చంద్రరేఖావిలాపము

చందురుకావి పావడయు సైకపుబంగరువ్రాత చీరయున్‌
ముందల కుచ్చుగచ్చు తెలిమొగ్గల కంచెలమించు చేమపూ
గుందనపుం గడేలు వగగుల్కెడి క్రొమ్ముడి పట్టుబొందు సొం
పందెడు దాని మేని సొబగద్దిర నామది కొల్లలాడెడిన్‌

అని దురంత చింతాక్రాంత స్వాంతుండై

గ్రుడ్లు త్రిప్పును పండ్లు కొరుకును మూల్గును
నీల్గును మిగుల కన్నీరు నించు
అసురుసురను పింగుపిసికికొనును నోరు
మోదుకొనున్‌ లంజెముండ యిచటి
కేల వచ్చెను దాని నేలచూచి విరాళి
చెందితి ననుకొను చెడితి పడితి
నెవ్వరి పంపుదు నేరీతినదివచ్చు
యేమి సేయుదు దైవమిట్లు వెతల

పాలుగా జేసె సాటి నృపాలకోటి
లోన నగుబాటులయ్యె కాలూనరాని
విరహ పరితాప భరమున వేగ తరమె
అంచు పలవించు తలవంచు నార్తిగాంచు

తములంబు తినడు బోగమువారి నాడింప
డన్నంబు కుడువడు సన్నవన్నె
కోకలు కట్టడు కొలువు కూర్చుండడు
జలకమాడడు గందమలదుకొనడు
వేపులతో తాను వేటకు పోవడు
నడుపుకత్తెల కూడి నవ్వుకొనడు
వేంకటమఖి యజ్ఞవిధి కనుంగొనడు భా
గవతుల వేషవైఖరులు కనడు

కటకటా చంద్రరేఖా వికట కటాక్ష
వీక్షణాక్షీణ వాతూల విజిత దేహ
బాలభూరుహు డగుచున్న నీలనృపుడు
పరవశత లేచి వన లతా తరుల చూచి

కమ్మవిలుకాని తూపన
అమ్మఖశాలాంగణమున అగపడి చనె నో
యుమ్మెత్తకొమ్మ! నీవా
క్రొమ్మెత్తనిమేని సానికొమ్మం గనవే

వింటివొ లేదో శునకపు
దంటెము వలె బిర్రబిగిసి తలగని వలపుం
గొంటిని కనినది మొదలుగ
తంటెపుమోకా! యిదేమి తబ్బిబ్బో కా?

కప్పువిప్పు కలుగు గొప్ప కొప్పలరారు
అప్పొలంతి చొప్పు త్రిప్పు కిప్పు
డొప్పుమీర మీరు చెప్పరే గుప్పున
మెప్పులిత్తు నుప్పితిప్పలార!

మీరింద రొకటియై పొలు
పారం దిటమూన పల్కి యతిరయమున నో
కోరింద డొంకలారా
సారేందుముఖీలలామ జాడ తెలుపరే

మారార్తి నెంత వేడిన
మా రాకడ తెలియజెప్పి మారాడక యో
జోరీగలార మీరా
నారీరత్నమును తెచ్చి నాకొసగరుగా

చింతలనాటి కులీనుడ
చింతాసంతాప చలితచిత్తుడ నిను నే
చింతామణిగా నెన్నెద
చింతా! అక్కాంత తెరువు చెప్పుము నాకున్‌

వ్రణకిణాంకిత యోని గణికాలలామ నా
లోకింపరే తుమ్మ మ్రాకులార
తుంబీఫలసమాన లంబమానోరోజ
పొడగానరే పట్టకడుములార
యింగాళకంబళ శృంగారతర కేశ
పాశ నీక్షింపరే పాశలార
క్రకచదంష్ట్రాంకురాగ్ర మృదుత్వ సంయుక్త
దేహ కానరె తిప్పతీగలార

ఉష్ట్ర రదన చ్ఛదోపమానోష్టబింబ
నీడ చూడరె మీరు జిల్లేడులార
మర్దళసమాన విపరీతమధ్య చంద్రి
కాంచరే నిక్కముగ నేడు కారలార

పోడులమ్రోడులార కడు పూచిన పీతిరితుమ్మలార బల్‌
బాడిదచెట్టులార ఫలభాగ్‌ విషముష్టికుజంబులార ఆ
వేడుకకత్తె చిత్తమున వేడుకమీరగ వేగిరంబు మీ
నీడకు నీడకొక్కసరణిం పరతెంచదుగా వచింపరే

బెండా మూర్కొండా యా
దొండా మీ అండకిపుడు తోరముమీరన్‌
తాండవమాడుచు మేలిప
సిండందెలచంద్రి రాదె చెచ్చెర చెపుడా

నాకెదలోపల విరహము
చీకాగుగ చేయజొచ్చె చెచ్చెర నిపుడో
కాకీ ఘూకీ కేకీ
పూ కీదగుమేనిసాని పొడ చూపరుగా

కృకవాకులార మాద్య
త్కృకలాపములార గవయ కిశ శశ శునీ
వృకజాతులార బోగపు
సకియ లతల మిన్న చంద్రిసానిం కనరే

ఉరు తాప కరణ కారణ
వర తామరసాశుగములు వైచి మరుడు వి
స్ఫురితాంగి చూపుమిపు డో
యురుతా మామాట సేయనొప్పిన కొరతా