ప్రథమాశ్వాసము
శ్రీకంఠుండు భుజంగభూషణుడు భస్మీభూత పంచాస్త్రుడ
స్తోకాటోప బలప్రతాప పురరక్షో దక్ష సంశిక్షణుం డా
కాశోజ్వ్జల కేశపాశుడు త్రిశూలాంకుండు రుద్రుండు తా
వీకం జింతలపాటి నీలనృపతిన్ వీక్షించు నేత్రత్రయిన్
అక్షయ బాహుగర్వ మహిషాసుర దుర్ముఖ చక్షురోల్లస
ద్రాక్షస దక్షులన్ సమరరంగములోన త్రిశూలధారచే
శిక్షయొనర్చి శోణిత మశేషము గ్రోలిన దుర్గ దుర్గుణా
ధ్యక్షుని నీలభూవిభుని తద్దయు నిర్ధను జేయు గావుతన్
స్తబ్ధ శబ్ద గ్రహద్వయుడు సంవేష్టితో
త్తాలవాలుండు కరాళవజ్ర
కర్కశ దంష్ట్రా క్రకచ భయంకర మహా
విస్తృత వక్త్రుండు విపుల దీర్ఘ
పటుతర కహకహ స్ఫుట చటు వికటాట్ట
హాస నిర్దళిత వేదాండభాండు
డాలోక కాలానలాభీల విస్ఫుర
న్నేత్రుండు ఖడ్గసన్నిభ నిశాత
నఖరుడు హిరణ్యకశిపు వినాశకుండు
సింహగిరివర్తి యగు నరసింహమూర్తి
యడరు చింతలపాటి నీలాద్రినృపుని
సిరియు గర్వం బడంగంగ జేయు గాత
నీరదనీలవర్ణుడు శునీవరవాహుడు విద్యుదాభ వి
స్ఫార జటాభరుండు బహుశష్పసమన్విత దీర్ఘమేడ్రు డం
భోరుహగర్భ మస్తక విభూషిత హస్తసరోజు డా మహా
భైరవు డిచ్చుగాత నశుభంబులు నీలనృపాలమౌళికిన్
అనుపమ విక్రమ క్రమ సహస్రభుజార్గళ భాసమాన సా
ధనజిత సిద్ధసాధ్యసురదానవ దక్షుడు దక్షశీర్ష ఖం
డను డగు వీరభద్రుడు కడంకను చింతలపాటి నీలభూ
జనపతిపుంగవు న్విభవసారవిహీనునిగా నొనర్చుతన్
నలువగు రక్తమాల్యవసనంబులు డంబుగదాల్చి కన్నులన్
జలజల బాష్పబిందువులు జాలుకొనంగ చెలంగుచుండు న
క్కలుములచేడెయక్క కలకాలము నీలనృపాలు నింటిలో
కలిపురుషానుషంగ యయి గాఢరతిన్నటియించుగావుతన్
అనుదిన వక్రమార్గరతులై చరియించుచు వైరివర్గముల్
తనర పరస్పరాత్మతను దాలిచి మంగళుడు న్గురుండునున్
శనియును రాహువు న్మిగుల సమ్మతి ద్వాదశజన్మరాశులన్
గొనకొనినిల్చి నీలనృపకుంజరుని న్గడతేర్తు రెంతయున్
భీమకవి రామలింగని
స్త్రీమన్మథుడై చెలంగు శ్రీనాథకవిన్
రామకవి ముఖ్యులను ప్రో
ద్దామగతిం జిత్తవీధి తలచి కడంగన్
ఇట్లు సకలదేవతా ప్రార్థనంబును సుకవిజనతాభివందనంబును కావించి యేనొక్క హాస్యరసప్రధానమగు ప్రబంధంబు సుకవినికర మనోనురాగ సంధాయకంబుగా రచియింప నుద్యోగించి యున్న సమయంబున
తన యపకీర్తి మాద్యత్ కృష్ణకాకికి
గురుతరాజాండంబు గూడు కాగ
తన లోభగుణ వినూతన దురాలభ లత
కష్టదిశల్ మ్రాకులై చెలంగ
తన పందతనమను ఘనతమోవితతికి
బహుగృహంబులు శైలగుహలు కాగ
తనదు జారత్వచోరునకు సంకరశర్మ
నాటకం బర్థాంజనంబు కాగ
అవని దీపించు చంద్రరేఖాభిధాన
వారనారీత్రికోణ సంవర్ధమాన
రసపరిప్లుత సుఖగదా వ్రణకిణాంక
భూషణుండైన నీలాద్రి భూమిపుండు
వెండియు నఖండ భూమండల మండవాయమాన మానవాధినాథ సాధుయూధ నిర్నిరోధావరోధ సభాభవనాభ్యంతర నితాంత వర్ణనీయ కాలకూట కాక కజ్జల ఖంజరీట కంబళేంగాల కాలమార్జాల గండోపల ఘనాఘన గంధేభ బంభర కదంబ సంభాసమా నానూనాంత దిగంతాక్రాం తాపయశోమండలుండను, సుభగుండును, మైరావణ రావణ కుంభకర్ణ కుంభనికుంభ శుంభనిశుంభ జంభ హిడింబ ప్రలంబ పౌలోమ బక వత్సక బాణ చాణూర ఘటోత్కచ కాలనేమి ఖర దూషణ త్రిశిర మారీచ మాలి సుమాలి మకరాక్ష ధూమ్రాక్ష శోణితాక్ష ప్రముఖ రక్షోదక్ష సదృక్షా క్షుద్ర నిర్నిద్ర ద్రాఘిష్ట దుర్దను దుర్గుణాధ్యక్షుండును, సర్వావలక్షణుండును, కిరాతగుణ గరిష్టుండును, దుర్మార్గప్రవీణాస్పదుండును, బ్రాహ్మణద్రవ్యభక్షణదక్షితుండును, బాలరండాసమాకర్ష్ణ కుతూహలుండును, నిరంతానంత దుర్దాంతప్రాంత కాంతారాంతరాళ కరాళమార్గానర్గళ సంచరద్గవయ గోమాయు గోపుచ్ఛ కురంగ శశ మర్కటో లూక గ్రామసూకర ప్రముఖ ప్రకట మృగయావిహార విశారదుండును, మహోన్మాదుండును, సుకవినికురంబ విద్వత్కదంబ వందిసందోహ వైణికశ్రేణికా మనోరధార్థ వ్యర్థీకరణా సంహారణాకారణా నిర్దయస్వాంతుండును, విగతశాంతుండును, బహువారనారీ జనాలింగన దుర్గంధ బంధుర భగ చుంబన తాడన పీడన దంతక్షత నఖక్షత మహిష మార్జాల మర్కట కుక్కుట కృకుర ప్రముఖ బంధనైపుణీ గుణగరిష్టుండును, దుర్జనశ్రేష్టుండును, శ్రీమచ్చింతలపాటివంశ పారావార ఘోరజాజ్వల్యమానానూన శిఖాసందోహ సందీప్త బడబానలుండును, చలచిత్తుండును, సంగరాంగణభీరుండును, విషయశూరుండును, నీచపాచకాధారుండును, పరమ దుర్బల దుర్భర శరీరుండును, ఆత్మీయ దాసవిలాసినీజన మనోధన పశ్యతోహరుండును, పతయాళుండును, అగు నీలాద్రి రాజన్యపుంగవుం డొక్కనాడు
వేటవేపులు పదివేలు మచ్చికమీఱ
మూతినాకుచు దండ మొఱుగుచుండ
ఱొమ్ముతప్పెట లూని క్రమ్మి రసాలాలు
జోహారనుచు వేటసొంపు తెలుప
తురకనేస్తలు సురాపరిమళం బెసగంగ
చెవిచెంత మనవుల చెప్పుచుండ
రసపొక్కు లడర వారస్త్రీలు ముంగల
తాథై యటంచు నృత్యంబు సలుప
వినయమెసకంగ కుంటెనపనులు సేయు
సేవకులు దాసికలు డాసి క్రేవనిలువ
అలరు కొప్పాక గ్రామసింహాసనమున
కడక తళుకొత్త పేరోలగమున నుండి
సరసాగ్రేసరు కూచిమంచికుల భాస్వద్వార్థి రాకావిధున్
చిరకీర్తిన్ బహుళాంధ్రలక్షణవిదున్ శ్రీమజ్జగన్నాథ సు
స్థిర కారుణ్యకటాక్షలబ్ధ కవితాధీయుక్తునిన్ జగ్గరా
డ్వరనామాంకితు నన్ను చూచి పలికెన్ వాల్లభ్యలీలాగతిన్
రచియించితివి మున్ను రసికులౌనని మెచ్చ
సురుచిర జానకీపరిణయంబు
వచియించితివి కవివ్రాతము ల్పొగడంగ
ద్విపద రాధాకృష్ణ దివ్యచరిత
ముచ్చరించితివి విద్వచ్చయంబు నుతింప
చాటుప్రబంధముల్ శతకములును
వడి ఘటించితివి ఇరువదిరెండు వర్ణనల్
రాణింపగా సుభద్రావివాహ