మీ ఘంటసాల

“సినిమా పాటలు లైట్‌ సాంగ్స్‌ (లలిత సంగీతమే) కదా అని లైట్‌గా తీసుకోకండి” అనేవాడు సంగీతం బాగా తెలిసిన నా మిత్రుడు. సినిమా పాటలు చక్కగా, తప్పులు లేకుండా పాడటం అంత తేలికైన విషయం కాదు, అన్నది సినిమా పాటలు పాడేవాళ్ళకి, పాడాలని ప్రయత్నించి అభాసు పాలయేవారికి అనుభవమే! శాస్త్రీయ సంగీతం సాంప్రదాయంగా అభ్యసించి, అందులో నిష్ణాతుడై, ఆంధ్రుల అభిమాన గాయకసంగీత దర్శకుడుగా రెండున్నర దశాబ్దాలకు పైగా, మరపురాని మనిషిగా సినీరంగంలో నిలిచిన శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు పై ఈ మధ్యనే వెలువడ్డ ‘మీ ఘంటసాల’ అన్న పుస్తకం ఒక అపురూపమైన పుస్తకం. ఇందులో శ్రీ ఘంటసాల జీవిత విశేషాలు, అనేకమంది విశిష్ట వ్యక్తులతో తీయించుకొన్న అరుదైన ఫొటోలు, అంతకు మించి సినీ రంగంలో పలువురు ప్రముఖులు శ్రీ ఘంటసాలపై వెల్లడించిన అభిప్రాయాలు విలువైనవి. శ్రీ ఘంటసాలకు సినీ సంగీతంలో ఎందుకు ఒక విశిష్ట స్థానం ఉందో ఈ వ్యాసాలు చెబుతాయి.

ఈ నాటి యువతకు శ్రీ ఘంటసాల గొప్ప గాయకుడుగా తెలిసే ఉంటుంది. ఐతే, అందరూ ఎందుకు ఘంటసాల గొప్పవాడంటారో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది.

చరిత్రను గ్రంధస్థం చెయ్యడంలో మనకి శ్రద్ధ తక్కువ అన్నది మన చరిత్రే చెబుతుంది. గొప్ప విషయాలను, గొప్ప వ్యక్తుల గురించి వివరాలను, పుస్తకాలపైకి ఎక్కించటం మనం అరుదుగా చేస్తూ ఉంటాం! ఇటువంటి నేపథ్యంలో, శ్రీ ఘంటసాల దివ్యస్మృతికి అంకితం కాబడ్డ ‘మీ ఘంటసాల’ అందరి తెలుగువారి ఇళ్ళలో ఉండవలసిన పుస్తకం.

ఒక వ్యక్తి యొక్క గొప్పతనం, ఆ వ్యక్తి ఏ రంగంలో గొప్పవాడో, అదే రంగంలో ప్రతిభామూర్తులైన సమకాలీనుల పొగడ్తల వల్ల ఇనుమడిస్తుంది. ఘంటసాల సినీరంగ ప్రవేశం చెయ్యక మునుపు జరిగిన విశేషాలు, ఆయన సినీరంగ ప్రవేశం తొలిరోజుల్లో జరిగిన అరుదైన అనుభవాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఒక కళాకారుడుగా మాత్రమే కాకుండా, ఒక వ్యక్తిగా ఘంటసాల సహృదయత, ఆయనను స్వయంగా ఎరిగిన వారు ఈ వ్యాసాల్లో వివరించటం వల్ల, ఘంటసాల అంటే ఏమిటో మనకి మళ్ళీ తెలుస్తుంది!

ఘంటసాల జీవించి ఉన్న కాలంలో, ఒక ప్రముఖ రచయిత, సంగీత విమర్శకుడు శ్రీ ఘంటసాల పై రాసిన వ్యాసం ఒకటి ఈ పుస్తకంలో ఉంది. అందులో ఒక విషయం ఈమాట పాఠకులకోసం యథాతథంగా ఇస్తున్నాను. “ఘంటసాల సృష్టించిన అనేకానేక పాటలనుంచి ఉదాహరణలు ఇవ్వటం సాధ్యంకాదు. నన్ను బాగా ఎఫెక్టు చేసిన ఒక ఉదాహరణ ఇస్తాను. పెళ్ళిచేసి చూడు అన్న సినిమాలో ‘ఏడుకొండలవాడ వెంకటా రమణా’ అన్న పాటకు చక్రవాకం రాగం వాడటంలో నాకు ఘంటసాల జీనియస్‌ అంతా కనిపించింది. ఆ పాటలో లేని జాలి ఒకటి ఆ సన్నివేశంలో ఉంది. ఇందుకు, దానికి ముందు నడిచిన సన్నివేశం చాలా తోడ్పడింది. ఆ పాటే ఇంకో రాగంలో ఉన్నట్టయితే, ఆ పాటకున్న విలువ 90 శాతం ఎగిరిపోయి ఉండేది!

ఈ పుస్తకంలో మరొక ఆకర్షణ, 1970లో శ్రీ ఘంటసాల చేసిన మొదటి/చివరి విదేశ పర్యటన వివరాలు. ఈ వివరాలతో పాటు విదేశాలలో శ్రీ ఘంటసాల తీయించుకొన్న కొన్ని అరుదైన ఫొటోలు కూడా ఈ పుస్తకంలో చోటు చేసుకొన్నాయి.ఈ పుస్తకంలో కొసమెరుపు, శ్రీ ఘంటసాల సినిమా సంగీతంపై స్వయంగా తన అభిప్రాయాలను ప్రకటించిన ఆఖరి వ్యాసం ‘సినీసీమలో సంగీతం’. ఈ వ్యాసం చదివిన తరువాత, శ్రీ ఘంటసాలకి సంగీతం మీద ఉన్న పట్టు (ఒక్క పాడటంలో మాత్రమే కాదు, బాణీలు కట్టడంలో, ఇతరరీతుల సంగీతాన్ని జీర్ణించుకోటంలో ఉన్న అవగాహన) ఎంత గట్టిదో తెలిసింది.

గులాబికి ముళ్ళున్నట్టుగా, ఈ పుస్తకంలో వేలెత్తి చూపడానికి కొన్ని తప్పులున్నాయి. అవి అచ్చుతప్పులు. ఇంత అరుదైన, అపురూపమైన పుస్తకంలో అచ్చుతప్పులే లేనట్టయితే ఇంకా బాగుండేది. అయినా, మిగిలిన విషయాల్లో ఈ పుస్తకం అందిస్తున్న వివరాలు, విశేషాల వల్ల, ఇది అందరూ చదివి తీరవలసిన పుస్తకం. ముఖ్యంగా పెండ్యాల నాగేశ్వరరావు , సాలూరు రాజేశ్వరరావు, ఆది నారాయణరావు, రమేష్‌ నాయుడు (ఘంటసాలను స్వయంగా ఎరగక పోయినా, “షావుకారు” సినిమాలో ఘంటసాల సంగీత దర్శకత్వంలో అందివ్వబడ్డ సంగీతంపై రమేష్‌ నాయుడు గారి అభిప్రాయాలు తెలుసుకోతగ్గవి) వంటి హేమాహేమీలైన సంగీత దర్శకులు, శ్రీ ఘంటసాలపై వెల్లడించిన అభిప్రాయాలు ఎందుకు గొప్పవో, అవి చదివితే గాని తెలియవు.

ఈ పుస్తకం వెలుగులోకి రావటానికి ఎంతోమంది ప్రముఖుల ప్రయత్నం ఉంది. శ్రీ ఘంటసాల సతీమణి శ్రీమతి సావిత్రమ్మ సహకారంతో ప్రచురింపబడ్డ ఈ పుస్తకం, అమెరికాలోనూ (పోస్టు ఖర్చులతో కలిపి 25 డాలర్లు), ఇండియాలోనూ (200 రూపాయలు) కూడా దొరుకుతుంది. ఈ పుస్తకం అమ్మగా వచ్చిన ధనంతో శ్రీ ఘంటసాల పేరుతో స్కాలర్‌షిప్పులు ఇవ్వాలనే ఒక ఉత్తమ ఆదర్శం వల్ల, ఎక్కువ మంది ఈ పుస్తకాన్ని కొంటారని ఆశిస్తున్నాను.

అమెరికాలో ఈ పుస్తకం కావలసిన వారు డా. ఎస్‌. ఆర్‌. పాణిని గారిని ఈ క్రింది చిరునామాలో సంప్రదించండి.

Dr. S. R. Panini
2 Opal Court
Johnson City, TN 37604

(Ph: 423-854-9513)
panini@sprynet.com

ఇండియాలో ఈ పుస్తకం కావలసిన వారు ఈ క్రింది చిరునామాలలో సంప్రదించండి.

Dr. K.V.Rao
Flat Number 28, IVth Floor
1-1-79 Bhagyanagar Apartments
Hyderabad – 500 020

(Ph: 7612030, 7639212)

Smt. Ghantasala Savitri
32, Ramakrishna Street
T. Nagar, Chennai – 600 017

(Ph: 044 – 8216339)