కారు వెళ్ళిపోయింది
వాళ్ళు వదలి వెళ్ళిన పూలబుట్ట చుట్టు
జుయ్యిమంటూ కందిరీగలు
కింద పడున్న క్యూటీక్యూరా పవుడర్ డబ్బా
బయట వాన తుంపర్లు
రెక్కలు విదిలించుకొంటూ కొమ్మపైన ఒక పక్షి
ఆకులనుండి అశ్రువులలా జారే నీటి ముత్యాలు
కడుపులో లేమి సెగలు
మనసులో కొలిమి పొగలుతెలియక కోకిల గుడ్డును తన గూటిలో పొదిగే కాకి
తెలిసి చేసిన ఈ కాకి చివరకు ఏకాకి
ఈ పొదుగు గడ్డకట్టుకొంటుంది
ఈ గూటినుండి పారిపోయిన పిల్లకోకిల
ఆ గూటిలో ఆమని గీతాలు పాడుతుంది
కాకిలాటి చీకట్లో స్మృతిదీపాలు
ఇంట్లో మాత్రమే కాక ఒంట్లో కూడ
ఆతిథ్యాన్నిచ్చిన తల్లి కాని తల్లి
తన పిల్ల కాని పిల్లను మళ్ళీ ముద్దాడాలనే ఆశ
మిగిలిందల్లా మమతల మరీచికలు
మాయని శేషప్రశ్నలు