అని భీమరాజు పలికిన
విని మనమున సంతసించి వేడుకతో ని
ట్లనియెను చంద్రిని వేగం
బనుకూలము సేయకున్న హా యెట్లోర్తున్
కోకిల కీర శారికల కూకలకున్ కలహంస కేకినీ
భీకర నిర్భరార్భటికి పెగ్గిలితిన్ మరి చెప్పనోప నెం
దాక సహించువాడ వెస దానిత్రికోణము తెచ్చిచూపుమా
నా కెదలోని మన్మథ కనద్ ఘన పావకతాప మారగన్
మరి విచారింపనది ఆడిమళ్ళ వేంక
టాభిధాన త్రజాపతి అంశ పుట్టె
సకల రతిబంధ చాతుర్యసరణి కనియె
పూని వర్ణింప దాని కేసాని సవతు?
కావున వేంకటశాస్త్రికి
నా వలపెరుగంగ చెప్పినను నాతడు తా
నావలిపని సమకూర్చును
వేవేగమె భీమరాజ విచ్చేయవయా
అని చెప్పి
పనిచిన నాతడేగి కనె భంజిత నీలతరాజకాయ సం
జనిత కరోటికూటము వసాస ఘృత ప్లుత సత్పలాశ మాం
స నికర వర్ధమాన విలసత్ పటు వహ్నిశిఖాప్రభాట మ
త్యనుపమ మంత్రతంత్రకర యాజక ఝాటము యజ్ఞవాటమున్
కనుగొని తచ్ఛాలాంతర
మున దక్షుడుబోలె దజ్ఞ ముగ్రంబున తా
నొనరించు వేంకటమఖిన్
చనవున కని రాజకార్యసంగతి తెలిపెన్
తెలిపిన మఖి అత్యంతము
పులుపువొడమ భీమమంత్రి పుంగవ వెస తా
తలచిన పని సమకూర్తును
చెలిమి వెలయ నీ మఖంబు చెల్లిన పిదపన్
దాతయు దైవము నేతయు
ఏతీరున కన్న నతడె యెప్పుడు కానన్
నీతోడు భీమరాజా
ఆతని పనిసేయు టుచితమగు గద మాకున్
అని రాజుగారి కంతయు
వినయంబున తెలుపుమనుచు వేడిన నతడున్
చని యట్ల చెప్ప నీలా
వనివిభుడు గుడారమునను వనరుచునుండెన్
అనంతరంబున నయ్యారామద్రావిడ బాడబాగ్రగణ్యుండగు వేంకటసోమపీథి నిరతపర్యుషి తాన్నదానవిధాన సంక్రుద్ధ సుప్రసిద్ధ వృద్ధ భూమీసుర వారా నివారిత భూరితర దారుణ భాషావిశేష దూషితంబును ప్రచండతర చండాలసరోవర పరిసర పరికల్పితానల్ప విశాల శాలాతట తటుల కుటిలాచ్ఛ మత్స్యపుచ్ఛాచ్ఛాదిత కృపీట సంపాద్యమా నాహీన పురోడాశప్రము ఖాయోగ్యవస్తు యాగభాగాను రాగారహిత విహిత మహిత బృందారకబృందంబును యథావిధివన్నిర్ధారిత దక్షిణాక్షీణ పదార్ధ వంచనాగుణ నిరస్తోత్సాహ సాహస ధావన్మహాసోమయాజి విరాజితంబును జామాత్య మూర్ఖ మహాకఠినవాక్య తర్జన భర్జన పలాయిత సకలదేశ సమాగత వివిధ విప్రప్రకరంబును పరమ పరిహాసక పరికల్పిత స్వచ్ఛచ్ఛాగ నాదామోదిత వేదితలాంతర పరివర్తిత ధూర్త పండిత పామరజన సమూహంబును బ్రాహ్మణార్ధ సంపాదిత బహుళ సత్ఫల శాక పాక భక్ష్య భోజ్య దధి ఘృత గుడాదిక వస్తుస్తోమ చౌర్యక్రియాకౌశల యాతాయాతాతతాయి శ్రేష్ఠ కుమారనారాయణశాస్త్రి విశ్రుతంబును సంభావనా సంభ్రమాలోకనార్ధ సమాగత వితత వారాంగనా భుజంగపుంగవ శృంగార కేళీగృహాయమాన శాలా సమీప ప్రదీప్త విశాల కాయమాన నికాయంబును విపులా పూపశరావోపమానూన పీనోపస్థాస్థల వికీర్ణాస్తోకానేక దీర్ఘతర శ్యామల కోమల రోమస్థోమోద్ఘాటన పాటవ ప్రోల్లసద్బాలవిధవా విరాజితాంతర్గేహంబును విదార్యమాణ పశు విసర కళేబర సంజనిత ఘనతర క్షరిత క్షతజ ప్రవాహా బిందుసందోహ గ్రసన వ్యసన సంభ్రమ భ్రమద దభ్ర శుభ్ర గృధ్ర కాక ఘూక కంక కౌలేయక గనయ గోమాయ ప్రముఖ వన్య ఖగ మృగజాల కోలాహల బధిరీకృత జనసమూహంబును పరమ నిర్భర నిర్భాగ్య దామోదర దురోదర మృగయావినోదామోదౌఖ నీలాద్రినృపాల బాలిశ దుష్కర కరాగ్ర సమర్పిత యాగఫల దానధారాపూరంబునుంగా క్రతువు సమాప్తంబు గావించి జన్నంబు బన్నంబు లేకుండ కడతేరె మదీయపుత్త్రియు నిజముఖ కళావిలాస తిరస్కృత చంద్రరేఖయగు చంద్రరేఖను కోమలాలంకారభవ్య యగు నా కావ్యకన్యకకును నుత్తముండగు నీలాద్రినృపుండు వరుండయ్యెడు సమయంబునయ్యె మామకీన భాగ్యమహిమంబు చెప్పతరంబె యని సంతుష్టాంతరంగుండై చని చని
పూతిగంధాధార పుంఖిత డిండీర
భరిత మైరేయ కుంభవ్రజంబు
గ్రామసూకర మాంసఖండ తోరణ వార
కంక వాయస గృధ్రసంకులంబు
మేదుర ఖాదనామోద సంపాదిత
తామ్రచూడాసహ్య తటతలంబు
రతిరాజ సంగరోత్థిత షిద్గజన శుక్ల
మూత్రార్థ గేహళీచిత్రితంబు
విటవిటీజన సంధాన విహితవచన
నిచయ రచనా నిపుణ కుట్టనీసహాయ
కరణ కారణ కౌలేయకంబు వేంక
టాభిధానాతినీచ వేశ్యాలయంబు
ఇటునటు కనుగొని లోనికి
లొటలొట చని మంచమెక్కి లోలత నది త
త్తటమున కూర్చుండిన న
క్కుటిలాత్ముడు కౌగలించుకొని యిట్లనియెన్
ఎంతభాగ్యంబు చేసితి మిరువురమును
కాసువిడకుండ యజ్ఞంబు కలిగె చంద్ర
రేఖను తలచి నీలాద్రిరేడు మిగుల
మోహితుండయ్యె భాగ్య మామోదమొదవె
నీలాద్రి రాజు మిక్కిలి
తాళక కృశియించె విరహదహనముచే నీ
వేళం జచ్చును వేగం
బాలోలత చంద్రినంపు మాతనికడకున్
పూలమ్రాకులు నీవు నీపుత్త్రికయును
చూచువల్ల యెరింగి బొజుగుల వలపు
వెల్లి గొలుపుచు బలువుగ విత్తమెల్ల
లాగుదురు ధాత్రి మీవంటి లంజెలేరి
నేడు నీకల్లుడాయెను నీలనృపుడు
కూతురును నీవు నేనును కొదవలేని
సిరుల పొదలెదమింక ఈ చిన్నదాని
కడక కైసేయుమని చంద్రి కాంచి పలికె
బాలరో నీవు మిగుల సౌభాగ్యవతివి
ఒక బొజుగువోవ మరియొక్క డుత్తముండు
దొరకె నీలాద్రిరాజు సచ్చరితుడిపుడు
నిన్నుగోరి పిలువనంపె నేడు నీవు
ఏలాగున నలయించెదొ
ఏలాగున నీలవిభుని వలయించెదొ మ
మ్మేలాగున రక్షించెదొ
బోలె తెగడు నీదు భగము పుణ్యముచేతన్