ఒక్కడినై..

కలనించి మెలకువకు వంతెన వేస్తూ ఫోన్‌ చప్పుడు..
“హలో” వదలని నిదరమత్తు, బద్ధకం.
“హలో! నేను శంకర్ని మాట్లాడుతున్నా!”
“ఆఁ శంకర్‌ ఏమిటి సంగతులు?” పదయింది.
“సారీ, నిదర లేపానా?”
“ఫర్లేదులే.. ఎటూ లేచే టైమేగా!”
“వాసు ఉన్నాడా?”
“వాసు వేరే ఎపార్ట్‌మెంట్‌కి మూవయ్యాడు కదా! నీకు చెప్పలేదా?”
“అవునా, నాకు తెలియదు. ఎప్పుడు? ఎందుకని?”  ఆశ్చర్యం, కుతూహలం.
“లాస్ట్‌ వీకెండ్‌ మారాడు. ఏవో చిన్న చిన్న గొడవలు.. మా ఇద్దరికీ పడటం లేదులే చాలా రోజుల్నించి”
“అదేమిటి..మీ ఇద్దరూ హాస్టల్లో నాలుగేళ్ళూ రూమ్మేట్స్‌ కదా? ఇప్పుడేమయింది?”

పొద్దున్నే చిరాకు. వీడికన్నీ కావాలి.
“ఎప్పుడూ ఒకలాగే ఉంటామా ఏమిటి? నా వంతు క్లీనింగూ, కుకింగూ చేయటల్లేదని తగువు పెట్టుకుంటున్నాడు మాటిమాటికీ.. అసలికి నేనేదో వాడు సాయం చేస్తే వచ్చి వాడికంటే ఎక్కువ సంపాదించేస్తున్నానని గుర్రనుకుంటా.. రిక్రూటర్లనించి మెస్సేజెస్‌ తీసుకుని మళ్ళీ నాకేమీ చెప్పడు..ఇట్లాగే ఏవేవో.. పెద్ద గొడవేమీ కాలేదులే!”
“మరయితే ఒక్కడివే ఉంటున్నావా ఇప్పుడు?”
“ఆ.. చూసుకోవాలి మళ్ళీ ఇంకొకడ్ని.. లేపోతే నేనే సింగిల్‌ బెడ్‌రూం ఎపార్ట్‌మెంట్‌కు మారిపోదామనుకుంటున్నా.. ప్రతివాడూ అంతే .. ఎడ్జస్టవడం కష్టమయిపోతుంది.”
“ఏంటో మీ గొడవలు! వాడి నంబరుందా నీదగ్గర?”
“లేదు. సూరి దగ్గరుండొచ్చు!”
“సరేలే, మళ్ళీ తీరిగ్గా ఫోన్‌ చేస్తా ఈ సారి”
“సరే, బై!”
కడుపులో ఆకలి. చకచక బాత్రూం పనులన్నీ ముగించుకుని కిచెన్‌లోకి. ఏమిటి తినటం? సీరియల్‌ అయిదారు రకాలు. ఉహు.. బ్రెడ్‌ బేగెల్‌ కాల్చే ఓపిక లేదు. పాలు ఉత్తమం. స్కిం మిల్క్‌ తెల్ల మీసం రాకుండా.

వాణ్ణేదో మిస్సయినట్లు ఎక్కడో. ఓ మనిషి తోడయినా ఉండేది. ఏమీ తోచదు. టీవీ ఉందిగా!

న్యూస్‌. అవే పాతమొహాలూ.. పాచి వార్తలూ.. ఎంతసేపు చూస్తాం? మంచి సినిమాలేవీ లేవు.. ఇది చూసిందే.. ముగింపు తెలిశాక మరి చూడబుద్ధి కాదీ సినిమా.. పొద్దున్నే ఎందుకుంటాయి? మ్యూజిక్‌ ఛానెల్సూ.. ఏవో సుత్తి పాటలూ.. ట్రావెలూ కుకింగూ ఏమిటీ చెత్తంతా.. ఛానెల్‌ తర్వాత ఛానెల్‌. బోడి ఎడ్వర్‌టైజ్‌మెంట్లూ.. పైనించి కిందకీ.. కిందనుంచి  పైకీ.. ఏవుంటుంది.. ఏదీ అందటం లేదు మనసును తాకటం లేదు.. కట్టిపడేసేదేదీ లేదు.. ఏదో విసుగు.. రిమోట్‌ పక్కన విసిరేసి..

గదంతా చిరాగ్గా ఉంది. ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలూ, పాత న్యూస్‌ పేపర్ల గుట్టా.. జంక్‌ మెయిలూ.. తాగేసిన గ్లాసులూ.. సర్దే ఓపిక లేదు. ఎటయినా వెళ్తే బావుణ్ణు. మూర్తికి ఫోన్‌ చేస్తే సరి! ఆన్సరింగ్‌ మెషీన్‌. మెస్సేజ్‌ వదల్లేదు. వాళ్ళిక రాత్రిక్కానీ ఇల్లు చేరరు. ఎవరున్నారింకా? బాలి రెడ్డీ, ఆనందులతో కలిసి శాన్‌ యాంటోనియో పోవలసింది! కాల్లో ఉండాల్సొచ్చి తర్వాత వారం వెళ్దామన్నా విన్నారు కాదు. ఎవరు మాత్రం ఆగుతారు?

ఆకలి మొదలయింది. లంచ్‌ ఇక బయటే. ఎక్కడికి? షిట్‌. శ్వేత.. టైం పన్నెండు.. హమ్మయ్యా ఫర్లేదు మరీ ఆలస్యం కాలేదు.. ఇంకా నయం పూర్తిగా మర్చిపోలేదు.. లంచ్‌కు కలిసివెళదామనుకున్న విషయమే మరిచిపోవడమా.. శ్వేతతో.. ఈ శంకర్‌ గాడు రేపెట్టిన గొడవకి.. లైబ్రరీకి పదకొండుకే వస్తానంది.. బుక్స్‌ రెన్యూ చేయించుకుని వెయిట్‌ చేస్తూండాలి ఈ పాటికే..

ఏ షర్టు.. ఏ పాంట్స్‌. క్లోజెట్‌ను నింపేస్తూ ఒక పెద్ద కుప్పగా ఉతకాల్సిన బట్టలు.. మిగిలిన వాటిలో మంచివేవీ.. లేవు. ఆలస్యమై పోతూంది.. ఏదో ఒకటి.. పాత జీన్స్‌, కాల్విన్‌ గాడి తెల్ల టీ షర్టూ.. ఫర్లేదు.. నాట్‌ బాడ్‌! ఇన్ని సెంట్లలో ఏది కొట్టుకోవడం? మల్టిపుల్‌ చాయిస్‌.. పిక్‌ వన్‌..ఇవాళ్టికి కొంచెం టామీ గాడి స్ప్రే..

గొప్ప అందగత్తేమీ కాదు కానీ మంచి అమ్మాయే.. ఒకే ప్రాజెక్ట్‌లో పని మూలాన కలిసి లంచ్‌కి వెళ్ళడాలూ, జోకులూ.. కొద్దిపాటి స్నేహం.. అడుగు ముందుకు వేయొచ్చా.. ఇంటి దగ్గర్నుంచి వచ్చే ఫోటోల్లో వాళ్ళ కంటే ఏమంత తీసిపోయిందీ.. సంపాదిస్తుంది కూడాను.. ఇంటి దగ్గరొప్పుకుంటారా?.. తప్పదిక వాళ్ళకి.. నెలనెలా ఇక్కడ్నించి పంపే డబ్బు మహత్యం.. ముందు కొంచెం గొణిగినా సర్దుకుపోతారు..

పావు గంటలో పాతకాలపు లైబ్రరీ ముందు.. బయటెక్కడా లేదు. పార్కింగ్‌ లాట్‌లో కారు పార్క్‌ చేసి.. మరీ ఎక్కువ కార్లేమీ లేవు..ఎక్కడా శ్వేత కారు లేదు.. లేదు వాళ్ళ ఫ్రండ్‌ డ్రాప్‌ చేస్తుందని చెప్పింది కదా తన కారు రిపెయిర్‌ షాప్‌లో డ్రాప్‌ చేసి.. లోపల కూచుని వెయిట్‌ చేస్తానని కూడా..

అలికిడి లేదు లోపల..కౌంటర్లో ఇద్దరూ బిజీ..ఇద్దరెవరో టెర్మినల్స్‌ ముందు కూచుని కీబోర్డ్‌ టకటకల్తో.. అక్కడక్కడా టేబుల్స్‌ పైన పుస్తకాలు పేర్చుకుని సీరియస్‌గా పుస్తకాల్లోకి చూస్తూ.. శనివారప్పొద్దునే..ఏదీ శ్వేత.. పదకొండున్నరకే వస్తానంది.. ఇంకా రాలేదా..వచ్చి వెళ్ళిపోయుంటుందా.. పన్నెండున్నరవుతూంది.. శ్వేతకు సెల్‌ ఫోన్‌ కూడా లేదు..ఇంటికి కాల్‌ చేసి చూడొచ్చు.. వరసగా పుస్తకాల అలమరలు.. ఫిక్షన్‌. మిస్టరీ, పొయిట్రీ, నాన్‌ ఫిక్షన్‌. చిల్రన్‌. ఉండటమా.. వెళ్ళటమా.. వెళ్ళటమా.. ఉండటమా..ఎటునుంచి ఎటు తిప్పినా రెండే ఆప్షన్స్‌. చాలవు.. ఇక్కడ వెయిట్‌ చేయటం కష్టం.. బయటికి వెళ్ళి.. సెల్‌ ఫోన్‌లో శ్వేత నంబర్‌కు డయల్‌ చేసి..రింగయ్యీ అయ్యీ ఆన్సరింగ్‌ మెషీన్‌ ..”హాయ్‌ శ్వేతా! మీకోసం లైబ్రరీకి వచ్చాను. టైం పన్నెండు ముప్పావు. ఈ మెస్సేజ్‌ చూస్తే నా సెల్‌కు కాల్‌ చేయండి. మళ్ళీ రేపు కాల్‌ చేస్తాను!”

ఇప్పుడెటు.. అటా.. ఇటా.. తేడా ఉందా.. ఉంటుందా.. శ్వేత ఎటెళ్ళి ఉండొచ్చు?..ఈ వెధవ యీల్డ్‌ కాడు..రోడ్లన్నీ బిజీ అవుతున్నాయి.. ఈ 635 ఎప్పుడూ ఇంతే.. పిచ్చికుక్కల్లా కార్లు.. స్పోర్స్ట్‌ కారొకటి వేగంగా దూసుకుపోయింది లైన్లన్నిట్లోకీ మెలికలు తిరుగుతూ..  కారొకటి కొత్తది కొనాలి.. ఇది కొని అప్పుడే రెండేళ్ళయిపోయింది.. ఒక గమ్యం లేకుండా రోడ్డెంట పడి.. ఏర్‌పోర్ట్‌ దగ్గర పడుతూంది.. పైనుంచి వాలబోతూ ఇనప డేగలాంటి విమానం.. ఎవరైనా రాకూడదూ ఇవాళ.. గ్రేప్‌వైన్‌ మిల్స్‌ అవుట్‌లెట్‌ మాల్‌.కొంచెం కాలక్షేపం కావొచ్చు..అక్కడి ఫుడ్‌ కోర్ట్‌లోనే ఏదన్నా తింటే సరి.

మాల్‌ బయటా లోపలా ఒకటే జనాలు.. చేతుల్లో సంచుల్తో .. బరువుల్తో అలసిపోతూ.. బోర్న్‌ టు షాప్‌. శ్వేత ఎక్కడయినా కనపడుతుందా.. ఛ ఇక్కడెందుకు ఉంటుంది? ఎందుకూ కొనడానికే..

ముందు కడుపును శాంతింపజేయాలి.. ఫుడ్‌ కోర్ట్‌ నిండా ఒకటే జనం.. టేబుల్స్‌ అన్నీ నిండిపోయి.. ఏం తినడం.. పీట్జా..చైనీస్‌.మెక్సికన్‌.కేజన్‌. బర్గర్‌. అంతా వెగటు..ప్చ్‌ దేనిమీదా మనసు పోవడం లేదు.. ఇంటి దగ్గరే కాస్త పచ్చడో, యోగర్టో వేసుకుని తినొచ్చినా పోయేది.. ఈ మాంసాలు తినీ తినీ.. రోజూ ఎట్లా తినడం?

ఒక ప్లేట్‌ సలాడ్‌. బేకెడ్‌ పొటాటో.. బటర్‌. సౌర్‌ క్రీం.. చాలు.. మళ్ళీ కొద్దిసేపటికే ఆకలి వేయొచ్చు.. ఫర్లేదు ఒక పూటకి..

కొంచెం శక్తీ.. ఆసక్తీ.. ఇన్ని షాపుల్లో దేనికి వెళ్ళటం?.. ఎన్నో మహానుషాపులు.. ఎందులో దూరటం.. జేసీ పెన్నీ.. సేల్‌. సేల్‌.ఎగబడి కొంటున్నారంతా.. వొట్టి సేల్‌ బతుకులు..  20్త్ల.. 30్త్ల.. 50్త్ల.. 75్త్ల.. ఆఫ్‌. 100్త్ల ఆఫ్‌ ఎక్కడ.. అవును ఈ ఉదయం చొక్కా కోసం ఎంత ఆలోచించాల్సొచ్చింది.. ఓ రెండు కొంటే ఇంకో వారం బట్టలుతికిందాకా సరిపోతాయి..  ఈ షర్టు .. ఇది.. బ్లూ మీద ఎరుపు గళ్ళు.. అచ్చం ఇదే .. ఎప్పటి జ్ఞాపకం.. దీనికోసమేగా కిందపడి దొర్లి దొర్లి ఏడ్చి.. పక్కింటి కిషోర్‌ కొనుక్కున్నాడని.. తన్నులు తినికూడా వదలకుండా సాధించి.. ఎంత ఆనందం టైలర్‌నుంచి తెచ్చుకుని వేసుకున్న రోజున.. ఆకాశాన్నే చుట్టుకుని వొళ్ళంతా కప్పుకున్నట్లు.. ఆ మాటకొస్తే ఏ కొత్తచొక్కా అందులో సగమైనా ఆనందాన్ని అందివ్వనిది? ఇక్కడికొచ్చాక.. ఇన్ని చొక్కాల తర్వాత.. ఇవన్నీ కేవలం చొక్కాలే.. ఎన్ని చొక్కాలు మాత్రం సరిపోతాయి? ఇప్పుడు స్టేక్స్‌ పెరిగాయి.. కనీసం ఒక మిలియన్‌డాలర్లయినా అందులో సగమైనా కావాలిప్పుడు.. మళ్ళీ ఏ తెలిసినవాడికంటేనైనా ఎక్కువగా ఉండేట్లూ.. అలవాటయిపోతున్న సుఖాలు.. మామూలుగా తీరిపోతున్న కోర్కెలు..

రెండు చొక్కాలు.. ఇంకోటీ.. సేల్‌లో వస్తున్నాయి కదా పడి ఉంటాయి.. ఇదో జాడ్యం.. ఏం చేయటం.. నిస్సహాయంగా, ఎవరో బలవంతాన కొనిపిస్తున్నట్లూ.. ఇంకా రెండు పాంట్లు.. క్లోజెట్‌ చిన్నదయిపోతూంది.. వీసాకార్డ్‌ మీద ఛార్జ్‌ చేసి బయటపడి… ఇవాళ్టికీ షాపింగ్‌ చాలు.. రేపటిక్కాస్త అట్టిపెట్టుకుని..

అటూ ఇటూ పోతూ జనాలు.. జనాలే జనాలు.. రకరకాల మొహాలేసుకుని ఎవరి గొంతుకల్తో వాళ్ళు మాట్లాడుకుంటూ.. నవ్వుకుంటూ.. ఇట్లా చూస్తూ కూచోవచ్చు ఎంతసేపయినా.. ప్రవాహంలో కలిసిపోకుండా పడవ మీద కూచున్నట్టు ఈ బెంచ్‌ మీద కూచుని.. జంటలూ.. టీనేజర్లూ..కేరింతలూ పరుగులతో పిల్లలూ.. అప్పుడప్పుడూ స్ట్రోలర్‌లో చిన్న బేబీ, పక్కన తల్లితోటీ దేశీ మొహాలూ.. అమ్మావాళ్ళెప్పుడొస్తారో.. శ్వేత ఎటెళ్ళి ఉంటుంది.. అన్నయ్య వాళ్ళ పాప ఇప్పటికి ఇంతయినా పెరిగి ఉండాలి..  రాత్రికి ఇండియా ఫోన్‌ చేయాలి..

ఇక ఇక్కడ చేసేదేం లేదు.. మళ్ళీ దారిన పడి.. అటా.. ఇటా..బైనరీ డెసిషన్‌ ట్రీ.. పక్క కారు సర్రున దూసుకుపోతూంది మెత్తగా.. ఈ కారు లాభం లేదు.. పికప్‌ తక్కువ.. భోరున ఏడుస్తుంది కాస్తంత గ్యాస్‌ ఇస్తేనే.. కొత్త కారు కొనాలిక.. టీవీ చిన్నదయిపోతూంది.. పెద్దదొకటి కొనాలి.. సెల్‌ఫోన్‌ పెద్దదయిపోయింది.. చిన్నదొకటి.. ఇంకా చాలా చాలా కొనాలి.. ఒక అగాథాన్ని పూడ్చాలి.. ముందీ కారు..పక్కనే టొయోటా డీలర్‌. వీడికి నూరేళ్ళాయుష్షు..

కొత్తకార్లు మెరుస్తూ.. వరసగా మొహాల్న రేట్లు తగిలించుకుని.. అక్కడే గాలంలా వేళ్ళాడుతూ సేల్స్‌మన్‌. వాడికి పోయి చేపలా తగులుకుని..
“ఏ కార్‌ చూస్తున్నారు?” ముల్లు గుచ్చకుండా ఇంగ్లీషులో..
“కామ్రీ..”
“ఏ మోడల్‌. ఏ రంగు.. నే చూపిస్తా ఇటు రండి.. ”
“ఎక్స్‌ ఎల్‌ ఈ జఈ 6”
“మీరు భలే తెలివైన వారు.. టెస్ట్‌ డ్రైవ్‌ చేద్దురు పదండి మరి!”
వేషాలొద్దురా బాబూ.. నేనివాళ కొనను.. ఇంకా బోలెడు రీసెర్చ్‌ చేయాలి..
కార్లో కూచున్నాక..
“ఆన్‌ చేయండి.. శబ్దం వినిపిస్తుందా.. అదే మరి టొయోటా అంటే.. కొంచెం దిగండి.. ఇటొచ్చి హుడ్‌ కింద చూడండి.. ఈ లైనర్‌ చూశారా.. ”
“ముందు డ్రైవ్‌ చేసి చూస్తాను”
“పదండి మరి.. ఇదుగో ఈ బటన్‌ చూశారా.. దీన్ని నొక్కండి.. ఇది కొత్త ఫీచర్‌. మునుపటి కంటే మెరుగైనది.. ఆ బటన్‌.” వీడిక ఆగడు.. బట్టీ పట్టిన పాఠంలా దాని గుణగణాలన్నీ దేవుణ్ణి భక్తుడిలా కీర్తన.. ఉహు.. దీనికి సన్‌ రూఫ్‌ లేదు.. అక్కర్లేదు.. ఎప్పుడూ వాడకనేపోవొచ్చు..కానీ బాలిరెడ్డి కారుకి ఉంది కదా మరి..
“మరి ఇది నాకు అన్నం వండి పెడుతుందా.. కబుర్లు చెబుతుందా?” పెదాలు దాటిపోయిన మాటలు..
వెర్రి నవ్వు..”మీకు మంచి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉంది”
వాడిని వదుల్చుకునేసరికి అయిదు.. మళ్ళీ రోడ్డు మీదపడి..

ఇంకోసారి లైబ్రరీకి పోయి చూస్తే.. పుస్తకాల పురుగునని చెప్పుకుంది.. దారే కద.. పొద్దుటికంటే కాసిని ఎక్కువగానే ఉన్నాయి కార్లు.. రెండు బెన్జ్‌ కార్లూ.. ఒక బీమరూ..కొంతమంది కూచునీ.. కొంతమంది హడావుడిగా బీరువాల వరసల మధ్య తిరుగుతూ.. అదుగో శ్వేత..

తిరణాళ్ళలో తప్పిపోయిన వాడికి తల్లి కనిపిస్తే కలిగే ఆనందం లాంటిది కలిగింది. నా పెదాలు నవ్వుగా సాగటం తెలుస్తూనే ఉంది. పక్కనే పుస్తకాల దొంతర పేర్చుకుని తలొంచుకుని తదేక దీక్షతో చదువుతూ కూచుని ఉంది ఆఫీస్‌కు ఎప్పుడూ వేసుకురాని తెల్ల డ్రస్‌ వేసుకుని తెల్ల పావురంలా. దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తట్టాను టేబుల్‌ మీద. తలెత్తి చూసింది.

పక్కనే కుర్చీ జరుపుకుని కూచుని “పొద్దున రాలేదేమిటి మీరు? పన్నెండున్నరకు వచ్చాను నేనిక్కడికి!” చిన్న గొంతుకతో చెప్పాను.

ఆశ్చర్యంగా చూసి “నేనిక్కడే ఉన్నా పన్నెండు నుంచీ!” అంది.
“ఛ! యూ ఆర్‌ కిడ్డింగ్‌” నమ్మడం కష్టమవుతుంది నాకు.
“లేదు, నిజం! అప్పటినుంచీ ఇక్కడే ఉన్నాను!”
“అయ్యో! నేను మొత్తం తిరిగి చూశానే! అయినా అప్పట్నుంచీ ఇక్కడే ఎందుకున్నారు? కనీసం నా సెల్‌కు కాల్‌ చేయొచ్చు కద?”
“బహుశా నేనే బీరువాల వెనకో ఉండి ఉంటాను. అయినా మీ సెల్‌ నంబర్‌ నాకెప్పుడూ ఇవ్వలేదు మీరు!”
“అయ్యో, అయాం రియల్లీ సారీ! పొద్దున్నించీ ఏమీ తినకుండా ఇక్కడే ఉండిపోయారా నా మూలాన!” ఆకలితో వాడిన మొహం తెలుస్తూనే ఉంది.
“ఏం పర్లేదులెండి! ఇండియాలో అసలు శనివారం ఒంటిపూటే తినేదాన్ని. అయినా ఈ పుస్తకాలన్నీ మేస్తూనే ఉన్నాగా!” నవ్వుతూ అంది.
“నిజంగా మీకేమీ కోపం రాలేదు కదా నా పైన?”
“ముందొచ్చిందనుకోండి, ఈ పుస్తకాల్లో పడి మర్చిపోయాను. పోతే డిన్నర్కి మీరు త్వరగా తీసుకు వెళ్ళాలి.”
“తప్పకుండా!” నా గొంతులో ఉత్సాహంగా మారుతూంది గుండెల్లో సంతోషం.


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...