చంద్రరేఖావిలాపము:ప్రధమాశ్వాసము

శ్రీకంఠుండు భుజంగభూషణుడు భస్మీభూత పంచాస్త్రుడ
స్తోకాటోప బలప్రతాప పురరక్షో దక్ష సంశిక్షణుం డా
కాశోజ్వ్జల కేశపాశుడు త్రిశూలాంకుండు రుద్రుండు తా
వీకం జింతలపాటి నీలనృపతిన్‌ వీక్షించు నేత్రత్రయిన్‌

అక్షయ బాహుగర్వ మహిషాసుర దుర్ముఖ చక్షురోల్లస
ద్రాక్షస దక్షులన్‌ సమరరంగములోన త్రిశూలధారచే
శిక్షయొనర్చి శోణిత మశేషము గ్రోలిన దుర్గ దుర్గుణా
ధ్యక్షుని నీలభూవిభుని తద్దయు నిర్ధను జేయు గావుతన్‌

స్తబ్ధ శబ్ద గ్రహద్వయుడు సంవేష్టితో
త్తాలవాలుండు కరాళవజ్ర
కర్కశ దంష్ట్రా క్రకచ భయంకర మహా
విస్తృత వక్త్రుండు విపుల దీర్ఘ
పటుతర కహకహ స్ఫుట చటు వికటాట్ట
హాస నిర్దళిత వేదాండభాండు
డాలోక కాలానలాభీల విస్ఫుర
న్నేత్రుండు ఖడ్గసన్నిభ నిశాత

నఖరుడు హిరణ్యకశిపు వినాశకుండు
సింహగిరివర్తి యగు నరసింహమూర్తి
యడరు చింతలపాటి నీలాద్రినృపుని
సిరియు గర్వం బడంగంగ జేయు గాత

నీరదనీలవర్ణుడు శునీవరవాహుడు విద్యుదాభ వి
స్ఫార జటాభరుండు బహుశష్పసమన్విత దీర్ఘమేడ్రు డం
భోరుహగర్భ మస్తక విభూషిత హస్తసరోజు డా మహా
భైరవు డిచ్చుగాత నశుభంబులు నీలనృపాలమౌళికిన్‌

అనుపమ విక్రమ క్రమ సహస్రభుజార్గళ భాసమాన సా
ధనజిత సిద్ధసాధ్యసురదానవ దక్షుడు దక్షశీర్ష ఖం
డను డగు వీరభద్రుడు కడంకను చింతలపాటి నీలభూ
జనపతిపుంగవు న్విభవసారవిహీనునిగా నొనర్చుతన్‌

నలువగు రక్తమాల్యవసనంబులు డంబుగదాల్చి కన్నులన్‌
జలజల బాష్పబిందువులు జాలుకొనంగ చెలంగుచుండు న
క్కలుములచేడెయక్క కలకాలము నీలనృపాలు నింటిలో
కలిపురుషానుషంగ యయి గాఢరతిన్నటియించుగావుతన్‌

అనుదిన వక్రమార్గరతులై చరియించుచు వైరివర్గముల్‌
తనర పరస్పరాత్మతను దాలిచి మంగళుడు న్గురుండునున్‌
శనియును రాహువు న్మిగుల సమ్మతి ద్వాదశజన్మరాశులన్‌
గొనకొనినిల్చి నీలనృపకుంజరుని న్గడతేర్తు రెంతయున్‌

భీమకవి రామలింగని
స్త్రీమన్మథుడై చెలంగు శ్రీనాథకవిన్‌
రామకవి ముఖ్యులను ప్రో
ద్దామగతిం జిత్తవీధి తలచి కడంగన్‌

ఇట్లు సకలదేవతా ప్రార్థనంబును సుకవిజనతాభివందనంబును కావించి యేనొక్క హాస్యరసప్రధానమగు ప్రబంధంబు సుకవినికర మనోనురాగ సంధాయకంబుగా రచియింప నుద్యోగించి యున్న సమయంబున

తన యపకీర్తి మాద్యత్‌ కృష్ణకాకికి
గురుతరాజాండంబు గూడు కాగ
తన లోభగుణ వినూతన దురాలభ లత
కష్టదిశల్‌ మ్రాకులై చెలంగ
తన పందతనమను ఘనతమోవితతికి
బహుగృహంబులు శైలగుహలు కాగ
తనదు జారత్వచోరునకు సంకరశర్మ
నాటకం బర్థాంజనంబు కాగ

అవని దీపించు చంద్రరేఖాభిధాన
వారనారీత్రికోణ సంవర్ధమాన
రసపరిప్లుత సుఖగదా వ్రణకిణాంక
భూషణుండైన నీలాద్రి భూమిపుండు

వెండియు నఖండ భూమండల మండవాయమాన మానవాధినాథ సాధుయూధ నిర్నిరోధావరోధ సభాభవనాభ్యంతర నితాంత వర్ణనీయ కాలకూట కాక కజ్జల ఖంజరీట కంబళేంగాల కాలమార్జాల గండోపల ఘనాఘన గంధేభ బంభర కదంబ సంభాసమా నానూనాంత దిగంతాక్రాం తాపయశోమండలుండను, సుభగుండును, మైరావణ రావణ కుంభకర్ణ కుంభనికుంభ శుంభనిశుంభ జంభ హిడింబ ప్రలంబ పౌలోమ బక వత్సక బాణ చాణూర ఘటోత్కచ కాలనేమి ఖర దూషణ త్రిశిర మారీచ మాలి సుమాలి మకరాక్ష ధూమ్రాక్ష శోణితాక్ష ప్రముఖ రక్షోదక్ష సదృక్షా క్షుద్ర నిర్నిద్ర ద్రాఘిష్ట దుర్దను దుర్గుణాధ్యక్షుండును, సర్వావలక్షణుండును, కిరాతగుణ గరిష్టుండును, దుర్మార్గప్రవీణాస్పదుండును, బ్రాహ్మణద్రవ్యభక్షణదక్షితుండును, బాలరండాసమాకర్ష్ణ కుతూహలుండును, నిరంతానంత దుర్దాంతప్రాంత కాంతారాంతరాళ కరాళమార్గానర్గళ సంచరద్గవయ గోమాయు గోపుచ్ఛ కురంగ శశ మర్కటో లూక గ్రామసూకర ప్రముఖ ప్రకట మృగయావిహార విశారదుండును, మహోన్మాదుండును, సుకవినికురంబ విద్వత్కదంబ వందిసందోహ వైణికశ్రేణికా మనోరధార్థ వ్యర్థీకరణా సంహారణాకారణా నిర్దయస్వాంతుండును, విగతశాంతుండును, బహువారనారీ జనాలింగన దుర్గంధ బంధుర భగ చుంబన తాడన పీడన దంతక్షత నఖక్షత మహిష మార్జాల మర్కట కుక్కుట కృకుర ప్రముఖ బంధనైపుణీ గుణగరిష్టుండును, దుర్జనశ్రేష్టుండును, శ్రీమచ్చింతలపాటివంశ పారావార ఘోరజాజ్వల్యమానానూన శిఖాసందోహ సందీప్త బడబానలుండును, చలచిత్తుండును, సంగరాంగణభీరుండును, విషయశూరుండును, నీచపాచకాధారుండును, పరమ దుర్బల దుర్భర శరీరుండును, ఆత్మీయ దాసవిలాసినీజన మనోధన పశ్యతోహరుండును, పతయాళుండును, అగు నీలాద్రి రాజన్యపుంగవుం డొక్కనాడు

వేటవేపులు పదివేలు మచ్చికమీఱ
మూతినాకుచు దండ మొఱుగుచుండ
ఱొమ్ముతప్పెట లూని క్రమ్మి రసాలాలు
జోహారనుచు వేటసొంపు తెలుప
తురకనేస్తలు సురాపరిమళం బెసగంగ
చెవిచెంత మనవుల చెప్పుచుండ
రసపొక్కు లడర వారస్త్రీలు ముంగల
తాథై యటంచు నృత్యంబు సలుప

వినయమెసకంగ కుంటెనపనులు సేయు
సేవకులు దాసికలు డాసి క్రేవనిలువ
అలరు కొప్పాక గ్రామసింహాసనమున
కడక తళుకొత్త పేరోలగమున నుండి

సరసాగ్రేసరు కూచిమంచికుల భాస్వద్వార్థి రాకావిధున్‌
చిరకీర్తిన్‌ బహుళాంధ్రలక్షణవిదున్‌ శ్రీమజ్జగన్నాథ సు
స్థిర కారుణ్యకటాక్షలబ్ధ కవితాధీయుక్తునిన్‌ జగ్గరా
డ్వరనామాంకితు నన్ను చూచి పలికెన్‌ వాల్లభ్యలీలాగతిన్‌

రచియించితివి మున్ను రసికులౌనని మెచ్చ
సురుచిర జానకీపరిణయంబు
వచియించితివి కవివ్రాతము ల్పొగడంగ
ద్విపద రాధాకృష్ణ దివ్యచరిత
ముచ్చరించితివి విద్వచ్చయంబు నుతింప
చాటుప్రబంధముల్‌ శతకములును
వడి ఘటించితివి ఇరువదిరెండు వర్ణనల్‌
రాణింపగా సుభద్రావివాహ

మాంధ్రలక్షణలక్ష్యంబు లరసినావు
భూరిరాజన్య సంపత్‌ ప్రపూజితుడవు
భళిర నీ భాగ్యమహిమ చెప్పంగ తరమె
జగ్గరాజ కవీంద్ర వాచాఫణీంద్ర

అర్ణవమేఖలం గల మహాకవికోటులలోన నెంతయున్‌
పూర్ణుడవీవు సత్కవిత; బూతులరీతుల గోరు కొండగా
వర్ణనసేయ నేరుతువు వాతెము జుల్కగ పల్కు మూర్ఖులన్‌
తూర్ణమె తిట్టి చంపుదువు ధూర్తవు, పౌరుషశాలివెంతయున్‌
నిర్ణయ మిత్తెరంగెరిగి నేర్పున నిన్ను బహూకరించినన్‌
స్వర్ణవిభూషణాంబర గజ ధ్వజ చామర గోధనాశ్వ దు
ర్వర్ణ విచిత్ర పాత్ర బహురాజ్య రమారమణీయపుత్ర సం
కీర్ణ సమస్తవస్తు వర గేహ సమంచిత భోగభాగ్యముల్‌
కర్ణసమానదానము నఖండపరాక్రమశక్తి, నిత్య దృ
క్కర్ణ కులీన వాగ్విభవగౌరవ మాశ్రితబంధురక్షణో
దీర్ణ కృపారసంబును నతిస్థిరబుద్ధి, చిరాయువున్‌, సుధా
వర్ణయశంబునున్‌ కలిగి వర్ధిలజేతువు జగ్గసత్కవీ

అని యనేకప్రకారంబులం గొనియాడి యీడులేని వేడుకం చంద్రరేఖాభిధాన వార వారణరాజయాన యూరుప్రదేశంబున శిరంబు మోపి పరుండి క్రిందు చూచుచు నా రాజాత్మజుండిట్లనియె

వేంకటశాస్త్రులు మాకు న
లంకారగ్రంథమొకటి లలి సురభాషన్‌
బంకించె ఆంధ్రకావ్యం
బంకిత మొనరింపు మీవు నట్లనె మాకున్‌

అని మున్ను సత్ప్రబంధం
బొనరింపుమటంచు చెప్పియుంటిమి వెస న
ట్లనె రసముగ చెప్పితి వది
గొన నిపుడు ధనంబు లేదు కొదువ లభించెన్‌

విను మదియెట్లన మనుజులు నామీద
బిట్టుగ చలమూని విజయరామ
ధరణీశుతో చెప్ప దండుగ పన్నెండు
వేలరూపాయలు వేగగొనియె
నిచ్ఛాపురంబులో నేనొక్క లంజతో
భోగించి నిద్దుర బోవ చోరు
లెలమి డేరా చొచ్చి బలువైన గుఱ్ఱంబు
వెండిపల్లము పదివేలవరాల

సొమ్ము దొంగిలిపోయిరి సొమ్ముపక్కి
సాటిదేశంబు రాయభూషణుడు ద్రొబ్బె
తప్పె భాగ్యంబు నిర్భాగ్యదశ లభించె
తవిలి సత్కృతి గొన పదార్థంబు లేదు

అదియునుం గాక

సత్కృతులు మున్ను రాజు లసంఖ్యగాగ
నంది రవియెల్ల జగతి నందంద యణగె
ఘనత జగదేకవిఖ్యాతి కలుగదయ్యె
వ్యర్థమయ్యె పదార్థంబు వారిదెల్ల

అపకీర్తియు కీర్తియు భువి
నెపుడుం పోకుండు; కీర్తి కియ్యగవలయున్‌
విపులముగ ధనము; మాకిపు
డుపకారము గాగ చెప్పు మొకకృతి సరగన్‌

చెప్పిడుము హాస్యరసముగ
గుప్పున ముందెవరు చెప్పుకొననిదిగా
ఇప్పుడు నాకును నొప్పుల
కుప్పకు ఈ చంద్రరేఖకును ముదమొదవన్‌

గంగి సుమీ మును పేరున
భృంగి సుమీ నాట్యకలన పేర్కొన మరు సా
రంగి సుమీ దీనమ్మను
దెంగి సుమీ కామరతుల దిట్టడనైతిన్‌

వారకన్యక యని నీవు కేరవలదు
దీనితో నాకు నేస్తంబు పూన జేసి
కడకమై నాడిమళ్ళ వేంకటమనీషి
దీనితల్లిని విషయించు దృష్టికలన

బోగమువారందరు న
చ్చో గుంభనమెసగ వచ్చిచూడగ నతడా
యాగాయతనము లో సం
యోగము గావింపజేసె నొగి నిర్వురకున్‌

ఆతనికి కూతురగుటన్‌
చాతుర్యమెలర్ప నేర్పె చౌశీతిగతుల్‌
ఖ్యాతిగ నిది నా మదికిన్‌
చేతస్సంజాత సుమవిశిఖమై నాటెన్‌

దీని మొగంబు డంబు మరి దీని విలంబకుచంబు లందమున్‌
దీని ఘనోరుకాండయుగ దీర్ఘవికీర్ణసుకేశపాశమున్‌
దీని మధుప్లతాధరము దీని మహోన్నత రోమరాజియున్‌
దీని సుబాహుమూలరుచి తెల్లమ నాకెదబాయ వెప్పుడున్‌

సానుల గూడనో మునుపు చక్కని చిక్కని నిక్కు ముక్కు పె
న్యోనుల చూడనో కడు సముజ్వల పంకజపత్త్ర విభ్రమా
నూన విలాసపేశల మనోహర యోనికి సాటిసేయగా
కానగరాదు వస్తువది కన్నుల కట్టిన యట్ల తోచెడిన్‌

చంద్రబింబస్ఫూర్తి చౌకసేయగ చాలు
ముద్దుగారెడి నవ్వుమోము తోడ
కలువరేకులడాలు కడకొత్తగా చాలు
తోరంపు నిడుదకందోయి తోడ
కరటికుంభంబుల పరిభవింపగ చాలు
కర్కశకుచయుగ్మకంబు తోడ
బంధుజీవముల తోడ ప్రతిఘటింపగ చాలు
రాగసంయోగాధరంబు తోడ

సొగసు కులుకంగ నుపరతి చొక్కజేసి
కొసరి నా మానసంబెల్ల కొల్లలాడి
నన్ను దాసునిగానేలె నన్నిగతుల
దీని వర్ణింపుమా రసోదీర్ణముగను

ఎన్ని విధంబుల దెంగిన
తన్నదు తిట్టదు వరాలు ధాన్యము సొమ్ముల్‌
సన్నపు కోకలు తెమ్మని
నన్నడుగదు యిట్టి వారనారులు కలరే

భగము బిగి మొగము జిగియును
చిగురాకన్మోవికావి చెప్పగతరమా
తగ నన్నును దీనిని కడు
సొగసుగ వర్ణింపవలయు సుకవివతంసా

అని యత్యంత ప్రేమాతిరేకంబున వేడిన నే నిట్లంటి

ఆది పురోహితులైన తేజోమూర్తు
లను గతాయులకడ కనిపినావు
సాధు జయంతి మహాదేవు మాన్యంబు
లెలమి కాసాలంజ కిచ్చినావు
రాయవరంబు మిరాశిదారుల వెళ్ళ
గొట్టి కొంపల పసుల్‌ కట్టినావు
ధర్మాత్ముడును తాతతమ్ముడు నగు రాయ
విభు నిరుద్యోగి కావించినావు

బోయగొల్లాములో కాసు పోకయుండ
వేంకటమనీషి చేత నిరంకుశగతి
క్రతువు సేయించితివి నీకు కృతియొనర్ప
నర్హమగునట్లు చేతు నీలాద్రిరాజ

అనినం ప్రహృష్టదుష్టహృదయుండై శిరఃకంపంబు సేయ నేనును పరమానందకందళిత మానసారవిందుండనై వచ్చి యతనికి షష్య్టంతంబు లీ ప్రకారంబునం చెప్పం బూనితి

నీచాధారునకు మహా
యాచక శుక శాల్మలీ ద్రుమాకారునకున్‌
ప్రాచుర్యవికారునకున్‌
రాచినృపకులాబ్ధి గరళరససారునకున్‌

క్రూరునకు సాధుబాధా
చారునకు న్యోనిపానసర శీలునకున్‌
జారునకు విప్రతతిధన
చోరునకున్‌ బుద్ధిహీన శుభరహితునకున్‌

పరనారీ భగచుంబన
పరతంత్రున కఖిల దుష్టపాపాత్మునకున్‌
నిరుపమ దుర్గుణశీలికి
ధరలో నీలాద్రిరాజ దౌర్భాగ్యునకున్‌

అతిమూఢశీలునకు సం
తత మృగయాఖేలునకున్‌ దాసీవనితా
వితత రతిలోలునకు ఘన
పతిత కుజన పాలునకును పతయాళునకున్‌

దుర్భరతనునకు రండా
గర్భాపాతన విధాన కౌశల కలనా
విర్భూతాపయశునకున్‌
నిర్భర కలుషాత్మునకును నిర్లజ్జునకున్‌

ఆవిష్కృత చంద్రీభగ
దేవీపూజావిధాన ధీసారునకున్‌
కేవల రణభీరునకున్‌
భూవలయోద్ధరణ ఘోర భూధారునకున్‌

వారవధూ సార మధూ
ద్గారి వదన చుంబన క్రకచభవ దురువ
క్త్రారూఢ రదనునకు కాం
తారాంతర సదనునకు వితత నిధనునకున్‌

చింతలపాట్యాన్వయతత
కాంతార కుఠారునకును ఘనతర చింతా
క్రాంతునకు నీలధరణీ
కాంతునకున్‌ వీత సుగుణగణ శాంతునకున్‌

అనభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్పంబూనిన చంద్రరేఖావిలాపంబను సత్ప్రబంధరాజంబునకు కథాక్రమం బెట్టిదనిన

మున్ను శ్రీశివబ్రాహ్మణ వర్ణాగ్రగణ్యుండగు వీరభద్ర భట్టారకేంద్రునకు శ్రీమద్వైఘానస వంశోత్తంసంబగు నంబి నరసింహాచార్యవర్యుం డిట్లని చెప్పం దొడంగె

బహుళ నానావిధ పశుకళేబర చర్మ
కంకాళ వాల ఖురాంకితంబు
మస్తిష్క వల్లూర మాంసఖాదన మోద
కంక వాయస కృధ్ర సంకులంబు
సాంద్రక్షతజ బిందుసందోహ పరిమిళ
న్మక్షికా క్రిమికీటకాక్షయంబు
పలలాశనానందభరిత పరస్పర
కలహకృత్కౌలేయ గవయశివము

మధురతర మదిరాపాన మదభరాతి
ఖేల బాలిశ చండాలజాల తాడ్య
మాన తూర్యనినాద సమన్వితము దు
రాపవనపల్లి బోయగొల్లావు పల్లి

బోయలును గొల్లలును నందు పొందు గూడి
యుండుటను బోయగొల్లమై యూరు వెలసె
మరియు తద్గ్రామమున నొక మాలపెద్ద
చెరువు త్రవ్వించె జనుల కచ్చెరువు కాగ

అంత కొంతకాలంబునకు

అప్పారావున కొక కృతి
చెప్ప నతండడగ నందు చేరెను వినయం
బొప్పన్‌ వేంకటశాస్త్రులు
గుప్పున నతడాడిమళ్ళ కులు డెన్నంగన్‌

వాని ప్రార్థింప నొక పెనుపాక చూప
వాసముగ నందు వసియించి వలనుమీర
కొడుకులును తాను వాడిచ్చు కోలు తినుచు
ఇడుములకు నోర్చి కాలంబు గడుపుచుండి

నీలాద్రివిభున కా కృతి
వాలాయము నిచ్చి సిరులు వడయగ వలెనం
చాలోల చిత్తమున తా
నాలోచన సేయుచుండె నాత్మజ తోడన్‌

అంత

కటకపు వేంకటసానికి
విటుడగుటను నూజవీడు విడిచి యచటికిన్‌
తటుకున కూతుం దోడ్కొని
మటుమాయలు పన్నుకొనుచు మచ్చిక చేరెన్‌

చేరిన దాని నతడు గని
కూరిమితో కౌగిలించుకొని మక్కువ నా
హారాదికంబు లిడుచును
మారక్రీడల చెలంగి మన్నన నునిచెన్‌

అది యెట్టిదనిన

పుట్టకాల్‌ సొట్టకేల్‌ వట్టివ్రేలుం జెవుల్‌
పట్టు లేకట్టిట్టు బిట్టు కదలు
మిట్టపండ్లును పెనులొట్ట కన్గవయును
బిట్టులై చుట్టలై నిట్టనిగిడి
దట్టమై బలు కొంగపిట్ట చట్టువలను
కొట్టంగ సమకట్టినట్టి తెలుపు
రెట్టింప నౌదలబుట్టి చెంపలమీద
నట్టాడు ఈకలకట్ట చుట్ట

తొట్టిపెదవులు తుంపరలుట్టిపడెడు
చట్టికెనయగు నోరును గట్టిలేక
కొట్టుమిట్టాడు బలు జనులుట్టిపడెడు
యోనిగలయది వేంకటసాని మరియు

కల్లు పెల్లుగద్రావి కారుకూతలు కూయు
మాలని నైనను మరులుగొల్పు
కాసువీసంబులు వాసిగా లంకించి
జుడిగి నెల్లాళ్ళలో జోగి చేసి
యిలు వెళ్ళగా కొట్టు నెక్కువతక్కువ
మాటలాడును వట్టిబూటకములు
వేంకటశాస్త్రుల వేశ్య నెవ్వరితోడ
నవ్వదంచును జనుల్‌ నమ్మ తిరుగు

కూతునకు ఎవ్వనిం దెచ్చి కొమరుకన్నె
ప్రాయ మిప్పించి ఏరీతి ప్రబలునట్లు
చేసెదవొ యంచు చెవిలోన చెప్పుచుండు
శాస్త్రిగారికి వేంకటసాని యెపుడు

ఈసరణి తెలుప నాతం
డా సానిం జూచి పలికె నలివేణి! మదిన్‌
వేసరక తాళియుండుము
నీ సుతకున్‌ కూర్మి కూర్తు నీలాద్రినృపున్‌

నా కృతికన్యకకును కన
దాకృతి యీ కన్యకకును నతనిం బతిగా
నీకొన జేసిన మనకున్‌
చేకురు భాగ్యంబటంచు చెప్పి రయమునన్‌

యాగము పేరుచెప్పికొని అర్థము భూప్రజ వేడి తెచ్చినన్‌
భోగము సేయవచ్చు నిజపుత్త్ర సహోదర దార బంధు సం
యోగము గాగ నంచు మది నూహ యొనర్చి యతం డఖండ మా
యాగుణ దూషితాత్ముడయి యచ్చొటు వెల్వడి యెల్ల భూములన్‌

నీచత్వమునకు రోయక
చూచిన నరులెల్ల వేడి సుడివడక కడున్‌
యాచన చేసి పదార్థ మ
గోచరముగ సంగ్రహించుకొని వచ్చి వెసన్‌

మాలవాని చెరువు మరువున పందిళ్ళు
సాలలును ఘటించి సంభ్రమమున
యాజకులును పెద్దలైన విప్రుల కూర్చి
దీక్ష బూని నిజసతియును తాను

కడక దక్షిణాగ్ని గార్హపత్యాహవ
నీయ వహ్నులందు నిలిపి మంచి
మేకపోతుగముల మెదలకుండ వధించి
వెరవు మీర నందు వేల్చుచుండి

మఖము చూడ వచ్చు మనుజుల కిష్టిష్టి
కాగ అన్నమిడడు, గదుముడనుచు
కొడుకుతోడ తనదు కూతుమగనితోడ
చెప్ప వారు లోభచిత్తులగుచు

కొందర కొకింత కూడిడి
కొందరకుం కూరలొసగి కొందరకిడకే
దండన సేయుచు గెంటుచు
కొందర తిట్టుచును వెళ్ళగొట్టుచు కడకన్‌

పుడమిరేండ్లంపిన గుడ దధి హైయంగ
వీనముల్‌ లోనిండ్లలోన దాచి
కరణంబు లంపిన కంద పెండలములు
పదిలంబుగా నేల పాతివైచి
బ్రాహ్మణుల్దెచ్చిన బహువిధఫలములు
లోలోన తనదు చుట్టాలకిచ్చి
కోమట్లు తెచ్చిన గురుతర వస్తువుల్‌
మెల్లమెల్లన తారె మ్రింగివైచి

పప్పులో నుప్పు మిక్కిలి పారజల్లి
నేతిలో ఆముదమ్మును నిండ నింపి
పులుసులో గంజి మిక్కిలి కలయబోసి
భక్ష్యములలోన మిరియంపు పదడు కలిపి

మంచి బూరెలు పొణకల మాటువెట్టి
పిండిబూరె లొక్కొక్కముక్క పెద్దవారి
విస్తరులలోన పారంగ విసరివైచి
కసరికొట్టిన విప్రు లాకటను లేచి

శపియించుచు ఎండలచే
తపియించుచు నేటికేమి తాళుడటంచున్‌
చపలస్వాంతుం డీతడు
కపటపు యజ్ఞంబు సేయ కడగె నటంచున్‌

చప్పట్లు చరచుకొంచును
ముప్పున నితడేల క్రతువు మొనసి యొనర్చెన్‌
మొప్పెతనంబున, అర్థము
గుప్పున ఇక్కపటవృత్తి కూర్చె నటంచున్‌

జవ్వనంబున వేంకటసాని యధర
మధువు గ్రోలిన రోతవో మదితలంచి
వృద్ధదశ సోమపాన మివ్విధి నొనర్చె
కాని స్వర్గాపవర్గేచ్ఛ కాదు సుండు

అనుచు జనులెల్ల నిబ్భంగి నాడుచుండి
రంత వేంకటశాస్త్రి ఆగాయతనము
ప్రకటముగ చూడ చింతలపాటి నీల
నరవరగ్రామణి మనంబునం దలంచి

బోగము మిడిమేళంబులు
భాగవతులు వేటకాండ్రు భషకచయంబుల్‌
మూగి తనవెంట కొలువగ
వేగంబున తరలి యట ప్రవేశంబయ్యెన్‌

ఇట్లు ప్రవేశించి యవ్విప్రపుంగవు దర్శించి యుడుగరలొసంగి శాలాసమీపంబునం పటకుటీరాభ్యంతరంబున నిలిచి తదీయ క్రతుమంత్రతంత్ర ప్రయోగ ప్రధాన విధానంబు లాలోకించి హాళిం గనుచుండె; నయ్యవసరంబున

విష్ణలోపలి పుచ్చవిత్తుల గతి కప్పు
గల గొగ్గిపండ్ల సింగారమడర
విప్పు కల్గిన పేడకుప్పలో పురువుల
చొప్పున కొప్పున సుమము లమర
కప్పచిప్పల పొల్సుకండ లూడెడి రీతి
చీకుకన్నుల పుసు లేపుమీర
నూతిచెంగట వ్రేలు నునుతంబ కాయల
సరణి పొక్కిలిదండ చన్నులొప్ప

గడ్డిబొద్దు వలెను మేను కానిపింప
బారకర్రల తెరగున బాహులలర
జనకయాగంబు చూడవచ్చెను త్రికోణ
సాంద్రతర రోమరేఖ ఆ చంద్రరేఖ

ఇటువలె నచటికి వచ్చెడు
విటకంటకి చూచి చిత్తవిభ్రమ మొదవన్‌
తటుకున నీలనృపతి హృ
త్పుటమున సోలుచును దాని పొగడదొడంగెన్‌

జడకుచ్చును మెడహెచ్చును
నడగచ్చును బొచ్చుపెరిగి నలువగు మేనున్‌
నిడుదగు తొడల బెడంగున్‌
కడు వలమగు నడుము కలుగు కలికిది భళిరా

నిక్కు పొగపిడుత కదరా
ముక్కు; మొగంబెన్న కోతిముఖమున కెనయౌ
పొక్కిలి మొలలో తగు భళి
అక్కజపుం నూనెసిద్దెలౌర కుచంబుల్‌

మోవి పీయూషమూరును కేవలముగ
గవ్వదళసరి పండ్లహా! కలికిమేని
మృదువు కోరింతకంపల గదుమజాలు
చెక్కులలరారు లోహపునక్కు లౌర

చూపు కాకిచూపు నేపారుకన్నులు
పిల్లికనుల గదుమ నుల్లసిల్లు
స్వరము గార్దభమును పరిహసింపగ జాలు
మదనసదనమెల్ల మంగలంబు

ఈనీటు సాని నెచ్చట
కానముగద మున్ను; నేడు గట్టిగ దీనిన్‌
పోనీక రతి గలంపక
యే నేక్రియ తాళువాడ నిక నిచ్చోటన్‌

భషక కపి చటక గార్దభ
వృషభాదిక బంధగతుల వేమరు దీనిన్‌
విషయింపక ఏలాగున
విషమశరు కరాళి బాధవీడునె నాకున్‌

బాలరండల పదివేల మరుల్గొల్పి
కోర్కె దీరగ మున్ను కూడినాడ
మగవాండ్ర పెక్కండ్ర మచ్చికలగావించి
కొంచక రతుల చొక్కించినాడ
దాసికాజనులకు కాసువీసంబీక
వెస గొల్లవంపులు వెట్టినాడ
సానిబోగమువాండ్ర చనవుబల్మిని బట్టి
పలుమారు రతికేళి కలసినాడ

కాని యీసోయగమును ఈ కలికిమీది
ప్రేమమును పెరచోట లభింపలేదు
మరుని మాయావికారమో మగువ మచ్చు
మందు చల్లెనో నామది మందగించె

ఈ మాపీ యింతిని నా
కామాతురతమెల్ల తీర గాఢతరమహా
స్తోమాయత ఖరబంధో
ద్దామత మెరయంగ దెంగెదను వలపారన్‌

పుణ్యంబేదిన నేదనీ, జనులు గుంపుల్గూడి కాదంచు కా
ర్పణ్యప్రక్రియ తెల్పినం తెలుపనీ, రాజుల్‌ మహాదుర్గుణా
గణ్యుండంచును పల్కినం పలుకనీ, కౌతూహలంబొప్ప నీ
పణ్యస్త్రీ మధురాధరోదిత సుధాపానంబు కావించెదన్‌

చెక్కిలినొక్కి ముద్దుగొని చిక్కని చక్కని గుబ్బచన్నులం
దొక్కట గోరులుంచి జిగియూరువు లంటుచు కోర్కెతీరగా
కుక్కుటబంధవైఖరుల కూడినగాక మనోజుధాటిచే
ఇక్కడ నిల్వగా తరమె యించుకయున్‌ పెరమాట లేటికిన్‌

అని యనివారితమోహము
మనమున పెనగొనగ నతడు మరిమరి చూడన్‌
వనితయు నాతని తప్పక
కనుగొని యనురాగమొదవ కడక నుతించెన్‌

పరువంపు ప్రాయంపు తురకబిడ్డని రీతి
మట్టుమీరగ పాగ చుట్టినాడు
కులుకుజవ్వనపు బల్‌ గుజరాతి పాపని
వీలుగా ప్రోగులు వెట్టినాడు
ఆడుభాగవతుని జాడ గడ్దము మూతి
నున్నగా గొరిగించుకొన్న వాడు
డుబుడక్క కొమరుడు డుంక నిజారును
పుడమిజీరెడి నగల్‌ తొడిగినాడు

మడుగులోబడ్డ మహిషంబు మాడ్కి మేన
నందముగ మంచిగంద మలందినాడు
భళిర యీ నీలనృపతితో కలయ కలుగు
బాలికామణిదే కదా భాగ్యమరయ

ఖర ఘృష్ణి సదృశ తేజుడు
పరమాత్మజ తుల్య రూపశాలి సుభగ భా
సురవదనుడు హరిసన్నిభ
గురుతరగుణు డిట్టి రాచకొమరుడు కలడే

గుహ్యకేశ తుల్య గురువైభవుండు పీ
నోరుశాలి సమరభీరు డుర్వి
జనుల నమలుబుద్ధి చనువాడితని తేరి
వాసుదేవు డెట్లు చేసెనొక్కె

ఆ వాలుకన్ను లందము
పీవర భుజదండములును పృథుగండములున్‌
కేవల శోభాతనుడీ
భూవరు డర్మిలిని నాకు బొజుగగు నొక్కో

బూరుగు పెనుమ్రాను పొడవు, గానుగరోటి
వలయదేహము, దాకవంటి నోరు
పెనురసపుం బొల్లిపెదవులు, అలమైన
బుర్రముక్కును, క్రొత్త బోడిగడ్డ
మల జ్యేష్టకిరవగు వెళుపుమొగంబును,
పొడకంత తలకాయ, కుడితి గూన
బోలెడు బొజ్జయు, పొలసుకన్నులు, లావు
నడుము, రాపాడెడు అడుగు లౌర

పెద్ద యేనుగుకాలంత కద్దు శిశ్న
మిట్టి సౌందర్యనిధి భువి పుట్ట జేసి
నట్టి తామరపట్టి నేర్పరయ తరమె
చాల చదివిన వేంకటశాస్త్రికైన

నా పూర్వపుణ్యఫలమున
ఈ పురుషునితోడ నేస్తమెనసిన కూర్మిన్‌
రేపిచ్చెద మాపిచ్చెద
కాపట్యములేని నిండు కౌగిలితనికిన్‌

జడ కటిసీమ తూల, నిడుజన్నులు రొమ్మున వ్రేల, కొప్పు వె
న్నడరుచు చిందులాడ, పురుషాయితబంధ కళాప్రవీణతన్‌
చెడుగుడులాడి వీని ఘనశిశ్నపటుత్వ మహత్వ మెన్నుచున్‌
విడువక వీని కూడి మది వెర్రితగుల్కొన చేయుటెన్నడో

కూతుబుడమ, మర్లమాతంగి ఆకును
మూత్రంబుతో నూరి ముద్దచేసి
పచ్చిపనస తోడ బాగుగా మర్దించి
నూనెతోడను కూర్చి మేన నలుగు
పెట్టిన నుమ్మెత్తవిత్తులు గుండెత
ల్లడపాకు పసరు నుల్లాసమునను
కాల్మడి కలిపి పోకలు దానిలోపల
నానించి యెండించి లోనికిముడ

వీడియముతోడ పెట్టిన విడువకితడు
బంటు తెరగున నా వెనువెంట తిరుగు
నట్లు సేయగ అత డెన్న డబ్బునొక్కొ
మెల్లమెల్లన కలధనంబెల్ల దొబ్బ

కొందరు మలయుక్తముగా
మందిడుదురు మరులుకొనగ మా వారసతుల్‌
మందత చెందును విటుడటు
నింద గదా యటుల సేయ నృపవర్యునకున్‌

ఏలాగు మాటలాడుదు
ఏలాగున మరులు కొలిపి యెలయింతును నే
నేలాగు లోలుజేయుదు
నేలాగున కలుగువిత్త మెల్ల హరింతున్‌

అని చాల జాలినొందుచు
చనుగుబ్బల పైటజార్చి చక్కగనొత్తున్‌
మొనవాడిచూపు చూచును
పెనుకొప్పటు జారజేసి బిరబిర ముడుచున్‌

ఆవ ద్రావిన పసరమ ట్లది మెలంగ
చూచి నీలాద్రిభూపతి సొమ్మసిల్లి
మెల్లమెల్లన తెలివొంది కల్లుద్రావి
పరవశత నొందు చండాలు పగిది తోచి

వలబడ్డ మీను కైవడి, నిప్పుద్రొక్కిన
కోతి భాతిని, వెర్రిగొన్న కుక్క
పద్ధతి, కుడితిలో పడిన మూషికమట్లు,
శ్లేష్మంబులో ఈగ లీల, సన్ని
పాతి చందమున, వాతంపుగొడ్డు వి
ధంబున, లాహిరీదళము మిగుల
తినిన పాశ్చాత్యుని తీరున, ఉరివడ్డ
పక్షి కైవడి, పెనుపాము పగిది,

భూతమూనిన మనుజుని పోల్కి, బెట్టు
మందు మెసవిన మాన్యు మాడ్కి, దేహ
మెరుగ కెంతయు కళవళంబెసగ దాని
పై తలంపిడి కన్ను మోడ్పక యతండు

తలనొప్పియు తాపజ్వర
మలసటయును మిగుల పొడమ నసురసు రనుచున్‌
నిలువంగ బలము చాలక
తలిమముపై వ్రాలి దాని తలచుచు నుండెన్‌

అని నంబి నారసింహుం
డనువొప్పగ నిట్లు చెప్ప నా తంబళి వీ
రన యావలికథ లెస్సగ
వినయంబున చెప్పుమనుచు వెస వేడుటయున్‌

నీచచరిత్ర వారరమణీభగ రుక్తతగాత్ర నిత్య దు
ర్యాచకమిత్ర సజ్జనపదార్థ పరిగ్రహణైకసూత్ర దు
ష్కాచ పిశంగనేత్ర నృపకర్మ మహాలతికా లవిత్ర శ్రీ
రాచి నృపాల గోత్ర వనరాశి కనద్‌ బడబాగ్నిహోత్రమా

దురాలాప దుర్దోష దుర్మార్గ వర్తీ
ధరామండలఖ్యాత ధౌర్య్తాపకీర్తీ
పరస్త్రీ రతాసక్త భావప్రపూర్తీ
స్థిరాయుస్స్థిరాజాత దీర్ఘోగ్రమూర్తీ

ఇది శ్రీమజ్జగన్నాథదేవ కరుణాకటాక్ష వీక్షణానుక్షణ సంలబ్ధ సరసకవితావిచిత్ర సలలితాపస్తంబసూత్ర కౌండిన్యసగోత్ర కూచిమంచికుల పవిత్ర గంగనామాత్యపుత్ర మానితానూన సమాన నానావిధరంగ త్రిలింగదేశ భాషావిశేష భూషితాశేష కవితావిలాస భాసురాఖర్వ సర్వలక్షణసార సంగ్రహోద్దామ శుద్ధాంధ్రరామాయణ ప్రముఖ బహుళ ప్రబంధ నిబంధన బంధురవిధాన నవీనశబ్దశాశన బిరుదాభిరామ తిమ్మకవిసార్వభౌమసహోదర గురుయశోమేదుర వివిధవిద్వజ్జనవిధేయ జగన్నాథనామధేయ ప్రణీతంబైన చంద్రరేఖావిలాపం బను హాస్యరస ప్రబంధరాజంబునం బ్రథమాశ్వాసంబు సంపూర్ణము