చంద్రరేఖావిలాపము

వద్దు సుమీ యిది కూడని
పద్దు సుమీ నాదు మాట పాలించితివా
ముద్దు సుమీ ఆ సానిది
మొద్దు సుమీ దానిదెంగు మోహంబేలా

జగ్గ కవిరాజు చేతం
పగ్గెయు సిరి వోవ తిట్లువడితివి చంద్రిన్‌
మగ్గము వెట్టిన మొదలే
నెగ్గవయో నీలభూప నృపసుమచాపా

అప్పు డప్పలుకులు విని కటకటంబడి కటమదర పండ్లు పెటపెటం గొరికి చటుల క్రోధ కుటిలారుణలోచనుండై తదీయ ప్రధాన ప్రధానుండగు ఆదుర్తి భీమ నామ మంత్రి అతని కిట్లనియె

ప్రభుచిత్త మెవ్విధంబున
ప్రభవించునొ అట్లె నీవు పలుకక వడి ని
ట్లు భయము మాని పలికెదవు
సభలో వారెల్ల కడు నసహ్యత పడగన్‌

ఓంభూలు చేసికొంచును
జంభంబులు కొట్టుకొనుచు జడమతి నశుభా
రంభము లరయుచు తిరిగెడి
దంభపు విప్రునకు నీకు తగదిది చనుమా

పప్పుదప్పళంబులొప్ప తప్పొప్పులు
సెప్పుకొంచు తడక విప్పుకొంచు
చదువుకొంచు తిరుగ ఛాందసుల్‌ మీరలు
రాచకార్యములకు రాగ తగునె

కైశ్యంబేలా విధవకు
వైశ్యునకున్‌ సమర విజయవాంఛ లవేలా
వశ్య యయి కులికి పైబడు
వేశ్యారతిసుఖము వేదవేద్యున కేలా

అనిన నమ్మంత్రిజన పుంగవున కాత డిట్లనియె

నిష్ఠవిహీనుండవు ఘన
నిష్ఠుర మాయాప్రలాపనిపుణుడ వీవే
జేష్ఠ వితనిని నియోగి
జ్యేష్ఠుల లోపలను చేర్చి చెప్పగనేలా

తిరుమణియు తులసిపేరులు
తిరువారాధనయు పెద్ద తిరుగూడ వెసన్‌
ధరియించి ముష్టికిప్పుడె
తరలుము మంత్రాంగముడిగి దాసరివగుచున్‌

బంధుడును పండితుడు కూరపాటి రాయ
మంత్రివర్యుం డతని తోలు మడతవెట్టి
కొట్టి సన్యాసి జేసితి విట్టివాడ
వితని కులశేఖరుని చేయుటెంత నీకు

ఇయ్యనీయవుగదా ఎంత సత్కవి వచ్చి
ప్రస్తుతించిన పూటబత్తెమైన
ఉండనీయవుగదా చండపండిత రాజ
మండలంబును సభామంటపమున
నిల్వనీయవుగదా నిమిషమాత్రంబైన
ఆశీర్వదించు ధరామరులను
చూడనీయవుగదా వేడుకతోపాడు
గానవిద్యా ప్రౌఢగాయకులను

కూసుమత మార్గరతుడవై కులము విడిచి
తిరిగి నీవిందుజేరి మంత్రిత్వమూని
త్రిప్ప నీలాద్రిరాజిట్లు మొప్పెయయ్యె
భీకరవ్యాజ ఆదుర్తి భీమరాజ

సామంబేమియు లేదు సాంత్వనవచస్సందర్భమున్‌ నాస్తి దు
ర్గ్రామణ్యం బధికంబు కాముకతయున్‌ కాపట్యమున్‌ హెచ్చుగా
భీమామాత్యుడవంచు పల్కుదురు నిన్‌ పృధ్విన్‌ యదార్ధం బహో
నీ మంత్రాంగముచేత నేడు చెడియెన్‌ నీలాద్రిరాజెంతయున్‌

గణికశ్రేష్టుడ వయ్యో
గణకాంగణపొందు రాజుగారికి తగదం
చణుమాత్రము చెప్పవు నీ
గుణము తెలిసివచ్చె బుద్ధికుశలుడవు భళీ

అని వారిరువు నిటువలె
ఘన ఘనరవ సదృశ నాద గద్గదగళులై
కినుక వివాదింపంగా
విని చింతలపాటి నీలవిభు డిట్లనియెన్‌

మీరేటికి వాదించెద
రూరక యుండుండు చెలిమి యొప్పారంగా
గౌరవమున నామదిగల
ఆరాటము తీర్ప బాప డసమర్ధుడుగా

రతిచింత చేత నిప్పుడు
మతివోయిన రీతినుండు మాకున్‌ సుద్దుల్‌
హితమతి చెప్పెదు పోపో
పతిచిత్త మెరుంగలేవు బాపడవయ్యున్‌

అని యతనిమీద రోషసంఘటిత చిత్తుండగుట గనుంగొని తత్సన్నిధిగలవార లేగుమనిన నతండరిగె నంత భీమరాజుం జూచి యేకాంతంబున నిట్లనియె

బాపడని నేస్తుడనియును
నోపిక చేసితిని గాని యొడుతును జుమ్మీ
పాపమున కోడ కిమ్మెయి
బాపన్నను భీమరాజ పటుకోపమునన్‌

అనిన భీమరాజతని కిట్లనియె

అదనైన పంది పొడవవొ
ఎదురించిన పులిని పొడవొ ఏన్గు పొడవవో
కదనమున శత్రు పొడవవొ
వదరుచు నెదురాడు నట్టి పారు పొడవవో