మంత్రి – మహిషం

ఉపోద్ఘాతం

పాలకుడు భ్రష్టుపట్టిపోయిన వేళ, భరించరాని మనోవేదన చవిచూసిన మంత్రి ఏం చేస్తాడు? రెండు పనులు చేస్తాడు. ఒకటి. పాలకుడికి నచ్చచెప్పి, ప్రజలకు మేలు చేయించాలని చూస్తాడు. రెండు. అది అసాధ్యమయితే, పదవి వదలిపెట్టుకొని దూరంగా పోయి ఏ వ్యవసాయమో చేసుకుంటాడు.

వాంఛేశ్వర మంత్రి సరిగ్గా ఇదే చేశాడు. అంతటితో ఆగక ఆ పాలకుడి అలసత్వాన్ని, ఆయన్ని ఆశ్రయించుకు బతుకుతూ ప్రజల్ని కాల్చుకుతినే మోతుబరుల ఆగడాలనీ చీల్చి చెండాడుతూ, సంస్కృతంలో, నూరు శ్లోకాలతో మహిష శతకం అనే వ్యంగ్య రచన చేశాడు. తన రచన చదివి, పాలకుడు సిగ్గుపడి చెంపలు వేసుకునేలాగా చేశాడు.

మహిషం అంటే దున్నపోతు. పల్లెటూళ్ళల్లో ప్రజలకు దగ్గిరగా దీనికి విశేషించి ఏ గౌరవం లేదని గమనించాలి. ఇటువంటి జంతువుని ‘సంకేతం’ గా తీసుకుని దానిని స్తుతిస్తున్నట్టు నటిస్తూ సమాజంలో చెడుని చెండాడేడు. ఇదంతా ఎలాజరిగిందంటే —

తంజావూరు రాజ్యాన్ని క్రీ.శ. 1674 నుండి 1885 వరకూ మహారాష్ట్ర రాజులు పరిపాలించారు.వారిలో పదకొండవ పాలకుడు, రెండవ ఏకోజీ కొడుకు ప్రతాప సింగు 1739 నుంచి 1763 వరకూ పరిపాలించాడు. ఈతని తండ్రి కాలం నుంచి వాంఛేశ్వర మంత్రి వీరి కొలువులో తెలివైన వ్యక్తిగా మన్ననలు పొందుతూ, సమర్థంగా మంత్రిత్వం నిర్వహిస్తుండేవాడు. రెండవ ఏకోజి మరణించాక, రాజ్యపరిపాలన అరాచకంలో పడింది. దానికి తోడు ప్రతాపసింగు, చాలా కుర్రవాడు సింహాసనమెక్కాడు. యౌవనం, ధనసంపత్తిః ప్రభుత్వమవివేకతా ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం – యౌవనం, బాగాడబ్బుండడం, పాలకపదవిలో వుండడం, అజ్ఞాని కావడం, వీటిలో ఒక్కొక్కటి ఉంటేనే మనిషికనర్థం. ఇంక ఈ నాలుగూ ఒక మనిషికే ప్రాప్తిస్తే, ఇంక చెప్పేందుకేముంది? అని సూక్తి చెప్పినట్టే అయింది ప్రతాపసింగు పని. చుట్టూ ఇచ్చకాలు చెప్పేవాళ్ళు చేరి తమపబ్బం గడుపుకొన్నారు. రాజు పేరు చెప్పి సుబేదారులు ప్రజలను పడరాని పాట్లకు గురి చేయ సాగారు. పరిపాలన నిరంకుశంగా తయారయింది. మంచితనంతో, నెమ్మదితనంతో, చదువుసంధ్యలతో, మెత్తగా పనిచేసే అధికారులని పదవులనుంచి తొలగించి, నిరంకుశులని దేశం మీదికి వదిలారు. బలవంతంగా ప్రజలనుంచి ధనధాన్యాలను దోపిడి చేయసాగారు. మానాభిమానాలను కోరుకునే చాలామంది రాజ్యం వదిలి వెళ్ళిపోయారు. అమాత్యుడుగా వున్న వాంఛేశ్వరుడు ఈ దుర్భర పరిస్థితిని సరిచేసే ప్రయత్నాలు చేశాడు. ఫలితం దక్కలేదు. ఒక దశలో వాంచేశ్వర మంత్రి, ప్రతాపసింగుని కలుసుకొనే మాట్లాడే అవకాలు సైతం దూరమయ్యాయి. వ్యక్తిగతంగా అవమానాలకు పాలయ్యాడు. దీనితో ఒళ్ళు మండిపోయి, కడుపులో కసి వెళ్ళగ్రక్కడానికి మహిష శతకం వ్రాసి ప్రచారం చేయించాడు. ఈ శతకం ప్రతాపసింగు చదివి, తప్పు తెలుసుకొని, మళ్ళీ వాంఛేశ్వర మంత్రిని దగ్గరకు తీసుకొని, ఆయన సలహా పాటించి మంచి రాజనిపించుకున్నాడు.

దుష్టపాలనను ఖండించడం, దుర్మార్గుల ఆగడాలను చీల్చి చెండాడడం ప్రధాన లక్ష్యాలుగా గల ఈ శతకానికి చారిత్రకంగానే కాదు, నైతికంగా, సామాజికంగా కూడా ఎంతో విలువ వుంది. వాంఛేశ్వర మంత్రి గొప్ప పండిత వంశంలో పుట్టాడు. అతి చిన్నతనంలోనే శాహాజీ మహరాజు మెప్పుపొంది, తకుట్టికవిత (బాలకవి) అనే బిరుదం పొందాడు. పెద్దవాడయ్యాక రెండవ ఏకోజీ కొలువులో అమాత్యపదవినే కాదు, ఆస్థాన విద్వాంసుడి పదవికూడా నిర్వహించాడు. శహాజీ మహరాజు తిరువిశనల్లూరు గ్రామాన్ని శహాజీ పుర అగ్రహారం చేసి 47 మంది ఉద్దండ పండితులకు దానం చేశాడు. ఆ 47 గురిలో వాంఛేశ్వర మంత్రి తండ్రి కూడా ఒకరు. వాంఛేశ్వర మంత్రి జన్మస్థలం ఈ తిరువిశనల్లూరే.

వాంఛేశ్వర మంత్రి ఈ మహిష శతకమే కాక, ధాటీ శతకమనీ, ఆశీర్వాద శతకమనీ మరో రెండు పుస్తకాలు వ్రాశాడట. ఈ మహిష శతకానికి వాంఛేశ్వర మంత్రి ముని మనుమడు ( అతని పేరూ వాంఛేశ్వరుడే) “శ్లేషార్థ చంద్రిక” అనే పేరుతో సంస్కృతంలో వ్యాఖ్యానం వ్రాశాడు. ఈయన మహా పండితుడు. తర్కశాస్త్ర నిధి. 80 ఏళ్ళవరకు జీవించి, 1849 ప్రాంతంలో మరణించాడు. తెలుగులో 1952 లో కావ్యతీర్థ మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి తేటగా తాత్పర్య రచన చేశారు. ఇక ఒక్కొక్క శ్లోకం పరిశీలిద్దాం.

మంత్రి మహిషం 1

వాంఛేశ్వర మంత్రి తన రచన ప్రారంభాన్ని కావ్య సాంప్రదాయ ప్రకారం, ఆశీర్వాదంతో ేస్తున్నాడు.

స్వస్తస్య్తు ప్రథమం సమస్త జగతే
శస్తా గుణస్తోమత
స్సంతో యే నివసంతి సంతు మఖిన
స్తే మీ శివానుగ్రహాత్‌
ధర్మిష్ఠేపధి సంచర న్వ్తవనిపా
ధర్మోపదేశాదృతా
స్తేషాం యే భువి మంత్రిణ స్సుమనస
స్తే సంతు దీర్ఘాయుషః

మొట్టమొదట, పరమశివుడి దయవల్ల మొత్తం ప్రపంచానికి మేలు జరగాలి. దయ, ఓర్పు, అసూయారహితం, పరిశుద్ధత, శ్రమలేమి, మంగళం, కార్పణ్యరాహిత్యం, ఆశలేమి వంటి గుణాలున్న మంచివాళ్ళకు సుఖం కలగాలి. పాలకులు ధర్మబద్ధంగా నడవాలి. వాళ్ళదగ్గిర పనిచేసే మంత్రులు మంచిమనస్సుతో పాలకులకు ధర్మం బోధించగలిగి మసలాలి. అటువంటివారు ఆయుర్దాయం కలిగి సుఖంగా జీవించాలి. తను మంత్రిగా కొలువు సాగిస్తున్నది, భోసలరాజవంశం వారికి. తరతరాల పాటు వాళ్ళకు మేలు జరగాలని కూడా తను అవమానపడినప్పటికీ కూడా కవి కోరుకుంటున్నాడు.

యే జాతా విమలేత్ర భోసలకులే
సూర్యేందు వంశోపమే
రాజానశ్చిర జీవిన శ్చ సుఖిన
స్తే సంతు సంతానినః
యే తద్వంశ పరంపరాక్రమవశా
త్సభ్యా స్సమాభ్యాగతా
స్తే సంతు ప్రథమాన మాన విభవా
రాజ్యాం కటాక్షోర్మిభిః

సూర్య, చంద్రవంశాలతో సమానంగా , మచ్చలేని విధంగా భోసల రాజవంశంలో పుట్టిన వాళ్ళందరూ, దేవుడి దయవల్ల చిరంజీవులు, సుఖసంపన్నులు, సంతానవంతులు కావాలి. అంతే కాదు. ఈ రాజవంశం వాళ్ళకు వంశపారంపర్యంగా మంత్రిపదవులు నిర్వహించేవారికి కూడా, శుభాలు జరగాలి. వాళ్ళు తమపాలకులకు అనుగ్రహ పాత్రులై గౌరవాలు, వైభవాలు పొందుతూ అభివృద్ధి చెందాలి. పాలకుల కడగంటిచూపుల తరగలతో మంత్రులు సుఖవంతులు కావాలని వాంఛేశ్వర మంత్రి వాంఛ.

మంత్రి మహిషం 2

మారిపోయిన పరిస్థితులపట్ల మంత్రికి కష్టం తోచింది. వంశం ఎంతగొప్పదైతే మాత్రం ఏం లాభం? అసభ్య ప్రవర్తన గల వారు తయారయ్యారు. ఇక ఉద్యోగం వల్ల ప్రయోజనం లేదు. వ్యవసాయం చేసుకోవడం ఒక్కటే దారి, అని నిర్ణయానికి వచ్చి మాట్లాడుతున్నాడు.

నానాజి ప్రభు చంద్రభాను శహజీంద్రానంద రా యాదయౌ
విద్వాంసః ప్రభవో గతాశ్రితసుధీ సందోహ జీవాతవః
విద్యాయాం విష బుద్ధయో హి వృషలా సభ్యా స్వ్థిదానీంతనాః
కిమ్‌ కుర్వేబ కృషే వ్రజామి శరణం త్వా మేవ విశ్వావనీం.

ఒకప్పుడైతే ధర్మాత్ముడు నానాజి మంత్రి, చంద్రభాను ప్రభువు, శాహజీ మహరాజు, ఆనందరాయ మంత్రి, వంటి వారు స్వయంగా మహా విద్వాంసులై తమదగ్గరకు వచ్చేవిద్వాంసుల్ని ఉదారంగా పోషించేవారు. కాని, ఆ రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పటికీ కొందరు మంచి పాలకులు లేకపోలేదు, పూర్వపు వాళ్ళంతగా కాదు. వీళ్ళు సభ్యత గల వాళ్ళు కారు. ధార్మికులు కారు. వేద,పురాణాలు, స్మృతులు వంటి వాటి మీద గౌరవం లేదు. ఈ పరిస్థితుల్లో ఏం ెయ్యాలి? సమస్త ప్రాణులనీ రక్షించే వ్యవసాయ మాతా, నిన్నే శరణు వేడుకొంటున్నాను. వేడుకుంటున్నాడు సరే. వ్యవసాయం చేసుకోవడానికి వాంఛేశ్వర మంత్రి కులానికి వేద శాస్త్రాలు ఒప్పుకోవే, అని ఎవరైనా ఆక్షేపణ చేస్తారేమోనని ఇక్కడ ఆ ప్రమాణం కూడా చూపించదలచి మంత్రి అంటున్నాడు.

అక్షైర్మేతి నను శ్రుతి స్మృతి పథం ప్రాయః ప్రవిష్ఠేన కిం?
సౌఖ్యం వా హల జీవినా మనుపమం భ్రాతర్న కిం పశ్యసి?
కిం వక్ష్యే త దపి క్షితీశ్వరబహిర్వ్దార ప్రకోష్ఠస్థలీ
దీర్ఘావష్యితి రౌరవాయ కురుషే హా హంత హంత సృహాం.

ఋగ్వేదంలోని శాకల శాఖ సప్తమాష్టకంలో ఏ మన్నాడో వినలేదా? “జూదం ఆడవద్దు. సేద్యం చేసుకో. సేద్యం చేసుకుంటూ లోక గౌరవం పొందుతూ ధన ధాన్యాలతో ఆనందం గా జీవించు,” అని కదా వుంది. కనక వ్యవసాయం చేసే వాళ్ళకు సాటిలేని సుఖం కలుగుతూండడం అనుభవంలో ఉన్నదే, సోదరా. అయినా నువ్వు రాజగృహాల ద్వారాల ముంగిళ్ళలో పడివుండి ఎంతకాలమైనా నిరీక్షణతో గడపాలని కోరతావెందుకు? ఏం చెప్పాలి? అయ్యయ్యో, ఇంత కన్నా నరకం వేరే వుందా?

మంత్రి మహిషం 3

వ్యవసాయం చేసుకోవడం వేదసమ్మతమేనని ప్రమాణం చూపించావు సరే నయ్యా. ఆ ప్రమాణం వైశ్య కులం వారికి, తదితరులకు వర్తిస్తుంది గాని, నీ కులానికి పనికిరాదు. సేద్యం వల్ల ప్రత్యక్షంగా లాభం కనబడుతోంది కనుక తప్పులేదని వేదప్రామాణ్యం చూపించడం సరికాదు అనే ఆక్షేపకులకు మంత్రి సమాధానం చెపుతున్నాడు.

దుర్భిక్షం కృషితో న హీతి జగతి ఖ్యాతం కిల, బ్రహ్మణా
మాపద్ధర్మ తయా మనౌ చ కృషి గో రక్షా దికం సమ్మతం
భూపే ష్వర్థపరేషు హంత సమయే క్షుణ్ణే చ దుర్భిక్షతో
వృత్యర్థం కృషి మాశ్రయే మ భువి నః కిం వా తతో హీయతే.

సేద్యం వల్ల, కరవు లాటకాలుండవని లోకంలో ప్రసిద్ధి కద. ఆపద్ధర్మంగా బ్రాహ్మణులు, వ్యవసాయం పశుపోషణ చేసుకోవచ్చునని మను ధర్మశాస్త్రం కూడా చెపుతోంది. పాలకులు కేవలం నసంపాదన మీద దృష్టి పెట్టివుంటేనూ, కరవు కాటకాలతో కాలం సంక్షోభించి పోతుంటేనూ, బ్రతుకు తెరువు కోసం వ్యవసాయ వృత్తిని ఆశ్రయించక ఇంకేం చెయ్యాలి? కనక ఆ వృత్తినే ఆశ్రయించుకుంటాం. స్వధర్మం ఎలాగూ అనుష్ఠిస్తూనే ఉంటామనేది కూడా వ్యవసాయం మాకు ఆపద్ధర్మ వృత్తి అనడంలో ఉంది.

ఇలా సమాధానం చెప్పగా మహిషం (దున్నపోతు) మంత్రిని ” ఏమయ్యా, నీకు ఒక పాలకుడి కొలువులో సాగుబాటు లేకపోతే పోయె. వేరే చోటుకు పోయి చదువు చెప్పుకుంటూ జీవించవచ్చు కదా, అది శాస్త్రసమ్మతం కదా? అలా చేయవేమి?” అని అడిగినట్టు భావించి, దానికి సమాధానం చెపుతున్నాడు.

ఆర్య శ్రీధర మంబుదీక్షిత మిమౌ దృష్య్తా మహా పండితౌ
విద్యాయై సృహయే న యద్యపి వరం క్షాత్రం బిభే మ్యాహవాత్‌
వాణిజ్యం ధన మూలకం త దఖిలం త్యక్వ్తా శ్రిత స్వ్తా మహం
త్వం విద్యా చ ధనం త్వ మేవ సకలం త్వం మే లులాయ ప్రభో.

మహారాజశ్రీ దున్నపోతుగారూ, వినండి. శ్రీధరుడున్నాడు కదా, మహాపండితుడు. అంబుదీక్షితులూ ఉన్నాడు, గొప్ప నిష్ఠాపరుడు. పండితుడు. షడ్దర్శనాలూ ఆపోశనం పట్టి వదిలాడు. ఇద్దరూ దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్నారు. వీళ్ళని చూశాక చదువంటే నాకు విరక్తి కలిగింది. తను చదువుకోవడం, ఇతరులకు చదువు చెప్పడం అనేవి బ్రాహ్మణ ధర్మాలైనా, అవి నిష్ప్రయోజనాలని తేలిపోయింది. పోనీ, క్షత్రియ ధర్మమైన శస్త్రాలను ఆశ్రయిద్దామా అంటే, యుద్ధం అంటే భయం కనుక మానేశాను. సరి, ఏ భయం లేని వ్యాపార వృత్తి వుంది కదా అనుకుంటే, దానికి డబ్బు కావాలి. అది మనదగ్గిర లేదు కదా. ఇవేమీ లాభం లేవని నిర్ధారించుకొని, నిన్ను ఆశ్రయించాను. నువ్వే నాచదువు, నువ్వే నా ధనం, అన్నీ నువ్వే, నీ దయవుంటేనే ఇవన్నీ నాకు దక్కుతాయి.