స్థితం

పక్కకి ఒత్తిగిలి పడుకున్నా. మోచెయ్యి కుమ్మరి పురుగుపై పడ్డట్లుంది. అది నలిగిపోతూ కరిచి కరిచి పెట్టింది. నొప్పి మొదలైంది. బాధగా లేదు. అది బాధకి విరుగుడులా ఉంది. నొప్పి మోచేతి నుంచి భుజానికి ఎక్కి సలపడం మొదలైంది. కళ్ళు తెరిచా. చూపు చీకట్లో కలిసిపోతుంది. తడుముకుంటూ లేచి బాత్రూమ్ వైపు వెళ్ళా. స్విచ్చ్ వేశా. జీరో వాట్ బల్బ్ సన్నటి వెలుతురు పరుచుకుంది. మూలనున్న బొద్దింక నా వైపుకి పరుగుపెట్టింది.

‘జిందగీ! దీనికీ స్వేచ్ఛ ఉంది. ఎవడి కాలికిందైనా పడిచచ్చే స్వేచ్ఛ. కనీసం చావడానికైనా.’

బయటకొచ్చి బాల్కనీ తలుపు తెరిచా. చిన్న శబ్దం ఏదో. అబ్బా! చల్లగా తగిలింది గాలి చేతులకి, కాళ్ళకి, మొహానికి. మిగతా శరీరం బట్టల వెనుక దాక్కొని ఉంది. ఆకాశం స్తబ్దంగా ఉంది. మునగదీసుకొని పడుకున్న సన్నజాజి చెట్టు నీడ. టైమ్ రెండయ్యిందేమో. ఒక్కసారిగా అంతా అపరిచితంగా అనిపించిందక్కడ. పొద్దుటి మాటలు ఇంకా గాల్లోనే తచ్చాడుతున్నాయి. అయిపోయిందిక. వెళ్ళిపోవాలి ఇక్కడనుంచి. ఇప్పుడే వెళితే మంచిదా? పొద్దున్నే చెప్పి వెళ్ళాలా? ఎవరు పట్టించుకుంటారు? పక్కనుంచి సన్నగా మందుల వాసన. పోచవ్వకి అర్థమయ్యే ఉంటుంది. ఏమనుకుంటుంది? దీని దారి ఇది చూసుకుందనా! నన్ను చూసుకొనే ఒక్కదిక్కూ పోయిందనా! ఎట్లా అనుకున్నా ఏం చేస్తా? అయినా చెప్పి వెళ్ళడం మంచిదేమో. అవసరం అయితే మళ్ళీ వెనక్కి రావాలిగా. లోపల ఎవరో హెచ్చరించారు, వెనక్కి వచ్చే ఆలోచనే ఉంటే నువ్వు పోకపోవడమే మంచిదని. హెచ్చరికలు లెక్కచేయకుండా వెళ్ళడం నేర్చుకొని చాలా కాలమైంది. అట్లా కాదులే, హెచ్చరికలకి భయపడట్లేదు అనుకోవాలి.

హాల్లోకి వచ్చా. కొందరు నిద్రపోతున్నారు. కొందరు నిద్ర నటిస్తూ మెలుకువ దాచుకుంటున్నారు. వాళ్ళకి నా ఉనికి చిరాగ్గా ఉన్నట్లుంది. జత బట్టలు, టవల్ తీసుకున్నా. బ్రష్, పేస్ట్, దువ్వెన గుర్తొచ్చాయి. అవీ తీసుకున్నా. ఇంకా ఏవో గుర్తొచ్చాయి. అన్నీ వదిలేసి పోవడానికి అన్నీ తీసుకెళ్ళాలనుకోవడం, ఏది లేకపోయినా ఇబ్బందనో, చిన్న వస్తువే కదా అనో ప్రతిదీ సంచిలో పెట్టుకోవడం. చివరికి ఏది అవసరమో ఆలోచించి కొన్ని తీసుకొని బయటపడ్డా.

ఒక్కసారిగా అందరిమీద విపరీతమైన ప్రేమ. లోపలికొచ్చి నా గురించి ఆలోచించకండి. అమ్మణి దగ్గరికెళ్తున్నా అని పుస్తకంలో పేపర్ చించి రాసి అక్కడ టేబుల్ పైన పెట్టా. కుమ్మరి పురుగు కరిచిన దగ్గర చురుక్కుమని నొప్పి. ఎంత నొప్పి తీసింది! కొంచం విషం ఉండి ఉంటది. లోపల ఉన్న విషంతో ఇది ఎలా సరితూగుతుంది, కష్టం.

గేటు వేసి బయటికొచ్చా. కుక్కలు నా అడుగుల శబ్దం గుర్తుపట్టాయనుకుంటా, తలలెత్తి చూసి మళ్ళీ పక్కకి తిప్పుకొని పడుకున్నాయి. వాటికీ నాకూ పెద్దగా పడదు. నేను వాటిలా విశ్వాసంగా ఉండలేనని వాటికి చిన్నచూపు కావొచ్చు లేక కినుకేమో అవి నాలా ఉండలేవని. అన్నీ వదులుకొని పోతున్నా కదా! ఇప్పుడు సంతోషమేగా మీకు అనుకుంటూ వాటి వైపు చూస్తూ ముందుకు నడిచా. సంచిలో మొబైల్ ఫోన్ చేతికి తగిలింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అమ్మణి దగ్గరికి పోవాలా నిజంగానే? కప్ప ఒకటి కాలి మీద నుంచి గెంతుకుంటా పోయింది. కప్పలుంటే పాములూ ఉంటాయి. జాగ్రత్తగా నడవాలి. వీధి చివరి దాకా వెళ్ళి వెనక్కి తిరిగి చూశా. చీకట్లో ఇళ్ళన్నీ మౌనముద్రలో ఉన్న యోగుల్లా ఉన్నాయి. తారు రోడ్ ఎక్కి కుడివైపుకు తిరిగా.

కోరికలు వదులుకోవాలి. వదులుకుంటే పోతాయా? వదులుకోవాలంటే ఏం చేయాలి? ఏమీ చేయకుండా ఉండాలా? వాటంతట అవే ఎలా పోతాయి? అయినా నాకేం పెద్ద కోరికలున్నాయి? కనీసం అద్దంలో ముఖం కూడా సరిగా చూసుకోను. మనుషుల గురించి కూడా ఆలోచించను కదా! ఉన్నవే చిన్న కోరికలు. ఆకలైతే అన్నం తినాలనిపిస్తుంది. మనసు బాగుంటే పాట పాడుకోవాలనిపిస్తుంది. రాత్రయితేనే కొంచం మత్తుగా ఉంటుంది. అదంతా సహజమే కదా! తోడు మాత్రం ఎప్పుడు కోరుకున్నా? ఎప్పుడో ఏరువాక పున్నమిరోజు స్వామిపై మనసుపడిన మాట నిజమేకాని అతడు దేవుడాయె. నన్ను కన్నెత్తి కూడా చూసినట్లనిపించలేదు. అతడు దేవుడేనా నిజంగా? ఏమో అందరి కోరికల్ని పట్టించుకున్నట్లు కనిపిస్తాడు. దేవుడు కోరికల్ని పట్టించుకోవాలా? అసలు దేవుడు మనుషుల కోరికల కోసం పుట్టాడేమో. ఫలించాలనుకునేవి, ఫలించకూడదనుకునేవి. ఫలించి ఫలించి విరిగిపోయేవి. ఫలించకుండానే మనుషుల్లో మిగిలిపోయేవి.

వీధి లైట్లు ఆగి ఆగి వెలుగుతున్నాయి. అక్కడ ఎవరో చిత్తుకాగితాలు ఏరుతున్నారు. వాళ్ళ చింపిరి జుట్టు పైన మెరుస్తున్న వెలుగు చూస్తే అతడే గుర్తొచ్చాడు. ఇందుకోసమైనా దేవుడు పుట్టి ఉంటాడు. ఎంతైనా దేవుడ్ని అంతగా ప్రేమించకూడదు. ప్రేమిస్తే ప్రేమించచ్చు కాని రమించాలని అనుకోకూడదు. రమిస్తేనే కోరికలు తీరతాయా? రమించడమంటే ద్వైతం నుంచి అద్వైతంలోకి పోవడమని చెప్పేది అమ్మణి.

రైల్వే స్టేషన్లు ఈ సమయంలో బాగుంటాయ్. అక్కడ ఖాళీగా ఉన్న బెంచ్ పైన కూర్చున్నా. అక్కడక్కడా సమస్యలకి ముసుగేసినట్లు పడుకున్న మనుషులు. నిశ్శబ్దాన్ని చెదరగొడుతున్న పక్క బెంచి గురక. ముసుగు తన్నుకున్నా మసక వెలుగులో చుట్టూ ముసురుతున్న దోమలు. కాళ్ళు పైకి లాగి పెట్టుకున్నా. పెద్ద శబ్దంతో ఫ్లాట్‌ఫామ్ మీది దుమ్ము, చిత్తుకాగితాలు లేపుతూ వెళ్ళింది గూడ్సు బండి.

ముందు గోపాల్ దగ్గరికి వెళ్ళాలి. వాడొక్కడే అర్థం చేసుకుంటాడు. టికెట్ కౌంటర్ వైపు నడిచా. ఆయన కునికిపాట్లు పడుతున్నాడు. చిన్నగా దగ్గాను. కళ్ళు తెరిచాడు.

“హైదరాబాద్‌కి వెళ్ళే రైళ్ళు ఏమైనా ఉన్నాయా?”

“విశాఖ ఉందమ్మా ఇంకో అరగంటలో” అన్నాడతను అరకన్నులతో పైనుంచి కింద దాకా చూస్తూ.

“హైదరాబాద్‌కు ఒక టికెట్ ఇవ్వండి.”

టికెట్ తీసుకొని మళ్ళీ ప్లాట్‌ఫామ్ మీదకి వచ్చా. టైమ్ మూడవుతుంది. స్వామి గుర్తొచ్చాడు. మనసు మరల్చుకొన్నా. ఇప్పుడు హైదరాబాద్ పోయి ఏం చేయాలి? అక్కడినుంచి పాండిచ్చేరి పోవాలి. ఆశ్రమంలో ఉన్న అమ్మణిని కలవాలి. కలిస్తే ఎదో ఒక దారి దొరుకుతుంది.

ఇంట్లో లేచాక నాకోసం వెతుకుతారా? పోతే పోయింది దరిద్రం అనుకుంటారా? అయినా అది ఇల్లేంటి? కొన్ని రోజులు ఆశ్రయమిచ్చిన మనుషులు. స్వార్థం కోసం నన్ను ఉంచుకున్నవాళ్ళు. వాళ్ళని వదిలి వచ్చినందుకు బాధపడక్కర్లేదు. బాధపడ్డా చేసేదేముంది అన్నీ వదిలేసుకోవాలనుకున్నాక!

అతన్నీ వదిలేయాలి. ఇష్టంగా తినే పెరుగన్నాన్ని వదిలేయాలి. పెరుగన్నం వదులుకోవడం అవసరమా? లేదేమో! అది వదిలేయకపోయినా ఏమీ అవదు. రామకృష్ణ పరమహంసలాంటోడు సందేశ్ మిఠాయిని వదులుకున్నాడా? చిన్నచిన్న కోరికలుండొచ్చు ఏమీ కాదు. పెద్ద పెద్దవి ఉండకూడదు.

రైలు వచ్చేసింది. తలుపు తీసున్న బోగీలోకి ఎక్కాను. అది రిజర్వేషన్ బోగీ. రిజర్వేషన్ బోగీలోకి ఎక్కొద్దు అని హెచ్చరించిన టి.సి. గుర్తొచ్చాడు. చెప్పినంత మాత్రాన వింటుందా బుద్ది? తలుపు తెరిచుంటే చాలు అది రావచ్చనే ఆహ్వానమే. వేరేవాళ్ళకి రిజర్వ్ అయిందని ఎందుకు ఊరుకోవాలి? వాళ్ళే సర్దుకుంటారు. ఎంత సిగ్గులేనిది ఈ బుద్ది. సిగ్గులేక పోవడం కాదు బతకనేర్చినతనం అంతే. ఎవరో ఈసడించుకొని చూస్తున్నట్లు అనిపించింది.

ట్రైన్ కుదుపులకు ఆసరాగా తలుపు దగ్గర కమ్మీ పట్టుకొని నిలబడ్డా. లోపలంతా నీలికాంతి. కొంచెం ముందుకు నడిచా. ఎవరో పడుకొని ఉంటే వాళ్ళ కాళ్ళదగ్గర సర్దుకొని కూర్చున్నా. పడుకున్నతను కొద్దిగా కదిలి కాళ్ళు ముడుచుకున్నాడు. పాపం దయతలిచినట్లున్నాడు. పోనీలే అనుకొని ఉంటాడు. నిద్రలో కూడా దయాత్మక బుద్ది ఎలా వస్తుందో? నిద్రలో కుమ్మరి పురుగును చంపేసిన చేతుల్ని చూసుకున్నా. అదిచ్చిన నొప్పి ఇంకా పొడుస్తుంది. సన్నగా మందులవాసన. తల విదిలించా. అన్నీ త్యజించగలనా? అయినా నాకోసం ఎవరున్నారు? ఏమంత ఇష్టాలున్నాయి? రైలు ఇంత పెద్ద శబ్దం చేస్తుంది. ముందు ముందు శబ్దం చేయకుండా వెళ్ళే రైలుని కనిపెడతారేమో! నిశ్శబ్దంలో కూడా పెద్ద పెద్ద శబ్దాలు ఉంటాయి కదా!

ఆకలవుతుంది. రాత్రి సరిగా తినలేదు. ఏది వదిలినా ఈ ఆకలి బాధను మాత్రం వదల్లేం. ఇన్ని రోజులు ఇక్కడ ఉంది ఈ ఆకలి కోసమేనా. టీ అమ్మే కుర్రాడు వచ్చాడు. టీ తీసుకుని తాగుతూ టైమ్ చూసుకున్నా, నాలుగున్నర దాటింది. అమ్మ ఎందుకు వెళ్ళిందో? వెళ్ళే ముందు ఎత్తుకొని ముద్దుచేసి ఉంటుందా? వదిలి వెళ్ళడానికి ఎంత కష్టపడిందో? నేనూ అమ్మలాగే ఉంటానంటారు. నాలా అమ్మ ఉందంటే తను ఊరికే వెళ్ళి ఉండదు. అయినా ఇప్పుడు మనకెలా తెలుస్తుంది? కరుణను దాచుకొని హింసను మోస్తూ ఎట్లా వెళ్ళిందో?

తెరలుతెరలుగా తెల్లారుతుంది. చీకటికి దయలేదు. పడుకున్నతను లేచి కూర్చుని నవ్వీ నవ్వనట్లు నవ్వాడు. అతన్ని చూడాలనిపించక పక్కకి తిరిగా. మీకు రిజర్వేషన్ ఉందా అని అడుగుతాడనుకున్నా. అడగలేదు.

“నల్గొండ దాటిందాండి.”

“హా ఇప్పుడే.”

“అయితే ఇంకో రెండు గంటలు హైదరాబాద్‌కి.”

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అందరూ ఖాళీ బిందెల్లా పెద్ద శబ్దం చేస్తున్నారు. వీళ్ళ చేతుల్లో, కళ్ళలో, హృదయాల్లో ఎంత డొల్లతనం! ఏమి కావాలో తెలీదు, ఎందుకు బతుకుతున్నారో తెలీదు. ఎలాగోలా బతికేస్తుంటారు. ఒక్కసారిగా సమస్త మానవాళిపై జాలి కలిగింది. ఎప్పటికి తెలుస్తుందో వీళ్ళు జీవించే జీవితం ఏమీ లేదని. బోనుల్లో ఉన్న చుంచెలుకల్లా బతుకుతున్నారని. నేనూ అంతేకదా.

సంచిని భుజానికి తగిలించుకొని ట్రైన్ దిగా. బస్సెక్కి యూసఫ్‌గూడా దాకా వెళ్ళి మధురానగర్ నడుచుకుంటా వెళ్ళా. గోపాల్ రూమ్‌కి తాళం వేసుంది. ఆ ఇంట్లో పైన రూమ్ అది. పిట్టగోడ దగ్గర నిలబడి చుట్టూతా చూశా. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడో వీడు. వీడిప్పుడు రాకపోతే ఏం చేయాలి? మళ్ళీ వెనక్కి వెళ్ళాలా? సంచిలో చేయిపెట్టి డబ్బులు ఎంతున్నాయో చూశా. వచ్చేముందు వాడికి చెప్పి ఉండాల్సింది. స్వామి ఎప్పుడూ అంటాడు ‘చెప్పకుండా ఎవరి తలుపు తట్టకు’ అని. అయినా వాడు గోపాల్ కదా! నాతోపాటు అరగంట తేడాతో పుట్టినవాడు. నేను ఏమీ చేసినా ఏమనడు. ఏం జరిగినా అమ్మలాగా చెప్పకుండా పోమాకే అంటాడు. మధురానగర్‌లో గోపాలుడు వీడు. ఆ ఆలోచనకే నవ్వు వచ్చింది.

ఈ ఊరు ఎప్పుడూ కంగారుపడుతున్నట్టు ఏదో పనిలో మునిగి తేలుతూ క్షణం తీరిక లేకుండా ఉన్నట్లు ఉంటుంది. అన్నీ డాబాలు, అపార్టుమెంట్లు. ఇసుమంతైనా ఖాళీస్థలం లేదు. ఉక్కిరిబిక్కిరిగా ఊపిరాడనట్లు ఒక దానికొకటి అతుక్కొని ఉన్నాయి. పైనుంచి కిందకి చూశా. ఉలికిపాటు. ఇక్కడినుంచి దూకితే చచ్చిపోతామా? కాలో చెయ్యో విరుగుతుంది. తల పగిలిందా అంతే. రాయి తీసుకొని కిందకి వదిలి చూశా. అది మామూలుగానే పడింది. పడటంలో దానికి ఉత్సాహంలేదు. అయినా ఎవరికి ఉంటుంది కిందకి పడిపోవాలని? ఆకాశం ఇంకా మబ్బుగా ఉంది. వీడు చెప్పకుండా ఇల్లు మారాడా? మొబైల్ తీసి చూశా. అది ఛార్జింగ్ లేక చచ్చిపోయింది.

వీడు రాకపోతే ఎక్కడికి వెళ్ళాలి? మనకోసం ఒక్క మనిషంటూ లేకపోతే మనుషులను ద్వేషిస్తూ శపిస్తూ వంచిస్తూ బతకాలేమో! ఏంటి ఇలా ఆలోచిస్తున్నా? స్వామి అంటాడు ‘అందర్ని తప్పుదారి పట్టిస్తున్నావా ఇలా మాట్లాడి?’ అని. ఏ దారిలో ఉన్నానో నాకే తెలీదు. ఇక అందరిని తప్పుదారి పట్టించడమా? అయినా ఎవరి దారి తప్పుగా నిర్ణయించబడుతుంది? నువ్వు ఆచరించలేని, వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని దారి. వెళ్ళాక ఏమవుతుందో తెలియని దారి. సుఖాన్ని సుఖంగా అనుభవించలేని, దుఃఖాన్ని బయటపెట్టుకోలేని దారి. నిజాయితీగా తప్పొప్పులని ఒప్పుకొనే దారి. అయ్యో! ఇదంతా ఎందుకు? కోరికలను త్యజించడమే ఇప్పుడు చేయాల్సిందల్లా. అప్పుడు అతడ్ని త్యజించవచ్చు. త్యజించాక ఏమి చేయాలి? నువ్వో సన్యాసినివి ఎప్పుడూ కాలేవు అంటాడు స్వామి. అమ్మణి అంటుంది ‘నువ్విక్కడ ఉండలేవు. ప్రశ్నలు ఉంటే జవాబులు కావాలి. ప్రశ్నలన్నీ పోయినప్పుడు సిద్ధంగా ఉన్నా అని చెప్పు’ అని. సిద్ధంగా ఉన్నా అని నాకెలా తెలుస్తుంది? ఎవరికైనా తెలుస్తుందా వాళ్ళు సిద్ధమయ్యారని దేనికైనా?

ఓ పిచ్చుక వచ్చి గోడపైన వాలింది. చిన్నగా జరుగుతూ దగ్గరికి వచ్చింది. రివ్వున ఎగిరి నీళ్ళకుంటలా ఉన్న దగ్గర నీళ్ళు తాగడం మొదలుపెట్టింది. అటు ఇటు చూసుకుంటుంది మధ్య మధ్యలో. దానికి కొత్త ప్రదేశంలా లేదు. రోజూ వచ్చి వెళ్ళే పిట్టలా ఉంది. నింపాదిగా అక్కడక్కడే ఎగురుతుంది. నువ్వే కొత్తగా వచ్చావ్ అన్నట్లు డాబుగా ఎగురుతుంది. పిట్టగోడ మీద అంచులదాకా వచ్చింది. ఉష్… అన్నా ముందుకి వచ్చి. అది కంగారుగా గోడ అంచు జారి టక్కుమని ఎగిరెళ్ళింది. అమ్మ కూడా అట్లే వెళ్ళుంటుంది.

అడుగుల శబ్దం వినిపించింది. మెట్లపైన గోపాల్ వస్తూ కనపడ్డాడు. ఊపిరితీసుకున్నా బలంగా.

గోపాల్ పెద్దగా ఆశ్చర్యపోకుండా “ఏంటి వచ్చేశావా?” అన్నాడు. అయినా వాడెందుకు ఆశ్చర్యపోతాడు నా సంగతి తెలిసిన ఒకే ఒక మనిషి ఈ ప్రపంచంలో.

“వాళ్ళకి చెప్పే వచ్చావా?”

“ఆ…” అనగలిగా. “పాండిచ్చేరి పోవాలిరా. అమ్మణి దగ్గరకు.”

“ఎందుకే పాండిచ్చేరి, అక్కడికెళ్ళి ఏం చేస్తావ్?”

“అన్నీ వదిలేద్దామనుకుంటున్నా.”

“అన్నీ అంటే?” అన్నాడు ఆశ్చర్యంగా.

“అన్నీ అంటే అన్నీనే.”

“నీకిప్పుడు ఏమైందక్కా?”

“ఏమీ లేదురా, అన్నిటికీ దూరం పోవాలనుకుంటున్నా. వాళ్ళ స్వార్థం భరించడం కష్టంగా ఉంది.”

“ఏంటో నువ్వు నాకు అర్థంకావు. అక్కడా మనుషులేగా ఉండేది. అయినా పనీపాట లేకుండా ఆశ్రమంలో చేసేదేంటి?”

నేనేమీ మాట్లడలేదు.

“సరే, నీ ఇష్టం. అమ్మణికి ఫోన్ చేస్తా. అక్కడ చేరాలంటే డబ్బులు కట్టాలి.”

ఏంటి, అన్నీ వదులుకొని ఆశ్రమంలో చేరడానికి కూడా డబ్బులు కావాలా? బతకాలనే కోరిక ఉంటే చాలు అన్ని అవసరాలు కోరికలు వాటంతట అవి వచ్చి వాలడానికి. ముందు బతకాలనే కోరికనే తీసేయాలేమో? అది ఎలా పోతుంది? ఆకల్ని దాహాన్ని నేను పుట్టించానా? పుట్టడంలో నా ప్రమేయం లేనప్పుడు చావడానికి నేను ఎలా కారణం అవ్వాలి? అలా అయితే చచ్చే వరకు కొన్ని న్యాయమైన కోరికలు ఉంటాయిగా. న్యాయమైన కోరికలా? మళ్ళా న్యాయం ఎలా వచ్చింది. నేను పుట్టడమే అన్యాయంగా పుట్టా కదా.

“ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తావేంది? ముందు లే. అయినా ఈ వయసులో ఆశ్రమానికి పోయేదేంటక్కా. అమ్మే ఉంటే ఇట్లా ఉండేది కాదుగా. అమ్మణి పిన్ని ఆశ్రమాలని పట్టిపోయింది. మామ చూస్తే వెట్టిచాకిరి చేయిస్తాడు.”

“అమ్మేంట్రా, నాన్న ఉన్నా ఇలా అయ్యేది కాదు.”

“నాన్నంటే చచ్చిపోయాడు.”

“చచ్చిపోతే ఏంటి? వెళ్ళిపోతే ఏంటి?”

కాసేపు నిశ్శబ్దంగా ఉండి, అన్నాడు గోపాల్ “ఎప్పుడు తిన్నావో ఏమో? ఇడ్లి తెస్తా ఉండు.”

“వద్దులేరా, ఏమైనా వండుతా.”

“ఇప్పుడేం వండుతావ్ కాని, నేను తెస్తా. ముందు నువ్వు లేచి స్నానం చేయ్.”

గోపాల్ ఇడ్లీ పొట్లంతో తిరిగొచ్చాడు. ‘ముందు ఇడ్లీ తినక్కా’ అని ఇడ్లీ తుంచి నోట్లో పెట్టాడు. రేపు అమ్మణిని ఎల్లగొడితే మనమే చూసుకోవాలి అని నవ్వించాడు.

“నీకో సంగతి చెప్పనా! లింగంపల్లిలో ఓ పెద్దావిడ ఉందంట. రాసుకుంటా ఉంటుందట. ఆమెని చూసుకోడానికి, ఆమెకోసం పనిచేయడానికి మనిషి కావాలని బాబు చెప్పాడు. వెళ్ళరాదూ. డబ్బులకి డబ్బులు, సేవ చేసినట్టూ ఉంటది. అన్నీ వదులుకున్నా అంటున్నావ్. ఈ పని చేయడానికి నీకు కష్టం ఏముంటుంది?

డబ్బులకి డబ్బు వచ్చాక ఇంకా సేవనుకోవడమా? మనిషికి మనిషే ఒక అవసరం. కొంతమంది అవసరాలు తీర్చడం మన అవసరం. మందులవాసన లీలగా గుర్తొచ్చింది.

“నవ్వుతావేంటక్కా!”

“ఏమీలేదురా.”

భుజం నొప్పి కొద్దిగా తగ్గినట్లుంది. ముసురు పట్టినట్లే పట్టి మళ్ళీ సన్నటి ఎండ కాస్తుంది.


శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...