రబీరా

బస్సు ఎక్కగానే తక్కువ ధరతో ఎక్కువ దూరం పోవడానికి అలవాటైనవాళ్ళు, టైమ్‌కి ఎలాంటి ప్రాముఖ్యం ఇవ్వనివాళ్ళు మాత్రమే ఇలాంటి బస్సు ఎక్కుతారేమో అనిపించింది. ఎందుకో ఆ రోజు పక్కసీట్ ఖాళీగా ఉంటే బావుంటుంది కదా అనిపించింది. అలా అనిపించిన కాసేపటికే అతను వచ్చి నా పక్కన కూర్చొన్నాడు. తెలుపులో రోజా రంగు కలిపినట్లుగా ఉన్నాడు. అతని దగ్గర ఒక రకమైన పచ్చిగడ్డి వాసన. అతనితో మాట్లాడతానని అనుకోలేదు.

కాస్త స్తిమితంగా కూర్చొన్నాక, నవ్వుతూ నావైపు చూసి అడిగాడు, “ఎక్కడి వరకు?”

మాటలు కలపక తప్పలేదు. అతని ఇంగ్లీష్ ఒక రకమైన యాసతో ప్రత్యేకంగా ఉంది.

“లిటిల్ రాక్, ఆర్కాన్సా వరకు.”

“మంచిది, నేనూ అంతవరకు మీకు తోడుగా వస్తాను.” గట్టిగా నవ్వాడు.

ఆ నవ్వు నాకు చిత్రంగా మా ఊర్లో చాకలి రాజయ్య గాడిద నవ్వులా అనిపించింది. ఆ గాడిద నవ్వడం నేను ఒకే ఒక్కసారి చూశా. నా చిన్నప్పుడు దొంగలు ఒకసారి చాకలి రాజయ్య గాడిదను ఎత్తుకెళ్ళారు. కానీ దాన్ని తోలుకు వెళ్ళలేక దాన్ని, దానితో పాటు దానిపైన దొంగతనం చేసి వేసిన బరువైన వస్తువుల్ని కూడా ఊరి చివరి వదిలేసి వెళ్ళారు. ఉదయాన్నే దాన్ని వెతుకుతూ వెళ్ళిన రాజయ్యకు తన గాడిద ఊరి చివర బీడు పొలాల్లో గడ్డి తింటూ కనిపించింది.

ఊళ్ళో వాళ్ళు రాజయ్య గాడిద గాడిద పనులు తప్ప అన్నీ చేస్తుందని నవ్వుకొనేవాళ్ళు. రాజయ్య మాత్రం దాన్ని శ్రద్ధగా చూసుకొనేవాడు. దానిమీద తక్కువ బరువులుంచి రాజయ్యే ఎక్కువ బరువు మోసేవాడు. రాజయ్యను ఓ తెలివితక్కువ చాకలోడని అందరూ వెక్కిరించేవాళ్ళు. ఓ సారి రాజయ్య గాడిదతో మా ఇంటికి వచ్చాడు. నేను ఆ గాడిదను, దొంగలు తీసుకెళ్ళినప్పుడు నీకు భయం వేయలేదా అని అడిగానట. అడిగిన విషయం నాకు సరిగా గుర్తులేదు కానీ ఆ రోజు రాజయ్య గాడిద నన్ను చూసి నవ్విన నవ్వు మాత్రం ఇప్పటికీ గుర్తుంది.

ఇప్పుడు ఇతని నవ్వు చూడగానే ఆ రాజయ్య గాడిద గుర్తుకురావడం అనే ఆలోచన నాకు తప్పుగా అనిపించింది. గాడిద మనుషులకంటే తక్కువనో లేదా అసలు గాడిద అనేది ఎలాంటి ఆలోచనలు ఎమోషన్‌లు ఉండని మొండి జంతువనో నా ఉద్దేశ్యం కావచ్చు.

“హలో మిస్, మీకు వాటర్ ఏమైనా కావాలా?” అడుగుతున్నాడతను. బాటిల్ తీసుకొని అతని వైపు థాంక్స్ చెపుతున్నట్లుగా చూశా.

కౌబాయ్ హాట్ తీయకుండా అలానే ఉంచుకోని నా వైపు చూస్తూ “నా పేరు హెన్నీ” అన్నాడు.

“నా పేరు మే” అన్నా. కొత్తవాళ్ళకి మొత్తం పేరు చెప్పడానికి నోరు రాదు. లోపల ఉన్న ఏదో డిఫెన్స్ మెకనిజం అలా పనిచేస్తుందేమో!

“చాలా ఇంటరెస్టింగ్ పేరు. సంవత్సరంలో ఒక నెల పేరును మీ పేరుగా పెట్టారు. అంటే మీరు చాలా ప్రముఖులన్నమాట” అన్నాడు పెద్దగా నవ్వుతూ. అతను వేసిన పిచ్చి జోక్‌కి నవ్వుతున్నట్లుగా ముఖం పెట్టాను. అతను నా నవ్వును పెద్దగా పట్టించుకోలేదు.

బస్సు బయలుదేరింది. అతను తన కౌబాయ్ హాట్‌ని ముఖం పైకి జార్చుకుని అలానే నిద్రపోయాడు. ఇంత త్వరగా నిద్రపోయే మనుషుల్ని నేనెక్కడా చూడలేదు. అతని చేతికి ఎర్రని రంగు దారం లాంటిది కట్టి ఉంది. ఆసక్తిగా దానివైపు చూశా. మధ్యలో తెల్లటి పెద్ద పూసలు, రెండు రాగి నాణేలు ముడులేసి కట్టి ఉన్నాయి.

సేతు గుర్తొచ్చాడు.

అతడిని తప్పించుకోడానికే ఈ ప్రయాణం. మనుషులని వేధించేవాళ్ళు, అబ్యూజ్ చేసేవాళ్ళు చాలా చోట్ల కనిపిస్తుంటారు. కాని సేతు లాంటివాళ్ళు తక్కువమందే ఉంటారు. వీళ్ళు చాలా నెమ్మదిగా స్లో పాయిజన్‌లా కొద్దికొద్దిగా లైఫ్‌ని ఆక్రమిస్తారు. మనల్ని నిస్సహాయులుగా మార్చి నిరంతరం వాళ్ళ మీద ఆధారపడేట్టు చేస్తారు. చివరికి సొంతంగా ఆలోచించుకోవడానికి, మన ఇష్టాయిష్టాలకి ఒక బుర్ర ఉందనే విషయాన్ని కూడా మరిచిపోయేట్లు చేసేస్తారు. వాళ్ళు చెప్పినట్లు వినడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి నెట్టేసే మనుషులతో ఉండటం స్వీట్ పాయిజన్ చెట్టును పక్కన పెట్టుకొని రోజూ అది విడిచే గాలిని పీలుస్తున్నట్లుగా ఉంటుంది.

హ్మ్, పైగా అదంతా నా కోసమే అని పదేపదే నొక్కి చెప్పడం.

సేతు నేనూ ఒకే దగ్గర పని చేస్తున్నాం. కొలీగ్‌గా ఉండి స్నేహితుడుగా మారి నెమ్మదిగా నా జీవితంలో స్థానం తీసుకోడానికి రెడీ అవుతున్నప్పుడు ఇప్పుడు కూడా మేల్కోకపోతే ఎలా అనిపించింది. అతనికేమీ చెప్పకుండా ఉద్యోగం మారాను. దూరం వెళుతున్నానని కలవడానికి ప్రయత్నించవద్దని చెప్పి ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేశాను.

అదంతా ఒక కల, అనుభవించిన కల. కలలు మళ్ళీ మళ్ళీ వచ్చి వెళ్ళిపోతుంటాయి. మనం కలలతో కలిసి వెళ్ళలేము.

సేతు అక్కడ అందరికీ చెప్పుకుంటూ ఉండి ఉంటాడు, నేను ఎలాంటి మనిషినో, ఎంత స్వార్థపరురాలినోనని.

ఎవరు ఎంత స్వార్థపరులో ఎవరికీ తెలీదు. అసలు అదంతా ఎవరికీ అక్కర్లేదు. మన స్వార్థంతో ఎదుటివాడి స్వార్థానికి సెగ తగలనంత వరకు నువ్వు మంచి, గొప్ప నిస్వార్థమైన మనిషివి. సెగ తగిలిందో నీ స్వార్థం రంగును బయట వేస్తారు. వాళ్ళ రంగుని దాచుకుంటూ.

సేతూ, ఏదేమైనా నువ్వు బావుండులే. నేను నీకు ఉపయోగపడేంత నిస్సహాయురాల్ని కాలేనందుకు క్షమించి వదిలేయ్. ఈ సారి ఎంచుకొనేవాళ్ళతో కొద్దిగా నిజాయితీగా స్కెచ్ వేయ్. ఎవరో ఒకరు సులభంగా నీ ఏడుపులకి నీపై ప్రేమ కురిపిస్తారు.

ఒడిదుడుకులు లేకుండా సాగుతున్న బస్సులో ఊగుతున్నట్లు నెమ్మదిగా కళ్ళు మూతలు పడుతున్నాయి.

ఏమైందో ఉన్నట్లుండి సడన్‌గా బ్రేక్స్ వేశాడు డ్రైవర్. హెన్నీ నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ముందుకు తూలి లేచా. హెన్నీ నా చేయి వదల్లేదు. అలానే దగ్గరగా పట్టుకొని ఉన్నాడు. విడిపించుకోవాలని చూశా. ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు గమనించా. అతని చేయి వెచ్చగా ఉంది. గట్టిగా కళ్ళు మూసుకొని ఉన్నాడు. అతని చేతుల్లో చిన్నపాటి వణుకు. నాచేతిని ఆధారం కోసం పట్టుకున్నట్లు ఉంది.

“హెన్నీ, ఆర్ యూ ఓకే?”

కళ్ళు తెరిచాడు. నా చేయి తన చేతిలో ఉండటం చూసి హాయిగా నవ్వాడు. తన ఇంకో చేతిని నా చేతిపైన వేసి “నీ చేతిలో ఏదో హీలింగ్ ఉంది మే, అది నా గుండె వేగాన్ని తగ్గించింది” అన్నాడు.

అతను ఫ్లర్ట్ చేస్తున్నాడేమో అనుకున్నా. కాదు అతడు నిజంగానే అన్నాడని అతని చూపులు చెబుతున్నాయి. రెండు గంటల ముందువరకు అతడెవరో తెలీదు కానీ ఇప్పుడు అతడిని నమ్ముతున్నా.

అతని చేతికి ఉన్న ఎర్రరంగు దారాన్ని చూపిస్తూ, “ఇదేంటి?” అని అడిగా.

“ఇది రబీరాకి గుర్తుగా పెట్టుకున్నాను.”

“రబీరా! రబీరా ఎవరూ?”

“రబీరా ఓ గాడిద.”

గాడిద అనగానే ఉలిక్కిపడ్డా. అతని నవ్వు చూసినప్పుడు నాకు గుర్తొచ్చిన రాజయ్య గాడిద కళ్ళ ముందు కదులుతోంది.

“నేను ఐడహోలో పుట్టి పెరిగాను. అక్కడ ఉన్నప్పుడు మా నాన్న రబీరాని తెచ్చాడు. అందరూ నవ్వేవారు మీ నాన్న నీకు గాడిదను బహుమతిగా ఇచ్చాడని. రానురానూ నాకు రబీరా బాగా దగ్గరయింది.” మాటలు ఆపి “మే, ఏంటి నా పాటికి నేను మాట్లాడుతుంటే ఏదో ఆలోచిస్తున్నావు” అన్నాడు నా వైపు చూస్తూ.

“ఏం లేదులే చెప్పు హెన్నీ” అన్నా నాలోని ఆశ్చర్యాన్ని దాచుకుంటూ.

“రబీరా నాతో మాట్లాడేది. నన్ను కనిపెట్టుకొని ఉండేది. ఒకసారి కొండల్లో నేను స్నేహితులతో వెళ్ళి తప్పిపోయాను. ఆ రాత్రి ఇంటి దారి తెలీక భయంతో కొండల మధ్యే ఉండిపోయాను. అందరూ నా కోసం వెతకడం మొదలుపెట్టారు.

చివరకు రబీరా ఒంటరిగా నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది. నన్ను తీసుకొని ఇంటికి వెళ్ళింది.”

“గాడిదలకు అంత గ్రహణ శక్తి ఉంటుందా?”

“లేకపోతే, నా కోసం వెతుక్కుంటూ రాలేదు కదా!” అంటూ గాడిదలు ఏడ్చినా కన్నీళ్ళు రావని, నిలుచొని నిద్రపోతాయని ఇలా చాలా విషయాలు చెప్తూనే ఉన్నాడు.

నేను ఆపినా ఆ గాడిద గురించి చెప్పడం ఆపడు అనిపించింది. అతని మాటలకు అడ్డువెళుతూ “అంటే, మనుషులకంటే గాడిదలు నయమంటావు” అన్నా నవ్వుతూ.

అతడు దెబ్బ తిన్నట్లు చూశాడు. “రబీరాను మనుషులతో ఎలా పోలుస్తాం!?” అన్నాడు సీరియస్‌గా ముఖం పెట్టి.

అతన్ని కొంచెం వెటకారం చేయాలనిపించింది. “మొదట నీ నవ్వుని చూసినప్పుడు మా ఊరిలో గాడిద నవ్వినట్లు ఉందనుకున్నా!” అన్నా.

“ఏంటి నువ్వు గాడిద నవ్వు చూశావా!? ఓహ్! మే! నువ్వు మామూలు అమ్మాయివి కాదు. గాడిదలు వాటి ఎమోషన్స్ ఎప్పుడూ బయట పెట్టవు. ప్రత్యేకమైన సందర్భాల్లో నమ్మకమైన మనుషుల దగ్గర మాత్రమే అవి బయటికి ఎమోషన్స్ చూపుతాయి. అయినా నీ దగ్గర గాడిద నవ్వడంలో అంత వింతేమీ లేదులే” అన్నాడు ఆలోచనగా.

నా వెటకారాన్ని అతను కనీసం పట్టించుకున్నట్లు కూడా లేడు. గాడిదలు తప్ప నన్ను నమ్మి, అర్థం చేసుకొనేవాళ్ళు లేరన్నమాట అనిపించి, ఆ ఆలోచనకి నవ్వొచ్చింది.

“ఎందుకు?” అన్నా అతని వైపు చూస్తూ.

“నిన్ను చూడగానే గాడెస్ హైజియా గుర్తొచ్చింది. మా నాయనమ్మ పూర్వికులు రోమ్ నుండి వచ్చారట. ఆమె చాలా సార్లు హైజియా గురించి చెపుతూ ఉండేది. ఆమె దగ్గర గ్రీకు దేవుళ్ళ బొమ్మలతో ఒక పుస్తకం ఉండేది. అందులో హైజియా అనే గాడెస్ బొమ్మ లాగే ఉన్నావు నువ్వు” అన్నాడు చిన్నగా నవ్వుతూ.

ఈ సారి అతని నవ్వు కొద్దిగా మెరుపుతో ఉంది.

నన్ను దేవతతో పోలుస్తున్నాడు. వీడికి చెప్పాలి సేతు విషయం. నేను విషంతో నిండిన దయ్యాన్నని ప్రచారం చేస్తున్నాడని.

“ఎవరామె?”

“ఆమె ఆర్యోగ్యాన్ని చూసుకొనే దేవత. ఆమె రెండు పిక్చర్స్ చూశా ఆ పుస్తకంలో. ఒకటి పొడవాటి వర్జిన్ మేరీ దుస్తుల్లో కూర్చొని ఉండి ఆమె చేతిలో ఉన్న పాముకు ఆహారం పెడుతున్న పిక్చర్. ఇంకొకటి ఆమె తండ్రి వైపు వంగి నవ్వుతూ ఉన్నది ఉంటుంది” అంటూ మళ్ళీ రబీరా గురించి చెప్పడం మొదలుపెట్టాడు.

ఈ సారి నా చేతిని నా ఒళ్ళో పెట్టుకున్నా.

కాసేపయ్యాక అతను తన బాగ్ లోంచి అల్‌బకరా పళ్ళు తీసి నాకొకటి ఇచ్చాడు. పుల్లగా ఉంటుందని ఊహించిన నాకు అది ఎంతో తియ్యగా అనిపించింది. దాని రుచి నన్ను ఎక్కడో కొండల మీద కాసిన అల్‌బకరా చెట్టు దాకా తీసుకెళ్ళింది.

“ఇంత తీయటి అల్‌బకరా ఎప్పుడూ తినలేదు” అన్నా అతనితో విస్మయంగా.

“నువ్వెప్పుడూ నిజమైన చెట్టు కాయల్ని తినుండవు మే.”

నిజమైన చెట్టు ఏంటో నా కర్థం కాలేదు కాని ఆ ఒక్క కాయ తినగానే పూర్తిగా కడుపు నిండినట్లైంది.

“ఇప్పుడు రబీరా ఎలా ఉంది?”

“చాలా కాలం క్రితమే రబీరాని కొండల్లో వదిలేసి వచ్చాను. అది మనుషుల్లోకి రావడానికి ఇష్టపడలేదు.”

“నువ్వో కొండ మనిషివి,”

“అవును, నేను కొండ మనిషినే” అంటూ అక్కడ ఉన్న కొండలు, చెట్లు, రబీరా గురించి చాలాసేపు చెప్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో తన నాయనమ్మ గురించి, ఆమె చేసే వంటల గురించి కూడా.

అతడి మాటలు కూడా కొండగాలిలా ఉన్నాయి. అకస్మాత్తుగా అతని మీద అభిమానం ప్రేమ కలిగాయి. ఇప్పుడు అతని దగ్గరినుంచి వచ్చే పచ్చిగడ్డి వాసన అలవాటైనట్లు ఉంది. ఈసారి అతని భుజాన్ని తాకుతూ రిలాక్స్‌డ్‌గా కూర్చున్నా. నాలుగు గంటలు కాలేదు ప్రయాణం మొదలుపెట్టి, ఇతనిపై ఎంత సులభంగా అభిమానం ఏర్పడిందో.

ఊరు రాకముందే హైవే మీద సందడి మొదలైంది. బస్సు స్లో అయ్యింది.

“డాలస్ వస్తున్నట్లుంది. ఇక్కడ ఒక గంట టైమ్ ఉంటుంది. మనం బస్సు మారాలి కదా!” అన్నా.

అతనితో ఇంకా ఏదైనా మాట్లాడాలనిపించింది.

“నేను డాలస్‌లో దిగిపోతాను.”

“అదేంటి లిటిల్ రాక్ వరకు అన్నావు కదా!”

“డాలస్‌లో నా పిక్‌అప్ ట్రక్ ఉంది మే, దాన్ని తీసుకొని వెళ్తాను.”

ఒక్క క్షణం అతడు నాకు అబద్ధం చెప్పి మోసం చేస్తున్నట్లనిపించింది. అతడు కావాలనే దిగిపోతున్నాడా అనే అనుమానం వచ్చింది. అసలు ఇతనెందుకు నా పక్కన కూర్చున్నాడు అనిపించింది.

కొద్దిగా ఎడంగా జరిగి కిటికీకి అనుకొని కూర్చున్నా.

అతడో గాడిద మనిషి. నవ్వొచ్చింది నాకు, కానీ ఆ రకంగా నా ఇగోని తృప్తి పరుచుకోవడం నచ్చలేదు. అయినా అతను నాతోపాటే వచ్చినా మహా అయితే ఇంకొన్ని గంటలు కలిసి ప్రయాణం చేస్తాడు, అంతే కదా! సేతూ, హెన్నీ మామూలు మనుషులే. కాకుంటే వాళ్ళు నాతో చేసిన ప్రయాణసమయాల్లోనే మార్పు అంతే.

సగం ప్రయాణం అయిపోయింది. ఇంకో బస్సు మారాలి. నిద్రపోతూనో, కిటికీనుంచి బయటికి చూస్తూనో మరో సగం ప్రయాణాన్ని పూర్తి చేయాలి.

పక్క సీట్ ఖాళీగా ఉంటే ప్రశాంతంగా నిద్రపోవొచ్చు.

డాలస్ స్టేషన్ వచ్చింది.

బస్ భారంగా నిట్టూర్చినట్లనిపించింది. నేను అర్థం కాకనేమో.

శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...