గణా! అప్పుడు నిన్ను ద్వేషించకుండా ఉండాల్సింది. నీపైన ద్వేషంలో నా స్వార్థం కొంత ఉందని చెప్పాలని అనుకుంటా. సాయంత్రాలు పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ బుజ్జిచేతుల్లో నీ హృదయం కనిపించి వాటిని తనివి తీరా ముద్దాడతా. ఇదంతా నీకు చెప్పుకోగలనో లేదో!
కావు కావుమంటూ ఎగురుకుంటూ వచ్చి ఓ కాకి గోడ పైన కూర్చుంది. దాని ముక్కున మాసం ముక్క. అదిలించా. ఆ మాసం ముక్క దాని నోట్లోంచి జారి పెరట్లో పడింది. ఎక్కడినుంచి వచ్చిందో ఎలుక టక్కుమని దాన్ని ఎత్తుకుపోయింది. గణా! ఎక్కడ ఎవరు నక్కి ఉండి ఎవరిని చేజిక్కించుకుంటారో!
జీవితం మామూలుగానే గడిచినా, ఆనందం లేకపోయినా, విషాదంగా ఉన్నా బానే ఉంటుంది. కానీ తప్పు చేసినట్లు దాన్ని మోస్తూ తిరగడమే కష్టం. తప్పు ఒప్పు అంటూ ఏమీ ఉండవని, తప్పు జరగడం వెనుక తెలియని, అర్థం కాని అన్యాయాలు ఉంటాయని అర్థం కావడానికి చాలా రోజులు పట్టింది. గణా! నా పరంగా ఏదో తేల్చుకోవడానికో, చెప్పడానికో ఏదైనా అడగడానికో కాదు, ఉత్తగా కారణాలు ఏమీ లేకుండా ఒక్కసారి నిన్ను చూసి దగ్గరగా హత్తుకొని గుండెని తేలిక చేసుకొని వెళ్ళాలనుకుంటున్నా.
అంతా అనుకున్నట్లే జరుగుతుందా!?
ఇంకా రెండున్నర గంటలు. కాలాన్ని మోయడం కష్టం. ఉండబట్టలేక స్టేషన్‌కి వచ్చేశా.
9:32 AM
ఎప్పుడూ కూర్చొనే కాంటీన్ ముందు అరుగు పైన కూర్చుని, సిగరెట్ వెలిగించా.
“గణా, కనీసం ఇదైనా మానుకుంటావా?” వెళ్ళేప్పుడు రమణ చివరిమాట. స్వేచ్ఛ గురించి కలవరించే రమణ ఎందుకో నా సిగరెట్ స్వేచ్ఛని గుర్తించదు మరి.
క్యాంటీన్ కుమార్ నేను వచ్చి కూర్చోగానే అడక్కుండానే చాయ్ పంపిస్తాడు.
కుమార్, రమణ కొన్నిసార్లు ఒకేలా అనిపిస్తారు. అడక్కుండానే ఏమి కావాలో తెలిసిపోతుంది వీళ్ళకి. ఏది గమనించనట్లు ఉంటూ ఎంతమందిలో ఉన్నా ఒక కంట కనిపెట్టుకొని ఉంటారు. ఖాళీగా ఉన్నా ఏదో పని ఉన్నట్లు ఉషారుగా హడావుడి చేస్తుంటారు.
9:45 AM
చీపురుపుల్ల పిల్లోడు సమోసాలు పట్టుకొని అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఈ సమోసాలు నిన్న రాత్రి చేసినవయుంటాయి. వాటి రుచే వేరు. వాడెప్పుడూ ఆ సమోసాలు తిన్నట్టు కనపడడు. వాడి నడకని గమనించడం నాకున్న అలవాటు. వాడెలా ఉన్నాడో వాడి కాళ్ళను చూస్తే తెలిసిపోతుంది. అవి వేగంగా అటూయిటూ కదులుతున్నప్పుడు జీవితం మీద ఆశతో ఏదైనా సాధించాలన్నట్లుంటాయి. అసలు దేనికీ సమయమే లేనట్లు హడావుడిగా పరిగెడుతున్నప్పుడు దేనికోసమో ఆరాటపడుతున్నట్లుంటాయి. కొన్నిసార్లు ఇష్టంగా మనుషులందరినీ ప్రేమిస్తున్నట్లు నింపాదిగా నడుస్తుంటాయి. ఎప్పుడైనా ఒక్కో అడుగు కూడదీసుకున్నట్లు నెమ్మదిగా పడే అడుగులు స్తబ్దంగా అందరినీ వదిలేసి నిరాసక్తంగా ఉంటాయి. నా దగ్గరకొచ్చినప్పుడు మాత్రం కుదురుగా నడుస్తాడు. ఒక్కోసారి ‘సార్, ఆ సిగిరెట్లు అన్ని కాల్చకండి సార్’ అని చెప్పి పోతుంటాడు, ఏదో రమణ వీడికి చెప్పి పంపినట్లు.
రమణ ఎప్పుడూ ఎవ్వరూ పట్టనట్లు ప్రపంచమంతా తనదే అన్నట్లు నిర్లక్ష్యంగా నడిచేది. ఎప్పుడైనా నా చేయి పట్టుకొని నడిచేప్పుడు మాత్రం వాడు నడిచినట్లు నింపాదిగా నడిచేది. అప్పుడప్పుడూ కుడికాలును ఎగరేసి కొద్దిగా తూలినట్లు అడుగు వేసినప్పుడు తన చేయి నా చేతిని తాకి ఇష్టం సన్నగా చుట్టుకున్నట్లు ఉండేది.
ఎప్పుడో ఒకసారి వీడు కూడా అలానే నడుస్తాడేమో ఎవరినైనా పట్టుకొని. అలా నడుస్తున్నప్పుడు వాడిని పట్టుకున్న చేయి టక్కుమని వదిలేస్తే వాడు కింద పడకుండా ఉంటే చాలు. రమణ నాకు నడవటమే రాదని వెక్కిరించేది. ‘కాస్త ఉషారుగా నడవలేవా? ఏంటా పెళ్ళికొడుకు నడక!’ అనేది.
తనతో అలా అడుగులు వేయడంలో ఉన్న శాంతి తనకి ఎప్పుడైనా తెలిసుంటుందా?
10:00 AM
లెక్కలేనన్ని సార్లు నన్ను ఎంతగా ద్వేషించిందో, అంతగా అన్నేసార్లు ప్రేమించింది రమణ. ప్రేమించడం ఎంత ఉన్మత్తంగా ఉండేదో ద్వేషించడమూ అంతే. వాటిలో తను స్వేచ్ఛగా అనుభవించే ఫీలింగ్స్ నాకు ఇష్టం. ప్రేమించడంలో లేని ఏదో హాయిని తను ద్వేషించినప్పుడు అనుభవించానేమో! తను ప్రత్యేకమని, అది నేనే గమనించి గుర్తించాలని తాపత్రయం తనలో. రమణ ప్రత్యేకమో కాదో తెలియదు కానీ తను మాత్రమే పూరించగలిగే ఖాళీలతో, రమణ మాత్రమే ఉండటానికి నా మనసు అనుకూలంగా ఉంటుందనుకుంటా! రమణ వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆపకుండా ఉండాల్సింది. అదే తన నిశ్చయాన్ని స్థిరపరుచుకునేలా చేసినట్లుంది.
10:30 AM
జామపళ్ళు అమ్మే బుడ్డి ఎవరూ లేనప్పుడు రెండు వేళ్ళు నోట్లో పెట్టుకొని ఆలోచిస్తుంటుంది. దానికి పదేళ్ళు ఉంటాయా? ఇంత చిన్న వయసులో ఏం ఆలోచిస్తుంటుందో! నాకు సిగరెట్‌లా, నోట్లో వేలేసుకోవడం ఆ పిల్లకి. అది కూడా నాలాగే ఏదైనా మర్చిపోవాలనుకుంటుందేమో! నా దగ్గరకు రాదు కాని, ఒక మూలగా నన్ను గమనిస్తుంటుంది. ఎప్పుడన్నా నవ్వితే చిన్ననవ్వుని బదులిచ్చి తల అటుతిప్పుకునేది. రైలు వచ్చి ఆగినప్పుడల్లా చీపురుపుల్ల పిల్లోడి వెంట పరిగెట్టేది. ఎక్కడలేని ఉషారుతో రైలు కిటికీల పక్కన నిల్చొని జామకాయలు చూపిస్తూ అమ్మేది. వెళ్ళిపోతున్న రైలు వైపు చూసి చేతులు ఊపేది. అటువైపే చూసే నన్ను చూసి భుజాలు ఎగరేసి నవ్వేది. రైలు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో వెళ్ళేటప్పుడూ అంతే. స్టేషన్‌కి వచ్చాక బుడ్డి కళ్ళలోంచి తప్పించుకోవడం కష్టం.
రమణ ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకు ఈ స్టేషన్‌లో పెద్ద మార్పేమీ లేదు. తనకి ఆగకుండా వెళ్ళే రైళ్ళంటే ఇష్టం. ఏదో స్టేషన్ వచ్చిందని కొద్దిగా స్లో అయిన రైల్లోంచి ఇక్కడ ఏముందా అని ముఖాలు బయటికి పెట్టి ప్లాట్‌ఫామ్ పైన రైలు కోసం ఎదురుచూసే వాళ్ళ వైపు జాలిగా చూస్తూ వెళ్ళిపోయే మనుషుల చూపులు తమాషాగా ఉంటాయనేది.
రమణ కూడా ఆగకుండా వెళ్ళే రైల్లో ఈ దారిలో ప్రయాణించే ఉంటుంది. ఈ స్టేషన్ చూసి ముఖం తిప్పుకొనుంటుంది. ఈ స్టేషన్ పక్కనే ఉన్న నా ఇంటిని ఎప్పుడన్నా చూసే ఉంటుంది. నన్నెలా గుర్తు చేసుకునేదో అప్పుడు. డాబాపైన తన బుగ్గ కొరికింది గుర్తు తెచ్చుకొని ఉంటుందా? లేదూ నా చేతకానితనాన్ని గుర్తు తెచ్చుకొని వెగటుగా ముఖం పెట్టుకొని ఉంటుందా? తను ఆశించే ప్రయోజకత్వాన్ని నేను చేరుకోలేకపోవడం నా చేతకానితనమేమో! సాధారణంగా ఉండటం ఒక తక్కువతనం. అది ఒక్క రమణ దృష్టిలోనే కాదనుకుంటా. అయినా అంతగా ద్వేషించే పని నేనేం చేశా? ద్వేషించే రమణ కళ్ళ వెనుక ఏదో భయం, చెప్పుకోలేని బాధేదో ఉంది. అదేంటో ఇప్పటికీ అర్థమవ్వలేదు. ఏదో ఉంది. ఇంకేదో దాచడానికి ద్వేషించేదా? ఎందుకు అంతగా ప్రేమించిన మనుషులు అసలేమీ కానీ మనుషులకన్నా అపరిచితులై పోతారు హఠాత్తుగా.
10:50 AM
అప్పట్లో ఇక్కడ రామ్మూర్తి స్టేషన్ మాస్టర్‌గా ఉండేవాడు. ‘సరదాగా ఏ రోజన్నా రైలు రావడానికి అనుమతి ఇవ్వకుండా ఉండరాదా? వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళకుండా ఉండిపోతారు’ అనేవాడిని. రామ్మూర్తి వింతగా నవ్వేవాడు. నా అమాయకత్వానికేమో! నా వెనుక నిలబడ్డ రమణని చూస్తూ కళ్ళు కొద్దిగా చికిలిస్తూ తమాషాగా తలాడించేవాడు. రామ్మూర్తి ట్రాన్స్‌ఫరై గుజరాత్ వెళ్తున్నా అని చెప్పాడు. వెనక్కి వచ్చే ఉంటాడు. పెళ్ళి చేసుకున్నాడో లేదో? వాడు సంగమేశ్వరం స్టేషన్ కేమన్నా వచ్చి ఉంటాడా? అక్కడే కదా రమణ ఉండేది. కలిసుండచ్చు కూడా. అందులోను వాడి చికిలించే తమాషా కళ్ళు నచ్చకుండా ఎవరికుంటాయి?
11:15 AM
గూడ్సుని లూప్ లైన్లో పెట్టారు.
వచ్చే రైలు కోసం గూడ్సు బండిని లూప్‌లో పెట్టాలి. అయినా గూడ్సు బండ్లకి విలువేముంది? ఎక్కడ పడితే అక్కడ రోజుల తరబడి ఆగిపోతావుంటాయి. ఆగిన జీవితం దేనికోసమో ఎప్పుడో మళ్ళీ ఎవరి దయతోనో కదిలినట్లు నెమ్మదిగా అన్ని బండ్లు వెళ్ళాక అదీ బయలుదేరుతుంది.
ఇంకో టీ అన్నట్లు కుమార్ వైపు చూశా.
బలంగా వీస్తున్న గాలికి దుమ్ము లేస్తోంది.
11:30 AM
రైలు వస్తున్నట్లు అనౌన్స్ చేస్తున్నారు.
గుండె వేగంగా కొట్టుకోవడం తెలుస్తుంది. రమణ వస్తుందా? వస్తే ఏం మాట్లాడాలి? నన్ను చూసి ఏమనుకుంటుందో! గుర్తుపడుతుందా అసలు. మస్టర్డ్ రంగుకి మెరూన్ బోర్డర్ చీర, నాకిష్టమయిన చీర. తను గుండెలకు అపురూపంగా హత్తుకున్నప్పుడు నా ముఖానికి మెత్తగా తగిలిన చీర. అది కట్టుకొని వస్తుందా?
అయినా రమణ ఇంతకాలం తరువాత ఎందుకొస్తుందో?
పదిహేనేళ్ళు… చిన్న సమయం రమణను మర్చిపోడానికి. పెద్ద సమయం తనలో ద్వేషం కరిగిపోవడానికి.
11:40 AM
సమయం దగ్గర పడుతోంది.
రైలు ప్లాట్‌ఫామ్ పైకి నిశ్శబ్దంగా వస్తున్నట్లుంది. చీపురుపుల్ల పిల్లోడు పరిగెత్తాడు ‘సమోసాలు సమోసాలు’ అంటూ. వాడి హడావుడి కాళ్ళతో కలిసి బుడ్డి పరిగెడుతోంది రైలు వెంట. కుమార్ లేచి లుంగీ సరిచేసుకున్నాడు. జనాలు తోసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు రైలు ఎక్కాలి, ఎక్కడికో పోవాలి. వాళ్ళ పనులకోసమో! ఇంకెవరికోసమో!
రైలు ఆగింది. ఒళ్ళంతా ఏదో తెలియని అలజడి. దానికి రమణతో తప్ప రమణ వెళ్ళి ఎంత కాలమయ్యిందన్న ధ్యాసే లేదు. కాళ్ళు నడవనంటున్నా నడుస్తున్నా. అడుగులు మరింతా నెమ్మదిస్తున్నాయి. రమణని ఎదుర్కోడానికో లేదా ఎదురుపడటానికో సిద్ధంగా లేనా? ఈ రైలు రాకుండా ఉంటే బావుండేది. నా చేతకాని జీవితం బావుందని రమణకి తెలీడం ఇష్టం లేదేమో! నిన్ను మరిచిపోయి చాలా కాలమైందని, కలుసుకొని కలబోసుకొనేవేమీ లేవని తెగేసి చెప్పాలి. చెప్పగలనా?
ఏదైనా రమణకి ఋణపడి ఉన్నానా? ఆమెని ప్రేమగా తాకినందుకు లేదా ఆమె ప్రేమని, ద్వేషాన్ని తీసుకున్నందుకు. అయినా ఋణమేముంది? రమణ ఎవరికైనా ఇలానే ఇస్తుంది కదా!
ఇంతసేపు ఎదురుచూసి ఇప్పుడేంటో మనసు ఎదురుతిరుగుతోంది.
రమణ కనపడలేదు. బోగీలోంచి దిగిన మనుషులు వెళ్ళిపోతున్నారు. రాని సిగ్నల్ కోసం రైలు నిరాసక్తంగా ఎదురుచూస్తోంది. ఎందుకు రాలేదో! ఏమైందో? వద్దనుకుందేమో! అలానే నిలబడ్డా. సందడి సద్దు మణుగుతోంది.
11:51 AM
సిగ్నల్ వచ్చినట్లుంది. రైలు కూత వేసింది. డ్రైవర్ పచ్చజెండా ఊపుతున్నాడు. హఠాత్తుగా వెనకనుంచి ఎవరో షర్ట్ లాగుతున్నట్లనిపించింది. చూస్తే బుడ్డి. అది రెండు వేళ్ళు నోట్లో వేసుకొని నా వైపు చూస్తోంది. ఏంటి అన్నట్టు చూశా. టీకొట్టు వైపు చూపించింది.
అక్కడ రమణ. గుండె ఆగి కొట్టుకోవడమంటే ఏంటో తెలిసిందప్పుడే. రక్తమంతా ముఖంలోకి తన్నుకొస్తున్నట్లుంది. బిగుసుకుపోయిన దవడ కండరాల్ని అడిగితే పెద్ద కథ చెప్తాయేమో! అప్రయత్నంగానే చేయి తలపైకి వెళ్ళింది. అప్పుడప్పుడే వస్తున్న బట్టతలను కవర్ చేసుకోడానికన్నట్లు జుట్టు ముందుకి లాక్కున్నా.
రమణ నావైపు చూస్తున్నట్లనిపించింది. ఆమేనా నా రమణ. తనలా అనిపిస్తున్న ఎవరో!? తనలో ముద్దు పెట్టుకున్న, ప్రేమించి ద్వేషించి నెట్టేసిన రమణ లేదు.
ఎవరో ఉన్నారు తన పక్కన. సన్నటి నవ్వుతో చికిలించి చూసే తమాషా కళ్ళు. కాలం కాసేపు స్తంభించినట్లనిపించింది. ఉన్నట్లుండి అంతా మసకమసకగా కనిపిస్తున్నారు. ఏమి జరుగుతుందో తెలీలేదు. వెనక్కి తిరిగి వెళుతున్న రైలువెంట పరిగెత్తాను పిచ్చి పట్టినట్లు. ఎదురు చూసిన రైల్వే స్టేషన్ జీవితం పగలబడి నవ్వుతోంది. చికిలించే కళ్ళతో ఆ వింతైన నవ్వు ముంచేస్తోంది. తాగిన సిగరెట్లన్నీ ఏడుస్తున్నట్లు ఆయాసం తన్నుకొస్తోంది.
“గణా!” రమణ కేక గాల్లోంచి చెవులను చేరుతోంది.
ఇంకో రోజు ఉంటుందా తన కోసం!?
అంత ఆయాసంలో కూడా తెరలుతెరలుగా హాయిగా నవ్వొస్తోంది.
ఎవరినీ కౌగిలించుకొని తేలిగ్గా ఊపిరి పీల్చుకొనే పని కాని, గుండెల్లో భారం ఉందని దించుకొనే అవసరం కానీ లేదు రమణకి ఇక.
ఒక్కసారిగా రైల్లోకి దూకాను. ఏం జరుగుతుందో తెలిసే లోపే రైలు వేగం అందుకుంది. ఎక్కడికి వెళుతున్నానో, ఎవరినుంచి దూరం పోతున్నానో, ఎంత దూరం పోతానో తెలీదు.
ఇక ఆమెను కలిసే పని లేదు. తాకే అవసరం లేదు. ఆ నవ్వును చూసే బాధ లేదు.
ఇప్పుడు ఇక్కడేమీ లేదు. ఏదీ లేదు.
శూన్యంలో విలవిలలాడుతూ కొట్టుకుంటున్న గుండె నెమ్మదిగా తేలికవుతోంది.
బుడ్డి నవ్వుతూ చేతులు ఊపుతూ ఉండి ఉంటుంది, వెళ్ళే రైలుని చూస్తూ.
12:00 PM
రెండు ముళ్ళు కలుసుకున్నాయి.
కాలం ఆగి కదిలింది.