స్పర్శ

గడ్డి యంత్రాలు గీమని రొద పెడుతున్నాయి..అదే చప్పుడు..చెవులు దిబ్బెళ్ళు పడేలా ! తృళ్ళిపడి లేచాడు శ్రీధర్‌.బాటిల్‌లో నాలుగు గుటకల నీరు మిగిలివుంది. ఖాళీచేశాడు.తనను వెంబడించిన కుక్క గుర్తుకు వచ్చింది.తనకు సాయంత్రం నడక అలవాటు చాలాకాలంగా.చిందరవందరగా గడ్డిచామంతులు,పిచ్చిపూవులు పూసినబయలు వేపు వెళతాడు.ఇళ్ళన్నీ ఒకేరకంగా ఉన్నా..అటూ ఇటూ దూకే ఉడుతలతో,ఆడుకునే పిల్లలతో హడావిడిగా ఉంటుంది ఆ వీధి.

ఎప్పటిలాగే కారుగారేజి పక్కసందు గుండా నడుస్తున్నాడు.కార్లన్నీ పార్క్‌చేసి ఉన్నాయి.బాల్కనీలో పోట్లాడినట్టు మాట్లాడే నల్లవారు అదే కార్యక్రమంలో నిమగ్నమైవున్నారు.పెద్దవాన్‌ ఆగి బిలబిల మని,భారీగా వున్న ఒక కుటుంబం దిగింది.వారి వైపు నుండే ,నాలుక వేలాడేసుకొని,మెత్తగా ఎగిరే కుక్క తనవైపుకు పరిగెత్తుకువచ్చింది. శ్రీధర్‌కు గొంతుగొలుసులేని కుక్కలంటే చెడ్డ చిరాకు;ఒకసారి రోడ్డురోలరంత కుక్క మీదపడి కరచినంత పని చేసింది.ఆ అదటుకు నోటమాట పెగలలేదు.దాని యజమాని ఎక్కడ తగలడ్డాడో పిచ్చి కోపంవచ్చింది;ఈ తెల్ల కుక్క,ఆగిన కారు వాళ్ళదే అయి వుంటుంది,సందు చివరికి రాగానే ఎవరో ఒకరు గద్దించి పిలుస్తారులే అని శ్రీధర్‌దాని గురించి పెద్దపట్టించుకోలేదు.ఎందుకో,అది చాలా దగ్గరిగా వచ్చింది అన్న అనుమానం కలిగింది శ్రీధర్‌కు ..తన పిక్క వాసన చూస్తున్నట్టుంది.దీనికేం పోయేకాలం..ఐనా దీన్ని కాదు,వదిలేసి పట్టించుకోకుండా ఉన్నారే వాళ్ళననాలి;వారి వైపు విసురుగా చూశాడు.ఇవేవీపెద్ద పట్టనట్టు,ఆ కుక్క శ్రీధర్‌చుట్టూ రౌండ్స్‌కొట్టడం ఆరంభించింది. రాత అంటే ఇదే అనిపించింది శ్రీధర్‌కు.ఇన్నేళ్ళు ,ఇంత జాగ్రత్తగా మెలిగి,సందు చివరి తెల్లకుక్కకు చిక్కాడు.తన ఆలోచనలతో దానికి ప్రమేయం వున్నట్టు లేదు.ఈ సారి నాలుగుకాళ్ళతో అటుదూకి,శ్రీధర్‌కాళ్ళకు అడ్డు వచ్చి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తోంది కవ్వింపుగా..ఎవరో ఈవెనింగ్‌రన్నర్‌ “Excuse,me” అని, “కుక్కను హద్దులో పెట్టుకోలేవు ” అన్నట్టు చూపు విసిరి ఆ తుప్పల దిశగా వంకర అడుగుల జాగ్‌ చేస్తూ వెళ్ళాడు.ఎప్పటిలాగే పెద్ద ఇంటి ముందు పిల్లలు ఆడుకొంటున్నారు.వారిలో కొద్దిగాపొడవున్నవారు బాస్కెట్‌బాల్‌లో మునిగిపోయి ఉన్నారు.తెల్లకుక్కకుచాలా ఉత్సాహం వచ్చినట్టుంది;అంతమంది పిల్లలను చూసేసరికి,”భౌ భౌ” మని తన రాకను సంకేతించి,అటుదూకి,రోడ్డుకు అడ్డంగా పరిగెత్తింది..పిల్లలందరూ శ్రీధర్‌ను,కుక్కనుఉసిగొలిపే ఓ అనాగరికుడిగా జమకట్టి పొలోమని లోనకు పరిగెత్తారు.శ్రీధర్‌నడక వేగం పెంచాడు.పరిగెడితే,అది సవాల్‌గా తీసుకొని,చెవులు కొట్టుకొంటూ,ఉరికి వచ్చితనమీద పడవచ్చు .అక్కడినుండి దూరంగా వచ్చేస్తుంటే, “హమ్మయ్య” దీని బెడద వదిలింది అనిపించింది,శ్రీధర్‌కు .పెద్దింటి ముసలాయన “he is menacing” గడ్డియంత్రం ఆపి ఏదో గొణుగుతున్నాడు,శ్రీధర్‌కుకు వినిపించాలని.”కుక్కనాది కాదురా బాబూ”అంటే అనవసరంగా కంగారు పడి చేతిలో ఉన్నదాన్నిమీదేసుకొని కుక్క బారీన పడతాడేమో అనిపించింది.”ఆహా” అని తోసుకు వచ్చేశాడు.పిల్లలందరూ వాతావరణ హెచ్చరిక విన్న జాలర్లలా జాగ్రత్త పడేసరికి ,చివరికి అది శ్రీధర్‌నే వెదుక్కుంటూ వచ్చింది.తన చుట్టూ గిర గిరా నాలుగు రౌండ్లు కొట్టింది.దయ్యం కుక్కను లాక్కు వెళ్ళే ఇద్దరు యువకులు “he is naughty” అని దాని వైపే ప్రశంసా పూర్వకంగా చూస్తూ వెళ్ళిపోయారు..,వారి కుక్కను అదిలించుకొంటూ. మెరుపు లేని వానలా ఇదెలా తగులుకుంది.? ఇవాళ తనకు మూడుకొచ్చింది..కానీ మొహంలో భయం కనిపిస్తే ఇంకా పెట్రేగి పోతాయట… dog psychology కూడా గుర్తుకు వచ్చింది.ఎదురు ట్రాక్‌మీద పరిమితమైన దుస్తుల్లో,తల ఊపుతూ,లయబద్దంగా పరిగెడుతుంది,అమెరికన్‌యువతి.తెల్లకుక్క ఏమాత్రం ఆలస్యం చేయకుండా,అమాంతం అటుదూకింది..”బ్రతుకు జీవుడా” అని శ్రీధర్‌ఊపిరి పీల్చుకొన్నాడు.ఆ అమ్మాయికి ఏదో అనుమానం వచ్చి ,వేగం తగ్గించి పిల్లిలా అడుగులు వేస్తోంది.వెనుక పహరా ఇస్తూ తెల్లకుక్క!!” nice dog ” అని దారిన పోయే చైనీస్‌ దంపతులు ఉదారంగా పొగుడుతున్నారు దాన్ని.

శ్రీధర్‌కు అటూఇటు పొర్లినా నిద్ర పట్టడం లేదు..ఎంతసేపూ ,ఆ కుక్కే జ్ఞాపకం వస్తోంది.ఆ కుక్క కరవడానికి రాలేదేమో అనిపించింది.కేవలం చెలగాటం ఆడుతుంది..కుక్కలకు ,పిల్లులకు ఇది అలవాటే..ముద్దు చేయమని కాళ్ళకు మొహం తాకించడం..ఇంత చిన్నవిషయం కూడా తనకు తట్టలేదు.తనలో ఇంత భయం పేరుకుపోయిందా?ఇంత బెరుకా?

ముగ్గురు చిన్న పిల్లలు బుల్లి సైకిళ్ళు తొక్కుతూ రోజూ ఎదురొస్తారు.వారుకనిపించక పోతే వెలితిగా ఉంటుంది..ఇద్దరు మగ పిల్లలు భారతీయులు..పాప అమెరికన్‌.రాగిరంగు జుట్టు.. భుజాల దాకా ;రంగురంగుల దుస్తుల్లో మాట్లాడే బొమ్మలా చలాకీగా వుంటుంది.గొయ్యి చూసుకోలేదు..ఢామ్మని పడిపోయింది;దూరంగా సైకిల్‌దాని చక్రాలు ఇంకా తిరుగుతూనే వున్నాయి.పాప గొల్లుమంది.పాపను లేపి,మోకాలి గాయం తుడిచి,ఎత్తుకొని వారిల్లు చేర్చాలనే ఉంది.తనదేశంలో ఎక్కడున్నా అదే చేసే వాడు.కానీ,ఇక్కడ పిల్లలను తాకరాదని,దగ్గరికి తీసుకోరాదని గట్టిగా చెప్పారందరూ.పాప బేల చూపులు తనను ఎన్నోరాత్రులు వెన్నాడాయి.
స్పర్శలేక బీడు పడిపోయిందా శరీరం ?ఇంత గడ్డ కట్టుకు పోయాడా తను? శ్రీధర్‌కు ,ఇక నిద్ర రాదనిపించింది;అమ్మకు ఫోన్‌చేస్తే..

“ఎప్పుడొస్తావు,నాయనా?”
“నాలుగు రోజుల్లో!”
“ఎన్నిరోజులుంటావు,తండ్రీ?”
“ఇక,అన్నిరోజులూ అక్కడే!”

అమ్మతో మాట్లాడి ఫోన్‌ పెట్టేశాక,రేడియోలో పాట..కోడిపెట్ట అరుపు..సైకిల్‌బెల్‌ చప్పుడు..దూరంగా రైలు కూత అన్నీ గుర్తుకొచ్చి శ్రీధర్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి!!


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...