా వాడినే ఇష్టపడింది, వాడు అమ్మా అనేవాడనా? చివరికి లక్ష్మి కూడా వాడిని నవ్వుతున్న కళ్ళతో చూసేది. ఆ చూపుల్లో ఇష్టం. అది నా జీవితంలోకి కదా వచ్చింది? నావైపు భయంతోనో భక్తితోనో చూసేదే తప్ప ఏవి ఆ ఇష్టపడే కళ్ళు?

లక్ష్మి ఏడుస్తున్నట్లుంది సన్నగా. ‘బాబూ! ఆయనకి ఏమి కాదుగా?’ అని అడుగుతుంది పక్కనున్న కాంపౌండర్‌నేమో. లక్ష్మి నిజంగానే ఏడుస్తుంది. పాపం ఏడవక ఏం చేస్తుంది. ఎంతైనా మొగుడిని కదా!

‘ఏమీ కాదులేమ్మా, అసలేమైంది, తమ్ముడు పొడవడమేంటి?’

‘ఏముంది బాబూ. కాలవ దగ్గర గొడవ ఇంత పెద్దదైంది. గిరి ప్రతిదగ్గర కావాలనే గొడవపడేవాడు. అన్నీ సహించి క్షమించేవాడీయన. చివరికి ఈన్నే పొడిచేదాకా వచ్చింది.’ సన్న ఏడుపుతోనే చెప్తుంది లక్ష్మి.

నేను నిజంగా సహించానా? సహించడంలో కవ్వించి వదిలి పెట్టలేదా? క్షమించడంలో వాడి అసమర్థతను గుర్తుచేస్తూ ఎన్నిసార్లు నవ్వలేదు. నవ్వాను, లోపల్లోపల గట్టిగానే నవ్వుకున్నాను. ఎవ్వరూ గుర్తు పట్టలేనంత బలంగా ముసుగేసుకున్నా వాడు మాత్రం నా ముసుగెనక అసలు స్వరూపాన్ని గుర్తించేవాడు. అది భరించలేక ప్రతిసారి గొడవపడేవాడు. నిజాయితీ అంటే అదేనేమో! అదే వాడ్ని జనానికి తప్పుటోడుగా కనిపించేట్లు చేసేది. ఆ కొట్లాటలతో నా ముసుగుని తీసేయాలని బండగా చూసేవాడు. నేనేమి చేశా? నిశ్శబ్దంగా ముసుగును కాపాడుకొంటా గెలుస్తూనే వచ్చా. విసిగి వేసారి పొడిచేశాడు. నేను సాధించాను. వాడ్ని అందరి ముందు పూర్తిగా చెడ్డవాడిగా నిలబెట్టడంలో గెలిచాను. ఇంతచేసినా వాడు మళ్ళీ నన్ను వెక్కిరిస్తున్నట్లు నన్ను పొడిచి అంబులెన్సు పిలిచి పోలీసుల దగ్గరికెళ్ళాడంట. వెళ్ళేప్పుడు వాడి చూపు, వాడన్న మాట వెంటాడుతూనే ఉంది. ఇదేగా నీక్కావల్సింది అన్నట్లు చూశాడు. “భయపడకు. చచ్చిపోయేంత పొడవలేదు” అన్నాడు శాంతంగా. వాడి ముఖం దుఃఖంతో ముసురుతో అలసిపోయినట్లున్నా నిర్మలంగా ఉంది. అది వాడు నాతో చివరిసారి చేసుకున్న ఒప్పందంలా ఉంది. ఈ ఆనందం ఎందుకిలా చివరికి దుఃఖమై చీకటి కమ్ముతుంది? ఇదేగా నీకు కావాల్సిన గెలుపు అంటూ గెలుపును నాకిస్తూ ఓడించాడా?

అంబులెన్సు శబ్దం గట్టిగా చెవుల్లో మోగుతుంది. లక్ష్మి ఏడుపు ఇప్పుడు వినబడట్లేదు. చిట్టి గుర్తొచ్చింది. చిట్టి కూడా వాళ్ళ నాన్నలాగే. ఐదేళ్ళులేవు దానికి, ఆ పిల్లది గోడవతల నుంచి నా వైపు చూసి చేతులూపేది. వేలు చూపించి ముక్కు కోస్తా అని బెదిరించేది. వెంటనే చల్లగా నవ్వేది. అచ్చం వాడి మెరుస్తున్న నవ్వులాగే. లక్ష్మికి భలే ముద్దు చిట్టి అంటే. చిట్టి నవ్వు ఎంత బావుంటుందో కదా అనేది. నాకు తెలుసు లక్ష్మికి చిట్టి నవ్వు ఎందుకు ఇష్టమో! చిట్టి నవ్వు నన్ను ప్రశ్నలతో గుచ్చినట్లు అనిపించేది.

పొడిచినచోట విపరీతమైన నొప్పి, మంట. ఇంకా హాస్పిటల్ ఎంత దూరంలో ఉందో? చౌడుచేను నుంచి పాతిక కిలోమీటర్లు. ఇంకెంత సేపు పడుతుందో? చౌడుచేను నా చేతికొచ్చినప్పుడు వాడెంత గొడవ చేశాడు, ఆ చేను వాడికి కావాలని. ‘నీకు మంచిగా పండే చేనిచ్చి బీడుగా ఉన్న చేను మీ అన్న తీసుకుంటే గొడవచేస్తున్నావేందిరా’ అని ఊర్లో జనాలు వాడిని అంటుంటే నా వైపు వాడు కోపంగా చూసిన చూపు, నవ్వుతూ రెచ్చగొట్టిన నా నవ్వు గుర్తొస్తుంది. కాలువ కిందెత్తులో ఉన్న చౌడు చేను. ‘ఎప్పుడైనా బంగారం పండే పొలంరా ఇది, చౌడప్ప చేతిలో బీడుగా ఉంది ఇన్ని రోజులు’ అని నాయన నాకు కూర్చోపెట్టి చెప్పేటప్పుడు వాడక్కడే ఆ చేనుమట్టితో ఎద్దులు చేస్తున్నాడు. వాడు వింటున్నాడని తెలుసు నాకు. వాడు వింటున్నది నాకు తెలుసని వాడికీ తెలుసు. ‘వీడిచేతుల్లో ఏదో కళుందిరా! ఎంత బాగా చేశాడో చూడు వీడు మట్టితో ఎద్దు బొమ్మల్ని!’ అన్నాడు నాయన వాడి వైపు మురిపెంగా చూస్తా. నాయన కూడా అంతే.

“అన్నా! చౌడుచేనులో నేను ఈ ఎద్దులతో దున్నుతా!” అన్నాడు గిరి నాకు ఎద్దు బొమ్మను చూపిస్తా.

ఆ తరువాత రెండెద్దుల్లో ఒక మట్టి ఎద్దు పగిలిపోయింది. వాడారోజు అన్నం తినకుండా ఏడుస్తూనే ఉన్నాడు. నా కాలి చెప్పులకి అంటిన మట్టిని చూసి ఏం జరిగిందో అర్థమైందేమో కోపంతో నాతో కలబడి పెన్నుతో గుచ్చిన గుర్తు చెయ్యి మీద చురుక్కుమంది. కాలవ గండి కొట్టించి, వాడి చేనుకు నీళ్ళు పోకుండా ఆపింది నేనే అని వాడికి తెలుసు. కేవలం వాడికి మాత్రమే తెలుసు. ఇప్పుడు కడుపులో పొడిచాడు. నొప్పి ఎక్కువైంది.

కాంపౌండర్ని ‘ఎంతవుద్ది పెద్ద హాస్పిటల్లో?’ ‘మీది ఏ వూరు?’ అని అడుగుతుంది లక్ష్మి. ఇప్పుడెందుకో దాని గొంతు తాపీగా ఉంది. అంబులెన్సు ఎక్కించేముందు ఏడుస్తున్న ఏడుపు గొంతు లేదు. అందరిముందు గుండెలు బాదుకుని ఏడ్చిన లక్ష్మి. ఇది ఎప్పుడైనా మనఃస్ఫూర్తిగా ఇష్టపడిందా నన్ను?

‘ఇంత అన్యాయంగా తమ్ముడే పొడవడం ఏంటమ్మా?’ అని వాడు పదే పదే వాపోతున్నాడు. కావాల్సినంత జాలి కురిపించాలని చూస్తున్నాడు. ఈ సారి లక్ష్మి గొంతులో ఏదో శబ్దం సన్నగా ‘ఆఁ, ఈన మాత్రం తక్కువా? కనిపించడు కాని…’ అలా ఏదో. నా చెవులు సరిగానే వింటున్నాయా? అంటే నా సంగతి లక్ష్మికి తెలుసా? ఇంకెంతమందికి తెలుసు? ఎంతో పెద్దమనిషిగా పేరు తెచ్చుకున్నా కదా! అందరూ పైకే నమ్ముతున్నారా? లోపల అందరికీ తెలుసా నేనెట్లాంటివాడినో? నాయనకి, చిట్టికి తెలిసిపోయినట్లు లక్ష్మికి కూడా తెలిసిపోయిందా? నాయన పొయ్యేప్పుడు అన్నాడు కదా, ‘నారాయణా, వాడికి నీలాగా బ్రతకడం రాదురా. లోకం తెలీదు, జాగ్రత్త’ అని. ఎవడికి జాగ్రత్త చెప్పాడు నాయన? వాడిని జాగ్రత్తగా చూసుకోమనా? నన్ను వాడితో జాగ్రత్తగా ఉండమనా? వాడ్ని నాతో జాగ్రత్తగా ఉండమనా? గుండెల్లో పోటులాంటి మాట అని పోయాడు.

ఇప్పుడు లక్ష్మి. వాడిని మెరుస్తున్న కళ్ళతో చూసే లక్ష్మి.

ఇన్ని రోజులు కష్టపడి నటించిందంతా నటనని తెలుసా అందరికీ? నాకంటే వాడే హాయిగా బతికాడు ఏ నటన లేకుండా, లోపల ఏ బాధా లేకుండా. నేనే అన్నీ భరించి నటించా. నొప్పి భరించలేనంతగా ఉంది. అంబులెన్సు మలుపు తిరుగుతున్నట్లుంది కొద్దిగా పక్కకి ఒరిగా. నొప్పితో మూలిగా. ‘ఇప్పుడే బండి మెయిన్ రోడ్ ఎక్కింది. ఇంకెంతసేపో పట్టదు, కొద్దిగా ఓర్చుకోండి వచ్చేస్తున్నాం’ అంటున్నాడు కాంపౌండర్.

దేన్ని ఓర్చుకోవాలి?

నన్ను పొడిచినా, నేనే పొడిచేలా చేశానని లక్ష్మికి తెల్సిపోయింది. ఇప్పుడు బయటికొచ్చి అదే నటనతో ముసుగులో బతికి ఏం లాభం? ఇప్పుడు ఎట్లా బతికితే నమ్ముతారు వీళ్ళు? చుట్ట కాలుస్తూ ఊస్తూ నా వైపు ఏటవాలుగా చూసే నాయన, వాడికి లోకం తెలీదురా అని నవ్వే నాయన, బతకడం నీకే తెలీదురా అని వెక్కిరిస్తున్నట్లున్నాడు… అయిపోయింది. సంపాదించుకున్నదంతా పోయింది.

ఏ శబ్దాలు వినపడట్లేదు.


కొద్దిగా తడి స్పర్శ. కళ్ళు తెరిచా.

అద్దాల అవతల లక్ష్మి, నా వైపే చూస్తున్నట్లనిపించింది. ఆ చూపు నాకు అందట్లేదు. ఆ చూపు వెనుక ఏముందో నాకు తెలీట్లేదు. ఐ.సి.యు.లో ఉన్నట్లున్నా. చుట్టూతా నాలాంటి రోగులు. చావు అంచులదాకా వెళ్ళినవాళ్ళు. వెళ్ళి వెనక్కి వచ్చినవాళ్ళు. అంచులు దాటి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. ఇక్కడ మనుషులు ఎవరూ దగ్గరగా లేరు. అందరి మధ్యా అద్దాలు. ఒకరి గాలి ఒకరికి సోకదు. ఇక్కడ నటించనక్కర్లేదు. కరుణ చూపిస్తూ ఎవర్ని నవ్వుతూ పలకరించాల్సిన అవసరంలేదు.

నర్స్ నవ్వుతూ వచ్చి, “మొత్తానికి నాలుగు రోజుల తరువాత కళ్ళు తెరిచారు” అంది. నాలుగు రోజులా? మరి పైన ఉన్న నాయన కనిపించలేదే. ఈ నాలుగు రోజులు ఎక్కడికెళ్ళాను?

“రేపు రూమ్‌కి మారుస్తున్నాం.”

మళ్ళీ నటించాలా? అందరికీ నేనేంటో తెలిసిపోయాక ఏమి చేయాలిప్పుడు?


కిటికీ బయటకి చూశా. మనుషులు కనబడలేదు. ఒక నల్లకుక్క ఎంగిలిస్తరాకును తీసుకుపోతుంది. పక్కనుంచి ఓ తెల్లకుక్క ఒడుపుగా వచ్చి దాని మీద పడింది. ఎంగిలిస్తరాకు కోసం రెండు కుక్కలు కొట్లాడుకున్నాయి. తెల్లకుక్క ఇస్తరాకు లాక్కునిపోతుంది. వాటి అరుపులు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎవరో వచ్చి వాటి మీద రాయి విసిరారు. అవి ఇస్తరాకుని వదిలి చెరోదిక్కు పరిగెత్తాయి.

లక్ష్మి క్యారేజి తీసుకొని లోపలికొచ్చింది. అన్నం తీసి కూర కలిపి పళ్ళెంలో పెట్టి ఇచ్చింది.

“ఏందిది ఉప్పూ కారం లేకుండా?” అన్నా కోపంగా.

“కొన్ని రోజులు పథ్యం పెట్టమంది అమ్మ. ఉప్పూ కారం తగలనీయకుండా చలవ చేసే కూరలు” అంది లక్ష్మి.

ఉప్పూకారాలు లేకుండా రుచీపచీ లేని అన్నం. నటన లేని జీవితం. నటించకుండా ఉండలేని ముఖం.

“గిరి స్టేషన్లోనే ఉన్నాడు. ఎంతడిగినా ఏమి మాట్లాడట్లేదంట. సాయంత్రం పోలీసులు వస్తారంట మీతో మాట్లాడడానికి.”

నేను పక్కకి తిరిగి కిటికీవైపు చూశా. తెల్లకుక్క హడావుడిగా వచ్చి ఎంగిలిస్తరాకు తీసుకుపోతుంది.


“ఏం జరిగింది?”

నేనేం మాట్లాడలేదు.

“చెప్పండి మీ తమ్ముడు పొడిచాడా మిమ్మల్ని?”

“లేదు పొడవలేదు. అనుకోకుండా తూలి ముందుకి పడ్డా. గడ్డపార కడుపులో దిగింది.”

“మీ తమ్ముడు పొడిచాడని అంటున్నారు అక్కడ చూసినవాళ్ళు.”

“లేదు పొడవలేదు. కాని వాడక్కడే ఉన్నాడు. కాలువ దగ్గర ఇద్దరం ఏదో మాటా మాటా అనుకున్నాం అంతే. వాడే అంబులెన్సు‌కు ఫోన్ చేశాడు.”

వాళ్ళు నా వైపు అభినందనగా, గొప్పగా చూసి వెళ్ళిపోయారు.

“మీదెంత గొప్ప మనసండి!” అంది లక్ష్మి. తన కళ్ళల్లో మెరుపుందో లేదో తెలీట్లేదు.

నాకు నవ్వొచ్చింది. నాది నిజంగా గొప్ప మనసేనా? ఇకముందు ఇంకా గొప్పగా నటించబోతున్నానా? అంతా మరుగునపడుతుందిప్పుడు, ఈ హత్యా ప్రయత్నంలో నా ప్రమేయం గురించి ఎవరూ ఆలోచించరు. ఇది ఒక ఆరితేరిన పథకం. నాకు సంతోషంగా అనిపించింది. ఈ రోజు నాకెవరి మీదా ఎలాంటి కోపం రావట్లేదు. ముఖ్యంగా వాడి మీద. నాతో రక్తం పంచుకు పుట్టిన వాడిపైన. కడుపు నుంచి చిందిన రక్తంలా సంతోషం లోపల. ఇక తిరుగులేకుండా నాదే పై చేయి. మరి వాడు, నా ప్రతి కదలికా తెలిసిన వాడిప్పుడు ఏంచేస్తాడు?

కిటికీ పక్కన నల్లకుక్క మళ్ళీ వచ్చి వెతుక్కుంటుంది. మధ్య మధ్యలో అరుస్తుంది పైకి చూస్తూ. ఎవరో విసిరిన ఎంగిలి విస్తరాకొకటి దొరికింది దానికి. ఎక్కడినుంచో ఇంకో కుక్క అరుపు వినబడుతుంది.

మరిప్పుడు వాడు కూడా లోకం ముందు నాలాగే!


శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...