మాంధ్రలక్షణలక్ష్యంబు లరసినావు
భూరిరాజన్య సంపత్ ప్రపూజితుడవు
భళిర నీ భాగ్యమహిమ చెప్పంగ తరమె
జగ్గరాజ కవీంద్ర వాచాఫణీంద్ర
అర్ణవమేఖలం గల మహాకవికోటులలోన నెంతయున్
పూర్ణుడవీవు సత్కవిత; బూతులరీతుల గోరు కొండగా
వర్ణనసేయ నేరుతువు వాతెము జుల్కగ పల్కు మూర్ఖులన్
తూర్ణమె తిట్టి చంపుదువు ధూర్తవు, పౌరుషశాలివెంతయున్
నిర్ణయ మిత్తెరంగెరిగి నేర్పున నిన్ను బహూకరించినన్
స్వర్ణవిభూషణాంబర గజ ధ్వజ చామర గోధనాశ్వ దు
ర్వర్ణ విచిత్ర పాత్ర బహురాజ్య రమారమణీయపుత్ర సం
కీర్ణ సమస్తవస్తు వర గేహ సమంచిత భోగభాగ్యముల్
కర్ణసమానదానము నఖండపరాక్రమశక్తి, నిత్య దృ
క్కర్ణ కులీన వాగ్విభవగౌరవ మాశ్రితబంధురక్షణో
దీర్ణ కృపారసంబును నతిస్థిరబుద్ధి, చిరాయువున్, సుధా
వర్ణయశంబునున్ కలిగి వర్ధిలజేతువు జగ్గసత్కవీ
అని యనేకప్రకారంబులం గొనియాడి యీడులేని వేడుకం చంద్రరేఖాభిధాన వార వారణరాజయాన యూరుప్రదేశంబున శిరంబు మోపి పరుండి క్రిందు చూచుచు నా రాజాత్మజుండిట్లనియె
వేంకటశాస్త్రులు మాకు న
లంకారగ్రంథమొకటి లలి సురభాషన్
బంకించె ఆంధ్రకావ్యం
బంకిత మొనరింపు మీవు నట్లనె మాకున్
అని మున్ను సత్ప్రబంధం
బొనరింపుమటంచు చెప్పియుంటిమి వెస న
ట్లనె రసముగ చెప్పితి వది
గొన నిపుడు ధనంబు లేదు కొదువ లభించెన్
విను మదియెట్లన మనుజులు నామీద
బిట్టుగ చలమూని విజయరామ
ధరణీశుతో చెప్ప దండుగ పన్నెండు
వేలరూపాయలు వేగగొనియె
నిచ్ఛాపురంబులో నేనొక్క లంజతో
భోగించి నిద్దుర బోవ చోరు
లెలమి డేరా చొచ్చి బలువైన గుఱ్ఱంబు
వెండిపల్లము పదివేలవరాల
సొమ్ము దొంగిలిపోయిరి సొమ్ముపక్కి
సాటిదేశంబు రాయభూషణుడు ద్రొబ్బె
తప్పె భాగ్యంబు నిర్భాగ్యదశ లభించె
తవిలి సత్కృతి గొన పదార్థంబు లేదు
అదియునుం గాక
సత్కృతులు మున్ను రాజు లసంఖ్యగాగ
నంది రవియెల్ల జగతి నందంద యణగె
ఘనత జగదేకవిఖ్యాతి కలుగదయ్యె
వ్యర్థమయ్యె పదార్థంబు వారిదెల్ల
అపకీర్తియు కీర్తియు భువి
నెపుడుం పోకుండు; కీర్తి కియ్యగవలయున్
విపులముగ ధనము; మాకిపు
డుపకారము గాగ చెప్పు మొకకృతి సరగన్
చెప్పిడుము హాస్యరసముగ
గుప్పున ముందెవరు చెప్పుకొననిదిగా
ఇప్పుడు నాకును నొప్పుల
కుప్పకు ఈ చంద్రరేఖకును ముదమొదవన్
గంగి సుమీ మును పేరున
భృంగి సుమీ నాట్యకలన పేర్కొన మరు సా
రంగి సుమీ దీనమ్మను
దెంగి సుమీ కామరతుల దిట్టడనైతిన్
వారకన్యక యని నీవు కేరవలదు
దీనితో నాకు నేస్తంబు పూన జేసి
కడకమై నాడిమళ్ళ వేంకటమనీషి
దీనితల్లిని విషయించు దృష్టికలన
బోగమువారందరు న
చ్చో గుంభనమెసగ వచ్చిచూడగ నతడా
యాగాయతనము లో సం
యోగము గావింపజేసె నొగి నిర్వురకున్
ఆతనికి కూతురగుటన్
చాతుర్యమెలర్ప నేర్పె చౌశీతిగతుల్
ఖ్యాతిగ నిది నా మదికిన్
చేతస్సంజాత సుమవిశిఖమై నాటెన్
దీని మొగంబు డంబు మరి దీని విలంబకుచంబు లందమున్
దీని ఘనోరుకాండయుగ దీర్ఘవికీర్ణసుకేశపాశమున్
దీని మధుప్లతాధరము దీని మహోన్నత రోమరాజియున్
దీని సుబాహుమూలరుచి తెల్లమ నాకెదబాయ వెప్పుడున్
సానుల గూడనో మునుపు చక్కని చిక్కని నిక్కు ముక్కు పె
న్యోనుల చూడనో కడు సముజ్వల పంకజపత్త్ర విభ్రమా
నూన విలాసపేశల మనోహర యోనికి సాటిసేయగా
కానగరాదు వస్తువది కన్నుల కట్టిన యట్ల తోచెడిన్
చంద్రబింబస్ఫూర్తి చౌకసేయగ చాలు
ముద్దుగారెడి నవ్వుమోము తోడ
కలువరేకులడాలు కడకొత్తగా చాలు
తోరంపు నిడుదకందోయి తోడ
కరటికుంభంబుల పరిభవింపగ చాలు
కర్కశకుచయుగ్మకంబు తోడ
బంధుజీవముల తోడ ప్రతిఘటింపగ చాలు
రాగసంయోగాధరంబు తోడ
సొగసు కులుకంగ నుపరతి చొక్కజేసి
కొసరి నా మానసంబెల్ల కొల్లలాడి
నన్ను దాసునిగానేలె నన్నిగతుల
దీని వర్ణింపుమా రసోదీర్ణముగను