ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్

తెలుగు నవలా సాహిత్యాకాశంలో హిమజ్వాల, అనుక్షణికం అనే ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి, దీర్ఘంగా మౌనించి, ఈమధ్యనే హఠాత్తుగా నిష్క్రమించిన శ్రీ వడ్డెర చండీదాస్ అసలు పేరు చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఎవరో బెంగాలీ శాక్తేయుడి పేరిట తన పేరునీ, శ్రమజీవులకి చిహ్నంగా ఇంటి పేరునీ మార్చుకొన్న శ్రీ చండీదాస్ తిరుపతిలో యస్వీ యూనివర్సిటీలో ఫిలాసఫీ అధ్యాపకుడిగా పనిచేసి విరమించారు.

1960 లో హిమజ్వాల మొదటి అధ్యాయం రాసి, ఏడు సంవత్సరాలు కారణం లేకుండా కలం పట్టుకోకుండా మళ్ళీ 1967 లో మొదలెట్టి ఆర్నెల్లలో పూర్తిచేసారు. Whitehead, Sartre, Jung ల తత్వాలు మూలాంశాలుగా , “గమనాన్నీ, యానాన్నీ, ప్రవాహాన్నీ అక్షరాలలో చిత్రించాలని — అంతర్ బహిర్ వర్తనాల మధ్యన వుండే గొలుసు పొరలు చిరగకుండా వొక్కొక్కటె విప్పి; యేదో శూన్య రహస్యాన్ని తెలుసుకోవాలన్న కోర్కె” తో రాసిన అస్తిత్వ వాద మనోవైజ్ఞానిక నవల హిమజ్వాల. తన మొదటి నవలతోటే పాఠకులకి ఆశ్చర్యానందభూతిల్ని కలిగించి వున్నత సాహిత్యశిఖరాలను అందుకున్న అరుదయిన రచయిత శ్రీ చండీదాస్.

హిమజ్వాలలో ఇద్దరు ప్రధాన పాత్రధారులు–ఫిలాసఫీ ప్రొఫెసర్ కృష్ణచైతన్య, గీతాదేవి–ఒకరిపై ఒకరికి సహజ మోహం. కానీ ఆమెలో తన చనిపోయిన తల్లిని చూస్తాడు. అక్రమ సంయోగ భీతి అతన్ని అకర్మయుణ్ణి చేస్తే, ఆందోళనతో దేశదిమ్మరవుతాడు. . గీతాదేవికి తన చనిపొయిన రసజీవి తండ్రి ఆదర్శం. ఆమె అంతరంగంలో–“యెంత బావుంది డాడీ మంచు, అనురాగంలా. పసిపాప చిరునవ్వులా, సన్నగా కరుగుతున్న మంచు–నువ్వు చిన్నప్పుడు అలాగే వుండేదానివమ్మా. కాకపొతే ఇప్పుడు అందులో విద్యుత్తు ప్రవేశించింది–కృష్ణా నీ మురళి మోగదేం, యే మీమాంస రగడలో మునిగిపోయినట్లు–వుష్–మాల్ రో నీమీద రాస్తే నాకేమొస్తొంది–యేమొస్తుందని నులివెచ్చని చలిలో శరత్కాలపు వెన్నెల ఆకాశాన్ని చూస్తూకూర్చుంటాను! అందుకే అమ్మా, గీతా intrinsic విలువలు వున్నాయనే విషయాన్ని మర్చిపోకు. నీ తండ్రి నీకు ముఖ్యంగా చెప్పే విషయం యిదే.”

గీతాదేవికీ భర్త శివరాంకీ–రసజీవికీ అందమైన పశువికీ–జరిగే విషాద రగడతో చివరికి నవల విషాదాంతమవుతుంది. తెలుగులో magnum opus గా పేరున్న “చివరకు మిగిలేది” నవలా రచయుతకి దీన్ని అంకితం చేసారు: “తెలుగుతనపుకూపంలో యిమడలేక అభాసుపాలైన కళాతపస్వి శ్రీ బుచ్చిబాబు గారి స్మృతికి”. హిమజ్వాలని ప్రయోజనం లేని ప్రయోగాత్మకమైన నవలగా విశ్లేషించారు ‘మో’. దానిని బూర్జువా నవలగా, చండీదాస్ వ్యక్తివాదాన్ని, “సాహిత్యానికీ, రాజకియాలకీ వుండే సంబంధాన్ని తెలుసుకోలేకపోతే రచయిత శక్తి సమాజానికి ఉపయోగపడకుండా తోమిన చెంబుల్లాంటి కళాఖండాలని సృష్టిస్తూ పోతుందని” ఈనవలని సీరియలించిన పురాణం విమర్శించారు. ప్రయోజన లేమి సంగతెలా వున్నా, సాహసంతో కూడిన మానసిక విశ్లేషణ అని ఒప్పుకోవాలేమో!:

“అంతరాళ భయంకరప్రాంతరాలనా నీ విహారం?ముళ్ళదారినా నీ సంచారం?

పలికించకు మౌన మృదంగాలను!కెరలించకు శాంత తెరంగాలను!హృదయంలో దీపం పెట్టకు!మంత్ర నగరి సరిహద్దులు ముట్టకు!” — శ్రీశ్రీ సాహసి

హిమజ్వాల లో సమాజ చిత్రణ దాదాపుగా శూన్యం. అందుకు చాలా భిన్నమైన నవల అనుక్షణికం. పందొమ్మిది వందల డెబ్భయి దశాబ్దంలో తెలుగుదేశం లో నెలకొన్న ఆర్ధిక పరిస్థితులనీ, సాంఘిక వాతావరణాన్నీ, రాజకీయ సంక్షోభాన్నీ నేపధ్యంగా తీసుకొని, వుస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అక్కడ చదువుకుంటున్న యువతీ యువకుల వుద్రేకాలనీ, వుల్లాసాలనీ, ఆకతాయితనాన్నీ, ఆందోళనలనీ, అరాచకత్వాన్నీ, ఆదర్శాలనీ రాగ రంజితంగా చిత్రీకరించిన నవలా మణిరత్నం అనుక్షణికం.

“యితివృత్తం మేధాజనితం.పాత్రలు వాస్తవ జగజ్జనితం. వివిధ పాత్రలు వివిధ సిద్ధాంతాల భావాలు కాదు. రక్తమాంసాల జీవిని యే సిద్ధాంతానికి గానీ పరిమితం చెయ్యటం సాహితీ హత్య”, అంటూ కొన్ని వందల పాత్రలతో, మన లోపాలనీ, ప్రలోభాలనీ, అల్పత్వాలనీ, ఔన్నత్యాలనీ, విస్తృతంగా స్పృశించిన అనుక్షణికం లాంటి నవల మరొకటి తెలుగులో ఇంతవరకు రాలేదు.

పాత్రల ఇంటి పేర్లతో బాటు కులగోత్రాలతో, వూరి చిరునామా తో సహా సాగే పాత్రల చిత్రణ తెలుగులో ఇదే మొదటిసారేమో! ఏ ప్రబోధమూ చెయ్యకుండానే ఆయా వ్యక్తుల సంభాషణల్లో వారి సంస్కారాన్ని చిత్రించి మనల్ని మనమే సంస్కరించుకునేటట్లు చేశారు శ్రీ చండీదాస్:

“మీది వొకే తాలూకా అనుకుంటాను” అన్నాడు గొవ్రీపతిశర్మ. “వొకే తాలూకా కాదు, వొకే వూరు. వీళ్ళ తాత చెప్పులజత కుట్టి యిస్తే మూడేళ్ళదాకా చెక్కు చెదరకుండా వుండేయని మాతాత అంటూ వుండేవాడు.” అన్నాడు అంకినీడు. రాఘవులు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

“యెక్కడికీ? కేంటీన్ కా?” అన్నాడు వరాహశాస్త్రి. “అవ్, తాగిపిస్త, చలో” అన్నాడు గ్నానేష్వర్. “నువ్వేం తాగిపించక్కర్లేదు. మీ దయవల్ల చేతులింకా బాగానే వున్నాయి. నే తాగ్గల్ను, బిల్లివ్వు చాలు” అని `హు, హు` అని నవ్వాడు వరాహశాస్త్రి. “శాస్త్రీ, భాషలో వివిధ మాండలిక పలుకుబడులుంటవి. అట్లా వొంకర్లు తియ్యటం భావ్యంకాదుకదా!” అని చిన్నగా నవ్వాడు మోహన్ రెడ్డి. “ఆంద్రోళ్ళకున్న బీమారె గది.” అన్నాడు సుధీర్.

ప్రేమలో పడి కులం అడ్డు వస్తే తండ్రి మాట జవ దాట లేని స్రవంతి, కొంచం ఆదరువు ఇస్తే ధైర్యంగా ముందడుగు వేసే రమాదేవి, ఎవరికీ తలవంచని గాయత్రి:

“లోకం గొడ్డుపొయినట్లు దొరక్క దొరక్క శూద్రపు వెధవే దొరికాడే నీకు!” అన్నాడు గాయత్రి తండ్రి రామనాధం. “కులాలు వేరైతే మాత్రం–“; గాయత్రిని పూర్తిగా చెప్పనివ్వకుండానే “కులాల మాట గాదు; చాతుర్వర్న వ్యవస్థ–మను ధర్మ శాస్త్రానుసారం అనాదిగా వొస్తోంది” అన్నాడు తండ్రి. “అనాదిగా కాదట. వేదాలప్పుడు వున్న దాఖలాలు లేవట. తరవాత్తరవాత పుట్టుకొచ్చిన తెగులేనట యిది!” అంది గాయత్రి. “నువ్వు గాయత్రివి కాదే. ఆపేరుకే అవమానం. యేడేడు పధ్నాలుగు తరాలు యెటు చూసినా యిలాంటి భ్రష్టు పని లేదు. నిప్పులాంటి వంశం.” “నేనూ నిప్పు లాంటిదాన్నే. అతనుకాక మరెవరు ముట్టుకున్నా నిప్పులా మండే దాన్ని. కాలి మసి అయ్యేవాడు.”

అయిన వాళ్ళనీ, ఐశ్వర్యాన్నీ కాదని, ఇల్లు వదిలి, కాలేజీ చదువు మాని, పూరిగుడిశలో చేరి, కార్మికుల్లో ఒకడై, వాళ్ళకి నాయకుడై, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, మంత్రి పదవుల సన్మానాల వ్యామోహంలో పడికొట్టుకొని పతనమైపోయిన రవి:

“రవీ! ఎంతటి నీచస్థితికి దిగజారావో తెలుసా? దేనికి? చెప్పు దేనికి?” అంది నళిని. చూపు కిందికి వాల్చి, “రాజకీయం భయంకరమైంది. ఆ దాహం, ఆ వ్యసనం–జూదం కంటే ముండల కంటే–అన్నిటికంటే మించిన వ్యసనం. మహా మోహం అది. దాంట్లో పడినవాడు దాంట్లో అంతం కాక తప్పదు” అన్నాడు రవి.

ఆడవాళ్ళని ఆటవస్తువులకంటే హీనంగా చూసే విప్లవ విజయకుమార్; మోసపోయి వంచనకి గురై వేశ్యావృత్తిలోకి జారిపడినా ఆత్మాభిమానం పోగొట్టుకోని కస్తూరి, చితికిపోయిన రమణి; సెక్సాకర్షణతో అందర్నీ కవ్వించి, భర్త తాహతు చాలక సంఘపు పై అంతస్తుల ప్రాకులాటలో ఆహుతై పోయిన తార.

ప్రకృతిలో లీనమై, సంగీతంలో తన్మయమై, అనంత లోకంలో విహరించే స్వప్నరాగలీన, దివి నుండి భువికి దిగి వచ్చిన ఓకాంతిపుంజం, చివరికి అనంత్ లో లీనం కాలేకపొయిన నిస్సహాయతతో నిర్యాణం: “స్ఖలనలీన రాగలీన స్వప్నలీన మౌనలీన నాదలీన విశ్వలీన స్వప్నవిశ్వలీన విశ్వరాగ స్వప్నలీన విషాదాశృలీన ఆనందాశృలీన విషాదానందాతీతలీన తాదాత్మ్య రసోన్మాద జ్వలనలీన స్వప్న విశ్వైక్య రసయోగ విశ్వ సంప్లావిత నిర్యాణం.”

అందరికీ తలలో నాల్కలా, నిరంతరం ఆర్ధిక, రాజకీయ, సామాజిక, తత్వ, కళా శాస్త్ర పుస్తక పఠనంతో, ఇదీ అదీ అని కాక అన్నిటినీ నిశితంగా పరిశీలిస్తూ, దిగకుండానే లోతు గ్రహించే, రచయిత భావాలని కొన్నయినా ప్రస్ఫుటించే నూటికో కోటికో ఒకడైన శ్రీపతి:

“బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీలోని పుస్తకాల పురుగు మార్క్సు వొక తీగపట్టుకుని పాక్కుంటూ వెళ్ళాడు కొనకంటా. యింకా చాలా తీగలున్నాయి. వొక్కో తీగా పట్టుకుంటే వొక్కో చోటికి వెడతాం. చరిత్ర గతి తార్కికమూ కాదు, మతి తార్కికమూ కాదు.”

“ఐనా రాధాకృష్ణన్ యేమంత చెప్పుకోదగ్గ ఫిలాసఫర్ కాదు. యూనివర్సిటీ పంతులు. మంచి స్కాలర్. భారతీయ దర్శన గ్రంధాలు బాగా చదివినవాడు. ప్రెసిడెంటు సింహాసనం అధిష్ఠించాడు. అలాంటి వున్నత రాజకీయస్థితిలోని వాడి ప్రాపకం కోసం గొప్ప తత్వవేత్త అంటూ వందిమాగధ గీతాలు వోండ్ర పెట్టటం ప్రారంభించారు. ఆయన సొంతం అంటూ చెప్పుకోదగ్గదేం లేదు.”

“తెలుగుతనం పల్లెటూళ్ళలోనే అంతరించిపోయింది. పల్లెటూళ్ళలో సినిమాతనం సినిమా నుడికారం సినిమా తెలుగు. సాహిత్యంలోనూ లేదు. గ్రామీణ వాతావరణ సాహిత్యంలోనే లేకపోతే నాన్ రూరల్ నాన్ సబర్బన్ మనుషులలో తెలుగు నుడికారం వుంటేనా సాహిత్యంలో వుండటానికి! వుంటే అన్ రియలిస్టిక్ అవుతుంది. సాహిత్యం రియాలిటీ యెలా అవుతుంది. డబ్బా కెమెరాతో బొమ్మల్లాగితే రియాలిటీ వుంటుంది–నక్సలిస్ట్ రియలిజం–మార్క్సిజం లెనినిజం–మోహన్–యెక్కడున్నావు మోహన్–అంత మౌనంగా–పాతిక వందల సంవత్సరాలనాడు సిద్ధార్ధుడులాగే వెళ్ళిపోయి వుంటాడు–తప్పకుండా నీ అరుణ కబురంపి వుంటుంది–అరుణంటే–అరుణంటే గాయత్రి. గాయత్రి యెలాగో మెలాయించుకొని యెక్కడో తను కలలుగనే కలావని లోకి…”

ఇన్ని సజీవ పాత్రల్ని సృష్టించి, వాళ్ళచే ఇంతగా భాషించి, సమాజాన్ని సునిశితంగా పరిశీలించి, సభలకీ, సన్మానాలకీ, అకాడెమీలకీ, అవార్డులకీ బహు దూరంగా బ్రతికిన ఈ మేధావి రచయిత, “మాట్లాడ్డానికేమీ లేదు; మౌనం ఆవహించింది” అని దాదాపు పాతికేళ్ళు ఏకాంతంగా మౌనించి రచనా వ్యాసంగం నుంచీ, జీవితాన్నుంచీ విరమించడం తెలుగు సాహితీ అభిమానులకి తీరని లోపమే! వాంఛ నుండి విముక్తి అంటే ఇదేనేమో! లేక, తనే అన్నట్లు, సౌందర్యానురాగపు తన వూపిరి శిలావల్మీకమై పోతే అందులో సమాధి అయ్యారో! అమూల్యమూ, అనితర సాధ్యమూ అయిన ఈ రెండు కానుకలూ వదలి వెళ్ళినందుకు కృతజ్ఞతలతో, నివాళులతో:

“ఆకాశతార ఆదరపు చూపులు చాపింది.
అలసిపోయింది పాపం, దీపం.
ఆకాశతార ఆహ్వానగానం చేసింది.
దీపం ఆరిపోయింది.
తారగా మారిపోయింది.”
— శ్రీశ్రీ ఆకాశ దీపం


కొడవళ్ళ హనుమంతరావు

రచయిత కొడవళ్ళ హనుమంతరావు గురించి: పుట్టిందీ పదో తరగతిదాకా చదివిందీ ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో. ఇప్పుడు ఉండేది Washington రాష్ట్రంలో Seattle నగరానికి దగ్గర్లో. ఇంజనీరుగా పని చేసేది సాఫ్ట్ వేర్ రంగంలో. దాదాపు పాతికేళ్ళుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగంలో లీనమై సాహిత్యదృష్టి కొరవడిన లోపాన్ని సరిదిద్దుకోడానికి, గత మూడేళ్ళుగా కొందరు తెలుగువాళ్ళతో పరిచయం, కాస్త తెలుగు చదవడం, ఎప్పుడన్నా ఓవ్యాసం రాయడం - అదీ ప్రస్తుత వ్యాపకం.  ...