అయ్యవసరంబున
ప్రాతపుట్టముకట్టి పూతచెందిరవెట్టి
పాతచెప్పులుమెట్టి చేతగట్టి
కోలపోలుచుబూని చాల మద్యంబాని
ప్రేలుకొంచును గూను గ్రాల యోని
పుండ్ల కీగలువ్రాల చండ్లు బొడ్డున తూల
కండ్ల పుసులు కార రొండ్లు వ్రేల
నోర దేగుడు కార ఊర బేరము మీర
సారె పయ్యెదజారి యోరజేర
దారి నెముకుచు బడబడ దగ్గుకొనుచు
అపుడు వేంకటసాని నీలాద్రిరాజు
గొల్లెనకు నాతులటుపాయ కొనుచు లోని
కరిగి చేయెత్తిమ్రొక్కి యిట్లనుచు పలికె
నీబానిసతొత్తిది దయ
చే బాసలనిచ్చి చాల చేపట్టుమికన్
గాబాగూబిగ చేయక
నీ బంతిని కూడు కుడుపు నీలాద్రినృపా
అనిన నతం డత్యంత సంతోషస్వాంతుండై యట్ల చేసెదనని దానికిం బీతాంబరాదికంబు లొసంగి చంద్రియె లోకంబుగా మెలంగుచుండె
రతిజేసి యలసిన ధృతి దాని మన్మథా
గార ద్రవంబెల్ల కడిగి తుడుచు
ఆకుచుట్టియొసంగినది తమ్మలముసేయ
దమ్మ గైకొని నోరగ్రుమ్మి నమలు
అది మదిర కొనంగ నది మంచిదేయని
తచ్ఛేషహాల మోదమున త్రావు
నిదురించుతరి దాని పదములు తొడలు త్రి
కోణంబు సుఖముగా గ్రుద్ది పిసుకు
మెల్లనే దాని మంచము నల్లి చంపు
లావుగుబ్బల గందమలంది నిడుద
క్రొమ్ముడిని పూవుటెత్తులగూర్చు వలపు
కులుక నీలాద్రిభూపాల మలహరుండు
ఇల్లెరుగక పట్టెరుగక
యెల్లధనము దానికిచ్చి యెగ్గును సిగ్గున్
చెల్లగ తత్పాదద్వయ
పల్లవముల దండ మురిసిపడి కాపుండెన్
పుడమిపై గూదలంజెకు బుడ్డవేడ్క
కాడనెడు మాట చంద్రరేఖకును నీల
ధరణివరునకు చెల్లెను తత్కథా వి
ధాన మెరిగించితిని నీకు తథ్యముగను
అనుచు తంబళ వీరభద్రార్యమణికి
నంబి నరసింహు డతులితానంద హృదయ
కమలుడై చెప్పి యంతట సముచితగతి
నతని వీడ్కొని చనె దేవతార్చనకును
వాచాగోచరముగ భువి
నాచంద్రార్కంబు కాగ హాస్యరసముచే
నా చంద్రరేఖ కథయును
నీ చరితము చెప్పినాడ నీలనృపాలా
ఈ కృతికి సమముగా కృతి
నే కవులును చెప్పజాల రిది బిరుదము భూ
లోకము రాజులలోపల
నీకు దొరకె హాస్యలీల నీలనృపాలా
ధరణియు మేఘమార్గమున తారలు తామరసాప్త చంద్ర ది
క్కరటి గిరీంద్ర శేషఫణి కంధి కిటీశ్వర కూర్మనాయకుల్
స్థిరముగ నెంతకాలము వసింతురు తత్క్రియ నీ ప్రబంధ ము
ర్వర సరసోత్తముల్ కవులు వర్ణనసేయగ నుండుగావుతన్
చేటీ వధూటికా కుచ
కోటీ సంలబ్ధ విపుల కోమల పంకో
త్పాటనకర ఖరనఖర ని
శాటోపమ ఘోరరూప ఆర్యదురూపా
రాచిరాజాన్వయా రామదావానలా
యాచకాస్తోక మేఘౌఘ ఝంఝానిలా
నీచవారాంగనా నిత్యరత్యాదరా
పాచకాధార నిర్భాగ్యదామోదరా
ఇది శ్రీమజ్జగన్నాథదేవ కరుణాకటాక్ష వీక్ష ణానుక్షణ సంలబ్ధ సరసకవితా విచిత్ర సలలితాపస్తంబసూత్ర కౌండిన్యసగోత్ర కూచిమంచికుల పవిత్ర గంగనామాత్యపుత్త్ర మానితానూన సమాన నానావిధరంగ త్రిలింగదేశభాషా విశేష భూషితాశేషకవితా విలాసభాసు రాఖర్వ సర్వలక్షణసార సంగ్రహోద్దామ శుద్ధాంధ్ర రామాయణప్రముఖ బహుళప్రబంధ నిబంధనబంధురవిధాన నవీనశబ్దశాసన బిరుదాభిరామ తిమ్మకవిసార్వభౌమసహోదర గురుయశోమేదుర వివిధవిద్వజ్జనవిధేయ జగన్నాథనామధేయ ప్రణీతంబైన చంద్రరేఖావిలాపంబను హాస్యరసప్రబంధరాజంబునం తృతీయాశ్వాసంబు సర్వంబును సంపూర్ణము.