కవిత్వీకరణ కొన్ని సంగతులు

ఏది కవిత్వం, ఏది కాదన్న విషయం ఎవరూ నిర్దిష్టంగా తేల్చి చెప్ప లేరు. అది కవి, పాఠకుడు తమ తమ అనుభవం మీద ఆధారపడి నిర్ణయించుకోవలసిందే. ఐతే, ఒక వస్తువు కవిత్వంగా మారే క్రమంలో, సమకూర్చబడే సాధారణ అంశాలేమన్నా ఉన్నాయా అని తెలుసుకోవటానికి మనం ప్రయత్నించవచ్చు. ఈ దిశగా నాకు తోచిన కొన్ని విషయాల్ని ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాను. ఈ విషయాలు చాలా వరకు, కవిగా, పాఠకునిగా నా అనుభవంలో గ్రహించినవి.  కవితా రచనను,పఠనాన్ని మరింతగా ఆస్వాదించడానికి దోహదపడాలన్నది ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం.

మంచి కవితలో ఒక విధమైన “కాంతి” నిండి ఉంటుందని నేననుకొంటాను. చీకటిలో ఉన్న వస్తువు మీద కవి తన కవిత ద్వారా వెలుగు ప్రసరించి, దానిని మన దృష్టిలోకి తీసుకువస్తాడు. ఆ విధంగా, ప్రకృతిలో ఉన్న ఒక చిన్న అందాన్ని గాని, దైనందిన జీవితంలో మనకుకలిగే ఒక సున్నితమైన అనుభవాన్ని గాని, సూక్ష్మమైన ఒక సామాజిక సత్యాన్ని గాని మన గ్రహింపులోనికి తెస్తాడు. ఇక్కడ పేర్కొన్న అందం గాని,అనుభవం గాని, సత్యం గాని కవి తానుగా సృష్టించినవి కావు. అవి యెప్పుడూ ఉన్నవే. కవి చేసినదల్లా వాటిమీద వెలుగు ప్రసరించటం. గుహలో దాగిన చిత్రాలమీద  టార్చిలైటు వేసి చూపే గైడులాగా కవి, ఆయా వస్తువులమీద వెలుగు ప్రసరించి వాటిని మనకు అవగతం చేస్తున్నాడు. తద్వారా ప్రకృతిని, మన అంతరంగాన్ని, సమాజాన్ని యింకా మెరుగ్గా అర్థం చేసుకోవటంలో మనకు సహాయం చేస్తున్నాడు.

ఇక్కడున్న ఒక ముఖ్య విషయమేమంటే, కవి ఆవిష్కరించే ఈ వస్తువు, పాఠకునికెంత దగ్గరైతే, పద్యం అంతగా తృప్తి నిస్తుంది. కవి తనకు మాత్రమే పరిమితమైన అనుభవాన్ని చెబితే అంతగా రక్తి కట్టదు. మనకు పరిచితమైన ఒక అరుదైన అనుభవాన్ని కవితలో చదివినప్పుడు గొప్ప ఆనందం కలుగుతుంది.ఎవరికి వారికే, కవి తన గురించే చెప్తున్నాడనిపిస్తుంది. అటువంటి అనుభవాన్ని గుర్తించి, ఆవిష్కరించటంలోనే కవి ప్రతిభ దాగివుంటుంది.

ఉదాహరణకు, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ కవిత “సౌందర్యారాధన ” తీసుకోండి.

” కుంకుడు పులుసు పడి ఏడ్చే
పసిపాపల ఎర్రజీరల నేత్రాల్లో
తల్లి పిండిన చనుబాలలా
చిమ్మిన వేకువ, శాంతపరిచిన
అడవిపై అందమైన పిట్టలు ఎగురుతాయి.
సగం అరగదీసిన ఇడుంకాయిలా
సూర్యుడు పైకొస్తే
ఆకాశం తేరుకుంటుంది.
పటిక ముక్కల్లాంటి మంచు బిందువుల
శీతాకాలంలో
చెరువు తేటబడుతుంది.
అప్పుడే అడవీ, ఆకాశం, చెరువు
ఒకదాని సౌందర్యం ఒకటి ఆస్వాదిస్తాయి. ”

ఇందులో, మనకు పరిచితమైన ఒక వేకువ దృశ్యం ఎంతో రమణీయంగా చెప్పబడింది. ముఖ్యంగా, ప్రకృతిలోని వివిధ అందాలు, పరస్పరం రసాస్వాదన చేసుకుంటాయన్న ఊహ కొత్తగా అనిపిస్తుంది.

అలాగే, వసీరా రాసిన మినీ కవిత ఒకటి అప్పట్లో చాలా పేరుపొందింది. అది

“కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలిగిన వాడు కూడా
కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. ”

అతి కొద్ది మాటల్లో ఒక జీవిత సత్యాన్ని ఆవిష్కరించటం ఈ  కవిత గొప్పతనం. ఇవేగాక, గాలి నాసర రెడ్డి, బి.వి.వి.ప్రసాద్‌ వంటి వారు రాసిన హైకూలనుండి కూడా అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు.

వెలుగు నీడలకి సంబంధించిన మరొక విశేషం కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక వస్తువుకి సంబంధించిన అనేక అంశాలలో,వేటిని, ఎంతవరకు కవి ప్రకాశింపజేస్తున్నాడు, వేటిని నీడలో ఉంచుతున్నాడనేదానిమీద కూడా ఒక కవిత నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఈ వెలుగు నీడల మధ్య సమతుల్యాన్ని  సాధించలేనప్పుడు, ఆ కవితలో ఏదో లోపం ఉందన్న విషయం మనకు లీలగా తెలుస్తుంది.

కొన్ని సందర్భాలలో, ఒక విషయాన్ని స్పష్టం చెయ్యటానికి, దానికి పూర్తిగా వ్యతిరేకమైన మరొక దానితో పోల్చటం జరుగుతుంది. దీనిని కాంట్రాస్టుగా చెప్పుకోవచ్చు.   నిన్ననేడు, జీవితంమృతువు,మనిషిదేవుడు .. యిలా రకరకాల పోలికలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. ఉదాహరణకి, ఇస్మాయిల్‌ “హంపీ” అనే పద్యం తీసుకుందాం.  ఈ పద్యంలో, హంపీ దృశ్యాన్ని, దాని గతవైభవాన్ని స్ఫురింపజెయ్యటానికి, అక్కడున్న రాయికి,నీటికి మధ్య ఉన్న కాంట్రాస్టును వాహకంగా వాడుకున్నారు.

“రాళ్ళకి తలుపులుండవు
రాయిలోపల రాయే కూచునుంటుంది
రాయి నీకేసి చూడదు
అంతర్య్ధానంలో ములిగుంటుంది నిత్యం

… ….
…….

నీళ్ళకి ఒళ్ళంతా నోళ్ళే,
నీళ్ళకి ఒళ్ళంతా కళ్ళే.
తలుపులన్నీ బార్ల్లా తెరిచి
నిన్ను ఆహ్వానిస్తుంది యేరు.

పూర్తిగా మూసుకున్న రాయికీ
పూర్తిగా తెరుచుకున్న యేటికీ మధ్య
సగం తెరిచి, సగం మూసుకున్న మనిషికి
స్థానంలేదు కావును.
అందుకే పక్షులెగిరిపోయాయి.”

ఈ కాంట్రాస్టు అనేకరకాలుగా సాధించవచ్చు. ఒకో కవితలో, రెండు భాగాల మధ్య కాంట్రాస్టు ఉంటుంది. తిలక్‌ “నువ్వులేవు నీ పాట ఉంది” అనే కవిత దీనికి మంచి ఉదాహరణ.  ఈ కవిత పూర్వార్థంలో వర్ణించబడ్డ గొప్ప రొమాంటిక్‌ సన్నివేశానికి, కవిత చివర్లో చెప్పబడ్డ యదార్థస్థితికి మధ్యనున్న కాంట్రాస్టు మనకొక మెలాంకలీని కలగజేస్తుంది. శ్రీ శ్రీ మహాప్రస్థానంలో ఉన్న “ఆ ః” అన్న కవిత పూర్తిగా కాంట్రాస్టు మీద ఆధారపడిన కవితగా చెప్పుకోవచ్చు. కేవలం రెండు పదాలతోనో, ఒకేపదంతోనో ఈ కాంట్రాస్టు సాధించే సందర్భాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు, “తీయని బాధ “,”తీయ తేనియ బరువు “, “వేడి వెన్నెల ” వంటి ప్రయోగాలనేకం మనం చూస్తాం.

ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. పరస్పర విరుద్ధాంశాలనెన్నుకొనే విషయంలో కవి జాగ్రత్తవహించాలి. వైరుధ్యం లేనివాటిని తీసుకొని ఉన్నట్టుగా రాస్తే, అపహాస్యం పాలయ్యే ప్రమాదం ఉంది.

ఒక చిత్రంలో, ఫొటోలో ఉన్నట్టే,  కొన్ని కవితలలో కూడా టైమింగు ఉంటుంది. ఒక చిన్న సంఘటనను లేదా ఒక జీవన దృశ్యాన్ని తన కవితలో కేప్చర్‌ చేసి కవి మనముందుంచుతాడు. దానితో, మనం మిస్సైన ఒక moment ను ఫొటోలో చూసినప్పుడు మనకు కలిగే థ్రిల్‌ వంటిదే ఆ కవిత చదివినప్పుడుకూడా మనకు కలుగుతుంది. ఒక స్త్రీ నిద్రపోతున్న దృశ్యం మీద శివారెడ్డి “ఆమె ఎవరైతేనేం ” అన్న పద్యం రాసారు. తన సహచరి నిద్రలో ఉలిక్కిపడి లేచిన సంఘటన మీద ఇస్మాయిల్‌ “నిద్దట్లో ఆమె కళ్ళు ” అనే పద్యం రాసారు. ఒక సాయంకాలం ఎవరూ రాకపోవటమనే సంఘటనమీద సినారే “ఇవాళ ఎవరూ రాలేదు ” అన్న పద్యం రాసారు. ఇలా అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇటువంటి పద్యాలలో మంచి స్పాంటేనిటీ ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది.

ఇవి గాక, కవి తాను తీసుకున్న వస్తువుని రొమాంటిసైజు చెయ్యటం కూడ అనేక సందర్భాలలో మనం గమనిస్తాము. “ఆమె కన్నులలో అనంతాంబరంపు నీలి నీడలు కలవు ” అన్న దగ్గర్నించీ, తన ప్రేయసిని కవి రొమాంటిసైజు చెయ్యటం ఉన్నదే.  తరువాత కాలంలో సీరియస్‌ కవులు ప్రేయసి గురించి పద్యాలు రాసిన సందర్భాలు చాలా తక్కువ.  గోదావరి శర్మ వంటివారి  పద్యాలలో ఎక్కడైనా ఒకటి రెండు ఉదాహరణలు కనిపిస్తాయేమో. ఐతే,  ఈ రొమాంటిసైజు చేసే ధోరణి బాల్యం, యవ్వనం, చిన్నప్పటి ఊరు, గ్రామీణ వాతావరణం  మొదలైన యితర అంశాల మీదకు మళ్ళింది. తిలక్‌ “ఆ రోజులు ”  దగ్గర్నించి , జయప్రభ కాకినాడ గురించి రాసిన “అంతా అంతే” అనే పద్యం వరకు అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కాలుష్యం, ఒంటరితనం, ప్రేమరాహిత్యం వంటి వాటితో బాధపడే నగరవాసులకు ఇటువంటి పద్యాలు యెంతో ఊరట కలిగిస్తాయి. కానీ, వీటిలో అత్యధికశాతం పద్యాలు గతం మీద అధారపడి ఉండటం మనం గమనిస్తాం. వీటిలో కవి గుర్తించి ప్రస్తుతించిన అంశాలు, ఆయా వస్తువుల్లో సహజంగా ఉన్న లక్షణాలే అయినప్పటికీ, పునరుక్తులు చోటు చేసుకొనే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు, చిన్నప్పుడు పుస్తకంలో దాచుకున్న నెమలికన్ను ప్రస్తావన ఎంత యెక్కువగా వాడబడిందంటే, యిప్పుడది దాదాపు అరిగిపోయినట్టుగా కనిపిస్తుంది.

తమకు ప్రియమైన వస్తువులను రొమాంటిసైజు చెయ్యటం ఒక పద్ధతైతే, సమాజంలో సాధారణ లేదా తక్కువ స్థాయిలో ఉన్నవారిపై సానుభూతి కలిగించే ఉద్దేశ్యంతో, వారిని రొమాంటిసైజు చెయ్యటం మరొక ముఖ్య ధోరణి. శిఖామణి “పూల కుర్రాడు” దీనికొక మంచి ఉదాహరణ. జీవనంకోసం పువ్వులమ్ముకొనే సలాది బుల్లెబ్బాయనే కుర్రాడిగురించి రాయబడ్డ ఈ కవిత కరుణాత్మకంగా సాగుతుంది. అతను “తన బాల్యాన్ని మూరమూర చొప్పున కోసి” అమ్ముకోవటం, “చెమటనూ కన్నీళ్ళనూ చల్లి వాటి మృదుత్వాన్ని కాపాడుతూండటం” వంటి వాక్యాల ద్వారా ఇది వ్యక్తమౌతుంది. ఐతే, కవితలో మరొక చోట, అతను “కార్తీక మాసంలో వదిలిన అరటి దొన్నెలో వెలిగించిన ప్రమిదలాగా ” ఉంటాడనీ “పరిమళాల్ని మోసుకొచ్చే వాయుదేవుడిలా “ఉంటాడనీ,  “విశ్వంపై పుష్పవృష్టి కురిపించే బాల గంధర్వుడిలా” ఉంటాడనీ చేసిన వర్ణన, కొంత రొమాంటిసైజు చేసాడన్న భావన కలిగిస్తుంది. దీనితరువాత, ఇదే ధోరణిలో అనేకమంది, అనేకమంది గురించి రాసారు. ఎండ్ల్లూరి సుధాకర్‌  గూర్ఖ, బల్దియా మైసమ్మ గురించి రాసిన పద్యాలు , భగ్వాన్‌ స్కూలు దగ్గర ఇస్ప్రూట్లమ్మే వాడిగురించి , చొక్కాలకి కాజాలుకుట్టేవాడి గురించి ఇలా చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. వీటిలో, మోతాదుకు మించిన రొమాంటిసైజేషను చోటుచేసుకుంది. నేను మొదట్లో చెప్పినట్టు, కవి వస్తువుల్లో సహజంగా ఉండి, గమనింపబడని లక్షణాలమీద వెలుగు ప్రసరించాలి గాని, తన కవిత్వంకోసం, వస్తువులోలేని లక్షణాలు దానికి ఆపాదించకూడదు. ఈ విచక్షణ పాటించకపోతే, పద్యం గిల్టు నగలు  తొడిగినట్టు, ఎబ్బెట్టుగా తయారవుతుంది.

చివరిగా, కవులు చాలా ఎక్కువగా వాడిన, సంయమనంతో ఉపయోగించవలసిన మరొక అంశం గురించి ప్రస్తావిస్తాను. అది సెంటుమెంటు.అమ్మ, మాతృదేశం, మృత్యువు, త్యాగం ఇటువంటి అంశాలపై అధారపడిన సెంటిమెంటు చాలా బలంగా ఉండి, పాఠకుల్నాకర్షిస్తుంది. ఇదికాక, ఒక బాధితునికి సంబంధించిన సెంటిమెంటు కూడా మన కవుల్లో చాలా ఎక్కువ. బాధలకు గురైన వ్యక్తికి మరీ ముఖ్యంగా, ఆ బాధ వేరొకరి కారణంగా ఏర్పడి నపుడు సహజంగానే, ఒక నైతిక బలంఉంటుంది. అందుకనే, కవి ఆ వ్యక్తి పక్షాన మాట్లాడుతాడు. అసలు, వివిధ వాదాల పరంగా వచన కవితా వికాసాన్ని  పరిశీలిస్తే, ఆయా దశలలో ఈ బాధితుని పాత్ర మారిందే కాని, మౌలికంగా స్వరంలోను, ధోరణిలోను మార్పు రాలేదనిపిస్తుంది. అయితే, తన వస్తువు ద్వారా సంక్రమించే నైతిక శక్తి కంటే మించిన శక్తి కవికి అవసరమనుకొంటాను. దానివలన, తనకంటూ ఒక ప్రాపంచిక దృక్పధం యేర్పడి, కవి మరిన్ని విషయాలను గ్రహించి రచించ గలుగుతాడు.

వచన కవితా ప్రక్రియను అనేక కోణాలలో పరిశీలించి, విశ్లేషించవలసిన అవసరం ఉంది. కాని, మన విమర్శకులు చాలామంది, వివిధ వాదాల నేపధ్యంలోనే ఎప్పటికీ వచన కవిత్వాన్ని అంచనా వేస్తుంటారు. ఆయా వాదాల ప్రాధాన్యతను కాదనలేకపోయినప్పటికీ, వాటికతీతమైన కొన్ని మౌలిక కవిత్వాంశాల పరిశీలన కూడా తగినంత జరగాలని నేననుకొంటాను. ఉదాహరణకు,  పద్యం ఎత్తుగడ, ముగింపు, నిడివి, మానసికంగా కవిత ఎక్కడ మొదలై ఉండవచ్చునన్న దానిపై కవితలో లభించే క్లూలు యిలా రకరకాల అంశాలపై ఆసక్తికరమైన పరిశోధన జరపవచ్చు. కవులు కూడా కవితా నిర్మాణంలో  తమతమ అనుభవాలను మిగతా వారితో పంచుకొంటే బాగుంటుంది.దానివలన వారికి, పాఠకులకి కూడా ఉపయోగం చేకూరుతుంది.