ఈ నాగరిక సమాజమొక పంజరం
డబ్బు పంజరం
పంజరానికి తాళం వేసుకుని
తాళంచెవి దూరంగా విసిరితే
అనాదిలోకి వెళ్ళిపోతున్న
ఆదిమమానవుడి జుట్టులో చిక్కడిపోయింది
మనుషులు
డబ్బుపంజరంలోని
డుబ్బుచిలకలు
తాము కల్పించుకున్న దేవుడికి
మనుషులు దాసానుదాసులైనట్లుగా
తాము తయారించిన డబ్బుకి
తామే దాసానుదాసులు
డబ్బు నాగరికత ఊపిరి
డబ్బు నాగరికత దేహం
డబ్బు నాగరికత ఆత్మ
డబ్బు నాగరికత గమ్యం
డబ్బుసంస్కృతి
డబ్బువిజ్ఞానం
డబ్బువ్యాధులు
డబ్బుతోటే అన్నీ
డబ్బులోనే అన్నీ
డబ్బుసమాజం
డబ్బునాగరికత
డబ్బే సమాజం
డబ్బే నాగరికత
డబ్బే సత్యం
డబ్బే శివం
డబ్బే సుందరం
ఈ నాగరిక సమాజంలో
అన్నిటికీ కొలమానం డబ్బు
మమతకి అనురాగానికి
స్నేహానికి ఆత్మీయతకి
అన్నిటికీ కొలమానం డబ్బు
తల్లిని తండ్రిని
సొంత పిల్లల్ని
భార్యని భర్తని
సాటివారిని
అందర్నీ అన్నిటినీ
అణాపైసల్లో తప్ప
విలువకట్టలేరు
యింత
తిండీ బట్టా కొంపా
అందరికీ ప్రతిఒక్కరికీ
చాలు
డబ్బును తిరస్కరించి
నాగరికను త్యజించి
స్వచ్చ్ఛతలోకి పవిత్రతలోకి
మానవత్వంలోకి అస్తిత్వంలోకి
అన్ని విలువల్నీ
మానవ విలువలన్నిటినీ
నాశనం చేసిన
డబ్బుని
తగలబెట్టండి
దేశదేశాల కరెన్సీని
మహాపర్వతంలా
కుప్పపోసి
నిప్పంటించండి
ఈ పంజరం విరగ్గొట్టండి
ఈ డబ్బుపంజరం లోంచి బయటపడండి
స్వచ్ఛంగా స్వేచ్ఛగా గాలి పీల్చండి