e తరమ్‌ (నాటిక )

( మధ్య తరగతి ఇంట్లో డ్రాయింగురూము. ఒక పెద్దాయన కూర్చుని పేపరు చదువుతూ ఉంటారు. ఆయన పేరు రామ శర్మ ఆ కుటుంబానికి చిరకాలంగా స్నేహితుడు. ఇంటి యజమాని పేరు అమృతరావు. వీళ్ళిద్దరూ రిటైరైన వాళ్ళే. కొంచెం పెద్దవాళ్ళలాగా కనిపిస్తారు. ఆయన కొడుకు అనంతరామయ్య అనంత్‌ అని చెప్పుకొంటూ ఉంటాడు. అతనొక పుస్తకం చేతిలో దాచుకుని, అటూ, ఇటూ చూస్తూ, జాగ్రత్తగా అడుగులు వేసుకొంటూ లోపలికి వస్తాడు.)

అనంత్‌ ( అటూ, ఇటూ చూస్తూ ఒకసారి రామశర్మని చూసి, ఉలిక్కిపడి) బాబాయి గారూ ! మీరా ! ఎప్పుడొచ్చారు ?
శర్మ (అతని వాలకం ముందునుంచీ గమనిస్తూనే ఉంటాడు.) ఇప్పుడేలే ఒక ఐదు నిమిషాలైంది. మీ నాన్న పూజలో ఉన్నాడంటేనూ, wait చేస్తున్నా. సరే కానీ, నీ చేతిలో ఏదో పుస్తకం దాచినట్టున్నావు యేమిటది ? ఏమన్నా పనికొచ్చే పుస్తకమా ? ఇలా యివ్వు, చూసి యిచ్చేస్తాను.
అనంత్‌ మీకుపయోగపడే పుస్తకం కాదు లెండి. అయినా, ఈ వయస్సులో మీకీ పుస్తకాల గొడవలెందుకు చెప్పండి ?
శర్మ బొమ్మలు చూడ్డానికిి వయస్సుతో పనేముందోయ్‌ ? ఒకసారిలా యివ్వు, చెప్తాను.
(లేచి దగ్గరకి రాబోతాడు)
అనంత్‌ (రెండడుగులు వెనక్కి వేసి) అయ్యా ! ఇది మీకుపయోగపడదని చెప్పానా ? ఇదేదో e-commerce మీద text book . మా ఫ్రెండ్సులో ఎవరికన్నా కంటపడిందంటే తన్నుకుపోతారని,
జాగ్రత్తగా దాచి తెస్తున్నా నంతే.
శర్మ అలాగా ! (తిరిగి వెళ్ళి కూర్చుంటాడు) ఈ e-commerce యేమిటయ్యా e-tv లాగా ?
అనంత్‌ e-tv కి దీనికి ఎటువంటి సంబంధమూ లేదు. e stands for electronic అంటే electronic commerce అన్న మాట.
శర్మ e-commerece అయినా, యే commerece అయినా, అసలు commerce అంత మంచి సబ్జక్టేమీ కాదే ! మా రోజుల్లోనే యెవరూ తీసుకునేవారు కాదు. నువ్వేమో అదేదో అపురూపమైనదన్నట్టు చెప్తున్నావు !
అనంత్‌ బాబాయి గారూ ! ఇది మామూలు commerce సబ్జక్టు లాంటిది కాదు Internet కి సంబంధించినది.
శర్మ అలా చెప్పు ! ఇప్పుదర్థమైంది నీ ఆరాటం. అంటే యిది నేర్చుకుంటే, ఆ తరవాత ,అలా, అలా ఎగిరి పోవటమేనా ? (చేతితో అభినయిస్తాడు)
అనంత్‌ (నవ్వి) అదేకదండీ ఆశ! కానీ, ఎలా రాసిపెట్టి ఉందో చూడాలి.
శర్మ అయినా ఏమిటోనోయ్‌ ఈ కంప్యూటర్లు కాదుగానీ, నువ్వు రోజుకొక కొత్త పేరు చెప్తావు. ఆ మధ్య C అన్నావు, C++ అని కూడా అన్నావు, తరవాత oracle అన్నావు … యిప్పుడు
e-commerce అంటున్నావు. ఇలా మన వీధి చివర ధియేటర్లో సినిమాలు మారినట్టు, products మారిపోతూనే ఉంటాయా ?
అనంత్‌ అదేకదా నా కొచ్చిన చిక్కు. ఫలానా కోర్సు గిరాకీలో ఉందని నేర్చుకోవటం మొదలెడితే, నేను నేర్చుకొనేలోపు అదికాస్తా పాతబడి పోతోంది. ఇలా ఎప్పటికీ నేర్చుకొంటూనే ఉంటానంటే, నాన్న
బయటకి గెంటేస్తాడేమోనని భయంగా కూడా ఉంటోంది.
శర్మ ఈ వరస చూస్తే, కొన్నాళ్ళకి, ఈ products కి కూడా శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుతారేమో ! (కొంచెంసేపు ఆగి) అయినా, ఈ వెంపర్లాటలన్నీ లేకుండా, ఏ గవర్నమెంటుద్యోగమో చూసుకొని, కృష్ణా, రామా అంటూ ఉండచ్చుగదోయ్‌ ?
అనంత్‌ ఎట్లా కుదురుతుందండీ ! ఒక వైపునించి statue of liberty చేతిలో డాలరు చూపించి పిలుస్తోంటే, యిక్కడ స్థిమితంగా యెలా కూర్చోగలం ?
శర్మ statue of liberty చేతిలో ఉండేది దీపం కదూ,డాలరంటావేమిటి ?
అనంత్‌ మనకి సంబంధించినంతవరకూ, రెండూ వెలుగునిచ్చేవే కాబట్టి, యేదైనా ఒకటే.
శర్మ అయితే యిప్పుడు, దానికోసం మళ్ళీ యింకో training లో చేరతానంటావు. మీ నాన్న ఒప్పుకుంటాడంటావా ?
అనంత్‌ బాబాయి గారూ ! మీరు కూడా కొంచెం నచ్చజెప్పండి నాన్నకి. ఈ సారి మాత్రం success తప్పదు. internet programming, web page design నేర్చుకుంటే, యింక తిరుగుండదు.నాన్న యిచ్చిన దానికి ప్రతిఫలంగా, మా కుటుంబం గురించి ఒక home page కూడా తయారుచేసి చూపిస్తాను.
శర్మ “ఇంటి గుట్టు internet కెక్కించట” మంటే యిదే. అయినా మన యింటి వ్యవహారాలతో ప్రపంచానికేంపనయ్యా ! మీ నాన్నకి నేను చెప్తానులే గాని, ఇటువంటి హోం పేజీలగురించి మాత్రం ఆలోచన పెట్టుకోకు.

(అమృతరావు ప్రవేశం. వేషధారణలో పూజ ముగించి వస్తున్నట్టు తెలుస్తూ ఉంటుంది. )

అమృత ఏవండీ శర్మ గారూ ! ఎంతసేపయింది వచ్చి ?
శర్మ ఎంతో సేపు కాలేదు లెండి. మీరు పూజలో ఉన్నారంటేనూ, ఈలోగా మీవాడికి హితబోధ చేద్దామని ప్రయత్నిస్తున్నాను.
అమృత వాడెక్కడ వింటాడు లెండి ! (అనంత్‌ వైపుకి తిరిగి) ఏరా ! క్రాఫ్‌ కని గదూ వెళ్ళావు . ఇంతసేపయిందే ?
అనంత్‌ అవున్నాన్నా ! కటింగ్‌ చేసే కుర్రాడు, ఏవో డౌట్లున్నయంటేనూ, మాట్లాడుతూ ఉండిపోయాను.
శర్మ ఏమిటీ , professional advice లాంటిదా ?
అనంత్‌ అంతే ననుకోండి. కాని, చేస్తున్న profession గురించి కాదు. అతనేదో C++ నేర్చుకుంటున్నాడట, దాంట్లో ఏవో డౌట్లు.
అమృత అదేమిట్రా ? ఈ computers నీ మాదిరిగా ఎవరైనా నేర్చేసుకోవచ్చా ?
అనంత్‌ అదేగదా దీని speciality . అందరికీ యిందులో సమానావకాశాలు. ఏంచదివావు, ఎలా చదివా వన్నది కాదు, ఏం చెయ్యగలం, ఎలా చెయ్యగలమన్నదే ముఖ్యం. చేతిలో విద్య ఉంటే చాలన్న మాట.
శర్మ అంటే, ఇదికూడా ఒక చేతి వృత్తిలాంటిదంటావు.
అనంత్‌ exactly! ఇంకోవిషయం మీకు తెలుసునో లేదో. ఈ profession లో qualificationsనిskills set అంటారు. దాన్నిబట్టే మీకర్థమౌతుందిగదా, దీనికేం కావాలో. ప్రశ్నలు కూడా సూటిగా ఉంటాయి C లో రాయ గలవా, VB లో రాయగలవా, DBA పనులు చక్క బెట్టగలవా యిలాంటివి.
శర్మ “చెట్టులెక్కగలవా, నరహరి, పుట్టలెక్క గలవా” అన్నట్టు అవేం ప్రశ్నలోయ్‌ ?
అనంత్‌ కరక్టుగా చెప్పారు. in fact ఆ పాటలో చెంచులక్ష్మి అడుగుతున్నది విష్ణుమూర్తి skills set గురించే ! చూసారా, దీన్ని బట్టి, చదువుకంటే skills ముఖ్యమని మనవాళ్ళేప్పుడో
చెప్పారని వాదించవచ్చు కూడా.
అమృత మాటలకేం , అంతా కాచి వడబోసినట్టు చెప్తావు. ఉద్యోగానికి మాత్రం యెక్కడా దిక్కులేదు.
అనంత్‌ ఇంకెంతో కాలం లేదు నాన్నా ! మనకింకొక్క skill బాకీ ఉండిపోయింది.
అమృత ఇంకొక్క స్కిల్లా ! అంటే మళ్ళీ ..
శర్మ (మాట మార్చుతున్నట్టుగా) ఆ విషయం తరువాత మాట్లాడవచ్చు లెండి. ( కొంచం వాసన చూస్తున్నట్టు నటించి) ఏమిటీ , gas వాసన వస్తున్నట్టుగా ఉంది.
(గట్టిగా) అమ్మాయ్‌ ! సావిత్రీ ! gas ఏదన్నా లీకఔతోందేమో చూడు. (అమృతరావు వైపు తిరిగి) పెళ్ళికావల్సిన కూతుళ్ళు, పెళ్ళిచేసుకొనివచ్చిన కోడళ్ళు ఉన్న ఇళ్ళల్లో gas తో జాగ్రత్తగా ఉండటం మంచిది.

(సావిత్రి కాఫీ ట్రేతో ప్రవేశిస్తుంది) ఏంటి బాబాయి గారూ ! gas వాసన వస్తోందా ? పొయ్యిలు రెండూ కట్టేసానే !
శర్మ ఆ, ఏం లేదమ్మా ! నువ్వెంతకీ కాఫీ తీసుకు రాకపోతేనూ, ఏదోరకంగా నిన్ను పిలుద్దామని అలా అన్నానంతే.

(సావిత్రి ముగ్గురికీ కాఫీ ఇచ్చి, తను కూడా ఒకటి తీసుకుంటుంది. అందరూ కాఫీ సిప్‌ చేస్తారు.)

అమృత (గొంతు సవరించుకుని) శర్మ గారూ ! అమ్మాయికి సంబంధాలు వేగిరం చూడాలండీ.
శర్మ మీరు కొంత కాలంగా చెప్తూనే ఉన్నారనుకోండి. చూద్దాం. ఏమ్మా నీ requirements ఏమిటి ?
అనంత్‌ మా చెల్లెలిదొకటే కండిషను అబ్బాయి ఇండియాలో లేకపోతే చాలు. ఆఖరికి ఇథియోపియాలో ఉన్నా ఫరవాలేదు.
సావిత్రిఎంత అన్యాయం! నువ్వేమో హాయిగా అమెరికాలో ఎంజాయి చేస్తుంటే, నేను ఇథియోపియాలో మాడాలా! అదేం కుదరదు. నేను కూడా అమెరికాకే వెడతాను. మరీ వీలుకాకపోతే కనీసం సింగపూరైనా సరిపెట్టుకోవచ్చు.
శర్మ అమ్మా, ఒక మాట చెప్పనా ! జీవితమంటే తెలుగు సినిమా పాటకాదు ఫారిన్‌ లో ఉంటేనే బాగుంటుందనుకోవటానికి. సుఖంగా వుండటానికి, వుండకపోవటానికి వేరే కారణాలనేకం వుంటాయి.
సావిత్రి మీరెన్నైనా చెప్పండి, బాబాయిగారు! నాకు, మా అన్నయ్యకి అదొక్కటే జీవితధ్యేయం. కష్టమో సుఖమో తరువాత! ముందు యిది మాత్రం ఎలాగైనా సాధించి తీరతాం చూడండి.
అమృతరావు వీళ్ళమాటలకేంగాని శర్మగారు! నా మటుకు నాకు,అమ్మాయికి ఉన్న ఊళ్ళో సంబంధం చేసి, కళ్ళెదురుగా ఉంచుకుంటేనే మంచిదనిపిస్తోంది.
శర్మ పిల్లలిప్పుడేదో మోజులో యిట్లా అంటారుగాని, వాళ్ళకి కూడా మీకు దగ్గరగా ఉండాలని ఉండదా, ఏమిటి?
అనంత్‌ నాకు మాత్రం ఉండదు.
సావిత్రి అనంత్‌ , మన ప్రయత్నాలు మనం చేద్దాము గానీ, నాన్నతో అట్లా మాట్లాడకు.

( సావిత్రి కాఫీ గ్లాసులు తీసుకుని లోపలికి వెళుతుంది.)

అమృత ఒరేయ్‌, నువ్వు లోపలికి వెళ్ళి స్నానంచెయ్యి.

(అనంత్‌ లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు. ఇంతలో “పోస్ట్‌” అన్న కేక బయట్నించి వినబడుతుంది. అతను వెనక్కితిరిగి, ద్వారం దగ్గరకి వెళ్ళి పోస్టు చేతిలో పట్టుకొని, లోపలికి వస్తాడు.రెండు కవర్లుంటాయి.ఒకటి “ఇది నీకు” అంటూ తండ్రి చేతిలో పెడతాడు.రెండవ కవరు చేతిలో పట్టుకొని)
అనంత్‌ “వి. అనంతరామయ్య” ! నా పూర్తి పేరు మీద లెటరు రాసిన వాళ్ళెవరబ్బా! (కవరు చింపి చదువుతాడు) “మీ నూరవ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు.”
(ఆశ్చర్యపడి) ఆ! వీడెవడు! నాకప్పుడే నూరేళ్ళూ నిండాయని అభినందిస్తున్నాడు!
శర్మ ఇదేమన్నా Y2K సమస్యవల్ల వచ్చింది కాదు కదా!
అనంత్‌ కరక్ట్‌ బాబాయిగారూ ! అదే అయుంటుంది. అమెరికాలో అయితే ఏం ముంచుకొస్తుందోనని మంచి నీళ్ళదగ్గర్నుంచి కొనుక్కుపెట్టుకొన్నారట. అంత ఘోరాలేవీ జరగలేదు కాని, యిటువంటి
పొరపాట్లేవో యిప్పుడు బయట పడు తున్నట్టున్నాయి.
అమృత ఒరేయ్‌, నువ్వంతగా ఏమీ ఊహించనక్కరలేదుగాని, ఎవరి దగ్గర్నించని ఉందో చదువు.
అనంత్‌ “కార్యదర్శి భారతీయ జీవన పోరాట సమితి”
అమృత ఆ… అది మీ తాతయ్యదై ఉంటుంది.
అనంత్‌ తాతయ్యదా?
అమృత ఔను, అదేదో వాలంటరీ ఆర్గనైజేషన్‌. దానికి ఆయన లైఫ్‌ మెంబరు. కాకపోతే , ఆయన పోయినట్టు మనం వాళ్ళకి చెప్పలేదు.
అనంత్‌ (కోపంగా)అందుకే ,ఈ తాతలపేర్లు,ముత్తాతలపేర్లు, పిల్లలకి పెట్టొద్దనేది. అసలు నా పేరు మార్చు కుంటానంటే ,నువ్వు వినలేదు. నీ పేరు మాత్రం మోడర్న్‌ గానే పెట్టుకొన్నావు.
అమృత(నవ్వి)మానాన్నకికొత్తపేర్లంటే యిష్టం. నాకు మా నాన్నంటే యిష్టం. నీ కోరిక నీ కొడుకు విషయంలో తీర్చుకొందువుగానిలే!(శర్మగారి వైపు తిరిగి)శర్మగారు! మాబావమరిది ఏదో సంబంధం ఉందని రాస్తున్నాడు.
శర్మ అలాగా వివరాలేమిటి?
అమృత అబ్బాయి అమెరికాలో ఉంటాడుట. నాకెందుకో మనస్కరించటంలేదు.
అనంత్‌ అమెరికానా? ఇంకెందుకు ఆలోచన ? వెంటనే రాసెయ్యండి.
శర్మ మీ అబ్బాయి అన్నాడని కాదుగాని, ముందేవెనక్కి తియ్యటమెందుకు? పూర్తిగా కనుక్కోండి. అన్నీ బాగుంటే ,ఆ ఒక్క అభ్యంతరంతో వదులుకోవలసిన పనిలేదు. పైగా, అమ్మాయికి కూడా యిష్టమేనంటోందిగదా !
అమృతఏమో పైకి వెళ్ళేకొద్దీ, మగపెళ్ళివాళ్ళ డిమాండ్లెట్లా ఉంటాయోనన్న భయం ఒకటి . మా పాత కొలీగ్‌ అచ్యుతరావు చెప్పాడు. వాళ్ళమ్మాయి విషయంలో పిల్లనచ్చిందిటగాని, యితరవిషయాలు గీచి గీచి బేరం ఆడు తున్నారుట. వారం రోజులుగా వాళ్ళతోమాట్లాడుతున్నా యింకా ఏమీ తేలలేదన్నాడు.
శర్మ వారం రోజులు చర్చలు జరపటానికి, వాళ్ళేమైనా హైజాకర్లుటండి !
అనంత్‌ నాన్నా,అందరూ అలా ఉంటారనేముంది? మీరు సందేహించకుండా ముందు ఉత్తరం రాయండి.అన్నీ తరవాత ఆలోచించుకోవచ్చు.
శర్మ అబ్బాయి చెప్పిందే రైటు. అలా కానివ్వండి రావుగారు.

(తెర వాలుతుంది)

II

(అమృత రావు యిల్లు డ్రాయింగు రూము.రావు, శర్మ, అనంత్‌ , సావిత్రిఅందరూ స్టేజీమీద ఉంటారు. వాళ్ళంతా రూము సర్దుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది)

అమృత అబ్బాయి ఏ వేళ్ళ కైనా రావచ్చు. మనమీ పని వీలైనంత త్వరగా ముగించటం మంచిది.
శర్మ రావు గారూ ! ఇంతకీ అబ్బాయి వివరాలేమన్నా కనుక్కున్నారా ?
అమృత అమెరికాలో software engineer గా పనిచేస్తునాడన్నారు గదా. అంతకుమించి మనకేమీ తెలియదు.
శర్మ హైదరాబాదులో కూరగాయలమ్ముతాడన్నట్టు అది చాలా general description గదా ! సరిపోయేవాళ్ళు కొన్ని వేలమంది ఉంటారు.
అమృత అలాగే ఉందిమరి. మా బావమరిది రాసాడుగదా అని రమ్మన్నాం. వచ్చాక వివరాలు కనుక్కోవాలి.
అనంత్‌ నాన్నా, అతనెక్కడ దిగాడో, ఎలా వస్తాడో అవైనా కనుక్కున్నావా ?
అమృత ఏమిటోరా ! ఇతని వాలకమంతా విచిత్రంగా ఉంది. ఎలా ఉంటాడో, ఎక్కడ్నించి వస్తాడో, ఎవరితో వస్తాడో ఏమీ తెలీదు. ఒక్క టైము రేంజిమాత్రం యిచ్చాడు.
శర్మ అంటే, ఏమీ తెలియకుండా, భగవంతం కోసం చూసినట్టు మనం చూస్తూ ఉండవలసిందేనా ?
అనంత్‌ కొంపతీసి మారువేషంలో రాడు గదా ?
శర్మ అసలువేషంలో వస్తేనే పోల్చుకోలేనప్పుడు, మారువేషంతో పనేముంది? అమ్మాయ్‌! ఒకవేళ యిద్దరు మనుషులు వచ్చారనుకో దమయంతి నలుణ్ణి పోల్చుకున్నట్టు నువ్వతన్ని పోల్చుకోగలవా ?
సావిత్రి ఇద్దరూ ఒక age group కాకపోతే గుర్తుపట్ట గలను! (నవ్వుతుంది)
అమృత అతని కండిషనొకటే. తను వచ్చేసరికి, అమ్మాయితోసహా అందరూ ముందుగదిలోనే ఉండాలని, తను వచ్చాక అమ్మాయిని తీసుకురావటం వంటివి తనకు నచ్చవని రాసాడు.
అనంత్‌ బాగానే ఉంది గాని, రూం ఎలా సర్దితే అతన్ని impress చెయ్యవచ్చునా అని అలోచిస్తున్నాను.
శర్మ మనకున్న వస్తువుల్ని కాస్త ఒబ్బిడిగా సర్దుకుంటే సరిపోతుంది.
అనంత్‌ అలా కాదు బాబాయిగారూ ! కొంచెం show put up చెయ్యాలంటే, కొన్ని foreign items యేవన్నా arrange చేస్తే బాగుంటుంది.
అమృత మనింట్లో ఉన్న విదేశీవస్తువులు మీరిద్దరే. ఇద్దరూ ఇక్కడే ఉంటారు కాబట్టి సరిపోతుంది.
సావిత్రి కాదులే నాన్నా ! అన్నయ్య చెప్పినట్టు decorate చేస్తేనే బాగుంటుంది.
అమృత మంచిదే. కానీ, టైమెక్కడుందమ్మా ?
అనంత్‌ మీరేం వర్రీ అవకండి. ముందు ఈ పాత కేలండరు, అలారం టైంపీసులాంటివిక్కడ్నించి తీసేస్తే, సగం damage తగ్గుతుంది. బాబాయి గారింట్లో ఉన్న table calendar , కోటేశ్వర
రావుగారినడిగి flower vase మీరిద్దరూ వెళ్ళి తీసుకొస్తే, నేనీలోపు మా ఫ్రెండు నడిగి,sony DVD player తెస్తాను.
అమృత ఇలా అందరమూ తలో దిక్కు వెళ్ళిపోతే, యీ లోపు అబ్బాయి వచ్చాడంటే బాగుండదు.
అనంత్‌ ఎంతసేపు నాన్నా ? అంతగా వస్తే ఎలాగూ సావిత్రి ఉండనే ఉంటుంది. రండి త్వరగా వెళ్ళి వచ్చేద్దాం.

(ముగ్గురూ బయటకు వెళతారు. సావిత్రి గోడమీద కేలండరు, టైంపీసు తీసుకొంటుంది.)

సావిత్రి వీళ్ళు వచ్చేలోగా, మేకప్‌ ఒకసారి చెక్‌ చేసుకొని రావచ్చు.

(సావిత్రి లోపలికి నడుస్తుంది. ఒక అర నిమిషంపాటు స్టేజి ఖాళీగా ఉంటుంది. బయట్నించి ఒక యువకుడు లోపలికి వస్తాడు. వేషధారణ చాలా neat గా శ్రద్ధ తీసుకొని తయారయినట్టుగా ఉంటుంది. ఇతనే వాళ్ళెదురుచూస్తున్న అబ్బాయి. పేరు హరి. )

హరి (కొంచంగా లోపలికి వస్తూ) ఇదేమిటీ ? సరైన అడ్రసుకే వచ్చానా ? నేను వచ్చే సరికి అమ్మాయితోసహా అందరూ తయారుగా ఉండాలని చెప్తే, యిక్కడొక పురుగైనా కనిపించటంలేదు.చెప్పింది చెప్పినట్టు చెయ్యటం మనవాళ్ళెప్పుడు నేర్చుకుంటారో !(అటూ యిటూ తిరుగు తాడు.) గోడలు, టేబులు అన్నీ బోసిగా ఉన్నాయి. తడితే response లేదు. అసలీయింట్లో యెవరైనా ఉంటున్నారా ?
(పైకి) ఏమండీ !

(ఇంతలో బయట్నించి అమృతరావు ప్రవేశం. చేతిలో flower vase గబుక్కున వెనక్కి దాచుకుంటాడు.)

అమృత వస్తున్నానండీ, వస్తున్నాను. (కొంచెం తడబడుతూ) సారీ… మీరేనా హరి ? నాపేరు అమృత రావు.
హరి అవునండీ! ఆ రెండక్షరాలూ నావే! మీరేమిటీ.. ఏదో దాస్తున్నట్టున్నారు ?
అమృత అబ్బెబ్బే, అదేమీ లేదండీ. మీకోసమే చూస్తూ, రావట్లేదేమా అని బయటకు వెళ్ళాను.
(చేతిలో flower vase బల్లకింద పెట్టేస్తాడు.) మీరు కూర్చోండి ముందు.

(హరి కూర్చుంటాడు. అమృతరావు మిగతావారిద్దరికోసమన్నట్టు, గుమ్మం దగ్గరగా వచ్చి, చూస్తూ ఉంటాడు. ఇంతలో శర్మ బయట్నించి ప్రవేశిస్తాడు.)

శర్మ రావు గారూ ! ఇదిగోనండీ కేలండరు … (చేతికివ్వబోతూ, హరిని చూసి, గబుక్కున వెనక్కి తీసేసుకుంటాడు) ఓ ! మీరు వచ్చేసారా ! glad to meet you . నన్ను శర్మ అంటారు. రావు గారి స్నేహితుణ్ణి.
హరి నా పేరు హరి. మీ చేతిలో ఆ కేలండరేమిటండీ ?
శర్మ అదేమీ లేదండీ, యివాళ తేదీ అనుమానం వస్తేను, చూద్దామని తెస్తున్నాను.

(ఇంతలో అనంత్‌ ప్రవేశిస్తాడు. చేతిలో సళలబలలలప ఉంటుంది. )

అనంత్‌ నాన్నా ! మీరు వచ్చేసారుగదా ! మావాడికి నచ్చజెప్పి యిది తీసుకొనేసరికి.. (హరిని చూసి ఆగిపోతాడు.) అరే !మీరు వచ్చేసారా ! నా పేరు అనంత్‌ అండీ!
(వెళ్ళి shake hand యిస్తాడు)
హరి హరి. ( DVD player వైపు అనుమానంగా చూస్తాడు)
అనంత్‌ (మొహమాటంగా నవ్వుతూ) మాదే ! రిపేరుకిచ్చి యిప్పుడే తెస్తున్నాను. ఎంతసేపయింది మీరు వచ్చి ?
హరి నేను వచ్చేసరికి యెవరూ లేరు. గోడలవీకూడా బోసిగా ఉంటేనూ, అసలింట్లో యెవరన్నా ఉంటున్నారా అని అనుమానం వచ్చింది.
శర్మ అదేమీ లేదండీ! తెల్లటి గోడ హుస్సేన్‌ శ్వేతాంబరి పెయిటింగులాగా ఉంటుందని అలా ఉంచేసారు.
హరి శ్వేతాంబరంటే తెల్ల కాగితంకదూ ? మీ అలోచన బాగుంది.
అమృత సారీ ! మీరు వచ్చే సరికి అంతా రెడీగా ఉందామనుకొన్నది, ఎవరూ లేకుండా అయిపోయాం. ఇంతకీ సావిత్రి యేమైనట్టు ?
అనంత్‌ నేను తీసుకు వస్తానుండండి. (లోపలికి వెళతాడు)
శర్మ నా ఉద్దేశ్యంలో అమ్మాయి అద్దం ముందు కూర్చుని ఉంటుంది. అద్దం ముందు కూర్చున్నంత సేపూ, మా అమ్మాయికి తపస్సమాధిలో ఉన్నట్టే. బాహ్య ప్రపంచం పట్టదు.
అమృత వచ్చేస్తుందిలెండి.
శర్మ అక్కడ మీకంతా సౌకర్యంగా ఉంటోందా ? మీ పేరూ అదీ సరిగ్గా పలుకుతారా వాళ్ళు ?
హరి నా పేరు సింపులేకాబట్టి ఫరవాలేదులెండి. కాకపోతే, ఒక కవయిత్రిగారు చెప్పినట్టు, యెవరైనా అప్పుడప్పుడు harry అంటూ ఉంటారు.
(అమృతరావు శర్మ నవ్వుతారు.)
అమృత మీకు వర్కూ అదీ బిజీగా ఉంటుందా ?
హరి చాలా ! week days లో అసలు తీరికుండదు. ఏపనికైనా weekend దాకా చూడవలసిందే. మా ఆఫీసులో ఒక భార్య,భర్త పనిచేస్తారు. వాళ్ళైతే పోట్లాడుకోవటానికి కూడా weekend దాకా wait చేస్తారుట.
(ఇంతలో అనంత్‌ , సావిత్రి లోపల్నించి వస్తారు. సావిత్రి చేతిలో కాఫీ కప్పులతో ట్రే ఉంటుంది.)
అమృత ఇదేనండీ, మా అమ్మాయి సావిత్రి. అమ్మాయ్‌, ఆయనే హరి.
సావిత్రి నమస్కారం.
హరి నమస్కారం.

(సావిత్రి, అనంత్‌ కూర్చుంటారు.)

అమృత అమ్మాయి వివరాలు మీకు రాసాను గదా.
హరి అవునులెండి గుర్తున్నాయి.
శర్మ మీరే కంపెనీలో పనిచేస్తుంటారు ?
హరి పేరేదైతే యేముందిలెండి . ఎక్కడచేసినా అనటం కాంట్రాక్టరనే అంటారు.
అమృత మిమ్మల్ని కాంట్రాక్టరని పిలుస్తారా ?
హరి అవునండీ అందరికీ అదే పేరు.
శర్మ ఎందుకో నాకు కాంట్రాక్టరనగానే, ముత్యాల ముగ్గులో రావుగోపాలరావు గుర్తొస్తాడు.
హరి (నవ్వుతాడు) మరీ అంత కానిపనులేమీ చెయ్యంలెండక్కడ.
శర్మ అబ్బెబ్బే, అదికాదు నా ఉద్దేశ్యం.
అనంత్‌ వీళ్ళు పాత తరం వాళ్ళు. కొత్త terminology వాళ్ళకంత తెలీదు. మీరేమీ చెడుగా అనుకోకండి.
హరి ఇందులో అనుకోవటానికేముంది ? మంచికో చెడ్డకో ఎవరి అపోహలు వారి కుంటాయి.
అమృత మా వాడికికూడా అక్కడికి రావాలని చాలా కోరిక. అందుకోసం వాడు చెయ్యని training course అంటూ లేదు.
హరి training లెన్ని తీసుకున్నా, ఫలితం లేకపోతే, best thing మనమే ఒక training center open చెయ్యటం. MCET రాకపోతే MCET training , H1 రాకపోతే
software training మనం చెప్పాలేగాని, వినేవాళ్ళకి కరువేముంది.
అనంత్‌ మీ సూచన బాగానే ఉంది గాని, సీరియస్‌ గా హరిగారూ, H1 చేసేవాళ్ళెవరన్నా ఉంటే,చెప్పి పుణ్యం కట్టుకోండి.
హరి పుణ్యమో, పాపమో యేదో ఒకటి చూద్దాంలెండి.
సావిత్రి మీరెటువంటి వస్తువుల్ని like చేస్తారు ?
హరి నాకు విదేశీ వస్తువులు చూసి,చూసి బోరుకొట్టిందనుకోండి. ఇప్పుడంతా పరమ దేశీ వస్తువులంటే నాకిష్టం. for example , ఆవకాయ జాడీ, అరిటాకులో వడ్డించిన భోజనం ప్రపంచంలో అన్నిటికంటె అందమైన వస్తువులుగా నాకు కనిపిస్తాయి.
శర్మ మీ టేస్టు నాకు నచ్చింది.
సావిత్రి గడ్డపెరుగుకూడా అదే కేటగిరీలోకి వస్తుంది.
హరి అమ్మో, అటువంటివి కొంచెం రిస్కు. (కాఫీ కప్పు వంక చూసి కంగారుగా) అన్నట్టు, ఈ పాలలో కొవ్వు శాతం ఎంతో తెలుసుకోకండా తాగేసాను.
సావిత్రి మా పాలవాడుపోసే పాలల్లో అటువంటివేమీ ఉండవులెండి.మీరేం కంగారు పడనక్కర్లేదు.
అమృత ఎంతనీళ్ళ పాలైనా నవ్వుతూ పోసేస్తాడు. వాటిలో కొవ్వు శాతం కంటే, వాడి నవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది.
సావిత్రి నాకు కూడా మన సాంప్రదాయమన్నా, వస్తువులన్నా చాలా అభిమానమండీ.

(హరితప్ప, మిగతా ముగ్గురూ ఆమెవైపు ఆశ్చర్యంగా చూస్తారు. అనంత్‌ ముందుగా తేరుకొని.)

అనంత్‌ (మొహమాటంగా నవ్వుతూ) నాక్కూడా మన కంట్రీ అన్నా, పద్ధతులన్నా వల్లమాలిన అభిమానం సుమండీ.
హరి రియల్లీ ! మరిందాకే ఏదో H1 అన్నారు ?
అనంత్‌ అంటే దేనికదే అనుకోండి. ఇప్పుడు, ఇల్లే స్వర్గసీమ అనుకొనేవాళ్ళు కూడా, నిజంగా స్వర్గం కనిపిస్తే, ఇల్లు వదిలిపెట్టరా చెప్పండి ?
హరి అంటే అమెరికా స్వర్గమేనంటారు.
అనంత్‌ అది మీకు నేను వివరించి చెప్పలా ! మనవాడు “అమరలోక ” అన్నాడు, దాన్నే అవతలి వాడు “అమెరికా” అన్నాడు.
హరి బాగుంది మీ పోలిక. ఇన్నాళ్ళుగా ఉంటున్నా నాకే తట్టలేదు.
అనంత్‌ అంతే కాదు. H1 లో H stands for heaven అని కూడా అంటుంటారు మా ఫ్రెండ్సు.
శర్మ ఈ పోలిక వల్ల కొంచెం ప్రమాదం ఉంది. ఎందుకంటే దానికి opposite గా ఉండే మాట కూడా H తోనేగా మొదలయ్యేది ?
అనంత్‌ అంతా మనం అనుకోవటంలో ఉంటుంది బాబాయి గారూ !
హరి అయ్యా మీకెందుకో మామీద సదభిప్రాయం ఉన్నట్టుగా లేదు.
శర్మ అబ్బే, అదేమీలేదు. మాటవరసకన్నానంతే.
అనంత్‌ హరి గారూ ! ఎవరెలాంటి కామెంట్లు చేసినా, బాధపడకుండా, నా ambitions ని జాగ్రత్తగా కాపాడుకొంటూ వస్తున్నాను. మీరు నా సెంటుమెంటుమీద sympathy తోనైనా, ఒక H1 కోసం ప్రయత్నించాలి.
హరి అలాగే అన్నాను కదండీ! అసలు బండి ముందుకు సాగనివ్వండి.
(సావిత్రి నుద్దేశించి) మీకు మన కల్చరు మీద అభిమానమని చెప్పటం బాగుంది.
సావిత్రి చెప్పటం మాత్రమేకాదు, నిజంకూడా అంతే.
అనంత్‌ ఔనౌను. అందులో మీకనుమానం అక్కర్లేదు.
హరి మన ఆర్టిస్టులన్నా, art forms అన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఉదాహరణకి ఫేరిణి శివతాండవం వంటివి చూడటం యెంతో exciting గా ఉంటుంది.
సావిత్రి నాకు కూడా అంతే.
హరి బి.వి.సుబ్బారావు హరిశ్చంద్ర పద్యాలు ఎన్నిసార్లు విన్నానోలెక్కలేదు.
సావిత్రి నాకవంటే ప్రాణం. ఒక్కహరిశ్చంద్రే కాదు,కృష్ణరాయబారం,గయోపాఖ్యానం,వరవిక్రయం ఇటువంటినాటకాలలో పద్యాలంటే నాకెంత ఇష్టమోచెప్పలేము.
హరి అలాగే నవలల్లో…
సావిత్రి అడవి బాపిరాజు గారి “నారాయణరావు” మీరు చదివారా ?
హరి చదివాను. అబ్బ, మీకు కూడా మన క్లాసిక్‌ నవలలంటే యిష్టమా?
సావిత్రి చాలా .
హరి మన తారలందరిలోకి, సావిత్రి నా అభిమాన తార
సావిత్రి నాకు కూడా అంతే.
హరి బాలమురళీకృష్ణ పాట ..
అనంత్‌ అదంటే మా సావిత్రి చెవి కోసుకుంటుంది. అందుకే దానిచెవిని పడకుండా జాగ్రత్త పడుతుంటాం.
హరి అలాగే వైకుంఠం ..
అనంత్‌ ఆయన పాటలన్నా అంతే.
హరి (విచిత్రంగా చూస్తాడు) ఆయన పాడరు. వథబలసబలఫ చేస్తారు.
అనంత్‌ (మొహమాటంగా నవ్వుతాడు) ఏదైతే ఏముందిలెండి.
అమృత (కొంత coverup చేసే ధోరణిలో) మీకిన్ని మంచి అభిరుచులుండటం, వాటితో మా అమ్మాయి ఇష్టాలుకూడా కలవటం చాలా ఆనందంగా ఉంది.
శర్మ మీరు చెప్పే పేర్లు వింటుంటే, 100 best Telugu people of the century అనే లిస్టునుంచి తీసుకున్నట్టుగా ఉంది.
హరి శర్మగారట్లా అంటే నాకు గుర్తొచ్చింది . మీ తెలుగు అభిమానానికొక final test .

(సావిత్రి భయంగా చూస్తుంది)

హరి tank bund మీద యేయే విగ్రహాలున్నాయో ఒక వరసలో చెప్పగలరా? రాణిగంజ్‌ వైపునించైనా ఫరవాలేదు, సెక్రటేరియట్‌ వైపునుంచైనా ఫరవాలేదు.
అనంత్‌ ఇది మరీ మిలియన్‌ డాలర్‌ ప్రశ్నలాగా ఉంది హరి గారూ !
సావిత్రి సారీ అండీ ! ఒక వరస కాదుగదా, ఏవరసలోనూ చెప్పలేను. ఈసారి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకుంటానులెండి.
అమృత రోజూ అటు వాకింగ్‌ కి వెళతానుకాబట్టి, నేను చెప్పగలను. నిజానికి, నడినిన దూరం అంచనా వేసుకోవటానికి, నేనీ విగ్రహాల్నే మైలురాళ్ళుగా లెక్కబెడుతూ ఉంటాను.
అనంత్‌ మహా పురుషులు చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచిపోవటమంటే ఇదే కాబోలు.
హరి మీరు surprise కానంటే , నేను వాళ్ళ పేర్లు ఏవరసలోనైనా చెప్పగలను.
సావిత్రి చాలా గొప్ప విషయం.
శర్మ మీ ఆంధ్రాభిమానం చూస్తోంటే, మీరసలు అమెరికాలో ఉంటున్నారా, ఆంధ్రాలోనే ఉంటున్నారా అని అనుమానం కలుగుతోంది.
హరి మీకా అనుమానం అక్కర్లేదు. కావాలంటే, నా passport చూపిస్తాను. ఈ మధ్య మనవాళ్ళు కొందర్నక్కడ అరెస్టు చేసిన దగ్గర్నించి, passport ఎప్పుడూ జేబులోనే ఉంచుకొంటున్నాను కూడా.

(జేబులోంచి passportతీసి, చూపించ బోతాడు.)

అమృత అబ్బెబ్బే, అవసరం లేదండీ! శర్మగారు మిమ్మల్ని మెచ్చుకొనే ఉద్దేశ్యంతో అన్నారంతే.

(హరి లేస్తాడు. )

హరి (అమృత రావుతో) ఇక్కడితో prelims అయినట్టే. finals కోసం రేపు మళ్ళీ వస్తాను.
అమృత మళ్ళీ రేపా ?
అనంత్‌ IAS లాగా మీ selection process లో కూడా phases ఉంటాయా ?
హరి అదేమీ లేదండీ . ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటానికి, ఒక రోజు సరిపోదని నా అభిప్రాయం. ఏం సావిత్రి గారూ, మీ కభ్యంతరం లేదు కదా ?
సావిత్రి లేదండీ.
హరి good.

(హరి లేచి అందరికీ విష్‌ చేసి బయటకు నడుస్తాడు. మగవాళ్ళు ముగ్గురూ గుమ్మం వరకు సాగనంపి తిరిగివచ్చి కూర్చుంటాడు.)

అనంత్‌ ఈయనెవరో “అమెరికాలో ఆంధ్ర భోజుడు” లాగా ఉన్నాడు.
అమృత పోనీ లేరా అభిమానం ఉండటం మంచిదే గదా.
అనంత్‌ (సావిత్రివైపు తిరిగి) మొత్తానికి superb performance. prelims qualify అయినట్టే.
సావిత్రి అవకాశం ఉంటే వదులుకుంటామా ? ఏమాటకామాటే చెప్పుకోవాలి. మనిషిమాత్రం చాలా సాధుజంతువులాగా కనిపిస్తున్నాడు.
అనంత్‌ నిజమే. అందుకనే నేనుకూడా కల్పించుకుని మాట్లాడాను. ఏదో ఒక విధంగా ఇదొక్కటీ క్లిక్కయిందంటే, మనిద్దరికీ మార్గం దొరుకుతుందిగదా అని ఆశ.
అమృత మరి అతనికి తగ్గట్టుగా మీ interests మార్చుకోవటానికి రెడీనా ?
సావిత్రి మారటమో, మార్చటమో ముందు అవతలి గట్టుకి చేరితే, ఆ తరువాత చూసుకోవచ్చు. ఏమంటావనంత్‌ ?
అనంత్‌ అదేగదా ఐడియా. అయినా తెలుగులో నువ్వింత పరిజ్ఞానం ఎప్పుడు సంపాదించావు ?
సావిత్రి group 1 పరీక్షలకంటూ ఎప్పుడో వెలగబెట్టిన training యివాళ పనికొచ్చింది.
అనంత్‌ కాని, అతన్ని impress చేసే ఉత్సాహంలో కాస్త ఎక్కువగానే committ అయ్యామని అనుమానంగా ఉంది.
సావిత్రి అదే కొంచెం భయంగా ఉంది. ఈయన వాలకం చూస్తుంటే, అమెరికాలోకూడా అలికి గొబ్బెమ్మలు పెట్టమంటాడేమో ననిపిస్తోంది.
శర్మ ఏమైనా కుర్రవాడు మంచివాడులాగానే కనిపిస్తున్నాడు.
అనంత్‌ ఈ ఒక్క విషయంలో మాత్రం మీతో ఏకీభవిస్తున్నాను బాబాయిగారూ! అందుకేగదా, మేం కూడా ఇంతగా కష్టపడుతున్నది.

(ఇంతలో ఫోను మోగుతుంది. అమృతరావు వెళ్ళి ఫోను lift చేస్తాడు. )

అమృత హలో ! ఔను, అమృతరావునే! .. ఔను, .. ఔను, ..ఆ, .. ఇప్పుడే వెళ్ళారు,.. నిజంగానా ? .. ఇక్కడేనా ! … ఇంతకీ మీరెవరూ ? .. మీ కెలా తెలుసూ ? …హలో…హలో…

( ఫోను పెట్టేసి, తిరిగి వచ్చి కూర్చుంటాడు.)

అనంత్‌ ఏమిటి నాన్నా, అది ?
అమృత ఎవరిదో anonymous call . హరి తనకు తెలుసునని చెప్తున్నాడు.
సావిత్రి ఏమంటాడాయన గురించి ?
అమృత అతనసలు అమెరికాకే వెళ్ళలేదని, ఇక్కడే ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటాడని చెప్తున్నాడు.
సావిత్రి నిజంగానా ?
అనంత్‌ ఎంత మోసం !
అమృత అదెంతవరకు నిజమో , అసలు నమ్మవచ్చునో లేదో తెలీదు. ఎవరన్నా ఆకతాయిగా చేసినా చేసి ఉండవచ్చు.
శర్మ ఏమో. అతన్ని చూస్తే అబద్ధం చెపుతున్నాడనిపించటంలేదు. పైగా, మీ బావమరిదిగారు చెప్పిన వ్యక్తి గదా ?
అమృత ఔనండీ నాకూ అదే అర్థం కావట్లేదు.
అనంత్‌ లేదులే నాన్నా ! అతని ఆంధ్రా టాకంతా వింటే, నాకది నిజమేననిపిస్తోంది.
సావిత్రి అసలాయన ఆవకాయ జాడీ అందాన్ని పొగిడినప్పుడే నాకనుమానం వచ్చింది.
అనంత్‌ ఆంధ్ర నాట్యం, హరిశ్చంద్ర పద్యాలు, tank bund విగ్రహాలు .. అసలు హైదరాబాదు పొలిమేరలుకూడా ఎప్పుడూ దాటి ఉండడు.
సావిత్రి నాన్నా! ఆయనకింక రానక్కర్లేదని చెప్పెయ్యండి.

(లేచి లోపలికి వెళ్ళిపోబోతుంది.)

శర్మ అమ్మా, ఒక్క నిముషం. రానీ, అసలతనెందుకిలా చేసాడో, అతని ఉద్దేశ్యమేమిటో కనుక్కుందాం.
అనంత్‌ రానీ, సావిత్రీ, రానీ. అసలిందాక passport చూపిస్తానన్నప్పుడు, తీసుకుని చూడ వలసింది. అప్పుడే తేలిపోయేది. అయినా రేపు వచ్చినప్పుడు కనుక్కోవటం కాదు, గట్టి గుణపాఠమే చెపుదాం. మళ్ళీ జీవితంలో మర్చిపోకూడదు.
అమృత ఏమిటో, ఒకటనుకుంటే ఒకటయ్యింది. (ఒక్క సెకండు ఆగి) నాకెందుకో అతను మంచివాడనే అనిపిస్తోంది రా.
అనంత్‌ చూద్దాంలెండి రేపు అతని మంచేమిటో, మన మంచేమిటో. అన్నట్టు, రేపు మాత్రం, మీ పెద్దవాళ్ళిద్దరూ ఒక్క మాటకూడా మాట్లాడకండి. మేం చూసుకుంటాం మొత్తం.

(అనంత్‌ , సావిత్రి లేచి, లోపలికి వెళ్ళిపోతారు.)

శర్మ నాక్కూడా ఇందులో యేదో పొరపాటుందని అనిపిస్తోంది. రావుగారూ, మీరు వర్రీ అవకండి. రేపన్నీ కనుక్కుందాం. అలా ఒక్కసారి బయటకి వెళ్ళి వద్దాం పదండి.

(ఇద్దరూ లేచి బయటకు నడుస్తుండగా తెర పడుతుంది. )

III

(తెర తీసేప్పటికి అందరూ స్టేజిమీదే ఉంటారు. అందరి చేతుల్లోనూ కాఫీతాగినట్టుగా కప్పులుంటాయి. అనంత్‌ తన కప్పు టేబుల్‌ మీదపెట్టి, నిలబడుతూ మాట్ల్లాడతాడు.)

అనంత్‌ మీ “అమెరికా అనుభవాలు” వింటోంటే, మాకు కూడా అమెరికా వెళ్ళివచ్చినట్టుగా ఉంది హరిగారూ !
సావిత్రి (హరి వైపు తిరిగి) బహుశ మీకు కూడా అలాగే ఉందేమో!
హరి (అర్థం కానట్టూ మొహం పెట్టి) మీరన్నదేంటో నా కర్థం కాలేదు.
అనంత్‌ ఆ, ఏదోలెండి. .. ఐతే మీరు RTC డ్రైవర్లా వేలకువేల మైళ్ళు drive చేసారంటేనే ఆశ్చర్యంగా ఉంది.
హరి కారుదేముంది నడపటం చాలా తేలిక. చిన్నప్పుడు మా తాతగారి ఊళ్ళో ఎడ్లబండి తోలేవాణ్ణి. ఆ మజానే వేరనుకోండి. గిత్తలు పరుగుపెడుతోంటే, బండి తల్లక్రిందులవుతుందేమో నన్నంత భయం వేస్తుంది.
అనంత్‌ ఆ, మళ్ళీ తెలుగు వాకిట్లోకి వచ్చెయ్యకండి. మీరు అమెరికా గడ్డమీద ఉంటేనే మాకానందం. అంతేనా, సావిత్రీ ?
సావిత్రి అంతే! అంతే !
హరి సర్లెండి, మీరుకూడా ఆ గడ్డమీదకి వచ్చాకే మాట్లాడుకుందాం. అన్నట్టు, అనంత్‌ , మా classmate ఒకతను ఇక్కడ్నించే H1 processing చేయిస్తున్నాట్ట. మీ resume ఒకటి నాకివ్వండి. అతనికొకసారి చూపిద్దాం.
అనంత్‌ అలాగే. పాపం, మీ H1 కూడా అతనే process చేయించాడేమో!
హరి కాదులెండి గాని, ఏమిటీ, నిన్నటికంటే యివాళ మీ ధోరణిలో ఏదో మార్పు కనిపిస్తోంది ?
అనంత్‌ కొంతసేపైతే మీకే అర్థం అవుతుందిలెండి. ఇంతకీ, మీ finals లో questions మొదలు పెడతారా ?
సావిత్రి హరి గారూ ! దానికంటే ముందు, నిన్న నేనిచ్చిన సమాధానాల్లో కొన్ని సవరణలున్నాయండి.
హరి (ఆశ్చర్యంగా) సవరణలా ?అవేంటి ?
సావిత్రి మా అభిమాన తార సావిత్రి కాదు, julia roberts !
హరి ఔనా ?
సావిత్రి అడవి బాపిరాజునెప్పుడూ చదవనేలేదు, arthur hailey ని తప్ప.
హరి నిజంగానా !
సావిత్రి బాలమురళీకృష్ణ మాకు ఎక్కనే ఎక్కడు back street boys తప్ప !
హరి అలాగా !
సావిత్రి ఫేరిణి నృత్యం కంటె, fashion parades చూడటమంటేనే మాకిష్టం.
హరి బాగుంది. ఇప్పటికి మీకు జ్ఞానోదయమయిందన్నమాట. మీకు నిజంగా యేవి నచ్చుతాయో ఒప్పుకొంటున్నారు.
అనంత్‌ ఔను. కాకపోతే, మీకుకూడా అటువంటి జ్ఞానోదయమే కలిగించాలని మా ప్రయత్నం.
హరి నాకా !(నవ్వుతాడు) నా కవబట్టేగదా మీకా ఫోను చేయించింది !
అమృత ఏమిటీ, ఆ ఫోను మీరు చేయించారా ?
హరి ఔను. మీరు create చేస్తున్న impression నిజమైనదికాదని నాకు నిన్ననే అనుమానం వచ్చింది. అందుకే, చిన్న trick play చేసానంతే.
అనంత్‌ ఇదంతా నాటకమా !
(నీరసంగా కుర్చీలో కూర్చుంటాడు. సావిత్రి విస్తుపోయి చూస్తుంది.)

సావిత్రి అయితే మీరు అమెరికాలోనే ఉంటున్నారా ?
హరి ఔను. అయితే, యిప్పుడది తెలుసుకున్నందువల్ల ప్రయోజనమేమీలేదు.
అనంత్‌ అంటే ?
హరి చూడండి ! ambitions ఉండటం తప్పుకాదు. అలాగే వేరేరకమైన అభిరుచులుండటంలోకూడా తప్పులేదు. కాని, నాకు మాత్రం వాటన్నిటికంటే, sincerity యింకా ముఖ్యమని అనిపిస్తుంది.
(అమృతరావ్‌ వైపు తిరిగి) సారీ, రావుగారూ, మీ సమయం వృధాచేసినందుకు.నేను వెళతాను.
అమృత అంతేనంటారా ?
శర్మ మీరొకసారి సావధానంగా కూర్చోండి. అసలేమయిందన్నది చర్చించి, ఒక నిర్ణయానికి వద్దాం.
హరి లాభంలేదు శర్మగారూ! నాకు కావలసింది, నా కోసం అమెరికాకివచ్చే మనిషిగాని, అమెరికాకోసం నాతోవచ్చేవాళ్ళు కాదు. (సావిత్రి,అనంత్‌ వైపు తిరిగి) నేనిక వెళతాను. wish you all the best !

(హరి నమస్కరించి బయటకు నడుస్తాడు. అందరూ దిగులుగా కూర్చుంటారు. అనంత్‌ లేచి, ముందుకువచ్చి)

అనంత్‌ డామిట్‌ ! కధేమిటి యిలా అడ్డం తిరిగింది !

(తెర వాలుతుంది.)