చంద్రరేఖావిలాపము

అనిన చంద్రరేఖ యిట్లనియె

చూపుకోపులచేత చుంబనంబులచేత
దంతక్షత నఖక్షతములచేత
తాడనంబులచేత పీడనంబులచేత
గాఢ పరీరంభకలనచేత
ఉపరతిగతులచే కపటవాక్యములచే
తాంబూలదాన విధంబుచేత
కలపంబుపూతచే గారవింపులచేత
గాన నాట్య ప్రసంగములచేత

మందు మంత్రంబులను నీలమనుజవరుని
లోలు గావించి కలధనం బోలి లాగి
పిదప జోగిగ గావించి మదముడించి
తెత్తు మీసన్నిధి నా ప్రతిజ్ఞ వినుడు

దొడ్డదొడ్డ తురకబిడ్డల నా తొడ
లందు నిరకబట్టి అడుగునెత్తి
పెట్టి లోలుజేసి వెట్టివానిగజేతు
నీలనృపుడు నాకు చాలగలడె

అనిన నీవంత నేర్పరివగుదు వమ్మ
లెమ్మ ముస్తీబు కమ్మ శీఘ్రమ్ముగాను
పొమ్మ ఆతనితమి తీర్ప కమ్మవిల్తు
చేతి బంగరుబొమ్మ ఓ చిన్నికొమ్మ

నావు డల చంద్రి యప్పుడు
భావంబలరార లేచి పరిపరిగతులన్‌
వేవేగ చేయదొడగెన్‌
కేవల శృంగార మొడల గీలుకొనంగన్‌

నీలాద్రిరాజు మోమున
గ్రాలెడు గడ్డంబురీతి కనుపట్టి మహా
స్థూలోపస్థా భాసా
భీలత నూరుహము లన్ని బిరబిర పెరికెన్‌

ఆతని పెను బాలీసుల
భాతిన్‌ కడుపొడవులగుచు ప్రబలు కుచములం
దాతత మలయాచల సం
జాత సుగంధంబు మిగుల జానుగ నలదెన్‌

భుగభుగ సుగంధ బంధుర
మగుచుండెడు ధూపమిడియె ఆనందమునన్‌
నిగనిగలీనెడు తన ఘన
భగదేవత కాత్మవాంఛ ఫలియించుటకున్‌

గొర్రెబొచ్చు కంటె ఎర్రనై చిర్రలౌ
కుర్రవెండ్రుకలను కూడదువ్వి
తొర్రకొప్పువెట్టె నర్రుమీదను చాల
విర్రవీగుకొంచు బిర్రబిగియ

హరిమొగము తెగడు మొగమున
హరిదళమును దళముగాగ నలది మహా సిం
ధురతర నేత్రయుగంబున
కర మరుదారంగ మందు కాటుక వెట్టెన్‌

సత్తికి సిింగారించిన
ఇత్తడిసొమ్ములను బోలి ఎసగగ మేనన్‌
పుత్తడిసొమ్ములు తన కా
పత్తారణ కారణముగ బాగుగ తాల్చెన్‌

కంచెలలోపల కట్టి బి
గించెన్‌ చనుకట్టుదోయి గిరినాగుల నా
డించక హితుండికుడు వడి
వంచనతో పెట్టినట్టి వైకరి తోపన్‌

ఈలీల నలంకృతయై
యాలోల వెలింగి నప్పు డాశ్చర్యముగా
నీలాద్రిరాజు పట్టం
బో లోలత మెరయు పెద్ద భూతమొ యనగన్‌

అప్పుడు సోమయాజులు తదాకృతి వేంకటసాని యుక్తుడై
రెప్పలు మోడ్ప కర్మిలి నెరిం కని కూతుర నీకు తుల్యయౌ
ఒప్పులకుప్ప ఇప్పుడమి నొక్కెడ చూడము లోలవయ్యు బా
గొప్పెడు బాలలీల కడు నూనితి మేల్‌ బళి యంచు మెచ్చగన్‌

నీలాద్రిరాజు వార
స్త్రీలోలుండయ్యె నింక చెడి వైతరిణిన్‌
కూలు నిటులనుచు తెల్పెడి
పోలిక నంభోధి క్రుంకె ప్రొద్దు రయమునన్‌

అపకారి నీలభూపతి
అపయశ మల విష్టపముల నలమె ననంగా
విపులమగు కటికచీకటి
విపులాస్థలి నంబరమున విప్పుగ కప్పెన్‌

అంతన్‌ తారలు తోచె నంబరమునం దా నీలభూపాధముం
డెంతే చంద్రిని కూడ తత్తనువునం దింతైన సందీయ క
త్యంతంబున్‌ రసపొక్కు లిట్లు వొడమున్‌ తథ్యం బటంచున్‌ నభః
కాంతారత్నము తెల్పెనో యన మహా గాఢాతి ధౌతచ్ఛలిన్‌

తాను చంద్రరేఖనా నెసంగుదు నంచు
సాని పిప్పితొత్తు లోన నుబ్బు
దాని నేతు నంచు తా కోపమున వచ్చె
నో యనంగ చంద్రు డుదితుడయ్యె

అయ్యవసరంబున

వేంకటసోమయాజియును వేంకటసానియు శ్రద్ధులై కడున్‌
పొంకపు మాటలున్‌ వగలు బుద్ధులు తద్దయు చెప్పుకొంచు లో
గొంకక నీలభూవిభుని గొల్లెన లోనికి దాని దూర్చి పూ
కంకటి చెంగట న్నిలుప కన్గొని ఆ నరపుండు వేడుకన్‌