D/o విజ్జి

మా ఇంట్లో నేను పెంచబడలేదు, పెరిగానంతే. నాకంటూ ఎలాంటి ఉనికీ లేని ఇల్లు అది. వాళ్ళకోసం నాకు ఎలాంటి పట్టుదలలూ లేవు. కష్టపడి ఉద్యోగం చేసి వాళ్ళ బాగోగులు చూసుకొనే గుడ్డి ప్రేమలూ లేవు. వాళ్ళకోసం నా జీవితంలో అంత సమయాన్ని వెచ్చించడం కష్టం. నా చదువుకి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. దాంతో ఇంటి కోసం నిలబడొచ్చు. అదంతా చేయొచ్చు. కానీ కోరికలు నాచేతిలో ఉన్నాయా? వాటిని అదుపు చేసుకొనో లేక చాటుమాటుగా ఎవరినో ప్రేమిస్తూ, వాళ్ళతో తిరుగుతూ కష్టాలు చెప్పుకుంటూ, ఉప్పూకారం తిన్న శరీరం అని దేహాన్ని నిందిస్తూ, ఇదంతా ఇంట్లోవాళ్ళ చేతకానితనం, పేదరికం అని ఏడుస్తూ, ఇంటి కోసమే ఇలా ఉన్నానని త్యాగాల ట్యాగులు తగిలించుకున్నా పెద్దగా ఏమీ మిగలదు. మంచిదానిలా చూడకుండా ఇంకో రకంగా నిందలు వేయగలరు. బహుశా అందుకేనేమో రామారావుని చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కొందరు త్యాగమని పొగిడారు, కొందరు సానుభూతి చూపించారు. పెద్దగా ఇష్టం లేకపోయినా ఇంతకంటే బెటర్ ఛాయిస్ లేక ఆ చాలీచాలని అసౌకర్యాల బ్రతుకునుంచి బయటపడటానికే ఈ పెళ్ళి చేసుకున్నానని వాళ్ళకి తెలియదు కదా!


“ఇదేంటమ్మాయ్, అలా కొయ్యలా బిగుసుకుపోతున్నావ్, నీకిష్టమయ్యే కదా తలూపావు!” అంది ఆమె ఆశిస్తున్న అయిష్టతను నాలో రాబట్టుకోడానికి ఎదురుచూస్తున్న కారప్పొడి పిన్ని. ఈమె కారప్పొడి బాగా చేస్తుందని అందరూ అలా పిలుస్తారట. కారప్పొడి చెయ్యడమే కాదు బాగా కలుపుతున్నట్లుంది మాటల్లో.

“ఇది నీకు కొత్త కానీ అతనికి కాదుగా, పర్వాలేదులే.” వెనుక నుంచి గట్టిగా నవ్వులు. వీళ్ళెందుకు నవ్వుతారో, ఆ నవ్వుల్లో ఏముంటుందో? అయినా ఇది దేనికి మొదటి రాత్రి? దర్జాగా ఇలా చేయండని అందరు అనుమతించడానికా? ఇష్టమున్నా లేకపోయినా సాధికారంగా శరీరాన్ని స్వాధీనపరుచుకోడానికా?

గదిలో మంచం మీద అతడి నవ్వు ఎదురుచూస్తూ కనిపించింది. “రా విజ్జీ, కూర్చో!” అన్నాడు. విజ్జీనా! ఒక కమిట్మెంట్ ఇంత ఈజీగా మనుషులను ఎలా మారుస్తుంది? లేదా అప్రయత్నంగా మారినట్లు నటిస్తారా?

మాట్లాడకుండా వచ్చి అతని ఎదురుగా కూర్చున్నా.

“నీకు కొన్ని విషయాలు చెప్పాలి” ఓహ్! మొదటి భార్య గురించి చెప్తాడా లేక… ఆలోచించకముందే చెప్పడం మొదలెట్టాడు.

“కరుణ పోయేటప్పటికీ డాలీ నెలల పిల్ల. సాధారణంగా ఎవరి దగ్గరికి పోదు. తనకి ఇష్టం లేకుండా ఒక్క అడుగుకూడా వేయదు. కాని ఎందుకో మూడేళ్ళవుతున్నా మాట్లాడటానికి ప్రయత్నించడం లేదు.” ఆ పిల్ల కోసమే కదా నన్ను చేసుకుంది. ఈ తంతులన్నీ దానికి బోనస్.

“డాలీ గురించే చేసుకున్నా అనుకోకు. నాకూ ఒక తోడు కావాలి. నా జీవితంలో కరుణ వచ్చి వెళ్ళినట్లు నీ జీవితంలో ఎవరైనా ఉన్నారా?”

నవ్వొచ్చింది. నీకేమైనా లవ్ ఎఫైర్లున్నాయా అని నేరుగా అడగచ్చు కదా, అయినా ఇప్పుడేం చేస్తావ్ రామారావ్? అర్థం చేసుకుంటావా లేక అయ్యో అని కుమిలిపోతావా? హాఁ, పర్వాలేదు, ఇప్పుడు గిల్ట్ ఫీల్ అయ్యే పనిలేదు అనుకుంటావా? ఎవరున్నా లేకపోయినా ఇప్పుడిక చేసేదేముంది నీతో ఇక్కడున్నాక.

మళ్ళీ కాసేపు నిశ్శబ్దం తరువాత “నీకు డాలీ విషయంలో అభ్యంతరం లేదుగా?” అన్నాడు.

“లేదు” అన్నా. పైకి మాట్లాడే మాటలు కళ్ళు మాట్లాడలేకపోవడం విషాదం. అది అర్థంకాకపోవడం ఒక సౌలభ్యం.

“విజ్జీ ఏంటి ఏమీ మాట్లాడవ్?” అంటూ చేయి పట్టుకున్నాడు. మాటల కోసం పట్టుకోవడం, పట్టుకోవడం కోసం మాట్లాడటం.

“మొదటి రాత్రే ఇవన్నీ చెప్పి భయపెడుతున్నానా?” ఇంకొంచం చనువుగా కాలుమీద… కాదు, ఈసారి తొడమీద చేయేసి మరీ అడిగాడు.

ప్రమోషన్.

నేను ఆ చేతివైపు చూశాను. కొంచం జంకుగా వెనక్కి తీసుకున్నాడు.

“నువ్వు ఫోటోలో చూసినదానికంటే చాలా కళగా ఉన్నావ్ విజ్జీ.” కళగానా? అంటే ఏంటో? కలర్ లేని వాళ్ళందరిని కళ కింద చేరుస్తుంటారు వీళ్ళు.

“వచ్చినప్పటినుంచి నేనే మాట్లాడుతున్నా. నీ గురించి చెప్పు.”

‘నాకు డాలీ లేదు’ అని చెప్పాలనిపించింది. “నాకేముంటాయి చెప్పడానికి?” అన్నా నెమ్మదిగా.

అప్పటికే అతని ముఖంలో ఏదో మార్పు. ఇక మాటలు అనవసరం అనుకున్నాడేమో లైట్ ఆపాడు.

అలా రాత్రుళ్ళు పెద్దగా నా ప్రమేయం లేకుండానే అది రాత్రైతే చాలు గడిచిపోవడం మొదలైంది.


నేను-డాలీ-రామారావు ఆ ఇంట్లో.

డాలీ అందంగా అంటే తెల్లగా, చిందరవందర జుట్టుతో రబ్బరు బొమ్మలా ఉంటుంది. ఏమీ మాట్లాడదు. నేను చిన్నప్పుడు తెల్లగానే పుట్టానంట, కానీ చెవులు నల్లగా ఉన్నాయంట. చెవులకి ఉన్న నలుపు ఒళ్ళంతా పాకిందంటుంది అమ్మ. ముద్దొచ్చినప్పుడు మాత్రం ‘నీకేమే, నీది బంగారమంటి రంగు, బావుంటావ్’ అనేది. అలా అన్నప్పుడల్లా నువ్వు బావుండవని చెప్పినట్లు అర్థమయ్యేది నాకు. పెద్దయ్యాక ఓసారి చెప్పా, నన్నెప్పుడూ బావున్నావ్ అనకు అని. డాలీ తలెత్తి నావైపు ఎప్పుడూ చూసినట్లు కనిపించదు కాని నేను చూడకుండా సూటిగా నావంకే చూస్తున్నట్లనిపించేది. రామారావ్ ఉన్నప్పుడు మాత్రం నవ్వుతున్నట్లుండేది. నేను ఏమిచ్చినా తీసుకోదు అని చెప్పడం కంటే కనీసం ముట్టుకోదని చెప్పడం మేలు.

ఆ ఇల్లు మాత్రం బాగా నచ్చింది. మంచి అటాచ్డ్ బాత్రూం, బట్టలు పెట్టుకోడానికి పెద్ద అలమరా. అన్ని సౌకర్యాలతో ఏ సమస్యాలేకుండా కిచెన్. మా ఇంటి నుంచి స్వర్గానికి వచ్చినట్టుంది. రామారావుతో రాత్రికి మాత్రమే చిరాకు. కానీ డాలీతో… డాలీ నా కళ్ళ ముందు లేకపోయినా తను ఉన్నదన్న ఊహే నన్ను చిరాకుపరిచేది. నేను పట్టుకోబోతే ఏడ్చేది, ఏ చిన్న పని చేయించుకొనేది కాదు. ఎక్కువగా ఒక్కతే బొమ్మలతో ఆడుకుంటుండేది.

ఆ ఇంట్లో మాతో పాటు ఉన్న ఇంకో జీవి పెరూ అనే కుక్క. డాలీ దాని చెవులు పట్టుకొని దానిపైన ఎక్కి కిందా మీద పడుతుండేది. దాన్ని డాలీ ఏం చేసినా అది చిన్న శబ్దం కూడా చేయదు. అది నన్ను పెద్దగా పట్టించుకునేది కాదు, కానీ డాలీ అంత అయిష్టం ఉండేది కాదు దాని కళ్ళల్లో. చాలా ప్రయత్నాలు చేశా డాలీని మంచి చేసుకోవాలని. చాక్లెట్స్ ఇచ్చేదాన్ని. తీసుకొనేది కాదు. టీవీ పెట్టేదాన్ని చూసేది కాదు. తనతో పాటు కూచుంటే అక్కడనుంచి వెళ్ళిపోయేది. తనకిష్టమైనవాటిని పెట్టాలనుకున్నా దగ్గరకు కూడా వచ్చేది కాదు. అంచలంచలుగా రకరకాల పథకాలు వేశా మచ్చిక చేసుకోవడానికి. ఎంతో ప్రేమ చూపిస్తున్నట్లు కనిపించా. ఏరకంగా చూసినా డాలీ దూరం జరగడమే కానీ దగ్గర కాలేదు. ఈ డాలీ మచ్చికైతే రామారావ్ నా గ్రిప్‌లో ఉంటాడు. నాలుగు నెలలైంది ఇక్కడికి వచ్చి. మూడేళ్ళ డాలీని డీల్ చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నానో! ఆలోచిస్తున్నకొద్దీ నా మీద నాకు కోపం వస్తుంది. పిల్లలు ఎంతో అమాయకమంటారు. మరి ఈ డాలీ ఏంటి తనలోపల ఎవరో పెద్దవాళ్ళు ఉన్నట్లు, నా లోపలి మనిషిని చదువుతున్నట్లు నాముందు సవాల్ విసురుతుంది ప్రతీసారి.


ఈ రోజు డాలీ పుట్టినరోజు. టేబుల్ పైన పెద్ద అందమైన బర్త్‌డే కేక్.

జీవితంలో నేనెప్పుడు కేక్ కట్ చేయలేదు. పుట్టడం ద్వారా బ్రతకడమనే లోయలోకి నెట్టబడ్డాక పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి? బ్రతకలేక గెలవడం కోసం తపించడం, ఓడిపోతూ బ్రతుకుతున్నామని మురిసిపోవడం. అంతా నటన. నటించి నటించి బ్రతకడం నటనయ్యాక, పుట్టింది నటించడానికి అని తేల్చేయబడ్డాక ఇక పుట్టినరోజుదేముంది. పుట్టడం మనచేతుల్లో ఉంటే అసలు నేను పుట్టేదాన్నా? రామారావ్, పెరూ నటిస్తున్నారుగా బతకడానికి. పెరూకి ప్రేమ కావాలి, రామారావుకి తోడు కావాలి. మరి డాలీకి ఏం కావాలి? డాలి ఎందుకు నటించకుండా ఉంది? మొదటి రాత్రి రామారావు డాలీ గురించి చెప్పకుండా ఉండాల్సింది. ఆ రాత్రి డాలీదయిపోయింది. అయినా రామారావు తప్పేముందిలే, అతని బిడ్డ కదా! అతనికి అవసరం.

ఇంటికి ఎవరెవరో వచ్చారు. అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నారు. బయటికేగాని లోపల ఎవరికీ డాలీని పట్టించుకోవాలని ఉన్నట్లు లేదు. నాకు సంతోషమేసింది, డాలీని నిజంగా ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ డాలీ కూడా ఎవరినీ పట్టించుకోవట్లేదు. ఆడుకొంటున్న పిల్లల దగ్గర ఉంది. ఎవరితో కలవకుండా అందరినీ పరిశీలనగా చూస్తున్నట్లు అనిపించింది. నిజంగానే డాలీ ప్రత్యేకమా?

ఈ రామారావు అందరి దగ్గరకి పిలుచుకు పోతున్నాడు. పరిచయం చేస్తున్నాడు. నా వెనుక ఎవరో ఒకామె ‘డాలీ పేరుతో ముద్దుల పెళ్ళాన్ని పరిచయం చేయడానికి పెట్టాడు ఈ పార్టీ’ అంటుంది.

‘చూడటానికి బానే ఉందిగానీ కలర్ తక్కువ. అయినా కరుణ ఎంత బావుండేది. అర్థాయుష్కురాలు.’ ఓ! డాలి తల్లి చచ్చినందుకు వీళ్ళు ఇప్పుడు సంతాపం ప్రకటిస్తున్నారు.

‘ఆఁ! అయినా ఆ కరుణా అంతే, మూగ మొద్దులా ఉండేది. రామం సుఖపడిందెప్పుడులే.’

ఈ మాటలు వింటుంటే వాళ్ళకి రామారావు సుఖపడకపోవడమే కావాలనిపించింది. నాకెందుకో కరుణ, రామారావు మీద అమాంతం సానుభూతి కలిగింది. తలతిప్పి రామారావు ఉన్నవైపు చూశా. అతను కొంచం దూరంగా మగవాళ్ళ గుంపులో ఉన్నాడు. వాళ్ళు రామారావుతో ఉన్నట్లే కనిపించినా వాళ్ళ చూపులన్నీ నా చుట్టే తిరుగుతున్నట్లున్నాయ్. పాపం రామారావ్ అనుకున్నా.

డాలీ కేక్ కట్ చేయనని బాగా గొడవ చేసింది. రామారావ్ నన్ను కేక్ కట్ చేయమన్నాడు. మొదటిసారి కేక్ కట్ చేశా. డాలీవైపు చూశా. తను అభావంగా ఎటో చూస్తుంది. అప్పుడు ఎందుకో అకస్మాత్తుగా అనిపించింది అసలు డాలీకి ఎందుకు దగ్గర కావాలి? ప్రపంచం ఏమనుకుంటుందో అని ప్రేమించేపని మానేయాలి. అయినా రామారావు నా మాట ఎందుకు వినాలి? అసలింత నాటకమాడే పనేంది? అలా అనుకున్నాక నాలో అశాంతి కొంచం తగ్గినట్లనిపించింది.


ఆ రోజు రామారావ్ ‘పని ఉంది, రాత్రికి రాన’ని చెప్పివెళ్ళాడు. అతడు ఎక్కడికి వెళితే నాకేంటి? అన్నం కలిపి డాలీని పిలిచాను తినమని. వచ్చి ప్లేట్ నెట్టేసింది. నేను తీవ్రంగా చూసి తనవైపు ప్లేట్ గట్టిగా తోశాను. ‘నోరుమూసుకు తిను’ అని పెద్దగా అరిచా. లోపల ఉన్న కోపం అంతా బయటికి వచ్చింది. నన్ను నేను అదుపు చేసుకోలేకపోయిన క్షణం. విచిత్రం, డాలీ మొదటిసారి నావైపు చూసింది. ఆ కళ్ళలో భయం లేదు. కానీ, ఏమనుకుందో ప్లేట్ తీసుకొని నెమ్మదిగా తినడం మొదలుపెట్టింది. ఆశ్చర్యమేసింది. డాలీని ఇక పట్టించుకోవాలనిపించలేదు. తన వైపు చూడటం కూడా మానేశా. నటించే పని తప్పింది. రామారావ్ నుంచి నాకేమీ అవసరం లేదనిపించింది.

రోజూ రామారావ్ ఇంటికొచ్చేసరికి పరిగెత్తుకుని ఏడుస్తూ ఎదురెళ్ళే డాలీ ఆ రోజు వెళ్ళలేదు. తనపాటికి తను ఆడుకుంటుంది. రామారావు నా వైపు చిత్రంగా చూశాడు. ఆ చూపు ఏంటో? ఏదైతేనేం?


ఈ మధ్య రామారావులో అతడు కనిపిస్తున్నాడు. నేను అనుకొనే, కోరుకొనే అతడు. రామారావుని కొంచం జాగ్రత్తగా చూడాలనిపించింది. అతడు దీక్షగా డాలీ పనులన్నీ చేస్తాడు. ఎలాంటి జీవంలేని, పసలేని మాటలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. నవ్వుతున్నట్లు కనిపిస్తాడు. నిజంగా ఆనందంగా ఉంటాడా ఇతడు? నాటకం చాలించాక అందరూ మాములుగా కనిపిస్తున్నారు. నాలో అతడుగా మారుతున్న రామారావు వచ్చి “విజ్జీ! నాకిప్పుడు సంతోషంగా ఉంది. డాలీ నీకు అలవాటవుతుంది. ఎక్కువ ఏడవట్లేదీ మధ్య!” అన్నాడు. నాకు అలవాటవుతుందా లేకా నేనేంటో తెలుసుకుంటుందా?

ఏమైందో తెలియదు కాని, నేను నాలాగానే ఉండాలనుకున్నాక డాలీ బానే ఉంది. ఇక నటించకూడదు అనుకున్నప్పుడు నేనిక డాలీ పనులు చేయను అని అతనికి చెప్పాలనుకున్నా. కానీ ఎలా చెప్పాలి, డాలీ కోసమే సగం ఇక్కడకి రప్పించబడ్డప్పుడు? ఆరోజు అతను వెళ్తూ “డాలీ మామ వస్తాడు. డాలీని బయటకు తీసుకెళ్తానంటున్నాడు. అతనితో పంపు.” అన్నాడు. మామ అంటే… అనవసరమైన ప్రశ్న అని అడగకుండా ఆగిపోయా.

మధ్యాన్నం డాలీ మామ వచ్చాడు. ఎప్పటిలానే డాలీలో ఏ భావం లేదు. “బావ చెప్పాడా? నేను షాపింగ్‌కి తీసుకెళ్తాను. డాలీకి కొంచం బావుంటది.” అన్నాడు. డాలీ వైపు చూశా. డాలీ మా వైపు చూడట్లేదు. పక్కన పెరూ చెవ్వు పట్టుకొని లాగుతుంది. ఎప్పుడూ లేంది అది బాధగా అరుస్తుంది. డాలీని ఎత్తుకొని బయటికి నడిచాడు. డాలీ చూపు ఎప్పట్లా లేదు. ఏదో ఉంది ఆ కళ్ళలో. అది బాధో కోపమో అసహ్యమో ఏదో. ఎందుకో పంపించాలనిపించలేదు. అతన్ని వెనక్కి పిలిచా.

“డాలీ రాదు, నాకిష్టం లేదు డాలీని బయటకు పంపడం.” అన్నా.

అతను కోపంగా “అదేంటి?” అన్నాడు. “అదంతే.” అన్నా.

డాలీని దింపి, వేగంగా వెళ్ళిపోయాడు. డాలీ నావైపు నవ్వుతూ చూసినట్లనిపించింది. పెరూ నా చుట్టూ తోక ఊపుతూ తిరిగింది.

అతడు కాల్ చేసి చెప్పాడు. “రావడం లేట్ అవుతుంది. డాలీకి స్నానం చేయించి, ఏమైనా పెట్టు. నిద్రపోతుంది.”

“డాలీ నన్ను ముట్టుకోనివ్వదు.” అని చెప్పా నిర్లక్ష్యంగా. “ప్రయత్నించు” అని పెట్టేశాడు. అయినా డాలీ మాత్రం నన్నెందుకు ఇష్టపడాలి. అలా అనిపించాక డాలీ కూడా నాలాగే ఉందనిపించింది.

డాలీ దగ్గరికెళ్ళి “స్నానం చేద్దువు రా!” అని పిలిచా. నా వైపు ఒకసారి చూసి మాట్లాడకుండా వచ్చింది. సంకోచంగా చూస్తున్నా. ఎత్తుకొమ్మని చేతులు చాచింది. ఆశ్చర్యంగా ఎత్తుకున్నా.

“నాతో మాట్లాడతావా?” అనడిగా.

“ఊఁ” అంది.

డాలీ మొదటి స్పర్శ. మొదటి మాట.


శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...