సముద్రం – రాస్

ఇదంతా జరిగిందే కదా. మరెందుకు ఏమీ జరగనట్లు ప్రపంచం అలా అంటుంది. అలాంటి మనిషి అలా ఒకసారైనా వచ్చివెళ్తాడని ఊహించలేదు. నా చేతివైపు చూసుకున్నా, రంగుల పూసల దారం నా మణికట్టుని హత్తుకొని ఉన్నట్లు సహజంగా అమరిపోయి ఉంది.


మేమందరం అతని మాటలు శ్రద్ధగా వింటున్నాం. అతన్ని కెప్టెన్ అని పిలుస్తున్నాం. అతను పరిచయమై పదిహేను నిమిషాలు అయిందనుకుంటాను. మాతో కూర్చొని కబుర్లు చెప్తున్నాడు.

నాకెందుకో అతడు కొద్దిగా హైలో ఉన్నాడా అనిపించింది. ఆకర్షణీయంగా ఉన్నాడు, చెపుతూ చూపుతో కళ్ళను ఎగరేసి తమాషాగా ఊఁ కొట్టిస్తున్నాడు మాతో. అతని ముక్కు మాట్లాడుతున్నట్లు ఉంది అతను మాట్లాడుతుంటే. ఒక మనిషి రూపం ఇంతగా నచ్చడం నాకిదే మొదటిసారేమో. అంతగా ఆకర్షించడానికి కారణం అతని సన్నని నడుము కారణం కాకపోవచ్చు, అతని ముక్కు కావొచ్చు లేక స్పానిష్ యాస కావొచ్చు. అతను ఎవరికోసమో ఎదురుచూస్తున్నాడు కావొచ్చు. రావాల్సినవాళ్ళు సమయానికి రాలేదు. నేను కొద్దిసేపు మీతో కూర్చోవచ్చా అని అడిగి మరీ కూర్చున్నాడు. అప్పటివరకు ఏవో లోపల్లోపల మాట్లాడుకుంటున్న మేము, కొత్త వ్యక్తిని ఆసక్తిగా చూస్తున్నాం.

సముద్రం శబ్దం చూశారా, అది మనతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది అన్నాడు. సముద్రం మధ్యలోకి వెళ్తే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, లోతు ఎక్కువ ఉన్నప్పుడు శబ్దం తగ్గిపోతుంది అని చెప్పాడు. మీకు సముద్రం గురించి బాగా తెలుసునులా ఉంది అన్నారు మాలో ఒకరు. నేను కెప్టెన్‌గా పని చేశా చాలా రోజులు అన్నాడు. అతడిని కెప్టెన్ అనాలని తీర్మానించాం. అతను మధ్య మధ్యలో నా వైపు ప్రత్యేకంగా చూస్తున్నట్లనిపించింది. కొద్దిగా మనసులో గర్వంగా అనిపించింది.

అతడు సముద్రం పైన తన కథలు చెప్పడం మొదలుపెట్టాడు ఉత్సాహంగా. బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర తన సాహసాలు, అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఎక్కువని దాని దగ్గరగా వెళితే తనలోకి లాగేస్తుందనీ చెప్తూ నావైపు చూసి తమాషాగా నవ్వాడు. అతడు ఆ వాక్యాలు నన్ను ఉద్దేశించే అన్నాడని అనిపించి లోపల నవ్వుకున్నా. తాను ఎంత చాకచక్యంగా షిప్‌ని బయటకు వేసింది, సముద్రపు పెద్ద పెద్ద అలలను తప్పించి వచ్చిన విషయాలు, సముద్రం-తాను ఏ జన్మలోనో స్నేహితులమని, అలానే కొందరిని చూస్తే ఎప్పుడో చూసినట్లు ఉంటుందని బహుశా వారు అంతకు ముందు మనం ప్రేమించినవాళ్ళే అయి ఉంటారని చెప్పి నవ్విస్తున్నాడు. మీరేమంటారు దీనికి అని నన్ను రెట్టించి కవ్వింపుగా అడిగాడు. అలాంటివి నేను నమ్మను, వారి మధ్యన పుట్టే ఆకర్షణకి ఇచ్చుకునే అసంబద్ధ కారణాలు అని నవ్వుతూ కొట్టి పారేశాను. నాతో పాటు అక్కడ మిగిలిన నలుగురు అతని సంభాషణని ఎంజాయ్ చేస్తున్నట్లు అనిపించింది.

అతను చెప్పే పద్ధతి ఆకర్షణీయంగా ఉంది. అతను అన్నీ నిజాలు చెపుతున్నట్లు అనిపించకపోయినా అతని చెప్పే పద్ధతి బావుంది. నాకు జానీ డెప్ గుర్తొచ్చాడు పైరేట్స్ ఆఫ్ కారిబియన్. ఎంత అబద్దాల కోరైనా, మోసగాడైనా, తాగుబోతైనా వాడిలో ఏదో నచ్చుతది, మంచి ఉంటది, వదల్లేని ఆకర్షణ ఉన్నట్లు. ఈ కెప్టెన్‌లో ఏదో ఉంది అనుకున్నా. అతను అర్ధరాత్రి నడి సముద్రంలో చంద్రోదయాన్ని వర్ణిస్తున్నాడు. అంత అద్భుతమైన దృశ్యంలో జరిగే రొమాన్స్ మిగిల్చే అనుభూతి ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు. నేను అతని వైపు చూడటం మానేశాను. ఆ సంభాషణను ఎటువైపో కావాలని లాక్కెళుతున్నట్లు నన్ను హెచ్చరిస్తున్నట్లు అనిపించింది.

నేను కొద్దిగా టాపిక్ మార్చి మీరు ఎక్కడివారు? మీది ఏ ఊరు అన్నా.

అంతసేపు సంభాషణలో నేను అడిగిన మొదటి ప్రశ్న.

మా ఇంగ్లీష్ సంభాషణలో అదొక సులభమైన ప్రశ్న.

అతను మీరింకా అడగలేదేంటా అని అనుకుంటున్నా అన్నాడు. అయినా ఒకటి చెప్పండి అమీగోస్, మనం ఎక్కడివారమైతే ఏంటి ఇప్పుడు? ఇక్కడ కలిసి ఉన్నాం కదా, అదే కదా ముఖ్యం అన్నాడు. అందరూ నవ్వుతూ తలాడించారు. అయినా కోలకళ్ళ అమ్మాయి అడిగింది కదా, నేను చెప్పే తీరాలని మొదలుపెట్టాడు. నా గురించి చెప్పాలంటే నా తాత నుంచి తాత స్నేహితుడు రాస్ గురించి చెప్పాలి అన్నాడు. అందరూ ఓహ్ అని నిట్టూర్చారు. అయ్యో, మీరనకున్నట్లు మాది జమీందారీల చరిత్ర కాదు, అక్కడ నుంచి చెపితేనే మీకు సరిగా అర్థమవుతుంది, చెప్పమంటారా అని నావైపు చూశాడు, నేను కొద్దిగా ముందుకు వంగాను.

మా తాతవాళ్ళు పసిఫిక్ సముద్రంలో ఉన్న ఛానల్ ఐలాండ్స్‌లో ఉండేవాళ్ళట. అక్కడకి సీ లయన్స్ వచ్చేవట, అవి మేటింగ్ సీజన్లో సముద్రపు ఇసుకలోకి చేరేవి. ఒకసారి ఒక సీ లయన్ పుట్టాక దాని తల్లి చనిపోయిందట, తండ్రి సముద్రంలోకి వెళ్ళి తిరిగి రాలేదట. ఆ సీ లయన్‌కి రాస్ అని పేరుపెట్టి మా తాత పెంచుకున్నాడు. మా అమ్మ, రాస్‌తో దగ్గరగా పెరిగిందట. రాస్‌కి మా అమ్మ అంటే అలవికాని ప్రేమ.

అది మా అమ్మని ఎప్పుడూ వదిలి ఉండేది కాదు. రాస్, తాత కలిసి సముద్రంలోకి వేటకి వెళ్ళేవాళ్ళు. మా అమ్మ ఒక సముద్ర వర్తకుడిని ప్రేమించింది. అతను సముద్రం పైకి వెళ్ళి తిరిగి రాలేదు. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మా తాత, రాస్, అమ్మ, నేను బోట్‌లో సముద్రం పైకి వెళ్ళేవాళ్ళం. ఒకసారి తుఫానులో చిక్కుకొని మా పడవ మునిగిపోతే నన్ను, మా తాతను ఒడ్డున వేసి రాస్ సముద్రంలోకి వెళ్ళి తిరిగి రాలేదు. అది మా అమ్మను వెతుకుతూ వెళ్ళిందని, అప్పుడప్పుడు ఒడ్డుకు వచ్చి విచిత్రంగా ఏడుస్తూ ఏదో ఒక పాట పాడి వెళ్తుందని చెప్పేవాడు మా తాత. మా ఊరివాళ్ళు మీ తాత సముద్రపు గుహల్లోనుంచి వచ్చాడని, అందుకే రాస్ స్నేహితుడయ్యాడని చెప్పేవాళ్ళు. ఆ రకంగా నేను సముద్రపు గుహలకి చెందినవాడినన్న మాట అన్నాడు నవ్వుతూ.

అందరూ అతని మాటలు ఆసక్తిగా వింటున్నారు అనిపించింది. ఉన్నట్టుంది అతను పాట పాడటం మొదలుపెట్టాడు. చాలా గమ్మత్తయిన పాటలా ఉంది ఆ పాట, ఇంగ్లిష్ స్పానిష్ పదాలు కలిసి ఉన్నాయి. మధ్యమధ్యలో విజిల్ వేస్తున్నాడు, ఆ విజిల్ సంకేతం ఇస్తున్నట్లు ఉంది.

సముద్రాన్ని చంద్రుడు ఆక్రమించుకున్నాడు.
ఆ వెన్నెల నాకూ సోకుతుంది
నా మనసు కొద్దిగా వశం తప్పి
నా ప్రియురాలి దగ్గరకి చేరుతుంది
తన ఒడికోసం వెతుకుతుంది
నా కన్నులిప్పుడు సౌందర్యంతో నిండిపోయాయి
ఆమె కురులు నన్ను దగ్గరికి పిలుస్తున్నాయి
సముద్రమా! నువ్వు నన్ను అనుమతించాలి
ఈ రేయి నా ప్రియురాలి చెంతకు చేరనివ్వాలి

ఇలా సాగుతుంది అతని పాట.

అతను ఆకాశంలోకి చూస్తూ నవ్వుతూ పాడుతున్నాడు. అతని గొంతులో ఏదో సన్నటి మత్తు కురుస్తున్నట్లు ఉంది.

మంటను కదిలించే నెపంతో అతడు చుట్టూ తిరిగి నాపక్కకు వచ్చి కూర్చున్నాడు.

అప్పుడు గమనించా. అతని చేతికి సన్నటి రంగుల పూసలతో దారాలు మణికట్టుకి కట్టి ఉన్నాయి. చిన్న శంకు గుర్తు టాటూ వేసుంది.

అతని చేతులు దృఢంగా ఉన్నాయి, చేతివేళ్ళు కళాకారుడి చేతివేళ్ళలా సన్నగా పొడవుగా ఉన్నాయి. నా చేతి పైన చేయి వేసి మృదువుగా పట్టుకొని వదిలేశాడు. నాకు అర్థం కాలేదు.

పాట ఆగింది.

నువ్విలా తెలియనివాళ్ళని సముద్రపు ఒడ్డున ఇలా కలుస్తూ ఉంటావా అన్నా. తెలియనివాళ్ళు కాదు, కలవాల్సినవాళ్ళని కలుస్తాను. లేకపోతే ఎప్పటికీ కలవరు వాళ్ళు. నేను కలుసుకొనే అవసరం లేనివారికి నేను కానీ నా కథలు కానీ గుర్తుండవు. చెప్పాను కదా, సముద్రపు గుహ మనిషినని అన్నాడు.

అతనో చిన్న పాటి మాంత్రికుడిలా అనిపించాడు, అర్థం కాలేదు. నువ్వు ఎక్కడినుంచి అని అడిగాడు. అతడలా అడుగుతున్నప్పుడు నాకు దగ్గరగా జరుగుతున్నాడు. అతని దగ్గర సన్నటి నారింజ వాసన.

ఈ భూమి పైన పుట్టినదానిని, నీలా సముద్రపు గుహనుండి రాలేదు అన్నా వెక్కిరింతగా.

నాకు అలా అనిపించట్లేదు. నువ్వు ఆకాశం నుండి భూమి పైకి జారిపడి ఉంటావు, లేక ఏ సముద్రపు గుహ నుండో తప్పిపోయి భూమి పైకి వచ్చివుంటావు అన్నాడు నవ్వుతూ.

నిన్నేమని పిలవాలి? అని అడిగాడు. నువ్వే చెప్పు అని రెట్టించా.

నువ్వు నోవియవి అన్నాడు. అంటే ప్రేయసి అని అర్థం అన్నాడు నవ్వుతూ. నీ నవ్వు ఎంతో తేటగా ఉంది, నీ హృదయం దూదికన్నా మెత్తగా ఉంది అన్నాడు.

సడెన్‌గా తన మణికట్టున కట్టిన రంగుల పూసల దారం తీసి నా చేతికి కట్టాడు, నా చెవిలో గుసగుసగా చెప్పాడు… నన్ను నమ్ము, నువ్వు గాలికన్నా తేలికైనదానవు అని. అతని పెదవులు నా చెవి కొసలకి తడిగా తగిలాయి నాకు. కొన్ని క్షణాలు ఆగిపోయినట్లనిపించింది. ఆ కొద్ది సమయంలోనే నేను అతనికి చాలా దగ్గరగా ఉన్నాననిపించింది. అతను నేనెప్పుడో తప్పిపోయిన ప్రేయసిని అని అపురూపంగా నన్ను చూసుకోవడం నచ్చింది. అతడు నేనూహించిన ప్రియుడే. నేనతడిని గుర్తుపట్టాను, నేను ఎదురుచూసింది అతడి కోసమే అని. అంతమందిలో నన్ను అమితంగా ఆకర్షించడమే కాదు, అతడినే నేను ఎంపిక చేసుకుంది అని తెలుసు. అతడు నా శరీరం ఎంతో తేలికైందని, అంతే మబ్బులాంటి మనసని గుర్తుపట్టాడు.

సన్నటి జల్లు కురవడం మొదలైంది. అంతలోకే పెద్ద మెరుపులు ఉరుముల శబ్దం. అందరం హడావుడి లేచాము, కాటేజ్ వేపు పరిగెత్తాము.


ఆలస్యంగా మెలుకువ వచ్చింది. రాత్రి జరిగినదంతా గుర్తుకు వచ్చింది, కెప్టెన్ గుర్తొచ్చాడు. అదే విషయం నాతో ఉన్నవాళ్ళని అడిగా. ఎక్కడికీ వెళ్ళలేదని, రాత్రి నేను త్వరగా పడుకున్నానని చెపుతున్నారు. వర్షం పడలేదని బయటికి పరిగెత్తా రాత్రి మంట వేసుకున్న స్థలం దగ్గరికి. ఏదీ లేదు. ఇదంతా కలనా! విస్మయంగా అనిపించింది. అతని నారింజ వాసన ఇప్పటికీ తెలుస్తుంది నాకు. అక్కడ ఇసుకలో సీ లయన్ నడిచిన గుర్తులు కనపడ్డాయి. ఏదో అర్థమైనట్లు, ఏదీ అర్థం కానట్లు సముద్రాన్ని చూస్తూ నిలబడిపోయా. దానికేదో అర్థమైంది. ఏదో చెపుతున్నట్లు అలలు నన్ను తాకి వెనక్కి వెళుతూ ఉన్నాయి. అతడు చెప్పిన రాస్ అతడేనా. అతడు సముద్ర తీరానికి దేనికోసం వచ్చాడు, నాకోసమేనా? అతడు నాలో సీ లయన్‌ని, నా లోపలి సముద్రాన్ని చూశాడా? నా మణికట్టున ఉన్న రంగు పూసల దారాన్ని చూసుకుంటూ వెనుతిరిగాను.


శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...