గాయం

“నా గురించి ఏమనుకుంటావ్?”

“ఎందుకు ఇంత సడన్ ప్రశ్న?”

“ఒక ప్రశ్న రావడానికి సమయం సందర్భం ఉండాలా?”

“ఏమనుకోవాలి?”

పెద్ద అల మీదకి వస్తున్నట్లు అనిపించింది. అలా చూస్తుండగానే అది కొంచం కొంచం తగ్గి దగ్గరగా వచ్చి పాదాలను తడిపి వెళ్ళింది.

“అంత పెద్ద అల ఒడ్డుకి చేరేసరికి ఎంత చిన్న అల అయిందో చూశావా?”

“అంటే ఇప్పుడు నువ్వీ ప్రతీకలతో ఏమి చెప్పాలనుకుంటున్నావ్?”

“ఏమీ చెప్పాలనుకోవట్లేదు. ఏదీ ప్రతీక కాదు. ప్రతిదీ వ్యూహాత్మకంగా మన ముందుకి వస్తుంది అంతే.”

“వ్యూహాత్మకమా లేక మన లోపల ఏది జరుగుతుందో, నలుగుతుందో, ఏది అనుకుంటామో అదే సందర్భానుసారంగా మనం తీసుకోడానికి, ఆపాదించుకోడానికి, మనకి కావాల్సిన విధంగా ప్రతీకలై కనిపిస్తాయా?”

“సరే అలానే అనుకో. నీ లోపల అదే ఎందుకు జరుగుతుంది? అది జరగడానికి కారణం ఏంటి?”

“అన్నిటికీ కారణాలు ఉంటాయా? ఉంటే ఆ కారణాలు ముందే తీసెయచ్చు కదా! కోరికలను నెరవేర్చుకుంటాం ఎందుకు? ఆ కారణం తీసేసి చూడు. కోరికను తీర్చుకోవడానికి ఇంకో కారణం సిద్దంగా ఉంటుంది.”

“మరైతే కోరికకు కారణాలు కారణం కాదంటావా?”

“విశ్వా! ఇలా ఎందుకు మాట్లాడతావ్? నాతో మాట్లాడించాలనా? కారణం లేనిది ఏదీ ఉండదు. నిజమైన కారణం కనుక్కోవాలేమో!”

తెరలుతెరలుగా విశ్వా నవ్వు. ఏంటో కొందరు ఇంత సమ్మోహనంగా నవ్వగలరు. అమాంతం వాళ్ళని హత్తుకోవాలనిపించేలా. సూర్యుడుకి మేఘాలు అడ్డు తొలిగి ఆకాశం రంగులతో నిండిపోయింది.

“నేను వెళ్ళాలి. అక్కడ వడగళ్ళ వాన కురుస్తుంటుంది.”

“అక్కడ నీ గొడుగులేమీ పని చెయ్యవా విశ్వా?”

“బయట గొడుగులు వేసుకుంటే అవి చినిగి వక్కలయ్యేదాకా వర్షం కురుస్తుంది. లోన వేసుకుంటే చాలుగా, ఎవరికైనా తెలియాలా?”

“సరే వెళ్ళు. కాసేపాగి నేను బయలుదేరతా.”

ప్యాంటుకి అంటిన ఇసుక దులుపుకుంటా లేచాడు. కొంచం వంగిన అతని భుజాలను చూశాను.

ఈ పిల్లోడు ఎంత వయసొచ్చినా అలానే ఉంటాడు.

పక్కన ఐసులు అమ్మే పిల్లాడు చుట్టూ చూస్తున్నాడు. ‘రోజుకు ఎన్ని ఐసులు అమ్ముతాడో, ఎంత గిట్టుబాటు అవుతదో. ఎప్పుడు వెళతాడో ఇంటికి?’

తిరిగి సముద్రంవైపు చూశా. మాట్లాడాలని ప్రయత్నించా. అయినా దాన్ని చూస్తూ ఉంటే మాటలే ఉండవు. ఇలానే నిండిపోతూనే ఉంటుంది. సూర్యుడు కిందకి దిగిపోయాడు. అది చేసిన గాయానికి కంది ఎరుపులో, నలుపులో ఆకాశం. బాధ తరువాత వచ్చే దిగులు, విషాదం ముగ్ధంగా ఉంటాయి. నెమ్మదిగా ఎప్పటికో అది చిక్కటి నలుపులోకి మారిపోతుంది. దానికి చీకటి తోడవుతుంది.

ఊరకూరికే మబ్బులు ముసురుపడితేనే కష్టం. చినుకులు మొదలవ్వకుండానే ఇంటికి బయలుదేరాలి. నెమ్మదిగా లేచా సముద్రపు అల్లరిని నిరసిస్తూ.

“అక్కా! ఐసు కావాలా?”

వద్దన్నట్లు తలూపి ముందుకు నడిచా. వాడు తీసుకో అక్కా పర్లేదు అంటాడనుకున్నా. వాడేమీ అనలేదు. అలా అడగాలని ఎందుకు ఆశించానో. బహుశా నేను వాడిపై చూపిన అవసరం లేని ప్రేమకి బదులనుకొని ఉండొచ్చు. ఇంత స్వార్థంగా ఎలా ఉంటానో? నేను నవ్వే చిన్న చిరునవ్వులో కూడా ఆశించే గుణం. ఒక మాట చాలుకదా! మనసు ఆనందపడటానికి. హాఁ! నా మనసు ఆనందం నాకు ఎంత అవసరమో.

ఇసుకలో కాళ్ళు దిగబడుతున్నాయి. సముద్రం ఒడ్డున ఇసుక కాకుండా ఇంకేమైనా ఉండొచ్చుకదా! ఇసుక ఒడ్డు లేని సముద్రం ఉంటుందా? అది ఊహించడమే కష్టం. ఎంత లేదన్నా ఇసుక అందమే వేరు.

రేవతి అంటుంది: “నీది ఇసుక హృదయం. పట్టుకుంటే పట్టుకున్నంత సేపు ఉండవ్, జారిపోతావ్. ఏదీ అంటించుకోకుండా ఎట్లుంటావే!”

“తడి తగిలితే ఇసుక ఎంత బరువెక్కుతుందో తెలుసా?”

“తెలుసు, తడి ఆవిరవ్వగానే ఇసుక ఎలా రాలిపోతుందో కూడా తెలుసు.” గట్టిగా నవ్వుతుంది. దాని నవ్వుని తట్టుకోవడం కష్టం. ఎవరినైనా యిట్టే ప్రేమించగలదు.

కష్టం మీద అడుగులు ముందుకు వేశా, తడి ఇసుక దాటి పొడి ఇసుకలో ఇంకొంచెం కష్టంగా కాళ్ళను ఈడ్చుకుంటూ రోడ్ పక్కగా పెట్టుకున్న స్కూటీ దగ్గరికి. అది రెగ్యులర్‌గా పార్క్ చేసే ప్లేస్ కాదు. నా ప్లేస్‌లో ఎవరో పార్క్ చేసేశారు వచ్చేటప్పటికి. అందుకే ఒక అరగంట ముందు రావాలి బీచ్‌కి.

“ఎక్కడో చోట పార్కింగ్ దొరికిందిగా. చిన్న చిన్న విషయాలకి ఎందుకింత ఆలోచిస్తావ్?” అంటాడు విశ్వ.

“అదో సెంటిమెంట్‌లే.”

“సెంటిమెంట్ ఏంటి సంజూ, సెంటిమెంట్లన్నీ ఒక అవసరంలోనో, భయంలోనో పుడతాయి.”

నువ్వు కనీసం దేవుడిని కూడా సరిగా నమ్మినట్లు కనిపించవు. ఇలాంటివన్నీ ఏంటి? అని ఎగతాళి చేస్తాడు. మళ్ళీ మళ్ళీ ఏదో జరిగితే, ఏదో ఉందని మొండిగా వాదిస్తా. అసలు ఆ వాదనలో పసలేదని తెలుసు. ఎందుకు ప్రతిదానికి హేతువాదన చెయ్యాలి?

బండి తీసి రోడ్ మీదకి పోనిచ్చా. ఆ రోడ్ ఇదివరకంత విశాలంగా లేకపోయినా, అదే రకమైన సెరినిటీ. మసకగా వెలుతురు.

“నువ్వేమైనా అనుకో, వైజాగ్‌లో ఉండటం వరమోయి, మీ హైదరాబాద్ వాళ్ళకి అర్ధంకాదు.” అంటాడు విశ్వ.

“ఎలాంటివాళ్ళనైనా అక్కువ చేర్చుకుంటుంది హైదరాబాద్. మా హైదరాబాద్ వాళ్ళకి ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ మీకు ఉండదులే!” అని జోక్స్ వేస్తా. హైదరాబాద్‌ని అంతగా ప్రేమించే నేను సముద్రం వల్ల ఏ మూలో వైజాగ్ వైపు మొగ్గు చూపుతూనే ఉంటా.

వర్షం మొదలైంది. విశ్వ వెళ్దామన్నప్పుడే నేనూ బయలుదేరాల్సింది. పాకెట్‌లో మొబైల్ మెసేజ్ వచ్చింది. విశ్వ అయి ఉంటాడు. వర్షం పడుతుంది కదా, బయలుదేరేవా అని. మనుషుల్లో ఇంత ప్రేమ, జాగ్రత్త ఎలా వస్తుందో! రోడ్ ఖాళీగా ఉండటంతో ఉత్సాహంగా ఆక్సిలరేటర్ రైజ్ చేశా.

మెయిన్ రోడ్ మీద నుంచి పక్క సందులోకి ఫాస్ట్‌గా తిరిగా. ఎదురుగా కారు వస్తుంది. పక్కగా ఒకామె పాపని పట్టుకొని నడుస్తుంది. అంత స్పీడ్‌లో పక్కకి తిప్పిన బండి వర్షంలో స్కిడ్ అవ్వడం తెలుస్తుంది. బ్రేక్ వేస్తుంటే పడట్లేదు. క్షణంలో అర్థమైంది, ఇదే వేగంతో పక్కకి వెళితే వాళ్ళని గుద్దుతా. ఎదురుగా వెళితే కార్‌ని గుద్దుతా. అంతకు ముందే ఏమైనా చెయ్యాలి. సడన్‌గా హాండిల్ తిప్పా. స్కూటీ రోడ్ పక్కన ఉన్న చిన్న రైలింగ్‌కి గుద్దుకుంది. ఎగిరి అవతల పడ్డా. కిందగా వెళుతున్న కాలువ. కాలువ అంచున గులకరాళ్ళు. ఒక సూదంటి ఎర్రటి రాయి ఆ క్షణంలో కంటి ముందు లీలగా కనిపించింది. అది ఎక్కడ పొడుచుకుంటుందో! ఏ అంచనాకి రాకముందే ఏమీ తెలీకుండాపోయింది. ఒళ్ళంతా సూదులతో గుచ్చుతున్నట్లనిపించింది. వెనక తడి తగిలింది.

ఎవరో బయటికి తీస్తున్నారు. బయటికితెచ్చే ఒక చేయి గుండెలని తడుముతుంది. బాస్టర్డ్ ఎవడ్రా నువ్వు. అయ్యో! అలా అనకూడదు. అది తిట్టు ఎలా అయింది. తక్కువగా చూసే పదం ఎలా అయింది. ఎంత నీచంగా ఆలోచిస్తున్నాను. ఎవడ్రా ఇలా తడుముతుంది, ఏమనాలిరా మిమ్మల్ని. ఆ చేయి ఆగిపోయింది. అప్పుడు తెలిసింది వెన్నులో నొప్పి. ఎవరో చేయి పట్టుకున్నారు. లేవలేకపోతున్నానని అర్ధమైందేమో కాళ్ళు పట్టుకొని ఎత్తుతున్నారు. ఎందుకు కళ్ళు తెరవలేకపోతున్నా. అన్నీ తెలుస్తున్నాయి. కళ్ళు తెరిచే ఉన్నాయా, కనపడట్లేదా? ఏమి జరుగుతుంది? ఇప్పుడు కళ్ళు పోతాయా. కళ్ళు పోతే ఎలా? సముద్రాన్ని ఇక చూడలేనా? అమ్మ, నాన్న విశ్వ ఇంకా ఇంకా భరత్. తలలో నొప్పి.


చుట్టూతా మనుషులు తిరుగుతున్న శబ్దం. ఎవరో చేయి పట్టుకున్న స్పర్శ. అది రేవతి. కొంచం గరుకుగా ఉంటుంది.

“సంజూ, ఎలా ఉందే ఇప్పుడు? వర్షం పడుతుంది, కొంచం స్లోగా నడపొచ్చుకదా!“ రేవతి ఏదేదో అనేస్తుంది.

నన్ను అడగదా అసలు, ఏం జరిగిందో! ఏమైందో తెలుసుకోకుండానే ఇలా ఎలా అంటుంది. అక్కడివాళ్ళు చెప్పి ఉంటారు. ఆమె, పాప ఆగి ఎవరినైనా పిలిచి ఉంటారా? ఆమె వెళ్దామన్నా పాప ఆపి ఉంటుంది. అయినా ఆ పాప ఎందుకు ఆపుతుంది? ఎదురుగా వచ్చిన కార్ వాడు ఆగి ఉంటాడా?

యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి? అనుకొని ఏదీ జరగదు. ఊహించనివి ఊహించకుండా జరుగుతాయి. అయినా ఇది అనుకోకుండా జరిగిందా? అనుకొనే జరిగింది కదా! కావాలని చేసిన యాక్సిడెంట్‌కి ఎంత మూల్యం చెల్లించాలి? మూల్యం చెల్లించడం కోసమే యాక్సిడెంట్ చేస్తారా! విరిగిన చేయి, వెన్ను పక్కగా దిగబడిన రాయి, నీ ప్రమేయం లేకుండా నిన్ను తడిమే చేతుల స్పర్శ కూడా. అయినా, అనుకోకుండా ఎదురైన పరిస్థితుల్లో కదా అనుకొని యాక్సిడెంట్ చేసింది.

“కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. హెల్మెట్ పెట్టుకున్నావు కాబట్టి తలకి ఏమీ అవ్వలేదు. కానీ, వెనకున్న పక్కటెముకల్లో ఏదో కోసు రాయి గుచ్చుకుంది. అంత లోతుకి దిగలేదు కాబట్టి సరిపోయింది. మోచేతికి చిన్న ఫ్రాక్చర్ అయ్యింది. కనీసం 4వారాలు రెస్ట్ కావాలి నీకు!” అంటోంది రేవతి.

కొద్ది సేపటి తరువాత అడుగుల చప్పుడు వినిపించింది. రేవతి వెళ్తున్నట్లుంది. మరింత దగ్గరకొస్తున్న అడుగులు. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశా. విశ్వ.

“విశ్వా, కూర్చో” అన్నా. కుర్చీ దగ్గరకు లాక్కొని కొంచెం ముందుకు వంగి కూర్చున్నాడు.

“ఇలా ఎలా జరిగింది? ఎలా నడిపినా బండి కంట్రోల్‌లో నడుపుతావ్ కదా!”

“ఏమీ లేదు, బండి స్కిడ్‌ అయి రోడ్ నుంచి పక్కకి వెళ్ళింది.”

“అంతేనా జరిగింది?”

“అవును. అంతే.”

“మరి ఎదురు వచ్చిన కార్ అతను వేరేలా చెప్పాడు. బండిని సడన్‌గా పక్కకి తిప్పావట కావాలనే.”

“ఇంకా ఏమి చెప్పాడు?”

“ఏమీ లేదు.”

“ఎవరు చేర్పించారు హాస్పిటల్లో?”

“ఆ కార్ అతనే.”

“ఇంకెవరూ లేరా అక్కడ?”

“కాసేపటికి ఆ చుట్టుపక్కలవాళ్ళు కూడా వచ్చారట.”

“ఎవరు తీశారు కిందపడితే?”

“తెలీదు సంజూ, హాస్పిటల్లో ఉన్నావని కాల్ వచ్చింది.”

“ఏంటే, అప్పుడే మొదలుపెట్టావా ప్రశ్నలు?” అంది రేవతి వస్తూ.

“ఎప్పుడు వెళ్తున్నాం ఇంటికి?”

“రేపు పంపుతా అన్నారు. వెనుక అయిన దెబ్బకి కొన్ని రోజులు డ్రెస్సింగ్ చేయించాలని చెప్పారు.”

గాయానికి ఇన్ఫెక్షన్ వచ్చి కుళ్ళిపోయి ఇంకా పెద్దదవ్వకుండా క్లీన్ చేయాలి. గాయంపైన మళ్ళీ గాయమవ్వకుండా కట్టు కట్టాలి. గాయాలు అంతే కదా! అవి మానేదాకా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇది మరీ వెనుకైన గాయం. కనపడదు కానీ చెప్పలేని నొప్పి. వెల్లికిలా హాయిగా పడుకొని నిద్ర పోలేని బాధ. ఎలా అవుతాయి ఇలా వెనుకగా గాయాలు. ఎవరుచేస్తారు ఇలాంటి గాయాలు?

“సంజు! అది ఏమంత పెద్దదెబ్బ కాదులే తొందరగానే తగ్గుతుంది” అంటున్నాడు విశ్వ.

“జనరల్ వార్డ్‌లో ఎందుకు, రూమ్‌కి షిఫ్ట్ అవుతా.”

“వద్దులే సంజూ, ఇక్కడే బెటర్. ఒక్కరోజేగా, చుట్టూతా జనం ఉంటారు.”

మనుషుల మధ్య ఉండు, అంటాడు ఎప్పుడూ. మనుషుల మధ్య ఉండటం అంత తేలికనా. వాళ్ళని భరించడం, వాళ్ళు నన్ను భరించడం. చుట్టూ చూశాను. ఇక్కడ ఊపిరాడట్లేదు. అక్కడివాళ్ళకి శారీరకబాధలు పెద్ద బాధగానే అనిపించట్లేదనుకుంటా. వాళ్ళకున్న అప్పులు, హాస్పిటల్ ఖర్చులు, మొగుడు పట్టించుకోవట్లేదనే అసహనాలు, ఉక్రోషంతో బూతులు తిట్టే మగవాళ్ళు. మాటలు లీలగా వినపడుతున్నాయి.

ఇవన్నీ బాధలేనా? అసలు ఇలాంటివి లేకుండా ఉంటే ఎవరికీ బ్రతికినట్లుగా ఉండదేమో! ఏదోకటి కావాలి అందరికి. బాధపడటానికి, దుఃఖపడటానికి.

డాక్టర్ వచ్చాడు. అలసటగా ఉన్నట్లున్నాడు. నవ్వీనవ్వనట్లుగా నవ్వాడు. వెనుకైన గాయాన్ని చూస్తూ అన్నాడు “చాలా లక్కీ మీరు, కొద్దిగా పక్కకి తగిలి ఉంటే వెన్నుపూసకి తగిలేది.”

ఆ కోసైన రాయి అంత జాగ్రత్తగా ఎలా గుచ్చుకుంది?

“ఇంటికి వెళ్ళొచ్చా డాక్టర్, ఇంట్లో ఉండే రెస్ట్ తీసుకుంటా,” అభ్యర్థిస్తున్నట్లుగా అడిగా.

“సరే వెళ్ళండి. డిశ్చార్జ్ రాస్తాను, జాగ్రత్తగా ఉండాలి. చిన్న హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ చేతికి. ఆంటీబయాటిక్ వాడాలి గాయానికి.”

ఆ మాటలతో ఊరటగా విశ్వా వైపు చూశా. తన కనుకొనలు నవ్వుతున్నాయి.


ఇంటి దగ్గర దింపి వెళ్ళాడు విశ్వ. అది నేను, రేవతి ఉండే సింగల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్. రేవతి కొంచం కష్టపడ్డట్టుంది. ఇల్లు నీట్‌గా ఉంది. రేవతి వైపు మెచ్చుకున్నట్లు చూశా. ఈ దెబ్బ తగ్గేదాకా వెల్లికిలా పడుకోకూడదు అని మరీ మరీ చెప్పి వెళ్ళాడు విశ్వ. ఇంటికి వచ్చాక ఏదో రిలీఫ్. నిద్రపట్టిందో లేక మగతలోకి వెళ్ళానో.

గుండెల మీద స్పర్శ, నెప్పి కంటే తీవ్రంగా జుగుప్సగా ఉంది. పగలబడి నవ్వుతున్న కోసైన రాయి. తోసేయలేని బరువు. వెన్నులోంచి మొదలైన చలి. గెట్ ఆఫ్! గట్టిగా అరుపు, నేనే వింటున్నా.

నిద్రలేపి రేవతి నీళ్ళు ఇచ్చింది.

ఎవరీ రేవతి, నేను లేనప్పుడు ఎలా ఉంటుంది? నటిస్తుందా? లేదు. నిజంగా ఉంటుంది. తను మంచిది, ఆ మంచితనమంతా నావల్లే కదా! అతను నాపైన చూపించే ఆపేక్ష అంతా నావల్లే కదా! అన్నిటికి నేనే. అయినా వాళ్ళవల్లే నేను మంచిగా, విశాల హృదయంతో ఉన్నట్లు నటిస్తున్నానేమో! నేను ఆ సూదంటి రాయిలా, గాయంతో రక్తమోడుతున్న శరీరాన్ని కూడా తడిమే చేతుల స్పర్శలా కూడా ఉంటానా? అలా కాదేమో. హాఁ! అలా ఏమీ ఉండను.

ఈ నిద్ర ఎందుకు రాదు? అప్పుడే తెల్లారుతుందా! కిటికీలోంచి ప్రపంచం బావుంది, అందరూ ఆహ్లాదంగా ఉన్నట్లు. ఆశ ఉన్నది ప్రపంచంలోనా లేకా ఈ కిటికీలోనా! దూరంగా ఉన్నది ఏదైనా ఎలాంటిదైనా బావుంటుందా? సూర్యుడిని కప్పెట్టే మబ్బులు, ఎదకొచ్సి ఎటూ పాలుపోక అరిచే పిల్లి, ఎంగిలి మెతుకుల కోసం చూసే కాకి, ఎదురింట్లో దొంగతనంగా కాయలు తెంపే పిల్లోడు, ఎండి రాలిన ఆకులు, విచ్చుకోని పూలు, కనపడకుండా పాడే కోయిల అన్నీ వివశత్వమే. అవును, అన్నిటికీ దూరమే అందం, ప్రేమ, పరవశం, అద్భుతం.

“కాసేపు నిద్రపోవే, నొప్పులు తగ్గుతాయి.”


కిటికీని ప్రేమిస్తూ, ద్వేషిస్తూ, నిందిస్తూ నాలుగువారాలు.

విశ్వ అడుగులు ఎన్నిసార్లు కనిపించాయి ఇక్కడ. రేవతి ఒక నక్షత్రమే. అది మెరుస్తూనే ఉంటుంది.

“ఈ రోజు బీచికి వస్తావా, సముద్రం నిన్ను కలవరిస్తుంది.” విశ్వ మెసేజ్.

వర్క్ ఫ్రమ్ హోమ్ చాలించి ఆఫీస్‌కి వెళ్ళిన రోజు బీచ్‌కి వస్తూ ఆ సందులో మలుపు తిరిగింది స్కూటీ. అదే చోట ఆపాను. కావాల్సింది సులభంగానే దొరికింది. తీసుకొని బయలుదేరా. కొంచం దూరంలో ఆమె, పాపతో వస్తుంది.

బీచ్‌కి వెళ్ళా. అక్కడ ఎప్పుడూ పార్క్ చేసే స్థలంలోనే స్కూటీని పెట్టా.

“అక్కా! ఇటు రాక చాల రోజులైంది.” ఐసులమ్మే అబ్బాయి పిలుపు. నవ్వుతూ చేయి ఊపి ముందుకు నడిచా. ఈ రోజు పల్చటి మబ్బుల మధ్య సూర్యుడు. వెనుకనుంచి కనిపిస్తున్నాడు విశ్వ, ధ్యానంలో ఉన్నట్లు. తనని దాటి ముందుకు నడిచా. సముద్రంలోకి కొంచం దూరం నడిచి చేతిలొ ఉన్న వస్తువును బలంగా విసిరివేశా. వెనక్కి వచ్చి విశ్వ పక్కన కూర్చున్నా.

“ఆ కార్ అతను ఫోన్ నెంబర్ ఇచ్చాడు కాల్ చేసి థాంక్స్ చెప్తావా?”

“చెప్పను.”

“సముద్రంలోకి ఏం విసిరావ్?” అన్నాడు విశ్వా ఆసక్తిగా.

“అదే సూదంటి రాయిని. నువ్విప్పుడు వెళ్ళాలా?”

“లేదు, కాసేపు ఉందాం.”

ఇసుకను తడుపుతూ, పల్చటి మెత్తటి ఇసుకను ఒడ్డున వదులుతున్న అలలు.

అలల్ని ముద్దాడుతున్న పాదాలు, కాదు పాదాల్ని ముద్దాడుతున్న అలలు.

ఇసుక, సముద్రం, అలల తాకిడికి నునుపైన రాళ్ళు.


శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...