బహు ‘మతులు’

నారాయణ రావు గారింటికి బయల్దేరాను. ఈ రోజు సాయంత్రం ఆయనింట్లో సాహితీ సమాఖ్య ఉంది. నారాయణ రావు గారు పేరు మోసిన కవి. రాసింది తక్కువే అయినా పదిమంది పాఠకులూ గుర్తుంచుకొనే రచనలు చేసారు. ఈ మధ్యగా ఆయన కలం మూలపడేసారు. ఇదే విషయం ఆయన్ని అడిగితే, “చదవడం ఎక్కువైతే రాయడం తగ్గుతుంది – ఎన్ని రాసామనేది కాదు – ఎంతమందిని ఆలోచింపగలిగేం అన్నది ముఖ్యం!” అంటారాయన. ఎవరూ కాదనలేని, తిరస్కరించలేని జవాబది. నా వరకూ నాకు నారాయణ రావు గారి కవిత్వం కంటే, ఆయన రాసిన కథలే ఇష్టం. ఆయన ప్రతీ పాత్ర ద్వారా చేసే మనో విశ్లేషణ నా హృదయాన్ని మరింతగా తాకుతుంది. నారాయణ రావు గారింట్లో ప్రతీ నెలా సాహితీ సమాఖ్య పేరున నాలాంటి సాహిత్యాభిమానులందరం కలుస్తూ ఉంటాం. తప్పనిసరిగా వచ్చేవాళ్ళలో నేనూ, ప్రణవ్, సుజాత గారు ఉంటాం. అడపాడడపా ఇంకో ఇద్దరు వస్తారు. కాని మేం నలుగురూ మాత్రం తప్పని సరిగా హాజరవుతాం. ప్రణవ్, సుజాత కూడా రచనలు చేస్తారు. ప్రణవ్‌ ఎక్కువగా విప్లవ కవిత్వం అంటే ఇష్టపడతాడు. అందుచేత ఆయన కవిత్వంలో అటువంటి భావ ప్రకరణే ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. చేతలూ అంతే. ప్రణవ్‌ అసలు పేరు ప్రణవ్‌ రెడ్డి. కులాలు మతాలు మనిషి పేరున అంటిపెట్టుకున్నంత కాలం మనిషిని మనిషిగా చూడలేం అంటూ – తన పేరుని ప్రణవ్‌ గానే కుందించేసాడు. సుజాత గారు కవిత్వం రాయరు. కథలు రాస్తారు.

నేనూ అప్పుడప్పుడు చిన్న చిన్న కథలు రాసాను. మా అందరివీ అన్ని మాస, వార పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. మా అందరికంటె నారాయణ రావు గారు వయసులో నూ, సాహిత్యానుభవంలోనూ పెద్దవారే! ఆయనంటే మా అందరికీ అత్యంత గౌరవం. నారాయణ రావు గారికి తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవులందరితోటీ పరిచయం ఉంది. నారాయణ రావు గారికి మహాకవి శ్రీ శ్రీ గారితో పరిచయమే కాదు, స్నేహం కూడా ఉండేది. ఆయన ప్రముఖ రచయితలతో ఆయన వయసులో ఉండగా జరిపిన సాహితీ సభలు, సంభాషణలు, కవిత్వం, ముచ్చట్లు చెబుతారు. ప్రతీ నెలా ఒకళ్ళ ఇంట్లో కలిసేలా మేం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సారి నారాయణ రావు గారి వంతు వచ్చింది. ఆయనింటి కి అందుకే బయల్దేరాను. కలిసినప్పుడల్లా మేమందరూ ప్రస్తుత తెలుగు సాహిత్యం గురించి, సమకాలీన కవిత్వం గురించి ప్రస్తుతం తెలుగు భాష మనుగడ గురించి, ఇలా అనేక విషయాలు చర్చిస్తాం. ఎవరి అభిప్రాయాలను వాళ్ళు నిర్ద్వంద్వంగా చెబుతాం. అంగీకరణలు, తిరస్కరణలు, విసురులు, విరుపులూ ఇవన్నీ మా అందిరికీ మామూలే. ఒక్కోసారి మా మధ్య వాదాలు తగవులుగా మారే సూచనలు కనిపిస్తే, మధ్యలో నారాయణ రావుగారే కల్పించుకొని వేరే విషయాలు ప్రస్తావిస్తారు. లేదా తనకు పరిచయం ఉన్న కవులు తమ తమ సిధ్ధాంతాలని స్నేహాన్ని కలగాపులగం చేయకుండా ఒకరినొకరు ఎలా గౌరవించు కునేవారో చెప్పేవారు. కలిసిన ప్రతీ సారి మేం ఏమైనా రచనలు చేస్తే చదివి వినిపిస్తాం. సలహాలు, సమీక్షలు వంటివి పంచుకుంటాం.

నే వెళ్ళేసరికి నారాయణ రావుగారు, సుజాత గారు ఉన్నారు. అప్పుడప్పుడు దర్శనమిచ్చే మరో ఇద్దరు వచ్చారు. అందులో ఒకాయన పేరు గౌరీనాధ శర్మ. ఆయన తెలుగు మాస్టారుగా పని చేస్తున్నారు. ఆయన కూడా అడపాదడపా కవిత్వం రాస్తూ ఉంటారు. వెళ్ళగానే అందరూ నవ్వుతూ ఆహ్వానించారు.

” ప్రణవ్‌ గారు ఓ పదినిమిషాలు ఆలస్యంగా వస్తానని చెప్పారు. వచ్చే వరుకూ ఆగుదాం – ఈ మధ్య మిమ్మల్ని ఆకట్టుకున్న రచనలేమైనా చదివారా ? ” నారాయణ రావుగారే మొదలు పెట్టారు.

లేదన్నట్లుగా తలూపాను. సుజాత గారు విపులలో వచ్చిన ఒక ఒరియా కథ తనకు నచ్చిందని చెప్పారు. గౌరీనాధ శర్మ గారు – విషయం మారుస్తూ –

” మీకో విషయం తెలుసా ? రెండేళ్ళ కోసారి కథలు, నవలలు పోటీ పెట్టే తెలుగు సాహితీ సంఘం వాళ్ళు ఈ సారి ప్రైజు మనీ పెంచారు. ప్రథమ బహుమతి నవల కి రెండు లక్షలట. కథకి ఏభై వేలట….” ఆశ్చర్యంగా చెప్పారు.

” తెలుగు సాహితీ సంఘం అంటే అమెరికాలోని ప్రవాసాంధృల సహకారంతో నడుస్తున్నదే కదూ ? ” నారాయణ రావు గారు అడిగారు.

” అవునండీ. వాళ్ళే ఈ సారి బహుమతుల విలువ పెంచారు. ఇదీ మంచిదే – రచయతలకి మంచి ప్రోత్సాహకరం గా ఉంటుంది. నేనూ ఒక కథ రాసి పంపుదామను కుంటున్నాను. ” సుజాత గారన్నారు.

” కథ కాదు – నవల రాయండి – ఏకంగా రెండు లక్షలు కొట్టేయచ్చు. ” వెటకారంగా అన్నారు గౌరీనాధ శర్మ గారు.

“నాకంత ఆశలేదు లెండి. అయినా నేను బహుమతి ఆశించి ఈ పోటీలో పాల్గొనడం లేదు. కథల పోటీ అనగానే అనేక మంది ప్రముఖ రచయితలు తమ తమ కలాల్ని ఝుళిపిస్తారు. వాళ్ళ కథల మధ్యలో మనదీ నిలబెట్టే ప్రయత్నమే ఇది. ఒక మంచి కథ రాయాడానికి ఇది ఓ దోహదకారి మాత్రమే!” గౌరీనాధ శర్మ గారి మాటలకి సుజాతగారు నొచ్చుకున్నట్లనిపించింది.

“మీ రన్నది కరక్టే సుజాత గారు! బహుమతి ఆశించి కాదు, పది మంచి కథల్లో మనది ఒకటి అన్న ఆనందమే ఓ పెద్ద బహుమతి ” నారాయణ రావుగారు నవ్వుతూ అన్నారు. నా వైపు తిరిగి –

“ఏం సూర్యం – నువ్వు ఈ పోటీలో పాల్గొనడం లేదా?” అని ప్రశ్నించారు.

“ఆ ఆలోచన ఇంకా కలగలేదండీ ! అయినా మీలాంటి పెద్ద రచయతల ముందు నాలాంటి వాళ్ళు నిలబడలేరు సార్!” నవ్వుతూనే జవాబిచ్చాను.

“ఏమిటి నిలబడేలేనంటున్నారు ? పోనీ కూర్చునే రాయండి …” అంటూ ప్రణవ్‌ ప్రవేశించాడు.

“రావోయి ప్రణవ్‌ రా ! మంచి టైం కే వచ్చావు!” లోపలికి అడుగుపెడుతున్న ప్రణవ్‌ తో అన్నారు నారాయణ రావు గారు.

ఏమిటి నే లేకుండా తీవ్రంగా వాదించుకుంటున్నారా?” ప్రణవ్‌ అడిగాడు.

“అదేంలేదండి – తెలుగు సాహితీ సంఘం వాళ్ళ కథల నవలల పోటీకి ప్రైజు మనీ స్టాక్‌ ఎక్సేంజ్‌ ఇండెక్స్‌ పెరిగినట్లు పెరిగిందని గౌరీనాధ శర్మ గారు అంటున్నారు. మీరు కూడా ఓ నవల రాస్తే లక్షాధికారులైపోవచ్చు.” సుజాత గారు అన్నారు.

“సరే ! – ప్రణవ్‌ ఓ నవల రాస్తే – ఇక ఎవ్వరికీ ప్రథమ బహుమతి రాదు. ” ప్రణవ్‌ కేసి చూస్తూ అన్నాను.

” అదేలా – కా కథల పోటీ వాళ్ళు నాకు చుట్టం కాదే – ? “

” అదే మరి – మీకు గాకుంట ఇంకెవరికైనా ప్రైజ్‌ ఇస్తే మీరూరుకుంటారు. నరికి పారేయరూ – “
” ఏదే విప్లవాత్వకంగా మాట్లాడు తానే తప్ప, మరీ ఇలా తలలు నరికే వాడిలా కనిపిస్తున్నానా ? అయిన అంతగా నరకాల్సి వస్తే కత్తెందుకు – మన కలానికి పదునెడితే సరి…కోసుకోవాల్సిన చోటే తెగుతుంది. “

” అది కాదయ్యా – నువ్వు ఓ కథ రాసి పంపంచ్చు కదా ! ” గౌరీనాధ శర్మ గారి ఉచిత సలహా !

” రాయచ్చు – కాని మన కథలు బహుమతి ఇచ్చేదెవరండీ ? మనకీ కథల పోటీలకీ పడదు. అయినా ఈ పోటీలు నిర్వహించడం అనేది నాకెందుకో నచ్చదు సార్‌ ! ఆ మధ్య ఒక పత్రిక సంక్రాంతి కథల పోటీ పెడితే, ఎంత నాసిరకం కథలకి ప్రైజులొచ్చాయో మీకూ తెలుసు… ” ప్రణవ్‌ నిక్కచ్చిగా చెప్పాడు.

” అలాగంటే ఎలా? ప్రతీ కళకి ఈ పోటీలు అవసరమే – ఈ పోటీల తోనే అనేకమంది ప్రేరణ పొంది రాయడం మొదలుపెడతారు. అనేకమంది కథలు చదివే అవకాశం కూడా వస్తుంది. ఆ సంక్రాంతి కథల పోటీకి మంచి కథలు రాలేదోమో?”

“అదే సార్‌ ! నేననేదీనూ – ఆ కథలు నిర్ణయించే వాళ్ళ వ్యక్తిగతమైన ఇష్టాలకి, సాహిత్య అభిరుచులకి దగ్గరగా ఉన్న కథల్నే సెలక్ట్‌ చేస్తారు సార్‌ ! నిష్పక్షపాతంగా నిర్ణయాలు జరుగుతాయన్న నమ్మకం నాకు లేదు…ఎందుకంటే ఒక కథ మంచిదా, చెడ్డదా అన్నది అప్పటి కాలాన్ని బట్టి ఉంటుంది. దాన్నే మనం సమకాలీన కథలు అంటాం. ఒక కథ ప్రస్తుత కాలంలో మంచి కథ అవ్వచ్చు. ప్రజలకి బాగా నచ్చచ్చు. వాళ్ళలో చైతన్యం కలిగించవచ్చు. కాని భవిష్యత్తులో అదే కథని మరలా చదివితే అంతగ హత్తుకు పోక పోవచ్చు. స్వాతంత్ర్య సమరంలో అనేక మంది కవులు అనేక విధాల చైతన్యం కలిగించే రచనలు చేసారు. కాని ఆ రచనలు ఇప్పుడు అంతగా నచ్చక పోవచ్చు..ఇక్కడ రచన, కవిత్వం కంటే కాలమే పెద్ద పాత్ర వహిస్తుంది. అందులోనూ ఈ కథలని నిర్ణయించే వాళ్ళకి ఎంతో కొంత సాహిత్యం గురించి తెలుస్తుంది. అంతే కాదు వాళ్ళకి కొన్ని సాహిత్య ప్రక్రియలన్నా, ప్రత్యేక మైన అభిమానాలు, అభిరుచులూ ఉంటాయి. దాని అనుగుణంగానే ఈ కథ మంచిదా చెడ్డదా అన్నది నిర్ణయించబడుతుంది. నా వరకూ నాకు విప్లవ కవిత్వమన్నా, శ్రీ శ్రీ గారి కవిత్వమన్నా ఇష్టం. నాకు పద్యమన్నా, దేవుడన్నా పడదు. కాబట్టి ఒకవేళ మంచి కథ ఎవరైనా రాసినా, నా వరకూ నాకు నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు – నాకు నచ్చని విభాగంలో కథకి బహుమతి వచ్చే అవకాశం అస్సలు లేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆ నిర్ణేతలలో ఎంత పారదర్శకంగా ఉంటారన్నది ఆయా వ్యక్తుల గుణగాణాల మీద ఆధారపడి ఉంటుంది….” ఆవేశంగా చెబుతున్నాడు ప్రణవ్.

మేం అందరం ప్రేక్షకులయ్యాం. అతని మాటలకి అడ్డు వస్తూ నారాయణ రావు గారే అన్నారు.

“నువ్వు చెప్పినదానికి అంగీకరిస్తాను. కాని న్యాయనిర్ణేతలందరూ అలా ఉంటారని నేననుకోను. ఒకప్పుడు గతంలో నేనూ ఒక న్యాయ నిర్ణేతనే.”

మళ్ళీ ప్రణవ్‌ అందుకున్నాడు..

” నాకెందుకో న్యాయ నిర్ణేత అన్న పదం చాలా అన్యాయంగా వాడుతున్నారని పిస్తుంది. వాళ్ళు ఏం న్యాయ నిర్ణయం చేస్తారు ? ఒక కథ మంచి, లేక చెడ్డ దా అనా ? ఈ మంచీ చెడులని ఏం అధారంగా నిర్ణయిస్తారు ? కొన్ని కథలు వస్తు రీత్యా మంచి కథలు అవ్వచ్చు. కొన్ని కథల్లో శిల్పం అద్భుతంగా ఉండచ్చు. మరికొన్ని కథల్లో పాత్రల పోషణ, విశ్లేషణ బాగుండచ్చు. కొన్ని కథల్లో కథనం చక్కగా ఉండచ్చు.. మంచి కథకి కావల్సిన అన్ని గుణాలూ ఒక కథలో కనిపించకపోవచ్చు..కాబట్టి వీళ్ళని న్యాయనిర్ణేతలూ అనేకన్నా గుణ నిర్ణేతలు అంటే బాగుంటుంది….”

ప్రణవ్‌ ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఆ ఆవేశాలో కొన్ని నిజాలు ఉన్నాయి. అవన్నీ అందరికీ తెలుసు.

“నువ్వు చెప్పింది నేనూ అంగీకరిస్తాను. కానీ ఇందులోనూ కొంత సాహిత్య సేవ ఉంది. ఎలాగంటావా – పోటీకి వచ్చిన కథలు పుస్తకం వేస్తారు. ఆ రకంగా అందరి రచనలూ ఒకే సారి చదివే అవకాశం వస్తుంది. అంతే కాదు – కొత్త రచయైతలకి ఒక పేరున్న కథకుడి కథ పక్కన కథ కానీ, ఒక మంచి కథ కానీ పడితే తన కథపై ఆ రచయితే విశ్లేషణ చేసుకొనే అవకాశం కలుగుతుంది. ఈ బహుమతుల వల్ల ఆర్థికంగా బలహీనంగా ఉన్న రచయితలకి చేయూత ఇచ్చినట్లూ అవుతుంది. దీని వల్ల కొంత మంచి జరిగే అవకాశమూ ఉంది..నువ్వన్నట్లుగా ఆ న్యాయ – అదే ఆ గుణ నిర్ణేతల విషయం అంటావా అది ఆ సంస్థల మీద, ఆ సంస్థలు నడిపే వ్యక్తుల మీద ఆథార పడి ఉంటుంది. ఏ సంస్థ అయినా మొదలు పెట్టినప్పుడు ఉద్దేశ్యాలు మంచివే ఉంటాయి. కాలక్రమేణా పెరిగే కొద్దీ, కీర్తి రుచి మరిగితే వ్యక్తులు ఆ సంస్థల నాక్రమించుకుంటారు. వాళ్ళ ఇష్టాలూ, అభిరుచులే ఆ సంస్థ ఉద్దేశ్యాలని పక్కకు తోసేస్తాయి. అలాంటప్పుడే – నువ్వు చెప్పినట్లుగా వ్యక్తిగత ఇష్టాలపై అధారపడి నిర్ణయాలు జరుగుతాయి. అలాంటప్పుడు – ఒక మంచి కథకు రావల్సిన బహుమతి – ఆ వ్యక్తికి నచ్చిన సాహిత్య ప్రక్రియకి దగ్గరగా ఉన్న కథలకి బహుమతి రావచ్చు. అప్పుడే నీ లాంటి సాహిత్యాభిమానులు నిరాశ పడేది. కాబట్టి ఇలాంటి విషయాలు అంత తీవ్రంగా ఆలోచించనవసరం లేదు…మనుష్యులం కదా – ఇష్టాలు, అభిమానాలు, స్నేహాలు, రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి…” నారాయణ రావు గారు సర్దుకోలుగా చెప్పారు.

” అందుకే సార్‌ ! నాకు ఈ పోటీ లంటే నమ్మకం లేదు. పోటీ అనేకన్నా ఈ సాహిత్య బహుమతులంటే నాకంతగా రుచించదు. అయిన కవిత్వమనేది ఒక సృజనాత్మక ప్రక్రియ. దానికి పోటీ ఏమిటి ? మనిద్దరం ఒకే విషయంపై వేరు వేరుగా స్పందిచ వచ్చు. మన స్పందన బట్టే కదా, మన కవిత్వం లేదా సృజనాత్మకత రూపు దిద్దుకొనేది. ఇందులో ఒకటి మంచి, ఇంకోటి చెడ్డ అన్నది ఎలా నిర్ణయిస్తారో వాళ్ళకే తెలియాలి…”

ఏమంటారు అన్నట్లుగా మా కేసి చూసాడు. గౌరీనాథ శర్మ గారు అవున్నట్లు తలూపారు. సుజాత గారు మాత్రం శ్రద్ధగా వింటున్నారు, నాలాగే –

” పోనీ లేవయ్యా ప్రణవ్, నువ్వు పంపద్దులే వీళ్ళైనా రాసి పంపనీ …”

“నేను పోటీలో పాల్గొన్నానన్నాను కానీ, వీళ్ళని ఆపడంలేదు సార్‌ !”

నారాయణ రావుగారన్నారు. ” గౌరీనాథ శర్మ గారు – క్రితం సారి కల్సినప్పుడు నాకిచ్చిన కథ చదివాను. చాలా బాగుంది. ముఖ్యంగా కథనం బాగుంది. మీరా కథని పోటీకి పంపండి…”

“అవును సార్‌ ! నేనూ చదివాను. ఒక మంచి కథల జాబితాలోకే వస్తుంది మీ కథ. ప్రస్తుత యువత ఎందుకు పెడదారి పడుతున్నారన్నది చాలా అద్భుతంగా రాసారు. పాత్రల మనో విశ్లేషణయితే నాకు బాగా నచ్చింది. ” నేను నారాయణ రావు గారికి వంతు కలిపాను.

“పంపుతాను” అన్నట్లుగా తలూపారు. నారాయణ రావు గారు నన్ను సుజాత గారినీ రాయమని ప్రోత్సహించారు. ఇద్దరం సరే అన్నాం..

కాసేపు – ప్రస్తుత కథల గురించి, మే రాసిన కొత్త కథలు,వ్యాసాల గురించి చర్చించుకొని అందరం ఇంటిముఖం పట్టాం.

**********************

ఆ తరువాయి, మా సాహితీ అభిమానుల సమాఖ్య రెండు నెలల వరకూ జరగలేదు. నారాయణ రావు గారి తోబుట్టువుకి సుస్తీగా ఉందని ఆయన అమలాపురం వెళ్ళారు. గౌరీనాథ శర్మ గారికి కర్నూలు ఆఫీసు బదిలీ అయ్యింది. కుంటుంబాన్ని ఇక్కడే ఉంచి ఆయన కర్నూలు, విజయవాడ మధ్య తిరుగుతున్నాడు. ఇక నేనూ ప్రణవ్‌ ఆ నెలకి మా సమావేశం వాయిదా వేసాం.

దాదాపు రెండు నెలల తర్వాత మరలా సమవేశమయ్యాం. ఈ సారీ నారాయణ రావు గారింట్లోనే సమావేశమయ్యాం. నేనూ ప్రణవ్‌ కలిసే వెళ్ళాం. అప్పటికే సుజాత గారు వచ్చి ఉన్నారు.

మమ్మల్ని చూసి నవ్వుతూ లోపలికి తీసుకెళ్ళారు నారాయణ రావు గారు.

” మీ కో శుభ వార్తయ్యా ! ఆ తెలుగు సాహితీ సమాఖ్య వాళ్ళు పెట్టిన కథల పోటీల్లో, మన సుజాత గారు రాసిన కథకి ప్రత్యేక బహుమతి ఇచ్చారు..”

” నిజంగానా – నాకు తెలియదు – కంగ్రాట్స్‌ ! ” చెప్పాను నేను.

” మరి మన గౌరీ నాథ శర్మ గారి కథకి…” అంటూండగా గౌరీ నాథ శర్మ గారొచ్చారు.

” మీ కథకి బహుమతి వచ్చిందాండీ ? ” అడిగాను నేను.

” అదా – బహుమతా పాడా! నా కథ కనీసం ప్రత్యేక బహుమతి పొందిన పాతిక కథల్లో కూడా లేదు…నేను ఒక చిన్న నవల కూడా పంపాను. అదీ అంతే – అయినా బహుమతి వచ్చిన కథలన్నీ పరమ చెత్తగా ఉన్నాయి.. చెత్త కథల పోటీ అని పెట్టి ఉంటే బాగుందేదోమో…”

గౌరీ నాథ శర్మ గారి మాటల్లో ఉక్రోషం, వెటకారం ధ్వనించింది.

“మన సుజాత గారి కథకి ప్రత్యేక బహుమతి వచ్చింది. తెలుసా ?”

“ఆవిడకి బహుమతి వస్తుందని ముందే తెలుసు – ఎందుకంటే ఆవిడ చుట్టం ఒకాయన ఆ సెలెక్షన్‌ కమిటీలో ఉన్నాడు.” గౌరీ నాథ శర్మ గారి మాటలకి సుజాత గారు ఒక్క సారి ముఖం చిన్న బుచ్చుకున్నారు.

“ఆయన మాకేం దగ్గర చుట్టం కాదు. ఆయనెవరో నాకు అంతగా పరిచయం లేదు.” సుజాత గారన్నారు.

“పరిచయం లేకున్నా – ఇంటి పేరు చాలమ్మా చుట్టరికాలు చుట్టిరావడానికి. అయినా – నా బొంద – ఆ న్యాయ నిర్ణేతలకి అసలు కథల గురించి తెలుసున్నట్లు లేదు. లేక పోతే లక్ష రూపాయల బహుమతికి అర్హత కలిగిన ఒక్క కథా ఈ పోటీకి రాలేదట. అందుకని పాతిక వేలు రెండో బహుమతి, పదిహేను వేలు మూడో బహుమతి ఇచ్చారట…వచ్చిన కథలన్నీ రాసిలో ఎక్కువైనా వాసిలో మాత్రం ఒక్కటీ బాగోలేవట. పోటీకి వచ్చిన వెయ్యి కథల్లో ఒక్కటీ సమకాలీన సాహిత్యానికి దగ్గరగా లేవట….”

మధ్యలో ప్రణవ్‌ అన్నాడు.

“నాకు ముందే తెలుసు – ఇలాంటిదేదో జరుగుతుందని. ఆయినా ఈ పోటీల నిర్వహణలో ఆంతర్యం కేవలం కీర్తి కండూతి మాత్రమే కనిపిస్తుంది. నిజం చెప్పమటారా – గౌరీ నాథ శర్మ గారు – మీరు రాసిన కథ నాకూ నిజంగా నచ్చింది. మీ కథకి తప్పకుండా వస్తుందని అనుకున్నాను. నారాయణ రావు గారి వైపు తిరిగి – “చుసారా – నే చెప్పిందే నిజం – ఈ పోటీలు నిర్వహించడంలో చిత్తశుద్ధి లోపించిందని ముందే చెప్పాను…” అన్నాడు. “మరి సుజాతగారి కథకి వచ్చింది కదా?” నారాయణ రావు గారి ప్రశ్న.

“నిర్మొహమాటంగా చెబుతున్నా – నా కథకి బహుమతి రాలేదన్న బాధ లేదు కాని ప్రత్యేక బహుమతి వచ్చిన కథ “చివరి ప్రయాణం” చాలా బాగుంది. ఆ కథకి మొదటి బహుమతి ఇవ్వచ్చు. ఎవరో అన్వేషిత అనే కలం పేరుతో రాసిన ఒకావిడకి వచ్చింది.” గౌరీ నాథ శర్మ గారన్నారు.

సుజాత గారు ముఖంలో రంగులు మారడం గమనించాను నేను.

” అయినా – కథల పోటీ అని పెట్టి – ప్రథమ బహుమతి అర్హత ఉన్న ఒక్క కథ రాలేదనడం అన్యాయం. పైగా వాళ్ళిచ్చిన వివరణ మరీ ఘోరంగా ఉంది. ఒక మంచి కథకి ప్రమాణం ఏమిటో వాళ్ళకే తెలియదు. మనం ప్రతీ ఏడూ సినిమా వాళ్ళకి ఆస్కార్‌ అవార్డ్‌ ఇవ్వడం చూస్తాం. వాళ్ళు ఆ ఏడాది వచ్చిన సినిమాల్లో విడుదలైన మంచి సినిమాకి ఆస్కార్‌ అవార్డ్‌ ఇస్తారు. అంతే కాని ఈ ఏడాది విడుదలైన సినిమా ఒకాటి కూడా, ఏ బెన్‌హర్‌ చిత్రానికో, ఏ సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ కో సమానంగా రాలేదని అవార్డ్‌ ఇవ్వడం మానేయరు. అలాగే ఈ సారి కథల పోటీకి వచ్చిన వెయ్యి కథల్లో ఏదో ఒక కథకి బహుమతి ఇచ్చి ఉండాల్సింది. ” ప్రణవ్‌ చెప్పింది సమంజసంగానే అనిపించింది నాకు.

ఈ సంభాషణ సుజాత గారికి అంతగా నచ్చినట్లు లేదు. అన్నిటి కన్నా గౌరీ నాథ శర్మ గారి జెలసీ ఆయన మాటల్లోనే కనిపించేసరికి పనుందని సుజాత గారు వెళిపోయారు. ఆవిడ అలా వెళ్ళగానే, గౌరీ నాథ శర్మ గారు ఆయన అక్కసంతా వెళ్ళబోసుకున్నాడు.

“సుజాత గారి కథ ఏం బాగుందని ప్రైజిచ్చారు? పరమ చెత్త కథ అది. ఆ న్యాయ నిర్ణేతల్లో ఒకాయనది ఈవిడది ఒకే కులం… అందుకే…”

” తప్పండి – మీరు అలా మాట్లాడకూడదు. మనం రచయితలం – మనకి ప్రతీ అంశాన్ని ఒక కొత్త కోణంలో చూసే గుణం ఉంది. సాహిత్యంలోకి ఇలా కులాలు, మతాలు చొరబడడం వల్లే మన భాషంటే ఎవరికీ గౌరవం లేకుండా పోతోంది. ఏదీ లెండి – కొన్ని కథలు కొంత మందికి నచ్చ్చుతాయి. కొంతమందికి నచ్చవు. మీ కథ నచ్చలేదేమో – మీ కథ చెత్తలా ఉందని ఓ నలుగురు పండితులంటే బాధ పడంది. అంతేకాని ఇలా బహుమతి రాలేదని బాధ పడడం బాగోలేదు. అయినా మీ కథ బాగుందని ఇక్కడున్న అందరం చెప్పాం. మీకు తెలుసు ఇక్కడున్న ఎవరికీ మొహమాటం లేదు. నిష్కర్షగా కుండ బద్దలుకొట్టినట్లే చెబుతాం. మీ మాటలకి సుజాత గారు బాధ పడినట్లుగా ఉన్నారు. అందుకే వెళ్ళిపోయారు.”

“నారాయణ రావు గారూ – గౌరీ నాధ శర్మ గారి బాధలో కొంత అర్థం ఉంది. ఒక మంచి కథకి బహుమతి ఇవ్వకపోయినా పరవాలేదు కాని ఒక చెత్త కథకి బహుమతి ఇవ్వడం నిజంగా అన్యాయం. ఇలాంటి పనులవల్ల ఎంతోమంది రచయితల్ని ప్రోత్సహించడం మాట దేవుడెరుగు, నిరుత్సాహ పరచడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నే క్రితం సారే చెప్పాను ఈ పోటీలీ నిస్పక్షపాతం గా జరగవని. అంతే కాదు ప్రతీ కథకి కొంత వయసుంటుంది. అదే లైఫ్‌ అన్నమాట. ఏ కథ కలకాలం నిలిచిపోదు. ఏభై ఏళ్ళ క్రితం నాటి మహత్తర సమకాలీన కథ నేడు చెత్తగా అనిపించ వచ్చు . ఎందుకంటే ఆ కథా వస్తువు కాని , సమస్య కాని నేటి సమాజంలో భాగం కాకపోవచ్చు…అంత మాత్రం చేత ఆ కథ మంచిదికాదనీ కాదు ఇప్పుడొస్తున్న కథలన్నీ చెడ్డవనీ కాదు. కేవలం ఆ కథ నేడు సమకాలీన కాదంతే … ఏ కథకైన కాలం, అప్పటి సమాజ పరిస్థితులు అనేవి చాలా ప్రభావం చూపుతాయి పాఠకుల మీద …”

” అలా అయితే – కొన్ని వేల సంవత్సరాలక్రింద రాసిన రామాయణం, భారతం నేటికీ బ్రతికే ఉన్నాయి కదా – అంటె వాటికి జీవిత కాలం అనేది వర్తించవా ?” అర్థం కాక అడిగాను.

నా ప్రశ్న కి నారాయణ రావు గారు జవాబిచ్చారు.

” ప్రణవ్‌ చెప్పినది నూటికి నూరు పాళ్ళూ కరక్ట్‌ ! నేటికీ రామాయణం, భారతం బ్రతికిఉన్నాయంటే అక్కడ సాహిత్యం, సమకాలీనత్వం కన్నా, ఆధ్యాత్మికత అన్న అంశమే నేటికూ బ్రతికుండేలా చేసింది. ఆ కావ్యాల్లో నిబిడీకృతమైన ఆధ్యాత్మికతే నేటికీ ప్రతీ పాఠకుడ్నీ చదివేలా చేస్తుంది. మనిషికి, తమ జీవితంలో సమస్యల చావు పుట్టుకలనేవి సహజం, సామాన్యం. కాకపోతే అధ్యాత్మిక చింతన అనేది అప్పుడూ ఉంది ఇప్పుడూ ఉంది. దానివల్లే ఆ మహాకావ్యాలు ఇంతకాలం బ్రతికి బట్టగలిగాయి. అలాగే ఓ అన్నమయ్య పదమైన, ఓ త్యాగరాజ కీర్తనైన నేటికీ పాడుకుంటున్నారంటే అందులోని ఆధ్యాత్మికత కూడా కొంత కారణం…”

నారాయణ రావు గారి జవాబు సమర్థనీయంగానే అనిపించింది నాకు.

“ఇంకో విషయం సార్‌ ! ఈ కథ లు నిర్ణయించే వాళ్ళకి మన తెలుగులో ఎన్ని మంచి కథలు వచ్చాయో, ఉన్నాయో కూడా తెలియదు…” ప్రణవ్‌ నవ్వుతూ అన్నాడు.

“అంత ఖచ్చితంగా ఎలా చెప్పగులుగుతున్నావు ? అయినా ఇంకోళ్ళ విజ్ఞానాన్ని తెలియకుండా అలా చులకనగా మాట్లాడదం అంత మంచిగా అనిపించదు. ఆ కమిటీలో నా స్నేహితుడు ఒకాయన ఉన్నాడు. నారాయణ రావు గారికి ప్రణవ్‌ ఎద్దేవా నచ్చ లేదు.

” ఖచ్చితంగాగా చెప్పగలను సారు ! ఎందుకంటే …” ప్రణవ్‌ ఆగిపోయాడు.

” ఎందుకంటే …” నేనూ, గౌరీనాధశర్మ గారు రెట్టించాము.

” ఎందుకంటే … అంతర్జాతీయంగా పేరొచ్చిన పాలగుమ్మి పద్మరాజు గారి “గాలివాన” కథ పేరు మార్చి పంపాను. కనీసం ఆ కథ ప్రత్యేక బహుమతొచ్చిన కథల గుంపులో కూడా లేదు …”

ప్రణవ్‌ మాటలకి నిశ్చేష్టులయ్యాం అందరం.

****************************
ఓ రెండు వారాల తరువాత నారాయణ రావు గారింటికి మా చెల్లెల పెళ్ళి సంబంధం విషయమై చిన్న పనిమీద బయల్దేరాను.

నే వెళ్ళే సరికి నారాయణ రావు గారు లేరు. బజారుకెళ్ళారని ఆయన భార్య వరలక్ష్మి గారు చెప్పారు.

ఇంకో పది నిమిషాల్లో వస్తారు, కూర్చోండి అని చెప్పి, కొంతసేపయ్యాక కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు నాకు.

“ఇవన్నీ ఎందుకండీ ?” మొహమాటంగా అన్నాను.

“ఫరవా లేదు. కాఫీయే కదా.. అవును సుజాత గారి కథకి ప్రైజొచ్చిందట కదా ?”

” అవునండీ – నేనూ పంపాను. నాకూ గౌరీ నాథ శర్మ గారికి ఏ బహుమతి రాలేదు. నారాయణ రావు గారు కూడ పంపించి ఉంటే ఆయనకి తప్పకుండా బహుమతి వచ్చేది.”

“నీకో విషయం చెబుతాను – ఎవరికీ చెప్పవు కదా ! చెబితే నా మీద ఒట్టే -” ఎంతో ఆత్రుత గా చెప్పారు.

ఆవిడ ఏదో చెప్పాలని ఉవ్విళ్ళూరుతోందన్న విషయం అర్థమయ్యింది నాకు.

“చెప్పనండి – ప్రామిస్‌ !” అభయం ఇచ్చాను.

“ఏం లేదు బాబూ – కథల పోటీకి లక్ష రూపాయల బహుమతి చూసి ఈయన్ని కథ పంపమని అడిగాను. పంపనన్నారు – నాకు లక్ష రూపాయిలు చూస్తే ఆశ కలిగి – ఎప్పుడో ఎరవై ఏళ్ళ క్రితం ఈయన రాసిన కథ “చివరి ప్రయాణం” అని, నేనే నా పేరు అన్వేషితగా మార్చి పంపాను. ఆ కథకీ బహుమతి రాలేదని తెల్సింది. ఈ విషయం ఆయనకి తెలియదు.”

ఆశ్చర్యంగా విన్నాను.

“బహుశా నారాయణ రావు గారి పేరు మీద పంపి ఉంటే బహుమతి వచ్చేదేమో ” అనిపించింది నాకు.

నాకు ప్రణవ్‌ వాదన, మాటలు మరోసారి గుర్తుకొచ్చాయి.