(శ్రీ “సుజ్ఞేయశ్రీ” గారు ఇండియాలో తెలుగు సాహిత్య విమర్శకుడిగా చాలా అనుభవం ఉన్నవారు. ఐనా కొన్ని కారణాల వల్ల అజ్ఞాతంగా ఉండాలని కోరుతున్నారు. చాలా కాలంగా మేము అమెరికా తెలుగు సాహిత్యం గురించి నిర్మాణాత్మక విమర్శల కోసం ఇక్కడి అనుభవజ్ఞులని ఎంతగా అడిగినా వాళ్ళకున్న పరిధుల వల్ల ఎవరూ అందుకు ముందుకు రాలేదు. అమెరికా రచయిత(త్రు)ల గురించి మాకు దొరికిన సమాచారం అంతా పంపి ఇండియాలోని ఈ విమర్శకుడిని విశ్లేషణాత్మక వ్యాసాలు రాయమని కోరాం. ఇది మొదటి వ్యాసం. ముందు ముందు ఇంకా లోతుగా విశ్లేషించే వ్యాసాలు ఈ వ్యాసకర్త నుంచి మేము ఆశిస్తున్నాం. అమెరికాలోని వారెవరైనా ఇలాటి నిర్మాణాత్మక వ్యాసాలు రాసి అజ్ఞాతంగా ప్రచురించమంటే అందుకు మాకు ఏమీ అభ్యంతరం ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంపాదకులు)
ఉత్తర అమెరికాలో తెలుగువారి సంఖ్య పెరుగుతున్నట్లుగానే తెలుగు రచయితల సంఖ్య, తెలుగు ప్రచురణల సంఖ్య పెరుగుతున్నాయి. మొదట్లో తెలుగు భాషా పత్రిక, తెలుగు అమెరికా వంటి జాతీయస్థాయి పత్రికలతోనూ, చికాగో తెలుగువెలుగు, హ్యూస్టన్‌మధురవాణి వంటి ప్రాంతీయ పత్రికలతోనూ మొదలైన ఈ సాహిత్యసేవ, ఇప్పుడు రెణ్ణెళ్ళకొకసారి తానాపత్రిక, అమెరికా భారతి, తెలుగుజ్యోతి వంటి పత్రికలూ, అప్పుడప్పుడూ వచ్చే ప్రాంతీయ తెలుగు సంఘాల పత్రికలూ, ఏడాదివిడిచి ఏడాది తానా,ఆటా ప్రచురించే సావనీర్లతో మూడు పూవులూ, ఆరుకాయలుగా వర్ధిల్లుతూంది. వీటికితోడు కథలూ, నవలలూ, కవితల పోటీలు నిర్వహిస్తూ 1995లో మొదలెట్టి 1998 వరకూ, అయిదు అమెరికా తెలుగు కథానికల సంపుటాలూ, రెండు అమెరికా తెలుగు కవితల సంపుటాలూ డాక్టరు పెమ్మరాజు వేణుగోపాలరావుగారి సంపాదకత్వంలో వంగూరి ఫౌండేషన్‌వారు ప్రచురించారు. ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన “రచన” తెలుగు సాహిత్యపత్రిక జన్మదినసంచికలో అమెరికా తెలుగు రచయితల ప్రత్యేక విభాగం అంటూ అమెరికాలో తెలుగువారి రచనలు చాలా వేశారు. దాదాపు ప్రముఖ తెలుగు పత్రికలన్నిటిలోనూ అమెరికా తెలుగువాళ్ళ కథలూ, కవితలూ పడుతూనే వున్నాయి. ఇంతే కాక ఈమాట, తెలుసా వంటి సైబర్‌యుగం పత్రికలూ, వేదికలూ కూడా అమెరికావారి తెలుగు సాహిత్య ప్రచురణకి వీలు కల్పిస్తున్నాయి.
ఈ సాహిత్యవ్యాసంగంలో ఎక్కువగా కన్పించేది మనం కథానిక అని పిలుచుకునే చిన్న కథ. దాదాపు ముప్పయ్యేళ్ళ నుండీ అమెరికాలో ఉన్న తెలుగు రచయితలు కథలు వ్రాస్తూనే ఉన్నారు. డబ్భయ్యో దశకంలోనే శ్రీరాం పరిమి కథలు ఒకటో రెండో యువలో ప్రచురించబడినట్లు గుర్తు. ఈవారంలో (అక్టోబరు 1999 ఆఖరివారం) డాక్టర్ కేవియెస్ రామారావుగారి కథలు రెండు పత్రికలలో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ వారపత్రికలలో ఒక్కసారే ప్రచురించబడటం చెప్పుకోదగిన విశేషమే.
(పై సమాచారం అందించిన శ్రీ జంపాల చౌదరి గారికి కృతజ్ఞతలు రచయిత)
అమెరికా తెలుగు కథకుల్లో ముందుగా చెప్పుకోవల్సిన వాళ్ళు ఇద్దరు “వే.వే.”లు– వేలూరి వేంకటేశ్వర రావు, వేమూరి వేంకటేశ్వర రావు. ఇద్దరూ విస్తృతంగా చదివినవాళ్ళు, తక్కువగా వ్రాసినా చాలా చక్కగా వ్రాసిన వాళ్ళు. మంచి వస్తువును ఎన్నుకోవటం, సరళమైన శైలిలో వ్రాయటం, చదువుతున్నప్పుడు ఆనందాన్నీ, చదవటం అయిపోయాక మెదడుకు మేతనీ ఇవ్వటం వీరి కథల్లో ప్రత్యేకతలు. కొద్దిగా వెటకారాన్ని మిళాయించి అమెరికా తెలుగు జీవితపు భేషజాలమీద విసుర్లు విసరడం వేలూరి వారి ప్రత్యేకత అయితే, కథలు చెప్తూనే వాటిలో గప్‌చుప్‌గా సైన్సు పాఠాలు కలిపెయ్యడం వేమూరి వారి చమత్కారం. వేలూరిగారి మెటమార్ఫాసిస్ బంగారయ్యభేతాళయ్య, వేమూరివారి పంటికింద పోకచెక్క, బ్రహ్మాండం బద్దలయ్యింది మొదలైన కథలు అమెరికా తెలుగు కథకి పేరు తెచ్చిన కథలు. వీళ్ళిద్దరి కథలనూ విడివిడి సంపుటాలుగా వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించటం ముదావహం.
తనదంటూ ఒక్క ప్రత్యేకతని చాలాకాలంనుంచి నిలపెట్టుకుంటూ వస్తున్న ఇంకో రచయిత వంగూరి చిట్టెన్‌రాజు. ఎప్పుడో వ్రాసిన జులపాల కథ, ఈ మధ్యే వ్రాసిన దంతవేదాంతం కథ అమెరికా తెలుగు జీవనంలో బారిస్టర్‌పార్వతీశం మార్కు హాస్యాన్ని కొద్దిగా మిళాయించేసి, అమెరికా హాస్య రచయితల్లో అగ్రగ్రణ్యుడిగా ఈయన్ని నిలబెడతాయి. అయితే హడావిడిగా వ్రాయడం మూలానో, మరెందువల్లనో గాని, అప్పుడప్పుడూ కొన్ని కథల్లో హాస్యమూ, కథా రెండూ తక్కువైపోయి, కొద్దిగా క్వాలిటీ కంట్రోల్ చూసుకుంటూ వుంటే బాగుణ్ణు అనిపించిన సందర్భాలు ఉన్నాయి.
అమెరికాకు రాకముందూ, వచ్చాకా, చాలా కథలు వ్రాసిన మందపాటి సత్యం అమెరికా తెలుగు కథకుల్లో ముఖ్యులే. ఈయన కొన్ని మంచి కథలు వ్రాశారు (మతమా నీ విలువెంత, కొన్ని భేతాళ కథలు వగైరా). సాధారణంగా ఈయన కథలు సింపుల్‌గా, ఒక్క పాయింటుని తీసుకుని వ్రాసినవై ఉంటాయి. అయితే కథద్వారా చెప్పాల్సిన విషయాన్ని కథలో పాత్రల సంభాషణలు (కొండొకచో ఉపన్యాసాలు) ద్వారా చెప్పటం అప్పుడప్పుడూ ఇబ్బంది పెడ్తూంటుంది.
మాచిరాజు సావిత్రి అమెరికా తెలుగుజీవితమ్మీద మంచి విశ్లేషణాత్మకమైన కథలు వ్రాశారు. చాలాకాలం అమెరికాలో ఉన్న అక్కినాపల్లి సుబ్బారావు తెలుగు, అమెరికా జీవితాలగురించి విడివిడిగానూ, కలసికట్టుగానూ కొన్ని మంచి కథలు వ్రాశారు.
కథనశైలిలో అద్భుత ప్రతిభతో అందమైన వాక్చిత్రాలు నిర్మించగల ప్రతిభగల రచయిత కనకప్రసాద్. ఇంతటి ప్రతిభనూ కనకప్రసాద్ ఈ మధ్యకాలంలో అనుసరణలకే పరిమితం చెయ్యడం కొద్దిగా బాధాకరమైన విషయమే. ఇవి అనుసరణలనీ, తాను స్వయంగా తెలుగులో రాసిన కథలు కాదనీ తను చెప్పితేకానీ తెలియకపోయేంతగా వ్రాయగలగటం కనకప్రసాద్ నైపుణ్యం. అవి అనుసరణలని నిజాయితీగా ఎప్పటికప్పుడు చెప్పెయ్యడం అతని పెద్దతనం.
సీయస్సీ మురళి, వెల్చేరు నారాయణరావు కొన్ని మంచి కథలు వ్రాశారు కానీ అవన్నీ అమెరికా రాకముందు వ్రాసినవి అనిపిస్తుంది. ఎప్పట్నించో కథలు వ్రాస్తున్న కన్నెగంటి చంద్రశేఖరరావూ, ఈమధ్యే విస్తృతంగా వ్రాయటం మొదలెట్టిన కేవియెస్ రామారావు, నాసీ (ఎస్.నారాయణస్వామి) మంచికథలే వ్రాస్తున్నారు.
అమెరికా కుటుంబ జీవితాన్ని వస్తువుగా తీసుకొని పూడిపెద్ది శేషుశర్మగారు కొన్ని ఆలోచనాత్మకమైన కథలు వ్రాశారు. చెరుకూరి రమాదేవి, మాలెంపాటి ఇందిరా ప్రియదర్శిని, సుధేష్ణ, నోరి రాధిక, కొవ్వలి జ్యోతి మొదలైన రచయిత్రులు విరివిగా కథలు వ్రాశారు. ఇంకా ఎందరో రచయితలూ, రచయిత్రులూ ఉన్నారుకానీ, అందర్నీ పేరుపేరునా పరిచయం చేసి విశ్లేషించటం ఇక్కడ కుదరని పని.
కథలు విరివిగా వస్తున్న మాట నిజమేగాని, ఈ కథల్లో మంచి కథలు ఎన్ని వస్తున్నాయి అన్నది విచారించాలి. మంచి కథ అంటే పాఠకులతో ఉత్సాహంగా చదివించేది అన్న నిర్వచనమిచ్చినా, లేదా పాఠకులు చాలాకాలం గుర్తుంచుకొనేదీ అన్న నిర్వచనమిచ్చినా, అమెరికా తెలుగు కథలలో మంచి కథలకన్నా మామూలు కథలే ఎక్కువ (ఈమాట ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రచురితమయ్యే కథలకూ వర్తిస్తుందనుకోండి. అది వేరే విషయం).
1995లో వెలువడిన అమెరికా తెలుగు కథానిక మొదటి సంపుటంలో, అప్పటివరకూ అమెరికాలో వచ్చిన మంచికథలన్నిటినీ కూర్చి ప్రచురించారు (ఆ తర్వాత సంపుటాల్లో కథలు ఏ సంవత్సరం పోటీలలో వచ్చినవి ఆ సంవత్సరం వేసినట్లు కన్పిస్తుంది). ఎంచికూర్చిన కథలే ఉన్న ఆ మొదటి సంపుటంలో కథలు కూడా అమెరికా తెలుగు కథానికల తీరుతెన్నులకు అద్దం పడుతున్నాయి. ఆ సంపుటంలో కొన్ని మంచి కథలూ, కొన్ని సింగిల్‌పాయింటు కథలూ, కొన్ని పాయింట్‌లేని కథలూ, ఇంకొన్ని అసహజమయిన కథలూ కనిపిస్తాయి. అలాగే చక్కటి పలుకుబడితో వ్రాసిన కథలూ, కృతకమైన భాషలో వ్రాసిన కథలూ ఉన్నాయి. మొదటి సంపుటంలో మంచికథల పాలే ఎక్కువగా ఉన్నా, ఆ తర్వాత సంపుటాలలో అంతగా బాగుండని కథలే ఎక్కువ.
అమెరికా తెలుగు కథానికల్లో చాలా వాటిని చూస్తే, కొద్దిగా నిరుత్సాహం కలుగుతుంది. కొన్ని కథలు బొత్తిగా సెకండ్‌రేటు కాలేజీ మేగజైనుల్లో థర్డ్‌రేటు కథల్లా ఉంటున్నాయి. చాలామంది రచయిత(త్రు)లకు మంచిసాహిత్యంతో పరిచయం తక్కువ, మంచి కథ లక్షణాల గురించి వారికి తెలియదు అనిపిస్తుంది. ఏదో ఒకటి రెండు సంఘటనలను గురించి వ్రాసిన మాత్రాన అది కథ అయిపోదని చాలామంది గుర్తిస్తున్నట్లు కనిపించదు. కథంటే చేంతాడంత సంభాషణలూ, ఉపన్యాసాలూ అనే ఒక భ్రమ ఉన్నట్లుంది. కథకు ఆదిమధ్యాంతాలుంటాయి, ఆ మూడు భాగాల్నీ శ్రద్ధగా నిర్మించాలన్న అవగాహన అప్పుడప్పుడూ మృగ్యం. భాష, శిల్పం విషయాల్లో కొందరు రచయిత(త్రు)లు ఏమాత్రమూ శ్రద్ధ చూపించటంలేదు. కథలో కొత్త అంశం ఏమైనా ఉందా అనిగాని, తాము సృష్టిస్తున్న సంఘటనల్లో సహజత్వం ఏ మాత్రమైనా ఉందా అని గాని ఆలోచిస్తున్నట్లు కనబడదు.
సమాజంలో ఉన్న సమస్యల్ని (అమెరికాలోవి కానివ్వండి, ఇండియావి కానివ్వండి) వస్తువులుగా తీసుకున్నప్పుడు, ఆ సమస్యల గురించి లోతుగా ఆలోచిస్తున్నట్లు కనబడదు. జటిలమైన సమస్యలక్కూడా పైపై సూపర్‌ఫిషియల్ తెలుగు సినిమా మార్కు పరిష్కారాలు చెప్పేయడం మామూలు. ఈ కథల్లో చాలావాటికి మహా ఉంటే ఒక పాయింటుంటుంది, అప్పుడప్పుడూ అదీ ఉండదు. కేరక్టరైజేషన్‌పట్ల శ్రద్ధగురించి అడగనక్కరలేదు. బహుకొద్దిమంది తప్పించి టెక్నిక్‌తో ప్రయోగాలు చేసే ప్రశ్నే లేదు. టెక్నిక్‌గురించి విపరీతంగా కబుర్లు చెప్పే కుర్రాడి కథలూ విపరీతంగానే ఉన్నాయి.
ఈ సమస్యలన్నీ అమెరికా తెలుగు కథానికకు మాత్రమే పరిమితమైనవి కాదు. ఆంధ్రదేశంలో ప్రచురితమవుతున్న చాలా కథల పరిస్థితీ ఇలానే ఉంది. అయితే అమెరికాకు ప్రత్యేకమయిన సమస్య ఏమిటంటే తోటి సాహితీకారుల రచనలపై తమ అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పటానికి విమర్శకులకూ, సంపాదకులకూ బహు మొహమోటం. ఈ సాహిత్య ఎడారిలో ఇన్ని తుప్పల మధ్య కొద్దిగా బాగున్న ఆముదం చెట్లను చూసినా విమర్శకులకు మెచ్చుకోబుద్ధవుతుంది. అయితే ఆ మెచ్చుకోళ్ళూ, మొహమోటాలకూ ఉన్న పరిధిని గమనించకుండా, మహావృక్షాలమన్న భ్రమలో పడిపోవటం మామూలయిపోయి, పెరుగుదల ఆగిపోవటం ఒక ఇబ్బందికరమైన ధోరణి.
కథకు వస్తువు ముఖ్యం; సహజత్వం లేని కథ రాణించదు; కథకు ఎత్తుగడ, నడక, ముగింపు మూడూ ముఖ్యమైన భాగాలే; భాష, శిల్పం, పాత్ర చిత్రణ బాగుండకపోతే కథ మంచికథ కాదు; కథలో విషయమంతా విప్పిచెప్పే ఉపన్యాసాలు కొద్దిగా తగ్గించి, పాఠకుల్ని ఆలోచింపచేయగలగాలి అనే మౌలికమైన విషయాల్ని రచయితలు గుర్తించినప్పుడు ఇంకా చక్కటి కథలు రావచ్చు. వివిధ తెలుగు ప్రాంతీయ కథలకు గుర్తింపు వచ్చినట్లే అమెరికా తెలుగు కథకూ అప్పుడు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది.