యురీకా

“సౌత్ ఆఫ్రికాలోని ఆరంజ్ నదీతీరంలో కొన్ని కుటుంబాలు ఉండేవి. అందులో జేకబ్ కుటుంబం ఒకటి. జాకబ్ వాళ్ళ చెల్లితో నది పక్కన ఆడుకుంటున్నప్పుడు అక్కడ నీలంగా తెల్లగా మెరుస్తూ ఒక చిన్న రాయి కనపడింది. అంత బురదలో కూడా అది కాంతివంతంగా మెరుస్తోంది. జేకబ్ దాన్ని తీసుకొని శుభ్రంగా కడిగాడు. భలే మెరిసిపోతుంది ఈ రాయి అని ఆడుకోవడానికి చెల్లికి ఇచ్చాడు. ఆ రాయిని వాళ్ళ అమ్మ చూసి అదేంటో చూడమని పొరుగువాళ్ళకి ఇచ్చింది. అలా అలా అది ఆ ప్రాంతంలో రంగురాళ్ళని సేకరించే స్నేహితుల ఇంటికి చేరింది.

“చివరకు అది ఒక విలువైన డైమండ్ అని తేలింది. దానికి యురీకా అని పేరు పెట్టారు.

“అది మొదలు ఆరెంజ్ నదీతీరానికి వందలమంది మనుషులు, కంపెనీలు రావడం మొదలైంది. అక్కడ వజ్రాల కోసం భూమిని తవ్వుతూనే ఉన్నారు. ప్రపంచంలో మనుషులు తొవ్విన అతి పెద్ద గొయ్యి తయారైంది అక్కడ. అసంఖ్యాకంగా వజ్రాలు బయటపడుతూనే ఉన్నాయి.

“జేకబ్ ఎప్పుడైనా అనుకొని ఉంటాడా, యురీకా ఎందుకు కనుక్కున్నానా అని?” కథ చెపుతూ మధ్యలో ప్రశ్న వేసి నన్ను ఇరకాటంలో పెట్టేది ముజు.

“జేకబ్ కాకపోతే ఇంకెవరైనా కనుక్కొనేవారు కదా, అలా అనుకొని ఉండడేమో! అది సరే కాని, ఇంతకు జేకబ్ ఏమయ్యాడు?”

“కొంత కాలం తరువాత జేకబ్ వాళ్ళ కుటుంబం ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయింది.”

ముజు చెప్పే కథలు వినాలంటే నాకు చాలాసార్లు విసుగ్గా ఉండేది. కొన్నిసార్లు కోపం కూడా వచ్చేది. వాటిని ఆపుకోలేక అప్పుడప్పుడు ఆమెపై చిరాకుపడతా. కానీ ఆమె గొంతులో అలవికాని మంద్ర స్థాయిలో పలికే చిన్నపాటి జీర, ఆ కథకి జీవితంతో ఉండే ఏదో సంబంధం, కథ విననీకుండా ఉండనిచ్చేవి కావు.

“సూరీ, ఈ కథ నువ్వు జాగ్రత్తగా వినాలి. తరువాత నాకు ఈ కథ గుర్తుండకపోవచ్చు” అని మొదలుపెట్టేది. చాలాసార్లు ఆమె కథ చెప్పిన కొన్ని రోజులకు కానీ ఆ కథ ఎందుకు చెప్పిందో అర్థమయ్యేది కాదు.


ముజు, ఆమె పేరు గురించి చిత్రంగా చెప్పేది.

ముజు అనేది ఓ బౌద్ద సన్యాసి పేరు. ఆయన పైన భక్తితో మా తాత ఆ పేరు నాకు పెట్టాడు. ముజు అంటే చెత్త అని అర్థం. ఎవరైన పిల్లలకు ఇలాంటి పేరు పెడతారా అని బుగ్గలు నొక్కుకుందంట మా అమ్మ. నేను పుట్టాక మా కుటుంబం ఉన్నది మొత్తం పోగొట్టుకొని రోడ్ మీద పడింది. అంత పెద్ద కుటుంబం ముక్కలు చెక్కలై చెట్టు కొకరు పుట్టకొకరుగా పోయారు. దీనికంతా కారణం నేనే అని, నన్ను అమ్మేయాలని అనుకున్నారు. దానికి అడ్డంపడి మా తాత నన్ను తీసుకెళ్ళి పెంచుకున్నాడు. నేను అక్కడికి వెళ్ళాక ఆయన కూడా నానా కష్టాలు పడ్డాడు. చివరికి మీ నాన్నతో పెళ్ళి చేసి ప్రాణాలు వదిలేశాడు. పోయేటప్పుడు, ముజు నాకెంతో ప్రత్యేకమైంది, ఆమె పేరును మార్చొద్దని మరీమరీ కోరి పోయాడు.


ముజు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు తొమ్మిదేళ్ళు ఉంటాయేమో! ఆమె రాగానే మూడేళ్ళ నా చెల్లెలు సేనిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. ఇక అప్పటి నుంచి సేని ముజుని వదిలి క్షణం ఉండేది కాదు. ఆమె వెంటే తిరుగుతూ ఉండేది. ముజుని పెళ్ళి చేసుకున్న కొన్ని రోజులకే పచ్చి తాగుబోతైన మా నాన్న చిన్న మురికికాలవలో పడి ఆపైన మంచానికి అతుక్కుపోయాడు. తాగుడుకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేక ఆయన తన కోపమంతా ముజుపైన చూపించేవాడు. మా నాయనమ్మ ‘ఈ పాడుముండ ఏమంటూ ఇంట్లోకి అడుగుపెట్టిందో నా కొడుకు మంచానపడ్డాడు’ అని ఎప్పుడూ ఆమెను తిడుతూ ఉండేది. ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఏమి చేసినా ముజు ముఖంలో ఏ భావమూ కనపడేది కాదు. ఎవరూ లేనప్పుడూ ముజు ఎంతో తెలివిగా ఉన్నట్లుండేది. అందరి ముందు తెలివితక్కువదానిలా తిట్లు తింటూ ఉండేది. అలా ఎందుకుండేదో నాకర్థమయ్యేది కాదు.

ముజు మా ఇంటికి వస్తూ ఓ పెట్టెను కూడా తెచ్చుకుంది. ఓ రోజు నేను ఆమె లేని సమయలో ఆ పెట్టెంతా వెతికాను. దాన్లో కాగితాల్లో చుట్టిపెట్టి ఉన్న వెండి నాణెం కనిపించింది. దాన్ని తీసి నేను దాచిపెట్టుకున్నా.

ఆ రోజు రాత్రి ఆమె మజ్జిగలో బాగా కారం వేసి నాకు అన్నం పెట్టింది. నోటి మంటతో నేను అరుస్తున్నప్పుడు, పంచదార తెచ్చి నా నోట్లో వేసి మొదటిసారి నాకు ఓ కథ చెప్పింది. ఆ కథ తరువాత ఎవరూ చూడకుండా ఎలా తీశానో అలానే ఆ వెండి నాణేన్ని ఆమె పెట్టెలో పెట్టేశాను.

ఆ రోజు నుంచి ఆమెతో నాకు మంచి స్నేహం కుదిరింది.


ముజు చాలా అరుదుగా నవ్వేది. నవ్వినప్పుడు మాత్రం గంటల తరబడి నవ్వుతూనే ఉండేది. ఆ నవ్వులో క్రూరత్వానికి మించినదేదో కనిపిస్తూ ఉంటుంది. ఆమె నవ్వుతున్నప్పుడు ఎవరూ ఆమెకి దగ్గరగా వెళ్ళే ధైర్యం చేసేవాళ్ళు కాదు. ముజు నవ్వంటే మా నాయనమ్మ కూడా భయపడేది. ఆమె నవ్విన ప్రతిసారి ఇంట్లో ఏదో ఒక చెడు జరుగుతుందని మా నాయనమ్మ నమ్మకం. ఒకసారి నవ్వినప్పుడు ఇంట్లో దూలం విరిగిపడిందట. ఇంకోసారి మా తాత పిచ్చోడై ఇంట్లోంచి పారిపోయాడట. ఇలాంటివి మా ఇంట్లోనే కాదు, ఊర్లో కూడా వింతగా చెప్పుకునేవారు.

ఓసారి ముజు ఎప్పటిలానే మొక్కజొన్నలతో జావ కాచి మా నాన్నకి ఇచ్చింది. ఎందుకు జారిందో, ఆయన చేతిలోంచి జారి పింగాణీ గిన్నె పగిలి వక్కలైంది. మా నాన్న కోపంగా ముజుని కొట్టడానికి చేయెత్తాడు. అంతే! మా నాన్న గాల్లోకి రెండడుగుల ఎత్తున ఎగిరి కింద పడ్డాడు. ఏమైందో మాకెవ్వరికీ అర్థం కాలేదు. ఈ లోపు మా నాయనమ్మ ఒక్కసారిగా పెద్దగా తిడుతూ ఓ కర్ర తీసుకొని ముజు వైపు దూసుకువచ్చింది.

ఆమె వైపు చూసి ముజు ఫక్కున నవ్వడం మొదలుపెట్టింది. ఆ దెబ్బకి మా నాయనమ్మ వెనక్కి తిరిగి అరుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ నవ్వు క్రమంగా పెరుగుతూనే ఉంది. మా నాన్నకి జ్వరం పట్టుకుంది. మా నాయనమ్మ ఎక్కడ దాక్కుందో గాని ఎక్కడా కనిపించలేదు. నేను, సేని ఇంటి బయట చెట్టుక్రిందే కూర్చున్నాం. ముజు నవ్వుతో ఆ వీధి వీధంతా మారుమోగిపోతుంది. అందరూ దాన్ని వినలేక భరించలేక కిటికీలు, తలుపులు మూసుకొని ఇళ్ళలోనే కూర్చున్నారు. వీధంతా నిర్మానుష్యం అయిపోయింది. ముజు ఐదు గంటల పాటు నవ్వుతూనే ఉంది. ఆ రోజంతా ఇంట్లో భయంతో కూడిన నిశ్శబ్దం ఏర్పడింది.

సాయంత్రం సేనిని తీసుకొని కాలువ ఒడ్డుకి వెళ్ళింది ముజు. వాళ్ళని అనుసరిస్తూ నేనూ వెళ్ళాను. కాలువలో రాళ్ళేస్తూ రాత్రయ్యేదాకా అక్కడే కూర్చొంది. దూరంగా కూర్చొని వాళ్ళనే చూస్తూ ఉన్నాను. సేని కూడా ఆమెతో పాటు నీళ్ళలో రాళ్ళేస్తూ ఆడుకుంటోంది. చివర్లో ఒక పెద్ద బండరాయిని గట్టిగా నీళ్ళలోకి తోసి పైకి లేచింది. అది జారుకుంటా నీళ్ళలో కొద్ది దూరం వెళ్ళి ఆగిపోయింది. వెనక్కి తిరిగి ఇంటికి వచ్చి అన్నం తినింది.

ఎలాంటి చెడు జరగనందుకు అందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.


ఆ రోజు రాత్రి చాలాసేపు నాకు నిద్రపట్టలేదు. ముజు ఇల్లు వదిలి వెళ్ళిపోతుందేమో అనిపించింది. ముజు వెళ్ళిపోతుందనే ఆలోచనే దిగులుగా అనిపించింది. ముజు వెళితే మా నాన్న, నాయనమ్మ బ్రతకలేరు. ఆమెను తిడుతూ బ్రతకడంలో వాళ్ళు హాయిగా ఉన్నారు. ముజు వెళ్ళిపోతే గట్టిగా అరిచి గొడవపెట్టే గయ్యాళి నాయనమ్మ దగ్గర, మందు మందు అని మంచంలో అటు ఇటు దొర్లుతూ మూలిగే నాన్నతో ఉండటం చాలా కష్టం.

లేచి ముజు మంచం వైపు చూశా. ముజు, సేని మంచం పైన నిద్రపోతూ ఉన్నారు. కాసేపు బయటకు వెళ్ళి వచ్చి పడుకున్నా.

ముజు ఎక్కడికి వెళ్తుందో అని ఆలోచించా. ఆమెకి తాత లేడు. ఎవరూ లేరు. ఎవరితో మాట్లాడినట్లు కూడా అనిపించదు. ఓసారెప్పుడో ఊరి పక్క కొండల్లో ఉన్న అడవంటే ఇష్టమని చెప్పింది. ఆ అడవిలోకే వెళుతుందేమో!


ముజు తన పెట్టెను వదిలేసి పక్కనే నిలబడి ఉన్న సేని చేయి పట్టుకొని బయలుదేరింది. తనకేదో వజ్రం దొరికింది. ఇక, తనిక్కడ ఉండదు. నేను వస్తా మీతో అని చెప్పాలనుకున్నా. నా మనసులో మాటలు ముజుకి తెలిసిపోతూనే ఉంటాయెప్పుడూ. ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. నన్ను కూడా వాళ్ళతో తీసుకువెళ్తుందనిపించింది.

నేను కూడా వాళ్ళ వెంట నడవడం ప్రారంభించా. ఆమె నడక అడవి వైపు సాగింది. అడవి దగ్గరయ్యే కొద్ది ముజు పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆమె వెంట నేను, సేని. ఆ అడవిలోకి రాగానే వేగంగా పరిగెడుతున్న ముజు ఉన్నట్లుండి ఎలుగుబంటిలా మారిపోయింది. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. మా శరీరాలు కూడా క్రమంగా మారిపోతున్నాయి. కాళ్ళ పిక్కలు బలంగా మారుతున్నాయి. మా వంటి నిండా వెంట్రుకలు మొలుచుకు వస్తున్నాయ్. ఇంకా బలంగా, వేగంగా నాలుగు కాళ్ళ పైన పరిగెడుతున్నాం.

ముజు నవ్వు అడవంతా వినపడుతుంది.


శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...