భ్రాంతి

ఆ బార్ రద్దీగా లేకుండా ఉండే సమయాలు తక్కువ. బాధను తగ్గించుకోవడానికో, సంతోషాన్ని పంచుకోవడానికో వచ్చేవాళ్ళకంటే అక్కడికి అలవాటుగా వచ్చే మనుషులే ఎక్కువ. మేమిద్దరం ఎప్పుడైనా కలవాలనుకుంటే ఆ బార్‌నే ఎంచుకునే వాళ్ళం. సాధారణంగా సారథి ఎవరినైనా కలవడానికి, తొందరగా ఏదైనా పంచుకోవడానికీ ఇష్టపడే వ్యక్తి కాదు. చాలాకాలం తరువాత ఫోన్ చేశాడు, కలుద్దాం అని. చెప్పిన టైమ్ కంటే కాస్త ఆలస్యంగానే వస్తాడని తెలుసు అయినా ముందే వచ్చి కూర్చొని వాడికోసం ఎదురు చూస్తున్నా.

మామూలుగానే నీరసంగా ఉండే సారథి ఆ రోజు ఇంకా నీరసంగా ముఖం వేలాడేసుకొని వచ్చాడు. ఏదో మాట్లాడాలని వచ్చినవాడు చాలాసేపు మౌనంగానే ఉండిపోయాడు. అడగడంకంటే వాడికివాడే ఏదైనా చెప్పే దాకా ఆగడం నాకు అలవాటే. కాసేపయ్యాక “మీ ఇంటికి వెళ్దాం రామ్” అన్నాడు. అదృష్టం వాసంతి ఇంట్లో లేదు. ఒక బాటిల్, దానికి మంచింగ్ ప్యాక్ చేయించుకొని మా అపార్ట్‌మెంట్ బాల్కనీలో కూర్చున్నాం.

వాడు మొదలుపెట్టాడు “హ్మ్, పదేళ్ళ తరువాత బిదు వచ్చింది” అంటూ.


వస్తూ వస్తూనే ఆమె అన్న మొదటిమాట, “నేను ఇలా రావడం, నీ దగ్గర ఉండటం వల్ల నీకేమైనా ఇబ్బందిగా ఉన్నా పర్వాలేదు, నా కోసం నువ్వు ఆ మాత్రం ఇబ్బంది పడచ్చు సాధూ” అన్నది. చిన్నపాటి నవ్వుతో ఆమె అలా అంటుంటే భలే ముచ్చటగా అనిపించింది. “బిదు గురించి నీకు కూడా తెలుసు కదా! పెద్దగా నవ్వడమో, అలా అని కోపంగా ఉన్నట్లో ఎప్పుడూ కనపడదు. మనుషుల్లో కోపతాపాలు ఉంటాయని ఈమెకి తెలుసా అనేంత నిర్వికారంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు అలా నవ్వుతూ మాట్లాడటం నాకే కొత్తగా అనిపించింది.”

ఫ్రెష్ అయ్యి వచ్చి బ్యాగ్‌లోంచి శారదాదేవి ఫోటో తీసి అక్కడ గూట్లో పెట్టుకుంది. ఆ ఫోటో మన కాలేజి రోజుల నుంచి ఆమెతోనే ఉంది. నేరుగా వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టుకొచ్చింది. ఆమెకి అక్కడేది కొత్తగా అనిపించినట్లు లేదు. తులసి ఆకులతో చేసిన టీ కొద్దిగా వగరుగా అనిపించింది, మౌనంగా చప్పరిస్తుంటే.

“నువ్వింకా పెళ్ళి చేసుకోలేదా?” అంది సడన్‌గా.

ఏదో ఒక సందర్భంలో ఆ రోజే ఆ ప్రశ్న వేస్తుందని తెలుసు. కానీ అదే మొదటి ప్రశ్న అవుతుందని అనుకోలేదు.

“లేదు” అని “ఏమైనా సరుకులు కావాలా తీసుకొని వస్తా” అని లేచా. తరువాత ప్రశ్ననుంచి తప్పించుకోడానికి లేచాను అని ఆమెకి అర్థమైందనుకుంటా.

“బస చేప తీసుకురా. అలాగే అరిటాకులు, కొబ్బరి కూడా. ఈ రోజు నీకు బెంగాలీ స్పెషల్ చేసి పెడతా” అంది.

అలా సంభాషణ తిండి మీదకి మళ్ళడం వల్ల పరిస్థితి కొంత మాములుగా మారిందనిపించింది.


అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. పెద్దగా మార్పేమి లేదు ఆమెలో. కళ్ళు మాత్రం పొడిబారినట్లు ఉన్నాయి.

ఎన్ని రోజులు ఉంటుందో, నా అడ్రెస్ ఎలా కనుక్కుందో! ఇన్ని సంవత్సరాల తరువాత హఠాత్తుగా ఇప్పుడు ఎందుకు వచ్చిందో! పెళ్ళి అయ్యిందో లేదో! ఆమె వచ్చినప్పుడు నేను లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేదేమో! ఇక మళ్ళీ వచ్చేది కాదేమో! ఆమె నన్ను వెతుక్కుంటూ రాలేదు, నేను ఆమె రావాలని కోరుకున్నా కాబట్టి వచ్చిందేమో! అలా అయితే వెళ్ళాలి అని కోరుకుంటే వెళ్ళిపోతుందా? ఆమె వెళ్ళాలి అని అసలు నేనెప్పటికైనా కోరుకుంటానా?

చాలాసేపు గట్టిగా అనుకున్నా ఆమెని ఏమీ ప్రశ్నించకూడదని. కానీ ఆ ప్రశ్నలన్నీ నన్ను వెంటాడి వేధిస్తున్నాయి. ఇలాంటి ఆలోచనలతో కాసేపు సతమతమైపోయాను.

ఆ సాయంత్రం రైలు వెళ్ళేప్పుడు మధ్య మధ్యలో రాళ్ళ శబ్దాలలో ఆమె మాటలు కలుస్తున్నాయి. నేను మౌనంగా వింటున్నాను. ఆమె ఏదో నా తెలియని రహస్యాలు చెపుతున్నట్లు అనిపించింది. మధ్యలో అంది, “ఇక ఇక్కడే ఉందామనుకుంటున్నాను” అని.

అంటే… బిదు ఇక నాతోనే ఉంటుందా? ఈమెతో రాత్రులు గడపడం అనే ఆలోచనే నన్ను భయపెట్టడం తెలుస్తుంది.

“నీ ముఖంలో ఆనందం కంటే ఆలోచనలే ఎక్కువ దోబూచులాడుతున్నాయ్ సాధూ” అంటూ అరల్లో అడ్డదిడ్డంగా పడేసిన పుస్తకాలను తీసి చూసింది. “ఏంటి ఇప్పుడు బుద్దుడు నచ్చుతున్నాడా?” అంది నవ్వుతూ.

ఇబ్బందిగా నవ్వాను. ఆ రాత్రి ఎలా గడుస్తుందో అన్న ఊహ నన్ను గట్టిగా పట్టేసుకొని ఎటూ పోనివ్వడం లేదు. ఇంతకాలం తరువాత తనెందుకు వెతుక్కుంటూ వచ్చింది? ఆమె పుస్తకాలు సర్దింది. వంట చేసింది. రైలు వచ్చినప్పుడల్లా ఆ శబ్దాలు, కొన్ని మాటలు. తనని గురించి అడగాలంటే ధైర్యం చాలట్లేదు. జరిగింది ఏదీ చెప్పకూడదని అనిపించింది. ఆశ్చర్యంగా ఆమె కూడా అప్పటి సంగతులేమి ఎత్తలేదు.

“ఏంటి సాధూ, సంకోచంగా ఉన్నావ్ వచ్చిన దగ్గరనుంచి. నేనేమైనా నీదగ్గరినుంచి తీసుకుపోవడానికో, ఇంకేదైనా కావాలని కోరుకోవడానికో వచ్చాననుకున్నావా?”

గతానికి భిన్నంగా ఆమె మాటలకు తోడవుతున్న చిరునవ్వు ఆమెను మరింత ప్రత్యేకంగా చూపిస్తోంది.

“అలా ఏం లేదులే బిదూ” అన్నా, నాలో ఉబుకుతున్న ఇబ్బంది నాకు తెలుస్తుంది. మనుషులు దేనికోసం వస్తారు? కంటికి కనిపించేవాటిని ఇవ్వడం కంటే కనిపించనివి ఇవ్వడం కదా కష్టమైన పని.

స్నానం చేసి తెల్లటి పైజామా లాల్చీ వేసుకొని ఎదురుగా కూర్చుంది. ఆమె పాదాలు మొద్దుగా ఉన్నాయి. రోజూ పొలానికి వెళ్ళి కష్టంచేసే పాదాల్లా మొద్దుబారి ఉన్నాయి.

“తిందామా?”

“హాఁ”

“ఈ రోజు నేను నీ పళ్ళెంలోనే తింటా” అంది చిన్నపిల్లలా.

నా ముఖంలో ఇబ్బంది గమనించిందేమో! “ఊరికే అన్నానులే. కంగారుపడకు. నా ప్లేట్ నేను పెట్టుకుంటాలే” అంటూ చేపలు తీసి ప్లేట్లో పెట్టింది. “ముళ్ళు పెద్దగా ఉండవు ఈ చేపల్లో” అంది. బెంగాలీ వాసన గదంతా.

“చేపలను జలపుష్పాలు అంటారు కదా బెంగాల్‌లో?”

“అవును చేపలు అక్కడ వెజిటేరియన్.” ఆమె తెలుగులో బెంగాలీ యాస.

“మీ నాన్న” అని కొద్దిగా ఆగా, ఆ సంభాషణ ఎటు వెళుతుందో అన్న అనుమానంతో.

తను నా మాటను పెద్దగా పట్టించుకోకుండా, “రైలు పట్టాల పక్కన రూమ్ కదా! నిద్రపడుతుందా నీకు?” అంది నవ్వుతూ.

“మొదట్లో రైలు వచ్చినపుడల్లా మెలుకువ వచ్చేది. ఇప్పుడు రైలు రాకపోతే మెలుకువ వస్తుంది” అన్నాను.

తనకి నేల పైన పరుపు వేసి నేను కొద్దిగా దూరంలో మంచం పైన పడుకున్నా. కానీ, అక్కడ పడుకోకుండా బిదు వచ్చి మంచంపైన కూర్చుంది.

“నేను మంచం పైన తప్పితే నిద్రపోలేను. ఒకసారి ఎప్పుడో క్రింద పడుకున్నప్పుడు కాళ్ళజెర్రి కుట్టింది. ఆ భయానికి మంచం పైన తప్పితే కింద ఎప్పుడూ పడుకోను” అంటూ నా పక్కనే పడుకుంది.

మంచం అంచుకు జరిగి ఇంకోవైపు తిరిగి పడుకున్నా. నా గుండె చప్పుడు నాకే పెద్దగా వినిపిస్తుంది. అలా ఎంత సమయం గడిచిందో తెలియదు. తన చేతులు నెమ్మదిగా వెనుక నుంచి నా చుట్టూ చుట్టుకున్నాయి. బలంగా తనలోకి అదుముకుంది. మెడపైన తను పెడుతున్న ఒక్కొక్క ముద్దులో కొద్దిగా కొద్దిగా నా విచక్షణ కరిగిపోయింది. గుండె ఇంకా పెద్దగా కొట్టుకుంది. చిన్నపాటి పెనుగులాట లోపల వీగిపోయింది. ఒక్కసారిగా తనవైపు తిరిగి ముద్దు పెట్టుకున్నా. తన ముఖం చంద్రబింబంలా వెలిగిపోతుంది. తన చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కోవాలనుకున్నా. ఆశ్చర్యం, అక్కడ ఆమె శరీరం లేదు. మంచులాంటి పొగలో నా చేతులు నాకే తగిలాయి. మరి తను నన్నెలా కౌగలించుకుందో అర్థం కాలేదు. భయంతో ఒక్క కేక గొంతు నుండి బయటికి రాకముందే కళ్ళు తెరిచా. చెమట వర్షంలా కారుతుంది.

ఎదురుగా టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని బిదు ఏదో రాసుకుంటూ కనిపించింది. తలతిప్పి మంచం వైపు చూశా. నా పక్కన ఎవరూ లేరు. నా అరుపుకేమో తను నా వైపే చూస్తోంది. నా కంగారు చూసి, “సాధూ, ఏమైంది కల కన్నావా?” అంది. ఆమె ముఖంలో అదే వెలుగు. అంత వెలుగు భరించడం కష్టం అనిపించి కళ్ళు మూసుకున్నా.

“ఏమైంది సాధూ” అని అడుగుతున్న తన గొంతు వినిపిస్తుంది.


సారథి చెప్పడం ఆపాడు.

బిదు మా మధ్య కొత్త వ్యక్తేమి కాదు. ఆంధ్ర యూనివర్సిటీలో పిజి మేమంతా కలిసే చదువుకున్నాం. చదువు అయిపోయి పది సంవత్సరాలు అయినా సారథి మాత్రం టచ్‌లో ఉన్నాడు. వాడు నన్ను ఒక నమ్మకమైన స్నేహితుడని భావిస్తాడు. నేను వాడికిచ్చే నమ్మకం కంటే నాకు నా విషయాలు తప్ప ఇంకెవరి విషయాలు పట్టనంత బిజీగా ఉండటంవల్లో లేక వాడిని రెట్టించి ఏ విషయమూ లోతుగా అడగక పోవడం వల్లనో వాడి నమ్మకాన్ని సంపాదించానేమో అనిపిస్తది.

యూనివర్సిటీలో చేరిన కొత్తల్లో ప్రతిదానికి భయపడే సారథిని హీరోలా చేసింది మాత్రం బిదుతో వాడి ప్రేమ. చివరి ఎగ్జామ్ అయ్యాక ఏమైందో ఏమో కాని వాడు ఎవరికి ఏమీ చెప్పకుండా రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు. ఎందుకనో ఎవరికీ అర్థం కాలేదు. బిదు వాడి కోసం చాలా ఎంక్వైరీలు చేసి, చివరకు బెంగాల్ వెళ్ళిపోయింది.

తరువాతెప్పుడో కలిశాడు. నేను వాడు కలవగానే బిదు విషయమే అడిగాను. వాడేమి చెప్పకుండా ఆగకుండా తాగుతుంటే ఆపి బీచ్ ఒడ్డుకి తీసుకువచ్చా. వాంతి చేసుకొని బీభత్సం చేసి ఏడుపు మొదలు పెట్టాడు. “బావా, అది మనిషి కాదురా” అని అదొక్కమాటే అంటున్నాడు. భయంతో ఏడుస్తున్నాడు. ఇంతగా భయపెట్టింది ఏంటో నాకు అర్థం కాలేదు.

ఆ తరువాత వాడు హైదరాబాద్‌లో ఏడెనిమిది సంవత్సరాల తరువాత ఎక్కడో తగిలాడు. మనిషి అలాగే ఉన్నాడు. నన్ను చూసి సంతోషపడ్డాడు. అప్పుడప్పుడూ బార్‌లో కలుసుకొనేవాళ్ళం.


“నాకొకటి చెప్పు, నువ్వు చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రి వెళ్ళిపోయావ్ బిదుని కూడా వదిలేసి. అప్పుడు ఏమైంది?”

“ఆ రోజు” అన్నాడు సారథి సంకోచంగా, “బిదును నా రూమ్‌లో ఉండమని బలవంతం చేశా. అర్ధరాత్రి దగ్గరికి తీసుకొని కౌగిలించుకున్నా. తమకంగా పెదాలను ముద్దాడాలని చూస్తే తనకి తల లేదు. కేవలం మొండెం మాత్రమే ఉంది. అదీ నగ్నంగా. చాలా భయపడిపోయా. కనీసం లైట్ వేసే ధైర్యం కూడా చేయలేకపోయా.”

“అది నిజమా, కలనా సారథీ?”

“ఏమో, అది నిజంగానే జరిగిందని నాకు తెలుస్తుంది. ఆ తరువాత కూడా రెండు మూడుసార్లు బిదును కలవడానికి చూశా. ప్రతిసారి ముఖం కనిపించకుండా మొండెం మాత్రమే కనిపించేది. ఏదో భయం పట్టుకుంది నాలో. ఇది ఎవరికి చెప్పాలో ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయాను.”

“అప్పుడు ముఖం లేదు, ఈ రోజు మరి ముఖం ఒక్కటే కనిపిస్తుందా?” అన్నా.

సారథి ఏమీ మాట్లాడలేదు కాసేపు.

“ఇలా ఎందుకు జరుగుతుందో తెలీదు. నా జీవితంలో ఇంత దగ్గరగా వచ్చిన మనిషి ఎవరూ లేరు. వసంతకాలంలో ఒక్క ఆకు లేకుండా పూర్తిగా పూలతో నిండిన చెట్టులా తను నాలోపల నిండిపోయింది. కొన్నిసార్లు తనని భరించలేక, ఇక తనను మోయలేక దుఃఖం వచ్చేది. తను నాలోనుంచి ఏమి చేసినా పోనందుకు సంతోషమూ వేసేది. తను నన్ను శిక్షించడానికి వచ్చిన దేవతలా అనిపిస్తుంది. నేను తనతో ఉండలేను. తనని వెళ్ళమని చెప్పలేను” అని గొణుక్కుంటున్నాడు.

“నిన్న రాత్రి అది స్పష్టంగా కలే అని తెలిసింది కదా! మరి కలల్ని చూసి భయపడతారా ఎవరన్నా.”

“కల, వాస్తవం అని దేనిని విడదీస్తావు. భయం ఎందుకు ఎక్కడినుంచి పుడుతుందో చెప్పగలవా? నిజమే భ్రమనో, భ్రమే నిజమో కరెక్ట్‌గా గీత గీసి ఇది అని చెప్పగలవా? ఇదంతా నీకు అర్థం కాదేమో! రెండు అవుతోంది. ఇక ఇంటికి వెళతా” అని లేచాడు.

వాడిని ఉండమని చెప్పలేదు. వాడేదో నిశ్చయించుకున్నాడు అనిపించింది.


అలా వెళ్ళిన సారథి ఇక నాకు కాల్ చేయలేదు.

శ్రీసుధ మోదుగు

రచయిత శ్రీసుధ మోదుగు గురించి: అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి. ...